National News

ఢిల్లీ : అండబలం.. దండ బలమే కాదు... అన్ని బలాలు ఉపయోగించి..  పవర్‌లోకి రావడానికి నానా పాట్లు పడుతుంటాయి రాజకీయ పార్టీలు.  అధికారమే పరమావధిగా నేరాలకు తెరలేపుతారు నేతాశ్రీలు. అందులో భాగంగా అనేక అక్రమాలకు పాల్పడతారు. కానీ ఇకముందు వాటికి చెక్‌పెట్టేందుకు రంగం సిద్ధం అవుతోంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు సంస్కరణలకు శ్రీకారం చుట్టబోతోంది ఎలక్షన్ కమిషన్. 
కేసుల సత్వర పరిష్కారం కోసం రాజ్యాంగ ధర్మాసనం  
ఎన్నికల్లో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల కేసుల సత్వర పరిష్కారం కోసం రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయబోతోంది. అక్రమాలకు తావు లేని విధంగా ఎన్నికల సంస్కరణలను అమలు చేయాలని నిర్వాచన్‌ సదన్‌ యోచిస్తోంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం, ఎన్నికల్లో నేరస్తులు పాల్గొనకుండా నిరోధించడంతో పాటు ఓటింగ్‌ శాతాన్ని పెంచేవిధంగా ఈ  సంస్కరణలు ఉంటాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.  కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేస్తున్నామని చీఫ్‌ ఎలక్షన్ కమిషనర్‌ నసీం జైదీ వెల్లడించారు. లా కమిషన్‌ సిఫారసు మేరకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జైదీ చెప్పారు. హైదరాబాద్‌లో ప్రజాస్వామిక హక్కులు, ఎన్నికల నిఘా సంస్థ వార్షికోత్సవంలో జైదీ పాల్గొన్నారు. 
ఎన్నికల అఫిడవిట్లో తప్పులు దొర్లితే కఠిన చర్యలు 
నామినేషన్‌ పత్రాల్లో పూర్తి సమాచారం అందించని వారిపై అనర్హత వేటు తప్పదని, ఎన్నికల అఫిడవిట్లో తప్పులు దొర్లితే కఠిన చర్యలుంటాయన్నారు. ఎన్నికల్లో హింసను నిరోధించేందుకు పోలీసు బలగాలను కాకుండా కేంద్ర భద్రతా, పారామిలటరీ బలగాలను మోహరిస్తున్నట్లు జైదీ తెలిపారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై మరింత నిఘా పెంచుతామని ఆయన తెలిపారు. 
పుట్టగొడుగుల్లా రోజుకో పార్టీ 
పుట్టగొడుగుల్లా రోజుకో పార్టీ ఆవిర్భవిస్తోందని, ఆయా పార్టీ వ్యవహారం అనుమానాస్పదంగా ఉందన్నారు జైదీ. 753 పార్టీలు ఇప్పటికీ ఒక్క ఎన్నికల్లో కూడా పాల్గొనలేదని, అలాంటి పార్టీలపై త్వరలోనే విచారణ జరపనున్నట్లు తెలిపారు.  

 

ఢిల్లీ : ఒకటి కాదు.. రెండు కాదు.. బ్యాంకులకు వేల కోట్ల బకాయిలు పడ్డ లిక్కర్‌ కింగ్ లండన్‌లోనే ఉన్నాడా..?  పెట్టా బేడా సర్దుకుని.. చెప్పాపెట్టకుండా మాయమైన కింగ్‌ ఫిషర్‌ అధినేతకు అక్కడ భారీ ఆస్తులే ఉన్నాయా..? ఇంతకీ విజయమాల్యా ఎక్కడ ..?  హార్ట్ ఫోర్డ్ షైర్‌లోని తన ఎస్టేట్‌ను చూస్తే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈజీగానే వెతుక్కోవచ్చు. 
లండన్‌లోని టైవెన్‌లో సొంత ఎస్టేట్‌
ముప్పై ఎకరాల స్థలం.. విశాలమైన పచ్చిక బయళ్లు... ఎత్తైన ఇనుప గేట్లు.. చుట్టూ ప్రహారీ.. అక్కడక్కడ కెమెరా నిఘా నేత్రాలు. తరచూ...లోపలికి బయటకు వచ్చిపోయే ఖరీదైన కార్లు.. ఇదీ కింగ్‌ ఫిషర్‌ అధినేత విజయ్‌ మాల్యా రాజసం. వేల కోట్ల రూపాయలు బకాయి పడి విదేశాలకు చెక్కేసిన విజయమాల్యా ఎక్కడున్నాడన్నదే అసలు ప్రశ్న. అయితే అతను లండన్‌లోని టైవెన్‌లో తన సొంత ఎస్టేట్‌లో తలదాచుకున్నట్లు మీడియా వర్గాల సమాచారం.  హార్డ్‌ఫోర్డ్‌షైర్‌లోని బేక్‌ స్ట్రీట్‌లో గల తన నివాసంలో  కొన్ని రోజులు బస చేసినట్లు స్థానికుల టాక్‌.!
టెన్నిస్‌ కోర్టు, స్విమ్మింగ్‌ పూల్‌, పచ్చిక మైదానాలు 
ముప్పై ఎకరాల సువిశాలమైన ఈ ఎస్టేట్‌లో టెన్నిస్‌ కోర్టు, స్విమ్మింగ్‌ పూల్‌, పచ్చిక మైదానాలతో పాటు విశాలమైన గదులున్నట్లు తెలుస్తోంది. నిరంతరం కెమెరా కనుసన్నల్లో ఉండే ఈ ఎస్టేట్‌ ఆంథోనీ అనే వ్యాపారవేత్త నుంచి కొన్నట్లు సమాచారం. విలాసవంతమైన జీవితాన్ని గడిపే విజయ్‌ మాల్యా ఈ ప్రాంతంలో పేద్ద సెలబ్రెటీ. ఇక్కడ వేల కోట్లు బకాయిలు  పడ్డ మాల్యా అక్కడ భారీమొత్తంలో ఆస్తులు కూడబెట్టుకున్నట్లు తెలుస్తోంది. 
ఎస్టేట్‌లో నిరంతరం సెక్యూరిటీ కట్టుదిట్టం 
ఖరీదైన కార్లలో తిరుగుతూ... అందమైన అమ్మాయిలతో పబ్‌లకు వెళ్లే మాల్యా కలర్‌ఫుల్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తుంటాడని, ఎస్టేట్‌లో నిరంతరం సెక్యూరిటీ కట్టుదిట్టంగా ఉంటుందని స్థానికులు స్పష్టం చేశారు. 
 

ఢిల్లీ : ఒకటి తప్పితే.. మరోటి. వివాదాల పరంపరలో ఆర్ట్ ఆఫ్‌ లివింగ్‌ దానికదే సాటి. ఉత్సవాల వేదిక స్థలం వివాదం ముగిసిందనుకుంటే...తాజాగా మరికొన్ని వివాదాలు ముసురుకుంటున్నాయి. సాంస్కృతిక ఉత్సవాలకు అవినీతి అక్రమాలతో సంబంధం ఉన్నవారినే కాదు... అసలు భూమ్మీద జీవించి లేని వాళ్లకు కూడా ఆహ్వానాలు పంపారు నిర్వాహకులు. ఈ చనిపోయిన వారికి ఇన్విటేషన్‌ ఇవ్వడమేంటని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 
మరో వివాదంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 
ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుతో సమస్యలు ఎదుర్కొంటున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ మరో వివాదంలో చిక్కుకుంది.. ఢిల్లీలో ఈ సంస్థ ఘనంగా నిర్వహిస్తున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల ఆహ్వాన జాబితాలో ఈ మధ్యే కన్నుమూసిన ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి పేరు, భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించే ఓ టర్కీ నేత, అలాగే.. భారీ కుంభకోణాలకు పాల్పడినవారి పేర్లు ఉండటంతో సంస్థ తీరుపై పలువరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 
ఆహ్వాన జాబితాలో బౌత్రోస్ ఘలీ పేరు
గత నెల 16న కన్నుమూసిన ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బౌత్రోస్ ఘలీ పేరును ఆహ్వాన జాబితాలో  పేర్కొన్నారు. జమ్ముకాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ వైఖరికి మద్దతుగా నిలుస్తున్న టర్కీలోని ఆర్గనైజేషన ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ మాజీ కార్యదర్శి అక్మలుద్దీన్ ఇసానోంగ్లూకు సైతం పిలుపు అందింది. లైంగిక వేధింపుల ఆరోపణలతో 2005లో ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న డచ్ ప్రధాని రుడ్ లుబ్బెర్స్ కు, అవినీతి ఆరోపణలపై పదవి నుంచి వైదొలగిన జపాన్ క్రీడలశాఖ మంత్రి షిమోమురాకు ఆహ్వానాలు పంపారు నిర్వాహకులు. 
షిమోమురాపై భారీ అవినీతి ఆరోపణలు 
2020లో జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించనున్న ఒలింపిక్స్ కు సంబంధించి ఓ స్టేడియం నిర్మాణంలో షిమోమురా భారీ అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన గతేడాది జపాన్ మంత్రివర్గం నుంచి తప్పుకొన్నారు. ఏకంగా డచ్ ప్రధాని రుడ్ లుబ్బెర్స్ కు ఆహ్వాన కమిటీ వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. చివరి నిమిషంలో జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, నేపాల్ తొలి మహిళా అధ్యక్షురాలు విద్యాదేవి భండారిలు హజరుకాబోమని ప్రకటించారు. కాశ్మీర్ విషయంలో పాక్ వైఖరిని సమర్థిస్తున్న సంస్థకు ఎలా ఆహ్వానం పంపుతారని.. ఇదేనా జీవించే కళంటే.. .అంటూ కొందరు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.  
పర్యావరణానికి నష్టం వాటిల్లే విధంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వేడుకలు
పాకిస్థాన్ మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ, ఆఫ్ఘనిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, మంగోలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మంత్రులు, ఆఫ్ఘనిస్థాన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అబ్దుల్లా అబ్దుల్లా కూడా హాజరుకాబోమని వెల్లడించారు.  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మొదట హజరవ్వాలని అనుకున్నప్పటికీ... వివాదాల నేపధ్యంలోనే హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారని అధికారులంటున్నారు. ఏదెమైనా ఆర్ట్ ఆఫ్ లీవింగ్ అంటూ పర్యావరణ విధ్వంసానికి నష్టం వాటిల్లే విధంగా వేడుకలు నిర్వహించడం, ఉత్సవాల్లో ఆర్మీని ఉపయోగించుకోవడంపై ఇప్పటికే దుమారం రేగింది. దేశ వైఖరికి విరుద్ధంగా ఉన్న సంస్థలను ఆహ్వానించడంపై కేంద్రం ఏం సమాధానం చెబుతుందో చూడాల్సిందే. 

 

ఢిల్లీ : భారత్‌లో ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన అడ్వాన్సింగ్ ఆసియా సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. ప్రపంచ దేశాలకు భారత ఆర్థిక వ్యవస్థ ఓ ఆశాకిరణంగా మారిందని, వేగవంతమైన ఆర్థిక వృద్ధి కోసం సంస్కరణలు కొనసాగుతాయని తెలిపారు. దేశంలో రైతు ఆదాయం రెట్టింపు కావాలన్నదే తమ లక్ష్యమని.. ఇందుకోసం గ్రామీణ, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులు ఎక్కువగా పెడతామని చెప్పారు. ద్రవ్యోల్బణం తగ్గిందని, విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచుకున్నామని తెలిపారు. అవినీతి, బ్యాంకుల మోసాలను సహించేది లేదంటూ మోది హెచ్చరించారు. 

పశ్చిమ బెంగాల్‌ : ముర్షిదాబాద్‌ జిల్లాలోని ఫరక్కా పవర్‌ ప్లాంట్‌లోని ఐదు యూనిట్లను మూసి వేశారు. ఫరక్క కెనాల్‌లో నీటి మట్టం పూర్తిగా అడుగంటి పోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదు యూనిట్ల ద్వారా 16 వందల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుంది. ఐదు యూనిట్ల మూసివేత కారణంగా బెంగాల్‌, బీహార్‌, జార్ఖండ్, ఓడిషా రాష్ట్రాలపై విద్యుత్‌కు తీవ్ర అంతరాయం కలగనుందని అధికారులు పేర్కొన్నారు. 

ఢిల్లీ : యూనివర్సిటీల్లో చాలా కాలంగా దేశ వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. దేశద్రోహానికి పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. జెఎన్‌యులో దేశ విభజనకు అనుకూలంగా నినాదాలు చేసినవారిని ఎలా సహిస్తారని ప్రశ్నించారు. మూడు రోజుల పాటు జరుగుతున్న అఖిల భారతీయ ప్రతినిధి సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యా సంస్థల్లో రాజకీయ జోక్యం లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులను కూడా కట్టడి చేయాలని మోహన్ భగవత్‌ అన్నారు. ఈ కార్యక్రమానికి బిజెపి చీఫ్‌ అమిత్‌ షా కూడా హాజరయ్యారు.

 

టైటానిక్ పేరు తెలియని సినీ ప్రియులు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి లేదు. ఆ సినిమాను చూడని ప్రేమ జంటలు ఉండరని కూడా వేరుగా చెప్పనక్కర్లేదు. మరి చరిత్రలో టైటానిక్ నిలిచిపోవడానికి, ఇంతగా గుర్తుంచుకోవడానికి కారణమయిన మంచు పర్వతం గుర్తులేకుండా పోదు. ఆ మంచు కొండ వయస్సు ఏకంగా లక్ష సంవత్సరాలట.

104 సంవత్సరాల క్రితం....

దాదాపు 104 సంవత్సరాల క్రితం సౌతాంఫ్టన్ నుంచి న్యూయార్క్ నగరానికి బయలుదేరి ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయి దాదాపు 1500 మందిని జలసమాధి చేసిన నౌక టైటానిక్. ప్రపంచంలో అత్యంత దురదృష్ట సంఘటనల్లో ఇదొకటిగా నిలిచిపోయింది.

1912, ఏప్రిల్ 14న టైటానిక్ ఓడ ....

అట్లాంటిక్ మహాసముద్రంలో 1912, ఏప్రిల్ 14న టైటానిక్ ఓడ మునిగిపోవడానికి కారణమైంది ఐస్‌బర్గ్. ఆ ఐస్‌ బర్గ్‌ ఇదే....ఇంతటి విషాదానికి కారణమైన ఐస్‌బర్గ్ కథేంటో తేల్చాలనుకున్నారు బ్రిటన్‌లోని షెఫీల్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్ర్తవేత్తలు. తమ పరిశోధనలో ఈ మంచుకొండ లక్ష ఏళ్ల నాటి దని తేల్చారు. గ్రాంట్ బిగ్ అనే శాస్త్రవేత్త తన సమష్టి అధ్యయనంలో ఈ విషయాన్ని కనుగొన్నారు. 1912 నుంచి వాతావరణ శాఖ జరిపిన అధ్యయనాల్లోని సమాచారాన్ని తన పరిశోధనకు తీసుకున్నారు.

మహాసముద్రాల ప్రవాహాలు, గాలి అనే అంశంపై .....

మహాసముద్రాల ప్రవాహాలు, గాలి అనే అంశంపై జరిపిన అధ్యయనంతో లభించిన ఆధునిక సమాచారాన్ని గత సమాచారంతో కలపి విశ్లేషించిన గ్రాంట్ బిగ్ 'టైటానిక్' ఓడ ఢీకొన్న పర్వతం వయసును నిర్ధారించారు. మంచుపర్వతం వయసును లెక్కకట్టగలిగిన ఓ మోడల్ కంప్యూటర్ ను బిగ్ ఉపయోగించినట్లు వెల్లడించారు.

మంచు పర్వతం 1700 అడుగుల పొడవు....

ఈ మంచు పర్వతం 400 అడుగుల పొడవు, సముద్ర ఉపరితలంపై 100 అడుగులకు పైగా ఎత్తు, 1.5 మిలియన్ టన్నుల బరువు ఉన్నట్లు మంచు పర్వతం పరిమాణాన్ని మొదట అంచనా వేశారు. కానీ, బిగ్ అధ్యయనం ప్రకారం 1700 అడుగుల పొడవు, 75 మిలియన్ టన్నుల బరువు ఉన్నట్లు చెబుతున్నారు.

బీహార్‌: పాట్నా హైకోర్టు వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోది పాల్గోనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకోసం జారీ చేసిన పాసుల్లో 25 పాసులు మాయం కావడం అధికారులను కలవరానికి గురి చేసింది. దీంతో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీహార్‌ సిఎం నితీష్‌కుమార్‌తో పాటు దేశం నలు మూలల నుంచి జడ్జిలు, లాయర్లు పాల్గోనున్నారు. దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మాయమైన పాసుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంతవరకు ఎవరిపై కేసు నమోదు చేయలేదు.

ఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్‌కు మళ్లీ బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కన్హయ్యను చంపుతామన్న పోస్టర్‌ కలకలం రేపింది. ''జేఎన్‌యూ ద్రోహులను కాల్చి చంపడం జాతిధర్మం. ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, కన్హయ్యలను కాల్చేస్తా'' అని ఈ పోస్టర్‌లో ఉంది. తన పేరు బల్బీర్ సింగ్ భారతీయ అని, తాను సమాజ సేవకుడినని అందులో పేర్కొన్నాడు. పోస్టర్‌లో తన ఫోన్ నంబర్, పాస్‌పోర్టు సైజు ఫొటో కూడా పెట్టాడు. ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో కూడా పోస్ట్‌ చేశారు. ఆ పోస్టర్‌ను జంతర్‌ మంతర్‌ వద్ద నుంచి ఎవరో తొలగించారు. దీనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఢిల్లీ: లోక్‌సభలో కేంద్రం ఆధార్‌ బిల్లును ఆదరా బాదరాగా ఆమోదించడాన్ని ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. ఆధార్‌ బిల్లును మనీ బిల్లు రూపంలో పాస్‌ చేయడమేంటని అసంతృప్తి వ్యక్తం చేశాయి. రాజ్యసభను తక్కువ చేసి చూపడమే ప్రభుత్వ ఉద్దేశమని మండిపడ్డాయి. ఈ బిల్లుపై పూర్తి స్థాయిలో చర్చ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. ఇందుకోసం రాజ్యసభ సమావేశాలను మరో రెండు రోజుల పాటు పొడిగించాలని విపక్షాలు సూచించాయి. పార్లమెంట్‌ బడ్జెట్‌ తొలివిడత సమావేశాలు మార్చి 16న ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్‌ బిల్లుపై చర్చించేందుకు సమావేశాలను పొడిగించాలని విపక్షాలు పట్టుదలతో ఉన్నాయి.

ఢిల్లీ : టీ 20 వరల్డ్ కప్‌ క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లో పసికూన జట్లు అంచనాలకు మించి రాణిస్తున్నాయి. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో  చిన్న చిన్న జట్ల ప్రదర్శన అంచనాలకు మించినట్టుగా ఉంది. 
టీ 20 ఫార్మాట్‌.. ధూమ్‌ ధామ్ బ్యాటింగ్‌
టీ 20 ఫార్మాట్‌ అంటేనే ధూమ్‌ ధామ్ బ్యాటింగ్‌.... పర్‌ఫెక్ట్ ఫీల్డింగ్‌, ఫటా ఫట్‌ బౌలింగ్‌. ట్వంటీ ట్వంటీ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ రౌండ్‌ పోటీలు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం క్వాలిఫైయింగ్ రౌండ్‌ పోటీలు జరుగుతున్నా.....క్రికెట్‌ అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. కానీ క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లో పోటీపడుతున్న జట్లు మాత్రం అంచనాలకు మించి అదరగొడుతున్నాయనే  చెప్పాలి. అసలు సిసలు సమరం ఆరంభం కాకముందే.....తమ ప్రదర్శనతో కాంపిటీషన్‌ను మరింత హీటెక్కిస్తున్నారు. 
ఒమన్‌ జట్టు అద్భుత ప్రదర్శన 
ఐర్లాండ్‌తో ముగిసిన తొలి క్వాలిఫైయింగ్‌ రౌండ్‌ మ్యాచ్‌లో ఒమన్‌ జట్టు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.ఈ మ్యాచ్‌లో ఒమన్‌ జట్టు ....తనకంటే పటిష్టమైన ఐర్లాండ్‌ జట్టును ఓడించడం మాత్రమే కాదు....ఆల్‌రౌండ్‌ షోతో క్రికెట్‌ అభిమానులకు అలరించారు.  మక్సూద్‌ సూపర్‌ క్యాచ్‌ పట్టగా,పేస్‌ బౌలర్‌ అన్సారీ  డెడ్లీ యార్కర్లతో ఐరిష్‌ బ్యాట్స్ మెన్‌కు చెక్‌ పెట్టాడు. ఐర్లాండ్‌ జట్టు బ్యాటింగ్ సమయంలో ...పీటర్‌ స్టిర్లింగ్‌ కొట్టిన కవర్స్‌ వైపు షాట్‌ కొట్టగా అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న మక్సూద్‌ కళ్లు చెదిరే డైవ్‌ క్యాచ్‌ పట్టి ఔరా అనిపించాడు. ఆఖరి ఓవర్లో అన్సారీ లో స్పీడ్‌ యార్కర్‌తో ఐర్లాండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ కెవిన్‌ ఓబ్రెయిన్‌ను బోల్తా కొట్టించాడు. క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లో ఐర్లాండ్‌ జట్టు ఒమన్ టీమ్‌ చేతిలో ఓడినా....ఐరిష్‌ ప్లేయర్‌ విల్సన్‌ మాత్రం తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఒమన్ జట్టు బ్యాటింగ్‌ సమయంలో...17వ ఓవర్‌లో కెవిన్‌ ఓబ్రెయిన్‌ వేసిన బంతిని ఒమన్‌ బ్యాట్స్ మెన్‌ అమీర్‌ అలీ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ షాట్‌ కొట్టాడు. స్టేడియంలో ఉన్నవారంతా సిక్స్‌ ఖాయమనుకున్నారంతా...కానీ బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న విల్సన్‌..గాల్లోకి ఎగిరి మరీ బంతిని బౌండరీ లైన్‌ లోపలకు వేశాడు. దీంతో ఆ బంతిని  సిక్స్‌ పోనివ్వకుండా ఆపడమే కాదు....ఐదు పరుగులు కాపాడాడు.  విల్సన్‌ ఇంతలా వీరోచితంగా ఫీల్డింగ్‌ చేసినా....ఐర్లాండ్‌ జట్టు ఆఖరి బంతికి ఓడిపోయింది. 
ఇరు జట్ల ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో అదరగొట్టారు 
ఇక స్కాట్లాండ్‌, జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇరు జట్ల ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో అదరగొట్టారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌ సమయంలో స్కాట్లాండ్‌ ఫీల్డర్‌ మైఖేల్‌ లీక్స్‌ అరుదైన రీతిలో క్యాచ్‌ పట్టాడు.  8వ ఓవర్‌లో  వాట్‌ వేసిన  రెండో బంతిని జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌ ముటుంబామీ లాంగ్‌ ఆఫ్‌ మీదుగా షాట్‌ కొట్టాడు. సులువుగా పట్టాల్సిన క్యాచ్‌ను ...తొలి ప్రయత్నంలో మిస్‌ చేసిన లీక్స్‌...రెండో ప్రయత్నంలో సింగిల్‌ హ్యాండ్‌తో క్యాచ్‌ పట్టి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఇక స్కాట్లాండ్ జట్టు బ్యాటింగ్‌ సమయంలో.....జింబాబ్వే ఆటగాడు సికందర్‌ రాజా మెరుపు వేగంతో క్యాచ్‌ పట్టాడు.కవర్స్‌ వైపు స్కాటిష్‌ బ్యాట్స్‌మెన్‌ కొయెట్జర్‌ షాట్‌ కొట్టగా....సికందర్ రాజా పర్‌ఫెక్ట్‌ టైమింగ్‌తో ఫ్లైయింగ్‌ క్యాచ్‌ పట్టి వీక్షకులను అవాక్కయేలా చేశాడు. ఇప్పటికే క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లోనే మూడు కళ్లు చెదిరే క్యాచ్‌లు చూశాం. ఇక  మెయిన్‌ రౌండ్‌ ప్రారంభమయ్యాక ఇంకెన్ని అద్భతాలు నమోదవుతాయో చూడాలి. 

గుజరాత్‌ : రాష్ట్రంలోని కాక్రపర్‌ అణువిద్యుత్‌ కేంద్రంలో ప్రాథమిక హీట్‌ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్‌లో లీకేజీ ఏర్పడింది. బుధవారం ఉదయం ఈ లీకేజ్ జరిగిందని ప్లాంట్ అధికారులు తెలిపారు. ఈ ఘటన అనంతరం... అణువిద్యుత్‌ కేంద్రం పరిసరాల్లో రేడియేషన్‌ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని, ప్రమాదమేమీ లేదన్నారు. ముందు జాగ్రత్త చర్యగానే ప్లాంట్‌ లో కార్యకలాపాలు నిలిపివేసినట్టు ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ముంబైలోని బార్క్, అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నిపుణులు రానున్నారు. 1993లో ప్రారంభమైన ఈ ప్లాంట్‌  220 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. 

 

ఛత్తీస్గఢ్ : కాంకేర్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, బీఎస్ ఎఫ్ జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈఘటనలో ముగ్గురు బీఎస్ ఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. 

 

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కాలర్ బ్రావో పట్టుకున్నాడా ? ఎందుకు ? ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీని గురించి తెలుసుకోవాలంటే ఇది చదవండి. కొద్ది రోజుల్లో టీ - 20 వరల్డ్ కప్ మ్యాచ్ లు జరుగనున్న సంగతి తెలిసందే. అంతకంటే ముందు జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. వెస్టిండీస్ తో భారత్ జట్టు ఢీకొంది. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టును టీమిండియా ఖంగుతినిపించింది. మ్యాచ్ అనంతరం అందరూ అభినందిస్తుండగా బ్రావో ఏకంగా ధోని కాలర్ ను పట్టుకున్నాడు. క్షణంకాలం పాటు ధోని సీరియస్ అయ్యాడు. ఇంతలోనే చిరునవ్వుతో రిసీవ్ చేసుకున్నాడంట. ధోనీ, బ్రావో గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ లో ఆడిన సంగతి తెలిసిందే. కానీ కాలర్ పట్టుకోవడంపై మాత్రం ధోని అభిమానులు ఆగ్రహంగా ఉన్నారంట. 

హైదరాబాద్ : కోట్ల రూపాయలను గోల్ మాల్ చేయడంలో సిద్ధహస్తులు. ప్రజల సొమ్ముతో పైలా పచ్చీస్ చేయడం వాళ్లకు అలవాటైన వ్యవహారం. ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసరడంలో ముందుంటారు. రాజకీయ అండదండలతో చట్టసభల్లో చాలా ఈజీగా స్థానం సంపాదిస్తారు. ఆ తరువాత చల్లగా జారుకుంటారు. ఇవన్నీ మన దేశంలో బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగవేస్తున్న డిఫాల్టర్స్ కు సరిగ్గా సరిపోతాయి.                                                                
 
వసూలు చేసుకోవడానికి అష్టకష్టాలు..
కోట్ల రూపాయల రుణం తీసుకుని..ఆ తరువాత కుచ్చుటోపీ పెట్టే బడా బాబుల వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. పెద్ద పెద్ద వాళ్లకు ఇష్టానుసారంగా అప్పులిచ్చేస్తున్న బ్యాంకులు తిరిగి వసూలు చేసుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నాయి. వాటి పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన్న తయారవుతోంది. విజయ్‌ మాల్యా ఉందంతమే దీనికి ఉదాహరణ. వేలాది కోట్లు రుణం తీసుకున్న కింగ్‌ఫిషర్‌ పిట్ట లండన్‌కు తుర్రుమని ఎగిరిపోయింది.

రాజ్యాంగ సంస్థల్లోనూ రాజకీయ జోక్యం..
అసలు రుణ ఎగవేతదారుల్లో మంత్రులు, ఎంపీలు కూడా ఉంటున్నారు.పార్లమెంట్ లో కూర్చోని చట్టాలు చేసేవారు, క్యాబినెట్ మీటింగ్ లలో ప్రభుత్వ విధానాలు ఖరారు చేసేవారు బ్యాంకు లోన్లు ఎగ్గొడుతున్నారు.. విజయ్ మాల్యా కూడా రాజ్యసభ సభ్యుడే. ఇటువంటి వారు కొన్ని పార్టీల అండదండలతో, కోట్లతో చేతులు తడిపి రాజ్యసభ, లోక్ సభ టిక్కెట్లు సంపాందించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. వీటిని ఏ పార్టీ ఖచ్చితంగా ఖండించదు. ఆ పార్టీ అధికారంలో వచ్చినప్పుడో.. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తుతో ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ల మాటలు ఈజీగా చెల్లుబాటు అవుతాయి.. రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాల్సిన వ్యవస్థల్లో రాజకీయ జోక్యమూ పెరిగిపోతోంది.దీంతో ఇలాంటి బడా చోర్ లు ఈజీగా తప్పించుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ ఎగవేతదారులు..
విజయ్ మాల్యా సంగతే చూశాం. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఎగవేతదారులు ఉన్నారు.. మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు చెందిన ప్రోగ్రెసివ్ కన్ స్ట్రక్షన్ 350 కోట్లు బకాయిలు పడింది. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు చెందిన ల్యాంకో హోస్కోటే హైవే సంస్థ 533 కోట్లు, ప్రస్తుత కేంద్ర మంత్రి సుజనా చౌదరి సంస్థల బకాయిలు 592 కోట్లు. ఇలా మరో 30 సంస్థల బకాయిలే దాదాపు దేశ వ్యాప్తంగా 95 వేల 122 కోట్లు. వీటితో మిగతా ఎగవేత దారుల మొండి బకాయిలు మొత్తం గత మార్చి నాటికే 2 లక్షల 67 వేల కోట్ల రూపాయిలు. ఇవి గత సమావేశాల్లో రాజ్యసభలో కేంద్రం చెప్పిన వివరాలు. ఈ బకాయిల్లో కేవలం 5 సంస్థల వాటానే 53 శాతం గా ఉందంటే.. వీళ్ల ఇష్టారాజ్యం ఎలా రాజ్యమేలుతోందో అర్థం చేసుకోవచ్చు.

మొండిబకాయిలపై రిజర్వ్ బ్యాంక్‌ ఆందోళన..
ఇటీవల కావూరి సాంబశివరావు మొండిబకాయిల విషయంలో నోరు మెదపకపోవడంతో కొన్ని బ్యాంకుల సిబ్బంది ఆయన సంస్థల కార్యాలయం ఎదుట మౌన ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఇలాంటి పేరుకుపోయిన జాబితాలో విజయ్ మాల్యాది మొదటి స్థానం. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా చాలా సందర్బాల్లో ఆందోళన వ్యక్తం చేసినా.. ఎగవేత దారులపై కఠినంగా వ్యవహరించే విషయంలో కేంద్రం, బ్యాంకుల తీరులో మార్పు రావడం లేదు. ఇంత పెద్ద ఎగవేత దారైన విజయ్ మాల్యాపై ఏ ఒక్కరూ కనీసం ఫిర్యాదు చేయలేదని, స్వయంగా సీబీఐ డైరెక్టర్‌ ప్రశ్నిస్తే బ్యాంకుల దగ్గర సమాధానమే లేదు. బ్యాంకు ఉద్యోగుల సంఘాలు కూడా డిపాల్టర్స్ విషయంలో సంస్థల తీరును ప్రశ్నించినా.. ఫలితం ఉండటం లేదు.

రుణాల కోసం బ్యాంకు అధికారులుపై ఒత్తిళ్లు..
బ్యాంకులకు భారీగా బకాయిల పడ్డవారి జాబితాలో ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్ కు చెందిన వారే ఎక్కువుగా ఉండటం మరో హైలెట్. కార్పోరేట్ సంస్థలకు, నేతలకు అడిగినంత లోన్లు ఇవ్వాలంటూ బ్యాంకు అధికారులపై ఒత్తిడుళ్లతో పాటు , బ్యాంక్ బోర్డుల్లోకి రాజకీయనాయకుల అనుచరులను నియమించుకోవడం వంటి అంశాలు ఇలాంటి దుస్థితికి కారణమవుతున్నాయి. మొండి బకాయిల్లో మైనింగ్, స్టీల్, టెక్స్ టైల్స్, ఏవియేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఈ 5 రంగాలకు చెందిన కంపెనీలే 53 శాతం ఆక్రమించినట్లు ఓ సర్వేలో తేలింది.

సతమౌతున్న బ్యాంకులు..
ఇలా బడా బకాయిల బకాయిలు ఎలా వసూలు చేసుకోవాలో తెలియక.. వస్తాయో రావో అన్న గ్యారంటీ లేక బ్యాంకులు సతమతమవుతున్నాయి. అదే రైతులు, సామాన్యులు రుణాలు ఎగ్గొడితే మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటాయి. కష్టాల్లో ఉన్న రైతన్నలు రుణాలు చెల్లించకపోతే ఇవే కొన్ని బ్యాంకులు వాళ్ల ఫోటోలను నోటీసు బోర్డుల్లో పెట్టిన సందర్భాలూ తెలుగు రాష్ట్రాల్లో చాలానే ఉన్నాయి.మొండి బకాయిల ఎఫెక్ట్ కేవలం ఆర్థిక ప్రగతిపైనే కాదు.. చిన్న చిన్న పరిశ్రమలకు లోన్లు ఇవ్వలేని దుస్థితిని కల్పిస్తోంది. నల్ల ధనం దేవుడెరుగు కనీసం మోడీ సర్కార్ బడాబాబుల మొండి బకాయిలనైనా వసూలు చేయకపోతే ఎలా.. 

హైదరాబాద్ :  ప్రస్తుతం ఇండియాలో హాట్ టాపిక్ కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా. ఇండియన్ బ్యాంకులకు తొమ్మిది వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయాడు. అతను ఇండియా నుండి ఎలా వెళ్లాడు? ఎవరెవరు హెల్ప్ చేశారనే విషయాలపై మీడియా  అనేక కథనాలు వచ్చాయి. అయితే మాల్యా మార్చి 2న మధ్యాహ్నం 1.30కు ఢిల్లీ - లండన్ జెట్ ఎయిర్ వేస్ విమానంలో బ్రిటన్ వెళ్లినట్లు ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి దృవీకరించారు. 
'మాల్యాతో పాటు ఓ మహిళ ఉందని, మాల్యా ఏడు భారీ లగేజీ బ్యాగులను తనతో పాటు తీసుకెళ్లాడని వెల్లడయ్యింది.' మాల్యాకు లండన్ లోని హెర్త్ ఫోర్ షైర్  లో ఓ  విలాసవంతమైన నివాసం ఉంది. మీడియాలో కథనాలు చూసిన అక్కడి ప్రజలు మాల్యాను గుర్తించారు. అయితే లండన్ వెళ్లిన ప్రతిసారి పబ్ లు పార్టీలంటూ విలాసంగా గడిపే మాల్యా ఈ దెబ్బకు ఇంటినుంచి బయటకి రావట్లేదట. 

ఢిల్లీ : లోక్ సభలో ఆధార్ కార్డు బిల్లు పాసైంది. శుక్రవారం లోక్ సభలో ఈ బిల్లును కేంద్రం బిల్లును ప్రవేశ పెట్టింది. ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టిన ఈ బిల్లుకు ఆమోదం లభించినట్లు స్పీకర్ సుమిత్రా మహజన్ పేర్కొన్నారు. అంతకుముందు జైట్లీ లోక్ సభలో ఈ బిల్లుపై మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు పక్కదారి పట్టకుండా అసలు లబ్ధిదారులకు అందచేయడమే తమ లక్ష్యమని, వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. దేశంలో 97 శాతం మందికి ఆధార్ కార్డులున్నాయని, పిల్లల వివరాలకు సంబంధించి త్వరలోనే ఆధార్ కార్డులను రూపొందిస్తామని తెలిపారు. ఆధార్ క్రెడిట్ అంతా నందన్ నీలేకన్ కు దక్కుతుందని జైట్లీ తెలిపారు. 

చిత్తూరు : నిత్యానంద..వివాదాల స్వామి..ఈ స్వామి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు. మొన్న శ్రీకాళహస్తిలో శిష్యురాలు రంజితతో ప్రత్యక్షమైన నిత్యానంద నేడు తిరుమల చేరుకున్నారు. శుక్రవారం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ లో ఆయన నిత్యానందకు దర్శన ఏర్పాట్లను టిటిడి అధికారులు కల్పించారు. వైకుఠం క్యూ కాంప్లెక్సు ద్వారా సామాన్యు భక్తులతో కలిసి ఆలయంలోకి వచ్చారు. అందరికీ ఆశీర్వాదాలు చేస్తూ ముందుకు కదిలారు. నిత్యానంద వేసుకున్న ఆభరణాలు..వస్త్రధారణను భక్తులు ఆసక్తిగా చూశారు.
గతంలో సినీ నటి రంజితతో ఆయన ఆశ్రమంలోని ఓ గదిలో నిత్యానంద స్వామి కలిసి ఉన్నట్లున్న ఓ వీడియోను ఆయన శిశ్యుడే గతంలో విడుదల చేయడం తెలిసిందే. ఆ వీడియోలో నిత్యానంద స్వామి, రంజిత సాన్నిహిత్యంగా ఉండటం గమనార్హం. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. విచారించిన అనంతరం నిత్యానంద బెయిల్‌పై విడుదలయ్యారు. 

ముంబై : దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విజయ్ మాల్యా వ్యవహారంపై ఈడీ రంగంలోకి దిగింది. ఈ రోజు మాల్యాకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నష్టాల ఊబిలో కూరుకపోయి, ఎస్ బీఐ కాన్సార్టియం బ్యాంకులకు సుమారు రూ.900 కోట్ల బాకీ ఉన్న మాల్యా ప్రస్తుతం పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఈడీ సూచించింది. ఈనెల 18న విచారణ జరగనుంది. మాల్యా మార్చి 2వ తేదీన లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు రుణాల వివరాలను తెలుపాలని రుణాలిచ్చిన 17 బ్యాంకులకు ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ఆస్తుల విలువ లెక్కకట్టకుండా ఐడీబీఐ బ్యాంకు రుణం మంజూరు చేయడంపై కూడా కేసు నమోదైంది.
విజయ్ మాల్యా..కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థ నష్టాల ఊబిలో కూరుకపోయింది. ఈ నేపథ్యంలో వేల కోట్ల రూపాయల రుణం తీసుకున్నాడని..రుణాలు చెల్లించడం లేదని పలు బ్యాంకులు పేర్కొన్నాయి. దీనితో మాల్యాపై సుప్రీంకోర్టులో, బెంగళూరు హైకోర్టులో మాల్యాపై పిటిషన్ లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ లు దాఖలైన సమయంలోనే మాల్యా లండన్ కు వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తనకు భారత చట్టాలపై గౌరవం ఉందని, తాను ఎక్కడికి పారిపోలేదని మాల్యా ట్విట్టర్ లో ట్వీట్స్ చేశారు. మరోవైపు శుక్రవారం కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సీఈఓను తమ కార్యాలయానికి పిలిపించింది. మాల్యా వ్యవహారం, సంస్థ ఆర్థిక స్థితిగతులపై ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదేశాల ప్రకారం మాల్యా ఈడీ ఎదుట హాజరౌతారా ? లేదా ? అన్నది వేచి చూడాలి. 

ఢిల్లీ : ప్రపంచంలోనే క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఉండే భారత గడ్డపై ...తొలిసారిగా జరుగుతున్న 2016 టీ-20 ప్రపంచకప్ లో ఆతిథ్య టీమిండియాతో సహా మొత్తం 16 దేశాల జట్లు ఢీకొనబోతున్నాయి. ఈ సందర్భంగా సూపర్ టెన్ రౌండ్లో పాల్గొంటున్న మొత్తం పదిజట్ల బలాబలాలపై 10 స్పోర్ట్స్ స్పెషల్ లో భాగంగా..ఈరోజు..ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ టీమిండియా ట్రాక్ రికార్డు ఓసారి చూద్దాం....
మార్చి 8 న ప్రారంభం
ప్రపంచకప్ టీ-20 తుపాను తొలిసారిగా భారత్ ను కమ్మేసింది. మార్చి 8 న ప్రారంభమై... ఏప్రిల్ 3 న ముగిసే 2016 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ను  రెండుదశలుగా నిర్వహిస్తున్నారు. టెస్ట్ హోదా పొందిన ఎనిమిదిదేశాలతో పాటు..బంగ్లాదేశ్, జింబాబ్వేలతో సహా మొత్తం 16 దేశాలజట్లు బరిలోకి దిగబోతున్నాయి. మార్చి 8 నుంచి 13 వరకూ ఎనిమిదిజట్ల క్వాలిఫైయింగ్ సమరం..., ఆ తర్వాత మార్చి 15నుంచి ఏప్రిల్ 3 వరకూ సూపర్ టెన్ కమ్ నాకౌట్ రౌండ్ నిర్వహిస్తున్నారు.
మార్చి 15 నుంచి సూపర్ టెన్ దశ పోటీలు
మార్చి 15 నుంచి రెండువారాలపాటు జరిగే సూపర్ టెన్ దశ పోటీల్లో ..ప్రపంచ నెంబర్ వన్ టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకిదిగుతోంది. టీ-20 ఫార్మాట్లో.. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచ నెంబర్ వన్ జట్టు టీమిండియా...ఆసియాకప్ విజయంతో ప్రపంచకప్ టైటిల్ సమరానికి పూర్తిస్థాయిలో సిద్ధమయ్యింది. 2007 ప్రారంభ టీ-20 ప్రపంచకప్ నుంచి 2014లో ముగిసిన ఐదవ ప్రపంచకప్ వరకూ...రెండుసార్లు ఫైనల్స్ చేరి..ఒకసారి విన్నర్ , మరోసారి రన్నరప్ గా నిలిచిన రికార్డు టీమిండియాకు ఉంది.
తొలి ప్రపంచ చాంపియన్ గౌరవం దక్కించుకున్న ధోనీసేన 
జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో...ఏమాత్రం అంచనాలు లేకుండా 2007 ప్రపంచకప్ బరిలోకి దిగిన టీమిండియా ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఐదు పరుగుల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. టీ-20 చరిత్రలోనే తొలి ప్రపంచ చాంపియన్ గౌరవం ధోనీసేన దక్కించుకొంది. ఆ తర్వాత జరిగిన 2009, 2010, 2012 ప్రపంచకప్ టోర్నీల్లో దారుణంగా విఫలమైన టీమిండియా...2014లో ముగిసిన ఐదవ ప్రపంచకప్ టోర్నీలో ఫైనలిస్ట్ గా, రన్నరప్ స్థానం సంపాదించింది.
టైటిల్ వేటకు దిగుతోన్న ధోని సేన
ప్రస్తుత 2016 ప్రపంచకప్ లో సైతం...ధోనీసేన టాప్ ర్యాంక్ జట్టుగా టైటిల్ వేటకు దిగుతోంది. 2016 సీజన్లో టీమిండియా రెండు సిరీస్ లతో పాటు ఆసియాకప్ టీ-20 టైటిల్ ను సైతం సొంతం చేసుకొని...హాట్ ఫేవరెట్ గా నిలిచింది. ఆస్ట్రేలియాతో ముగిసిన మూడుమ్యాచ్ ల సిరీస్ లో క్లీన్ స్వీప్ సాధించిన ధోనీసేన..ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మూడుమ్యాచ్ ల సిరీస్ ను 2-1తో దక్కించుకొంది. అంతేకాదు..బంగ్లాదేశ్ వేదికగా ముగిసిన ప్రారంభ ఆసియాకప్ టీ-20 టోర్నీని అలవోకగా గెలుచుకొంది. ఐదు జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో నాలుగుకు నాలుగు మ్యాచ్ లూ నెగ్గిన టీమిండియాకు...బంగ్లాదేశ్ తో ముగిసిన టైటిల్ సమరంలో ఎదురేలేకుండా పోయింది. ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గడం ద్వారా..ధోనీసేన ఆసియాకప్ సొంతం చేసుకొంది. 2016లో ఆడిన 11 మ్యాచ్ ల్లో పది విజయాలు సాధించిన ఒకే ఒక్కజట్టుగా...టీమిండియా ప్రపంచకప్ టైటిల్ వేటకు దిగుతోంది.
మార్చి 15న న్యూజిలాండ్ తో తొలిమ్యాచ్ 
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో అత్యంత సమతూకంతో ఉన్న టీమిండియాకు...స్వదేశీ పిచ్ లపైన ఆడటం అదనపు బలంగా ఉంది. ప్రపంచకప్ సూపర్ టెన్ పూల్-బీ లీగ్ లో..టీమిండియా తన ప్రారంభమ్యాచ్ ను మార్చి 15న నాగపూర్ విదర్భ స్టేడియంలో ఆడుతుంది. నాలుగోర్యాంకర్ న్యూజిలాండ్ తో తొలిమ్యాచ్ ఆడుతుంది.
మార్చి 19న పాకిస్థాన్ తో గ్రూప్ రెండో మ్యాచ్ 
మార్చి 19న ధర్మశాల హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో గ్రూప్ రెండో మ్యాచ్ ఆడుతుంది.
మార్చి 27న ఆస్ట్రేలియాతో టీమిండియా ఢీ  
మార్చి 27న మొహాలీ పంజాబ్ క్రికెట్ సంఘం వేదికగా జరిగే మూడోరౌండ్ పోటీలో ఆస్ట్రేలియాతో టీమిండియా ఢీ కొంటుంది. మార్చి 30న న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా జరిగే ఆఖరి రౌండ్ పోటీలో...క్వాలిఫైయింగ్ రౌండ్ నుంచి అర్హత సాధించిన జట్టుతో ధోనీసేన పోటీపడుతుంది.
17 విజయాలు, 9 పరాజయాలు 
2007 ప్రపంచకప్ నుంచి 2014 వరకూ జరిగిన ఐదుటోర్నీల్లో మొత్తం 28 మ్యాచ్ లు ఆడిన టీమిండియా..17 విజయాలు, 9 పరాజయాల రికార్డుతో ఉంది. 64. 8 విజయశాతం సాధించిన టీమిండియా...2016 ప్రపంచకప్ లో నూటికి నూరుశాతం విజయాలతో...రెండోసారి టీ-20 విశ్వవిజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది. దేశంలోని కోట్లాదిమంది అభిమానులు సైతం అదే కోరుకొంటున్నారు. ఈ ధూమ్ ధామ్ సమరంలో ధోనీసేన శివమెత్తిపోవాలని కోరుకొందాం....

ఢిల్లీ : గ్రీన్‌ ట్రిబ్యునల్‌ విధించిన ఐదు కోట్ల జరిమానాను చెల్లించేందుకు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ నిర్వాహకుడు రవిశంకర్‌ ఎట్టకేలకు అంగీకరించారు. అయితే ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ అనేది ఒక ఎన్జీవో అని ఐదు కోట్లు జరిమానా చెల్లించేందుకు కనీసం నాలుగు వారాల సమయం కావాలని కోరారు. ఇదిలా ఉంటే పర్యావరణ అనుమతులను ఉల్లంఘించినందుకే ఐదు కోట్లు చెల్లించాలని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ మొట్టికాయ వేసింది. అయితే ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ మాత్రం తాము పెనాల్టీగా భావించడం లేదని, 5 కోట్లతో బయోడైవర్సిటీ పార్క్‌ను పునరుద్ధరించాలని ట్రిబ్యునల్‌ ను కోరింది.   

యూఏఈ : ఏడారి దేశాలను వర్షం ముంచేసింది. వడగాల్పులు తప్ప వాన జాడలేని దేశాల్లో ఇప్పుడు రోడ్లన్నీ వరదనీటితో నిండిపోయాయి. 2రోజులుగా కురుస్తున్న వర్షాలతో గల్ఫ్ దేశాల్లో కొత్త వాతావరణం కనిపిస్తోంది. 
తగ్గుముఖం పడుతున్న వరదలు
ఏడారి దేశం యూఏఈలో వరదలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. 24 గంటలుగా స్తంభించిన జనజీవనం ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. నిన్న షార్జాకు వెళ్లే దారులన్నీ ట్రాఫిక్ తో నిండిపోగా, నేడు ఆ పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. జనాలు ఇప్పుడిప్పుడే రోడ్లమీదకి వస్తున్నారు. ఆఫీసులకు వెళ్లడం, ఇతర పనులకు వెళ్లే వాహనదారులు మళ్లీ తమ పనులను ప్రారంభించారు. కొన్ని విమాన సర్వీసులను అధికారులు పునరుద్ధరించారు.
యూఏఈ అతలాకుతలం
ఒక్కసారిగా భారీగా కురిసిన వర్షాలతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బుధవారం అతలాకుతలమైంది. ఆ ఒక్కరోజే 240 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అటు వర్షాల కారణంగా దాదాపు 250  రోడ్డు ప్రమాద కేసులు నమోదయ్యాయని స్థానిక మీడియా తెలిపింది.
దుబాయ్ చాలా ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం 
ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన నగరం దుబాయ్ సహా అక్కడి చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. 130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, జోరువానలతో అక్కడి జనజీవనం స్థంభించింది. పాఠశాలలు మూతపడ్డాయి. విమాన సేవలకు అంతరాయం కలిగింది. అయితే చాలా ఏళ్ల తరువాత ఇంతగా వర్షాలు పడటంతో... దుబాయ్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

 

రాయ్పూర్ : తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దులో మావోయిస్టులు చెలరేగిపోయారు. ఇవాళ సీఆర్ పీఎఫ్ వాహనం లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే మావోయిస్టులు, పోలీసులు మధ్య ఎదురుకాల్పులు జరిగిన ఘటనలో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో సీఆర్ పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా మర్లగూడెం వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చారు.దీంతో సీఆర్‌పీఎఫ్‌ వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రభాత్, త్రిపాఠి, శ్రీనివాస్, రంగ రాఘవన్ జవాన్లు గాయపడ్డారు. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. 

 

 

ఢిల్లీ : టీ-20 ప్రపంచకప్ సునామీకి క్రికెట్‌ క్రేజీ భారత్‌ సిద్ధమయ్యింది. మూడుగంటల్లో ధూమ్ ధామ్ గా సాగిపోయే ఈ టోర్నీ కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది నవతరం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూడువారాలు...మూడువేదికల్లో జరిగే పదహారుజట్లు, రెండుదశల 2016 టీ-20 ప్రపంచకప్ పై 10 స్పోర్ట్స్ స్పెషల్ 
భారత్‌లో రంగం సిద్ధం 
టీ 20 వరల్డ్‌ కప్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. చిట్టి పొట్టి ఫార్మాట్‌లో మహా సంగ్రామానికి క్రికెట్‌ క్రేజీ నేషన్‌ భారత్‌లో రంగం సిద్ధమైంది. ఈ చిట్టి పొట్టి ఫార్మాట్‌ గురించి తలచుకోగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి ఇవే....
ఎన్నో మలుపులు, మరెన్నో మెరుపులతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌లా సాగే ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌ అంటే క్రికెట్‌ అభిమానులకు నిజంగా పండుగే. 
బ్యాట్స్ మెన్‌దే డామినేషన్‌
ఎంతమంది కొమ్ములు తిరిగిన బౌలర్లున్నా ఈ ఫార్మాట్‌లో మాత్రం...బ్యాట్స్ మెన్‌దే డామినేషన్‌. వీరబాదుడు, బండబాదుడుకి టీ 20 ఫార్మాట్‌  కేరాఫ్‌ అడ్రస్‌. అందుకే మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు చూస్తున్న అభిమానులందరికీ ...నాన్‌ స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. అందుకే ఈ ఫార్మాట్‌కు అంత క్రేజ్‌. ముచ్చటగా మూడు గంటల్లో ముగిసిపోయె ఈ ఫార్మాట్‌కు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు...ఎందుకంటే బ్యాట్స్ మెన్‌ వీరలెవల్లో రెచ్చిపోయి బౌలర్లను చీల్చి చెండాడుతుంటే...ఆ మజానే వేరు. మామూలు మ్యాచ్‌ల్లోనే పోటీ తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఇంక ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో అయితే పోటీ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
2007లో భారత జట్టు బోణీ....
ఇప్పటివరకు జరిగిన ఐదు టీ 20 ప్రపంచ కప్‌ టోర్నీల్లో ...ఐదు వేర్వేరు జట్లు విజేతలుగా నిలిచాయి. 2007లో భారత జట్టు బోణీ కొట్టగా....2009లో పాకిస్థాన్‌ జట్టు రెండో ప్రయత్నంలో టైటిల్‌ను దక్కించుకుంది.2010లో ఇంగ్లండ్‌ జట్టు తొలి ప్రధాన ఐసీసీ వరల్డ్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకోగా...2012లో  వెస్టిండీస్‌ జట్టు అదరగొట్టింది.2014లో శ్రీలంక వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచింది. 
తొలి టీ 20 ప్రపంచ కప్‌లో టీమిండియా సంచలనం
2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ 20 ప్రపంచ కప్‌లో టీమిండియా పెద్ద సంచలనమే సృష్టించింది. ధోనీ నాయకత్వంలోని భారత జట్టు అదరగొట్టింది. అందరూ కుర్రాళ్లతో టోర్నీలో ఎంటరైన భారత్‌...అందరినీ ఆశ్చర్యపరచింది. ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌పై ఆఖరి ఓవర్‌లో సంచలన విజయం సాధించి చరిత్ర సృష్టించింది.
రెండో టీ 20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో పాకిస్థాన్‌ విజయం 
ఆ తర్వాత 2009లో ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన రెండో టీ 20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో పాకిస్థాన్‌ జట్టు...శ్రీలంక జట్టుపై సునాయాస విజయాన్ని నమోదు చేసి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. 
మూడో టీ 20 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ గెలుపు 
2010లో వెస్టిండీస్‌ వేదికగా జరిగిన మూడవ టీ 20 ప్రపంచ కప్‌  ఫైనల్‌లో పాల్‌ కాలింగ్‌వుడ్‌ నాయకత్వంలోని ఇంగ్లండ్‌ జట్టు....చిరకాల ప్రత్యర్ధి ఆస్ట్రేలియా జట్టును చిత్తు చేసి పెద్ద సంచలనమే సృష్టించింది. ఇంగ్లండ్ జట్టు సాధించిన తొలి ఐసీసీ వరల్డ్‌ కప్‌ ఇదే కావడం విశేషం.
నాల్గవ ప్రవంచకప్‌లో వెస్టిండీస్‌ జట్టు విజయం 
ఇక 2012లో శ్రీలంక వేదికగా జరిగిన నాల్గవ ప్రవంచకప్‌లో వెస్టిండీస్‌ జట్టు...ఫైనల్‌లో లంక జట్టుకు షాకిచ్చి టైటిల్‌ను దక్కించుకుంది. కరీబియన్‌ టీమ్‌ 35 ఏళ్ల తర్వాత  ప్రపంచ కప్‌ సొంతం చేసుకుని అరుదైన రికార్డ్‌ నమోదు చేసింది.
2014 టోర్నీలో విజేతగా శ్రీలంక జట్టు 
బంగ్లాదేశ్‌ వేదికగా ముగిసిన 2014 టోర్నీలో....శ్రీలంక జట్టు అనూహ్యంగా విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్‌లో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టును ఓడించి తొలిసారిగా టీ 20 వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచింది.మూడో  సారి ఫైనల్‌ చేరిన శ్రీలంక ఎట్టకేలకు టైటిల్‌ నెగ్గి వెటరన్లు మహేల జయవర్ధనే, కుమార సంగక్కరలకు ఘనమైన వీడ్కోలు పలికింది. 
టీమిండియా చరిత్ర
తొలి టీ 20 వరల్డ్‌ కప్‌ను సొంతం చేసుకున్న జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకూ రెండు సార్లు ఫైనల్‌ చేరుకున్న జట్లుగా భారత్‌,పాకిస్థాన్‌ రికార్డ్‌ నెలకొల్పగా.....మూడు సార్లు ఫైనల్స్‌కు అర్హత సాధించిన ఏకైక జట్టుగా  శ్రీలంక టీమ్‌ రికార్డులకెక్కింది. అంతే కాదు నాలుగు ప్రపంచ కప్‌ టోర్నీల్లోనూ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించిన జట్టుగా పాకిస్థాన్‌ అరుదైన రికార్డ్ సృష్టించింది. 
ఉపఖండ జట్ల హవా
ఇక టీ 20 వరల్డ్‌ కప్‌లో ఇప్పటివరకూ ఉపఖండ జట్ల హవానే కొనసాగింది. ఈ మెగా టోర్నీలో  భారత్‌, శ్రీలంక, పాకిస్థాన్‌ జట్లను మించిన జట్లు లేవనడంలో ఎటువంటి సందేహం లేదు. వరల్డ్‌కప్‌ ట్రాక్‌ రికార్డ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు శ్రీలంక .ఐదు ప్రపంచ కప్‌ పోటీల్లో మొత్తం 31 మ్యాచ్‌లు ఆడిన లంక జట్టు...21 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.  26 మ్యాచ్‌ల్లో 17 విజయాలతో భారత జట్టు రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా జట్లు  మూడు,నాలుగు స్థానాల్లో ఉన్నాయి. 
వ్యక్తిగత రికార్డులు.. శ్రీలంక ఆటగాళ్లదే పై చేయి
ఇక వ్యక్తిగత రికార్డుల్లోనూ శ్రీలంక ఆటగాళ్లదే పై చేయి. బౌలర్ల లిస్ట్ లో లంక యార్కర్ల కింగ్‌ లసిత్‌ మలింగా.....38 వికెట్లతో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. బ్యాట్స్ మెన్‌ లిస్ట్ లో వెటరన్‌ బ్యాట్స్ మెన్‌ మహేల జయవర్ధనే 1016 పరుగులతో అందరి కంటే ముందున్నాడు. మరి ఈ సారి చిట్టి పొట్టి ప్రపంచ కప్‌ సాధించే జట్టేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

 

లండన్ : తాను దేశం విడిచి పారిపోలేదని వ్యాపారవేత్త విజయ్ మాల్యా తెలిపారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు. తనపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు. తాను అంతర్జాతీయ వ్యాపారవేత్తనని.. వ్యాపారం నిమిత్తం లండన్ వచ్చానని పేర్కొన్నారు. బాధ్యత గల ఎంపీగా చట్టానికి లోబడే ఉంటానని విజయ్ మాల్యా తెలిపారు.
 

ఢిల్లీ : కేంద్ర కేబినెట్‌ పులు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం  జరిగిన కేబినెట్‌ భేటీలో  ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకానికి ఆమోదముద్ర లభించింది. ఈ పథకం ద్వారా పేద మహిళలకు ఉచితంగా వంటగ్యాస్‌ కనెక్షన్లు ఇస్తారు.  వచ్చే ఏప్రిల్‌ నుంచి మూడేళ్లపాటు అమలు చేసే ఈ పథకానికి  8 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా 5 కోట్ల మంది మహిళలకు గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తారు. ప్రతి కనెక్షన్‌కు 1600 రూపాయల ఆర్ధిక సహాయం అందచేస్తారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ పథకం కింది లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అప్పగించారు. గ్రామీణ పేద మహిళలకు ఎల్ పిజి అందుబాటులోకి  తీసుకురావడంతోపాటు, ఆహారం  తయారీకి  వంట చెరకు వాడటంతో జరుగుతున్న మరణాలను తగ్గించేందుకు  ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని  ప్రకటించారు. 

 

ఢిల్లీ : తెలంగాణకు కేంద్రం ఏమాత్రం సహకరించడంలేదని నిజామాబాద్ ఎంపీ కవిత విమర్శించారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా లోక్‌సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణలో వెనకబడిన ప్రాంతాలకు 450 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. బడ్జెట్‌లో ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. కవిత ఎఫ్ ఆర్ బిఎం పెంచాలని రెండేళ్లుగా తెలుగు రాష్ట్రాలు కోరుతున్నా స్పందించడంలేదని చెప్పారు. ట్యాక్స్ విధానంలో పద్ధతిలేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు. వన్‌ ర్యాంక్, వన్‌ పెన్షన్‌పై మాట నిలబెట్టుకోలేదన్నారు. కేంద్రం జాతీయ విపత్తు నివారణ నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

 

Pages

Don't Miss