ప్రజలు తెలివైన వాళ్లు.. ఎన్నికల్లో రుజువైంది: ప్రధాని మోడీ

Submitted on 25 June 2019
Lok Sabha Budget Session: PM Modi addresses parliament

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగం దేశ ప్రజల మనోభావాలకు అద్దం పట్టిందని పార్లమెంటులో ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్ సభలో మాట్లాడిన మోడీ.. ప్రజల సంక్షేమం, సంరక్షణ తదితర అంశాలపై రాష్ట్రపతి తన ప్రసంగంలో వివరించారని అన్నారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడిన సభ్యులకు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. లోక్‌సభకు ఎన్నికైన కొత్త సభ్యులు అద్భుతంగా మాట్లాడారని అన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చవలసిన అవసరం ఉందని, ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే తమకు పెద్ద విజయమని మోడీ అన్నారు.

మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పాలన అందిస్తామని, ప్రజలు ఎంత తెలివైనవాళ్లో మొన్నటి ఎన్నికల్లో రుజువైందని అన్నారు. ఓటర్లు తమ కంటే ఎక్కువగా దేశాన్ని ప్రేమించారని, ఆ విషయం ఈ ఎన్నికల్లో వచ్చిన తీర్పుతో స్పష్టం అయిందని మోడీ తెలిపారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని, ఆ దిశగా ముందుకు సాగుతామన్నారు.

ఎన్నికల్లో గెలుపోటములు సహజమని విపక్ష నేతలు విలువైన సలహాలు ఇవ్వాలని కోరారు. అంతా కలిసి దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. అలాగే స్పీకర్ ఓంబిర్లా సమర్థవంతంగా సభను నడుపుతున్నారని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు మోడీ.

కాంగ్రెస్ పార్టీ నేల విడిచి సాము చేసిందని, కాంగ్రెస్ పాలనలోని ఎమర్జెన్సీ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిందని విమర్శించారు. వారికి వాస్తవాలు తెలియదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ పాలనను పొగడటం లేదని అన్నారు. కాంగ్రెస్ నేతగా రాజకీయాల్లో కొనసాగిన ప్రణబ్ ముఖర్జీకి తాము భారతరత్న ఇచ్చి గౌరవించినట్లు మోడీ గుర్తు చేశారు.

Lok Sabha Budget Session
pm modi
Parliament

మరిన్ని వార్తలు