National News

హైదరాబాద్ : ప్రకృతి ధర్మాలు మారిపోతున్నాయి. పురుషుడిగా జన్మించి, ఆపై లింగమార్పిడి చేయించుకున్న ఓ వ్యక్తి గర్భం ధరించి చరిత్ర సృష్టించాడు. ఈ ఘటన ఈక్వెడార్ లో జరిగింది. పుట్టుకతో స్త్రీగా ఉండి లింగమార్పిడి చేయించుకున్న మహిళతో జతకట్టిన ఫెర్నాండో మచాదో తాను గర్భం దాల్చినట్టు ప్రకటించాడు. ప్రపంచంలో ఈ తరహా ఘటనల్లో ఇదే మొదటిదని తెలుస్తోంది. కాగా, వీరిద్దరూ పూర్తి స్థాయి లింగ మార్పిడి కోసం హార్మోనులు తీసుకున్నారని, డెలివరీ సమయంలో ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశాలు లేవని వైద్యులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనపై ఇప్పటివరకూ చర్చి లీడర్స్ స్పందించ లేదు. ఇటీవల అమెరికాలో ట్రాన్స్ జండర్ల వివాహాలను చట్టబద్ధం చేసిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్ : ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ సాయిబాబా మధ్యంతర బెయిల్‌ను నాగ్‌పూర్‌ కోర్టు రద్దు చేయడాన్ని విద్యావేత్తలు, ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తున్నారు. 2014 మే9న ఢిల్లీ యూనివర్శిటీలో ప్రోఫెసర్‌ సాయిబాబాను అరెస్ట్‌ చేశారు. కాని బెయిల్‌ రాకుండా పోలీసులే అడ్డుకుంటున్నారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. సాయిబాబా ఆరోగ్యకారణాల రీత్యా వెంటనే ఆయన్ని విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్ : చెన్నైలో క్రిస్‌మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. అర్థరాత్రి నుంచే క్రైస్తవులు తమ చర్చీల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. దక్షిణాధిలో అతిపెద్ద చర్చిలుగా ప్రఖ్యాతిగాంచిన చెన్నైలోని శాంతోమ్‌, సెయింట్‌ థామస్‌ మౌంట్‌, వేలాంగిణిమాతాలో క్రిస్‌మస్‌ వేడుకలు అంబరాన్నంటాయి. శాంతోమ్‌ చర్చిలో దాదాపు 3 లక్షలమంది క్రిస్టియన్‌ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేసి అరుదైన రికార్డును నెలకొల్పారు.

 

హైదరాబాద్: పార్లమెంట్‌ సభ్యుల వేతనాలను రెట్టింపు చేయాలని పార్లమెంటరీ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. నెలవారీ వేతనం..నియోజకవర్గం అలవెన్సులను డబుల్‌ చేయాలని ప్రపోజ్‌ చేసింది. ప్రస్తుతం ఎంపీల జీతం 50 వేలు. దీనికి అదనంగా మరో రూ. 45 వేలు నియోజకవర్గ భత్యంగా ఇస్తున్నారు.

కొత్త ప్రతిపాదనల ప్రకారం పెరగనున్న ఎంపీల జీతభత్యాలు.......

తాజా ప్రతిపాదనల ప్రకారం ఈ జీత భత్యాలు రెట్టింపు అవ్వనున్నాయి. నెల జీతం 50 వేలు నుంచి లక్షకు పెరుగుతుంది. నియోజకవర్గ భత్యం 45 వేల నుంచి 90 వేలుకు చేరుతుంది. ఈ ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదం లభిస్తే ఎంపీలకు నెలకు రూ. 2.8 లక్షలు అందుతుంది.

మూలవేతనంలో పెంపును వ్యతిరేకిస్తున్న ఎంపీలు!.....

మూలవేతనంలో పెంపుపై ఎక్కువమంది ఎంపీలు ఇంట్రస్ట్ చూపడంలేదని తెలుస్తోంది. బేసిక్‌ను పెంచితే అధిక ఆదాయపన్ను పరిధిలోకి వస్తారనే కారణంతోనే దీన్ని వ్యతిరేకిస్తున్నారని సమాచారం. ఇది ఇలా ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన వేతన కమిషన్‌కే ఎంపీల జీతభత్యాల అంశాన్ని జత చేయాలనే ప్రతిపాదనను ఆర్థికశాఖ పరిశీలిస్తుంది.

ఎంపీల వేతనాలు చివరిసారిగా 2011లో పెంపు......

ఎంపీల వేతనాలను చివరిసారిగా 2011లో సవరించారు. మళ్లీ పార్లమెంట్‌ సభ్యుల వేతనాలను పెంచాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదన తీసుకొచ్చింది. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్‌ సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

హైదరాబాద్ : రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. రెండు రోజుల రష్యా పర్యటనలో భాగంగా ఆయన ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో కలిసి 16వ వార్షిక శిఖరాగ్ర సదస్సు నిర్వహించారు. నిరుడు న్యూఢిల్లీలో జరిగిన 15వ వార్షిక శిఖరాగ్ర సదస్సులోనూ మోడీ భాగస్వామయ్యారు.

ఇరు దేశాలు 16 ఒప్పందాలపై సంతకాలు....

గురువారం జరిగిన సమావేశాల్లో ఇరు దేశాలు 16 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. న్యూక్లియర్‌ రియాక్టర్లు, సోలార్‌ ఎనర్జీ ప్లాంట్లు, రైల్వే, రక్షణ రంగాలకు సంబంధించి ఆ ఒప్పందాలు చేసుకున్నాయి. మేక్‌ ఇన్‌ ఇండియా మంత్రం జపిస్తున్న మోడీ రక్షణ రంగానికి చెందిన కొమోవ్‌ 226 హెలికాప్టర్లను భారత్‌లో నిర్మించబోతున్నట్లు చెప్పారు. మేక్‌ ఇన్ ఇండియాలో భాగంగా రక్షణ రంగానికి సంబంధించి జరుగుతున్న మొదటి అతిపెద్ద ఉత్పత్తి ఇది అని చెప్పారు. ఇక రష్యా సాంకేతిక పరిజ్ఙానంతో కూడిన 12 న్యూక్లియర్‌ రియాక్టర్లను భారత్‌లో రెండు ప్రదేశాల్లో నిర్మించబోతున్నట్లు స్పష్టం చేశారు.

భారత్‌ గొప్ప శక్తివంతంగా బాధ్యతాయుతంగా....

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ మాట్లాడుతూ విదేశీ విధానాల రూపకల్పనలో భారత్‌ గొప్ప శక్తివంతంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని ప్రశంసించారు. ఈ చర్చల వల్ల ఇరు దేశాల స్నేహసంబంధం మరింత బలపడుతుందని అన్నారు. మోడీ పర్యటనలో భాగంగా వ్యాపారాత్మక ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న 10 బిలియన్‌ డాలర్లు అంటే సుమారు 70 వేల కోట్ల వ్యాపారాన్ని రాబోయే పదేళ్లలో మూడింతలకు చేర్చాలని నిర్ణయించారు. రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలర్పించిన సోవియట్ సైనికుల స్మారక చిహ్నం వద్ద మోడీ నివాళులర్పించారు. వెనుక రష్యన్‌ మిలటరీ బ్యాండ్ మోగిస్తుండగా స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచారు.

ఢిల్లీ : మాఫియా డాన్‌ దావుద్‌ ఇబ్రహీం రిటైర్‌ కాబోతున్నాడా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. శనివారం 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న దావుద్‌ ఇక మాఫియా కార్యకలాపాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాడట. తన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. తన సోదరులలో ఒకరిని వారసుడిగా చేయొచ్చని, అందులో అనీస్ అహ్మద్‌కు అవకాశాలు ఎక్కువని తెలుస్తోంది. ఇక దావూద్ గ్యాంగులో అత్యంత కీలకమైన వ్యక్తి, గ్యాంగు సీఈవోగా చెప్పుకునే ఛోటా షకీల్‌కు అతడి స్థానం యథాతథంగా ఉంచుతారని సమాచారం. అయితే ఈ విషయాన్ని అత్యంత సీక్రెట్‌గా ఉంచుతున్నారు. డ్రగ్స్, బెట్టింగ్, హవాలా, ఆయుధాల స్మగ్లింగ్ లాంటి వ్యవహారాల ద్వారా 66 వేల కోట్ల రూపాయలను దావుద్‌ కంపెనీ సామ్రాజ్యం నడిపిస్తోంది. తన అనారోగ్యం కారణంగా డీ కంపెనీ కుప్పకూలకూడదని దావూద్ భావిస్తున్నట్లు తెలిసింది. రాబోయే రెండు మూడేళ్ల పాటు మాత్రమే తాను కూడా ఉండి.. వచ్చేవాళ్లకు కాస్త మార్గదర్శనం చేయాలన్నది దావూద్ ప్లాన్‌గా తెలుస్తోంది. 

త్రిపుర : మున్సిపల్‌ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన వామపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. మొత్తం 19 మున్సిపాలిటీలను సిపిఎం గెలుచుకుంది. అగర్తాల మున్సిపల్ కార్పోరేషన్‌తో పాటు 13 పురపాలక సంస్థలు, ఐదు నగర పంచాయితీల్లో లెఫ్ట్‌ ఫ్రంట్‌ విజయ ఢంకా మోగించింది. డిసెంబర్‌ 9న ఎన్నికలు జరగగా, డిసెంబర్‌ 12న ఫలితాలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా సిపిఎం విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. గ్రామీణ ప్రజలతో పాటు నగర ప్రజలు కూడా మాణిక్‌ సర్కార్‌ ప్రభుత్వంపై విశ్వాసంతో ఉన్నారనడానికి ఈ ఎన్నికలే నిదర్శనమని సిపిఎం నేతలు పేర్కొన్నారు.

ఢిల్లీ : త్వరలో పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు పెరగనున్నాయి. ప్రస్తుతం వారు పొందుతున్న జీత భత్యాలకంటే రెట్టింపు మొత్తంలో వారికి అందనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఇప్పటికే ఆర్థికశాఖకు ప్రతిపాదన చేసినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఎంపీల నెలసరి జీతాలు రెట్టింపును ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఎంపీకి 50 వేలు చెల్లిస్తుండగా అది లక్షకు పెరగనుంది. నియోజకవర్గ అలవెన్సుల కింద 45 వేలు చెల్లిస్తుండగా దానిని 90 వేలు చేయనున్నారు. ఇతర అలవెన్సులతో కలిపి ఎంపీ నెలసరి వేతనం 2 లక్షల 80 వేలకు చేరనుంది. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం లభించాల్సి ఉంది. 2010లో పార్లమెంటు సభ్యులకు జీతభత్యాలు పెంచారు.

ఢిల్లీ : డిడిసిఎలో జరిగిని నిధుల దుర్వినియోగంపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ మరోసారి ఘాటుగా స్పందించారు. నిజాలు చెప్పడమే తాను చేసిన నేరమా అని ప్రశ్నించారు. నా సస్పెన్షన్ కు గల కారణాలేంటో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానమివ్వాలని కీర్తి ఆజాద్‌ డిమాండ్ చేశారు. బిజెపి చీఫ్‌ తనకు జారీ చేసిన నోటీసులో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు తప్ప మరేమీ లేవన్నారు. తాను డిడిసిఎ అక్రమాలపై ప్రశ్నించినందుకే తనపై చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. నేను గత 9 ఏళ్లుగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నానని ఆజాద్‌ స్పష్టం చేశారు.

ఆ ఫైళ్ల కోసమే సిబిఐ దాడులు..
జైట్లీని కాపాడేందుకే డిడిసిఏ ఫైళ్ల కోసం ఢిల్లీ సెక్రటేరియట్‌లో సిబిఐ దాడులు నిర్వహించిందని సిఎం కేజ్రీవాల్‌ గతవారం ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయంపై దాడి చేసినట్టే డిడిసిఏపై సిబిఐ ఎందుకు దాడులు జరపడం లేదని కీర్తి ఆజాద్‌ ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా చేయడానికి డిడిసిఏ నుంచి రెండు బాక్సుల డాక్యుమెంట్లను తీసుకెళ్లారని ఆయన వెల్లడించారు.

బిజెపి సీనియర్ల భేటీ..
మరోవైపు బిజెపి సీనియర్ నేతలు అద్వాని, శాంతకుమార్, యశ్వంత్ సిన్హా ఢిల్లీలోని మురళీ మనోహర్‌ జోషి ఇంట్లో సమావేశమయ్యారు. కీర్తి అజాద్ సస్పెన్షన్‌ విషయంపై వారు మంతనాలు జరిపారు. డిడిసిఎ వ్యవహారంలో జైట్లీపై విచారణకే మార్గదర్శక మండలి మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. బిజెపికి చెందిన మరో సీనియర్‌ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా కీర్తి ఆజాద్‌కు అండగా నిలిచారు. నిజాయితీపరుడైన నేతను పార్టీ కోల్పోవద్దని ఆయన సూచించారు. డిడిసిఏ చీఫ్‌గా జైట్లీ 13 ఏళ్ల కాలంలో ఆర్థిక అక్రమాలు జరిగాయని కీర్తి ఆజాద్‌ సొంతపార్టీకి చెందిన మంత్రిపైనే బహిరంగంగా ఆరోపణలు చేయడంతో ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడింది.

ఢిల్లీ : డీసీసీఏ అక్రమాలపై విచారణ జరిపించాలని ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో అవినీతిని సహించేది లేదని పేర్కొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత పార్టీ ఎంపీ కీర్తీఆజాద్ అవినీతిపై మాట్లాడితే ఎందుకు స్పందించడం లేదని, అవినీతిపై మోడీ మౌనం వీడాలని రాహుల్ పేర్కొన్నారు. మోడీ పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందని తెలిపారు. రాహుల్ తన సొంత నియోజకవర్గమైన అమేథీలో రెండు రోజుల పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. 

ఢిల్లీ : బీజేపీ సీనీయర్ నేతలు మురళీ మనోహర్ జోషి నివాసంలో భేటీ అయ్యారు. వృద్ధనేత అద్వానీ, శాంతకుమార్, యశ్వంత్ సిన్హాలు ఈ భేటీకి హాజరయ్యారు. పార్టీ ఎంపీ కీర్తీ ఆజాద్ సస్పెండ్ పై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. డీసీసీఏ నిధులు దుర్వినియోగంలో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ పాత్ర ఉందని కీర్తి ఆజాద్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. జైట్లీపై ఆరోపణలు చేసినందుకు బీజేపీ అధిష్టానం కీర్తి ఆజాద్ ను పార్టీని నుండి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కీర్తీ ఆజాద్ కు సుబ్రమణ్యస్వామి మద్దతు పలికారు. తనకు నోటీసులు అందాయని, ప్రధాన మంత్రి మోడీ స్పందించాలని కీర్తి ఆజాద్ డిమాండ్ చేశారు. 

ఢిల్లీ : దేశ రాజధానిలో సరి, బేసి నెంబర్ల ఆధారంగా వాహనాల రాకపోకలకు రంగం సిద్ధమవుతోంది. జనవరి 1నుంచి 15వరకూ ట్రయల్‌ రన్‌ నిర్వహించబోతోంది ఢిల్లీ ప్రభుత్వం. ఆ తర్వాత పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. నిబంధనలు అతిక్రమిస్తే 2వేల రూపాయలు ఫైన్‌ కట్టాలంటూ ఆర్డర్ పాస్ చేసింది. ఆదివారం ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది సర్కారు. రాష్ట్రపతి, ప్రధాని వాహనాలు..అంబులెన్స్, ఫైరింజన్‌లకు ఈ రూల్‌ వర్తించదని తెలిపింది. సీఎం వాహనమైనా ఈ నిబంధన పాటించాల్సిందే అన్నారు కేజ్రీవాల్‌. ముందు కార్లకు..ఆ తర్వాత టూవీలర్లకు ఈ నిబంధనలు వర్తింపజేసేలా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. కాలుష్యం తగ్గించేందుకు రిజిస్ట్రేషన్‌ నెంబర్లలో చివరి సంఖ్య ఆధారంగా సరి, బేసి రూల్‌ ప్రవేశపెట్టింది కేజ్రీవాల్‌ సర్కారు.

ఢిల్లీ : రైల్వే శాఖ తత్కాల్ టికెట్ల ఛార్జీలను భారీగా పెంచేసింది. ఇప్పటికే పలుమార్లు ప్లాట్ ఫామ్, ఎక్స్ ప్రెస్ ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ మరోసారి  ఛార్జీలను పెంచింది.  స్లీపర్ క్లాస్ తత్కాల్ బుకింగ్ ఛార్జీ గతంలో 175 ఉండగా ఇప్పుడు దాన్ని 200 కు పెంచారు. థర్డ్ ఏసీ ఛార్జీని 350 నుంచి 400 పెంచారు. స్లీపర్ ఛార్జీ కనీస ధర 90 రూపాయలు ఉండగా దాన్ని 100 రూపాయలకు పెంచుతూ రైల్వే శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు రేపటి నుండి అమలులోకి రానున్నాయి. 

 

ఢిల్లీ : రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోడీ రష్యా వెళ్లారు. మాస్కోలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా ఆదేశ అధ్యక్షుడితో మోడీ భేటీ అయ్యారు. రష్యా, భారత్‌ సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించారు.
మోడీకి ఘనస్వాగతం
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్రమోడీ మాస్కో చేరుకున్నారు. ఆయనకు రష్యా అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా మాస్కోలో ద్వైపాక్షిక వార్షిక సదస్సులో మోడీ పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఏర్పాటుచేసిన విందుకు హాజరుకావడానికి కొన్ని గంటల ముందు ఆ దేశానికి చెందిన టాస్‌ వార్తా సంస్థకు మోదీ ఇంటర్వ్యూ ఇచ్చారు.
భారత్ కు నిజమైన మిత్రదేశంగా రష్యా
భారత దేశానికి నిజమైన మిత్రదేశంగా రష్యా అండగా నిలుస్తున్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు. సంక్షోభ సమయంలో రష్యా తన స్నేహహస్తాన్ని అందిస్తున్నదని ఆయన ప్రశంసించారు. అనంతరం మోదీ.. రష్యా అధ్యక్షుడి పుతిన్‌తో భేటీ అయ్యారు. రష్యా-భారత్ సంబంధాలంపై చర్చించామని భేటీ అనంతరం మోదీ ట్వీట్‌ చేశారు. ఈ సమావేశం ఫలవంతమైందని ప్రధాని పేర్కొన్నారు.
నేడు ఇండియా-రష్యా వార్షిక సమావేశం
గురువారం జరిగే 16వ ఇండియా-రష్యా వార్షిక సమావేశంలో మోడీ, పుతిన్‌లు పాల్గొంటారు. ఆర్థిక, అణుశక్తి, రక్షణ సహకారంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. భారత్‌, రష్యాల మధ్య వాణిజ్య సంబంధాలపైనా మోదీ, పుతిన్‌ చర్చించనున్నారు. ఇరు దేశాలకు చెందిన పలు కంపెనీల సీఈవోలతో వీరు భేటీ అవుతారు.ప్రస్తుతం 10 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రాబోయే పదేళ్లలో 30 బిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇరుదేశాల లీడర్లు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
భారతీయులతో సంభాషణ
గురువారం జరిగే మరో కార్యక్రమంలో మాస్కోలో ఉంటున్న భారతీయులతో మోదీ ముచ్చటిస్తారు. ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.

 

 

ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. విమాన ప్రమాదంలో మృతి చెందిన జవాన్లకు నివాళులర్పించడానికి వెళ్లిన హోంమంత్రిని వారి కుటుంబాలు నిలదీశాయి. జవాన్లకేమో పాత విమానాలు... వివిఐపిలకు కొత్త విమానాలా అంటూ కుటుంబసభ్యులు ప్రశ్నించారు. పాత విమానమే జవాన్ల ప్రాణాలను బలిగొందని ధ్వజమెత్తారు.
సైనికులకు ఎందుకు పాత విమానాలు ఇస్తున్నారు..?
ఢిల్లీలో మంగళవారం జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన జవాన్లకు సఫ్దర్‌ జంగ్‌ విమానాశ్రయంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఎస్‌ఐ రవీందర్‌ కుమార్‌ కూతురు సలోనీ రాజ్ నాథ్‌పైకి ప్రశ్నలు సంధించింది. 'సర్, ఎప్పుడూ సైనికుల కుటుంబాలే ఎందుకు ఏడవాలి? వీఐపీల విమానాల్లో ఎందుకు ఇలా జరగదు? సైనికులకు ఎందుకు పాత విమానాలు ఇస్తున్నారు? నాకు తక్షణమే సమాధానం చెప్పాలంటూ వెక్కివెక్కి ఏడుస్తూ హోంమంత్రిని నిలదీసింది.
బీఎస్ఎఫ్ విభాగానికి కొత్త విమానాలు అవసరం
బీఎస్ఎఫ్ విభాగానికి కొత్త విమానాలు కావాల్సిన అవసరం ఉందని, ప్రమాదానికి గురైన ఈ విమానం ఎంతోకాలం నుంచి వాడుతున్నట్టు తన భర్త తరచూ చెప్పేవారని చనిపోయిన కో పైలెట్ కెప్టెన్‌ రాజేష్‌ శివరెయిన్‌ భార్య తెలిపారు. గత ఏడాది ఆ విమానం వాడేందుకు ఆయన పలుమార్లు నిరాకరించారని పేర్కొన్నారు.
విమానం 20 ఏళ్ల క్రితం నాటిది
ప్రమాదానికి గురైన బీఎస్ఎఫ్ కు చెందిన సూపర్ కింగ్ విమానం 20 ఏళ్ల క్రితం నాటిదని అధికారులు చెబుతున్నారు. ఉదయం విమానం బాగానే ఉందని, సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
విమాన ప్రమాదం... 12 మంది మృతి
బీఎస్ఎఫ్ కు చెందిన సూపర్ కింగ్ చిన్న విమానం రాంచీ హెలికాప్టర్‌ బాగు చేయడానికి వెళ్తూ ఢిల్లీ విమానాశ్రయానికి సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అధికారులతో పాటు పది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జవాన్ల మృతదేహాలను అంతిమ సంస్కారం కోసం వారి కుటుంబాలకు అధికారులు అప్పగించారు.

 

ఢిల్లీ : రుణభారంలో చిక్కుకున్న కన్సస్ట్రక్సన్ కంపెనీలు కొత్త పోకడలు పోతున్నాయి. బ్యాంక్ లకు తాము చెల్లించాల్సిన బకాయిలను ఈక్విటీలుగా మార్చి, వాటాదారులుగా చేర్చుకుంటున్నాయి. జాతీయ రహదారుల పనులు చేపట్టిన పలు కంపెనీలు ఇప్పటికే ఈ బాటపట్టాయి. ఈ కొత్త పరిణామం బ్యాంకింగ్ రంగం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది ఆసక్తికరంగా మారుతోంది.
పెరుగుతున్న నిర్మాణ కంపెనీల రుణభారం
రుణ భారంతో కుంగిపోతున్న నిర్మాణ కంపెనీలు కొత్త వ్యూహాలు అనుసరిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన రుణాలను తిరిగి వసూలు చేసుకోవడంలో అష్టకష్టాలు పడుతున్న బ్యాంక్ లు కూడా కొత్త పంథాను అనుసరిస్తున్నాయి. ఇటు అప్పులిచ్చినవారు, అటు అప్పు తీర్చాల్సిన వారు ఒకేరకంగా ఆలోచిస్తుండడంతో కొత్త ట్రెండ్ మొదలవుతోంది. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టే ఐవీఆర్ సీఎల్ ఉదంతమే ఇందుకు తాజా ఉదాహరణ. ఈ కంపెనీకి 7,500 కోట్ల రూపాయలకు పైగా అప్పులున్నాయి. ఎస్ బీ ఐ, ఐడీబీఐలలో రుణాలున్నాయి. దీంతో ఈ బ్యాంక్ లు ఐవీఆర్ సీఎల్ చెల్లించాల్సిన రుణాలను ఈక్విటీలుగా మార్చుకుంటున్నాయి.
కొత్త ట్రెండ్ కి సంకేతాలు
గత ఆగస్టులో గామన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించింది. తాను చేపట్టిన తొమ్మిది రోడ్డు ప్రాజెక్ట్ లలో ఆరింటిని బీఐఎఫ్ ఇండియా హోల్డింగ్స్ ప్రయివేట్ లిమిటెడ్ కి విక్రయించింది. ఈ డీల్ విలువ 563 కోట్లు రూపాయలు. గామన్ ఇండియా లిమిటెడ్ కి అప్పులిచ్చిన సంస్థలు గత నవంబర్ లో దాదాపు 15వేల కోట్ల రూపాయల రుణాన్ని ఈక్విటీల కిందకు మార్చుకున్నాయి. ఈ ఉదాహరణలు రుణదాతలు, రుణ గ్రహీతలు సృష్టిస్తున్న కొత్త ట్రెండ్ కి సంకేతాలు.
నిర్మించు-నిర్వహించు-బదలాయించు పద్ధతిలో రోడ్డు ప్రాజెక్ట్ లు
ఐవీఆర్ సీఎల్, గామన్ లాంటి సంస్థలు నిర్మించు - నిర్వహించు - బదలాయించు పద్ధతిలో రోడ్డు ప్రాజెక్ట్ లు చేపట్టాయి. ఈ పద్ధతిలో నిర్మాణం పనులు చేపట్టిన సంస్థకు ప్రభుత్వం ఎలాంటి చెల్లింపులు చేయదు. నిర్మాణ సంస్థ టోల్ గేట్స్ ద్వారా తాను పెట్టిన ఖర్చులు, లాభాలు రాబట్టుకోవాల్సి వుంటుంది. ఒప్పంద కాలం ముగిసిన తర్వాత తాను చేపట్టిన నిర్మాణాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి వుంటుంది. బీవోటీ పద్ధతిలో చేపట్టిన పనులు నిర్మాణ సంస్థలకు లాభాలు సంపాదించకపోగా, వాటి రుణభారాన్ని పెంచుతున్నాయి. ఈ తరహా ప్రాజెక్ట్ లకు ఇచ్చిన రుణాలు వసూలు కాక బ్యాంక్ లు గుడ్లు తేలేస్తున్నాయి. . 2010 12 మధ్య కాలంలో 7500 కిలోమీటర్ల పొడవైన హై వేల నిర్మాణ పనులకిచ్చిన రుణాలు ఇప్పుడు హై రిస్క్ గ్రూపులో చేరిపోయాయి.
బీవోటి పద్ధతిపై నిర్మాణ సంస్థలు అనాసక్తి
వివిధ శాఖల నుంచి నిర్మాణ అనుమతులు త్వరితగతిన రాకపోవడం, భూ సేకరణలో జాప్యం, నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాకపోవడం, కోర్టు కేసులు మొదలైన కారణాలతో నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోందనీ, టోల్ గేట్ ద్వారా ఆదాయాలు రాబట్టుకోవడానికి ఎక్కువ టైమ్ పడుతోందని, దీంతో వడ్డీల భారం పెరుగుతోందని నిర్మాణ సంస్థలు వాపోతున్నాయి. పెట్టుబడులు ఇరుక్కుపోవడం వల్ల కొత్తగా చేపట్టే ప్రాజెక్ట్ లకు నిధుల కొరత సమస్య కూడా ఉత్పన్నమవుతోంది. దీంతో బీవోటి పద్ధతిపై పనులు చేపట్టేందుకు నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపడం లేదు. ఈ పీసీ పద్ధతికే ప్రాధాన్యత ఇస్తున్నాయి.
నేషనల్ హైవే అథార్టీకి తలనొప్పిగా నిధుల సమీకరణ
గత రెండేళ్లలో హైవే పనుల్లో 80శాతం ఈపీసీ పద్ధతిలో చేపట్టగా, బీవోటీ పద్ధతిలో చేపట్టినవి 15, 20శాతానికే పరిమితమయ్యాయి. అయితే ఈపీసీ పద్ధతిలో చేపట్టే పనులకు నిధులు సమకూర్చడం నేషనల్ హైవే అథార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనుల కు కేటాయించిన మొత్తం దాదాపు 23, 691 కోట్ల రూపాయలు కాగా నేషనల్ హై వే అథార్టీ 6, 208 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలిగినట్టు పార్లమెంటరీ ప్యానెల్ సమీక్షలో తేలింది. దీంతో బీవోటీ, ఈపీసీ పద్ధతులకు బదులుగా ప్రాజెక్ట్ వ్యయంలో 40శాతాన్ని గ్రాంట్ రూపంలో సమకూర్చే పద్ధతిని గత అక్టోబర్ లో ప్రవేశపెట్టారు. మరోవైపు, బీవోటీ పద్ధతిలో హై వే పనులు చేపట్టిన సంస్థలు నిర్మాణం పూర్తయిన రెండేళ్ల తర్వాత వంద శాతం ఈక్విటీలు అమ్ముకునే ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ గత ఆగస్టులోనే క్లియరెన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఈ అవకాశాన్ని నిర్మాణ సంస్థలు ఉపయోగించుకోవడానికి ఉత్సుకతచూపిస్తున్నాయనడానికి ఐవీఆర్ సీఎల్, గామన్ సంస్థలే నిదర్శనం.

 

 

 

 

 

ఢిల్లీ : డీడీసీఏ వ్యవహారంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ ను బీజేపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. జైట్లీ ఢిల్లీ క్రికెట్ సంఘం ఛైర్మన్ గా ఉన్న సమయంలో అవకతవకలు జరిగాయంటూ ఆప్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాంలో జైట్లీపై సొంత పార్టీ ఎంపీ అయిన కీర్తి ఆజాద్ కూడా ఆరోపణలు చేయడంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై బీజేపీ సీనియర్ నేతలు హెచ్చరించినా ఆయన వెనక్కి తగ్గలేదు. కీర్తి ఆజాద్ బీహార్ లోని దర్భాంగ లోక్ సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ స్థానం నుండి మూడు సార్లు గెలిచారు. ఆయన తండ్రి భగవత్ ఝూ ఆజాద్ బీహార్ మాజీ సీఎంగా వ్యవహరించారు. క్రికెటర్ గా మంచి పేరున్న ఆజాద్ 1983 ప్రపంచకప్ ను సాధించిన జట్టులో సభ్యుడుగా ఉన్నారు. 

హైదరాబాద్ : కర్నాటక సీఐటీయూ కార్యదర్శి ప్రసన్నకుమార్ మృతి పట్ల సీఐటీయూ తెలంగాణ కమిటీ సంతాపం తెలియచేసింది. హైదరాబాద్ లోని కార్యాలయంలో కార్మిక సంఘం నేతలు సంతాప సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రసన్నకుమార్ మరణం కార్మిక ఉద్యమానికి తీరని లోటని సీఐటీయూ జాతీయ కార్యదర్శి సుధా భాస్కర్ తెలిపారు. కర్నాటకలోని కార్మికుల సమస్యల పరిష్కారం ప్రసన్నకుమార్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. 

ఢిల్లీ : రైతుల ఆత్మహత్యలు జరుగుతుండగా అయిత చండీయాగం నిర్వహించడం ఏంటనీ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ మండిపడింది. దిగ్విజయ్ సింగ్ పాలించిన మధ్యప్రదేశ్ లోనే రైతుల ఆత్మహత్యలు అధికంగా జరుగుతున్నాయని ఆ పార్టీ ఎంపీ వినోద్ పేర్కొన్నారు. ముందుగా అక్కడి పరిస్థితిని చూసుకోవాలని సూచించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని తెలిపారు. కేసీఆర్ నిర్వహిస్తున్న అయిత చండీగాయానికి ప్రభుత్వానికి మధ్య సంబంధం లేదన్నారు. యాగానికి ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదని ఎంపీ వినోద్ తెలిపారు.

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రష్యా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మాస్కోలో ద్వైపాక్షిక వార్షిక సదస్సులో మోడీ పాల్గొననున్నారు. అణు, హైడ్రో కార్బన్ లు, రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోడీ చర్చలు జరుపనున్నారు. రష్యా పర్యటన పట్ల తాను ఎంతో ఆశావాహకంగా ఉన్నట్లు మోడీ తెలిపారు. భారత్, రష్యా దేశాల మధ్య సంబంధాలు ఎంత గొప్పవో చరిత్ర చెబుతుందని, ప్రపంచంలోనే భారత్ కు రష్యా అత్యంత కీలక మిత్రదేశమని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు రష్యా వ్యాపారులను ఆహ్వానిస్తానని మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

ఢిల్లీ : దేశ రాజధానియైన ఢిల్లీలో కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. దండగులు పది రౌండ్ల కాల్పులు జరపడంతో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన కర్కర్ డుమా మెట్రోపాలిటన్ కోర్టు ఆవరణలో చోటు చేసుకుంది. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కోర్టు ఆవరణలో ప్రవేశించారు. అనంతరం 83వ గదికి చేరుకుని విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో రామ్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ కు మూడు బుల్లెట్లు దూసుకపోవడంతో అక్కడికక్కడనే దుర్మరణం చెందగా ఇర్ఫాన్ తో పాటు కోర్టులో పనిచేసే క్లర్క్ కి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జడ్జి సురక్షితంగా ఈ దాడి నుండి బయటపడ్డారు. అండర్ ట్రయల్ చెలు పహిల్వాన్ అలియాస్ ఇర్ఫాన్ టార్గెట్ గా ప్రత్యర్థి వర్గం కాల్పులకు దిగినట్లు తెలుస్తోంది. కాల్పులకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్ : లోక్ సభలో పది బిల్లులపై టీఆర్ఎస్ ఎంపీలు చర్చించినట్లు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ పేర్కొన్నారు. లోక్ సభ నిరవధికంగా వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరు ప్రైవేటు బిల్లులను ప్రవేశ పెట్టినట్లు, రాష్ట్రం విడిపోయిన అనంతరం శాసనసభలో సీట్ల సంఖ్యను పెంచుకొనే వెసులు బాటు ఇవ్వాలని బిల్లులు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. విభజన చట్టం చెప్పినా హైకోర్టు విభజన ఇంకా జరగలేదని, అంతేగాక సమయం పొందుపర్చలేదన్నారు. హైకోర్టు విభజన కోసం ప్రైవేటు బిల్లును ప్రవేశ పెట్టడం జరిగిందని ఎంపీ వినోద్ పేర్కొన్నారు. 

ఢిల్లీ : హస్తిలో ఆప్‌ కార్యకర్తలు  కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ నివాసం దగ్గర  నిరసన వ్యక్తం చేశారు. డీడీసీఏ వ్యవహారంలో జైట్లీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.  బ్యారికేడ్లను చేధించుకుని ఆయన  నివాసం వైపు చొచ్చుకు పోయేందుకు ప్రయత్నించిన ఆప్‌ కార్యకర్తలపై పోలీసులు జల ఫిరంగులు  ప్రయోగించారు. అరుణ్‌ జైట్లీ 1999-2013 మధ్య డీడీసీఏ అధ్యక్షుడుగా పని చేశారు.  ఆయన హయాంలో ఆర్ధిక అవకతవకలు జరిగాయని ఆప్‌ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై కేజ్రీవాల్‌ సర్కార్‌  న్యాయ విచారణకు కూడా ఆదేశించారు. దీనికి ప్రతిగా అరుణ్‌ జైట్లీ...  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాలతోపాటు, ఆ పార్టీకి చెందిన ఐదుగురు నేతలపై 10 కోట్ల రూపాయలకు ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. పటియాల హౌస్‌ కోర్టులో క్రిమిల్‌ కేసు దాఖలు చేశారు. 

ఢిల్లీ : ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మోదీ ఇవాళ రష్యా వెళుతున్నారు. అణువిద్యుత్తు, రక్షణ ఒప్పందాలే కీలక ఎజెండాలుగా ఆయన రష్యాలో పర్యటిస్తున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ భేటీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రష్యా పర్యటనకు వెళుతున్నారు. బుధ,గురువారాల్లో ఆయన రష్యాలో పర్యటిస్తారు. బుధవారం ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో మోదీ మాస్కాలో సమావేశమవుతారు. ఈ సమావేశం అనంతరం రక్షణ, అణుశక్తికి సంబంధించి పలు ఒప్పందాలపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేసే అవకాశముంది.
ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగా ప్రధాని పర్యటన
దశాబ్ధన్నర కాలంగా, భారత్‌, రష్యాల మధ్య సహాయ సహకారాలకు సంబంధించి జరుగుతున్న ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగానే ప్రధాని ఈ పర్యటన చేస్తున్నారు. రక్షణ, అణుశక్తి రంగాలకు సంబంధించిన పలు అంశాలను ఇరు దేశాల అధినేతలు చర్చించనున్నారు.
వాణిజ్య సహకారంపైనా చర్చ
భారత్‌, రష్యాల మధ్య వాణిజ్య సహకారంపైనా మోదీ, పుతిన్‌ చర్చించనున్నారు. ఇరు దేశాలకు చెందిన పలు కంపెనీల సీఈవోలతో వీరు భేటీ అవుతారు.ప్రస్తుతం 10 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రాబోయే పదేళ్లలో 30 బిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇరుదేశాల లీడర్లు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.ఇది ఇలా ఉంటే పాకిస్తాన్‌కు రక్షణ హెలికాప్టర్లను సరఫరా చేయాలని రష్యా భావిస్తున్న నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
అంతర్జాతీయ పరిణామాలపై సమాలోచనలు!
అంతర్జాతీయ పరిణామాలపైనా మోదీ, పుతిన్‌ చర్చిస్తారు. సిరియాలో తాజా పరిస్థితితో పాటు తీవ్రవాదానికి అడ్డుకట్టవేయడంపైనా రెండు దేశాల నేతలు సమాలోచనలు జరిపే అవకాశముంది. ఈ భేటీ అనంతరం రష్యా అధ్యక్షుడు ఇచ్చే విందు కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. గురువారం జరిగే మరో కార్యక్రమంలో మాస్కోలో ఉంటున్న భారతీయులతో మోడీ ముచ్చటిస్తారు.

 

 

ఢిల్లీ : నిర్భయ కేసులో జువెనైల్‌ నేరస్థుడి విడుదలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో రాజ్యసభలో జువెనైల్‌ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు పాసైంది. దీంతో బాల నేరస్థుడి వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గనుంది. ఇకపై 16 ఏళ్లు దాటిన వారు నేరం చేస్తే పెద్దవాళ్లకు పడే శిక్ష అమలు కానుంది. హత్య, అత్యాచారం, యాసిడ్‌ దాడులు, ఉగ్రవాద చర్యలు లాంటి తీవ్ర నేరాలకు పాల్పడే వారికి ఈ చట్టం వర్తిస్తుంది.

సీపీఎం అభ్యంతరం..
జువెనైల్‌ చట్ట సవరణ బిల్లును ఆదర బాదరాగా ఆమోదం తెలపడంపై సీపీఎం అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్భయ సెంటిమెంట్‌ ఆధారంగా చట్టంలో మార్పు తేవద్దని, సమగ్రమైన అవగాహన, చర్చల ద్వారా చట్టంలో మార్పు తేవాలని ఆ పార్టీ సభ్యుడు ఏచూరి సూచించారు. బాల నేరస్థుల సవరణ చట్టాన్ని సెలెక్ట్‌ కమిటీకి పంపాలని డిమాండ్‌ చేశారు. 14, 15 ఏళ్ల వయసు బాలుడు తీవ్రమైన నేరాలకు పాల్పడితే మళ్లీ చట్టాన్ని సవరిస్తారా అని ప్రశ్నించారు. నేరాల ఆధారంగా శిక్షలుండాలి కానీ, వయో పరిమితిని బట్టి కాదన్నారు. అయితే తాము సవరణ బిల్లుకు వ్యతిరేకం కాదని ఏచూరి తెలిపారు.

కాంగ్రెస్ పలు విమర్శలు..
అంతకుముందు జువెనైల్‌ చట్ట సవరణ బిల్లును కేంద్రమంత్రి మేనకా గాంధీ రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. దేశంలో జువెనైల్ నేరాలు చాలా వేగంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో పటిష్టమైన చట్టాన్ని తీసుకు రావలసిన అవసరం ఉందన్నారు. ఇవాళ 18 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలు చాలా తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. నిర్భయ కేసులో జువెనైల్‌ నేరస్థుడి విడుదలపై వ్యతిరేకత రావడంతో కేంద్రం హడావిడిగా బిల్లు పాస్‌ చేయాలని చూస్తోందని కాంగ్రెస్‌ విపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ అన్నారు. దేశంలో నిర్భయ లాంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకే జ్యోతిసింగ్‌ తల్లి పోరాడుతున్నట్టు ఆజాద్‌ తెలిపారు. బాల నేరస్థులకు, తీవ్ర నేరాలకు పాల్పడిన వారికి వేర్వేరు జైళ్లు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తీవ్ర నేరాలకు పాల్పడిన వారితో బాల నేరస్థులను కలిపి ఉంచినట్టయితే వారు పెద్ద నేరస్థుడిగా బయటకు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. తాము చేసిన తప్పులకు పశ్చాత్తాపడే విధంగా వారికి ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయాలని ఆజాద్‌ సూచించారు.

2012లో నిర్భయ ఘటన..
చర్చలో భాగంగా తృణముల్ పార్టీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బాధితురాలు నిర్భయ స్థానంలో ఒకవేళ తన కూతురు కనుక ఉండి ఉంటే.. నిందితులను అప్పుడే తుపాకితో కాల్చి చంపేవాడినని ఆగ్రహంతో అన్నారు. దేశ ప్రజలు కోరుకుంటున్న ఈ బిల్లు ఎంతో బాగుందని, ఎలాంటి నిరీక్షణ లేకుండా తక్షణమే పాస్‌ చేయాలన్నారు. వయసును తగ్గించాలన్ని అంశం ప్రధానం కాదని, ఈ నేరాల వెనక గల కారణాలను వెతకాలని, ఈ బిల్లుపై తొందరపాటు కుదరదని, సెలెక్ట్‌ కమిటికి పంపాలని మరికొందరు సభ్యులు అభిప్రాయపడ్డారు. 2012 డిసెంబర్‌లో జరిగిన నిర్భయ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. రాజ్యసభలో చర్చ సందర్భంగా జ్యోతిసింగ్‌ పేరెంట్స్‌ సభలో ఉన్నారు. జువెనైల్‌ చట్టు సవరణ బిల్లు పాస్‌ కావడంపై నిర్భయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. 

మహారాష్ట్ర : ప్రాణహిత బ్యారేజీలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు మంత్రి హరీశ్ రావు... డిసెంబర్‌ 29, 30న జరగబోయే ప్రాణహిత ఇంటర్‌స్టేట్‌ బోర్డ్ సమావేశంలో సాంకేతిక అంశాలు చర్చించాలంటూ నిర్ణయించారు.. తమ్మిడి హట్టి దగ్గర 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర సూత్రప్రాయంగా అంగీకరించిందని హరీశ్ రావు తెలిపారు.. మేడిగడ్డ బ్యారేజీ మార్పులపై బోర్డు మీటింగ్‌లో తమ నిర్ణయం తెలియజేస్తామని మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్‌ చెప్పారని హరీశ్ రావు వివరించారు.

<p><strong>ఢిల్లీ :</strong> అమెరికాలో తెలుగు విద్యార్థులకు వీసా వివాదంపై కేంద్రమంత్రి అశోక గజపతి రాజు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి... విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ ను కలిశారు. అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులను వెనక్కి పంపించిన అంశంపై చర్చించారు. వీలైనంత త్వరగా అమెరికాలో బ్లాక్ లిస్ట్‌లో ఉన్న</p><p>యూనివర్సిటీల వివరాలు తెప్పిస్తామని అశోక గజపతి రాజు హామీ ఇచ్చారు. విద్యార్థులు తొందరపడకుండా.. అనుమతులున్న యూనివర్సిటీలనే ఎన్నుకోవాలని కంభంపాటి సూచించారు.&nbsp;</p>

Pages

Don't Miss