National News

నేర్చుకోవాలన్న తపన ఉండాలే కానీ వయసు అడ్డు కాదు. రాణించాలన్న ఆశ ఉండాలేకానీ పెళ్లి ఆటంకం కాదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ వీణు పాలివాల్‌.. దేశంలోని అతికొద్దిమంది మహిళా బైక్‌రైడర్స్‌లో ఒకరు. ప్రమాదవశాత్తు సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. స్ఫూర్తినందించే ఓ బైక్‌రైడర్‌ పరిచయం..
జైపూర్‌కు చెందిన 44 ఏళ్ల వీణు పాలివాల్‌.. లేడీ ఆఫ్‌ హ్యార్లీగా పేరు తెచ్చుకున్నారు. వీణు తండ్రికి కూడా బైక్‌ రైడింగ్‌ అంటే పిచ్చి. అలా చిన్నతనంలోనే తండ్రిని చూసి స్ఫూర్తి పొందిన వీణు.. కాలేజ్‌ ఫ్రెండ్స్‌ దగ్గర బైక్‌ రైడింగ్‌ నేర్చుకుంది. అయితే సొంత బైక్‌ లేకపోవడంతో తన ప్యాషన్‌ను కొనసాగించలేకపోయింది. తరువాత పెళ్లి కావడంతో బైక్‌ రైడింగ్‌ అన్నమాటే పక్కకు పోయింది. ఒక బాబు, పాప కూడా పుట్టారు. కానీ బైక్‌రైడింగ్‌ మీద ఉన్న ప్యాషన్‌ మాత్రం ఆమె మనసులో అలాగే ఉండిపోయింది. తన ఆసక్తిని, మనసులో మాటను భర్త ముందు ఈ వయసులో ఆ బైక్‌ రైడింగ్‌లేంటి? వద్దన్నాడు. తరువాత ఇద్దరి మధ్య వచ్చిన విభేదాలు విడాకులు తీసుకునేదాక వచ్చాయి. భర్తతో విడిపోయిన తరువాత పిల్లల పెంపకంలో బిజీ అయిపోయింది. జైపూర్‌లోనే 'విక్టోరియన్‌ టీ రూమ్‌' చారు బార్‌ను కూడా నిర్వహిస్తుండేది. అయితే పిల్లలు చదువులకోసం వెళ్లిపోవడంతో తన బైక్‌రైడింగ్‌ను కొనసాగించాలనుకుంది వీణు. వెంటనే హ్యార్లీడేవిడ్‌సన్‌ను కొనుగోలు చేసింది. పిల్లలను చదివిస్తూనే తన ఆసక్తిని కొనసాగించింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో హ్యార్లీని నడపడంలో వీణు దిట్ట. అందుకే ఆమెను డేర్‌ డెవిల్‌ అనేవారు తోటి బైకర్స్‌. ఫెలో డ్రైవర్‌ దీపేష్‌ తన్వర్‌తో కలిసి నేషన్‌వైడ్‌ ట్రిప్‌లో ఉండగా... సోమవారం భోపాల్‌వైపు వస్తుండగా బైక్‌ స్కిడ్‌ అవ్వడంతో ఈ ఘటన జరిగింది. దేశవ్యాప్తంగా తన మోటార్‌ బైక్‌ జర్నీకి సంబంధించిన అనుభవాలతో డాక్యుమెంటరీ కూడా తీయాలనుకున్నారు వీణు. ఆలోపే ఈ హఠాన్మరణం సంభవించింది. 

హైదరాబాద్ : మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 45 పరుగుల తేడాతో  హైదరాబాద్ పై ఘన విజయం సాధించింది. ఏబీ డివిలియర్స్,విరాట్ కోహ్లి  మెరుపులకు తోడు కుర్రాడు సర్ఫారాజ్ ఖాన్ ఆఖర్లో విజృంభించడంతో బెంగుళూరు 227 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ ఓవర్లన్నీ ఆడి 182 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ వార్నర్ అత్యధికంగా 58 పరుగులు చేశాడు. ఏబీ డివిలియర్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.

 

ఢిల్లీ : భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. గత రెండేళ్ల కంటే ఈసారి ఎక్కువ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 
వాతావరణ శాఖ నుంచి చల్లని కబురు
ఈసారి రుతు పవనాలు ఆశాజనకంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది.. గత రెండేళ్లుగా తక్కువ వర్షపాతంతో ఇబ్బందిపడ్డ వ్యవసాయ రంగానికి ఈసారి ఆశాజనకంగా ఉంటుందని తెలిపింది. 
104 నుంచి 110 శాతం వరకు వర్షపాతం
ఈసారి 104 నుంచి 110 శాతం వరకు వర్షపాతం నమోదు కానుంది. కరువుతో అల్లాడిపోతున్న మరాఠ్వాడా, విదర్భ, బుందేల్‌ ఖండ్‌ తదితర ప్రాంతాలలో కూడా వర్షపాతం ఆశాజనకంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఎల్‌నీనో ప్రభావం తగ్గుముఖం పడుతోందని, దీనివల్ల రుతుపవనాల్లో మార్పు రానుందని తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఇక ఆగ్నేయ, ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ అధికారులు వెల్లడించారు.  
రెండేళ్లుగా దేశంలో కరువు
గత ఏడాది తక్కువ వర్షపాతం కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. గత రెండేళ్లుగా దేశంలో కరువు తాండవిస్తోంది. గతేడాది వర్షాలు లేకపోవడంతో ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఐతే ఉష్ణోగ్రతలు ఎక్కువుగా నమోదు కావడం వల్ల వర్షాలు కూడా అధికంగా పడే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి వాతావరణ శాఖ ముందస్తు సమాచారం కరువుతో అల్లాడుతున్న 10 రాష్ట్రాలకు ఊరటనిచ్చేలా ఉంది.

 

హైదరాబాద్ : కోట్లు బకాయిలు పడ్డ వాళ్లని వదిలేసి.. తేలికపాటి రుణాలు తీసుకున్న రైతుల్ని వేధిస్తారా..? మీరు ఆస్తులు జప్తు చేయడం వల్ల.. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు..! అంటూ సర్వోన్నత న్యాయస్థానం.. బ్యాంకర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వేల కోట్లు బకాయిలు పడి.. వ్యాపార సామ్రాజ్యాలు నడుపుతున్న బడాబాబులు, కార్పొరేట్లను బ్యాంకులు ఏం చేయలేక పోతున్నాయని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఐదు వందల కోట్లు పైబడి బకాయిపడ్డ వారి వివరాలను అందించాలని ఆదేశించింది.

రుణ ఎగవేత దారుల విషయంలో....

రుణ ఎగవేత దారుల విషయంలో ఆర్‌బీఐ చర్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐదు వందల కోట్లకు పైగా బకాయిలున్న వారి పేర్లు వెల్లడించాలంటూ ప్రశాంత్‌ భూషణ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రుణ ఎగవేత దారుల వివరాలు వెల్లడించలేమన్న ఆర్‌బీఐ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం సీరియస్‌ అయింది. బ్యాంకుల నుంచి వేల కోట్లు అప్పులు తీసుకున్న బడా బాబులు, కార్పెరేట్‌ కంపెనీలు వ్యాపార సామ్రాజ్యాలు నడుపుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఐదు వందల కోట్ల పైగా అప్పులు తీసుకున్న బడాబాబుల భరతం పట్టాలని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. పది..పాతిక వేల అప్పులు తీసుకున్న రైతులు అవి కట్టలేకపోతే.. బ్యాంకులు ఆస్తులు జప్తు చేస్తున్నాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. చిన్న పాటి రుణాలు చేసిన రైతులు అవి కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ థాకూర్‌ అన్నారు.

వేల కోట్లు రుణాలు తీసుకున్నా....

వేల కోట్లు రుణాలు తీసుకున్న వారిని బ్యాంకులు ఏం చేయలేక పోతున్నాయని వ్యాఖ్యానించింది. వందలు.. వేల కోట్ల రుణాలు తీసుకున్న బడా బాబులు, కార్పొరేట్‌ కంపెనీలు మాత్రం రుణాలు ఎగ్గొట్టి ఎం చక్కా ఎంజాయ్‌ చేస్తున్నారని అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రుణ ఎగవేత దారుల అంశంపై వివరణ ఇవ్వాలని, ఐబీఏ, ఆర్థిక మంత్రిత్వశాఖకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. రుణాల ఎగవేత దారుల జాబితా ఆర్‌బీఐ సీల్డ్‌ కవర్‌లో సుప్రీంకోర్టుకు అందించింది. అయితే బకాయిల మొత్తాన్ని వెల్లడించాలని, అవసరమైతే వారి పేర్లు గోప్యంగా ఉంచాలని సుప్రీం ఆదేశించింది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ప్రముఖంగా టూరిజంపై దృష్టి పెట్టారు. ఈ విభాగానికి బ్రాండ్ అంబాసిడర్లుగా బాలీవుడ్ దంపతులు అజయ్ దేవ్ గన్, కాజల్ నియమితులయ్యారు. బాబు ఆహ్వానం మేరకు ఉదయం విజయవాడకు వచ్చిన అజయ్ దేవ్ గన్ ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం రాష్ట్ర పర్యాటక ప్రచారకర్తలుగా నియమిస్తున్నట్లు ఏపీ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై అజయ్ దేవ్ గన్, బాబులు చర్చించినట్లు సమాచారం. ఇందుకోసం ఓ వీడియో తీయనున్నట్లు సమాచారం. ఈ వీడియోలో అజయ్ దేవ్ గన్, కాజల్ దంపతులు కనిపించనున్నారని తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అజయ్ పేర్కొన్నట్లు సమాచారం. 

హైదరాబాద్: కేరళలో రాత్రివేళ పెద్ద శబ్దం చేసే బాణ సంచా కాల్చడంపై హైకోర్టు నిషేధం విధించింది. పుట్టింగల్‌లో ఘటనకు సంబంధించి కేరళ సర్కార్‌ పై... కోర్టు సీరియస్‌ అయింది. కొల్లం టెంపుల్‌ ఘటనపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. పుట్టింగల్‌ ఆలయ ఘటనపై ఎలా దర్యాప్తు చేయాలన్నదానిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి తగు నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ తెలిపారు.

హైదరాబాద్ : లక్నోలో బాణసంచా కాల్చడంపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. లక్నోలో ఎలాంటి ఉత్సవాల్లోనూ బాణసంచా కాల్చకూడదని ఆదేశాలు జారీ చేసింది. కేరళలోని పుట్టింగల్‌ ఆలయంలో బాణసంచా పేలి 109 మంది మృతి చెందిన నేపథ్యంలో అఖిలేష్‌ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది. 

ముంబయి: మహారాష్ట్రలోని థానె జిల్లా భివాండి ప్రాంతంలో మంగళవారం ఉదయం చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో రెస్క్యూ టీం శ్రమించి 30 మందిని కాపాడారు. ఓ నివాస భవన సముదాయం పక్కనే ఉన్న వస్త్ర పరిశ్రమలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాలుగు అంతస్తులున్న ఈ భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో నివాసముంటున్నవారు భయభ్రాంతులకు గురయ్యారు. కింది అంతస్తు నుంచి మంటలు వ్యాపించటంతో బిల్డింగ్‌లో ఉన్న సుమారు వంద మంది మంటల్లో చిక్కుకున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 12 ఫైరింజన్ల సాయంతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కార్మికులు భవనంపైకి వెళ్లి తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేశారు. రెస్క్యూ టీం పలువురిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. జనావాస ప్రాంతంలో వ్యాపారసంస్థ ఏర్పాటు చేయటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో చిక్కువారంతా వస్త్ర పరిశ్రమలో పని చేసేవారేనని పోలీసులు భావిస్తున్నారు. కాగా భవన సముదాయంలో ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మంటలలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు తగిన వీలు లేకపోవటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోందని ఫైర్ సిబ్బంది పేర్కొన్నారు. 
నిబంధనలకు వ్యతిరేకంగా భవన నిర్మాణాలు చేపట్టడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు సంభవించటం జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పలు భవన నిర్మాణ యజమానులు ఫైర్ స్టేషన్ అధికారుల అనుమతి కూడా తీసుకోవాలనే నిబంధనలను ఉల్లఘించి నిర్మాణాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అనుకూలంగా నిర్మాణాలు లేకపోవడం..అగ్నిమాపక సిబ్బందికి పలు ఇబ్బందులు ఎదురు కావడం వల్ల మృతుల సంఖ్య అధికంగానే వుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇలాంటి పరిస్థితులలోనే మహారాష్ట్ర లో అగ్నిప్రమాదం జరిగినట్లుగా ఫైర్ సిబ్బంది భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఢిల్లీ : రాష్ట్రపతి భవన్ లో 'పద్మ' అవార్డు ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మ అవార్డులను అందచేశారు. పద్మ పురస్కారాల ప్రధానోత్సవానికి ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, వెంకయ్యనాయుడు, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తదితరులు హాజరయ్యారు.
శాస్త్ర సాంకేతిక, సాహిత్య, సినీ తదితర రంగాల్లో విశిష్ట సేవలు చేసిన ప్రముఖులను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పద్మ అవార్డులతో సత్కరించారు. తొలివిడతలో మార్చి 28న ఐదుగురికి పద్మ విభూషణ్‌, 8 మందికి పద్మభూషణ్‌ 43 మందికి పద్మశ్రీ అవార్డులు అందజేశారు. ఈ విడతలో 5 పద్మ విభూషణ్‌, 10 పద్మ భూషణ్‌, 40 పద్మశ్రీ అవార్డులు అందజేశారు.

రామోజీ రావుకు పద్మ విభూషణ్..
తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు పద్మ విభూషణ్‌, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, వాసుదేవ కలుకుంటే ఆత్రే, గిరిజా దేవి, వి.శాంత పద్మ విభూషణ్‌ అవార్డులు స్వీకరించారు. పద్మభూషణ్‌ అవార్డులు అందుకున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారిణి సానియామీర్జా, సాహిత్య రంగానికి చెందిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఉన్నారు. వీరితోపాటు ప్రజా వ్యవహారాల రంగానికి చెందిన రవీంద్ర చంద్ర భార్గవ్, పారిశ్రామిక రంగానికి చెందిన ఇందూజైన్‌, నేపథ్య గాయకులు ఉదిత్‌ నారాయణ్‌, కళా రంగానికి చెందిన కన్హయాలాల్‌, ఉన్నారు. ఆధ్యాత్మిక రంగానికి చెందిన స్వామి తేజోమయానంద, శిల్పకళలో నిపుణులు రామ్‌.వి సుతర్, సాహిత్య రంగంలో ప్రొఫెసర్‌ రామానుజ తాతాచార్య పద్మభూషణ్‌ అవార్డులు స్వీకరించారు. ఇక 40 మంది ప్రముఖులకు రాష్ట్రపతి పద్మశ్రీ అవార్డులు అందజేశారు. సినీరంగానికి చెందిన దర్శకుడు రాజమౌళి, నటి ప్రియాంక చోప్రా, నటులు అజయ్‌దేవ్‌గన్‌, వైద్య రంగానికి చెందిన మన్నం గోపీచంద్‌, మధు పండిట్ దాసా, ఉజ్వల్ దేవ్ రావ్‌ నికమ్‌, తదితరులు పద్మశ్రీ అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు.

ముంబయి : నీటి ఎద్దడి ఏ ప్రాంతాన్ని వదలడం లేదు .లారీల్లో, వ్యానుల్లోనే కాదు రైళ్లలోను నీటిని తరలించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం కూడా అందుకు మినహాయింపు కాదు. వాడడానికే కాదు, తాగేందుకు నీరులేక ప్రజలు అల్లాడుతున్నారు. దీంతో సుమారు 5లక్షల లీటర్ల నీటిని రైలు ద్వారా లాతూరుకు తరలించారు అధికారులు. 300 కిలోమీటర్ల దూరంలోని మిరాజ్‌స్టేషన్లో నీటిని నింపుకుని రైలు ఇవాళ లాతురు చేరుకుంది. మొదట 50 వ్యాగన్ల ద్వారా నీటిని తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా, దూరం ఎక్కువగా ఉండటంతో 10 వ్యాగన్లకే పరిమితం చేశారు. ఈ నీటితో లాతూరు ప్రజల నీటి కష్టాలు తాత్కాలికంగా తీరనున్నాయి. 

త్రివేండ్రం : కేరళలోని కొల్లం పుట్టింగల్‌దేవి ఆలయంలో జరిగిన విషాద ఘటనలో 13 మంది అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. పుట్టింగల్‌ ఆలయంలో భారీ అగ్నిప్రమాదంలో 109 మంది మృత్యావాత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై కొల్లం కలెక్టర్ షాయినామోల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యవైఖరి స్పష్టంగా తెలుస్తోందని మండిపడ్డారు. బాణాసంచా పోటీలకు అనుమతి నిరాకరించినా అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరించారని అన్నారు. స్పష్టమైన ఆదేశాలిచ్చినా ఎందుకు ఆపలేకపోయారని పోలీసు కమిషనర్‌ను వివరణ అడిగారు.   

 

బెంగళూరు : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో హాట్‌ హాట్‌ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. పవర్‌ ప్యాకెడ్‌ రాయల్ చాలెంజర్స్  బెంగళూర్‌ జట్టుకు .....సంచలనాలకు మారుపేరైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు సవాల్‌ విసురుతోంది. బెంగళూర్‌ చిన్నస్వామి స్టేడియంలో మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
క్రికెట్‌ అభిమానులకు ఆసక్తి 
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఈ రెండు జట్ల మధ్య పోటీ అంటే క్రికెట్‌ అభిమానులకు ఎక్కడ లేని ఆసక్తి. ఎందుకంటే గత మూడు సీజన్లలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లన్నీ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగాయి. ఐపీఎల్‌ 9వ సీజన్‌లో ఈ  రెండు జట్ల మధ్య జరుగనున్న పోటీకి చిన్నస్వామి స్టేడియంలో రంగం సిద్ధమైంది. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు ....డాషింగ్ బ్యాట్స్‌మెన్‌  డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలోని హైదరాబాద్ సన్ రైజర్స్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. 
బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు కోహ్లీ నేతృత్వం 
ఈ సీజన్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు అందరి హాట్ ఫేవరెట్ జట్టుగా టైటిల్‌ వేట స్టార్ట్ చేయబోతుండగా....సన్ రైజర్స్ జట్టు సైతం ఈ సారి టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. యాంగ్రీ యంగ్‌ గన్‌ విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని చాలెంజర్స్ జట్టులో అందరూ మ్యాచ్‌ విన్నర్లే. కరీబియన్‌ బుల్‌ క్రిస్‌ గేల్‌, సఫారీ సూపర్‌ మ్యాన్‌ ఏబీ డివిలియర్స్‌, కంగారూ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌,స్పీడ్‌ గన్స్‌ ఆడమ్‌ మిల్నే, కేన్‌ రిచర్డ్‌సన్‌, మ్యాజిక్‌ స్పిన్నర్‌ శామ్యూల్‌ బద్రీ వంటి మ్యాచ్‌ విన్నర్లతో భీకరంగా ఉంది. వీరితో పాటు కేఎల్‌ రాహుల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, హర్షల్‌ పటేల్‌, అరవింద్‌ శ్రీకాంత్‌, మన్‌దీప్‌ సింగ్‌ వంటి ప్రతిభావంతులైన భారత ఆటగాళ్లతో సమతూకంగా ఉంది.
కెరీర్‌ బెస్ట్ ఫామ్‌లో విరాట్‌ కొహ్లీ 
ఇక విరాట్‌ కొహ్లీ ప్రస్తుతం కెరీర్‌ బెస్ట్ ఫామ్‌లో ఉండటం చాలెంజర్స్ జట్టుకు పెద్ద ప్లస్‌ పాయింట్‌ అనే చెప్పాలి. ఎందుకంటే గత మూడు నెలల్లో టీ 20 ఫార్మాట్‌లో కొహ్లీ.....ఏ స్థాయిలో చెలరేగాడో అందరికీ తెలిసిందే. ఒంటిచేత్తో జట్టును గెలిపించగల క్రిస్‌ గేల్‌, డివిలియర్స్ లతో పాటు ఆల్‌రౌండర్‌  షేన్‌ వాట్సన్‌, టీ 20 నెంబర్ వన్‌ బౌలర్‌ శామ్యూల్‌ బద్రీ వంటి ఆటగాళ్ల రాకతో బెంగళూర్‌ టీమ్‌ మునుపెన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తోంది. మిషెల్‌ స్టార్క్ గాయం కారణంగా సీజన్‌కు అందుబాటులో లేకపోయినా స్పీడ్‌ గన్స్ ఆడమ్‌ మిల్నే, కేన్‌ రిచర్డ్ సన్‌ వంటి మెరుపు ఫాస్ట్ బౌలర్లతో చాలెంజర్స్ పేస్‌ బౌలింగ్‌ విభాగంలోనూ దుర్భేధ్యంగా ఉంది. 
బెంగళూరుకు ధీటుగా సన్‌రైజర్స్ జట్టు
డైనమిక్‌ బ్యాట్స్ మెన్‌  డేవిడ్ వార్నర్ సారధ్యంలోని సన్‌రైజర్స్ జట్టు బెంగళూర్‌ జట్టుకు ధీటుగా ఉంది. అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో సన్‌రైజర్స్ జట్టు సమతూకంగా ఉంది. డేవిడ్‌ వార్నర్‌, శిఖర్‌ ధావన్‌, కేన్‌ విలియమ్‌సన్‌, ఓయిన్‌ మోర్గాన్‌, నమన్‌ ఓజా, బెన్‌ కట్టింగ్‌ వంటి బ్యాట్స్‌మెన్‌తో పాటు...కరణ్‌ శర్మ, అశిష్‌  నెహ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌, ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌ వంటి అనుభవజ్ఞులైన పేసర్లతో బౌలింగ్‌ విభాగం సైతం పవర్‌ఫుల్‌గా ఉంది.
రైజర్స్ కు ఎదురుదెబ్బ
సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌ గాయం కారణంగా  రెండు వారాలు దూరమవ్వడం రైజర్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. దీంతో గత సీజన్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన డేవిడ్‌ వార్నర్‌పై రైజర్స్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఈ సారి కూడా భారీ  అంచనాలే పెట్టుకుంది. టాప్‌ ఆర్డర్‌లో శిఖర్‌ ధావన్‌ , మోర్గాన్‌ మిడిల్‌ఆర్డర్‌లో నమన్‌ ఓజా  సైతం అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తే హైదరాబాద్‌ జట్టుకు తిరుగుండదు. ఇక లేటు వయసులోనూ అద్భుతంగా రాణిస్తున్న అశిష్ నెహ్రా అనుభవం, కివీ స్పీడ్‌ గన్‌ ట్రెంట్‌ బౌల్ట్‌, రైజింగ్ స్టార్‌ ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌లతో కూడిన పదునైన పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ రైజర్స్ జట్టుకు కలిసొచ్చే అంశమనే చెప్పాలి.బ్యాటింగ్‌ ఆర్డర్‌లో  కేన్‌ విలియమ్‌సన్‌, మోర్గాన్‌లలో ఒక్కరికే అవకాశం దక్కే చాన్స్‌ ఉండగా....ఈ ఇద్దరినీ కాదని పవర్‌ఫుల్‌ హిట్టర్‌గా పేరున్న ఆస్ట్రేలియన్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ కట్టింగ్‌కు తుది జట్టులో చోటు కల్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.నెహ్రాతో పాటు బౌల్ట్, ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌లలో ఒక్కరికే  స్పెషలిస్ట్‌ పేసర్‌గా చోటు దక్కే అవకాశం ఉంది. 
సన్‌రైజర్స్ సంచలన విజయం
ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్ సైతం ఇరు జట్లకు సమానంగా ఉంది. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు ఆరు మ్యాచ్‌ల్లో పోటీపడగా....చాలెంజర్స్ జట్టు మూడు, సన్‌రైజర్స్ జట్టు రెండు మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఓ మ్యాచ్‌ టైగా ముగిసినా...సన్‌రైజర్స్ జట్టు సూపర్‌ ఓవర్‌లో సంచలన విజయం సాధించింది. బ్యాటింగ్ తో పాటు...పేస్ బౌలింగ్ కు  అనువుగా ఉండే చిన్నస్వామి స్టేడియం పిచ్ పై...హైదరాబాద్ ఫాస్ట్‌ బౌలర్లకు..... పవర్ ఫుల్ బెంగళూరు బ్యాటింగ్ లైనప్‌కు మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
భారీ స్కోర్లు నమోదు...? 
ఫ్లడ్ లైట్ల వెలుగులో జరిగే ఈ మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జట్టు.. 180 కి పైగా స్కోరు సాధించినా..చేజింగ్‌కు దిగే జట్టుకే విజయావకాశాలు ఉంటాయి. మరి ఈ మ్యాచ్‌లో  నెగ్గి టోర్నీని విజయంతో ఆరంభించే జట్టేదో తెలియాలంటే మాత్రం మరికొద్ది సేపు సస్పెన్స్‌ భరించక తప్పదు. 

శాస్త్ర విజ్ఞానం రోజురోజుకు అభివృద్ధి చెందుతున్నా మూఢ నమ్మకాలు ఇంకా రాజ్యం ఏలుతూనే ఉన్నాయి. అంతేగాకుండా ఆడపిల్లలపై వివక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లల వస్త్రధారణపై పలు గ్రామాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని బావ్లీ గ్రామ పంచాయతీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమౌతోంది. ఇటీవల బావ్లీ గ్రామ పంచాయతీ పలు తీర్మానాలు ఆమోదించింది. అందులో కొన్ని ఆమోదయోగ్యం కాగా మరికొన్ని విమర్శలకు తావిచ్చేదిగా ఉంది. ఆడపిల్లలు జీన్స్ వేసుకోవద్దు...బిగుతైన దుస్తులు కూడా ధరించవద్దని తీర్మానించింది. తమ మాట కాదంటే ఆ కుటుంబాన్ని బహిష్కరిస్తామని హెచ్చరించింది. వరకట్నం తీసుకోవడంపై మంచి నిర్ణయం తీసుకుంది. వరకట్నం తీసుకోం..ఇవ్వం అని గ్రామంలో ఉన్నవారంతా ప్రతిజ్ఞ చేయాలని హుకుం జారీ చేసింది. ఆడశిశువని చెప్పి గర్భస్రావాలు చేయించరాదని స్పష్టం చేసింది. ఇక వివాహాల్లో డీజే సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయవద్దని, ఎవరైనా చనిపోయినప్పుడు పెద్దకర్మ సందర్భంగా నిర్వహించే తేర్ీ ఉత్సవానికి హాజరై భోజనాలు చేయవద్దని సూచించింది. ఈ నిర్ణయాలను పాటించని వారిని గ్రామం నుండి వెలివేస్తామని స్పష్టం చేసింది. 

ఫేస్ బుక్..ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెలియని వారుండరు. కానీ ఫేస్ బుక్ లో 'మై ఫస్ట్ వీడియో' పేరుతో ఓ వీడియో హంగామా సృష్టిస్తోంది. ఈ వీడియోను చూసిన కొంతమంది డెస్క్ టాప్ లు, స్మార్ట్ ఫోన్ లు వైరస్ బారిన పడిపోయాయంట. అయితే ఈ వీడియో వల్ల మరో ప్రమాదం కూడా ఉందంట. ఈ వీడియోను మీరు టాగ్ చేయకపోయినా..ఈ వీడియో క్లిక్ చేయగానే ఆటోమెటిక్ గా అందరికీ టాగ్ అవుతుందంట. అంటే మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే ఈ వీడియోను ఓపెన్ చేస్తారో వారి స్మార్ట్ ఫోన్ లు వైరస్ కు గురవుతాయి. చాలా మంది ఫేస్ బుక్ యూజర్లు ఈ వీడియో వైరస్ బాధితులుగా మారినట్లు సమాచారం. సో...ఆ వీడియోను మాత్రం ఓపెన్ చేయకండని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఢిల్లీ : సాగు తాగు నీటి రంగాల్లో తెలంగాణ సర్కార్ తీసుకొస్తున్న విప్లవాత్మకమైన మార్పులు తదితర అంశాలపై కేంద్ర జలవనరుల సమన్వయ కమిటీ ఢిల్లీలో మరోసారి భేటీ అవుతోంది.పీఎం కేఎస్ వై కింద దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 46 ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసే అంశంపై  కమిటీ చర్చించనుంది. 
పలు కీలక నిర్ణయాలపై సమస్వయ కమిటీ భేటీ..
కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడం.. సత్వర అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవడంపై.. సీడబ్ల్యూసీ పనితీరు మెరుగుపరచడం కేంద్ర జలవనరుల శాఖ సామర్థ్యం పెంచడం వంటి పలు కీలక నిర్ణయాలపై సమస్వయ కమిటీ భేటీ కానుంది. ప్రాజెక్టు నిర్మాణం అనుమతుల కోసం ఒక రాష్ట్రం ఎంతలా కష్టపడాలో చెప్పడం ద్వారా హరీష్ రావు కేంద్రం దృష్టిని ఆకర్షించారు. 
హరీష్ రావు సూచనలపై కేంద్రం సానుకూల స్పాందన
కేంద్రమంత్రి ఉమాభారతి... హరీష్ సూచనలు సలహాలు ఆయన లేవనెత్తిన సమస్యల పట్ల గతంలో సానుకూలంగా స్పందించారు.  ఒక్కొక్క ప్రాజెక్టు కోసం  కేంద్రం చుట్టూ తిరగాల్సి  రావడంతో అనుమతుల కోసం సీడబ్ల్యూసీ కి నివేదిక పంపితే రెండేళ్లు పడుతుందని  ఆయన కేంద్రానికి విన్నవించారు. ఇందుకు ఉమా భారతి వెంటనే రియాక్ట్ అయి హరీష్ సూచనల మేరకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు.  ఛత్తీస్ గడ్ జలవనరుల శాఖ మంత్రి బ్రిజ్ మోహన్ అగర్వాల్ ఆధ్వర్యంలో  ఈ కమిటీ ఏర్పాటైంది.
పీఎం కేఎస్ వై కింద 46 ప్రాజెక్ట్ లు ఎంపిక 
తెలంగాణ నీటి వనరుల శాఖ  మంత్రి హరీష్ రావు తో పాటు .. మహారాష్ట్ర మంత్రి గిరీష్ దత్తాత్రేయ మహాజన్ లు సమన్వయ కమిటీ లో సభ్యులుగా ఉన్నారు. రాజస్థాన్ - జమ్మూకశ్మీర్, అస్సాం , ఏపీ రాష్ట్రాల నీటిపారుదల శాఖ  కార్యదర్శులకు కూడా కేంద్ర జలవనరుల కమిటీలో స్థానం కల్పించారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులను వాటి ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన పథకం పేరుతో 46 ప్రాజెక్టులను గుర్తించింది కేంద్రం.
తెలంగాణ నుంచి సెలక్ట్ అయిన దేవాదుల ప్రాజెక్టు
ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఫర్ సస్టేనబుల్ వాటర్ మేనేజ్ మెంట్ పేరుతో జలమంథన్ 2 ను కూడా నిర్వహించారు. రాబోయే సంవత్సరంలో 23 ప్రాజెక్టులు.. 2020 కల్లా మొత్తం 46 ప్రాజెక్టులు పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.దీనిలో దేవాదుల మాత్రమే సెలక్ట్ అయింది.దీనిపై హరీష్ రావు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరో 9 ప్రాజెక్టులను కూడా చేర్చాలని విజ్ఞప్తి  చేశారు. మిషన్ కాకతీయకు సహకరించాలని ఉమా భారతిని గత సమావేశంలో  కోరారు.
ప్రాజెక్టుల వైపు కేంద్రం దృష్టిని తిప్పిన మంత్రి హరీష్ రావు..
తన దైన శైలిలో కేంద్రం పెద్దల దృష్టిని తెలంగాణ ప్రాజెక్టుల వైపు తిప్పిన మంత్రి హరీష్ రావు.. సమన్వయ కమిటీలో మరోసారి కీలకంగా మారారు. దీంతో ఈ భేటీలో మరిన్ని ప్రాజెక్టులు ఈ కమిటీ పరిధిలోకి తీసుకుని సత్వరం పూర్తిచేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. మరి ఈ భేటీలో అయినా సరిహద్దు వివాదాలు తొలగి.. ప్రాజెక్టులు ముందుకు పడతాయో లేదో వేచి చూడాలి.

 

ఢిల్లీ : శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించకపోవడంపై.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవుణ్ణి పూజించడానికి ఫలానా భక్తులు మాత్రమే అర్హులని ఎక్కడైనా ఉంటుందా..? అసలు దేవునికి భక్తుల విషయంలో తేడాలు ఉంటాయా...? చిన్నా..పెద్దా..కుల, మతంతో పాటు లింగబేధం కూడా ఉంటుందా..? అని ప్రశ్నాస్త్రాలను సంధించింది. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించకపోవడంపై కేసు విచారణ  సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది.  
ఆలయంలోకి మహిళలకు ప్రవేశం అంశంపై సుప్రీంకోర్టు విచారణ
శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం అంశంపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్‌ దీపక్‌ మిశ్రా బెంచ్‌ ఈ అంశంపై ట్రావెన్‌కోర్‌ దేవస్థానానికి కొన్ని సూటి ప్రశ్నలు వేసింది. చట్టం కన్నా సాంప్రదాయమే గొప్పదా అని ప్రశ్నించింది. ఏ విధానం ఆధారంగా ఆలయాలకు వెళ్లకుండా మహిళలను అడ్డుకుంటున్నారు..? దేవుణ్ణి ఎవరైనా ఆరాధించవచ్చు. దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు ఆయన దర్శనానికి స్త్రీ, పురుష వివక్ష ఏమిటని వ్యాఖ్యానించింది. పైగా దేశంలో తల్లికే మొట్టమొదటి గౌరవం అందిస్తామని, అలాంటప్పుడు స్త్రీలకు ఆలయ ప్రవేశం లేదని ఎలా అంటారని జస్టిస్‌ దీపక్‌మిశ్రా ప్రశ్నించారు. 
మహిళలకు అనుమతి నిరాకరణపై గతంలోనూ తప్పుపట్టిన సుప్రీంకోర్టు 
ట్రావెన్‌కోర్‌ దేవస్థానానికి, ప్రభుత్వానికి, రాజ్యాంగ నిబంధనలను వెనక్కి నెట్టేసే సంప్రదాయం ఏదైనా ఉంటుందా అని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ప్రశ్నించారు. మహిళల ఆలయ ప్రవేశంపై గతంలో జారీ చేసిన ఆదేశాలను మరోసారి పరిశీలించాలని భావిస్తున్నట్లు తెలిపారు. శబరిమల అయ్యప్ప ఆలయాన్ని నిర్వహించే ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు.. మహిళలకు అనుమతి నిరాకరించడంపై.. గతంలోనూ సుప్రీంకోర్టు తప్పుపట్టింది. రుతు క్రమానికి లోనయ్యే 10 ఏళ్ల అమ్మాయిల నుంచి 50 ఏళ్ల మహిళల వరకు శబరిమల ఆలయంలోకి ప్రవేశించరాదన్న నిబంధనను బోర్డు అమలు చేస్తోంది. 
ఎన్నో ఉద్యమాల అనంతరం గుళ్లోకి మహిళలకు ప్రవేశం
మహారాష్ట్ర శింగనాపూర్‌లోని శని ఆలయంలోకి కూడా మొన్నటి వరకూ మహిళలను అనుమతించేవారు కాదు. ఎన్నో ఉద్యమాల అనంతరం.. ఉగాది రోజున ఆలయ కమిటీ మహిళలను గుళ్లోకి అనుమింతించింది. ఈనేపథ్యంలోనే శబరిమల విషయంలోనూ సుప్రీంకోర్టు.. ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం విశేషం. దేవుణ్ణి ఎవరైనా ప్రార్థించవచ్చని, రాజ్యాంగంలో మౌలిక సూత్రాలను సంప్రదాయాల పేరుతో అధిగమించరాదన్న భావనను సుప్రీంకోర్టు వెలువరించిన నేపథ్యంలో.. శబరిమల అయ్యప్ప ఆలయంలోనూ తమకు ప్రవేశం లభిస్తుందన్న విశ్వాసాన్ని.. ఈ అంశంపై పోరాడుతున్న మహిళా సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. 

 

మహారాష్ట్ర : ముంబయిలోని భివండిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముంబయి సబ్ అర్బన్ భివండి ప్రాంతంలోని నాలుగు అంతస్తుల భవనం.. పవర్ లూమ్ హబ్ లో ప్రమాదం జరిగింది. 80 మంది అగ్నికీలల్లో చిక్కుకున్నారు. మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఐదు ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. మంటలు పక్క బిల్డింగ్ కు వ్యాపించకుండా ప్రయత్నిస్తున్నారు. లోపల ఉన్నవారిని రక్షించేందుకు రెస్క్యూటీం ప్రయత్నిస్తుంది. ఇప్పటివరకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న నలుగురిని సురక్షితంగా కాపాడారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. క్రేన్ల సహాయంతో పై అంతస్తుల్లో ఉన్నవారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

 

ముంబై : స్టాక్‌ మార్కెట్లో బుల్ మళ్లీ విజృంభించింది. మిడ్ సెషన్ నుంచి అందిన బైయింగ్ సపోర్టురో... సెన్సెక్స్ 348 పాయింట్ల లాభంతో.. మళ్లీ 25వేల మార్క్ దాటింది. ఈ సూచీ 25వేల 22 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి 116 పాయింట్లు పెరిగి 7వేల 6వందల 71 వద్ద క్లోజైంది. బ్యాంకింగ్, ఇన్‌ ఫ్రా, ఆటో, ఐటీ, మెటల్ షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి. మిడ్ సెషన్ వరకు ట్రేడింగ్ మామూలుగానే సాగినా... మధ్యాహ్నం ఐరోపా సూచీలు లాభాల్లో ప్రారంభమవడంతో...దేశీయంగా సెంటిమెంట్ పెరిగింది. నిఫ్టీలో ఐడియా సెల్యులర్, బాష్, హిండాల్కో 5శాతం పెరిగాయి.

హైదరాబాద్ : అసోం, పశ్చిమబెంగాల్‌లో రెండో దశ ఎన్నికల్లో రికార్డ్ స్తాయిలో పోలింగ్ నమోదైంది. అసోంలో 82శాతం ఓటింగ్ నమోదవగా... బెంగాల్‌ లో 80శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ 31 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరిగింది. అయితే బెంగాల్‌లో పలుచోట్ల అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు సిపిఎం కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురు సిపిఎం కార్యకర్తలకు తీవ్రంగా గాయపడ్డారు. చంద్రకోణ జిల్లాలో ఉదయం సిపిఎం పోలింగ్‌ ఏజెంట్‌ను టిఎంసి కార్యకర్తలు చితకబాదడంతో అతడు ఆసుపత్రి పాలయ్యాడు. 

కేరళ : కొల్లాంలోని ఓ ఆలయం సమీపంలో ఆగిన మూడు కార్లు కలకలం సృష్టించాయి. ఆ కార్లలో భారీ పేలుడు పదార్థాలు ఉండడంతో బాంబ్‌ స్క్వాడ్‌ తణిఖీలు చేపట్టింది. ఈ కార్లు ఎవరివి? పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పుట్టింగల్‌ ఆలయంలో జరిగిన బాణాసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 108కి చేరింది. ఆలయాల్లో పటాకులను నిషేధించే విషయమై కేరళ హైకోర్టు రేపు విచారణ జరపనుంది.

పుట్టింగళ్ మళ్లీ కలకలం...

పుట్టింగళ్ ఆలయంలో చోటుచేసుకున్న పెను విషాదం నుంచి కోలుకోకముందే కొల్లాంలో మళ్లీ కలకలం చెలరేగింది. పుట్టింగల్‌ దేవి ఆలయానికి అతి సమీపంలో మూడు గుర్తుతెలియని కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి నిండా భారీగా పేలుడు పదార్థాలు ఉండటంతో అధికారులతోపాటు ప్రజల్లోనూ కలవరం మొదలైంది. బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

108కి చేరిన మృతుల సంఖ్య....

కొల్లంలోని పుట్టింగల్‌ దేవి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు బాణ సంచా పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 108కి చేరింది. సుమారు 4 వందల మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగినప్పుడు దాదాపు 15 వేల మంది భక్తులున్నారు. టపాసుల పేలుల్ల అగ్నికీలలు బాణసంచా స్టోరేజీపై పడడంతో భారీ విస్ఫోటం జరిగింది. పేలుడు ధాటికి ఆలయంతో పాటు పక్కనున్న భవనం ధ్వంసమైంది. ఆలయ వేడుకల్లో భాగంగా బాణసంచా పోటీలు నిర్వహిస్తుండగా.. ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా పేలుడుకు సంబంధించిన ఆఖరు 30 సెకన్ల వీడియోను స్థానిక మీడియా ప్రసారం చేసింది. ఈ పేలుడు ఘటన అనంతరం పుట్టంగిల్‌ ఆలయ బోర్డుకు చెందిన 10 మంది సభ్యులు కనిపించకుండా పోయారు. కేరళ కొల్లం జిల్లాలోని ఆలయంలో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి అధికారులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. 30 మందిపై కేసు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో ఆలయ బోర్డు సభ్యులు కూడా ఉన్నారు. ఆలయంలో బాణసంచా పోటీలకు అనుమతి లేదని ముఖ్యమంత్రి సహా, పలువురు అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై క్రైం బ్రాంచ్‌ విచారణ జరుపుతోంది.

ఆలయాల్లో బాణాసంచా కాల్చడాన్నినిషేధించాలంటూ ఆందోళనలు ....

కేరళలోని అన్ని ఆలయాల్లో బాణాసంచా కాల్చడాన్నినిషేధించాలంటూ ఆందోళనలు మిన్నంటాయి. ఇప్పటికే దీనిపై పలువురు సామాజిక వేత్తలు, సంస్థలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఆలయాల్లో పటాకులను నిషేధించే విషయమై మంగళవారం కేరళ హైకోర్టులో వాదనలు ప్రారంభంకానున్నాయి. మరోవైపు ఆలయాల ధర్మకర్తల మండళ్లు మాత్రం పటాకుల వేడుకలను ఆపేదిలేదని ప్రకటించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాల్లో టపాకాయలు పేల్చడం అనాదిగా వస్తోన్న ఆచారమని, ఎట్టిపరిస్థితుల్లో ఆపబోమని చెబుతున్నారు. 

సమానత్వం.. సమ సమాజం కోసం దాదాపు రెండు శతాబ్దాల క్రితమే నడుం బిగించిన ఘనుడాయన. కట్టుబాట్ల సమాజంలోనే ఆధునిక భావాలను అమలు చేసి, సామాజిక మార్పు కోసం అనితర కృషి చేసిన మహత్తర శక్తి అతను. అన్ని వర్ణాలు, అన్ని వర్గాలు ఏకతాటిపైకి వచ్చినప్పుడే... మానవ సమాజం ఉన్నత స్థితికి చేరుకోగలదని సంకల్పించిన ధీరోదాత్తుడు అతను. అతనే మహాజన మహాత్ముడు.. జ్యోతిరావు పూలే.

1867 ఏప్రిల్‌ 11న మహారాష్ట్రలో జననం...

స్వతంత్ర దృష్టి. సమగ్ర ఆధునిక అవగాహన కలిగిన జ్యోతిరావు పూలే 1867 ఏప్రిల్‌ 11న మహారాష్ట్రలో జన్మించారు. కుల వివక్షను ప్రత్యక్షంగా అనుభవించిన పూలే.. అది అంతం కావాలని పరితపించారు. అసమానతల కుల వ్యవస్థ అంతం కావాలని, శూద్ర, అతిశూద్ర ప్రజలకు జీవితం అంకితం చేయాలని ఆనాడే నిర్ణయించుకున్నారు.

మనువాదుల కుతంత్రాలను ఎండగట్టడానికి....

మనువాదుల కుతంత్రాలను ఎండగట్టడానికి.. చీకటి శాసనాలతో ప్రజలను దోచుకుంటున్న తీరును తుద ముట్టించడమే లక్ష్యంగా తన కార్యాచరణను ప్రకటించిన పూలే.. ఆ దిశగా ఎనలేని కృషి చేశారు. ప్రతి రంగంలో స్త్రీలను అణగదొక్కిన తీరుపై పూలే పోరాడారు. అలాగే కులపరమైన అణచివేతకు వ్యతిరేకంగా తీవ్రమైన కృషి చేశారు. అణగారిన వర్గాల హక్కుల కోసం.. వారి బానిసత్వ విముక్తి కోసం పోరాడిన ధీరోదాత్తుడు జ్యతీరావ్‌ పూలే.

భార్య సావిత్రిభాయికి తానే గురువై....

మహిళలు చదవుకూడదన్న ఆంక్షలున్న ఆ రోజుల్లో తన భార్య సావిత్రిభాయికి తానే గురువై ఈ దేశానికి మొదటి మహిళా ఉపాధ్యాయురాలిని అందించిన ఘనులు జ్యోతిరావు పూలే. బ్రాహ్మణుల ఇళ్లల్లో వితంతువులకు శిరోముండనం చేయడం, హీనంగా చూడటం, వారి పట్ల జరిగే అకృత్యాలను పూలే సాహసంతో ఎదుర్కొన్నాడు. అవమానాలు, నిందలకు భయపడి ప్రాణాలు తీసుకోకండి అంటూ వితంతు శరణాలయాన్ని నెలకొల్పినవాడు పూలే. వృద్ధులు, అనాధలు, వికలాంగులకు సేవ చేయడమే నిజమైన భగవంతుని ఆరాధనగా తలచిన ఆయన.. 1848లో మొట్టమొదటి సారిగా బాలికల పాఠశాల నెలకొల్పారు.

ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం, సత్యాగ్రహాన్ని పాటించడం పూలే అలవాటు....

ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం, సత్యాగ్రహాన్ని పాటించడం పూలే అలవాటు. ఆయన లేఖల మీద సత్యమేవజయతే అని రాసుకున్నారు. స్త్రీలు, కార్మికులు, రైతులు, శూద్రులు, అతిశూద్రులు వంటి వర్గాల గురించి, వారి ఆర్థిక, సామాజిక స్థితిగతుల గురించి అనేక ఉద్యమాలు నిర్వహించి, అనేక చట్టాల రూపకల్పనకు కారకుడయ్యాడు. పూలే కర్తవ్యదీక్ష, నిరాడంబరతను, బీదల పట్లను ప్రేమను గమనించిన గాంధీజీ.. పూలే నిజమైన మహాత్ముడు అని ప్రశంసించారు. 1873లో బానిసత్వ విముక్తి జరగాలని భావిస్తూ గులాంగిరి అనే పుస్తకాన్ని రాసిన పూలే..1880లో బొంబాయి నూలు మిల్లు కార్మికుల సమస్యలపై పోరాటం చేశారు.

1873లో సత్యశోధక సమాజాన్ని స్థాపన....

శూద్రులను అగ్రవర్ణాల దోపిడీ నుంచి విముక్తి చేయడం కోసం 1873లో సత్యశోధక సమాజాన్ని స్థాపించారు పూలే. తక్కువ ఖర్చుతో వివాహం జరిపించడం, మత సహనం పాటించడం, మూఢనమ్మకాలను పారద్రోలడం ఈ సంస్థ లక్ష్యంగా ఆయన ఉద్యమించారు. నేటి తరానికీ.. పూలే జీవితం ఆదర్శప్రాయం.. అనుసరణీయం. 

హైదరాబాద్ : మహారాష్ట్రలోని లాతూర్‌లో గత కొన్నేళ్లుగా కరువు కరాళ నృత్యం చేస్తోంది. వర్షాలు లేక నదులు, చెరువులు, కుంటలు ఎండిపోయాయి. బోరుబావులు అడుగంటిపోయాయి. దీంతో ఇక్కడి ప్రజల దాహార్తిని తీర్చడానికి మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం రాజస్థాన్‌ నుంచి రైలు ద్వారా నీటిని సప్లయ్‌ చేయాలని నిర్ణయించాయి.

50 వ్యాగన్లతో కూడిన వాటర్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రెయిన్‌.....

ఇందులో భాగంగా 50 వ్యాగన్లతో కూడిన వాటర్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రెయిన్‌ రాజస్థాన్‌ నుంచి బయలుదేరి పుణే సమీపంలోని మిరజ్‌కు చేరుకుంది. ఒక్కొక్క వ్యాగన్‌లో 54 వేల లీటర్ల నీటి కెపాసిటి ఉంది. వాటర్‌ ట్రెయిన్‌ ప్రస్తుతం లాతూర్‌కు 3 వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి లాతూర్‌ చేరుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ పేర్కొన్నారు. ఒక్క ట్రిప్పుకు 5 లక్షల లీటర్ల నీరు సప్లయ్‌ అవుతుంది. ఏప్రిల్‌ 15 వరకు మరో వాటర్‌ ట్రెయిన్‌ లాతూర్‌ చేరనుంది.

ప్రారంభం కాని పైప్ లైన్ పనులు...

రైలులో నీరొచ్చినా లాతూర్‌ ప్రజలకు అప్పుడే దాహం తీరే అవకాశం లేదు. రైలులో తెచ్చిన నీటిని సప్లయ్‌ చేసేందుకు పైప్‌ లైన్‌ పనులే ఇంకా ప్రారంభించలేదు. మరో మూడు రోజుల్లో పైప్‌ లైన్‌ పనులు పూర్తి చేస్తామన్న ధీమాను అధికారులు వ్యక్తం చేశారు. నాలుగున్నర లక్షల మంది నివసించే లాతూర్‌తో పాటు పరిసర గ్రామాలకు నీటిని సప్లయ్‌ చేసే డామ్‌ పూర్తిగా అడుగంటిపోయింది. దీంతో ఇక బావులు, బోరు బావులే జనానికి దిక్కయ్యాయి. ఆ బావుల నుంచి జనానికి సరిపడా నీళ్లు సప్లయ్‌ కావడం లేదు. దీంతో నీటి కోసం పోటీ పడి జనం సిగపట్లకు దిగుతున్నారు. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు ఇప్పటికే 144 సెక్షన్‌ విధించారు.

గత కొన్నేళ్లుగా కురవని వర్షాలు....

గత కొన్నేళ్లుగా వర్షాలు కురియక మరఠ్వాడాలోని జలాశయాలు ఎండిపోయి దుర్భర కరువు పరిస్థితి నెలకొంది. గత రెండు నెలలుగా చాలామంది రైతులు, పేదలు ఊళ్లు వదలి బతుకు తెరువుకోసం ముంబై చేరుకున్నారు. కూలీ పని చేసుకుంటూ కుటుంబాలను సాకుతున్నారు. మరాఠ్వాడాలో కరువు కారణంగా గత ఏడాది 3 వేల 228 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కరువు పీడిత ప్రాంతాలపై ప్రధాని నరేంద్రమోది ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. బుందేల్‌ఖండ్‌, విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

హైదరాబాద్ : పల్లె జీవులకు ఉపాధి కల్పించాలి.. ఉపాధి లేక ఏ ఒక్కరూ ఆకలిబాధతో అలమటించకూడదు.. పట్టణాలకు వలసెల్లకూడదు.. ఇలాంటి లక్ష్యాలతో ఉపాధి హామీ చట్టాన్ని తయారుచేశారు. ఇంతటి గొప్ప చట్టాన్ని కేంద్రమే నీరుగార్చుతోంది. ఈ పథకానికి బడ్జెట్ కేటాయింపులు చూస్తే.. ప్రభుత్వం ఉద్దేశమేంటో అర్థమవుతోంది. ఒకవైపు ఉన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసినా.. కేంద్ర ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు రావట్లేదు.

ఉపాధి లేక ప్రజలు పట్టణాలకు వలసలు...

ఒకపక్క కరువు దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. ఉపాధి లేక ప్రజలు పట్టణాలకు వలసెల్లిపోతున్నారు. కూలీలు వలసలు పోవడం ఈనాడు కొత్తేమీ కాదు. గ్రామాల్లో ఉపాధి లేక వేలాది మంది పట్టణాలకు వెళ్లిపోవడం దశాబ్దాలుగా చూస్తున్నాం. ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టాలన్న సదుద్దేశంతో యుపిఎ హయాంలో వామపక్ష పార్టీల ఒత్తిడిమేరకు తీసుకొచ్చిన అద్భుత చట్టమే ఉపాధి హామీ యాక్ట్‌. ఈ చట్టం అమల్లోకి వచ్చాక గ్రామాల్లో కూలీల ఆర్థిక పరిస్థితుల్లో గణనీయమైన మార్పులొచ్చాయి. వలసలకు కొంతమేర అడ్డుకట్టపడింది. ఇంతటి విశేషమైన పథకాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులే ఉదాహరణ..

2015-2016లో రూ.41,371 కోట్ల ఖర్చు....

2015-16 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కోసం ప్రభుత్వం 41,371 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. తద్వారా 239 కోట్ల ఉపాధి పనిదినాలు కల్పించినట్లైంది. ఈ సంవత్సరం 217 కోట్ల పనిదినాలు కల్పించాలన్నదే లక్ష్యంగా బడ్జెట్‌ను 38,500 కోట్ల రూపాయలమేర కేటాయించారు. దీన్నిబట్టి 2871 కోట్ల రూపాయలను తగ్గించినట్లైంది. ఒకపక్క దేశ జనాభా ఏటా కోటికి పైగా పెరుగుతోంది. ఇందుకు తగ్గట్లుగా ఉపాధి అవకాశాలు మాత్రం మెరుగుపడట్లేదు. ఇలాంటి సమయంలో ఉపాధి హామీ పనిదినాలు కొద్దిమేరకైనా పెరగాల్సి ఉంది. ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వం పనిదినాలను కుదించడం... బడ్జెట్‌ కేటాయింపులను తగ్గించడం ఆందోళన కలిగిస్తోంది.

మొదటి, చివరి ఆర్థిక త్రైమాసికాల్లో తగ్గిన పనులు.....

2016 ఆర్థిక సంవత్సరంలో మొదటి, చివరి త్రైమాసికాల్లో జరిగిన ఉపాధి హామీ పనిదినాలను బట్టి ప్రభుత్వం 2017 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో కోత విధించింది. అయితే 2, 3 త్రైమాసికాల్లో జరిగిన పనిదినాల సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం. కానీ ప్రభుత్వం మాత్రం 22 కోట్ల పనిదినాలను తగ్గించడం ఎవరికీ అంతుబట్టడం లేదు. నిజానికి గత ఏడాది ఏప్రిల్-జూన్‌ త్రైమాసికంలో విపరీతమైన ఎండల మూలంగా పశ్చిమ, ఉత్తర భారతదేశంలో ఉపాధి పని దినాలు భారీగా తగ్గాయి. దీన్నిబట్టి ఈ త్రైమాసికంలో పనులు తగ్గుతాయని అంచనావేసిన ప్రభుత్వం బడ్జెట్‌లో కోత విధించింది.

త్వరితగతిన విడుదల చేయడకపోవడంతో.....

ఇక కేంద్ర ప్రభుత్వం పనిదినాలకు కేటాయించాల్సిన నిధులనూ రాష్ట్రాలకు త్వరితగతిన విడుదల చేయడకపోవడం మరో సమస్యను క్రియేట్ చేస్తోంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యాన్ని చూపుతున్నాయి. పైగా కూలీలకు పనిచేసిన ఎన్నో నెలలకు వేతనాలు అందుతుండడంతో వారు ఉపాధి హామీ పనులంటేనే కొంత విముఖత చూపుతుండడం గమనార్హం. ఇలా ఎన్నో రకాలుగా ఉపాధి హామీ చట్టం అమలులో కేంద్రం విఫలమవుతూ చివరకు బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

హైదరాబాద్ : ద్వారకా శారదా పీఠ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనిసింగణాపూర్‌ ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించే మహిళలు అత్యచారాలను కొనితెచ్చుకున్నట్టేనంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు శని దేవాలయం గర్భగుడిలోకి వెళ్లడం సరైనది కాదని అది వారికి దురదృష్టాన్ని తెచ్చి పెడుతుందని అన్నారు. శనిని కొలవడం వల్ల మహిళలపై నేరాలు మరింత పెరుగుతాయన్నారు. శనిదేవుడిని పూజించేందుకు మహిళలకు మహారాష్ట్ర సర్కార్‌ అనుమతించింది. స్వరూపానంద వ్యాఖ్యలపై తృప్తి దేశాయ్‌ తీవ్రంగా మండిపడ్డారు.

ఢిల్లీ : కేంద్రమంత్రి సుజనా చౌదరిపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. సుజనా కంపెనీలో రూ.7,602 కోట్ల అవకతవకలు జరిగాయని అడ్వకేట్ వినోద్ కుమార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం పర్యవేక్షణలో సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని కోర్టును పిటిషనర్ కోరారు. అయితే పిటిషనర్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆర్బీఐ లేదా ఎస్‌ఎఫ్‌ఐవో సంస్థలకు ఫిర్యాదు చేయాలని కోర్టు ఫిర్యాదుదారుడ్ని ఆదేశించింది. 

ఢిల్లీ : శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం అంశంపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్‌ దీపక్‌ మిశ్రా బెంచ్‌ ఈ అంశంపై ట్రావెన్‌కోర్‌ దేవస్థానానికి కొన్ని సూటి ప్రశ్నలు వేసింది. చట్టం కన్నా సాంప్రదాయమే గొప్పదా అని ప్రశ్నించింది. ఏ విధానం ఆధారంగా ఆలయాలకు వెళ్లకుండా మహిళలను అడ్డుకుంటున్నారు..? దేవుణ్ణి ఎవరైనా ఆరాధించవచ్చు. దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు ఆయన దర్శనానికి స్త్రీ, పురుష వివక్ష ఏమిటని వ్యాఖ్యానించింది. పైగా దేశంలో తల్లికే మొట్టమొదటి గౌరవం అందిస్తామని, అలాంటప్పుడు స్త్రీలకు ఆలయ ప్రవేశం లేదని ఎలా అంటారని జస్టిస్‌ దీపక్‌మిశ్రా ప్రశ్నించారు.

ట్రావెన్‌కోర్‌ దేవస్థానానికి, ప్రభుత్వానికి, రాజ్యాంగ నిబంధనలను వెనక్కి నెట్టేసే సంప్రదాయం ఏదైనా ఉంటుందా అని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ప్రశ్నించారు. మహిళల ఆలయ ప్రవేశంపై గతంలో జారీ చేసిన ఆదేశాలను మరోసారి పరిశీలించాలని భావిస్తున్నట్లు తెలిపారు. శబరిమల అయ్యప్ప ఆలయాన్ని నిర్వహించే ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు.. మహిళలకు అనుమతి నిరాకరించడంపై.. గతంలోనూ సుప్రీంకోర్టు తప్పుపట్టింది. రుతు క్రమానికి లోనయ్యే 10 ఏళ్ల అమ్మాయిల నుంచి 50 ఏళ్ల మహిళల వరకు శబరిమల ఆలయంలోకి ప్రవేశించరాదన్న నిబంధనను బోర్డు అమలు చేస్తోంది.

మహారాష్ట్ర శింగనాపూర్‌లోని శని ఆలయంలోకి కూడా మొన్నటి వరకూ మహిళలను అనుమతించేవారు కాదు. ఎన్నో ఉద్యమాల అనంతరం.. ఉగాది రోజున ఆలయ కమిటీ మహిళలను గుళ్లోకి అనుమింతించింది. ఈనేపథ్యంలోనే శబరిమల విషయంలోనూ సుప్రీంకోర్టు.. ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం విశేషం. దేవుణ్ణి ఎవరైనా ప్రార్థించవచ్చని, రాజ్యాంగంలో మౌలిక సూత్రాలను సంప్రదాయాల పేరుతో అధిగమించరాదన్న భావనను సుప్రీంకోర్టు వెలువరించిన నేపథ్యంలో.. శబరిమల అయ్యప్ప ఆలయంలోనూ తమకు ప్రవేశం లభిస్తుందన్న విశ్వాసాన్ని.. ఈ అంశంపై పోరాడుతున్న మహిళా సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. 

చెన్నై : దుర్ముఖి నామ సంవత్స ఉగాది వేడుకులు చెన్నైలో ఘనంగా జరిగాయి. పడళవనిలోని విజయగార్డెన్‌లో నాలుగు రోజుల పాటు ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. చెన్నై తెలుగు అసోసియేషన్‌ నిర్వహించిన కార్యక్రమాలను పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ గాయని సుశీల, అలనాటి నటి కాంచన, విజయ సంస్థల అధినేత విశ్వనాథరెడ్డి, ఘంటసాల రత్నకుమార్‌ను నిర్వాహాకులు సన్మానించారు. గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాందించిన గాయని సుశీలను పలువురు అభినందించారు. 

Pages

Don't Miss