ఎమ్మెల్యే రాపాకను అరెస్ట్ చేసే అధికారం ఎవరిచ్చారు : పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం

Submitted on 13 August 2019
mla rapaka arrest case, judge angry on police

జనసేన నేత, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్. ఎమ్మెల్యే అరెస్ట్ విషయంలో పోలీసుల తీరుపై రాజోలు కోర్టు న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేని అరెస్ట్ చేసే అధికారం మీకు ఎవరిచ్చారు అని పోలీసులపై మండిపడ్డారు. ఎంపీ, ఎమ్మెల్యేల విచారణకు ప్రత్యేక కోర్టు ఉందని న్యాయమూర్తి గుర్తు చేశారు. స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా ఎమ్మెల్యేని కోర్టుకి ఎందుకు తెచ్చారని పోలీసులను ప్రశ్నించారు. పోలీసులను మందలించిన న్యాయమూర్తి.. ఎమ్మెల్యే రాపాకను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. న్యాయమూర్తి వ్యాఖ్యలతో పోలీసులు కంగుతిన్నారు. వెంటనే ఎమ్మెల్యేకి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే రాపాక విడుదల అయ్యారు. ఎమ్మెల్యే రాపాకని అరెస్ట్ చేసిన పోలీసులు రాజోలు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుని న్యాయమూర్తి తప్పుపట్టారు. పోలీసులు ఇలా ప్రవర్తించి ఉండాల్సింది కాదన్నారు.

మలికిపురం పోలీస్ స్టేషన్ పై దాడి కేసులో పోలీసులు ఎమ్మెల్యే రాపాకని అరెస్ట్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని కేసులు పెట్టారు. రాపాకతో పాటు ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే తమపై దాడి చేశారని పోలీసులు చెబుతుంటే.. పోలీసులే తమపై దాడి చేశారని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. పేకాట కేసులో ఎమ్మెల్యే అనుచరుడిని పోలీసులు స్టేషన్ కి తీసుకెళ్లారు. అతడిని విడిపించేందుకు ఎమ్మెల్యే రాపాక మలికిపురం పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అతడు అనారోగ్యంతో ఉన్నాడని వదిలేయాలని పోలీసులను కోరారు. ఈ విషయంలో పోలీసులు, ఎమ్మెల్యే మధ్య గొడవ జరిగింది. పోలీసులు రాపాకపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. దీంతో మంగళవారం(ఆగస్టు 13,2019) రాపాక వరప్రసాద్ రాజోలు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.

ఎమ్మెల్యే రాపాక అరెస్ట్ ని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఖండించారు. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకు తెచ్చారని పోలీసులపై సీరియస్ అయ్యారు. ప్రజల పక్షాన పోలీస్ స్టేషన్ కి వెళ్లిన ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. నెల్లూరులో జర్నలిస్టుపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే తాను ఊరుకోనని, స్వయంగా రంగంలోకి దిగుతానని రాజోలుకి వచ్చి ఎమ్మెల్యే తరఫున పోరాటం చేస్తానని పవన్ హెచ్చరించారు.

Also Read : నేనే రాజోలు వచ్చి పోరాడతా : ఎమ్మెల్యే రాపాక అరెస్ట్ పై పవన్ వార్నింగ్

mla rapaka varaprasad
Court
Judge
Police
Angry
janasena
station bail
release

మరిన్ని వార్తలు