12 తలలతో ఖైరతాబాద్ గణేష్ ఎత్తు భారీగా పెరిగింది

Submitted on 13 August 2019
Khairatabad Ganesh Idol 2019 Getting Ready for Ganesh Chaturthi Festival

హైదరాబాద్ లో గణేష్ నవరాత్రి సందడికి ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. నగరంలోనే కాకా రాష్ట్ర్ర స్దాయిలో గుర్తింపు పొందిన ఖైరతాబాద్ గణేషుడి విగ్రహం కూడా  90 శాతం  పూర్తి కావచ్చింది. ప్రతిఏటా వివిధ రూపాల్లో భక్తులకు దర్సనమిచ్చే ఖైరతాబాద్ గణనాధుడు ఈ ఏడాది ద్వాదశాదిత్యుడి రూపంలో భక్తులను అలరించనున్నారు.  61 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో....విగ్రహానికి మొత్తం 12 తలలు, 24 చేతులు, 12 సర్పాలు, 7 గుర్రాలతో గణనాయకుడు కొలువు దీరుతున్నాడు. ఇప్పటి వరకు అరవై అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన మహాదేవుడు ఈ సంవత్సరం అరవై ఒక్క అడుగుల మహాకాయంతో శ్రీ ద్వాదశాధిత్య మహాగణపతిగా  మహా వీరాఠ్ స్వరూపంలో  2019, సెప్టెంబరు 2  సోమవారం నుండి 11 రోజులపాటు భక్తులను సాక్షాత్కరించనున్నాడు.

ఈ గణపతి విశేషమేమంటే 
ప్రముఖ సిద్ధాంతి గౌరిభట్ల విఠలశర్మ సూచనతో గణేశుడి విగ్రహాన్ని ఉత్సవ కమిటీ ప్రతి ఏటా తయారుచేయిస్తూ ఉంటుంది. ఈఏడాది వికారి నామ సంవత్సరంలో గ్రహాలకు అధిపతియైున సూర్యుడి రూపంలో గణపతిని తయారుచేసి పూజిస్తే  లోకకల్యాణం జరుగుతుందని, వాతావరణం అందరికీ అనుకూలించేలా ఉంటుందని, ప్రజలందరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండవని సిద్ధాంతి విఠలశర్మ వివరించారు. ఈ గణపతి ఆకారాన్ని ప్రముఖ గ్రాఫిక్‌ డిజైనర్‌ గవ్వల వెంకట్‌  తయారు చేశారు.

శిల్పి రాజేంద్రన్ నేతృత్వంలో కళాకారులు ఈ మహారూపాన్ని తయారు చేస్తున్నారు. శ్రీ ద్వాదశాధిత్య మహాగణపతికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఏడు గుర్రాలతో సూర్య భగవానుని రథం ముందు నిండైన రూపంతో నేత్రానందం కలిగిస్తారు. కలశాన్ని దరించిన పది అడుగుల తొండం, 6అడుగుల ముఖంతో పాటు దానికి ఆనుకొని 12 ముఖాలు (మూడుఅడుగులు), గణపతి ప్రతిమ పైభాగాన 12 పడగల ఆదిశేషుడి నీడలో చిన్ని గణపతి రూపం ఆకర్షణీయంగా ఉంటుంది. ఆంకుశం, పాశం తదితర పన్నెండు ఆయుధాలో కూడిన 12 అడుగుల 24 చేతులు, 22 అడుగుల కాళ్లు, ప్రధానమైన ఎడమ చేతిలో లడ్డు ప్రసాదం, కుడి చేతితో ఆశీర్వదిస్తూ కనిపిస్తారు. పాదాల వద్ద లడ్డుతో స్వామి వారి వాహనం ముషికం, గణేశుడి కుడివైపు మహాంకాళి, లక్ష్మీ, సరస్వతి అంశంగా పిలిచే సిద్ధకుంజికా దేవి, ఎడమవైపు గోవుతో నిలబడిన రూపంలో దత్తాత్రేయ స్వామి దర్శనమిస్తారు. 

ఇక వినాయకుడితో పాటు ప్రతియేటా పూజలందుకునేందుకు విశేష దేవతలుగా కుడివైపున 18 అడుగుల ఎత్తుతో పులి వాహనంగా ఏకాదశి దేవి, శేషతల్పంపై పడుకుని ఉన్న మహా విష్ణువును పూజిస్తున్న విగ్రహం చూడముచ్చటగొల్పుతోంది. ఎడమవైపున 20 అడుగుల ఎత్తుతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సహిత శక్తి స్వరూపిణీ అయిన దుర్గాదేవి పద్మ కమలంపై ఆసీనురాలైన విగ్రహం కొలువుదీరింది.

150 మంది కళాకారులు 
గణేష్‌ ఉత్సవాల షష్టిపూర్తి అనంతరం ఎత్తు విషయమై ఉత్సవ కమిటీ ప్రతియేటా ఒక్కో అడుగు ఎత్తును తగ్గిస్తూ వచ్చింది. గత సంవత్సరం 57 అడుగుల ఎత్తుతో గణపతిని తయారు చేయగా ఈసారి 12 తలలతో 12 సర్పాలతో సూర్యభగవానుడి రూపంలో తయారుచేస్తున్నందున ఎత్తును పెంచకతప్పలేదని.. మొత్తం మీద ఈ సారి 61 అడుగుల ఎత్తుతో గణపతిని తయారు చేస్తున్నాం అని విగ్రహశిల్పి చిన్నస్వామి రాజేంద్రన్  తెలిపారు.

దాదాపు కోటి రూపాయల ఖర్చుతో  ఈ విగ్రహాన్ని 150 మంది కళాకారులు  3 నెలలపాటు రాత్రింబవళ్లు కష్టపడితయారు చేశారు. ఈ విగ్రహ తయారీ కోసం 25 టన్నుల స్టీలు, తమిళనాడు నుంచి తీసుకొచ్చిన 45 టన్నుల ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, నర్సాపూర్‌ నుంచి తెప్పించిన 30 టన్నుల నాటు కర్రలు, 2వేల మీటర్ల గోనెసంచి క్లాత్‌, 30కేజీల బరువుండే కొబ్బరిపీచు బండళ్లు 60, ఏషియన్‌ పెయింట్స్‌కు చెందిన వాటర్‌ కలర్‌లను వినియోగించారు.

సర్వశుభాలు కలగాలని 
ఖైరతాబాద్‌ గణపతిని పూజించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఎంతో మంది ఇక్కడ పూజలు చేసిన వారు తాము అనుకున్న కోరికలు నెరవేరాయని చెప్తుంటే ఎంతో తృప్తి కలుగుతోందని గణేష్ ఉత్సవకమిటీ  చైర్మన్ ఎస్. సుదర్శన్ తెలిపారు. ఈ సారి కూడా భక్తులందరికీ  సర్వశుభాలు కలగాలనే ఉద్దేశ్యంతోనే పండితుల సూచన మేరకు ద్వాదశాదిత్య మహాగణపతిగా గణపతిని తయారుచేస్తున్నామన్నారు.

Ganesh Chaturthi Celebrations
Khairatabad Ganesh
khairatabad ganesh 2019 model

మరిన్ని వార్తలు