బాబుది హిస్టరీ..మీది లాటరీ: బాలకృష్ణ

11:13 - December 3, 2018

హైదరాబాద్ : సినిమాల్లో పంచ్ డైలాగ్సే కాదు..ఎమోషనల్ డైలాగ్స్ లో కూడా బాలయ్యది ఓ స్పెషల్. అటు ఎమ్మెల్యేగా..ఇటు ట్రెండ్ సినిమాలతో అభిమానులను ఆకట్టుకోవటమే కాదు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలయ్య తెలంగాణ యాసలోకూడా అదరగొట్టేస్తున్నారు. నగరంలోని శేరిలింగంపల్లి నియోకవర్గంలో రోడ్డు షోలో తెలంగాణ యాస, భాషతో మాట్లాడి సభికుల్లో జోష్‌ నింపారు. ప్రభుత్వం రైతుల్ని ఇబ్బంది పెట్టడం వల్లే వందలాది మంది ఆత్మహత్య చేసుకున్నారని ధ్వజమెత్తారు. ఎందరో త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో ఉపాధి, ఉద్యోగాల్లేక పలువురు ఆత్మహత్యకు పాల్పడడం ఆవేదన కలిగించే విషయమన్నారు. 

ల్యాప్‌టాప్‌ కనిపెట్టింది మీరేనా’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబును వ్యంగ్యంగా విమర్శిస్తున్న వారికి తనదైన శైలిలో జవాబిచ్చారు బాలయ్య. చంద్రబాబు రాజకీయ జీవితం హిస్టరీ అయితే మీది లాటరీ అని, రాళ్లగుట్టలతో నిండిన హైదరాబాద్‌ను హైటెక్‌ సిటీగా అభివృద్ధి చేసిన ఘనత బాబుదని కౌంటర్ ఎటాక్ ఇచ్చారు ప్రత్యర్థి పార్టీ నాయకులకు.చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదని, సైబరాబాద్‌ సృష్టికర్త ముమ్మాటికీ చంద్రబాబేనని బాలకృష్ణ ప్రశంసించారు. స్వరాష్ట్రం సిద్ధించిన తరువాత రైతు రాజ్యం వస్తుందని అంతా ఆశిస్తే రాబందుల రాజ్యం వచ్చిందని..టీడీపీ ఒక కులం, మతం కోసం పుట్టిన పార్టీ కాదని, సామాజిక న్యాయం కోసం ప్రజల్లోంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనీ..కారుకూతలు కూస్తున్న వారికి ఓటర్లే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బాలయ్య మాటలతో టీడీపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నిండింది.
 

Don't Miss