ప్రధాని హత్య లేఖపై మావో కేంద్ర కమిటీ స్పందన..

16:57 - October 1, 2018

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ హత్యకు మావోయిస్టులు ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాలు పేర్కొనటంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనిపై విరసం సభ్యుడు వరవరరావు, హక్కుల కార్యకర్తలు సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్మన్ గంజాల్వెజ్, గౌతమ్ నవలఖాలను మహారాష్ట్ర పోలీసులు ఆగస్టు 28న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఐదుగురు హక్కుల కార్యకర్తలను సుప్రీంకోర్టు 4 వారాల పాటు హౌస్ అరెస్ట్ లో ఉంచింది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు వీరి అరెస్టులపై స్పందించారు.
ప్రధాని మోదీ హత్యకు తాము పౌర హక్కుల నేతలతో కలసి కుట్ర పన్నలేదని మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ కి చెందిన అభయ్ లేఖ విడుదల చేశారు. హక్కుల నేత రోనా విల్సన్ దగ్గర దొరికినట్లు పోలీసులు చెబుతున్న లేఖలు బూటకమని విమర్శించారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. పౌర హక్కుల నేతలపై జరుగుతున్న అణచివేతలపై ప్రజాస్వామ్య వాదులు స్పందించాలని కోరారు. ప్రధానిని హత్య చేయాలని తాము ఎవరికీ లేఖ రాయలేదనీ, అలాంటి అవసరం తమకు లేదని అభయ్ స్పష్టం చేశారు.
పుణెలో జరిగిన ఎల్గర్ పరిషత్ సమావేశం అనంతరం దళితులకు-అగ్రవర్ణాలకు మధ్య భీమా-కోరేగావ్ ప్రాంతంలో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీనికి సంబంధించి కేసు నమోదుచేసిన పోలీసులు హక్కుల కార్యకర్త రోనా విల్సన్ ఇంటిలో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ తరహాలో ప్రధాని మోదీని మట్టుబెట్టేందుకు మావోలు ప్లాన్ వేశారనీ, ఇందుకోసం ఆయుధాల కొనుగోలుకు వరవరరావు సాయం చేస్తాడని లేఖలో ఉన్నట్లు..దానికి సంబంధించిన లేఖ లు తమకు లభించినట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐదుగురు హక్కుల కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది.

Don't Miss