National News

న్యూఢిల్లీ: రోజు రోజుకు పెరుగుతున్న ‘‘#మీ టూ’’ స్పందనల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ కేసుల విచారణకు నలుగురు సభ్యుల విశ్రాంత న్యాయమూర్తులను నియమించినట్టు కేంద్ర మంత్రి  మేనకా గాంథీ శుక్రవారం ప్రకటించారు. 
ఈ న్యాయవాదుల బృందం ‘‘మీ టూ’’ కేసులను విచారణ చేసేందుకు పబ్లిక్ హియరింగ్స్ నిర్వహిస్తారని మంత్రి వెల్లడించారు. ఇందులో లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలను వేరువేరుగా విచారించే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు మేనకా గాంధీ పేర్కొన్నారు.
 

 

ఢిల్లీ : తాను ఏ పార్టీలో చేరడం లేదని ప్రజా గాయకుడు గద్దర్ స్పష్టం చేశారు. తాను ఏ పార్టీ సభ్యుడిని కాదన్నారు. ఢిల్లీలో ప్రజా గాయకుడు గద్దర్ రాహుల్ గాంధీని కలిశారు. అనంతరం గద్దర్ మీడియాతో మాట్లాడారు. సోనియమ్మను చూడటానికే ఢిల్లీకి వచ్చానని తెలిపారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని... సెక్యులర్ శక్తులన్నీ ఏకం కావాలన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో అక్కడి ప్రజలు, రాజకీయ పార్టీలు కేసీఆర్‌పై పోటీ చేయాలని కోరితే తాను పోటీ చేస్తానని చెప్పారు. నయా ఫ్యూడలిజాన్ని తగ్గించేందుకు పోటీ చేస్తానని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఏ పార్టీలోనైనా ఉండవచ్చన్నారు. ఓటు.. రాజకీయ విప్లవమన్నారు. 

వాషింగ్‌టన్: రానున్న 48 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్‌నెట్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యమైన ఇంటర్‌నెట్ సర్వర్ల సాధారణ మైంటెనెన్స్‌ సందర్భంగా ఇంటర్‌నెట్ వినియోగదారులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. నెట్‌ను పొందడంలో తీవ్ర వైఫల్యాలు తలెత్తుతాయి. సర్వర్లు కొంతసేపు పూర్తిగా పనిచేయడం ఆగిపోవడంవల్ల ఈ సమస్య గ్లోబల్ వ్యాప్తంగా సమస్య సంభవిస్తుంది. ఇంటర్‌నెట్ కార్పోరేషన్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ (ఐసీఏఎన్ఎన్) సంస్థ ఈ మైంటెనెన్స్‌ను ఈ సమయంలో చేపట్టబోతోంది. క్రిప్టోగ్రాఫిక్ కీ ను మార్చడం ద్వారా ఇంటర్‌నెట్‌లోని అడ్రస్‌బుక్ లేదా డొమైన్ నేమ్ సిస్టమ్ (డీఎన్‌ఎస్) క్షేమంగానే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ దాడుల నేపథ్యంలో ఈ తరహా మైంటెనెన్స్ తప్పదని ఐసీఏఎన్ఎన్ పేర్కొంది. ఈ ప్రక్రియ ద్వారా గ్లోబల్ ఇంటర్‌నెట్‌ను షట్‌డౌన్ చేయడం ద్వారా భద్రతతో పాటు డీఎన్ఎస్‌ను అపత్కరసమయాల్లో తిరిగి డాటాను పొందే వీలుంటుందని కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (సీఆర్ఏ) వెల్లడించింది. నెట్ వినియోగదారులతో పాటు నెట్‌వర్క్ ఆపరేటర్స్, ఇంటర్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ఐఎస్‌పీ) ఈ షట్‌డౌన్  కు సిద్ధంగా ఉండాలని కోరింది. సిస్టమ్ సెక్యూరిటీ ఎక్స్‌టెన్షన్‌లను ఎనేబుల్ చేయడం ద్వారా దీని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని సీఆర్ఏ తెలిపింది. కాలం చెల్లిన ఐఎస్‌పీ లను వాడే వినియోగదారులకు ఈ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

హైదరాబాద్ : భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. రాజ్‌కోట్ టెస్ట్‌లో ఆకట్టుకున్న పేస్ బౌలర్ మహ్మద్ షమీ స్థానంలో శార్ధూల్ ఠాకూర్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ అవకాశం కల్పించింది. టాస్ గెలిచిన విండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి సెషన్‌లో భారత బౌలర్లు ప్రతిభ కనబరిచారు. కీరన్ పొవెల్, క్రైగ్ బ్రాత్‌వైట్‌లు బ్యాటింగ్ ఆరంభించారు. జట్టు స్కోరు 32 పరుగులుండగా పొవెల్ (22) వెనుదిరిగాడు. ఇతడిని అశ్విన్ అవుట్ చేశాడు. అనంతరం బ్రాత్‌వైట్‌కు హోప్ జత కలిశాడు. వీరిద్దరేూ కొద్దిసేపు భారత బౌలర్లను ఎదుర్కొన్నట్లు కనిపించింది. కానీ బ్రాత్ వైట్ (14) మరోసారి నిరాశ పరిచాడు. మరోవైపు హోప్‌ బౌండరీలతో వెస్టిండీస్ స్కోరు బోర్డుని పరుగెత్తించే ప్రయత్నం చేశాడు. ఇతని ప్రయత్నాన్ని ఉమేశ్ యాదవ్ నిలువరించాడు. హోప్‌ని ఉమేశ్ యాదవ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఆ జట్టు జోరుకి కళ్లెం వేశాడు. మూడో వికెట్ కోల్పోయే సరికి వెస్టిండీస్ జట్టు 86 పరుగులు చేసింది. లంచ్ సమయానికి క్రీజులో హెట్‌మెయర్ (10 బ్యాటింగ్: 23 బంతుల్లో 2x4) ఉన్నాడు. 
భారత జట్టు : విరాట్ కొహ్లి , అజింక్యా రహానే , కేఎల్ రాహుల్, పృథ్వీ షా, చటేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్.

న్యూఢిల్లీ: ‘‘రాహుల్ గాంధీ మూత్రం తాగటానికి జనం రెడీగా ఉన్నారు.. నువ్వు ఈ మాత్రం చేయలేవా?’’ అంటూ హిందూ టెర్రర్ కేసులో నరేంద్ర మోడీ పేరును చేర్చేందుకు అప్పటి కేంద్ర మంత్రి కమలనాథ్ తనతో అన్నట్టు అప్పటి హోమ్ శాఖ మాజీ కార్యదర్శి ఆర్వీఎస్ మణి షాకింగ్ వార్తను వెల్లడించారు.  
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యలోని యూపీఏ హయాంలో నరేంద్ర మోడీని ప్రధాని కాకుండా అడ్డగించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు పలు రకాలుగా ప్రయత్నించారని మణి చెప్పారు. ఈ సందర్భంగా.. కమలనాథ్ మరో ఇద్దరు అధికారులు తనపై వత్తిడి తెచ్చి మోడీపై ఇష్రాన్ జహాన్ కేసును ఫేక్ ఎన్‌కౌంటర్‌గా సృష్టించే విధంగా  వివరాలు మార్చాలని సూచించారని మణి పేర్కొన్నారు. కానీ తాను అలా చేసేందుకు తాను నిరాకరించినట్టు పేర్కొంటూ ఆర్వీఎస్ మణి ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇష్రాన్ జహాన్‌ను అమాయకుడిగా చిత్రించేందుకు ఈ ఎన్‌కౌంటర్‌లో మోడీని ఇరికించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారని మణి వెల్లడించారు.  
‘‘మీకు ఆ మూత్రం రుచి తెలిస్తే.. మీరే తాగండి.. నేనైతే తాగలేను. నేను నిజానికే కట్టుబడి ఉంటా..’’ అంటూ తిరుగు సమాధానం కమలనాథ్‌కు చెప్పినట్టు మణి పేర్కొన్నారు. 
ఆర్వీఎస్ మణి ట్వీట్ వైరల్ కావడంతో కమలనాథులు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమలనాథ్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ మోడీని ప్రధాని కాకుండా ఆపలేకపోయిందని విమర్శించారు. 
 
 
 
 
తిరుచ్చి: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం టేకాఫ్ సమయంలో ఎయిర్‌పోర్టు గోడను డీ కొట్టిన ఘటన శుక్రవారం ఉదయం తమిళనాడులోని తిరుచినాపల్లిలో చోటుచేసుకుంది. తిరుచ్చి నుండి దుబాయ్ వెళుతున్న ఈ విమానంలో 136 మంది ప్రయాణిస్తున్నారు. విమానాన్ని ముంబయి ఎయిర్‌పోర్టుకు మళ్లించారు.  అందులో ప్రయాణిస్తున్న 136 మంది ప్రయాణీకులు క్షేమంగా ఉన్నారని ఎయిర్ ఇండియా తెలిపింది. విమానం వెనకవైపు  ఉన్న రెండు చక్రాలు ఎయిర్‌పోర్టు కాంపౌండ్‌వాల్‌ను ఢీ కొనడంతో ఆ మేరకు గోడ కూలిపోయింది. ఈ ఘటనపై పౌరవిమానయాన శాఖ డైరక్టర్ జనరల్ విచారణ చేయనున్నారు.     

న్యూఢిల్లీ: రాఫెల్ డీల్ వివాదంలో పీకల్లోతు కష్టాల్లో ఉండి విపక్షాల దాడిని ఎదుర్కోంటున్న కమలదళం ఇప్పుడు ఎంజే అక్బర్ రూపంలో మరో గండంలో చిక్కుకుంది. మీటూ వివాదం ఆరోపణలు ఎదుర్కోంటున్న విదేశాంగశాఖ సహాయ మంత్రి అక్బర్ పై  ఇప్పటికే పలు విమర్శలు  చుట్టుముట్టాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఏరికోరి కేబినెట్ లోకి చేర్చుకున్నప్పటికీ విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా వెంటనే అక్బర్ తో రాజీనామా చేయించాలని సంఘ్పరివార్ బీజేపీ నేతలపై ఒత్తిడి తీసుకు వస్తోంది. ప్రస్తుతం నైజీరియా పర్యటనలో ఉన్నఎంజే అక్బర్ తన పర్యటన అర్ధంతరంగా ముగించుకుని వచ్చి రాజీనామా చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెపుతున్నాయి. ఎఁజే అక్బర్ 80వ దశకంలో ఏసియన్ ఏజ్, టెలిగ్రాఫ్ పత్రికల్లో పని చేసిన సమయంలో ఆయన వద్ద పని  చేసిన మహిళా జర్నలిస్టులను ఏరకంగా వేధింపులకు గురి చేశారో చెపుతూ, సుమారు 10 మంది జర్నలిస్టులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆయన బండారాన్ని బయట పెట్టారు.

అక్బర్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నవంబర్ నెలలో ఆరాష్ట్ర శాసనసభకు  ఎన్నికలు జరుగుతున్నాయి.  మీటూ వివాదంతో ఆరాష్ట్రంలో బీజీపీ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని ఇప్పటికే బీజేపీ భయపడుతోంది. అక్బర్ విషయంలో స్పందించటానికి కేంద్ర మంత్రులుగానీ, పార్టీ నాయకులు కానీ ప్రస్తుతానికి సుముఖంగా లేరు. ఒకవేళ మీటూ వివాదంపై అక్బర్ వివరణ ఇవ్వాలని చూసినా ఎన్నికల సమయంలో అది సంతృప్తికరంగా ఉండదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రియారమణి అనే జర్నలిస్టు ఒక ప్రముఖ ఎడిటర్ తనను లైంగికంగా ఎలా  వేధించారో వివరిస్తూ 2017లో మీటూ ఉద్యమాన్ని సమర్ధిస్తూ ఒక వ్యాసం రాశారు. ఇప్పుడు ఆమె ఆ ఎడిటర్ అక్బరేనని ట్విట్టర్ ద్వారా చెప్పారు. విదేశాల నుంచి రాగానే  అక్బర్ రాజీనామా చేస్తే ఇప్పటి వరకు ఎన్డీఏ ప్రభుత్వంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొని రాజీనామా  చేసిన వారి సంఖ్య 3 కి చేరుకుంటుంది. 2017 జనవరిలో మేఘాలయ గవర్నర్‌ వి.షన్ముగనాథన్‌, 2018 ఆగస్టులో కేంద్ర మంత్రి నిహాల్‌ చంద్‌ మేఘ్‌వాల్‌ లైంగిక వేధింపుల ఆరోపణలతోనే తమ పదవులకు రాజీనామాలు చేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో  ఏంజరుగుతుందో వేచి చూద్దాం. 

లుథియాన : భారతదేశంలో...తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. తమ కులం కాని వాడిని ప్రేమించిందని సొంత కుటుంబసభ్యులే దారుణానికి ఒడిగడుతున్నారు. ప్రేమ పేరిట హత్యలు పరిపాటై పోయాయి. తాజాగా ఓ యువతి సొంత తమ్ముడినే చంపేసింది. కేవలం ప్రేమకు అడ్డొస్తున్నాడనే కారణంతో దారుణంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన లూథియానాలో ఆలస్యంగా వెలుగు చూసింది. 
రేణు కనౌజియా అనే యువతి ఓ యువకుడితో ప్రేమాయణం సాగిస్తోంది. ఈ విషయం ఆమె సోదరుడు అన్ష్‌ కనౌజియాకు తెలిసింది. వెంటనే తల్లిదండ్రులకు చెప్పాడు. దీనితో ప్రేమ వద్దని తల్లిదండ్రులు మందలించారు. రేణుపై అన్ష్ ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచేవాడని..ప్రియుడితో కలిసే సమయంలో గమనించే వాడని..ఏ సమయంలో వెళుతోంది..ఎప్పుడు కలుస్తోంది..తదితర సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలియచేసేవాడని అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజ్వీర్ సింగ్ ఓ జాతీయ పత్రికకు తెలియచేశారు. 
దీనితో రేణు సోదరుడిపై కక్ష పెంచుకుందని, తమ ప్రేమకు అన్స్ అడ్డుగా ఉంటాడని భావించి అతడిని హత్య చేయాలని నిర్ణయానికి వచ్చిందన్నారు. అక్టోబర్ 6వ తేదీన తండ్రి గణేష్ ఉదయం 8గంటల సమయంలో బయటకు వెళ్లగా బంధువు ఆసుపత్రిలో చేరడంతో తల్లి కూడా ఇంటి నుండి బయటకు వెళ్లిందని తెలిపారు. 
ఇంట్లో ఉన్న అన్ష్ ను వేరే గదిలోకి పిలిపించుకుని అతడి గొంతు నులిమి హత్య చేసిందన్నారు. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు తమ్ముడు కనిపించడం లేదని రేణు పేర్కొందన్నారు. కానీ రేణును విచారించగా హత్య విషయం బయపటడిందని, రేణుపై 365 (కిడ్నాప్), 302 (హత్య) 506 కేసులు నమోదు చేశారు. 

హర్యానా : అత్యాచారాలను నియంత్రించడానికి దేశంలో నిర్భయలాంటి ఎన్నిచట్టాలొచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఓ బాలికపై సమీప బంధువులే అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలో తెలియక బాధితురాలు యూనిట్‌టెస్ట్‌ పరీక్ష సమాధాన పత్రంలో రాసింది. తనపై జరిగిన అఘాయిత్యం గురించి అందులో వివరించింది. 

గుడ్‌గావ్‌ సమీపంలోని బాద్‌షాపూర్‌ తాలూకాకు చెందిన 15 సంవత్సరాల బాలిక పదో తరగతి చుదువుతోంది. విద్యార్థినిపై ఆమె బంధువు(23), మరో మైనర్‌ బాలుడు కొద్ది రోజుల క్రితం అత్యాచారం చేశారు. అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలో తెలియక బాధితురాలు ఈనెల 1న జరిగిన యూనిట్‌టెస్ట్‌ పరీక్ష సమాధాన పత్రంలో రాసింది. తనపై జరిగిన అఘాయిత్యం గురించి అందులో వివరించింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా పాఠశాల యాజమాన్యం కోరడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో నిందితులిద్దరిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.

 

ఢిల్లీ : గంగా నదిని కాపాడేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలంటూ డిమాండ్ చేస్తున్న ప్రొఫెసర్ జి.డి.అగర్వాల్ (స్వామి జ్ఞానస్వరూప్ సనంద్ జీ) కన్నుమూశారు. 112 రోజులుగా ఆయన ఉపవాస దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం ఆయన్ను బలవంతంగా పోలీసులు రిషికేష్ లోని ఏయిమ్్స ఆసుపత్రికి తరలించారు. కానీ గురువారం శరీరంలో పొటాషియం, ఇతర ప్రోటీన్లు పడిపోవడంతో మధ్యాహ్నం 1గంటకు తుదిశ్వాస విడిచారని వైద్యులు పేర్కొన్నారు. 
గంగా నదిని కాపాడేందుకు ఆయన జూన్ 22వ తేదీ నుండి ఉపవాస దీక్ష చేస్తున్నారు. నదిని కాపాడేందుకు ప్రత్యేక చట్టం తీసుకరావాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఐఐటి కాన్పూర్‌లో ఆయన ప్రొపెసర్‌గా పనిచేశారు. సీపీసీబీలో ఆయన సభ్యుడిగా పనిచేశారు. 2011లో ఆయన స్వామిగా అవతారమెత్తారు. భగరీథి నదిపై డ్యామ్‌లు కట్టవద్దని ఆయన కోరారు. 

ఢిల్లీ : ఇప్పుడు ప్రపంచం అంతా స్మార్ట్ అయిపోయింది. అందరి చేతుల్లోను స్మార్ట్ ఫోన్సే. ఇంటిలోను స్మార్ట్ ఐటెమ్సే. స్మార్ట్ అభిమానులకోసం మైక్రోమ్యాక్స్ సంస్థ నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్‌టీవీలను తాజాగా విడుదల చేసింది. చూపరులను కట్టిపడే స్మార్ట్ టీవీని విడుదల చేసింది. మైక్రోమ్యాక్స్ అనుబంధ యూ టెలీ వెంచర్స్, 'యూఫోరియా' పేరిట భారత మార్కెట్లో 40 అంగుళాల స్మార్ట్ టీవీని ఆకర్షణీయ ధరలో విడుదల చేసింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా ప్రత్యేకంగా విక్రయించబడే ఈ టీవీ ధర రూ. 18,999 కాగా, పాత టీవీని ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో భాగంగా మార్చుకుంటే రూ. 7,200 వరకూ డిస్కౌంట్ కూడా లభిస్తుందని సంస్థ తెలిపింది. 

Image result for amazon
ఇక ఈ స్మార్ట్ టీవీలో మీడియా ఫైల్స్ ను డైరెక్టుగా ప్లే చేసుకోవచ్చు. తమకు నచ్చిన యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా ఈ టీవీలో 40 అంగుళాల ఫుల్‌ హెచ్‌ డీ డిస్‌ ప్లే, 5000:1 కాంట్రాస్ట్‌ రేషియో, డ్యూయల్ కోర్ గ్రాఫిక్స్ కో ప్రోసెసర్‌ కూడిన క్వాడ్-కోర్ ప్రాసెసర్, మూడు హెచ్‌డీఎం పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక వీజీఏ పోర్ట్, 24 వాట్స్‌ ఆడియో అవుట్‌ పుట్‌ సదుపాయాలుంటాయి. మరి ఇంకేంటి మీ పాత టీవీని ఇచ్చేయండి. కొత్త ఫుల్ హెచ్చ డీ స్మార్ట్ టీవీని ఇంటికి పట్టుకెళ్ళండి.

ఢిల్లీ: రాఫెల్ డీల్ దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. భారత్-ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందంలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టార్గెట్‌గా కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. రాఫెల్ డీల్ పూర్తి వివరాలను సీల్డ్ కవర్‌లో తమకు అందజేయాలని సుప్రీంకోర్టు నిన్న కేంద్రాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. 

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. అనిల్ అంబానీకి ప్రధాని మోదీ రూ.30,000 కోట్లు అప్పనంగా ఇచ్చేశారని ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డ ప్రధాని మోదీ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.

ఈ ఫైటర్ జెట్ల కొనుగోలు ఒప్పందంలో రహస్యంగా ఉంచాల్సిన అంశాల్లో విమానం ధర లేనేలేదని రాహుల్ వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ విషయాన్ని స్వయంగా తనకు చెప్పారని తెలిపారు. వాస్తవాలను రాస్తున్న మీడియాపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోందని, అయినా లొంగనివారిపై ఐటీ దాడులు చేయిస్తోందని రాహుల్ విమర్శించారు. 

దేశానికి కాపలాదారుగా ఉంటానన్న ప్రధాని మోదీ అవినీతిపరుడిగా తయారయ్యారని రాహుల్ ఎద్దేవా చేశారు. అవినీతిపై పోరాడతానన్న హామీతోనే మోదీ అధికారంలోకి వచ్చారన్నారు. సుప్రీంకోర్టు రాఫెల్ వివరాలు ఇవ్వాలని నిన్న కోరగానే రాత్రికిరాత్రి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ కు వెళ్లారని, దీని వెనుక అసలు రహస్యం ఏంటని రాహుల్ ప్రశ్నించారు.

మోదీ అవినీతికి పాల్పడ్డారు అనేదానికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయని రాహుల్ స్పష్టం చేశారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హోలాండే, డస్సాల్ట్ కంపెనీలో నంబర్ 2 అధికారి ఇద్దరూ.. మోదీ అవినీతి పరుడనే చెప్పారన్నారు. డస్సాల్ట్ కంపెనీపై ఒత్తిడి తీసుకొచ్చి తన అవినీతిని మోదీ దాస్తున్నారని విమర్శించారు. రిలయన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకోకుండా, వారికి తగిన మొత్తం చెల్లించకుండా కాంట్రాక్టును దక్కించుకోలేరని డస్సాల్ట్ కంపెనీకి కేంద్రం స్పష్టం చేసినట్లు ఇటీవల ఓ డాక్యుమెంట్ లభ్యమయిందని రాహుల్ ఆరోపించారు. ఇదొక్కటే కాదు, గతంలో కేంద్రం చేసుకున్న పలు ఒప్పందాలకు సంబంధించిన వాస్తవాలు త్వరలోనే బయటకు రాబోతున్నాయని రాహుల్ బాంబు పేల్చారు.

కేరళ : శబరిబలలో మహిళల దర్శనం విషయంలో వివాదాలు కొనసాగుతునేవున్నాయి. మహిళలు కూడా శబరిమల స్వామి దర్శనానికి వెళ్ళవచ్చుఅంటు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేరళ సీపీఎం ఎంపీ పీకే శ్రీమతి మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఆలయాలకు వెళ్లేది భక్తితో కాదని, అంగాంగ ప్రదర్శనతో పురుషులను ఆకట్టుకోవడానికే వారు ఆలయానికి వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలను అలా చూసి ఆనందించడానికే పురుషులు కూడా ఆలయానికి వెళ్తున్నారని పేర్కొన్నారు. ఆలయాల్లోని కోనేరులో స్నానం చేసే మహిళలు తడిసిన దుస్తులతో అంగాంగ ప్రదర్శనకే మొగ్గు చూపుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Image result for sabarimala temple in supreme court

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అడ్డంపెట్టుకుని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై తిరుగుబాటుకు ఆరెస్సెస్, కాంగ్రెస్, బీజేపీలు కుట్ర పన్నుతున్నాయని ఎంపీ  శ్రీమతి ఆరోపించారు. సుప్రీం తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న శ్రీమతి.. సమానత్వ హక్కును ఎవరూ కాదనలేరని పేర్కొన్నారు. 

కేరళలోని అనేక సామాజిక దురాచారాలను కమ్యూనిస్టు పార్టీ రూపుమాపిందని శ్రీమతి అన్నారు. ఎంపీ వ్యాఖ్యలపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలను ఇంత ఘోరంగా అవమానించడమేంటంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. తక్షణం ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఎంపీ శ్రీమతి ఎలా స్పందిస్తారో చూడాలి.
 

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై విరుచుకు పడ్డాడు. రష్యాతో 5 బిలియన్ అమెరికన్ డాలర్ల ఎస్-400 డీల్ కుదుర్చుకొని ఆర్మీ పరికరాలు కొనుగోలు  చేయడంపై పెద్దన్న ట్రంప్ గరం గరంగా ఉన్నాడు. ఇది అమెరికా ప్రభుత్వం రూపొందించిన కాట్సా శాంక్షన్ల చట్టంకు వ్యతిరేకమని ట్రంప్ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ట్రంప్ ఓ ప్రకటన చేస్తూ ‘‘భారత్ త్వరలో తెలుసుకుంటుంది నా నిర్ణయాలు ఎంత తీవ్రంగా ఉంటాయో’’ అంటూ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

న్యూఢిల్లీ: నేటి యువత సహనాన్ని కోల్పోయి మృగంలా మారుతున్నారన్న దానికి ఉదాహరించే సంఘటన ఢిల్లీలో జరిగింది. ప్రతీ తల్లీ, తండ్రికి ఈ సంఘటన ఓ గుణపాఠం కావాలి. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో బిజీ అయిపోయి.. ఎదిగిన కొడుకును ఎలా డీల్ చేయాలో తెలియకపోతే ఇటువంటి అనర్థాలే జరుగుతాయని ఈ సంఘటన రుజువు చేస్తోంది. 
దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ముగ్గురు హత్యగావించబడ్డారు. ఈ ఘటనలో మృతిచెందినవారు రియల్ ఎస్టేట్ వ్యాపారి మిథిలేష్ వర్మ, అతని భార్య సియా, వీరి 15 ఏళ్ల కుమార్తె. ఆ కుటుంబంలోని నాలుగో వ్యక్తి ఏమయ్యాడు అనే ప్రశ్న పోలీసుల్లో ఉదయించింది. వారి టీనేజి కొడుకు మృత్యువాతనుంచి తప్పించుకున్నారని పోలీసులు మొదట భావించారు. అయితే అతనే హంతకుడని ఊహించలేకపోయారు. 19 ఏళ్ళ సూరజ్ వర్మను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. 
అతను చెప్పిన విషయాలు విని పోలీసులే నివ్వెరపోయారు. కారణం ఆగస్ఠు 15న గాలిపటాలు ఎగరవేస్తూ కాలేజీ ఎగ్గొట్టి చదువుని అశ్రధ్ద చేస్తున్నాడని సూరజ్ తండ్రి మిథిలేష్ వర్మ కొడుకు సూరజ్ వర్మను కొట్టాడు. పదేపదే తిట్లతో విసిగిపోయిన సూరజ్ తండ్రిపై కక్ష పెంచుకున్నాడు. ఇంట్లోవాళ్లకు గట్టిగా బుద్ధిచెప్పాలని అదే రోజు సూరజ్ నిశ్చయించుకున్నాడు. మంగళవారంనాడు సూరజ్ స్నేహితులతో బయటకు వెళ్లి.. తిరిగి వచ్చేటప్పుడు ఓ కత్తి, కత్తెరలను కొనుక్కొని తెచ్చుకున్నాడు.
ఆ రోజు రాత్రి కుటుంబ సభ్యులతో పాత ఫోటో ఆల్బమ్‌లను చూస్తూ సరదాగా గడిపాడు. తెల్లవారుఝామున 3 గంటల ప్రాంతంలో ముందుగా తల్లిదండ్రులు నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి తండ్రిని, తల్లి సియాను, 15 ఏళ్ల చెల్లెలును దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. తల్లి మేల్కొని కూతురును కాపేడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తల్లి అరచినా భయపడక పదే పదే కత్తితో పొడిచి తల్లిని, చెల్లినీ చంపేశాడు. 
అనంతరం ఇంట్లో దొంగలు పడ్డారన్నట్టుగా సృష్టించేందుకు ఇల్లంతా సామానులు చిందరవందర చేసి.. ఆ తర్వాత కత్తిపై వేలుముద్రలను చెరిపేసాడు. రెండు గంటల అనంతరం చుట్టుపక్కలవారిని లేపి ఎవరో దొంగలు వచ్చి తన కుటుంబ సభ్యులను చంపేశారని కథ అల్లేశాడు. ఇంట్లో నగదు కానీ, విలువైన సామగ్రి అంతా అలాగే ఉండటంతో పోలీసుల దృష్టి సూరజ్ మీద పడించి. విచారణలో భయంకర నిజాలను వెల్లడించాడు. సూరజ్ తన 12వ తరగతి పరీక్షలో ఫెయిల్ అయ్యాడనీ... గతంలో తనని ఎవరో కిడ్నాప్ చేసినట్టు చెప్పి నమ్మించే ప్రయత్నం చేసి తరువాత దొరికిపోయాడని పోలీసులు తెలిపారు. తరచూ తన గురించిన నిజాలను తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయటంతో చెల్లెలు పైనా సూరజ్ కక్ష పెంచుకున్నట్టు విచారణలో తెలిసింది. 
క్లూస్ టీం సభ్యులు వంటగదిలో కత్తిని శుభ్రం చేసినట్టుగా గుర్తించారు. సూరజ్‌ను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. 

జైపూర్: ఇప్పటివరకు మనం ఎన్నో రకాల ఉద్యోగాలు చూసి ఉంటాం, విని ఉంటాము. నెలకు ఇంత వేతనం ఇచ్చి ఉద్యోగులను నియమించుకుని వారితో పని చేయించుకుంటారు. ఇది రోటీన్‌గా జరిగేదే. కానీ ఇప్పుడు చెప్పబోయే ఉద్యోగం గురించి మీరు జీవితంలో చూసి ఉండరు, కనీసం విని కూడా ఉండరు. ఆ జాబ్ ఏంతో తెలుసా? దోపిడీలు, దొంగతనాలు, నేరాలు చేయడమే. షాక్ అయ్యారా? కానీ ఇది నిజం. 

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో పోలీసులకి చిక్కిన ఓ దొంగల గ్యాంగ్ గురించి వాస్తవాలు తెలుసుకుని పోలీసులే విస్తుపోతున్నారు. ఆ గ్యాంగ్‌లో ఆరుగురు సభ్యులు ఉన్నారు. వారంతా ఉద్యోగులు. ఒక్కొక్కరికి నెలకు రూ.15వేలు వేతనం. చేయాల్సిన పని దొంగతనాలు, దోపిడీలు, నేరాలు మాత్రమే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆశిష్ మీనా అనే వ్యక్తి ఈ గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. నిరుద్యోగ యువతకు గాలం వేసి వారికి ఉద్యోగాలు ఇచ్చాడు. బంగారు నగలు, మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు దొంగిలించేందుకు ఆ ఆరుగురిని నెలవారీ వేతనాలతో ఉద్యోగంలో చేర్చుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఉద్యోగంలో చేరిన వ్యక్తి రోజుకు కనీసం ఒక్క నేరమైనా చేయాలి. ఒకవేళ నేరం చేయడంలో విఫలమైతే ఆ రోజు సాలరీ కట్ చేస్తాడు.

జవహర్ సర్కిల్ ఏరియా, శివ్‌దాస్‌పుర, ఖో నగోరియాన్, సంగనీర్ సహా ఇతర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లు, మొబైల్ ఫోన్ దొంగతనాలు, మోటార్ సైకిళ్ల మాయంపై తరచూ ఫిర్యాదులు వస్తుండడంతో నిఘా వేసిన పోలీసులు పకడ్బందీ ప్రణాళికతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గ్యాంగ్ లీడర్‌ సహా మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. పోలీసులు తమ స్టైల్‌లో తీగలాగితే డొంకంతా కదిలింది. ముఠా సభ్యులు దొంగిలించిన వస్తువులను నాయకుడు ఆశిష్ మీనా అమ్మి సొమ్ము చేసుకుంటాడని జైపూర్ ఈస్ట్ డీసీపీ తెలిపారు.

కాగా, ముఠా సభ్యులందరూ నిరక్ష్యరాసులు, ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటున్న వారే. వీరిందరినీ ఉద్యోగంలోకి తీసుకున్న ఆశిష్ ఓ ఇంట్లో వారిని పెట్టాడు. జూలైలో వీరిని రిక్రూట్ చేసుకున్నాడని, ఇప్పటి వరకు 36 నేరాలకు పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి మొత్తం 35 పోన్లు, ల్యాప్‌టాప్, రెండు చైన్లు, మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ అదికారులు మీడియా దిగ్గజం రాఘవ బెహల్ ఇంటిపై గురువారం దాడులు చేశారు. 
పన్నుఎగవేత ఆరోపణల నేపథ్యంలో నోయిడాలోని రాఘవ ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడులు జరిగాయి. ఆస్తులకు సంబంధింన పత్రాలు, వివరాల కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. 
రాఘవ్ బెహల్ క్వింట్ అనే వార్తా పోర్టల్‌ను న్యూస్ 18 నెట్‌వర్క్‌కు అధిపతిగా ఉన్నారు. ఇతర వ్యాపార సంస్థలపైనా ఐటీ శాఖ అధికారులు ఢిల్లీలో పలుచోట్ల దాడులు చేపట్టారు. 

 

ముంబై: ‘మీటూ’ ఉద్యమం దుమారం రేపుతోంది. దేశాన్ని కుదిపేస్తోంది. పలు రంగాల్లో లైంగిక వేధింపులకు గురైన మహిళలు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఇన్నాళ్లు తమలోనే దాచుకున్న బాధలను నిర్భయంగా ప్రపంచానికి తెలియజేస్తున్నారు. సొసైటీలో పెద్దలుగా చలామణి అవుతున్న వారి బాగోతాలను వెలుగులోకి తెస్తున్నారు. 

మీటూ ఉద్యమం సినీ, క్రీడా రంగాలనే కాదు రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ లిస్టులోకి శ్రీలంక మాజీ క్రికెటర్‌, ప్రస్తుత శ్రీలంక పెట్రోలియం శాఖ మంత్రి అర్జున రణతుంగ కూడా చేరిపోయారు. రణతుంగ తనను లైంగికంగా వేధించాడంటూ ముంబైకి చెందిన ఓ ఎయిర్‌ హోస్టెస్‌ ఆరోపించారు. ముంబైలోని ఓ హోటల్‌లో తనకు ఎదురైన ఘటన గురించి ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆమె ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే...

‘కొన్నేళ్ల క్రితం క్రికెట్‌ మ్యాచ్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్లు ముంబైలోని జుహు సెంటార్‌ హోటల్‌లో దిగాయి. అక్కడకు వెళ్లి వాళ్ల వద్ద ఆటోగ్రాఫ్‌ తీసుకుందామని నా సహచర ఉద్యోగిని కోరింది. సరేనని అక్కడికి వెళ్లాం. శ్రీలంక క్రికెటర్ల వద్దకు వెళ్లగానే నాకు భయం వేసింది. వాళ్లు దాదాపు ఏడుమంది ఉన్నారు. మేం ఇద్దరమే. నాకు అసౌకర్యంగా, ఇబ్బందిగా అనిపించడంతో వెంటనే వెళ్లిపోదామని నా స్నేహితురాలిని కోరాను. అంతలోనే వారు కూల్ డ్రింక్ ఆఫర్ చేశారు. నేను తాగలేదు. అంతలోనే మరికొందరు మమ్మల్ని హోటల్ వెనకవైపు ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ శ్రీలంక క్రికెటర్‌ అర్జున రణతుంగ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నా నడుము మీద చేయివేయబోయాడు. నేను అతడిని తప్పించుకుందామని ప్రయత్నించాను. ఆయన నన్ను కొట్టాడు. నేను పోలీసులతో చెప్పి పాస్‌పోర్ట్‌ రద్దు చేయిస్తానని బెదిరించాను. ఆయన వద్ద నుంచి తప్పించుకుని వచ్చి రిసెప్షన్‌లో ఫిర్యాదు చేస్తే ‘ఇది మీ వ్యక్తిగత విషయం. మేం ఎలాంటి సహాయం చేయలేం’ అని చెప్పేశారు’ అంటూ ఆమె పోస్ట్‌ పెట్టింది.

హైదరాబాద్ : ఇక కేంద్రంలో నడిచేవన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే అని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్న తరుణంలో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించింది. లోక్‌సభలో బీజేపీ బలం 275 సీట్లు. దేశంలో 29 రాష్ట్రాలకు గాను బీజేపీ, దాని మిత్ర పక్షాలు కలసి 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. ఇది బీజేపీకి స్వర్ణ యుగమా? అనే ప్రశ్నను తలపించింది.  2014లో కేంద్రంలో కమలం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత సొంతంగా లేదా మిత్ర పక్షాలతో కలసి.. ఉత్తరాదిలో ఆయా రాష్ట్రాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాుట చేసిన బీజేపీ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వమే అక్కడ అధికారం చేపట్టింది. కాగా జమ్మూ కశ్మీర్ లో ముఫ్తీ పార్టీతో చెడిన సంబంధాల కారణంగా అక్కడ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నుండి తప్పుకుంది. ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందనే కారణంతో ఏపీలో కూడా అధికారపార్టీ టీడీపీతో సంబంధాలు బెడిసికొట్టాయి. దీంతో కొన్ని రాష్ట్రాలలో సంకీర్ణంగా కొనసాగుతున్న బీజేపీ ఆయా పార్టీ లనుండి అభిప్రాయబేధాలతో విడిపోయవటంతో బీజేపీ ఉనికి కష్టంగానే వుంది. కర్ణాటకలోనూ బీజేపీ నాయకుడు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ, అసెంబ్లీలో బలనిరూపణకు ముందే రాజీనామా చేశారు. దీంతో జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి ప్రభుత్వ ఏర్పాటు అవకాశం లభించింది. అలా బీజేపీ నుండి తప్పుకోవటంతో కొన్ని రాష్ట్రాలలో బీజేపీ ప్రశ్నార్థకంగా మారింది. 
చత్తీశ్‌గఢ్, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్ రాష్ట్రాల్లో 2013 నుంచే అధికారంలో కొనసాగుతోంది. అంటే.. ప్రస్తుతం 19 రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, మిజోరాంలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోను ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా  కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 6న ప్రకటించింది. 

రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్‌లు మాత్రం.. భారతీయ జనతా పార్టీకి ప్రతిష్టాత్మకమైనవి. ఎందుకంటే..ఐదేళ్ల నుంచి అప్రహతీతంగా సాగుతున్న భారతీయ జనతా పార్టీ ప్రభంజనం మొదలైనది ఈ రాష్ట్రాల నుంచినే. ఐదేళ్ల కిందట ఈ మూడు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయాలను నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఇక తెలంగాణలో కూడా కాషాయ దళం పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో అపర చాణుక్యుడుగా రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్న జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. అటు ఏపీ సీఎంపైనా..ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా..తెలంగాణలో ఏర్పడిన మహాకూటమిపైనా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. స్వతహాగా హిందూభావజాలం అధికంగా వున్న బీజేపీ ముస్లింలపై వివక్ష చూపుతోందనే విమర్శలు కూడా వున్నాయి. ఈ క్రమంలో అమిత్ షా కరీంనగర్ సభలో మాట్లాడుతు..తెలంగాణలో  ముస్లిం పార్టీ అయిన ఎంఐఎంను ఎదుర్కోవటం కేసీఆర్ వల్ల చంద్రబాబు వల్ల కాదని ఒక్క బీజేపీకి మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పటం బీజేపీ ముస్లింల పట్ల వున్న తీరును తెలుపుతోంది. 

కాగా ఇటు తెలంగాణలో కేసీఆర్ హవాకు బ్రేకులు పడ్డాయి. ప్రజల నుండి కొంచెం వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతోంది. దీనొక అవకాశంగా తీసుకుని ప్రతిపక్షాలు టీఆర్ఎస్  ఓటుబ్యాంకును తమవైపుకు తిప్పుకోవాలని చూస్తున్నాయి. మరోపక్క కేంద్రం ప్రభుత్వం తెలంగాణకు నిధులు మంజూరు విషయంలో ఉదారత చూపుతోందని..అందుకే తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్ర కీలకమని ప్రజలకు తెలిపి ఓట్లు కొల్లగొట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. తెలంగాణలో ఒక్క అవకాశం ఇవ్వమని బీజేపీ ఓటర్లను కోరుకుంటోంది. 

కాగా డిసెంబర్ 7న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించినా..అధికార పార్టీతో సహా ఇప్పటి వరకూ ఏ పార్టీ కూడా తమ మేనిఫెస్టోను ప్రకటించలేదు. దసరా తరువాతనే ప్రకటిస్తామని దాదాపుఅన్ని పార్టీలు చెబుతున్నాయి. కట్టుదిట్టంగా ఎవరికి వారు తమ మేనిఫెస్టోని సిద్ధం చేసుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఎవరు ముందుగా ప్రకటిస్తే వారి స్ర్కిప్ట్ ను మరోపార్టీ కాపీ కొట్టేస్తాయనే భయం కూడా కావచ్చు. 

కాగా జిల్లాలలో కంటే నగరంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన బీజేపీ ఇప్పటికే బీజేపీ మేనిఫెస్టోలో నగర వాసులకు పెద్ద పెద్ద తాయిలాలను ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది.  కిరాయి ఇంటివారికి రూ.5వేలు, వాటర్ ట్యాక్స్ 1రూపాయి, నిరుద్యోగులకు భారీగా భృతివంటివి తమ మేనిఫెస్టోలో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. మరి తెలంగాణ ప్రజలు మేనిఫెస్టో వాగ్ధానాలకు పడిపోతారో లేదో వేచి చూడాలి..కాగా సీట్లు పెద్దగా రాని దక్షిణాది రాష్ట్రాలలో ఎలాగైనా సరే పట్టు సాధించుకోవాలనే బీజేపీ పట్టుదల 2019 ఎన్నికల్లో ఏమాత్రం రాణిస్తుందో వేచి చూడాలి..

-ఎం.నాగమణి

ఢిల్లీ: నోరు జారడం ఆ తర్వాత నాలిక కరుచుకోవడం.. మన రాజకీయ నాయకులకు కామనే కదా. ఆవేశంలో ముందూ వెనకా ఆలోచన చేయకుండా ఏదో ఒకటి మాట్లాడేస్తారు. ఆ తర్వాత వివాదాస్పదం కావడంతో మళ్లీ మాట మారుస్తారు. బీజేపీ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విషయంలోనూ ఇదే జరిగింది. సొంత పార్టీ నేతల నుంచి వచ్చిన విమర్శల ఫలితమో.. తన తప్పు తెలుసుకున్నారో... కానీ.. ఇప్పుడు ఆయన మాట మార్చారు. అసలు నేను అలా అనలేదు అని చెబుతున్నారు.

వివరాల్లో వెళితే.. 2014 పార్లమెంటు ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నో అమలు సాధ్యం కాని హామీలను ఇచ్చామని, ప్రజలు ఇప్పుడు వాటిని గురించి అడుగుతుంటే సమాధానం చెప్పలేక పారిపోతున్నామని వ్యాఖ్యానించి ఎన్డీయే సర్కారును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇరుకునపడేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు బీజేపీకి షాక్ ఇచ్చాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ బీజేపీని ఇబ్బందులకు గురి చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని, కాంగ్రెస్ విరుచుకుపడేలా ఆయన అస్త్రాన్ని అందించారని బీజేపీ నేతలు వాపోయారు. దీంతో నితిన్ గడ్కరీ మాటమార్చారు. 

తాను మరాఠీలో ఇచ్చిన ఇంటర్వ్యూను అర్థం చేసుకుని విమర్శలు చేయడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరాఠీ భాషను ఎప్పుడు నేర్చుకున్నారని నితిన్ గడ్కరీ ప్రశ్నించారు. ఆ ఇంటర్వ్యూలో తాను మోదీ పేరెత్తలేదని, ప్రజల ఖాతాల్లో ఎన్నడూ రూ. 15 లక్షలు వేస్తామని చెప్పలేదని ఆయన వివరణ ఇచ్చారు. నేను చెప్పింది ఒకటైతే, మీడియాలో ప్రసారమైంది మరొకటని నితిన్ పేర్కొన్నారు.

తన మరాఠీ ఇంటర్వ్యూపై మరింత వివరణ ఇచ్చిన గడ్కరీ, ఏడెనిమిది రోజుల క్రితం తాను ఇంటర్వ్యూ కోసం వెళ్లానని, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దేవేంద్ర ఫడ్నవిస్, గోపీనాథ్ ముండే ఇచ్చిన ఎన్నికల హామీల గురించిన ప్రస్తావన వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో అమలుకు సాధ్యం కాని ఎన్నికల హామీలు ఇవ్వొద్దని తాను అభ్యంతరం చెప్పానని, అటువంటి హామీల జోలికి వెళ్లవద్దని తాను వారిద్దరికీ సూచించిన విషయాన్ని గుర్తు చేశానని గడ్కరీ అన్నారు. నేను మాట్లాడిన మాటలను వక్రీకరించారని నితిన్ గడ్కరీ ఆరోపించారు.

ఢిల్లీ : కర్ణిసేన వ్యవస్థాపకుడు...వివాదాస్పద నేత సూరజ్‌పాల్‌ అమూ మళ్లీ బీజేపీలో చేరారు. పద్మావతి పాత్రను కించ పరిచారంటూ బాలీవుడ్‌ నటి దీపికా పడుకోన్ .. సంజయ్‌ లీలా బన్సాల్‌ తలకు 10 కోట్లు పారితోషికం ప్రకటించడం అప్పట్లో సంచలనంగా మారింది. కర్ణిసేనను ఏర్పాటు చేసి సినిమా విడుదలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఆయనకు బీజేపీ షోకాజ్‌ నోటీసు జారీ చేయడంతో పార్టీకి రాజీనామా చేశారు. సూరజ్‌పాల్‌ రాజీనామాను ఆమోదించేది లేదని బీజేపీ హర్యానా రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్‌ బరాలా ప్రకటించారు.

 

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన బీజేపీకి ఊహించని షాక్‌ తగిలింది. ఓ నేత చేసిన వ్యాఖ్యలతో ఆపార్టీ ఇరకాటంలో పడింది. బీజేపీని ఇంత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టిన వ్యక్తి ప్రతిపక్ష నేతకాదు.. ఇంతకు ఎవరా నేత..? అసలేమన్నారు..బీజేపీ ఆచరణకు అమలుకాని హామీలిచ్చింది. ఆ హామీలు ప్రజల్లో ఎన్నో ఆశలు రేకెత్తించాయి. వాటిని నెరవేర్చే ప్రయత్నం ఇంతవరకూ జరగలేదు. ఈ మాటలన్నది ప్రతిపక్ష నేతకాదు.. స్వయంగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ..కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సొంత బీజేపీ ప్రభుత్వాన్నే తీవ్ర ఇరకాటంలో పడేశారు. కమలనాథులపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్‌ చేతికి స్వయంగా మరో అస్త్రాన్ని అందించారు. గడ్కరీ వ్యాఖ్యలతో మోదీ, అమిత్‌ షా ద్వయమే కాదు కమలదళమంతా తలలు పట్టుకుంటుంటే... కాంగ్రెస్‌ ఇదే అవకాశంగా తూర్పారబడుతోంది. ఓ చానల్‌లో ప్రసారమైన 'అసల్‌ పవానే- ఇర్సల్‌ నమూనే' అనే రియాలిటీ షోలో గడ్కరీ, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నానా పాటేకర్‌తో కలిసి పాల్గొన్నారు. ఇందులో భాగంగా నానాతో సంభాషిస్తూ గడ్కరీ బీజేపీని ఇరకాటంలో పడేసే వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ఈనెల 4, 5 తేదీల్లో రెండు భాగాలుగా ప్రసారమైంది. 'రాజకీయాలు సినిమా కలిసిన వేళ' పేరిట మొదటి భాగం, 'నానా-నితిన్‌ మధ్య చమత్కారం' పేరిట రెండో భాగం ప్రసారమయ్యాయి.''మేం అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేదు. అందుకే పెద్ద పెద్ద హామీలు ఇవ్వాలని మాకు సలహా ఇచ్చారు. ఇప్పుడు మేం అధికారంలో ఉన్నాం. ప్రజలు మేం ఇచ్చిన హామీలను మాకు గుర్తు చేస్తున్నారు. మేం నవ్వి వెళ్లిపోతున్నామని చెప్పుకొచ్చారు నితిన్‌ గడ్కరీ. గడ్కరీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గురించి ఈ వ్యాఖ్యలు చేశారా ? లేక మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం గురించి చేశారా ? అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే గడ్కరీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. 

తిరువనంతపురం : ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ను కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 50 లక్షల చెక్కును అందచేశారు. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్(76) ను కేరళ పోలీసులు అనవసరంగా గూఢచర్యం కేసులో ఇరికించారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను వేధించినందుకు ఎనిమిది వారాల్లో రూ.50 లక్షలు పరిహారం చెల్లించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనితో ఆయన్ను కలిసి డబ్బును అందచేసింది. 

1994 నాటి గూఢచర్యం కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారని, వేధించారని నంబి నారాయణన్(76) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనితో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డీకే జైన్ నేతృత్వంలో జస్టిస్‌లు ఏఎం ఖాన్‌విల్కర్, డీవై చంద్రచూడ్‌తో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది.  విచారణ జరిపిన అనంతరం 1994నాటి కేసులో నంబి నారాయణన్ ను కేరళ పోలీసులు అనవసరంగా అరెస్టు చేశారని, దారుణంగా వేధించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

అసలేం జరిగింది ? 
1994 అక్టోబర్ 20న కేరళలోని తిరువనంతపురంలో మాల్దీవులకు చెందిన మరియం రషీదా అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఇస్రోకు చెందిన క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ పరిజ్ఞానాన్ని రహస్యంగా సేకరించి పాకిస్థాన్‌కు అందచేస్తున్నట్లు పోలీసులు అభియోగాలు మోపారు. అదే ఏడాది నవంబర్‌లో ఇస్రోకు చెందిన క్రయోజెనిక్ ప్రాజెక్టు డైరెక్టర్ నంబి నారాయణ్, డిప్యూటీ డైరెక్టర్ డీ శశికుమారన్ లను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేసింది. నిరాధారమంటూ  పేర్కొంది. 

ఢిల్లీ: కేంద్రంలోని  బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్ చేస్తూ ఆదాయపన్నుశాఖతో దాడులు చేయిస్తోందని ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిగిన  ఐటీ దాడుల సమయంలో ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై తీవ్ర స్ధాయిలో ఆరోపణలు చేసాయి. తాజాగా ఈరోజు ఆమ్ఆద్మీ పార్టీ కూడా అదే వ్యాఖ్యలు చేసింది. పన్ను ఎగవేత కేసుకు సంబంధించి ఢిల్లీ రవాణాశాఖ మంత్రి  కైలాష్ గెహ్లాట్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన 16 ప్రాంతాల్లో ఆదాయపన్నుశాఖ అధికారులు ఈరోజు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆమ్ఆద్మీ పార్టీ నేత కైలాష్ గెహ్లాట్  కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న బ్రిస్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్, కార్పోరేట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అనే 2 సంస్ధలకు సంబంధించి పన్నుఎగవేత కేసులో, 60 మంది సభ్యుల బృందం ఢిల్లీ  గురుగావ్ ల లో 16 చోట్ల సోదాలు  నిర్వహిస్తున్నారు. గెహ్లాట్ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న రెండు సంస్ధల్లో చాలా లావాదేవీలు జరిగాయి కానీ లాభాలు లేవని ఆదాయపన్ను రిటర్న్  దాఖలు  చేయటంతో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఆదాయపన్నుశాఖ అధికారి ఒకరు చెప్పారు. ఆదాయపన్ను దాడులపై స్పందిస్తూ ఢిల్లీ  సీఎం కేజ్రీవాల్ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాన్నికేంద్రం వేధిస్తోందని ట్విట్టర్లో ఆరోపించారు. 

ఢిల్లీ : జెట్ ఎయిర్ వేస్ ఆర్థిక సంక్షోభంలో కూరుకపోయింది. పైలట్లకు..ఎయిర్ క్రాఫ్్ట సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. సెప్టెంబర్ నెల వేతనాలు ఇంకా ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  11, 26వ తేదీల్లో రెండు దఫాలుగా వేతనాలు చెల్లిస్తామని జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యం గతంలో హామీనిచ్చింది. కానీ ఈనెల 11న జీతాలు చెల్లించలేమని..వీలైనంత త్వరగా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని బుధవారం వెల్లడించింది. అక్టోబర్ 11న సెప్టెంబర్ నెలకు సంబంధించిన 50 శాతం వేతనం, ఆగస్టులో చెల్లించకుండా మిగిలిపోయిన 25 శాతం వేతనం చెల్లించాల్సి ఉంది. 

వేతనాలు వస్తాయని ఆశించిన పైలట్లు..ఎయిర్ క్రాఫ్్ట సిబ్బంది తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కొంత సంయమనం  పాటించాలని యాజమాన్యం పేర్కొంది. ఆగస్టు నెలలో ఉద్యోగులకు 75 శాతం మాత్రమే వేతనాలు చెల్లించింది. మిగతా 25 శాతం తరువాత చెల్లిస్తామని చెప్పింది. వేతనాలు ఇవ్వలేమని జెట్ ఇండియన్ జెట్ ఇండియన్ పైలట్్స యూనియన్, నేషనల్ ఏవియేటర్్స గిల్్డ తో సమావేశమై పరిస్థితిని వివరించింది. వేతనాలు ఎప్పుడిస్తామనేది త్వరలో తెలియచేస్తామని పేర్కొంది. 

చత్తీస్‌గఢ్‌ : పరిశ్రమల్లో అగ్రిప్రమాదాలు సంభవించి తొమ్మిది మంది మృతి చెందిన ఘటన స్థానికింగా భయాందోళనలకు గురిచేసింది. కర్మాగారంలోని గ్యాస్ పైపులైను పేలడంతో భిలాయ్ ఉక్కు పరిశ్రమలో సంభవించిన ఘోర ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. కర్మాగారంలోని గ్యాస్ పైపులైను పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్లాంటులోని కోక్ ఓవెన్ సెక్షన్ సమీపంలో మంగళవారం ఈ ప్రమాదం సంభవించింది. ఘటనలో మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్నవెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు దుర్గ్‌ రేంజ్‌ ఐజీ జీపీ సింగ్‌ వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్‌లో 24 మందికిపైగా కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది.
 

చెన్నై :  ఫేస్ బుక్ లో తనకు పరిచయమైన యువతిపై ఓ కానిస్టేబుల్ అనుమానం పెంచుకున్నాడు.అనుమానం పెనుభూతంగా మారి విచక్షణ మరిచాడు. ఆమె మరెవరితోనో సన్నిహితంగా వుంటుందనే అనుమానంతో, ఆమెను కాల్చి చంపి, తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై సమీపంలోని విల్లుపురం, అన్నియూరులో జరిగిన ఈ దారుణం చోటుచేసుకుంది. కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కార్తివేలు అనే యువకుడికి మెడిసిన్ చదువుతున్న సరస్వతి సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో పరిచయమైంది. ఈ క్రమంలో వారి మధ్య స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. గత కొంతకాలంలో సరస్వతి తనకు దూరమవుతూ, మరెవరికో దగ్గరవుతోందన్న అనుమానం కార్తివేలులో పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సరస్వతి పుట్టిన రోజురాగా, వేడుకల్లో పాలుపంచుకునేందుకు ఆమె వద్దకు వచ్చాడు. ఆపై వీరిద్దరి మధ్యా వాగ్వాదం జరుగగా, తుపాకితో సరస్వతిని కాల్చిచంపిన కార్తివేలు, ఆపై తనను తాను కాల్చుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

Pages

Don't Miss