National News

హైదరాబాద్ : దేశంలో గోసంరక్షణ పేరుతో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. కొందరి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మతోన్మాద ఘర్షణలు పెంచి సామాజిక ఐక్యతను దెబ్బతీయడం దారుణమన్నారు. తెలంగాణలో పార్టీ ప్లీనం సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వాస్తవ పరిస్థితులు ప్రస్తావించని మోడీ..
మరోవైపు మోదీ స్వాతంత్ర్య సందేశంలో వాస్తవ పరిస్థితులను ప్రస్తావించలేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. రెండేళ్లుగా చెప్పిన విషయాలే పదే పదే చెబుతున్నారని విమర్శించారు. ఓవైపు నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్య ప్రజలు అల్లాడిపోతుంటే..దేశంలో ఆర్థికాభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతుందని గొప్పలు చెప్పుకోవడం విచారకరమన్నారు.

కేంద్రం కుట్రలు..
మతతత్వాన్ని విద్యారంగంలో చొప్పించే విధంగా మోదీ సర్కార్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోందని సీతారాం ఏచూరి ఆరోపించారు. జాతీయత పేరుతో మతతత్వాన్ని పెంచి పోషించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. 

ముంబై : ఆ బంగళాకు ఎంతో విశిష్టత ఉంది. పేరు ప్రఖ్యాతలూ ఉన్నాయి. ఎంతో మంది జాతీయ నేతలు. బస చేసేందుకు విడిదిగా ఉపయోగపడింది. 1904లో నిర్మించిన ఆ బంగళాను ఇప్పుడు అమ్మకానికి పెట్టారు. రియల్‌ఎస్టేట్‌ మార్కెట్‌లో ఇప్పుడా బంగ్లా వందల కోట్లు పలుకుతోంది. ఇంతకు ఆ పురాతన బిల్డింగ్‌ ఎక్కడుంది..? స్వాతంత్య్ర సమరయోధులకు రహస్య స్థావరం. స్వాతంత్య్ర సమరయోధులకు రహస్య స్థావరంగా నిలిచిన పురాతన బంగ్లా. ఎంతోమంది జాతీయ నేతలకు అనేకసార్లు విడిదిగా ఉపయోగపడిన బంగళా.  ముంబైలోని ఓల్డ్ బాంబే నేపియన్‌సీ రోడ్డులో ఉన్న లక్ష్మీనివాస్ బంగళాను అమ్మకానికి పెట్టారు. ఈ భవనం నుంచే నేతాజీ సుభాష్‌చంద్రబోస్ ఐఎన్‌ఏ రేడియో కేంద్రాన్ని నిర్వహించారు. మూడు తరాలుగా కపాడియా కుటుంబ సభ్యులకు నివాసంగా ఉన్న ఈ చరిత్రాత్మక బంగళాను 1904లో ఒక పార్సీ కుటుంబం నిర్మించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే శతాబ్ది కాలంగా అది కపాడియా కుటుంబం చేతుల్లోనే ఉంది.
క్విట్ ఇండియా ఉద్యమం రోజుల్లో అరుణా అసఫలీ వంటి నేతలు బ్రిటిష్ పోలీసులను తప్పించుకొనేందుకు ఈ బంగళాలోనే తలదాచుకొనేవారు. జవహర్‌లాల్ నెహ్రూ వారిని కలుసుకొనేందుకు పలుమార్లు ఈ బంగళాకు వచ్చేవారు. రాంమనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్ ముంబైకి వస్తే బస చేసేది ఈ బంగళాలోనే. ఎంతోమందికి ఆతిథ్యమిచ్చిన ఈ సువిశాలమైన బంగ్లా ఇప్పుడు అమ్మకానికి వచ్చింది. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో వందల కోట్లు పలికే అవకాశముంది. మరి ఏ కోటిశ్వరుడు సొంతం చేసుకుంటారో చూడాలి..!

హైదరాబాద్ : కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానిది చతుర్ముఖ ప్రభుత్వం అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి పేర్కొన్నారు. ఎస్వీకేలో జరుగుతున్న పార్టీ ప్లీనం సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధులను ఉద్ధేశించి ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. మోడీ పాలన తీరు..ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై స్పష్టంగా విశ్లేషించారు. దేశంలో ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయని హెచ్చరించారు. ఆర్థిక భారాలు పెంచడం..ఆర్థిక దౌర్జన్యానికి పూనుకోవడం మొదటి ముఖమన్నారు. మతతత్వాన్ని పెంచి పోషిస్తోందన్నారు. దళితులపై దాడులు పెరిగాయని, ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు వచ్చే ముందు మతోన్మాద ఘర్షణలు జరిగే అవకాశం ఉందన్నారు. అన్ని రంగాల్లో మతతత్వ దాడులు జరుగుతున్నాయన్నారు. అంతేగాకుండా విద్యారంగంలో తీవ్రమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, యూనివర్సిటీలను ఎలా కంట్రోల్ చేయాలి ? ఘర్షణలు ఎలా పెంచాలనే దానిపై ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. భారత్ మాతాకి జై అనే ఒక్క స్లోగన్ పెడుతున్నారని గుర్తు చేశారు. ఇది రెండో ముఖమన్నారు. రాష్ట్రాలపై పెత్తనం చెలాయించడం మూడో ముఖమన్నారు. అరుణాచల్, ఉత్తరాఖండ్ లో జరిగిన సంగతి తెలిసిందేనని గుర్తు చేశారు.

మతతత్వ దాడులు...
బిల్లులను రాజ్యసభలు ఆమోదించాల్సిన పరిస్థితి ఉండేదని కానీ ప్రస్తుతం ప్రతి బిల్లు మనీ బిల్లు కాదా ? అవునా ? అనేది లోక్ సభ స్పీకర్ నిర్ణయిస్తారని పేర్కొంటున్నారని తెలిపారు. నిరంకుశతత్వం పెరుగుతూ వస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యానికే పెద్ద ప్రమాదం హెచ్చరించారు. విదేశీ విధానాల్లో చాలా మార్పులు వస్తున్నాయని, ఇంకా వస్తాయని తెలిపారు. కాశ్మీర్ లో ఇంకా గొడవలు జరుగుతున్నాయని, ప్రస్తుతం 36వ రోజు కర్ఫ్యూ కొనసాగుతోందన్నారు. ఇక్కడ ఎంతో మంది మృతి చెందారని, ఎంతో మంది చూపు కొల్పోతున్నారని తెలిపారు. సమస్య పరిష్కరించాలని తాము మొదటి నుండి కోరడం జరుగుతోందన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తాను మొదట చెప్పడం జరిగిందని, పార్లమెంటరీ చివరి రోజున అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. పాక్ వల్లే ఇదంతా జరుగుతోందంటూ కాశ్మీర్ అంశం పక్కదారిపెట్టించే విధంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రెండు సంవత్సరాల్లో నాలుగు సార్లు అమెరికాకు వెళ్లడం జరిగిందని, 50 పేజీల అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిపారు. వాళ్లకు లొంగి ఒక జూనియర్ పార్ట్ నర్ గా ఉందని స్పష్టంగా కనబడుతోందన్నారు. అన్ని రంగాల్లో ఎఫ్ డీఐలకు అనుమతించడం జరిగిందని, గతంలో వ్యతిరేకించిన ఈ పార్టీయే ఇప్పుడు అనుమతినిస్తోందన్నారు. మొత్తం సామ్రాజ్యావాదానికి లొంగడం నాలుగో ముఖమని తెలిపారు.

మోడీ ప్రసంగంలో వాస్తవాలు ఏవీ ?
స్వతంత్రం రోజున ప్రధాన మంత్రి మోడీ చేసిన ప్రసంగంలో వాస్తవాలు ఎక్కడా అని ప్రశ్నించారు. 90 నిమిషాల పాటు మోడీ మాట్లాడారని, దేశంలో నెలకొన్న పరిస్థితులపై స్పష్టంగా ఏమి చెప్పలేదన్నారు. ప్రతిసారి ఏదో ఒక నినాదం ఇస్తున్నారని, ఈసారి కూడా నినాదం ఇచ్చారని తెలిపారు. రెండు సంవత్సరాల నుండి అదే విషయాలను చెబుతున్నారని తెలిపారు. దేశం అభివృద్ధి చెందుతోందని పేర్కొంటున్నారని, వాస్తవంగా జరుగుతున్నది ఏంటీ అని ప్రశ్నించారు. రూరల్ ఇన్ కమ్ గ్రోత్ రేట్ 2015 సంవత్సరంలో సున్నా శాతంగా ఉందని, 2015లో 60 శాతం ఎంప్లాయిమెంట్ గ్రోత్ తగ్గిందన్నారు. అంతేగాకుండా కరవులు పెరుగుతున్నాయని, ఈ విషయంలో ఆర్థికరంగంలోనే పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ హెచ్చరించడం జరిగిందన్నారు. వ్యవసాయ రంగంలో సంక్షోభం తీవ్రతమరమౌతోందని, రైతుల ఆత్మహత్యలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. రుణాల వల్ల వత్తిడి వల్ల ఆత్మహత్యలు జరగడం లేదని, దీనికి కారణాలు వేరే ఉన్నాయని కేంద్రం వాదిస్తోందని విమర్శించారు. ధరలు పెరుగుతున్నాయి..కానీ ఈ లాభాలు రైతులకు అందడం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతుల జీవన పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏ రంగంలో ఉద్యోగాలు దొరుకుతాయో..పెరుగుతాయో అలాంటి రంగమైన మ్యాన్యుఫ్యాక్ష రింగ్ రంగంలో 2015లో మైనస్ 0.07గా ఉందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఒలింపిక్స్ లో పాల్గొనాలని క్రీడాకారులు భావిస్తుంటారు. పతకం గెలవాలని ఆశిస్తుంటారు. ఇటీవలే ప్రారంభమైన రియో ఒలింపిక్స్ పోటీలు కొనసాగుతున్నాయి. కానీ ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఒలింపిక్ సాక్షిగా ఓ యువకుడు తన ప్రేమను వ్యక్తపరిచాడు. మొదట షాక్ తిన్న క్రీడాకారిణి ఆ తరువాత అంగీకరించడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. క్వీన్‌ కాయ్‌, యువతి హెజీ చైనాకు చెందిన వారు. వీరు డైవింగ్‌ పోటీల్లో పాల్గొన్నారు. మహిళల డైవింగ్‌ 3 మీ. స్ప్రింగ్‌ బోర్డు విభాగంలో హిజీ రజతం పతకం గెలిచింది. దానిని ఆమె తీసుకుంటున్న సమయంలో అక్కడికి క్వీన్‌ కాయ్‌ చేరుకున్నాడు. పతకం తీసుకొని పోడియం దిగగానే ఆమె వద్దకు వెళ్లి మోకాళ్ల పైన కుర్చొని బంగారు ఉంగరాన్ని చూపించి పెళ్లి చేసుకుందామా.. అని ప్రపోజ్‌ చేశాడు. దీంతో ఆశ్చర్యం, ఆనందానికి గురైన ఆమె ఆనందబాష్పాలతో ప్రియుడిని హత్తుకొని ఓకే అన్నది. త‌న ప్రేయ‌సి హీజీకి ఎర్ర గులాబిని కూడా కానుక‌గా ఇచ్చాడు.
ఆరేళ్లుగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒలింపిక్ వేదిక‌గా త‌న బాయ్‌ఫ్రెండ్ ల‌వ్‌ను ప్ర‌పోజ్ చేస్తాడ‌ను కోలేద‌ని హీజీ తెలిపింది. పురుషుల స్విమ్మింగ్ ఈవెంట్‌లోనూ క్విన్ మేటి డైవ‌రే. అత‌ను 3 మీట‌ర్ల స్ప్రింగ్‌ బోర్డ్ లో కాంస్య ప‌త‌కాన్ని గెలుచుకున్నాడు. స్విమ్మింగ్ పూల్ వేదిక‌గా ఒక్క‌టైన ఆ జంట స్టేడియంలోని ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. 

హైదరాబాద్ : మనిషి జీవిత కాలం ఎంత ? గరిష్టంగా వందేళ్లు.. ఇంకా అంటే మరో నాలుగేళ్లు అటు ఇటుగా ఉండొచ్చు. అదే తాబేలు అయితే రెండొందల ఏళ్ల వరకు బతుకుతుంది. ఇంతకంటే ఎక్కువ రోజులు బతికే జీవరాశి ఏదైనా ఉందా.? ఇటీవలే 400 ఏళ్లు బతికే జీవిని శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఆ జీవి ఏంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. గ్రీన్‌ల్యాండ్‌ షార్క్ ఆర్కిటిక్‌ మహాసముద్రంలోని అతి శీతల నీటిలో ఈ చేపలు జీవిస్తాయి. ప్రపంచంలో అత్యధిక వయసు ఈ చేపల సొంతం. దాదాపు 400 ఏళ్లుగా ఈ గ్రీన్‌ల్యాండ్‌ షార్క్‌ జీవిస్తోంది. గ్రీన్‌ల్యాండ్‌ షార్క్ లు రెండు అడుగుల నుంచి 16 అడుగుల వరకు పెరుగుతాయి. ఇవి అతి శీతల నీటిలో పెరగడం వల్ల వీటి జీవిత కాలం ఎక్కువగా ఉంటుంది. ఈ చేపలు ప్రత్యుత్పత్తి దశకు రావడానికే దాదాపు 150 ఏళ్లు పడుతుంది. గ్రీన్‌ల్యాండ్‌ షార్క్ లు 1500 సంవత్సరం నుంచి 1740 వరకు ఎక్కువగా పెరిగాయి. 1620 సంవత్సరం ఈ గ్రీన్‌ల్యాండ్‌ షార్క్ లకు స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఈ కాలంలో ఇవి అధికంగా పెరిగాయి. గ్రీన్‌ల్యాండ్‌ షార్క్ నాలుగు వందల ఏళ్లు బతికిందనే విషయాన్ని శాస్త్రజ్ఞులు నోవెల్‌ డేటింగ్‌ విధానాల ద్వారా గుర్తించారు. వీటి కంటి కణజాలాల ద్వారా వయసును నిర్దారించారు. భూమి పైన ఉండే జీవుల్లో తాబేళ్లు రెండొందల ఏళ్ల వరకు బతికితే.. ఈ షార్క్ చేపలు మాత్రం 400 ఏళ్ల వరకు జీవిస్తాయి. 400 ఏళ్ల అంటే.. అప్పటి వరకు వాటికి ఎలాంటి హాని జరగకుండా ఉండాలి. పెద్ద చేపల నుంచి తప్పించుకుంటూ ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటూ నిలబడాలి.

ఢిల్లీ : జమైకన్‌ బుల్లెట్‌ ఉసేన్‌ బోల్ట్ ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించాడు. రియోలో అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అదరగొట్టిన బోల్ట్ హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ తో రికార్డ్ ల మోత మోగించాడు. 100 మీటర్ల స్ప్రింట్‌లో వరుసగా మూడు ఒలింపిక్‌ గోల్డ్ మెడల్స్ నెగ్గిన తొలి అథ్లెట్‌గా బోల్ట్ హిస్టరీ క్రియేట్‌ చేశాడు. రియో ఒలింపిక్స్ లో జమైకన్‌ స్పీడ్‌ గన్‌ ఉసేన్‌ బోల్ట్ రికార్డ్ ల మోత మోగించాడు. హ్యాట్రిక్‌ గోల్డ్ మెడల్స్ తో చరిత్రను తిరగరాశాడు. 100 మీటర్ల స్ప్రింట్‌లో తన తర్వాతే ఎవరైనా అని బోల్ట్ మరోసారి నిరూపించాడు. ఒలింపిక్స్ లో మరే ఇతర అథ్లెట్‌కు సాధ్యం కాని ఘనతను బోల్ట్‌ సొంతం చేసుకున్నాడు.

బుల్లెట్ స్పీడ్...
మెన్స్‌ 100 మీటర్ల హీట్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్ రౌండ్‌కు క్వాలిఫై అయ్యాడు. క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లో 10.07 సెకన్లలో రేస్‌ ముగించిన బోల్ట్ ఫైనల్‌ రౌండ్‌లో మాత్రం అంచనాలకు మించి అదరగొట్టాడు. ఎప్పటిలానే రేస్‌ ఆరంభంలో స్లోగా స్టార్ట్ చేసిన బోల్ట్....30 మీటర్ల నుంచి జోరు పెంచాడు. రేస్‌ ట్రాక్‌లో బుల్లెట్‌ స్పీడ్‌లో దూసుకుపోయిన బోల్ట్.....ప్రత్యర్ధులందరి కంటే ముందుగా రేస్‌ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. కేవలం 9.81 సెకన్లలోనే రేస్‌ ముగించి స్వర్ణ పతకం సొంతంచేసుకున్నాడు. ఈ విజయంతో బోల్ట్ కొన్ని అరుదైన రికార్డ్ లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఒలింపిక్స్ లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ తో రికార్డ్ ల మోత మోగించాడు. 100 మీటర్ల స్ప్రింట్‌లో వరుసగా మూడు ఒలింపిక్‌ గోల్డ్ మెడల్స్ నెగ్గిన తొలి అథ్లెట్‌గా బోల్ట్ హిస్టరీ క్రియేట్‌ చేశాడు. బీజింగ్‌ ఒలింపిక్స్ లో 9.69 సెకన్లలో రేస్‌ పూర్తి చేసిన బోల్ట్ 2012 లండన్‌లో 9.63 సెకన్లతో ఒలింపిక్స్ లో రికార్డ్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్ లోనే కాదు...క్రీడా చరిత్రలోనే జమైకన్‌ బుల్లెట్‌ ఉసేన్‌ బోల్ట్ అత్యుత్తమ అథ్లెట్‌గా నిలిచిపోతాడనడంలో ఎటువంటి సందేహం లేదు. 

గుజరాత్ : ఉనాలో దళితులు గర్జించారు. గుజరాత్‌లో చనిపోయిన పశువుల తోలు తీయడం లాంటి పనులు చేయరాదని శపథం చేశారు. ప్రతి దళిత కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దళిత్-ముస్లిం భాయ్..భాయ్‌ అంటూ నినాదాలు చేశారు. గుజరాత్‌ ఉనాలోని హెచ్‌ డి షా స్కూల్‌ దళితుల ఐక్యతకు వేదికైంది. హెచ్‌సియులో ఆత్మహత్యకు పాల్పడ్డ పిహెచ్‌డి విద్యార్థి రోహిత్‌ వేముల తల్లి రాధికకు అరుదైన గౌరవం దక్కింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌తో పాటు వేలాదిగా దళితులు, మైనరీటీలు హాజరయ్యారు. ప్రధాని మోది చెప్పిన గుజరాత్‌ అభివృద్ధి అంతా బూటకమని తేలిపోయిందని కన్హయ్య అన్నారు.

పలు డిమాండ్స్..
దళితులు ఇకపై పశువుల కళేబరాలు తొలగించడం, మృతి చెందిన పశువుల తోలు తీయడం లాంటి పనులు చేయరాదని సభ శపథం చేసింది. ప్రతి దళిత కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. నెలరోజుల్లోగా తమ డిమాండ్‌ నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా రైలు రోకో ఆందోళనకు దిగుతామని ఉనా సభ హెచ్చరించింది. దళితులపై దాడులు చేయొద్దు...తనని చంపండంటూ ఇటీవల మోది చేసిన ప్రకటన ఓ నాటకమని దళిత నేత జిగ్నేశ్‌ మేవాని అభిప్రాయపడ్డారు.

గుజరాత్ లో 8 శాతం దళితులు...
10 వేల మంది ఈ సభలో అత్యాచారాలను సహించేది లేదని దళిత్-ముస్లిం భాయ్..భాయ్‌ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్‌, బిజెపిలకు వ్యతిరేకంగా తృతీయ పక్షాన్ని ఏర్పాటు చేసే సమయం ఆసన్నమైందని సభకు వచ్చిన దళిత ముస్లిం యువకులు అభిప్రాయ పడ్డారు. గోసంరక్షణ పేరిట గుజరాత్‌తో పాటు దేశవ్యాప్తంగా దళితులుపై మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దాద్రీలో అఖ్లాక్‌ హత్య, గత నెల ఉనాలో నలుగురు దళిత యువకులను కట్టేసి కొట్టిన ఘటనలు ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. గుజరాత్‌లో దళితులు, ముస్లింలపై దాడులు జరగడం వల్లే వారంతా ఏకమైనట్లు డాక్యుమెంటరీ సినిమా దర్శకుడు ఆనంద్‌ పట్‌వర్ధన్‌ అభిప్రాయపడ్డారు. ఉనాలో దళితులపై అత్యాచారం తర్వాత గుజరాత్‌లో ఆందోళనలు ఉధృతమయ్యాయి. వచ్చే ఏడాది గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి సిఎం పదవి నుంచి ఆనందిబెన్‌ పటేల్‌ను తప్పించింది. గుజరాత్‌లో 8 శాతం దళితులున్నారు.

ఢిల్లీ : సీమాంతర ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట నుంచి హెచ్చరించారు. ఉగ్రవాదులను భారత్‌పైకి ఉసిగొల్పుతున్న పాకిస్థాన్‌ నైజాన్ని అంతర్జాతీయ సమాజం ముందు ఎండగడతామని అన్నారు. ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన భారత 70వ స్వాతంత్ర్య వేడుకల్లో జాతీయ పతాకావిష్కరణ చేసిన ప్రధాని మోదీ.. తమ ప్రభుత్వం సాధించిన విజయాలు.. గత ప్రభుత్వాలకు, తమ ప్రభుత్వానికీ తేడాలను వివరిస్తూ ప్రసంగించారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలనూ ఆయనీ సందర్భంగా ప్రస్తావించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ దంపతులతోపాటు, త్రివిధ దళాధిపతులు, పలువురు కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా దంపతులు, పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, పలువురు కేంద్ర మంత్రులు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దంపతులతోపాటు పలువురు అధికారులు, అనధికారులు స్వాతంత్ర్య దిన వేడుకలకు హాజరయ్యారు.

పాక్ ప్రశంసలను తప్పుబట్టిన మోదీ..
చారిత్రక ఎర్రకోట బురుజు నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదంతో దేశానికి ఎదురవుతున్న సవాళ్లు, జరుగుతున్న నష్టాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. జాతీయ, అంతర్జాతీయంగా జరిగిన పలు ఉగ్రవాద ఘటనలను ప్రధాని ప్రస్తావించారు. గతనెల 8న ఉగ్రవాది బర్హాన్‌ వని ఎన్‌కౌంటర్‌ తర్వాత జమ్ము-కశ్మీర్‌లో చోటుచేకున్న అశాంతినీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. భారత్‌లో దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులను హీరోలుగా పాకిస్థాన్‌ ప్రశంసించడాన్ని మోదీ తప్పుపట్టారు.

77 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు..
దేశవ్యాప్తంగా ఒకే విద్యుత్‌ గ్రిడ్‌ వ్యవస్థ.. వన్‌ నేషన్‌-వన్‌ గ్రిడ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు మోదీ తెలిపారు. విద్యుత్‌ ఆదా చేసేందుకు 77 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను తక్కువ ధరకే అందజేసే విధానాన్ని పస్తావించారు. ఆధార్‌ అనుసంధానాన్ని మరింత విస్తృతం చేస్తామని చెప్పారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తామన్న మోదీ.. ప్రసూతి సెలవుల పెంపు అంశాన్ని ప్రస్తావించారు. వస్తు, సేవల పన్ను బిల్లుతో దేశాభివృద్ధి వేగం పుంజుకుంటుందని ప్రధాని చెబుతున్నారు. రక్షణ వలయాన్ని పక్కన పెట్టిన మోదీ.. కార్య్రమానికి హాజరైన ప్రముఖులతోపాటు, పాఠశాల బాలబాలికలు, విద్యార్థులతో కలిసిపోయారు. వారందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

ఢిల్లీ : రాజ్యసభ సభ్యత్వంతోపాటు బీజేపీకి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు ఆప్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈవారంలోనే సిద్ధు అధికారికంగా ఆప్‌లో చేరే అవకాశం ఉందని ఆయన సతీమణి నవజ్యోత్‌ కౌర్‌ వెల్లడించారు. సిద్ధు బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్‌ తమను సంప్రదించిందని, అయితే ఆ పార్టీలో చేరే విషయాన్ని తిరస్కరించనట్టు చెప్పారు. ప్రస్తుతం పంజాబ్‌లో అధికారంలో ఉన్న శిరోమణి అకాలీదళ్‌కూ, కాంగ్రెస్ పార్టీకి పెద్ద వ్యత్యాసంలేదని నవజ్యోత్‌ కౌర్‌ వ్యాఖ్యానించారు.ఈ రెండు పార్టీలు అవినీతి ఊబిలో కూరుకుపోయాయని ఆరోపించారు. అందువల్ల ఎటువంటి మచ్చలేని ఆమ్‌ఆద్మీ పార్టీలో చేరేందుకు సిద్ధు సుముఖంగా ఉన్నట్టు నవజ్యోత్‌ కౌర్‌ వెల్లడించారు. 

కేరళ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అనంత పద్మనాభస్వామి ఆలయానికి చెందిన నిధులు మాయమయ్యాయి.186 కోట్ల విలువ చేసే 769 బంగారు కుండల ఆచూకీ తెలియడం లేదని మాజీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ వినోద్‌రాయ్‌ సుప్రీంకోర్టులో ఓ నివేదిక ద్వారా వెల్లడించారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీ.ఎస్‌.ఠాకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఆలయ నిధుల్లో ఉన్న బంగారు కుండలన్నింటికీ వరుస సంఖ్యలున్నాయి. జులై 2002 వరకు 1 నుంచి వెయ్యి సంఖ్యలు గల కుండలు ఉపయోగంలో ఉన్నాయి. అయితే 2011 ఏప్రిల్‌ 1న 1988వ సంఖ్య కలిగిన కుండ బయటపడింది. దీంతో బంగారుకుండల సంఖ్య కనీసం 1988 ఉండాలని వినోద్‌రాయ్‌ చెబుతున్నారు. వీటిలో 822 కుండలను ఆలయ అలంకరణకు వినియోగించగా.. ఇంకా 1,166 బంగారు కుండలు ఉండాలి. కానీ 397 వరకు సంఖ్యలు గల కుండలు మాత్రమే దొరికాయని నివేదికలో పేర్కొన్నారు.

ఢిల్లీ : 70వ స్వాతంత్ర్య దినోత్సవం..ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాక ఆవిష్కరణ..అనంతరం ప్రసంగం..కానీ ప్రధాని చేసిన ప్రసంగం బోర్ కొట్టిందా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకో తెలుసుకోవాలంటే చదవండి..
70వ స్వతంత్ర దినోత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై జరిగిన కార్యక్రమానికి వివిధ ప్రముఖులు హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని సుదీర్ఘ ప్రసంగం చేశారు. కానీ ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖుల్లో కొందరు గుర్రు కొట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. వీఐపీ గ్యాలరీలో కూర్చొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాంగ్రెస్ నేతల గులాం నబీ ఆజాద్ లు కునుకు తీస్తున్న ఫొటో బయటకు వచ్చింది. వీరే గాకుండా కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, మనోహర్ పారికర్ లు కూడా కునుకు తీస్తున్న ఫొటోలు దర్శనమిస్తున్నాయి. కేజ్రీవాల్ ఫొటోలపై డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్పందించారు. మోడీ ప్రసంగం బోర్ కొట్టిందంటూ ట్వీట్ చేశారు. 

ఢిల్లీ : 70వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ప్రధాని చేసిన ప్రసంగంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జడ్జీల నియామకంపై ప్రసంగంలో ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. గంటన్నర సేపు ప్రధాని ప్రసంగాన్ని వినడం జరిగిందని, ఎక్కడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదని తెలిపారు. తన కెరీర్ లో అత్యున్నతస్థాయి పదవి పొందానని, తన మనోభావాలను వ్యక్తపరిచడానికి సందేహించనని తెలిపారు. జడ్జిల నియామకంలో తాను పలుమార్లు ప్రస్తావించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

గుజరాత్ : హెచ్ సీయూ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ వేముల తల్లి రాధిక ఉనాను సందర్శించారు. అక్కడ ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఢిల్లీ జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి కన్నయ్య కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది దళితులు, మైనార్టీలు హాజరయ్యారు. గో సంరక్షణ పేరిట ఇటీవలే ఉనాలో నలుగురు యువ దళితులను కట్టేసి దారుణంగా కొట్టిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. గత నెలలో జరిగిన ఘటనతో అట్టుడికింది. 

ఢిల్లీ : భారతదేశ 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురష్కరించుకుని గూగుల్‌ డూడుల్‌లో సరికొత్త ఫొటోను పెట్టారు. పార్లమెంట్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రసంగిస్తున్న ఫొటోను గూగుల్‌ డూడుల్‌లో పెట్టారు. గత స్వాతంత్ర్య దినోత్సవాలకు ఎర్రకోట, మూడు రంగుల జాతీయ జెండా, జాతీయ స్టాంపులు, జాతీయ పక్షి నెమలితో కూడుకున్న ఇమేజ్‌లను ఉంచిన గూగుల్‌ ఈసారి.. స్వాతంత్ర్యం వచ్చిన రోజు నె‌హ్రూ ప్రసంగిస్తున్న చిత్రాన్ని ఉంచారు. ఇది నెటిజన్‌లను విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఢిల్లీ : భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్‌కు షాక్‌.. గ్రూప్‌-జిలో భాగంగా రెండో ప్రిలిమినరీ మ్యాచ్‌లో ఉక్రెయిన్‌కు చెందిన ప్రపంచ 61వ ర్యాంక్‌ మరియా ఉలిటిన చేతిలో సైనా 18-21, 19-21తో వరుస గేముల్లో అనూహ్య ఓటమి చవిచూసి భారత పతక ఆశలను ఆవిరి చేసింది. హోరా హోరీగా జరిగిన పోరులో సైనా కోర్టులో మునుపటిలా చురుగ్గా కదలలేకపోయింది. ప్రత్యర్థి స్మాష్‌లతో దూకుడు ప్రదర్శిస్తుంటే సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. 18-21తో తొలి సెట్‌ కోల్పోయిన సైనా.. రెండో సెట్లో కాస్త పుంజుకొన్నా నిలకడగా పాయింట్లు రాబట్టలేకపోయింది. 16-17తో ముందంజలో ఉన్నా ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఉలిటినా వెంటనే 17-17తో స్కోర్‌ సమం చేసింది. 20-19తో గేమ్‌పాయింట్‌ సాధించింది. మరో పాయింట్‌ సాధించి సైనాను ఓడించింది.

 

ఢిల్లీ : జిమ్నాస్టిక్స్‌ మహిళల వాల్ట్‌ ఫైనల్స్‌లో భారత స్టార్‌ జిమ్నాస్ట్‌ దీప కర్మాకర్‌ నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకాన్ని కోల్పోయింది. మొదటి ప్రయత్నంలో 14 పాయింట్‌ 866 పాయింట్లు సాధించిన దీప.. రెండో ప్రయత్నంలో మరింత మెరుగైన ప్రదర్శన చేసి 15 పాయింట్‌ 266 పాయింట్లు స్కోర్‌ చేసింది. సరాసరి 15 పాయింట్‌ 066 స్కోర్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ఈవెంట్‌లో అమెరికాకు చెందిన సిమోన్‌ బైల్స్‌ 15 పాయింట్‌ 966 స్కోర్‌తో స్వర్ణం సాధించగా, రష్యాకు చెందిన మారియా పాసెకా 15 పాయింట్‌ 253తో రజతం, స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన స్టెయిన్‌గ్రుబెర్‌ 15 పాయింట్‌ 216తో కాంస్యం సొంతం చేసుకుంది. అయితే కాంస్యం గెలిచిన జమ్నాస్ట్‌ సాధించిన పాయింట్లు, దీప సాధించిన పాయింట్లకు మధ్య తేడా కేవలం 0 పాయింట్‌15 మాత్రమే.
తలెత్తుకుని సగర్వంగా నిలిచే ప్రదర్శన ఆమెది 
దీపా కర్మాకర్‌ రియో ఒలింపిక్స్‌ నుంచి పతకం లేకుండానే నిష్క్రమించింది. కానీ తలెత్తుకుని సగర్వంగా నిలిచే ప్రదర్శన ఆమెది. కొన్ని నెలల కిందట ఓ భారత జిమ్నాస్ట్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిందంటే.. ఏదో నామమాత్రంగా వెళ్లడం, రావడమే అనుకున్నారు చాలామంది! కానీ తనను తక్కువగా అంచనా వేసిన వాళ్లందరినీ విస్మయానికి గురి చేస్తూ నాలుగు రోజుల కిందట వాల్ట్‌ విభాగంలో ఏకంగా ఫైనల్‌ చేరి ఆశ్చర్యపరిచిన దీప.. తుది పోరులోనూ అంచనాల్ని మించి అద్భుత ప్రదర్శనే చేసింది. ప్రపంచ స్థాయి జిమ్నాస్ట్‌లతో పోటీ పడి నాలుగో స్థానంలో నిలిచిన దీప.. త్రుటిలో పతకం చేజార్చుకుంది. జిమ్నాస్టిక్స్‌ చరిత్రలోనే అత్యుత్తమ క్రీడాకారిణి అనదగ్గ సిమోన్‌ బైల్స్‌ సహా చాలామంది సాహసించని అత్యంత ప్రమాదకర విన్యాసమైన ప్రొడునోవాను ఫైనల్లో అలవోకగా చేసిన దీప.. 15 పాయింట్‌ 066 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. జిమ్నాస్టిక్స్‌లో చైనా ఆధిపత్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ దేశానికి చెందిన యాన్‌ వాంగ్‌.. దీప తర్వాతి స్థానంలోనే నిలిచింది. ఒలింపిక్స్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణాలు సాధించిన ఉజ్బెకిస్థాన్‌ దిగ్గజ జిమ్నాస్ట్‌ చుసోవితినా సైతం దీప కంటే కింద ఏడో స్థానంలో నిలిచింది. 
ఆమె  సాహసం చరిత్రలో నిలిచిపోతుంది
రియో ఒలింపిక్స్‌లో దీపా కర్మాకర్‌ పతకం గెలవలేదు.. కానీ ఆమె విన్యాసాల్ని ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆమె చేసిన సాహసం చరిత్రలో నిలిచిపోతుంది. ఆమె ప్రదర్శన ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది! దీపా కర్మాకర్‌.. భారత క్రీడా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే పేరిది! ఓ భారత జిమ్నాస్ట్‌ ఒలింపిక్స్‌లో పోటీ పడటమే గొప్ప అనుకుంటే.. దీప తన అద్భుత విన్యాసాలతో ఏకంగా ఫైనల్‌ చేరింది. అక్కడా అంచనాల్ని మించి ఆకట్టుకుంది. పతకానికి గట్టి పోటీదారుగా నిలిచింది. చివరికి త్రుటిలో ఆమెకు పతకం చేజారింది. 

 

కరీంనగర్ : గాంధీజీ కలలకు ప్రతిరూపం ఆ గ్రామం... ఖాదీ వస్త్రాల తయారీలో ప్రత్యేకత అక్కడ సొంతం.  అక్కడ తయారయ్యే నూలు వస్త్రాన్ని జాతీయ జెండాల తయారీలో ఉపయోగించటం ఆ గ్రామానికి దక్కిన గౌరవం. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఢిల్లీలోని ఎర్రకోటపైన ఎగిరిన తొలి జాతీయ జెండాను అందించిన వావిలాల గ్రామంపై 10 టీవీ ప్రత్యేక కథనం..!
వావిలాల జాతీయ జెండాలకు ప్రత్యేక గుర్తింపు 
ఈ గ్రామం పేరు వావిలాల...ఇదీ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని ఓ కుగ్రామం. ఈ గ్రామానికి  దేశ స్వాతంత్ర్య సమరంతోనూ, స్వాతంత్ర్య దినోత్సవంతోనూ అవినాభావ సంబంధం ఉంది. 1929లో మహాత్మాగాంధీ ఆదేశాల మేరకు ఆయన అనుచరులు గ్రామీణ ప్రాంతాల్లో చరఖాతో నూలు దారంతో ఖద్దర్ వస్త్రాలను తయారు చేసేవారు. వావిలాల గ్రామం కూడా వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ ద్వారా ఖాదీ వస్త్రాలను తయారు చేస్తూ వాటిని దేశవ్యాప్తంగా సరఫరా చేసింది. దీంతో ఈ గ్రామం దేశవ్యాప్తంగా పేరుగాంచింది. ఈ సంస్ధలో తయారయ్యే నూలును జాతీయ జెండాల తయారీలో ఉపయోగించడం ఇక్కడి ప్రత్యేకత. ఈ జాతీయ జెండాలు దేశవ్యాప్తంగా సరఫరా అవుతుంటాయి. 
వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ సంస్థదే
బ్రిటిషు పాలకుల నుంచి మన దేశం స్వాతంత్ర్యం సాధించిన తర్వాత ఢిల్లీలోని ఎర్రకోట పైన ఎగరేసిన తొలి జాతీయజెండా వావిలాల గ్రామంలోని ఖాదీ ప్రతిష్టాన్ సంస్ధ తయారు చేసిందే. మహాత్మాగాంధీ స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా విదేశీ వస్తాలను బహిష్కరించి, స్వదేశీ వస్త్రాలను ధరించాలని పిలుపునిచ్చారు. ఈ
సమయంలో ఆ పిలుపునందుకున్న వావివాల ఖాదీ ప్రతిష్టాన్ స్వదేశీ వస్తాలను తయారుచేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. 
వావిలాల ఖాదీ ప్రతిష్టాన్‌కు రాష్ట్రపతి అవార్డు 
జాతీయ జెండాలకు తుదిరూపమిచ్చిన వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ కు 2005-2009 సంవత్సరంలో రాష్ట్రపతి అవార్డు వరించింది. 2010లో ISO 9001 సంస్ధ నాణ్యత గల వస్త్రాలు తయారు చేస్తున్నారని సర్టిఫై చేస్తూ అవార్డును అందించింది. వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ లో నూలుతో తయారయ్యే చొక్కాలు, ప్యాంట్లు, జరీ దొవతులు, చీరలు, టవల్స్, టస్పర్ లు తదితర దుస్తులు ఎంతో పాచుర్యం పొందాయి. 1983లో వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ స్వతంత్ర ప్రతిపత్తి సంతరించుకొని 20 లక్షల టర్నోవర్ సాధించింది. ప్రస్తుతం రెండు కోట్ల టర్నోవర్ తో కొనసాగటం విశేషం.

 

ఢిల్లీ : 'మనం జరుపుకుంటున్న స్వాతంత్య్రదినోత్సవ వేడుకల వెనుక ఎందరో అమరవీరుల త్యాగం ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. దేశవ్యాప్తంగా 70 వ స్వాతంత్ర్య దినోత్సవేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయపతాకాన్ని మోడీ ఆవిష్కరించారు. త్రివిద దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. భారతదేశం.. సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు అని తెలిపారు. 'దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని మనందరం సంకల్పిద్దామని' పేర్కొన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వేడుకలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవేడుకలను విదేశీ ప్రముఖులు తిలకిస్తున్నారు. 

 

ఢిల్లీ : దేశ సంస్కృతి సంప్రదాయాలన్నీ ఒకే చోట ప్రతిబింబించేలా రాజ్‌పథ్‌లో ప్రారంభమైన భారత్‌పర్వ్‌ ప్రదర్శన వీక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలో వారం రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమంలో... తెలంగాణ నుంచి కూచిపూడి ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల సంస్కృతిని తెలపడంతోపాటు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటడం ఈ వేడుక ప్రత్యేకత..!
దేశసంస్కృతిని చాటేలా భారత్‌పర్వ్ కార్యక్రమం
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారతదేశం... దేశంలోని వివిధ రాష్ట్రాల సంప్రదాయాలను చాటిచెప్పడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న భారత్‌ పర్వ్‌ ప్రదర్శన సందర్శకులతో కిటకిటలాడుతోంది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హస్తకళలు, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ఒక్క ప్రదర్శనతో దేశం మొత్తాన్ని ఒక్క చోటికి తీసుకొచ్చినట్టుందని సందర్శకులు చెప్పడం విశేషం.
భారత్‌పర్వ్‌లో కూచిపూడి ప్రదర్శన
భారత్‌పర్వ్‌ ప్రదర్శనలో తెలుగురాష్ట్రాలు సైతం స్టాళ్లను ఏర్పాటు చేశాయి. తెలుగు వంటకాలను ఇష్టపడే ఉత్తరాది భోజన ప్రియులకు హైదరాబాద్ బిర్యానీ సైతం అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు ప్రముఖ నాట్యకారిణి యామినీ రెడ్డి బృంద ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంటోంది. తమ బృందప్రదర్శనపై యామినీ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈనెల 18 వరకూ కొనసాగే భారత్‌పర్వ్‌లో వివిధ రాష్ట్రాల హస్తకళలు, ఆయా ప్రాంతాల వంటకాలకు సంబంధించి మొత్తం 50 స్టాళ్లను ఏర్పాటు చేశారు. 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆజాదీ సత్తర్‌సాల్-యాద్‌కరో కుర్బానీ పేరిట ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఢిల్లీ : 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ఢిల్లీ సర్వం సిద్ధమైంది. ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో ఎర్రకోట పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా చర్యలలో భాగంగా దేశ రాజధానిలోకి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే ప్రవేశానికి అనుమతి నిస్తున్నారు. ఎర్రకోట మొత్తం భద్రతా దళాల అధీనంలో ఉంది. ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో భద్రతను సైతం గతంలో కంటే భారీగా పెంచారు. పదివేల మందికి పైగా బలగాలు ఢిల్లీ పోలీసులు సహా కేంద్ర భద్రతా దళాలు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, సీఐఎస్ఎఫ్, బీఎస్ ఎఫ్ దళాలు ఎర్రకోట చుట్టూ పహారా కాస్తున్నాయి.

హై రిజల్యూషన్‌ కెమెరాల వినియోగం..
ఎర్రకోటలోని చిన్న గదులు, కిటికీల వంటివి దాదాపు 18వందల ప్రదేశాలను భద్రతా దళాలు ముసేశాయి. మొత్తం 600 సిసి కెమెరాల ద్వారా నిఘాను పర్యవేక్షించగా ఎర్రకోట పరిసర ప్రాంతాల్లోనే 115 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని స్పష్టంగా చూపించగలిగే రెండు కోట్ల విలువైన హై రిజల్యూషన్ కెమెరాలను ఈసారి వినియోగిస్తున్నారు.  ప్రధాని ఎర్రకోటకు వచ్చే మార్గంలో 50 ఆర్మీ వాహనాలు గస్తీ కాస్తున్నాయి. స్క్వాడ్ బృందాలు ప్రతి అంగుళాన్నితనిఖీ చేస్తున్నాయి. సందర్శకుల కోసం ఎల్ ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. అందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే ఎర్రకోటలోకి అనుమతించేందుకు బాంబ్ స్క్వాడ్స్ తనిఖీ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం ఏడుగంటలకు ఎర్రకోటపై ప్రధాని ప్రధమంగా త్రివర్ణపతకాన్ని ఆవిష్కరించి జాతి నుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సారి గార్డ్ ఆఫ్ హానర్ కమాండెంట్ గా భారత వైమానిక అధికారి కె.శ్రీనివాసన్ వ్యవహరిస్తారు. దేశ రాజధానిలోని ప్రభుత్వ పాఠశాలలనుంచి ఐదు వందల మంది విద్యార్థినులు జాతీయగీతాన్ని ఆలపించనున్నారు.

ఢిల్లీ : బలహీన వర్గాలపై దాడులు దేశ సంస్కృతికి వ్యతిరేకమని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ప్రణబ్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు. మన ప్రజాస్వామ్యానికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వమే పునాదులని పేర్కొన్నారు. దేశ ప్రజలకు 70వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య దేశంగా భారత్ పరిఢవిల్లుతుందని ఎవరూ నమ్మలేదని పేర్కొన్నారు. ఎన్నో కష్టాలకు ఓర్చి స్వాతంత్య్రం తీసుకువచ్చిన వీరులను ఎప్పుడూ గౌరవించాలని తెలిపారు. మనల్ని మనం ప్రశ్నించుకుంటూ శాస్త్రీయ దృక్కోణం పెంచుకోవాలని సూచించారు.

భద్రత విషయంలో..
దేశ భద్రత విషయంలో అందరూ కలిసి సమగ్రంగా చర్చ జరిపి పోరాడాలన్నారు. దేశ అభివృద్ధికి అందరూ కృషి చేయాలన్నారు. మహిళలకు, పిల్లలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బలహీన వర్గాలపై దాడులు దేశ సంస్కృతికి వ్యతిరేకమన్నారు. అలా చేయడం సరికాదన్నారు. దేశ ప్రజలంతా ఐక్యమత్యంతో ఉండాలని పిలుపునిచ్చారు. జీఎస్టీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడం శుభసూచకమని ప్రణబ్‌ అన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలను తిప్పికొట్టాలని ప్రణబ్ పేర్కొన్నారు. మన ప్రజాస్వామ్యానికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వమే పునాదులని రాష్ట్రపతి స్పష్టం చేశారు. 

పంజాబ్ : ది గ్రేట్ ఖలీ...తెలియని వారుండరు...ఎందుకంటే ఆయన ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్.. 7.1 అడుగులు..మాంఛి బలిష్టంగా ఉండే శరీరం..రెజ్లింగ్ ఆటలో ప్రపంచస్థాయి ఆటగాడిగా గుర్తింపు పొందాడు..పంజాబ్ రాష్ట్ర పోలీసు ఆఫీసర్ అయిన ఖలీ..2007లో హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ ను పొందాడు. ప్రస్తుతం ఇతను రింగ్ వదిలి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయనకు సంబంధించిన ఓ చిత్రం హల్ చల్ చేస్తోంది. ఆయన 'ఆమ్ ఆద్మీ పార్టీ' తీర్థం పుచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 
పంజాబ్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. దీనితో ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా పలువురు ప్రముఖులు..ఇతరులపై నజర్ పెట్టింది. పార్టీలో చేర్పించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవలే ప్రముఖ క్రికెటర్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన త్వరలో ఆప్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా దిలీప్ సింగ్ రాణా ఆధ్వర్యంలో ఖలీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఆయనకు ఖలీ మద్దతు తెలియచేసినట్లు తెలుస్తోంది. మరి ఖలీ రాజకీయాలో ఎంట్రీ ఇచ్చాడా ? లేదా ? అనేది చూడాలి. 

ఢిల్లీ : స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఆవిష్కరణ చేయనున్న నేపథ్యంలో భద్రతా బలగాలు ఎర్రకోట పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఎన్‌ఎస్‌జీ కమాండోలతో పాటు పారామిలటరీ, బీఎస్‌ఎఫ్‌ దళాలు ఎర్రకోటను పహారా కాస్తున్నాయి. సీసీకెమెరాలతో గట్టి నిఘా ఏర్పాట్లు చేశారు. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో 9వేల మంది పోలీసులు మోహరించారు. అంతేగాకుండా 3వేల మంది కీలక ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 30 మంది కూడిన బృందం సీసీ టివి ఫుటేజ్ లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనుంది. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఉన్న దుకాణాలను మూసివేయించారు. ఎర్రకోట సమీపంలో ఉన్న నివాస స్థలాలపై పోలీసులు నిఘా పెట్టారు. గత కొద్ది రోజులుగా వర్షాలుగా కురుస్తున్నాయి. రేపు కూడా వర్షం కురుస్తుందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రేపు ప్రధాని స్పీచ్ ఎలా ఉంటుందోనని ప్రజలు వేచి చూస్తున్నారు. 

Pages

Don't Miss