ఏపీపై కేంద్రం కక్ష కట్టింది..

09:14 - October 9, 2018

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపింది. రాష్ట్రంలో వెనకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు విడుదల విషయంలో కేంద్రం ఇంకా ఎటూ తేల్చడం లేదు.  ఈ ఏడాది మార్చిలో ఏడు జిల్లాలకు విడుదల చేసిన 350 కోట్ల రూపాయలనూ మోదీ ప్రభుత్వం వెనక్కితీసుకుంది.  రాష్ట్ర ప్రభుత్వం యూసీలు, ఖర్చుల వివరాలను అందించి ఆర్నెళ్లు గడుస్తున్నా... ఈ నిధుల విడుదలకు  సంబంధించి ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.  ఏపీతోపాటు పెండింగ్‌లో పెట్టిన తెలంగాణకు చెల్లించాల్సిన 450 కోట్ల రూపాయల నిధులను మాత్రం వారం రోజుల క్రితమే విడుదల చేసింది. ఏపీకి మాత్రం ఎలాంటి నిధులు విడుదల చేయకుండా మరోసారి మొండిచేయి చూపించింది.
కక్ష సాధింపు చర్యల్లో భాగమే ఐటీ సోదాలు
ఏపీలో జరిగిన ఐటీ దాడులపై ఐటీశాఖ మంత్రి లోకేష్‌ స్పందించారు. ఐటీ దాడుల పేరుతో ఏపీపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ ఇంత భారీ స్థాయిలో ఐటీ దాడులు జరుగలేదన్నారు.  19 బృందాలు, 200 మంది సిబ్బందితో దాడులు నిర్వహించడం.. కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందనడాకి  నిదర్శనమన్నారు. మొత్తానికి  కేంద్రం తీరుపై ఏపీ టీడీపీ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేంద్రంతో విభేదిస్తున్నందున రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని వారంతా మండిపడుతున్నారు.

Don't Miss