కర్ణాటక సంక్షోభంలో కొత్త ట్విస్ట్...బలపరీక్షకు సిద్ధమైన కుమారస్వామి

Submitted on 12 July 2019
Kumaraswamy seeks floor test, 3 rebel MLAs leave Mumbai hotel

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరో కీలక మలుపు తిరిగింది. ప్రభుత్వం మైనార్టీలో కొనసాగుతుంది,సీఎంగా కుమారస్వామి రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేస్తున్న సమయంలో తాను బలపరీక్షకు సిద్దంగా ఉన్నానని కుమారస్వామి తెలిపారు. ఇవాళ(జులై-12,2019) అసెంబ్లీ మొద‌లైన త‌ర్వాత‌..బలపరీక్షకు సమయం ఖరారు చేయాలని స్పీకర్‌ కేఆర్ రమేశ్‌ కుమార్‌ను కోరారు. 
కొంద‌రు ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణ‌యాల వ‌ల్ల‌ రాష్ట్ర రాజ‌కీయాలు అనేక మ‌లుపులు తిరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో నేను అధికారంలో ఉండలేను. అయితే నాకు ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దాన్ని రుజువు చేసుకుంటా. బలపరీక్షకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నా. ఇందుకు సమయాన్ని ఖరారు చేయండని సీఎం కుమారస్వామి అసెంబ్లీలో వేదికగా స్పీకర్ ని కోరారు. దీంతో ఒక్కసారిగా కర్ణాటక సంక్షోభం కీలక మలుపు తిరిగినట్లయింది. బలపరీక్షకు స్పీకర్‌ ఎప్పుడు సమయమిస్తారన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు ముంబై హోటల్ లో ఉన్న  రెబల్ ఎమ్మెల్యేలలో ముగ్గురు హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోయారు.

అంత‌క‌ముందు క‌ర్నాట‌క రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ కేసులో జులై- 15,2019న  తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. రెబల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత వేటుపై యథాతథస్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన కొద్ది క్షణాలకే కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

కర్ణాటకలో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 16 మంది రాజీనామాలు చేశారు. అయితే వీరి రాజీనామాలను స్పీకర్‌ ఇప్పుడు అంగీకరించకూడదు కనుక మంగళవారం వరకు ఎమ్మెల్యేలుగానే ఉంటారు. శాసనసభలోబీజేపీ బలం 107, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను తీసేస్తే సంకీర్ణం సంఖ్యా బలం 100. ఇలాంటి సమయంలో బలపరీక్షలో కుమారస్వామి సర్కార్ నిలబడుతుందో లేక కూలిపోతుందో తేలనుంది.

karnataka
floor test
Assembly
rebel mla's
Speaker
Time
permission
PROVE
Majority


మరిన్ని వార్తలు