పాక్ కు ఎదురుదెబ్బ : కుల‌భూష‌ణ్ ఉరి శిక్ష నిలిపివేత‌

Submitted on 17 July 2019
kulbhushan jadhav case, icj stay on execution

కులభూషణ్ జాదవ్ కేసులో భారత్ కు అనుకూలంగా అంతర్జాతీయ కోర్టు రూలింగ్ ఇచ్చింది. కులభూషణ్ జాదవ్ కి పాకిస్తాన్ కోర్టు విధించిన ఉరిశిక్షను అంతర్జాతీయ కోర్టు నిలిపివేసింది. జాదవ్ ఉరిశిక్షపై మరోసారి పరిశీలించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ కోర్టు ఆదేశించింది. భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు.. జాదవ్‌కు అవకాశం ఇవ్వాలని చెప్పింది. ఈ కేసులో 16 మంది న్యాయమూర్తుల్లో 15మంది భారత్‌ వాదనకు మద్దతు పలికారు.

జాదవ్ కేసులో అంతర్జాతీయ కోర్టు బుధవారం(జూలై 17,2019) తీర్పు ఇచ్చింది. భారత గూఢచారిగా ఆరోపిస్తూ కులభూషణ్ జాదవ్ కి పాకిస్తాన్ కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్ న్యాయ పోరాటం చేస్తోంది. పాకిస్తాన్ కోర్టు తీర్పు అన్యాయం, అక్రమం అని వాదించింది. అసలు కులభూషణ్ కి దేశ నిఘా విభాగానికి సంబంధం లేదని భారత్ వాదనలు వినిపించింది. తుది తీర్పు ఇచ్చేవరకు జాదవ్ ఉరిశిక్షపై  కోర్టు స్టే విధించింది. తీర్పు సందర్బంగా పాకిస్తాన్ పై ఐసీజే సీరియస్ అయ్యింది. వియన్నా నిబంధనలను పాకిస్తాన్ ఉల్లంఘించిందని మండిపడింది. భారత్ కి న్యాయవాదిని నియమించుకునే హక్కు ఉందని ఐసీజే తేల్చి చెప్పింది.

గూఢచర్యం ఆరోపణలతో 2016లో జాదవ్ ని పాకిస్తాన్ దళాలు అరెస్ట్ చేశాయి. ఈ కేసులో 2017 ఏప్రిల్‌ 11న పాక్‌ సైనిక కోర్టు జాదవ్ కి మరణశిక్ష విధించింది. 2017 మే 8న జాదవ్ మరణశిక్ష పై ఐసీజేని భారత్ ఆశ్రయించింది. 2016లో కులభూషణ్ జాదవ్‌ ని బలూచిస్తాన్ ఫ్రావిన్స్‌లో పాకిస్తాన్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. జాదవ్ పై గూఢచర్యం అభియోగాలు మోపారు. పాక్ మిలిటరీ కోర్టు.. జాదవ్ కి మరణ శిక్ష విధించింది. ఈ తీర్పుని అంతర్జాతీయ కోర్టులో భారత్ సవాల్ చేసింది. పాక్ చర్యను తీవ్రంగా తప్పుబట్టింది. అమాయకుడైన కులభూషణ్ జాదవ్‌ ని దోషిగా చిత్రీకరించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. దీనికి సంబంధించి 2019 ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు సాగిన తుది విచారణలో భారత్‌, పాకిస్తాన్‌లు తమ వాదనలు వినిపించాయి.

భారత్ తరపున హరీశ్ పాల్వే వాదనలు వినిపించారు. పాకిస్తాన్ తీరుని ఎండగట్టారు. పాక్ మిలిటరీ కోర్టు కులభూషణ్ జాదవ్‌కు మరణశిక్ష విధించడం వియన్నా ఒప్పందం ప్రకారం కరెక్ట్ కాదన్నారు. అసలా కోర్టులో నిబంధనలకు అనుగుణంగా వాదనలే జరగవన్నారు. వియన్నా ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తూనే ఉందన్నారు. జాదవ్‌ను గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ చేసిన పాకిస్తాన్.. అందుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఇప్పటివరకూ బయటపెట్టలేదన్నారు. ఇప్పటికే అనేక సార్లు సంప్రదించినా.. జాదవ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వలేదని చెప్పారు. చివరికి భారత్ చేసి పోరాటం ఫలించింది. పాకిస్తాన్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Kulbhushan Jadhav
ICJ
india
Pakistan
hang
execution

మరిన్ని వార్తలు