National News

ముంబై : మీటు ఉద్యమం అన్ని రంగాలలోను సంచలన సృష్టిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా చిత్రపరిశ్రమలో సంచలనంగా మారిన తరుణంలో పలువురు నటీమణులు కొంతకాలం మౌనంగా భరించినా..ఇటీవలి కాలంలో తమపై జరిగిన ఈ వేధంపులపై గళమెత్తుతున్నారు. తెలుగులో శ్రీరెడ్డి రోడ్డుపైకి వచ్చి సంచలనం సృష్టించింది. బాలీవుడ్ లో తనుశ్రీదత్తా మరోమారు తన గళాన్ని విన్నగా వినిపిస్తోంది. దీనికి బాలివుడ్ లో మద్దతుకూడా లభిస్తోంది. ఈ నేపథ్యంలో క్రీడారంగంలో కూడా ఈ వేధింపులు వున్నాయన ప్రముఖ బాట్మింటన్ తార గుత్తా జ్వాల ట్విట్టర్ వేదికగా మొరపెట్టుకుంది. ఈ నేపథ్యంలో పలువురు వెలుగులోకి వచ్చిన మేము కూడా బాధితులమేనని ఎలుగెత్తి చాటుతున్నారు. ఈ క్రమంలో చానాళ్ల క్రితం బాలీవుడ్ స్టార్ ఐశ్వర్యా రాయ్, నిర్మాత గౌరంగ్ దోషి లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా, ఆయన తలపెట్టిన ఓ సినిమా నుంచి తప్పుకుందట. ఈ విషయాన్ని నటి ఫ్లోరా శైనీ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. తనను గౌరంగ్ వేధించాడని, కొట్టాడని తెలుసుకున్న ఐశ్వర్యా, తనకు అండగా నిలిచిందని, గౌరంగ్ చర్యలను వ్యతిరేకిస్తూ, ప్రాజెక్టు నుంచి తప్పుకుందని వెల్లడించింది. గౌరంగ్ పై ఫ్లోరా షైనీ సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాను ఆయన్ను ప్రేమించానని, తనను లైంగికంగా వేధించడంతో పాటు దారుణంగా హింసించాడని వెల్లడించింది.

 

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 'మీటూ' ఉద్యమం ప్రకంపనలు పుట్టిస్తుండగా, లైంగిక వేధింపులను ఎదుర్కొన్నామని చెబుతున్న సెలబ్రిటీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే వేధింపులు పరిమితం కాలేదని, మీడియా, క్రీడా రంగాల్లోనూ ఈ జాడ్యం ఉందని చెబుతూ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తనకు ఎదురైన వేధింపులను పంచుకుంది. తనను ఓ వ్యక్తి మానసికంగా ఎంతో వేధించాడని చెప్పింది. ఈ మేరకు ట్విట్టర్ లో కొన్ని ట్వీట్లు పెట్టింది. నాకు ఎదురైన మానసిక వేధింపులను వెల్లడించే సమయం ఆసన్నమైందని అనుకుంటున్నాను. అతను 2006లో చీఫ్ గా వచ్చాడు. జాతీయ చాంపియన్ షిప్ సాధించిన నన్ను జట్టు నుంచి తొలగించాడు. మానసికంగా వేధింపులకు గురి చేశాడు. రియో ఒలింపిక్స్ తరువాత కూడా ఇవి సాగాయి. నేను బ్యాడ్మింటన్ ను వదిలేందుకు ఈ వేధింపులు కూడా కారణం. నేను మిక్సెడ్ డబుల్స్ లో ఎవరితో ఆడతానో తెలుసుకుని, అతన్ని బెదిరించేవాడు. అందుకే నేను జట్టుకు పూర్తిగా దూరమయ్యానని..అన్ని రకాలుగా నన్ను ఒంటరిని చేశాడు" అని  గుత్తా జ్వాల ట్విట్టర్ వేదికగా వాపోయింది. కాగా, సింధు, సైనాల వంటి సింగిల్స్ క్రీడాకారులకు ప్రోత్సాహం ఇస్తూ, సంచలన విజయాలు సాధించిన తనను పక్కనబెడుతున్నారని ఆరోపిస్తూ, గతంలో గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన సంగతి విదితమే.

 

ఢిల్లీ : సామాన్యుడి అతి చౌక ప్రయాణ సాధనం రైలు. ఇండియన్ రైల్వేలో లక్షలాదిమంది ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారు. రైల్వేలో ఉద్యోగం అంటే ఎగిరి గంతేస్తారు చాలామంది. ఎందుకంటే వారికి అన్ని విధాల సదుపాయాలను ఆ శాఖ నిర్వహిస్తుంటుంది.  ఈ నేపథ్యంలో దసరాకు రైల్వే ఉద్యోగులకు శుభవార్తనందించింది ఆ శాఖ. రైల్వే యూనియన్లతో జరిగిన చర్చలు ఫలప్రదం కావటంతో రైల్వే ఉద్యోగులకు ఈసారి 78 రోజుల దసరా బోనస్ లభించనుంది. దీంతో రైల్వే ఉద్యోగుల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. ఉత్పాదకత ఆధారంగా 78 రోజులకు బోనస్ ఇవ్వాలని బోర్డు ప్రతిపాదించింది.  అయితే, ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. బోర్డు ప్రతిపాదనతో రూ.12.26 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఒక్కొక్కరికీ సుమారు రూ. 18 వేల బోనస్ లభించనుంది. అయితే, గెజిటెడ్ ఉద్యోగులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఆర్పీఎఫ్ స్పెషల్ ఫోర్స్‌కు చెందిన ఉద్యోగులకు ఈ పీఎల్‌బీ బోనస్ వర్తించదు. రైల్వే బోర్డు నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.2 వేల కోట్ల భారం పడనుంది.

ముంబై: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు నితిన్ బాలి దుర్మరణం చెందారు. నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన నితిన్.. నేటి ఉదయం తుది శ్వాస విడిచారు. ముంబై మాలద్ నుంచి బొరివిల్లిలో ఉన్న తన ఇంటికి వెళుతున్న క్రమంలో నితిన్ కారు ప్రమాదానికి గురైంది. ఆయన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు, ముఖానికి గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి గాయాలకు చికిత్స చేశారు. అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కానీ ఇంటికి వెళ్లిన తర్వాత, ఆయన మృత్యువాత పట్టారు. 

ఇంటికి చేరుకున్న వెంటనే నితిన్‌ రక్తపు వాంతులు చేసుకున్నారని, రక్తపోటు తీవ్ర స్థాయికి చేరిందని, ఒక్కసారిగా హార్ట్‌ రేటు పడిపోయిందని కుటుంబ సభ్యులు చెప్పారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే నితిన్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. 

కాగా, నితిన్‌ 1990 కాలంలో సింగర్‌గా బాగా ప్రసిద్ధి పొందారు. ‘నీలే నీలే అంబర్‌ పర్‌’ అనే క్లాసిక్‌ పాటతో ఎక్కువగా ఫేమస్‌ అయ్యారు. ఈ పాట బ్లాక్‌ అండ్‌ వైట్‌ వీడియోలో రూపొందింది. ఆరుకు పైగా ఆల్బమ్స్‌ చేశారు. ‘నా జానే’తో మ్యూజిక్‌ ఇండస్ట్రీలోకి నితిన్ అడుగుపెట్టారు. అయితే నితిన్‌ చాలా లో ప్రొఫైల్‌ మెయింటేన్ చేసేవారు. 2012లోనే మ్యూజిక్ ఇండస్ట్రీ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నారు. నితిన్‌ అంత్యక్రియలకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నితిన్ బాలి.. టీవీ నటి రోమా బాలి భర్త.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి వద్ద రైలు ప్రమాదం చోటు చేసుకుంది. న్యూ ఫరక్కా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. దాదాపు 35మందికిపైగా గాయపడినట్టు తెలుస్తోంది. రాయ్‌బరేలి జిల్లా హర్‌చంద్‌పూర్ రైల్వే‌స్టేషన్‌కు 50మీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐదు బోగీలు, ఇంజిన్ పట్టాలు తప్పాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం ఎన్ఢీఆర్ఎఫ్ బృందాలను సహాయక చర్యల కోసం ఘటనాస్థలికి పంపింది. ఈ ప్రమాదంపై స్పందించిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర రైల్వేమంత్రి పియూష్‌ గోయల్‌ సహాయక చర్యలను చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. వారణాసి, లక్నోల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాదస్థలానికి తరలివెళ్లాయి. రైల్వే బోర్డు ఛైర్మన్‌ అశ్విన్‌ లోహానీ సహాయ, రక్షక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. ఫరక్కా ఎక్స్‌ప్రెస్ లక్నో నుంచి అలహాబాద్‌కు వెళుతోంది.

ఢిల్లీ : యూత్‌ ఒలింపిక్స్‌లో మిజోరాం వెయిట్‌లిఫ్టర్ జెరెమీ లాల్‌రినుంగా చరిత్ర సృష్టించాడు. అతను ఈ క్రీడల చరిత్రలోనే భారత్‌కు తొలి పసిడి పతకాన్ని అందించాడు. మరోవైపు షూటింగ్‌ సంచలనం మను బాకర్‌ కూడా చక్కటి ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించింది. యూత్‌ ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టర్‌ జెరెమీ లాల్‌రినుంగా సంచలన ప్రదర్శన చేశాడు. మిజోరాంకు చెందిన 15 ఏళ్ల లాల్‌.. 62 కేజీల విభాగంలో పసిడితో మెరిశాడు. స్నాచ్‌లో 124 కేజీలు ఎత్తిన లాల్‌... క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 150 కేజీలు, మొత్తం మీద 274 కేజీలు లిఫ్ట్‌ చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఇక  సంచలన షూటర్‌ మనుబాకర్‌ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో ఆమె స్వర్ణంతో మెరిసింది. ఫైనల్లో రష్యా అమ్మాయి అనా ఇనినా గట్టి పోటీ ఇచ్చినా.. 236.5 పాయింట్లతో పసిడి ఎగరేసుకుపోయింది. భారత్‌కు ఇవే ఉత్తమ యూత్‌ ఒలింపిక్స్‌ క్రీడలు కాబోతున్నాయి. ఇప్పటికే నాలుగు పతకాలు గెలిచిన భారత్‌.. గత రికార్డును తుడిచిపెట్టింది. 
 

 

ఢిల్లీ : కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు రాహుల్‌గాంధీకి బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ సవాల్‌ విసిరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ నియోజకవర్గం నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేసి తనపై గెలవాలని.. ఒకవేళ ఓడిపోతే ఇటలీ వెళ్లిపోవాలలని మహరాజ్ అన్నారు. ఈమేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘రాహుల్‌గాంధీకి ఇదే నా సవాల్‌. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉన్నావ్‌ నియోజకవర్గం నుంచి నాకు వ్యతిరేకంగా పోటీ చేయాలి. ఒకవేళ ఆయన గెలిస్తే నేను రాజకీయాలను వదిలేస్తా.. కానీ ఆయన ఓడిపోతే మాత్రం దేశాన్ని‌ వదిలి ఇటలీ వెళ్లిపోవాలి’ అని సవాల్ చేశారు. రాహుల్‌ మానస సరోవర్‌ యాత్రపైనా ఆయన విమర్శలు చేశారు. రాహుల్‌ యాత్ర చేయడాన్ని తాము వ్యతిరేకించబోమని, అయితే అలాంటి యాత్రలు చేపట్టేముందు పవిత్రత చాలా అవసరమన్నారు. రాహుల్‌గాంధీ ఈ యాత్ర చేపట్టే ముందు స్వచ్ఛంగా మారాలని అని సాక్షి మహరాజ్‌ సూచించారు.

 

ముంబయి: రూపాయి విలువ మరింత దిగజారింది. ఈ ఏడాది ఇప్పటివరకు డాలర్‌తో పోల్చితే 16 శాతం మేరకు తగ్గిపోయింది. ఈ రోజు ఒక్కసారిగా..33 పైసలు తగ్గి.. డాలర్ విలువలో 74.39 వద్ద నిలిచింది. ఇది ఇప్పటి వరకు జరిగిన తగ్గుదలలో అత్యధికంగా మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.

ముంబయి:  గత కొద్ది ఏళ్లగా వినియోగదారులకు దూరమైన హ్యుండయ్ శాంట్రో మోడల్ కారు..మళ్లీ త్వరలో మార్కెట్‌లోకి రాబోతోంది.  కొత్తగా రాబోయే శాంట్రో హ్యుండయ్ ఇయాన్, హ్యుండయ్ గ్రాండ్ ఐ10 మధ్య మోడల్‌గా విడుదల చేసేందుకు హ్యుండయ్ సన్నాహాలు చేస్తోంది. గతంలో తమ మొదటి కారుగా కొనుక్కున్న శాంట్రో వినియోగదారులు.. కొత్త మోడల్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.
గతంలో మార్కెట్‌లో రిలీజ్ అయిన శాంట్రో మోడల్ కంటే రాబోయే మోడల్ కొన్ని మార్పులు, చేర్పులతో విడుదల చేస్తున్నారు. ఎక్సటీరియర్, ఇంటీరియర్ లుక్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే సరికొత్త ఫీచర్లతో శాంట్రో వస్తోంది. ప్రధానంగా కొత్త ఇంజన్, పెట్రోల్, డీజిల్ మోడళ్లతో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరికొన్ని ఫీచర్లు ఉండబోతున్నాయి.  దీని ధర రూ 46 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ కారు ఈ నెల 23న విడుదల చేస్తున్నట్టు హ్యుండయ్ కంపెనీ వెల్లడించింది. 

 

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి, మాజీ ఎడిటర్ ఎమ్ జే అక్భర్ ‘#మీ టూ’ సుడిగుండంలో చిక్కుకున్నారు. తనుశ్రీ దత్తా- నానా పటేకర్‌తో మొదలైన ‘మీ టూ’ ప్రచారం సినీ రంగంతోపాటు మీడియా హౌజ్‌లను కబళిస్తోంది. హిందూస్థాన్ టైమ్స్ ఎడిటర్‌పై లైంగిక ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా చేసినట్టు సమాచారం. ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రికే ఈ ప్రచారం ఎసరుపెట్టింది. 
దీనిపై విలేకరులు ప్రశ్నించగా కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడేందుకు నిరాకరించారు. ‘‘మీరు మహిళా మంత్రిగా ఉన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మీరేమైనా వీటిపై విచారణకు ఆదేశిస్తారా’’ అని  ట్రిబ్యూన్ ప్రతినిధి స్మితా శర్మ.. సుష్మా స్వరాజ్‌ను ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా వడివడిగా వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.  దీనిపై స్పందించడానికి మంత్రి అక్బర్ అందుబాటులో లేరు. ఆయన నైజీరియా పర్యటనలో ఉన్నట్టుగా సమాచారం.  
ప్రియా రమణి అనే జర్నలిస్టు తన ట్వీట్‌లో ప్రముఖ జర్నలిస్టు కేంద్ర విదేశీ ఉప మంత్రి అక్బర్ పేరును వెల్లడించింది. అమెరికాలో ఈ తరహా ప్రచారం హార్వే వీన్‌స్టీన్ కుంభకోణం వెలుగుచూసినపుడు రమణి తన చేదు అనుభవాలను వెల్లడించింది.  ఆ వ్యక్తినే ఒక ప్రముఖ పత్రిక ఎడిటర్‌గా పేర్కొంది. తనపై వేధింపులపై ఒక  మ్యాగజైన్‌లో ఓ ఆర్టికల్‌ను గత ఏడాది అక్టోబర్‌లో ఆమె రాసింది. 

 

చెన్నై: తమిళ వార పత్రిక ఎడిటర్ నక్కీరన్  గోపాల్ ను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర గవర్నర్  బన్వరిలాల్ పురోహిత్  పై  అసత్య కధనాలు ఫ్రచురించినందుకు ఆయన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పూణే వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన ఆయన్ను ఈ ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన ప్రోఫెసర్ నిర్మలాదేవి విధ్యార్ధినిలను వ్యభిచారంలోకి దింపుతున్నారని, ఆమె విద్యార్ధినులను రాజ్ భవన్ కు తీసుకువెళుతున్నారని నక్కీరన్ పత్రికలో కధనాలు వెలువడ్డాయి. దీంతో రాజ్ భవన్ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. తనపై వచ్చిన వార్తలను గవర్నర్ ఖండించారు. కాలేజీ విద్యార్ధినులను మభ్యపెట్టి వ్యభిచారంలోకి  దింపుతున్నారనే ఆరోపణలతో ఏప్రిల్లో నిర్మలాదేవిని అరెస్టు చేసి పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తున్నారు.గవర్నర్  ను  కలిసినట్లు నిర్మలాదేవి పోలీసు విచారణలో చెప్పారు .ఈకేసు విచారించేందుకు విశ్రాంత ఉన్నతాధికారి ఆర్‌.సంథమ్‌ను  నియమించారు. ‌కేసు విచారణ  జరుగుతోంది.  
నక్కీరన్ గోపాల్ అరెస్టు అప్పుడే తమిళనాట రాజకీయ దుమారం రేపింది. గోపాల్ అరెస్టు పత్రికా స్వేచ్చను హరించటమేనని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నక్కీరన్ గోపాల్ ను అరెస్టు చేయించిందిని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆరోపించారు. మరోవైపు...సరైన సాక్ష్యాధారాలు లేకుండా వార్త ప్రచురించటం తప్పు అని గోపాల్ అరెస్టును సమర్దిస్తూ టీటీవీ దినకరన్ అన్నారు. కాగా గోపాల్  ను   అరెస్టు చేసిన చింతాద్రిపేట పోలీసు స్టేషన్ వద్ద రాజ్యసభ  సభ్యుడు, ఎండీఎంకే నేత వైగో ధర్నా నిర్వహించారు. గతంలో కరడుగట్టిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్  తో  నక్కీరన్ గోపాల్ ఇంటర్వ్యూ చేసి తన పత్రికలో ప్రచురించి ప్రాముఖ్యం పొందారు.  

 

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మరో ప్రసంశ తోడయింది. ప్రస్తుతం జరుగుతున్న సంస్కరణల కారణంగా అత్యంత వేగంగా అభివృద్ధిచెందుతున్న ఆర్థికవ్యవస్థల్లో భారతదేశం చేరుకుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎమ్ఎఫ్) ప్రశంసలు కురిపించింది.   
గతకొన్ని సంవత్సరాలుగా ఇండియాలో పలు ముఖ్యమైన సంస్కరణలు ఉదా.. జీఎస్టీ, ద్రవ్యోల్బణం అదుపుచేసే యంత్రాంగం, బ్యాంకుల దివాతీయకుండా చేపట్టిన చర్యల ద్వారా, ఈజ్ ఆఫ్ దూయంగ్ బిజినెస్‌లో సాధించిన ప్రగతి ఆర్థికసోపానాలకు మార్గదర్శకంగా మారాయని బాలిలో ఐఎమ్ఎఫ్ వార్షిక సమావేశం సందర్భంగా రానున్న ప్రపంచ ఆర్థిక ఔట్‌లుక్ (డబ్ల్యూఈఓ) నివేదికలో పేర్కొంది.  
ఇటీవల పెరిగిన ఆయిల్ ధరలు, గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులు ఉన్నప్పటికీ వచ్చే ఏడాది అభివృద్ధి సూచికలో 0.1 శాతం నుంచి 7.4 శాతం పెరుగుదల నమోదు చేసేందుకు కృషి జరుగుతోందని ఐఎమ్ఎఫ్ నివేదిక పేర్కొంది.  భారత్ అంచనాలు సాధ్యం కాకపోయినప్పటికీ..ఇది ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే ఇది తక్కువేమీ కాదని నివేదిక పేర్కొంది. చైనా ఆర్థికాభివృధ్ది అంచనాల కంటే భారత్ మెరుగైన ఫలితాలు పొందగలదని ఐఎమ్ఎఫ్ నివేదిక తేల్చింది.

 

అహ్మదాబాద్: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని ఓ కుమారుడికి కోర్టు బుద్ధి చెప్పింది. ప్రతి నెలా ఖర్చుల కోసం డబ్బు ఇవ్వాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఏకంగా అతడికి నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది. 

వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌కు చెందిన రాంఛోద్‌భాయ్ సోలంకి, జసుమంతి సోలంకికి ఇద్దరు కుమారులు. వృద్ధాప్యంలో ఉన్న ఆ దంపతులకు కొడుకులతో వివాదం నడుస్తోంది. ఇద్దరు కుమారులు తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోవడంతో.. గతిలేని పరిస్థితుల్లో 2013లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. కొడుకుల నుంచి తమకు ప్రతి నెలా కొంత డబ్బు అందేలా చూడాలని కోరారు. పాపం ఆ దంపతుల కష్టాలను చూసిన కోర్టు.. ప్రతి నెలా తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి రూ.900 చొప్పున ఇవ్వాలని ఆదేశించింది. అప్పటి నుంచి మొదటి కుమారుడు దయాభాయ్ మాత్రం ప్రతి నెలా తల్లిదండ్రులకు డబ్బు చెల్లిస్తున్నాడు. రెండో కుమారుడు కాంతి భాయ్ మాత్రం సరిగా డబ్బు ఇవ్వడం లేదు. 

రెండో కుమారుడి నుంచి డబ్బు సరిగా అందకపోవడంతో.. ఆ దంపతులు మళ్లీ 2015లో కోర్టును ఆశ్రయించారు. తమకు డబ్బు సరిగా చెల్లించడం లేదని పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఏప్రిల్‌లో జైలు శిక్ష విధించి నోటీసులు పంపింది.  అయినా అతడు డబ్బు చెల్లించకపోవడంతో శిక్షను ఖరారు చేసింది. తండ్రికి డబ్బు ఇవ్వనందుకు 735రోజులు.. తల్లికి పంపనందుకు 810 రోజులు.. మొత్తం కలిపి 1545 రోజులు జైలు శిక్ష విధించింది. కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. కోర్టు తీర్పుపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని పట్టించుకోని పిల్లలకు కోర్టు హెచ్చరికలు పంపినట్టైంది. 

చెన్నై: క్యాస్టింగ్ కౌచ్ పేరుతో తెలుగు సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడిని శ్రీరెడ్డి కొద్ది నెలల క్రితం బయట పెట్టి సంచలనం సృష్టించింది. అప్పటికే హాలీవుడ్‌లో "మీ టూ" పేరుతో మొదలైన ఉద్యమం బాలీవుడ్‌లో పాకింది. అప్పటి నుంచి మహిళలు ఒక్కొక్కరుగా తమపై జరిగిన లైంగిక దాడిని ధైర్యంగా గొంతెత్తి చెబుతూ సెలబ్రిటీల బండారం బయటపెడుతున్నారు. దక్షిణాదిలో ఇటీవల సింగర్ చిన్మయి తనపై జరిగిన లైంగిక దాడిని బయటపెట్టి మీ టూ ఉద్యమాన్ని ఉధృతం చేసారు. 
లేటెస్ట్‌గా ప్రముఖ తమిళ పాటల రచయిత, పద్మవిభూషణ్ అవార్డుగ్రహీత వైరముత్తు తన దగ్గర పని చేసే సహాయకురాలిపై లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు.. జర్నలిస్టు సంధ్యామీనన్‌కు చెప్పారు. ఆమె ఈ విషయాన్ని, బాధితురాలు పంపిన వాట్సప్ మెసెజ్‌తో తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 
తమిళ చిత్రపరిశ్రమలో లెజెండ్‌గా భావించే వైరముత్తు దగ్గర బాధితురాలు 18వ ఏట నుంచి పని చేస్తోంది. పాటల డిక్టేషన్ కోసం పిలిపించుకుని, దగ్గరకు తీసుకుని, ముద్దు పెట్టుకుని, కౌగిలించుకునే వాడని బాధితురాలు వాపోయింది. ఆ సమయంలో ఏం చేయాలో తోచక భయం వేసి ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి బయట పడేదాన్నని ఆమె చెప్పింది. ఆయన నిజస్వరూపం తెలిశాక ఒంటరిగా ఉండలేక నలుగురు ఉన్న చోట మాత్రమే ఉండేలా అలవాటు చేసుకున్నట్లు బాధితురాలు తెలిపినట్లు జర్నలిస్టు సంధ్యామీనన్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. వైరముత్తుకున్న రాజకీయ పలుకుబడి ఇతర పరిచయాల వల్ల అతను చేసిన అఘాయిత్యాన్ని బయటకు చెప్పలేక ఇప్పుడు చెప్పినట్లు భాదితురాలు తెలిపింది.

నాగ్‌పూర్: పాకిస్థాన్ గూఢ‌చారి సంస్థ ఐఎస్ఐ ప‌న్నిన కుట్ర వెలుగులోకి వ‌చ్చింది. భారత అమ్ములపొదిలో కీలక అస్త్రమైన ‘బ్రహ్మోస్‌ క్షిపణి’ రహస్యాలు తెలుసుకునేందుకు ఐఎస్ఐ ఈ కుట్ర ప‌న్నింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ క్షిపణి పరీక్ష కేంద్రంలో ప‌ని చేస్తున్న ఇంజినీర్ నిషాంత్ అగ‌ర్వాల్‌ను ఏటీఎస్ అరెస్టు చేసింది. నిషాంత్ అగ‌ర్వాల్ ఐఎస్ఐ ఏజెంట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడని అధికారులు చెబుతున్నారు. క్షిప‌ణికి సంబంధించిన స‌మాచారాన్ని ఐఎస్‌ఐకి చేరవేస్తున్న‌ట్టు అధికారులు గుర్తించారు. ఫేస్‌బుక్ ద్వారా అతడు ఈ సమాచారాన్ని పంపించినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఏటీఎస్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఫెసిలిటీ యూనిట్ వద్ద నిశాంత్ అగర్వాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ యూనిట్‌లో బ్రహ్మాస్ క్షిపణులకు ప్రొపెల్లెంట్, ఇంధనం వంటివి సమకూరుస్తున్నారు.
 
భారత మిస్సైల్ సిస్టమ్‌కు చెందిన కీలకమైన సాంకేతిక సమాచారాన్ని నిశాంత్ అగర్వాల్‌ సేకరించి ఐఎస్ఐకి లీక్ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దేశ రక్షణ వ్యవస్థలో కీలకమైన బ్రహ్మోస్‌ సాంకేతిక సమాచారాన్ని నిషాంత్ ఐఎస్ఐకి ఏ మేరకు చేరవేశాడనే అంశంపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ గూఢచర్యం వ్యవహారంలో మరో ఏజెన్సీ ప్రమేయం ఉన్నట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఢిల్లీ : భారత్, ఫ్రాన్స్ మధ్య కుదిరిన ‘రాఫెల్ యుద్ధ విమానాల’ ఒప్పందంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిల్ పై అక్టోబర్ 10న విచారణ జరగనుంది. వినీత్ దండ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ కే కౌల్, జస్టిస్ కే ఎం జోసెఫ్ మోండేల బెంచ్ వాదనలు విననుంది. రాఫెల్ ఒప్పందం వివరాలతో పాటుగా, యూపీఏ, ఎన్ డీఏ ప్రభుత్వాల హయాంలో ఈ ఒప్పందపు విలువలో వున్న వ్యత్యాసాన్ని సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని న్యాయవాది తన పిల్ లో కోరారు.
ఇదిలావుండగా భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఒప్పందంపై స్టే విధించాలంటూ ఎం ఎల్ శర్మ అనే అడ్వకేట్ వేసిన పిటీషన్ కూడా ఈ నెల 10న విచారణకు రానుంది. 36 విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందని, ఇరు దేశ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 253 ప్రకారం పార్లమెంట్ ఆమోదం లేనందున, ఒప్పందాన్ని రద్దు చేయాలని న్యాయవాది శర్మ తన పిటీషన్ లో పేర్కొన్నారు.
ఇదేకోవలో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో అవినీతిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించి వివరాలను పార్లమెంటుకు సమర్పించాలని కోరుతూ సుప్రీంలో మార్చి నెలలో మరో పిటీషన్ దాఖలైంది. నిబంధనల ప్రకారం డిఫెన్స్ ప్రొక్యూర్ మెంట్ ప్రొసీజర్ అనుమతి కోరలేదని, ఫ్రాన్స్ తో జరిగిన ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం ఎందుకు తీసుకోలేదో కేంద్రం నుంచి తెలుసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నేత తెహ్ సీన్ ఎస్ పూనావల్లా కూడా ఓ పిటీషన్ ను సుప్రీం కోర్టులో దాఖలు చేశారు.
రాఫెల్ ఒప్పందం భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన రక్షణ ఒప్పందం. భారత ఎయిర్ ఫోర్స్ ఆయుధాల ఆధునికీకరణ ప్రక్రియలో భాగంగా భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందంలో 36 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ కొనుగోలు చేయాలనేదే ఒప్పందం. రెండు ఇంజిన్ల మీడియం మల్టీ రోల్ కంబాట్ సామర్థ్యం కలిగిన రాఫెల్ విమానాలను ఫ్రెంచ్ ఏరోస్పెస్ కంపెనీ డసాల్డ్ ఏవియేషన్ తయారు చేసింది. 126 యుద్ధ విమానాల కొనుగోలుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 2007 ఆగస్టులో ప్రతిపాదనలు చేసింది.  
 

 

ముంబై : మీ టూ ఉద్యమం ఇప్పుడు మనదేశంలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది.మహిళలు మౌనం వీడి.. సామాజిక మాధ్యమ వేదికల మీదికి వచ్చి.. తమపై జరిగిన లైంగిక వేధింపులు, లైంగిక దాడులపై నినదించడమే మీ టూ ఉద్యమంప్రముఖ బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలతో  మీటూ  ఆరంభమైంది. ఇది సంచలనంగా మారి చలనచిత్ర పరిశ్రమను పట్టి కుదిపేస్తోంది.

మీటూ ప్రకంపనలు ఇప్పుడు మీడియాను తాకాయి.  దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలనూ ఉక్కిరిబిక్కిరి చేయటం ఆరంభించింది. తనుశ్రీ ఆరంభించిన ట్విటర్‌ సందేశ పరంపరను చూసి మరికొంతమంది నటీమణులు తమకు ఎదురైన అనుభవాలను బయటపెట్టటం మొదలుపెట్టారు. 'క్వీన్‌' సినిమా చిత్రీకరణ సమయంలో ఆ చిత్ర దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ప్రముఖ నటి కంగనా రనౌత్‌  ఆరోపించింది. ఉత్తరాది నుంచి 'మీ టూ' ఉద్యమంలో కంగనా దూకితే దక్షిణాదికి చెందిన గాయని చిన్మయి, నటి ఆషా శైనీ తామూ లైంగికంగా వేధింపులకు గురయ్యామంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ పత్రిక 'హిందుస్థాన్‌ టైమ్స్‌'లో పని చేసిన ఒక మహిళా ఉద్యోగి తమ పత్రిక రాజకీయ విభాగం సంపాదకుడు తనను లైంగికంగా వేధించాడని వెల్లడించటంతో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు సమాచారం.

గతంలో తమకు ఎదురైన లైంగిక వేధింపులకు సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమాల్లో బయటపెడుతూ ఆరంభమైన 'మీ టూ' ఉద్యమం ఇప్పుడు సినీ పరిశ్రమలోనే కాదు, వివిధ మీడియా సంస్థలనూ చేరుకుంది. మీడియా సంస్థలు కూడా 'మీ టూ' సుడిలో చిక్కుకుంటున్నాయి. తాజాగా హిందుస్థాన్‌ టైమ్స్‌ పత్రిక రాజకీయ విభాగం సంపాదకుడు ప్రశాంత్‌ ఝాపై సంస్థ మాజీ ఉద్యోగిని లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో ఆయన రాజీనామా సమర్పించినట్లు వార్తలొస్తున్నాయి. అలాగే వినోద కార్యక్రమాలను రూపొందించే 'ఏఐబీ' సంస్థ వ్యవస్థాపకుల్లో ఇద్దరు కూడా ఇవే ఆరోపణల సుడిలో చిక్కుకొని, సెలవు మీద వెళ్లిపోయారు. 'మీ టూ' ట్విటర్‌ పరంపరలో ప్రముఖ పత్రికా సంస్థలకు చెందిన మరికొందరు పాత్రికేయుల పైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ ఉద్యమం ఇంకెలా మారుతుందో ,  ఇంకెంతమంది బాధితులు ముందుకు వస్తారో చూడాలి.
 

జైపూర్: స్వచ్చ  భారత్ పేరుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజల్లో మార్పు తీసుకు వస్తుంటే ఆ పార్టీకి చెందిన నేతలు మోడీ ఆశయానికి  తూట్లు పొడుస్తున్నారు. లేటెస్ట్ గా రాజస్ధాన్ కు  చెందిన మంత్రి శంభు సింగ్ ఖేటసర్ బహిరంగ మూత్ర విసర్జన చేసి వార్తల్లో కెక్కారు. మంత్రి గారు మూత్రవిసర్జన చేస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ హాట్ టాపిక్ గా మారి నెటిజన్ల విమర్శలు ఎదుర్కుంటోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా  అజ్మీర్ వద్ద ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభకు హజరయ్యే క్రమంలో సభా వేదికకు సమీపంలోనే  మంత్రిగారు లఘుశంక తీర్చుకున్నారు. పైగా ముఖ్యమంత్రి వసుంధర రాజే పోస్టర్  పక్కనే ఆయన మూత్ర విసర్జన చేయడం మరింత చర్చకు దారి తీసింది. ఇదేం పని మంత్రి గారు అని అడిగితే స్వచ్ఛ భారత్‌ ఉద్దేశ్యం  బహిరంగ మల విసర్జన చేయవద్దని కానీ, మూత్ర విసర్జన కాదని తాను చేసిన పనిని సమర్ధించుకున్నారు ఆ పెద్ద మనిషి. తను చేసిన ఈ పనిని  ఇది పెద్దవారి సాంప్రదాయమని చెప్పడం కొసమెరుపు. ఆ రోజు ఉదయం నుంచి బిజీగా గడిపానని, దగ్గరల్లో ఎక్కడా  టాయిలెట్స్‌ లేవని చివరకు తప్పు ఒప్పుకున్నారు సదరు మంత్రిగారు. 

న్యూఢిల్లీ: దేశ జాతీయ భద్రతలోని డొల్లతనం మరోసారి బయటపడింది. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ ఏజంటు ఒకరు అత్యంత భద్రత నడుమ రహస్యంగా చేపడుతున్న బ్రహ్మోస్ మిసైల్ ప్రయోగశాల వద్ద తచ్చాడుతూ కనిపించడం జాతీయ భద్రతపై అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తెలియజేస్తోంది. మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బ్రహ్మోస్ మిసైల్ తయారీ కేంద్రం వద్ద నిషాంత్ అగర్వాల్ అనే పాకిస్థాన్ గూఢచారి తచ్చాడుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక శాఖ అధికారులు జరిపిన సంయుక్త ఆపరేషన్‌‌లో నిషాంత్ పట్టుబడ్డట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

గత కొంతకాలంగా పోలీసులు నిషాంత్ కదలికలపై నిఘా పెట్టారు. ఈ నిఘాను శనివారం నుంచి పెంచారు. కీలకమైన సాంకేతిక సమాచారాన్ని ఐఎస్ఐకు నిషాంత్ చేరవేస్తున్నాడని తెలుస్తోంది. పాకిస్థాన్‌తో పాటు ఇతర గూఢచార సంస్థలకు చేరవేస్తున్నట్టు సమాచారం.

ఢిల్లీ: బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ చేరుకున్న శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని ఆయన తెలిపారు. అమిత్‌షా ఆదేశాల మేరకు తన ప్రణాళిక ఉంటుందని,నవరాత్రి ఉత్సవాలు అయ్యాక మరోసారి కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్వామి పరిపూర్ణానంద చెప్పారు. 
శ్రీ పీఠం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు చేస్తున్న స్వామి పరిపూర్ణానంద ఇటీవలి కాలంలో హిందూ మత పరిరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలతో వార్తల్లో నిలిచారు. యూపీలో యోగి ఆదిత్యనాధ్ తరహాలోనే  తెలంగాణాలోను స్వామి పరిపూర్ణానందను రంగంలోకి  దింపి హిందూ సెంటిమెంట్‌తో మరింత లాభపడే ఆలోచనలో బీజేపీ అధినాయకత్వం ఉంది. అంతకు ముందు స్వామి పరిపూర్ణానంద బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తోనూ సమావేశం అయ్యారు. 

ఢిల్లీ:వంద అబద్దాలు ఆడి ఓ పెళ్లి చెయ్యమన్నారు పెద్దలు. కానీ ఇక్కడ నకిలీ వజ్రాలు బహుకరించే సరికి కుదిరిన పెళ్లి కాస్త క్యాన్సిల్ అయ్యింది,  దాంతో ఆ పెళ్లికొొడుకు లబోదిబో మంటూ వజ్రాల వ్యాపారి పై కేసు పెట్టాడు.ఇంతకీ ఆ వజ్రాల వ్యాపారి ఎవరనుకుంటున్నారు? మన దేశంలో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేలాది కోట్ల రూపాయలు అప్పులు ఎగొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీయే.
సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ అనే అనే పత్రిక కథనం ప్రకారం.. నీరవ్‌ మోడీ జూన్ లో కెనడాకి చెందిన పౌల్‌ ఆల్ఫోన్సో అనే వ్యక్తికి సుమారు 2లక్షల డాలర్ల విలువ కలిగిన రెండు డైమండ్‌ ఉంగరాలను హాంకాంగ్ లో అమ్మాడు. అందులో ఒక రింగును ఆల్ఫోన్సో తన గర్ల్ ఫ్రెండ్ కు బహుకరించాడు. ఆమె డైమండ్ రింగ్ లు చెక్ చేయించగా అవి నకిలీవని తేలింది, ఆ విషయం ఆల్ఫోన్సో కు చెప్పిన అతని  గర్ల్ ప్రెండ్ ఎంగేజ్ మెంట్ రద్దు  చేసుకుంది. నీరవ్ చేసిన పనికి గర్ల్ ఫ్రెండ్ దూరమైన ఆ వ్యక్తి డిప్రెషన్ లోకి వెళ్లాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆల్ఫోన్సో నీరవ్ మోడీ పై  రూ.31కోట్ల నష్టపరిహారం కోరుతూ కాలిఫోర్నియాలో కేసు పెట్టాడు.
పంజాబ్ నేషనల్  బ్యాంకుకు రుణం ఎగ్గొట్టిన కేసులో నీరవ్ కు చెందిన సుమారు 600 కోట్లరూపాయల ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  అధికారులు ఇటీవల జప్తు చేసి, నీరవ్ ని ఇండియా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ లో బ్యాంకులను మోసం చేసిన కేసులో భాగంగానే  నీరవ్ పై ఇంటర్ పోల్ అధికారులు రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. నీరవ్ మోడీ బ్యాంకును చేసిన మోసం వెలుగులోకి వచ్చింది,  ఇప్పుడు తాజాగా నకిలీ వజ్రాలు అమ్మిన విషయం బయటపడింది. నీరవ్ ఇలా ఇంకెంత మందికి నకిలీ వజ్రాలు అమ్మాడో మున్ముందు తెలియాల్సి ఉంది. 

ముంబై: అవును.. భార్య‌లు బ‌తికుండ‌గానే భ‌ర్తలు పిండ ప్ర‌దానం చేశారు. భర్తలకు భార్యలు విముక్తి కల్పిస్తారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారట‌. పెళ్లయిన కొన్ని రోజులకే భార్యాభర్తల మధ్య విభేదాలు చోటుచేసుకుంటున్నాయని, చివరికి అవి విడాకులకు దారి తీస్తున్నాయని వారు వాపోయారు. మహారాష్ట్రలోని నాసిక్ లో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వాస్తవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వందమంది భార్యాబాధితులు వేదమంత్రోచ్చారణ మధ్య గోదావరిలో తర్పణాలు విడిచారు. వాస్తవ్ ఫౌండేషన్ అధ్యక్షుడు అమిత్ దేశ్‌పాండే దీనికి అన్ని ఏర్పాట్లు చేశారు.

పెళ్లయిన కొన్ని రోజులకే భార్యాభర్తల మధ్య విభేదాలు చోటుచేసుకుంటున్నాయని, చివరికి అవి విడాకులకు దారి తీస్తున్నాయని అమిత్ దేశ్ పాండే పేర్కొన్నారు. ఇటువంటి వ్యవహారాల్లో మహిళలకే ఎక్కువగా మద్దతు లభిస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో భర్తలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే వాస్తవ్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసినట్టు అమిత్ తెలిపారు. గతంలో వారణాసిలోనూ పిండ ప్రదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు అమిత్ వివరించారు. భార్యలు కేసులు వేసినప్పుడు భర్తలకు ధైర్యం చెప్పడంతో పాటు న్యాయపరమైన సాయం కల్పిస్తున్నారు.  

గ‌తంలో వార‌ణాసిలోనూ ఇలానే జ‌రిగింది. భార్యల వల్ల బాధలు పడ్డ భర్తలు వైవాహిక జీవితానికి ముగింపు పలికి.. తమ మాజీ భార్యల పేరిట ‘పిశాచి ముక్తి పూజ’ను వారణాసిలోని గంగానది వద్ద నిర్వహించారు. ఇలా చేస్తే.. భార్యల వల్ల పడిన బాధలకు స్వస్తి పలికి.. పీడ వదిలిపోతుందని వారు చెబుతున్నారు. అంతేకాదు, తమ మాజీ భార్యలకు శాస్త్రోక్తంగా హిందూ ధర్మం ప్రకారం పిండ ప్రదానం చేశారు.
 
భారతీయ చట్టాలన్నీ పురుషులకు వ్యతిరేకంగా ఉన్నాయని భ‌ర్త‌లు వాపోతున్నారు. చివరికి జంతువులకు కూడా ఓ మంత్రిత్వ శాఖ ఉందని.. పురుషుల భద్రత కోసం ఏ శాఖ లేదని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్రతీ సంవత్సరం భార్యలు పెట్టే బాధలు భరించలేక 92వేల‌ మంది భర్తలు చనిపోతున్నారని, భర్తలు పెట్టే హింసలు భరించలేక 24వేల‌ మంది భార్యలు చనిపోతున్నారని సంస్థ స‌భ్యులు చెప్ప‌డం విశేషం.

కేరళ : పోలీసులు తమ వసూళ్ల విషయంలో ఎటువంటి రాజీలకు పోరు. అసలే పోలీసులు వ్యవస్థతపై నమ్మకం కోల్పోతున్న తరుణంలో మరోసారి తమపై నమ్మకం పెట్టుకోవద్దంటున్నట్లుగా వ్యవహరించారు కేరళ రాష్ట్రంలో పోలీసులు. సాధారణంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి. అది లేకుండా బండెక్కితే భారీ జరిమానా తప్పదు.  వాహనాదారులకు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఈ నిబంధనను కొనసాగిస్తున్నాయి. దీనిపై ఎటువంటి రాజీలేకుండా నిబంధనలకు పాటిస్తున్నాయి. కానీ దీన్ని అలుసుగా తీసుకున్న కొందరు పోలీసులు తమ దందాను కొనసాగిస్తున్నారు. కానీ హెల్మెట్ తప్పనిసరి అనేది ద్విచక్ర వాహనదారులకు మాత్రమే కాదు.. సైకిలిస్టులకూ వర్తిస్తుంటూ ఓ వ్యక్తికి ఏకంగా రూ.2 వేల జరిమానా విధించారు కేరళ పోలీసులు. అంతమొత్తం తన దగ్గర లేదని ఆ అభాగ్యుడు మొరపెట్టుకోవడంతో కనికరించిన పోలీసులు చివరికి రూ.500 కట్టించుకున్నారు. కేరళలోని కసర్‌గోడ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో పోలీసులపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఖాసిం కేరళలో వలస కూలీ. కంబాలాలో ప్రధాన రహదారిపై సైకిలుపై వెళ్తుండగా అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేదంటూ జరిమానా విధించారు. హెల్మెట్ లేకుండా వేగంగా వెళ్లడం నేరమంటూ రూ.2 వేల జరిమానా విధించారు. అక్కడితో ఆగక సైకిలు టైర్లలోని గాలిని తొలగించారు. ఖాసింకు ఇచ్చిన చలానా రసీదుపై ఓ మహిళకు చెందిన స్కూటరు వివరాలు ఉండడంతో అవాక్కైన ఖాసిం తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. రూ.500 కట్టే వరకు పోలీసులు తనను విడిచిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అది కాస్తా వైరల్ అయి ఎస్పీ దృష్టికి చేరింది. తీవ్రంగా పరిగణించిన ఆయన విచారణకు ఆదేశించారు.  

అహ్మ‌దాబాద్: చిన్నారిపై లైంగిక దాడి ఘ‌ట‌న‌తో దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన‌ గుజ‌రాత్ లో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. గుజ‌రాత్ రాష్ట్రంలో నివాసం ఉంటున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్, బీహార్ వాసులు ప్రాణ‌భ‌యంతో వ‌ణికిపోతున్నారు. గుజ‌రాత్ రాష్ట్రం వ‌దిలి పారిపోతున్నారు. గుజరాతీ చిన్నారిపై స్థానికేతరుడు అత్యాచారానికి పాల్ప‌డాడ్డు. ఈ కేసులో బీహార్ నుంచి వలస వచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అల్లరిమూకలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. ఈ క్రమంలో బీహార్, యూపీ నుంచి వలసవచ్చిన  కుటుంబాలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. 

గాంధీనగర్ తో పాటు అహ్మదాబాద్, పటన్, సబర్‌కాంతా, మెహసానా ప్రాంతాల్లో వలస దారులను లక్ష్యంగా చేసుకొని వారిపై అల్లరిమూకలు విరుచుకుపడ్డాయి. ఇక ఈ అత్యాచార‌ ఘటనపై సోషల్ మీడియాలో కొంద‌రు విద్వేష పూరిత పోస్టులు పెట్ట‌డంతో ఈ దాడులు మ‌రింత పెరిగాయి. దీంతో పొట్ట కూటి కోసం ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు తమ ప్రాణాలను అరచేత పట్టుకుని సొంత రాష్ట్రాలకు పారిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో ప్రయాణించే బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోయాయి.

అహ్మదాబాద్‌కు సమపంలోని సబర్‌కాంతా జిల్లా హిమ్మత్‌నగర్ పట్టణంలో సెప్టెంబ‌ర్ 28న ఓ 14 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అనుమానంతో ఓ బీహార్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో గుజరాతీ ప్రజల్లో బీహార్ సహా వలసదారులపై ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. వీటికి ఆజ్యం పోస్తూ సోషల్ మీడియాలో విద్వేష పోస్టులు వ‌స్తున్నాయి. ఈ నేపథ్యంలో ఠాకూర్ సేన అనే సంస్థ బీహార్, యూపీ ప్రజలు వెంటనే గుజరాత్ ను వదిలి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. ఈ ప్రాంత  వాసులకు పని ఇవ్వరాదని దుకాణాల యజమానులకు అల్టిమేటం జారీ చేసింది. దీంతో వందలాది మంది ప్రజలు ప్రాణ భయంతో తమ సొంత రాష్ట్రాలకు త‌ర‌లిపోతున్నారు.

ఈ ఘ‌ట‌న‌ల‌తో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. లా అండ్ ఆర్డ‌ర్ అదుపు త‌ప్ప‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇందులో భాగంగా స్థానికేత‌రుల‌పై దాడి చేసిన 342మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 42కేసులు న‌మోదు చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌క్కుండా గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. స్టేట్ రిజ‌ర్వ్డ్ పోలీసుల‌కు చెందిన 17 కంపెనీల‌ను రంగంలోకి దించారు. స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో గ‌స్తీని పెంచారు.

తమిళనాడు  : ఇంటిల్లి పాదిని హుషారెత్తించే ప్రో కబడ్డీ-6 సీజన్ ప్రారంభమైంది. 12 జట్లు పాల్గొంటున్న ఆరో సీజన్ లో తొలి మ్యాచ్ లో తమిళ్ తలైవాస్-పట్నా పైరేట్స్ మధ్య జరిగింది. తొలి మ్యాచ్ లో తమిళ్ తలైవాస్ జట్టు అద్భుత ఆట తీరుతో అదరగొట్టింది. 42-26 స్కోరు తేడాతో పట్నా పైరేట్స్ ను ఓడించింది. 13 నగరాల్లో నిర్వహించే ఈ లీగ్‌.. జనవరి 5న ముంబైలో జరిగే మెగా ఫైనల్‌తో ముగుస్తుంది. 
 

అమరావతి :  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ... పశ్చిమ బెంగాళ్‌ సీఎం మమతాబెనర్జీ ఓ లేఖ రాశారు. ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనవరిలో కోల్‌కతాలో తాము నిర్వహించబోయే భారీ ప్రదర్శనకు హాజరుకావాలని ఆ లేఖలో కోరారు. 2019 పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల సంఘటిత శక్తిని ఈ ర్యాలీ ద్వారా నిరూపించాల్సిన అవసరం ఉందని ఆమె లేఖలో పేర్కొన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరి 19న ఈ భారీ ప్రదర్శన చేపట్టనున్నట్లు వివరించారు. బీజేపీకి  వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒకేతాటిపైకి వచ్చి పోరాడేందుకు ఇది మంచి వేదికవుతుందని తెలిపారు.  దేశ చరిత్రలో ఎన్నో కీలక సమావేశాలకు సాక్ష్యంగా నిలిచిన కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ వద్ద ఈ ప్రదర్శనను ప్రారంభిస్తామని..  ఇక్కడి నుంచే అత్యంత కీలకమైన అంశాలపై నిరసన స్వరం వినిపిద్దామని కోరారు. 

 

ఢిల్లీ : సర్వసంగ పరిత్యాగులు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. స్వాములు, యోగుల రాజకీయ తీరే బీజేపీ అన్నది కొత్తగా చెప్పేదేమీ కాదు. అయితే,తెలుగు రాష్ట్రాల బీజేపీలో ఇంతవరకు స్వాములు, యోగులు లేరు. త్వరలో ఆ లోటు తీరబోతున్నట్లుగా రాజకీయ వాతావరణం కలనిపిస్తోంది. స్వామి పరిపూర్ణానంద త్వరలో బీజేపీలో చేరటానికి బీజేపి రంగం సిద్ధం చేస్తోంది. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లిన పరిపూర్ణానందస్వామి మాట్లాడుతు..అమ్మవారు ఆదేశిస్తే రాజకీయ అరగ్రేటం చేస్తానంటున్నారు.
కాగా ఇటీవల నగర బహిష్కరణకు గురై మొన్ననే తిరిగి హైదరాబాద్‌లో అడుగుపెట్టిన స్వామి పరిపూర్ణానందకు కాషాయ కండువా కప్పడం ద్వారా తెలంగాణలో మజ్లిస్ దూకుడుకు అడ్డుకట్ట వేయవచ్చని బీజేపీ భావిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లా హిందుత్వ కార్డును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగే సమ్మోహనశక్తి పరిపూర్ణానందకు ఉందని ఆరెస్సెస్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. పరిపూర్ణానంద స్వామిని పార్టీలోకి ఆహ్వానించడంపై ఇటీవల మోహన్ భగవత్ నేతృత్వంలో జరిగిన సమావేశంలోనూ చర్చించినట్టు తెలుస్తోంది.  

హిందూ ధర్మ పరిరక్షణ కోసం పరిపూర్ణానంద నిలబడుతున్న విషయం ఆరెస్సెస్ గుర్తించిందని తెలుస్తోంది.  ముఖ్యంగా సినీ క్రిటిక్ కత్తి మహేశ్ శ్రీరాముడిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై స్వామి పరిపూర్ణానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నిత అంశంపై వాతావరణం వేడెక్కడంతో, పోలీసులు స్పందించి తొలుత కత్తి మహేశ్‌ను, ఆ తర్వాత పరిపూర్ణానందను నగరం నుంచి బహిష్కరించారు. 55 రోజుల బహిష్కరణ తర్వాత స్వామి భారీ ర్యాలీతో రెండు రోజుల క్రితం నగరంలో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రవేశానికి బీజేపీ అన్నివిధాలుగా రంగం చేస్తున్నట్లు రాజకీయ సన్నిహిత వర్గాలు సమాచారం. కాగా గతంలో పరిపూర్ణానంద మాట్లాడుతు..తాను తలచుకుంటే సీఎంను కావటం పెద్ద విషయం కాదు అని వ్యాఖ్యానించటం గమనించాల్సిన విషయం.
 

Pages

Don't Miss