National News

హైదరాబాద్ : ఆర్జేడి చీఫ్‌ లాలూప్రసాద్‌ యాదవ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. బీహార్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోతిహరి ఎన్నికల సభా వేదికపై లాలూ ఆసీనులై ఉండగా పైనుంచి సీలింగ్‌ ఫ్యాన్‌ ఊడి పడింది. ఆ ఫ్యాన్‌ లాలూ చేతిని తగులుకుంటూ పక్క కుర్చీలో పడడంతో ప్రమాదం తప్పింది. ఆయన పక్క కుర్చీలో ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. పోలీసుల వైఫల్యమే కారణమని లాలూ ఆరోపించారు.

హైదరాబాద్ : నగరం మరో ఇంటర్నేషనల్ ఈవెంట్ కు వేదిక కానుంది. వచ్చేనెల 14 నుంచి 20 వరకు 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ వేడుకలను ఇక్కడ నిర్వహించనున్నారు. శిల్పకళా వేదికలో నిర్వహించడానికి తెలంగాణ సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ పోటీల్లో ఎంపికైన 1204 సినిమాలను ఈ ఈవెంట్ లో ప్రదర్శించనున్నారు. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు. చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్‌కు హైదరాబాద్‌ను శాశ్వత వేదిక చేయాలనుకుంటున్నామని మంత్రి చెప్పారు.

ఢిల్లీ : అన్ని రంగాల్లోనూ పారదర్శకత ఆవశ్యకమని ప్రధాని నరేంద్రమోడీ అభిప్రాయపడ్డారు. కేంద్ర సమాచార కమిషన్‌ దశాబ్ద కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన సదస్సులో మోడీ ప్రసంగించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకి భద్రతా కారణాల దృష్ట్యా ఆహ్వానించలేదు. దీంతో ఆర్టీఐ ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ ఆర్టీఐ యాక్టివిస్టు అరుణా రాయ్‌ సైతం ఈ సదస్సుకి హాజరుకాలేదు. పారదర్శక చట్టంపై నిర్వహించిన ఈ సదస్సును లోకేష్ బత్రా, వెంకటేష్‌ నాయక్‌, అంజలి భరద్వాజ్‌, నిఖిల్‌ డే బాయకాట్‌ చేశారు.

 

ఢిల్లీ : సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆహ్వానిస్తున్నామని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు. ఎన్‌జేఏసీ రద్దుపై కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటామని ఈ సదానంద తెలిపారు. తర్వాతి పరిణామాలపై ప్రధానితోనూ, న్యాయశాఖకు చెందిన నిపుణులతోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటామని సదానంద తెలిపారు.

 

హైదరాబాద్ : ఉపాధి హామీతో ఉపాధి కల్పిస్తామంటూనే కొత్త మెలికలతో కూలీల ఉసురు తీస్తోంది కేంద్రం.. పనిదినాలు పెంచుతామంటూనే మరో చేత్తో కరువు మండలాల్లోనే పెంచుతామంటూ కూలీల కడుపుకొడుతోంది. గతంలో జాతీయ ఉపాధి హామీ పథకం అమలయ్యే మండలాల సంఖ్యను తగ్గించి అసలు పథకం ఉద్దేశ్యాన్నే పథకం ప్రకారం పక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది మోడీ సర్కార్.. ఇప్పుడు మండలాలు ప్రకటించకుండా.. ఉపాధి హామీ కూలీలకు పని దినాలు పెంచుతామని ప్రకటన చేసింది.. పనిదినాలు పెరుగుతున్నాయని అందరూ సంతోషపడ్డారు.. అయితే కేవలం కరవు మండలాలు గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించే మండలాల్లో మాత్రమే పనిదినాలు పెంపు నిబంధన వర్తింపజేస్తామంటూ కొత్త మెలిక పెట్టింది.. మరీ మిగతా మండలాల్లో పరిస్థితి ఏంటీ?
పేదలకు ఆసరాగా ఉపాధి హామీ
దారిద్ర్య రేఖకు దిగువనున్న పేదలకు ఉపాధి హామీకి ఆసరాగా నిలుస్తోంది.. అయితే దేశంలో కరవు ఛాయలు ఏర్పడిన రాష్ట్రాల్లో పనిదినాలను 100 నుంచి 150 రోజులకు పెంచుతామని కేంద్రం ప్రకటించింది.. కానీ అది కరవు మండలాల్లోనే అంటూ ఇచ్చిన తాజా ఆదేశం మిగతా మండలాల్లో బడుగు జీవులపై తీవ్ర ప్రభావం చూపనుంది.. తెలంగాణ రాష్ట్రానికి సంబందించి ఇప్పటి వరకు కరవు మండలాల ప్రకటనే జరగలేదు... ఆచార్య జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ 261 మండలాల్లో కరవు ఉందని అంచనా వేసింది. అలాగే వాతావరణ శాఖ 218 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించింది కానీ ప్రభుత్వానికి కరవు మండలాలు 60 యేనంటూ కలెక్టర్లు నివేదిక ఇచ్చినట్లు వార్తలొచ్చాయి.. దీంతో ఉపాధి కూలీల్లో గందరగోళం నెలకొంది.
కేంద్రానికి అందని నివేదికలు...
ఇంతవరకు కరువును అంచనా వేయడం, మండలాలను గుర్తించడం, ఆ వివరాలను రాష్ట్ర మంత్రివర్గం ఎదుట పెట్టడం తదితర పనులేవీ జరగలేదు. పూర్తి వివరాలతో కేంద్రానికి నివేదిక పంపే ప్రక్రియ దాదాపుగా ఆగిపోయినట్టుగా కనిపిస్తోంది. ఆయా జిల్లాలకు సంబంధించిన వర్షాభావ పరిస్థితులు, పంటలు ఎండిపోవడం, నష్టపరిహారం, ఇతర అంశాలకు సంబంధించి తాత్కాలిక నివేదికలు మాత్రమే జిల్లా కలెక్టర్ల నుంచి ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం. రాష్ట్ర మంత్రివర్గం ఆ నివేదికను పరిశీలించి, ఆమోదించిన తరువాతే కేంద్రానికి పంపాల్సి ఉంటుంది.
9 జిల్లాల్లో ఉపాధి హామీ పనులు
రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని 440 మండలాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద పనులు జరుగుతున్నాయి. మొత్తం కూలీల్లో దాదాపు 72వేల మంది 100 రోజుల పనిదినాలు పూర్తి చేశారు. ఇది ఈనెలాఖరుకు లక్షకి చేరే అవకాశం ఉన్నట్లు అధికారిక సమాచారం. ఈ లెక్కన రోజుకు ఒక కూలీకి 180 రూపాయిల చొప్పున లక్ష మందికి అదనంగా వచ్చే 50 రోజులకుగాను 100 కోట్ల మేర నిధులు అవసరమవుతాయి. ప్రభుత్వం కరువు నివేదికను కేంద్రానికి పంపితేనే నిధులు విడుదలవుతాయి..
కేంద్రం కొత్త షరతులు విధించడంపై విమర్శలు
నల్లగొండ, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌, రంగారెడ్డి జిల్లాల పరిస్థితి దారుణంగా మారింది. అప్పుడే అక్కడక్కడా వలసలు ప్రారంభమయ్యాయి.. రైతుల ఆత్మహత్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయి.. కరవు, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో సరైన సలహా, భరోసా లేకపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. ఇలాంటి సందర్భంలో ఆసరాగా నిలవాల్సిన ఉపాధి హామీ పథకంపై కేంద్రం కొత్త షరతులు విధించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి..

 

ఢిల్లీ : ఎన్ డిఎ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. పాత పద్ధతిలోనే జడ్జీల నియామకం జరగాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ) రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీల కోసం గతంలో ఉన్న కొలీజియం వ్యవస్థస్థానంలో మోడీ సర్కారు ఎన్‌జేఏసీని తీసుకువచ్చింది. దీన్ని సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని పరిశీలించిన సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.... జడ్డీల నియాయకంపై ఇవాళ తుది తీర్పు వెల్లడించింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది. కొలీజియం వ్యవస్థను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. జడ్జీల నియామకం విషయంలో గతంలోని కొలీజియం వ్యవస్థనే కొనసాగించాలని కోర్టు తెలిపింది. నేషనల్ జ్యుడీయల్ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగం విరుద్ధమని స్పష్టం చేసింది. జడ్డీల నియామకంలో కేంద్రం జోక్యం.. న్యాయవ్యవస్థకు మంచిది కాదని ధర్మాసనం హితవుపలికింది. 

చండీఘర్ : వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేయడం బీజేపీ నేతలకు పరిపాటి అయింది. అనునిత్యం ఏదో ఒక అంశంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ముస్లీంలపై వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. దాద్రీ ఘటన చేసిన గాయంపై బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ వరుసలో హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టార్‌ వచ్చి చేరారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది గడిచిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఖట్టర్‌ మాట్లాడుతూ, ముస్లిం మతస్తులు ఈ దేశంలో ఉండాలంటే గొడ్డు మాంసం తినడం మానివేయాలంటూ ప్రకటించారు. దేశంలో మెజారిటీ మతస్తులకు ఆవు పవిత్ర జంతువని అందుకే గొడ్డుమాంసం తినడం మానివేయాలంటూ తెలిపారు. అంతేకాదు దాద్రీ ఘటన కేవలం అవగాహానాలోపంతోనే జరిగిందని ఖట్టర్‌ అన్నారు. అలాగే దాద్రీ ఘటనలో మృతి చెందిన అఖ్లాక్‌.. ఆవుపై చులకనగా మాట్లాడారని మెజారిటీ మనోభావాలు దెబ్బతిన్నందుకే దాడి జరిగిందని భాష్యం చెప్పారు. అంతేకాదు బీఫ్‌ తినడం రాజ్యాంగానికి విరుద్ధమని ఖట్టర్‌ తెలిపారు.

 

ఢిల్లీ :  భారత్‌లో మత స్వేచ్ఛ కరువైందని అమెరికా పేర్కొంది. మతపరమైన ఘర్షణలు, హత్యలు పెరిగిపోయాయని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛకు సంబంధించిన రిపోర్టులో ఈ విషయాలు వెల్లడించింది. మతపరమైన ఘర్షణలు ఆపడంలో పోలీసులు కూడా విఫలమయ్యారని తెలిపింది.
'అంతర్జాతీయ మత స్వేచ్ఛ' నివేదిక విడుదల
2014 సంవత్సరానికి సంబంధించిన 'అంతర్జాతీయ మత స్వేచ్ఛ' నివేదికను అమెరికా విడుదల చేసింది. భారత్‌లో మత స్వేచ్ఛ హరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. మత మార్పిడులు, మతపరమైన హత్యలు, ఘర్షణలు, అరెస్ట్‌లతో భారత్‌లో ఉద్రిక్తత పరిస్తితులు చోటు చేసుకున్నాయని తన వార్షిక నివేదికలో పేర్కొంది. అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ ఈ రిపోర్టును విడుదల చేశారు. ప్రభుత్వంలో ఉన్న కొందరు ప్రతినిధులు మైనారిటీల పట్ల వివక్షపూరిత ప్రకటనలు చేశారని వెల్లడించింది.
మత ఘర్షణలను అరికట్టడంలో పోలీసులు విఫలం
కొన్ని సందర్భాల్లో మత ఘర్షణలను అరికట్టడంలో స్థానిక పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని అమెరికా తెలిపింది. ఘర్‌ వాప్‌సీ పేరిట బలవంతపు మత మార్పిడులు, చర్చిలపై, మైనారిటీలపై జరిగిన దాడులను ఆపడంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపించింది. 2014 మే నుంచి డిసెంబర్‌ నెలాఖరు వరకు భారత్‌లో మతపరమైన దాడులు 8 వందలకు పైగా చోటుచోసుకున్నాయని 'యాక్ట్‌ నౌ ఫర్‌ హార్మనీ అండ్‌ డెమాక్రసీ' అనే స్వచ్చంధ సంస్థ వెల్లడించింది.
నిరంజన్‌ జ్యోతి వివాదస్పద వ్యాఖ్యలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్రమంత్రి నిరంజన్‌ జ్యోతి మైనారిటీలను ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై విమర్శలు రావడంతో ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోది వివరణ ఇచ్చిన విషయాన్ని కూడా రిపోర్టు ఉదహరించింది. 1984 లో జరిగిన సిక్కులపై దాడులు, 2002 గుజరాత్‌ అల్లర్లకు సంబంధించిన వందలాది కేసులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని రిపోర్ట్‌ తెలిపింది.

 

పాట్నా : బీహార్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలు నేడు జరగనున్నాయి. మొత్తం 32 నియోజకవర్గాల్లో 456 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ దశ ఎన్నికల్లో ఆరు నక్సల్స్ జిల్లాలు కైమూర్, రోహతస్, ఆర్వాల్, జెహానాబాద్, ఔరంగాబాద్, గయా ఉండటంతో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 23 నియోజక వర్గాలు ఈ జిల్లాల్లోనే ఉన్నాయి. ఈ జిల్లాలన్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావటంతో పోలింగ్ సమయాలను గంట నుంచి రెండు గంటలు తగ్గించారు. మొత్తం 32 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవుతుంది. అయితే 11 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3గంటలకు, 12స్థానాల్లో సాయంత్రం 4గంటలకు పోలింగ్ ముగిసిపోతుంది. కేవలం 9 నియోజక వర్గాల్లో మాత్రమే సాయంత్రం 5గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. ఈ నియోజకవర్గాల్లో 993 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు. నేడు ఎన్నికలు జరగనున్న ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానమైన ఇమామ్‌గంజ్ నుంచి మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామ్ మోర్చా నేత జితన్ రామ్ మాంఝీ పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్, జేడీయూ నేత ఉదయ్‌నారాయణ్ చౌదురీ మాంఝీని ఈ నియోజకవర్గంలో ఎదుర్కొంటున్నారు. రెండో దశ ఎన్నికల్లో కుల ప్రభావమే అధికంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

ఫేస్ బుక్ వ్యసనం.. ఓ చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది. మహిళలకు పిల్లలు పుట్టాక వారు తమ చిన్నారులతో ఆడుతూ.... పాడుతూ ఆనందంతో కాలం గడుపుతుంటారు. కానీ ఓ మహిళ మాత్రం తమ గారాల కుమారుడిని పట్టించుకోకుండా.. ఫేస్ బుక్ లో షేర్లు, లైక్ లతో బిజీ బిజీ అయిపోయింది. దీంతో ఆ పిల్లాడు స్విమ్మింగ్ పూల్ పడి ప్రాణాలు విడిచాడు. అమెరికాలోని తూర్పు యార్క్ షేర్ లో నివసించే క్లెయిర్ బార్నెట్ అనే 31 ఏళ్ల మహిళ నిర్లక్ష్యానికి రెండేళ్ళ కన్న కొడుకు ప్రాణాలు విడిచాడు.
వివరాల్లోకి వెళితే...
బార్నెట్ కి సోషల్ మీడియా అంటే తెగ మోజు.. ఇది ఆమెను వరకు తీసుకెళ్లిందంటే.. అసలు ఇంట్లో ఏమి జరుగుతుందో తెలుసుకోలేనంతగా… ఆమెకు జాషువా అనే రెండేళ్ళ కుమారుడు ఉన్నాడు. కొడుకుని స్విమ్మింగ్ పూల్ వద్ద వదిలేసి ఆమె ఫేస్ బుక్ ఓపెన్ చేసింది. అంతే తానూ ఎక్కడున్నానో, పిల్లాడు ఏమి చేస్తున్నాడో అన్నీ మర్చిపోయింది. స్విమ్మింగ్ పూల్ లో కొడుకు పడిపోయాడు. ఆమె మాత్రం షేర్లు, లైకులు అంటూ టైం వృధా చేసేసింది. చివరికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కుమారుడు చనిపోయిన కారణంతో ఆమె నిర్లక్ష్యమే ప్రధాన కారణమని గుర్తించిన కోర్టు ఆమెకి ఐదేళ్ళ శిక్ష విధించింది.

ఇక్కడ ఆసక్తి కరమైన విషయం మరోటి ఉంది. ఇది ఆమెకు మొదటి ఘటన కాదు. అంతకుముందు ఆమె ఫేస్ బుక్ మోజు వల్ల కొడుకుని మరిచిపోతే అతను రోడ్డు మీదకు వెళ్ళిపోయాడు. అటుగా వస్తున్నా ఓ కారు అతన్ని ఢీకొట్టబోయింది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తి వల్ల అతను అప్పుడు బతికాడు. చివరికి తల్లి మాత్రం ఫేస్ బుక్ వ్యసనంలో పడి కుమారున్ని కోల్పోయింది. 

 

ఢిల్లీ : కరవు కోరల్లో చిక్కుకున్న తెలంగాణ రైతులను ఆదుకోవాలని కోరుతూ టి.టిడిపి నేతలు గురువారం కేంద్ర మంత్రులను కలిశారు. హస్తిన వెళ్లిన పార్టీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి, రావుల చంద్రశేఖర్... కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మోహన్ భాయ్ కలానియా, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు. పత్తి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ఓసారి వరంగల్ కు రావాలని నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు.

ఉత్తర్ ప్రదేశ్ : తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్‌ బృందం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌తో సమావేశమైంది. తెలంగాణలో ప్రారంభించిన వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పథకంపై ముగ్దుడైన అఖిలేష్‌ యాదవ్ ఆ పథకాన్ని యూపీలో అమలు చేసే దిశగా కేటీఆర్‌ను ఆహ్వానించారు. వాటర్‌గ్రిడ్‌ పథకం ద్వారా తెలంగాణలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని ట్యాప్‌ ద్వారా అందించనుండడంపై అఖిలేష్‌ అభినందించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం వాటర్‌ గ్రిడ్‌ పథకం చేపట్టడాన్ని ఆయన స్వాగతించారు. వాటర్‌గ్రిడ్‌ పథకంపై తొలిసారిగా స్పందించిన యుపీ సిఎం అఖిలేష్‌ యాదవ్‌కు కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి రావాలని అఖిలేష్‌ను మంత్రి ఆహ్వానించారు.  

ఢిల్లీ : కృష్ణా జలాల వివాదం కేసును సుప్రీంకోర్టు డిసెంబర్‌ 3కు వాయిదా వేసింది. సర్వోన్నత న్యాయస్థానంలో తెలంగాణ తరపు లాయర్లు తమ వాదన వినిపించారు. తెలంగాణలో 26శాతం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉందని.. అయితే విభజనలో కేవలం 12.8శాతం నీటిని మాత్రమ కేటాయించారని న్యాయవాది వైద్యనాధన్ వాదించారు. తెలంగాణలో సాగు, త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే... మహారాష్ట్ర 150 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అరేబియా సముద్రంలో కలుపుతోందన్నారు. ఇక్కడ నీటి సమస్యను పరిష్కరించేందుకు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక మధ్య కృష్ణా జలాల కేటాయింపు మొదటి నుంచి జరపాలని న్యాయవాది వాదించారు.

బెంగళూరు : వెళ్లే దారిలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఇదంతా మనకెందుకెలే అనుకుంటూ ఎన్ని ఇబ్బందులు పడుతున్నా వెళుతూనే ఉంటుంటాం. కానీ సమస్య పరిష్కారం కోసం దారి వెతకం. కానీ ఓ ఎనిమిదేళ్ల బుడతడు మాత్రం ఏకంగా తాను ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశాడు. ఇందుకు తాత సహయం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
అభినవ్..బెంగళూరులోని యశ్వంత్ పూర్ లోని నేషనల్ పబ్లిక్ స్కూల్ లో మూడో తరగతి చదువుతున్నాడు. కానీ స్కూల్ కు వెళ్లే సమయంలో ప్రధాన సమస్యను ఎదుర్కొంటున్నానని పేర్కొన్నాడు. తన నివాసం నుండి స్కూల్ కేవలం మూడు కిలో మీటర్లు మాత్రమే ఉందని తెలిపాడు. స్కూల్ కు ఐదు నిమిషాలు లేట్ గా వస్తే శిక్ష విధిస్తారని, స్కూల్ బస్ వెళ్లడానికి 40-45 సమయం పడుతోందని తెలిపాడు. దీనికి కారణం యశ్వంత్ పూర్ వద్ద రైల్వే గేట్ మూసివేయడమే కారణమని, దీనివల్ల తమ ఆరోగ్యాలు, చదువుపై పెను ప్రభావం పడుతోందన్నాడు. అంతేగాకుండా రైల్వే గేట్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం చేస్తున్నారని, ప్రస్తుతం పనులు ఆగిపోయాయని పేర్కొన్నాడు. దీనికి డిఫెన్స్ శాఖ అనుమతినివ్వడం లేదని, సమస్య అంతటికీ ప్రధాన కారణమని లేఖలో తెలిపాడు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరాడు. దీనికి పీఎంఓ కార్యాలయం స్పందించింది. సమస్యను తెలుసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించింది. 

మహారాష్ట్ర : ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆ రాష్ట్రంలో డాన్స్ బార్లపై ఉన్న నిషేధంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దాంతో డాన్స్ బార్లను తెరిపించేందుకు లైన్ క్లియరైంది. 2005లో తొలిసారిగా డాన్స్ బార్లపై మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించగా, 2013లో దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ -ఎన్సీపీ ప్రభుత్వం మళ్లీ మహారాష్ట్ర పోలీసు చట్టాన్ని సవరించడం ద్వారా డాన్స్ బార్లను నిషేధించింది. ఇప్పుడు మళ్లీ సుప్రీంకోర్టు డాన్స్ బార్లపై ఉన్న నిషేధం మీద స్టే విధించడంతో వాటి యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ : తప్పిపోయిన పన్నెండేళ్ల తర్వాత తన తల్లిదండ్రులను చేరుకోబోతోంది గీత.. పుట్టుకతోనే మూగ, చెవిటి లక్షణాలున్న ఈ యువతి పదకొండేళ్ల వయసున్నప్పుడు దేశ సరిహద్దులో తప్పిపోయారు.. పాకిస్థాన్‌లోని కరాచీలో పెరిగి పెద్దయ్యారు.. కరాచీలోని ఈది ఫౌండేషన్‌ సంస్థ గీతకు ఆశ్రయం కల్పించింది. ప్రస్తుతం ఇరవైఏళ్ల వయసున్న ఈమె తన మాతృదేశానికి రావాలని కోరుకుంటున్నారు. భజరంగీ భాయిజాన్‌ సినిమా తర్వాత ఈ విషయం వెలుగులోకివచ్చింది. గీత తమ కూతురంటే తమ కూతురంటూ పంజాబ్‌, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌ రాష్ట్రాలకుచెందిన మూడు కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి. వీరి ఫొటోలను పాక్‌లోని భారత హై కమిషన్‌కు పంపారు పోలీసులు. అక్కడి అధికారులు ఈ ఫొటోలను గీతకు చూపించారు. ఇందులో బీహార్‌లోని దంపతులను ఆమె గుర్తుపట్టారు. ఆ తర్వాత గీతను తన తల్లిదండ్రులతో కలిపేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వారం రోజుల్లో డాక్యుమెంట్ల ప్రక్రియ పూర్తిచేసి దేశానికి రప్పిస్తామని ఢిల్లీ అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్ : ప్రముఖ జమైకా నవలా రచయిత మార్లన్‌ జేమ్స్ సరికొత్త రికార్డు సృష్టించారు.. ఈ ఏడాది ప్రతిష్టాత్మక బుకర్‌ ప్రైజ్ అందుకున్నారు.. జమైకానుంచి తొలిసారి ఈ అవార్డు అందుకున్న వ్యక్తిగా నిలిచారు.. కాల్పనిక సాహిత్యరచనా విభాగంలో మన్‌బుకర్ సంస్థ ఈ అవార్డును అందిస్తుంది.. ఈసారి మొత్తం ఆరుగురి ఫిక్షన్ స్టోరీలు నామినీలుగా చోటు దక్కించుకున్నాయి... ఇందులో మార్లన్ రాసిన ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సెవెన్‌ కిల్లింగ్స్ ఈ ప్రైజ్ దక్కించుకుంది.. 1970లో బాబ్‌ మార్లీలో జరిగిన మారణహోమాన్ని బేస్‌ చేసుకొని జేమ్స్ ఈ బుక్ రాశారు.. లండన్‌లోని గిల్డ్‌ హాల్‌లో ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది.. 

హైదరాబాద్ : చైనా ఎయిర్‌ లైన్స్‌లో అద్భుతం చోటుచేసుకుంది. భూమికి సుమారు 30 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలోనే ఓ మహిళ శిశువును ప్రసవించింది. అత్యవసర పరిస్థితి తలెత్తినా విమానం ల్యాండయ్యేలోగానే తోటి ప్రయాణికులు, సిబ్బంది సహాయంతో శిశువుకు జన్మనిచ్చింది మహిళ. ఈ ఘటనను చిత్రించి యూట్యూబ్‌లో పెట్టడంతో సంచలనమై కూర్చుంది.

ఎగురుతున్న విమానంలోనే...

ఆసుపత్రిలో సుఖంగా ప్రసవించాల్సిన ఓ గర్భిణి..ఆకాశంలో ఎగురుతున్న విమానంలో అందులోనూ 30 వేల అడుగుల ఎత్తులో ప్రసవించాల్సిన వచ్చింది. ఈ ఘటన చైనా ఎయిర్‌లైన్స్ లో చోటు చేసుకుంది. బాలి నుంచి లాస్‌ ఏంజెల్స్‌ వెళుతున్న విమానంలో తైవాన్‌ చెందిన గర్భిణి ప్రయాణిస్తుండగా ప్రసవవేదన మొదలైంది. దీంతో విమానంలోని ఎయిర్‌ హోస్టెస్‌లు అప్రమత్తమయ్యారు. పైలెట్‌కు సమాచారం తెలియజేయగా ఎమర్జన్సీ ల్యాండింగ్‌ కోసం అమెరికాలోని అలాస్కా విమానశ్రయాన్ని అభ్యర్థించారు.

ల్యాండవడానికి మరో 30 నిమిషాల ముందే...

దీంతో ఎమర్జన్సీ ల్యాండింగ్‌కు అనుమతి లభించింది. కానీ ల్యాండవడానికి మరో 30 నిమిషాలు మిగిలి ఉండగానే మహిళ పరిస్థితి కాన్పుకు సిద్ధమైపోయింది. అదృష్టవశాత్తు విమానంలోనే ఒక డాక్టర్‌ కూడా ప్రయాణిస్తుండడంతో ఆమె సహాయంతో ఎయిర్‌ హోస్టెస్‌లు, తోటి ప్రయాణికులు కలిసి కాన్పు చేశారు. కాసేపటికే విమానంలో శిశువు కేర్‌మని శబ్దం వినిపించగానే అందరూ హర్షం వ్యక్తం చేశారు.

బిడ్డ పౌరసత్వంపైనే సందిగ్ధత.....

విమానం అలాస్కాలో ల్యాండవ్వగానే తల్లి బిడ్డను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తల్లిబిడ్డ క్షేమంగానే ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పుడు బిడ్డ పౌరసత్వంపైనే సందిగ్ధత నెలకొంది. ఆకాశంలోని ట్రాన్సిట్‌ జోన్‌లో జన్మనివ్వడం ఒక కారణంగా చెబుతున్నారు. చైనాకు చెందిన అధికార విమానంలో జన్మించడంతో చైనా పౌరసత్వం ఇవ్వాలా, లేక శిశువు తొలిసారి నేలపై అడుగుపెట్టిన అమెరికా పౌరసత్వం ఇవ్వాల్సి ఉంటుందా అని అధికారులు ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉంటే శిశువుకు బర్త్‌ సర్టిఫికేట్‌ జారిచేసేది అలాస్కా ఆసుపత్రి కాబట్టి అమెరికా పౌరసత్వం లభించే అవకాశం ఉందని తేలింది. శిశువుకు 18 ఏళ్లు వచ్చే వరకూ చైనా ఎయిర్‌ లైన్స్‌లో ఉచితంగా తిరిగే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు సదరు ఎయిర్ లైన్స్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.   

హైదరాబాద్ : సెల్‌ఫోన్ వ్యసనం ఓ మహిళ ప్రాణం తీసింది.. కేరళకుచెందిన ఓ మహిళ సెల్‌ఫోన్‌తో ఎక్కువ సమయం గడిపేది.. ఇలా గంటలకొద్దీ వాట్స్ యాప్, ఫేస్ బుక్‌ వాడటం మంచిదికాదని భర్త మందలించాడు.. ఇందులోంచి బయటకు రావాలంటూ హెచ్చరించాడు.. దీంతో ఇరవైఏళ్ల ఆ గృహిణి తీవ్ర ఆవేదనకు లోనైంది.. వెంటనే తన సోదరుడికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది.. కోయంబత్తూరు గౌండపాలయంలోని తన ఇంట్లో ఉరివేసుకుంది.. బంధువులు వచ్చి తలుపు తెరిచేవరకే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.. ఇల్లాలి మరణవార్తతో కుంగిపోయిన భర్త కుమార్‌ బిల్డింగ్‌పైనుంచి దూకి చనిపోయేందుకు ప్రయత్నించాడు.. స్థానికులు గమనించి రక్షించడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు.. అయితే ‌ఈ ఆత్మహత్య వెనక ఇతర కారణాలు కూడా ఉండొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.. 

హైదరాబాద్ :కొందరు రచయితలు తమ అవార్డులను వెనక్కిపంపడంవెనక రాజకీయ దురుద్దేశం ఉందన్నారు.. హిందీ నటుడు అనుపమ్‌ ఖేర్... ప్రధాని మోడీ అంటే గిట్టనివారే ఇలాంటి పనులు చేస్తున్నారని విమర్శించారు.. దేశంలో హింసాత్మక ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదని గుర్తుచేశారు.. మిగతా అవార్డులుకూడా ఎందుకు వెనక్కి పంపడంలేదని ప్రశ్నించారు అనుపమ్‌ ఖేర్..

 

హైదరాబాద్ : ముందు కర్చీఫ్‌ వేశారు. ఆ తర్వాత దుప్పటి వేశారు. లక్షల కోట్ల విలువైన సంపద పట్టేశారు. తామైతేనే ఖర్చు తగ్గుతుందంటూ తెలివిగా పోటీదారులను తప్పించేశారు. చేతిలోకి వచ్చాక గుప్పిట బిగించేశారు. రేటు పెంచితే తప్ప పని నడవదంటూ బ్లాక్‌మెయిలింగ్‌ చేశారు. లాబీయింగ్‌తో రేటు పెంచుకున్నారు. ఇవన్నీ చాలదన్నట్లు దొంగతనానికి కూడా దిగజారారు. బిలీయనర్లు కాబట్టి ఈ దొంగలు వాళ్ల రేంజ్‌లోనే 9 వేల కోట్లు దోచేశారు.

ఓఎన్‌జీసిని పక్కకు నెట్టి కేజీబేసిన్‌లోకి రిలయెన్స్‌ ఎంట్రీ....

రిలయెన్స్‌.. ప్రపంచ సంపన్నుల వరుసలో నిలిచిపోయారు ఈ కంపెనీ అధినేతలు. ఈ భారీ సామ్రాజ్య నిర్మాణం వెనుక వారు నడిపిన వ్యూహాలు తెలుసుకుంటే దిమ్మ తిరగాల్సిందే. అత్యంత విలువైన కేజీ బేసిన్‌ కాంట్రాక్ట్‌ను వారు సంపాదించిన తీరు.. ఆ తర్వాత రేటు పెంచుకోవడానికి చేసిన జిమ్మిక్కులు.. ఇప్పుడు కొత్తగా వేరే కంపెనీకి.. అది కూడా పోటీలో లేకుండా తప్పించేసిన ప్రభుత్వ రంగ సంస్థ ఓన్‌జీసీకి కేటాయించిన ప్రాంతంలో గ్యాస్‌ తోడేసుకోవడం.. ఇవన్నీ చూస్తే రిలయెన్స్‌ కంపెనీ రికార్డులు ఎలా బద్దలుకొడుతుందో అర్ధమైపోతుంది.

దబాయించి రేటు పెంచుకున్న రిలయెన్స్‌....

కేజీబేసిన్‌లోని గ్యాస్‌ నిక్షేపాలను వెలికి తీసే పని మొదట ఓఎన్‌జీసీ చేయాల్సి ఉన్నా.. వారు చేస్తే ఖర్చు ఎక్కువని, ప్రభుత్వానికి భారమని.. తామైతే తక్కువకు చేస్తామని.. పైగా బ్రిటన్‌ నుంచి అత్యాధునిక టెక్నాలజీని తెచ్చి వాడతామని బిల్డప్‌ ఇచ్చి రిలయెన్స్‌ ఆ కాంట్రాక్ట్‌ కొట్టేసింది. తీరా చేతిలోకి వచ్చాక.. ఖర్చు ఎక్కువవుతుందంటూ రేటు పెంచాల్సిందేనని డిమాండ్‌ చేసింది. కేంద్రంలో ఏ పార్టీ వచ్చినా.. అందరూ అస్మదీయులే కావడంతో వారి పని సులువుగా అయిపోయింది.

ఓఎన్‌జీసి క్షేత్రాల్లోనూ అక్రమంగా గ్యాస్‌ వెలికితీత.....

ఇప్పుడు కొత్తగా వారికి కేటాయించిన ప్రాంతం పక్కనే ఉన్న ఓఎన్‌జీసీ క్షేత్రాల్లోని గ్యాస్‌ను కూడా గుట్టుచప్పుడు కాకుండా లాగేశారు. ఈ విషయం ఓఎన్‌జీసీ ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపిన డీ అండ్‌ ఎం అనే కన్సల్టెన్సీ అది నిజమేనని తేల్చింది. 2009 నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు 9 వేల కోట్ల విలువైన గ్యాస్‌ రిలయెన్స్‌ తీసేసుకుందని లెక్క ఇచ్చింది.

కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది?....

ఇప్పుడు ఈ విచారణ రిపోర్టుపై కేంద్రం ఎలా రియాక్టవుతుందనేదే ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్‌ హయాంలో అడ్డగోలుగా రిలయెన్స్‌కు రేటు ఇచ్చారన్న బిజెపి.. తాము అధికారంలోకి రాగానే సకల మర్యాదలతో వారు అడిగిన రేటు ఇచ్చేసింది. ఇవ్వక తప్పదని వాదించింది కూడా. మరి అంత అభిమానం చూపించిన సర్కార్‌.. ఇప్పుడు ఈ రిపోర్టును పట్టించుకుంటుందా.. రిలయెన్స్‌ దగ్గర 9 వేల కోట్లు వసూలు చేస్తుందా లేదా అనేదే ప్రశ్న.

ముంబై : టీమిండియా ఆల్ టైమ్ గ్రేట్ ..లెఫ్టామ్ పేస్ బౌలర్ జహీర్ ఖాన్ ఐపీఎల్ మినహా మిగిలిన అన్ని క్రికెట్ ఫార్మాట్లకూ గుడ్ బై చెప్పినట్లు ప్రకటించాడు. తన రిటైర్మెంట్ వార్తను ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. టెస్ట్ క్రికెట్, వన్డే, టీ-20 ఫార్మాట్లలో మొత్తం 610 వికెట్లు పడగొట్టిన రికార్డు జహీర్ ఖాన్ కు ఉంది. మొత్తం 92 టెస్ట్ మ్యాచ్ ల్లో 311 వికెట్లతో కపిలే దేవ్ తర్వాతి స్థానంలో నిలిచాడు. 200 వన్డేల్లో 282 వికెట్లు, 17 టీ-20 మ్యాచ్ ల్లో 17 వికెట్లు పడగొట్టిన ఘనత కూడా జహీర్ ఖాన్ దే. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాను ఎనలేని సంతృప్తితో నిష్క్రమిస్తున్నానని ఐపీఎల్ తొమ్మిదో సీజన్ కు సిద్ధమవుతున్నానని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. గత రెండుదశాబ్దాలుగా క్రికెట్టే ఊపిరిగా భావించిన తనకు ఎన్నో మధురస్మృతులు ఉన్నాయని జహీర్ తెలిపాడు.

తీపి జ్ఞాపకాలు...
అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాను ఎంతో సంతృప్తి ఎన్నో అరుదైన విజయాలు తీపి జ్ఞాపకాలతో రిటైరవుతున్నట్లు టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ ప్రకటించాడు. కుటుంబసభ్యులు, స్నేహితులతో చర్చించిన తర్వాతే ఈనిర్ణయం తీసుకొన్నట్లు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెటర్ గా తాను ఎదగడంలో ప్రధానపాత్ర వహించిన అందరికీ జహీర్ కృతజ్ఞతలు తెలిపాడు. గత రెండు దశాబ్దాల కాలం పాటు క్రికెట్టే ఊపిరిగా తాను జీవించానని గుర్తు చేశాడు.

విజ్ఞానం ఆయన ఊపిరి...నిరాడంబరం ఆయన పెన్నిధి. సామాన్య ప్రజలే ఆయన ఉచ్ఛ్వాసనిశ్వాస. అతి సామాన్యుడిగా పుట్టి...అసామాన్యుడిగా ఎదిగి సామాన్యుల కోసమే నిరంతరం శ్రమించిన విజ్ఞాన గని డాక్టర్‌ అబ్దుల్‌ కలాం. రామేశ్వరంలో నిరుపేద కుటుంబంలో జన్మించి రాష్ర్టపతి స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి అబ్దుల్‌ కలాం. నేడు ఆ మహానుభావుడి జయంతి.

విద్యార్థులకు ఆయనొక దిక్సూచి...

విద్యార్థులకు ఆయనొక దిక్సూచి. వారికి కలలను కనడం నేర్పారు కలాం. అంతేకాదు కన్న కలలను ఎలా సాకారం చేసుకోవాలో కూడా చూపించారు. నిత్య విద్యార్థిగా విద్యార్థులతోనే గడుపుతూ అనంతమైన విజ్ఞానాన్ని ఆర్జించి భారతీయ మిస్సైల్‌ మ్యాన్‌గా చరిత్రపుటల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు కలాం.

నిరుపేదగా పుట్టి...నిప్పులుచిమ్ముతూ నింగికెగిరాడు.....

నిరుపేదగా పుట్టాడు...నిప్పులుచిమ్ముతూ నింగికెగిరాడు. విజ్ఞాన యోధుడై అంతరిక్షంలో భారతదేశపు అగ్నిని రగిల్చాడు. రక్షణరంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. విస్తృతమైన పరిశోధనలతో తన విలక్షణతను చాటుకున్నారు డాక్టర్‌ అబ్దుల్‌కలాం. దేశాభివృద్ధికి కులాలు, మతాలు కాదు విజ్ఞానం, స్వచ్ఛమైన పాలనొక్కటే మార్గమని నినదించిన స్ఫూర్తిప్రదాత కలాం.

మహోన్నత వ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకరు....

భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకరు. ప్రపంచ పటంలో త్రివర్ణపతాకాన్ని ఎగురవేసిన భరతమాత ముద్దుబిడ్డ ఆయన. శాస్ర్తసాంకేతిక రంగంలో కీలక మైలురాయి కలాం. ఓ శాస్ర్తవేత్తగా పరిశోధనలను.. రాష్ర్టపతిగా పాలనను సామాన్యుల దరికి చేర్చిన మహాజ్ఞాని అతను.

ప్రజల రాష్ర్టపతిగా పేరు.....

ప్రజల రాష్ర్టపతిగా పేరు గాంచిన అతిసామాన్యుల్లో ఒకరు అబ్దుల్‌ కలాం. అందుకే ఆయన్ని పీపుల్స్‌ ప్రెసిడెంట్ అని కూడా అంటారు. రాష్ర్టపతిగా ఉన్న సమయంలోను ఆయన నిత్య ఉపాధ్యాయునిగా పనిచేశారు. యువతను ఉత్తేజపరిచేందుకు పుస్తకాలు రచించారు. అనంతమైన విజ్ఞాన సముద్రంలో ఆణిముత్యమై నిలిచారు డాక్టర్‌ అబ్దుల్‌ కలాం.

వయసు తో బాటు నాచురల్ గా పెరిగే ఛాతి పెరగకుండా వాటిని ఆటవిక పధ్ధతుల్లో అణిచి వేస్తారట. ఇది ఎక్కడా అనుకుంటున్నారా మన దేశంలో కాదులేండి... కేమరూన్, నైజీరియా, సౌత్ ఆఫ్రికాల్లో ఈ పద్ధతి అమల్లో వుందట. బ్రెస్ట్ ఐరనింగ్ అని పిలిచే ఈ ప్రక్రియలో ఛాతి కనపించకుండా అణచివేస్తే ఆడపిల్లల వయసు దాచిపెట్టడంతో బాటు, వారి మీద మగవాళ్ల కన్ను పడకుండా ఉండేందుకు ఈ ఆటవిక పద్దతిని అవలంబిస్తున్నారట. ఈ అనాగరిక మూఢ నమ్మకంలో తల్లులే ముఖ్య పాత్ర వహిస్తున్నట్టు యునైటెడ్ నేషన్స్ నివేదిక పేర్కొంది. తమ పిల్లలకు బ్రెస్ట్ ఐరనింగ్ చేస్తే లైంగిక వేధింపులు, అత్యాచారాలనుంచి రక్షణ కలుగుతుందన్న మూఢనమ్మకమేకారణమట. ఐరనింగ్ కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 3.8 మిలియన్ల మంది నానా హింస బారిన పడి నరకం చూస్తున్నట్టు యూ ఎన్ నివేదిక పేర్కొంది. ఆడతనాన్ని ప్రతిబింబించే ఛాతి పెరగనీయకుండా ఉండేందుకు తల్లులు ఆశ్రయిస్తున్న అనాగరిక పద్దతి దారుణంగా ఉంటుందట. పెద్ద పెద్ద రాళ్లు, లేదా వెడల్పాటి గరిటె లాంటి దాన్ని బొగ్గుల మీద కాల్చి వాటితో ఛాతిని అణుస్తారట. ఈ పద్ధతిలో బ్రెస్ట్ టిష్యూ దారుణంగా దెబ్బ తింనడం వల్ల ఆడతనం అణిగిపోతుందనేది తల్లుల భావనట.కామెరూన్, నైజీరియా, సౌత్ ఆఫ్రికా తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ ఆనాగరిక ఆచారంలో 58 శాతం తల్లులే ప్రధానంగా ఉన్నారని పబ్లి్క్ హెల్త్ సర్వీస్ లెక్కలు చెబుతున్నాయి. డబ్బున్న కుటుంబాలకు చెందిన యువతులైతే వెడల్పాటి బెల్టు గట్టిగా చుట్టుకుంటారట. దీని కారణంగా ఛాతి పెరగవట. ముఖ్యంగా 11,15 సంవత్సరాల మధ్య వయసున్న ఆడపిల్లల్లో శరీర భాగాలు పురుషుల కంట బడనీయక పోతే మగాళ్ళ కళ్ళు తమ పిల్లల మీద పడవని ఆ తల్లుల నమ్మకమట. మహిళల మానసిక స్థితి మీద కూడా ప్రభావం చూపుతున్న ఈ అనాగరికపు ఆచారం మీద ఇప్పుడిప్పుడే చైతన్యం ప్రారంభమైంది.

ఢిల్లీ : దాద్రీపై ప్రధాని మోది ఆలస్యంగా స్పందించడాన్ని ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. భారత క్రికెట్‌ జట్టు గెలవగానే తక్షణమే శుభాకాంక్షలు చెప్పే ప్రధాని- దాద్రీ ఘటనపై ఇంత ఆలస్యంగా ప్రతిస్పందించడంపై నిలదీశాయి. దేశానికి ప్రధానమంత్రినన్న సంగతి మోది మరచి పోతున్నారని కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది. దాద్రి ఘటన జరిగిన 15 రోజులకు ప్రధాని స్పందించడాన్ని విపక్షాలు విమర్శించాయి. దాద్రీ ఘటన అనంతరం వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రులు మహేష్ శర్మ, సంజీవ్ బల్యాన్, బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ తదితరులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో ప్రజలకు చెప్పాల్పిన బాధ్యత ప్రధానిపై ఉందని కాంగ్రెస్ పేర్కొంది. దాద్రీపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడం, ప్రతిపక్షాలు వేలెత్తి చూపడం వల్లే ప్రధాని స్పందించారే తప్ప మరోటి కాదని సిపిఐ నేత రాజా అన్నారు.

ఇప్పుడు సారీ చెబుతారా ? 
దాద్రి ఉదంతం జాతి మనోభావాలను దెబ్బతీసిందని ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజం ఖాన్ ఆక్షేపించారు. ప్రపంచమంతా ఖండించిన తర్వాత నరేంద్ర మోదీ ప్రకటన చేయడం శోచనీయమన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీకి అనుబంధ సంస్థలు నరేంద్ర మోదీని 'గోద్రా హీరో'గా భావిస్తున్నాయని ఆజం ఖాన్ అన్నారు. మోదీ స్పందనపై లాలూ తీవ్రంగా మండిపడ్డారు. కొట్టి చంపాక సారీ చెప్పడం ఇదేం పద్దతని విమర్శించారు. పూటకో మాట మాట్లాడే వారిని ఎవరూ నమ్మరన్నారు. ఇంత గ్యాప్‌ వచ్చాక మోడీ స్పందించడం సరికాదన్నారు. నిజాయితీ లేని ప్రకటనను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని జెడియు అధ్యక్షులు శరద్‌యాదవ్‌ అన్నారు.

గోమాంసం తిన్నాడని ఇఖ్లాక్ హత్య..
యూపీ దాద్రీలోని బిసడ గ్రామంలో గోవు మాంసం నిల్వచేశారనే పుకార్లతో 52 ఏళ్ల ఇఖ్లాక్‌ను కొట్టి చంపిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. 15 రోజుల తర్వాత దాద్రి ఘటన దురదృష్టకరమంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఓ బెంగాల్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో స్పందించడం విమర్శలకు తావిస్తోంది.

ఢిల్లీ : ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీని ఆహ్వానించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సహా పలువురు కేంద్ర మంత్రులను క్యాపిటల్‌ ఫౌండేషన్‌ సెర్మనీకి ఇన్‌వైట్‌ చేశారు. పనిలో పనిగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్‌ అంశాలను పరిష్కరించాలని కేంద్ర మంత్రులకు విన్నవించారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లిన ఆయన... వరుస భేటీలతో బిజీ బిజీగా గడిపారు. ముందుగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను కలిసి అమరావతి శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. ఏపీ భవన్‌లో ఢిల్లీ సీఎంతో భేటీ అయిన చంద్రబాబు... కేజ్రీవాల్‌కు ఆహ్వానపత్రిక అందజేశారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు చంద్రబాబు. రాజధాని శంకుస్థాపనకు రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి ఏపీకి తరలివచ్చే వారికి స్థానికత కల్పించేందుకు వీలుగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు చేయాలని రాజ్‌నాథ్‌ను చంద్రబాబు కోరినట్లు సమాచారం. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ అయ్యారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంపై నివేదికను మోడీకి అందజేశారు. ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా చంద్రబాబు.. మోడీని ఆహ్వానించారు. రాజధాని శంకుస్థాపనకు అరుణ్‌జైట్లీ, సుప్రీంకోర్టు సీజే హెచ్‌ఎల్‌ దత్తును ఏపీ సిఎం చంద్రబాబు వేరువేరుగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జైట్లీ, బాబు మధ్య పోలవరం, పెండింగ్‌ అంశాలపై చర్చ జరిగింది. ఏపీని అన్నీ విదాలుగా ఆదుకుంటామని జైట్లీ చంద్రబాబుకు హామీ ఇచ్చారు.

ఇండోర్ : రెండో మ్యాచ్ లోనైనా గెలుస్తారా ? ఓడిపోతారా ? అని భావించిన భారత అభిమానులను టీమిండియా సంతృప్తి పరిచింది. ఒక దశలో ఓడిపోతారా అని అభిమానులు భావించారు. కానీ భారత బౌలర్ల విజృంభనతో టీమిండియా గెలుపు సాధించింది. ఐదు వన్డేల సిరీస్ ను 1-1తో సమయం చేసింది. 22 పరుగుల తేడాతో ధోని సేన గెలిచింది. తొలుత టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు విఫలం కావడం..రహానే..ధోని పోరాటంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. అనంతరం 248 పరుగుల లక్ష్యంతో సౌతాఫ్రికా బరిలోకి దిగింది. ఓపెనర్లు ఆమ్లా, కాక్ లు ధాటిగానే ఆడారు. సింగిల్స్..ఫోర్సు తీస్తూ భారత బౌలర్లపై ఆరంభంలోనే వత్తిడి తెచ్చారు. జట్టుస స్కోరు 40 పరుగుల వద్ద ఉన్నప్పుడు పటేల్ బౌలింగ్ లో ఆమ్లా (17) వెనుదిరిగాడు. తరువాత కాక్ తో డుప్లెసిస్ జత కలిశాడు. వీరు కూడా భారత బౌలర్లపై తమ ప్రతాపం చూపెట్టారు. అడపదడపా షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. జట్టు స్కోరు 52 పరుగుల వద్ద కాక్ (34) అవుట్ అయ్యాడు. డుప్లెసిస్ కు డుమిని కలిశాడు. వీరిద్దరూ వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడారు. కానీ 134 పరుగుల వద్ద డుమిని పెవిలియన్ చేరాడు. మరోవైపు డుప్లెసిస్ హాఫ్ సెంచరీ సాధించాడు. దీనితో భారత శిబిరంలో ఆందోళన నెలకొంది. చివరకు పటేల్ ఆందోళనకు తెరదించాడు. డుప్లెసిస్ (51) పెవిలయన్ పంపించాడు. అనంతరం వచ్చిన ఇతర క్రీడాకారులు ఏ మాత్రం నిలదొక్కులేదు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వికెట్లు వెంటనే వెంటనే పడిపోయాయి. 

ధోని పోరాటం..
తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియాకు సౌతాఫ్రికా జట్టు బౌలర్లు చుక్కలు చూపించారు. మొదటి వన్డేలో రాణించిన రోహిత్ శర్మ మూడు పరుగులకే అవుట్ కావడం అభిమాలను తీవ్ర నిరాశకు గురి చేసింది. అనంతరం ధావన్ కు రహానే జత కలిశాడు. వీరిద్దరూ కలిసి వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడారు. 50 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన అనంతరం ధావన్ (23) అవుట్ అయ్యాడు. తరువాత వచ్చిన కోహ్లీ ఈ మ్యాచ్ లో కూడా రాణించలేదు. కేవలం 12 పరుగులకే అవుట్ అయ్యాడు. ధనా ధన్ ధోని జాగ్రత్తగా ఆడుతూ గౌరవప్రదమైన స్కోరు సాధించే ప్రయత్నం చేశాడు. అదుపుతప్పిన బంతులను రహానే బౌండరీలకు తరలించి స్కోరు బోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేశాడు. ఈ తరుణంలో రహానే (51) అర్ధ సెంచరీ సాధించి వెంటనే అవుట్ అయ్యాడు. రైనా డకౌట్ అయ్యాడు. అప్పటికీ జట్టు స్కోరు 104 పరుగులు. అనంతరం వచ్చిన మిగతా బ్యాట్ మెన్స్ ఎక్కువ సేపు నిలబడలేదు. దీనితో అంతా ధోనిపై బాధ్యత పడింది. చివరకు ధోని బ్యాట్ ఝులిపించి అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులు చేసింది. ధోని 92 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు.

భారత్ స్కోరు కార్డు : శర్మ (3), ధావన్ (23), రహానే (51), కోహ్లీ (12), ధోని (92, నాటౌట్), రైనా (0), పటేల్ (13), భువనేశ్వర్ కుమార్ (14), హర్భజన్ సింగ్ (22), ఉమేష్ యాదవ్ (4), శర్మ (0, నాటౌట్)
దక్షిణాఫ్రికా బౌలింగ్ : స్టేన్ (3), మోర్కెల్ (2), తాహిర్ (2), రబడ (1) వికెట్లు తీశారు.
దక్షిణాఫ్రికా స్కోరు : ఆమ్లా (17), కాక్ (34), డుప్లెసిస్ (51), డుమిని (36), విలియర్స్ (19), మిల్లర్ (0), బెహార్డీన్ (18), స్టేన్ (13), రబడ (19, నాటౌట్), తాహిర్ (9), మోర్కెల్ (4).
భారత బౌలింగ్ : భువనేశ్వర్ (3), పటేల్ (3), హర్భజన్ సింగ్ (2), యాదవ్ (1), శర్మ (1) వికెట్ తీశారు. 

Pages

Don't Miss