National News

వాషింగ్టన్ : అమెరికాలోని ఒరెగాన్‌ యూనివర్సిటీలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఓ అగంతకుడు జరిపిన కాల్పుల్లో 13 మంది కాలేజీ విద్యార్థులు మృతిచెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు పాల్పడ్డ 20 ఏళ్ల దుండగుడు పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయుధ చట్టాన్ని కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

 

హైదరాబాద్ : సిరియా ప్రభుత్వానికి మద్దతుగా రష్యా రంగంలోకి దిగింది. ఐఎస్ఐఎస్‌ స్థావరాలపై వైమానిక దాడులు జరుపుతోంది. ఇందుకు ఇప్పటికే రష్యన్‌ పార్లమెంట్‌ కూడా పుతిన్‌కు మద్దతు తెలిపింది. రష్యా నిర్ణయాన్ని అమెరికా వ్యతిరేకిస్తోంది.

గత నాలుగేళ్లుగా సిరియాలో అంతర్యుద్ధం....

సిరియాలో గత నాలుగేళ్లుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఐఎస్‌ఐఎస్‌ పాటు పలు ఇస్లామిక్‌ సంస్థలు, సిరియా ప్రభుత్వానికి మధ్య దాడులు జరుగుతున్నాయి. సిరియా అధ్యక్షుడు బషర్‌-అల్‌-అసద్‌ను పదవి నుంచి తప్పుకోవాలని అమెరికా దాని మిత్రపక్షాలు ఒత్తిడి చేస్తున్నాయి. రష్యా మాత్రం సిరియా అధ్యక్షుడికి పూర్తి మద్దతు ప్రకటించింది.

రష్యాని సైనిక సహకారాన్ని సిరియా అధ్యక్షుడు......

సిరియాలో ఐఎస్‌ దాడులు పెరిగిపోతుండడంతో తమకు సైనిక సహకారాన్ని అందించాల్సిందిగా సిరియా అధ్యక్షుడు అసద్‌ రష్యాను కోరాడు. దీంతో అత్యవసరంగా సమావేశమైన రష్యా పార్లమెంట్‌ సిరియా సైనిక సహకారం అందించడానికి ప్రెసిడెంట్‌ వ్లాదిమిర్ పుతిన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కేవలం సిరియాలో వైమానిక దాడులకు మాత్రమే అంగీకరించింది.

సిరియాలో ఇస్లామిక్‌ స్టేట్ స్థావరాలపై వైమానిక దాడులు....

రష్యా లడాకూ విమానాల ద్వారా ఇస్లామిక్‌ స్టేట్‌ స్థావరాలపై దాడులు చేసిందని అమెరికా మీడియా పేర్కొంది. సిరియాలో ఇస్లామిక్‌ స్టేట్ స్థావరాలపై వైమానిక దాడులు చేయనున్నట్టు బగ్దాద్‌లోని రష్యన్‌ అధికారులు యుఎస్‌ ఎంబసికీ ఇదివరకే సమాచారం అందించినట్టు తెలిపింది. ఇప్పటికే ఇరాక్‌, సిరియాలోని ఐఎస్‌ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయాలని అమెరికా దాని మిత్రపక్షాలు నిర్ణయించాయి. గత ఏడాది కాలంగా వైమానిక దాడులు కూడా చేస్తున్నాయి. సిరియా, ఐక్యరాజ్యసమితి అనుమతి లేకుండా సిరియాలో అమెరికా ఫ్రాన్స్‌ చేస్తున్న వైమానిక దాడులు అంతర్జాతీయ నిబందనలకు విరుద్ధమని రష్యా చెబుతోంది. ఈ నేపథ్యంలో రష్యా ఐఎస్‌ స్థావరాలపై దాడులు చేయడాన్ని అమెరికా జీర్ణించుకోవడం లేదు. పైకి మాత్రం రష్యా నిర్మాణాత్మక పాత్ర చేపడుతున్నందుకు స్వాగతించింది. అంతర్యుద్ధం కారణంగా గత నాలుగున్నరేళ్లలో రెండున్నర లక్షల మంది సిరియన్లు మరణించారు. దీంతో ఉగ్రవాద గ్రూపులు పెరిగి సిరియా అల్లకల్లోలంగా మారింది.

...

హైదరాబాద్ : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల మెనిఫెస్టోను బిజెపి విడుదల చేసింది. కాంగ్రెస్‌, ఆర్జేడి, జెడియు సుదీర్ఘ పాలనలో బీహార్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ...బీహార్‌ వెనకబాటుతనానికి ఈ మూడు పార్టీలే కారణమని ఆరోపించారు. బిజెపికి అధికారమిస్తే బీహార్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తామని జైట్లీ పేర్కొన్నారు. రిజర్వేషన్లకు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకం కాదని జైట్లీ స్పష్టం చేశారు. 

హైదరాబాద్ : ఢిల్లీలోని ఏపీభవన్‌లో తుపాకీ మిస్‌ఫైర్ అయ్యింది. పలువురు ట్రైనీ డీఎస్పీలు పరీక్ష రాసేందుకై ఢిల్లీలోని ఏపీభవన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఓ అభ్యర్థి తన వద్ద ఉన్న తుపాకీని శుభ్రం చేస్తున్న సమయంలో తుపాకీ మిస్‌ఫైర్ అయి అతని కాలులో నుంచి తూటా దూసుకెళ్లింది. దీంతో వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. తుపాకీ పేలుడిపై దర్యాప్తు కొనసాగుతోంది.

 

హైదరాబాద్ : అంతర్జాతీయ స్థాయిలో పెట్రోల్‌ ధరలు తగ్గినా..దేశంలో మాత్రం నిత్యావసరాల ధరలు తగ్గడంలేదని సీపీఐ కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు నారాయణ ఆరోపించారు. ధరల్ని నియంత్రించాలని డిమాండ్ చేస్తూ...నేటి నుంచి 5వతేదీవరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేపట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. కార్పొరేటీకరణకు అనుకూలంగా కేంద్రంలో ఉన్న మోడి ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని నారాయణ తెలిపారు. 

హైదరాబాద్ : అర్జెంటీనాలోని బ్యూనోస్ఏర్స్ ప్రాంతానికి చెందిన యువతీ యువకులు కరెన్ క్లెన్(22), లియాండ్రో అకోస్టాలు (25) వరుసకి అన్నాచెల్లెళ్ళ అనుబంధం. క్లెన్ తల్లి, అకోస్టా తండ్రి పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీరిద్దరికీ కవల పిల్లలు పుట్టారు. అయితే అన్నాచెల్లెళ్ళుగా వ్యవహరించాల్సిన క్లెన్, అకోస్టాల మధ్య ప్రేమ చిగురించింది. దానికి తోడు తమ కవల తోబుట్టువులను తల్లిదండ్రులు సరిగా చూడడం లేదని వారు భావించారు. ఆ కోపంతో తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో వారిని కాల్చి చంపారు. అనంతరం వారి మృతదేహాలను ముక్కలుగా కోసి, కుక్కలకు ఆహారంగా వేశారు. మిగిలిన శరీరావయవాలను కాల్చేశారు. తాము చేసిన పనికి ఏ మాత్రం బాధపడటంలేదని, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నామని చెబుతున్నారు క్లెన్,అకోస్టా.

హైదరాబాద్ : ఎడ్వార్డ్‌ స్నోడెన్‌..! ట్విట్టర్‌లో ఇలా అకౌంట్‌ ఓపెన్‌ చేశాడో లేదో.. లక్షలాది మంది ఫాలో అయిపోయారు. గంటలోపే లక్షన్నర మంది ఫాలో అవగా.. తొమ్మిది గంటల్లో ఆ సంఖ్య 7 లక్షలు దాటి పోయింది. ఇంతకీ ఎవరీ ఎడ్వార్డ్‌.. ఇతనికి ఎందుకింత ఫాలోయింగ్..? వాచ్‌ దిస్‌ స్టోరీ..

అమెరికన్‌ భద్రతా విభాగం సీఐఏలో పనిచేసిన ఎడ్వార్డ్‌.....

ఎడ్వార్డ్‌ స్నోడెన్‌.. రెండేళ్ల క్రితం అమెరికాను గడగడ లాడించిన వ్యక్తి. అలాగని అతనేమీ ఉగ్రవాదో.. అమెరికా ద్వేషో కాదు. ఇంకా చెప్పాలంటే.. అమెరికన్‌ భద్రతా విభాగం సీఐఏ కోసం జెనీవాలో రహస్యంగా పనిచేసిన వేగు. అయితే.. ఎడ్వార్డ్‌ 2013లొ బయటపెట్టిన ఓ రహస్యం.. అతణ్ణి అమెరికాకు శత్రువుగా మార్చేసింది. మిలియన్ల కొద్దీ ఫోన్ల సంభాషణలను అమెరికా రికార్డు చేస్తోందంటూ ఎడ్వార్డ్‌... మీడియాకిచ్చిన సమాచారం.. కలకలం సృష్టించింది. అమెరికా ప్రభుత్వ అభియోగాలతో ఎడ్వార్డ్‌ దేశం వదిలి.. మాస్కోలో తలదాచుకుంటున్నాడు. ఎడ్వార్డ్‌ స్నోడెన్‌ను అమెరికా దేశం శత్రువులా పరిగణిస్తున్నా.. మిగిలిన ప్రపంచం అతణ్ణి.. పౌర స్వేచ్ఛను కాపాడిన చాంపియన్‌గా గుర్తిస్తోంది.

ట్విట్టర్‌లో అకౌంట్‌ ప్రారంభించిన ఎడ్వార్డ్‌ స్నోడెన్‌.....

ఇంతటి నేపథ్యం ఉన్న ఎడ్వార్డ్‌.. తాజాగా ట్విట్టర్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేశాడు. ఇప్పుడు మీరు వినగలుగుతున్నారా..? అన్న అర్థంతో... కెన్‌ యూ హియర్‌ మీ నౌ.. అంటూ తొలి ట్వీట్‌ చేశాడు. ఆ తర్వాత.. మార్స్‌పైన నీటిని కనుక్కున్నారంట.. అక్కడి సరిహద్దుల్లో పాస్‌పోర్టులను చెక్‌ చేస్తారంటారా..? అంటూ ఓ స్నేహితుడితో జోక్‌ చేశాడు.ఆయన ఇలా ట్విట్లర్‌లోకి అడుగు పెట్టాడో లేదో.. ఫాలోయర్ల సంఖ్య క్షణక్షణానికీ పెరిగిపోతూ వచ్చింది. కేవలం తొమ్మిది గంటల వ్యవధిలో.. అతడి ట్విట్టర్‌ అకౌంట్‌కు ఏడు లక్షల పది మంది ఫాలోయర్లు చేరారు. తనను ఇంత మంది ఫాలో అవుతున్నా.. ఎడ్వార్డ్‌ మాత్రం.. అమెరికా జాతీయ భద్రతా ఏజెన్సీ.. ఎన్‌ఎస్‌ఏని ఒక్కదాన్నే ఫాలో అవుతుండడం విశేషం. 

ప్రపంచంలో ఎత్తైన వారందరూ ఒక్కచోట చేరితే ఎలా ఉంటుంది. అంతా సందడి సందడిగా ఉంటుంది కదా. అవును ప్రపంచంలోనే టాలెస్ట్ పీపుల్స్ గా గుర్తింపు పొందిన ఐదుగురు ఒకే చోట కలుసుకున్నారు. ఎందుకు ? అంటారా ? వీరందరికీ ఒక ప్రధాన సమస్యను ఎదుర్కొంటున్నారు. అదే 'పాదరక్షలు' మనలాగ ఎక్కడ పడితే షూస్ దొరకవు. అందుకే వీరంతా వెస్ట్ జర్మనీలోని ఓ పాదరక్షల దుకాణానికి వచ్చారు. వారి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన షూస్ కొనుక్కోవడానికి ఆ షాప్ కు వెళ్లారు. పాదరక్షలు కొనుక్కున్న అనంతరం వారు వెళ్లిపోయారు. ఒకరు 8 ఫీట్ 2.75 ఇంచెస్ ఉంటే మరొకరు 8 అడుగుల ఒక అంగుళం పొడవు ఉన్నారు. అంతా ఏడు అడుగుల పైనే పొడగుంటారు. వీరిని చూడటానికి జనం ఎగబడ్డారంట. 

ఢిల్లీ : అక్రమంగా సంపాదించి కూడబెట్టిన లక్షల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని దేశవిదేశాల్లో దాచుకున్న వారి నుంచి తిరిగి స్వదేశానికి తీసుకువస్తామని పదేపదే కలల ప్రపంచం చూపించిన ఎన్‌డిఎ సర్కారు ఆలోచనలకు సెప్టెంబర్‌ 30 వ తేదీతో తెరపడుతోంది. గత మార్చిలో ఇలా అక్రమంగా సంపాదించి విదేశాల్లో దాచుకున్న సంపదను వెల్లడించి కొద్ది మాత్రం జరిమానాతో తెల్ల డబ్బుగా మార్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అవకాశాన్ని ఎంత మంది ఉపయోగించుకున్నారో కాని, సెప్టెంబర్‌ మూడో వారం చివరికి అందిన సమాచారం ప్రకారం అలా ప్రభుత్వ లెక్కల్లోకి ఆదాయం రూపంలో జమ అయిన మొత్తం మాత్రం రూ. 6500 కోట్లకు మించలేదు. గడువు ముగిసిన తరువాత అధికారులకు పట్టుబడినట్టయితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది.

రూ.28 లక్షల కోట్లు ?
2003-12 మధ్య కాలంలో విదేశాల్లో మన భారతీయులు దాచిపెట్టిన నల్ల ధనం - గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ ఇంటెగ్రిటీ గ్రూప్‌ (వాషింగ్టన్‌) అంచనాల ప్రకారం - దాదాపు రూ. 28 లక్షల కోట్లు అని తెలుస్తోంది. ఈ అక్రమ సంపాదన మొత్తాన్ని స్వదేశానికి తరలించగలిగితే దేశంలోని ఒక్కో పౌరునికి రూ. 15 లక్షలు అందించవచ్చునని రెండేండ్ల క్రితం ఒక ఎన్నికల సభలో నరేంద్ర మోడీ గొప్పగా ప్రకటించారు. డబ్బు వ్యామోహం అత్యధికంగా ఉన్న మన దేశంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల కండ్లు కప్పడానికి, పన్ను భారం లేని స్విట్జర్లాండ్‌ లేదా సింగపూర్‌లకు తరలించడం లేదా నగలు నట్రా, పురాతన విలువైన పెయింటింగ్స్, ఇతర ఆస్తుల రూపంలోకి తమ అక్రమ సంపాదనను నిల్వచేయడం సర్వసాధారణం. మరి ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల ద్వారా గడువు పూర్తయే సరికి ఎంత నల్ల ధనం తెలుపు రంగులోకి మారుతుందో వేచి చూడాల్సిందే.

హైదరాబాద్ : మయన్మార్‌లోకి చొరబడి ఉగ్రవాదులను హతమార్చామంటూ బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద విషయంలో కాంగ్రెస్‌ కన్నా మోది ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. భారత్ భద్రతే బిజెపి ప్రధాన ఎజెండా అని, మన భూభాగంలోకి చొరబడడానికి ఎవరూ సాహసించరని రాహుల్‌గాంధీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. బిజెపి కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన అమిత్‌షా- లాలూ, నితీష్‌ల తీరుపై నిప్పులు చెరిగారు. మయన్మార్‌లో జరిపిన ఉగ్ర దాడులపై మోది ప్రభుత్వం చేసిన ప్రకటనలను ప్రతిపక్షాలు అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించాయి.

హైదరాబాద్ : సభ్య సమాజం తలదించుకునేలా పోలీసులు ప్రవర్తించారు. రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్న పనులను అరికట్టాల్సిన పోలీసులే రెచ్చిపోయి చిందులేసిన సంఘటన వారణాసిలో జరిగింది. ఓ సాంస్కృతిక కార్యక్రమంలో బార్‌ డ్యాన్సర్లతో కలిపి పోలీసులు చిందులేశారు. అంతటితో ఆగకుండా.. యువతులపై డబ్బులు వెదజల్లి తమ పైత్యాన్ని నిరూపించుకున్నారు. బహిరంగంగా పోలీసులు ప్రవర్తించిన తీరును చూసి పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. 

ముంబై : ప్రధాని మోదీ విదేశీ పర్యటన సూపర్‌ సక్సెస్‌ అంటూ బీజేపీ చెబుతోంది.. అంతా ఒట్టిదే అని కాంగ్రెస్‌ అంటోంది. ఈ నేపథ్యంలో స్వపక్షంలో విపక్షంలా ఉంది శివసేన పార్టీ తీరు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ప్రధాన మంత్రులను శివసేన అధికార పత్రిక సామ్నాలో ఆకాశానికి ఎత్తివేయడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. దేశ ఆర్థికాభివృద్ధికి పీవీ నరసింహారావు, డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ చేసిన కృషి మరిచిపోలేనిదని శివసేన అధిష్టానం వ్యాఖ్యానించింది ఆర్థికాభివృద్ధికి ఆ ఇద్దరు ప్రధానులు దశనిర్దేషం చేశారని గుర్తు చేసింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రధాని నరేంద్రమోదీ సఫలమయ్యారంటూ బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. విపక్ష కాంగ్రెస్‌ మాత్రం మోదీ తన స్వీయ ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపిస్తోంది. అయితే విపక్షాల వాదనకు బలం చేకూర్చేలా శివసేన పార్టీ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేడం దుమారం రేపుతోంది. కేంద్రంలోనూ మహారాష్ట్రలోనూ అధికార బీజేపీకి శివసేన భాగస్వామ్య పక్షంగా ఉంది. తాజాగా ఈ వ్యాఖ్యల ద్వారా తన మిత్రపక్షం బీజేపీకి షాక్‌ ఇచ్చింది.

హైదరాబాద్ అడవిలో ఉండాల్సిన పులి హటాత్తుగా ఓ ఊళ్లోకి వచ్చింది. ఊళ్లోకి వచ్చిన పులి ఎంతో భీభత్సం సృష్టించి గడగడలాడించిందనుకుంటే పొరపాటే. ఓ నీటి బిందెలో తలను పెట్టి తీరా అందులో ఇరుక్కోవడంతో గిలగిలలాడింది. ఈ విచిత్ర ఘటన రాజస్థాన్‌లోని భుతోలి అనే గ్రామంలో చోటుచేసుకుంది. ఊళ్లోకి వచ్చిన పులికి దాహం వేయడంతో దానికి ఓ బిందెలో నీళ్లు కనిపించాయి. ఇంకేముందే చూసిందే తడువుగా బిందెలో తల దూర్చి దాహం తీర్చుకుంది. ఇక దాహం తీరడంతో తలను బయటికి తీసేందుకు ప్రయత్నించింది. కానీ అందులో తల ఇరుక్కుపోవడంతో నానా తంటాలు పడింది. మొదట పులిని గమనించిన గ్రామస్తులు దగ్గరకు రావడానికి బయపడ్డారు. కానీ పులి తల బిందెలో ఉండటంతో అది ఏమీ చేయలేదని భావించి దగ్గరకు వెళ్లి చూశారు. పులిని రక్షించే ప్రయత్నం చేస్తే తమ ప్రాణాలకే ప్రమాదమని భావించి ఎవ్వరూ ఆ సాహసం చేయలేదు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఈ దృశ్యాల్ని తన మొబైల్ లో బందించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా వెళ్తోంది. 

పాట్నా : గత దశాబ్ద కాలంగా గూండాలు, నేర చరితులు బీహార్‌ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. బీహార్‌లో తాజాగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే స్పష్టమౌతోంది. ఇక్కడ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 99 మంది నేర చరితులున్నారు. గూండాలు ప్రత్యక్షంగా గానీ, లేదా వారి జీవిత భాగస్వాములను, బంధువులను రంగంలోకి దించడం ద్వారా రాజకీయాలను వేదికగా మలుచుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బు, అంగబలం ప్రధాన అవసరాలుగా నేటి రాజకీయ విలువలు మారిపోయాయి. ప్రస్తుత బీహార్‌ ఎన్నికల్లో నేర చరితుల సంఖ్య 99 మంది ఉండటం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

బిజెపి, జెడి(యు) పార్టీల నేతలే అధికం..
ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న బిజెపి, జెడి(యు) పార్టీల నుండి నేర చరితుల సంఖ్య అధికంగా ఉండటం గమనార్హం. ఇందులోనూ బిజెపి ప్రథమ స్థానంలో నిలిచింది. బిజెపి తరపున 47, జెడియు నుండి 38 మంది క్రిమినల్స్ పోటీ చేస్తుండగా, ఆర్‌జెడి నుండి ఆరుగురు బరిలో వున్నారు. కాంగ్రెస్‌ నుండి ముగ్గురు, జితన్‌ రాం మాంఝీ పార్టీ హెచ్‌ఎఎం నుండి ముగ్గురేసి చొప్పున పోటీలో ఉన్నారు. ఒకరు ఎల్‌జెపి తరపున, మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఇందులో 30 మంది అభ్యర్థులు తీవ్ర నేరాలైన హత్య, కిడ్నాప్‌, బలవంతపు వసూళ్లు, దోపిడీ తదితర అభియోగాలను ఎదుర్కొంటున్నారు. తీవ్ర నేరాలనెదుర్కొంటున్న ఈ 30 మందిలో మహా కూటమికి చెందినవారు 17 మంది ఉండగా, బిజెపి తరపున 13 మంది ఉన్నారు. వరిసాలిగంజ్‌ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న జెడి(యు) అభ్యర్థి ప్రతాప్‌ కుమార్‌పై అత్యధికంగా 32 కేసులు నమోదై ఉన్నాయి. తర్వాతి స్థానానికి నవడ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఆర్‌జెడి అభ్యర్థి రాజ్‌వల్లభ్‌ యాదవ్‌ ఆక్రమించారు ఈయనపై 17 కేసులున్నాయి.

అనిల్ సింగ్ పై తీవ్రమైన నేర అభియోగాలు...
బిజెపి తరపున ఛాటపుర్‌ నుండి పోటీ చేస్తున్న నీరజ్‌ సింగ్‌, హిసువ్‌ నుండి పోటీ చేస్తున్న అనిల్‌ సింగ్‌పై కూడా తీవ్రమైన నేర అభియోగాలు నమోదైనాయి. జహనాబాద్‌ నుండి ఆర్‌జెడి తరపున పోటీ చేస్తున్న సురేంద్ర ప్రసాద్‌పై కూడా తీవ్రమైన కేసులున్నాయి. ఇటీవల శాసనమండలికి ఎన్నికైన సంచలనాత్మక గ్యాంగ్‌స్టర్‌ రిట్లాల్‌ యాదవ్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇతడి సోదరుడిని దనపుర్‌ నియోజకవర్గం నుండి రంగంలోకి దింపాడు. జైలు శిక్ష అనుభవించిన 'బాహుబలి'గా పిలవబడే మాజీ ఎంపి ఆనంద్‌ మోహన్‌ భార్య లవ్లీ ఆనంద్‌ హీహార్‌ నుండి హిందుస్తానీ అవాం మోర్చ (హెచ్‌ఎఎం) తరపున పోటీకి రంగం సిద్ధమైంది. ఈమె గత పార్లమెంటు ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ టిక్కెట్‌ మీద, 2009లో కాంగ్రెస్‌ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసింది.

హైదరాబాద్ : బీహార్‌ ఎన్నికల్లో నితీష్‌ను అడ్డుకోవడానికి బిజెపి కుయుక్తులు పన్నుతోంది. నవాడా ఎన్నికల సభలో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ప్రసంగాన్ని బిజెపి కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకునే యత్నం చేశారు. మోదికి మద్దతుగా బిజెపి జెండాలు ప్రదర్శిస్తూ- నితీష్‌ ప్రసంగానికి అడ్డు తగిలారు. ఎన్నికలను ఎదుర్కోలేకపోతున్న బిజెపి ఇలాంటి చీప్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని జెడియు ధ్వజమెత్తింది. ఓటమి భయంతో నిరాశకు లోనైన బిజెపి శ్రేణులు ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నేత వసిష్ట నారాయణ్‌సింగ్‌ అన్నారు. 

హైదరాబాద్: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న కారణంతో ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. రిజర్వేషన్ల పేరిట జనాన్ని రెచ్చగొడుతూ సమాజంలో విద్వేషాలు సృష్టిస్తున్నారన్న ఆరోపణలతో లాలూపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రిజర్వేషన్లపై ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలపై లాలూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనని ఉరి వేసినా దళిత, బిసి వర్గాల రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని లాలు ప్రకటించారు. లాలూపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం అన్యాయమని, బిజెపి కక్ష్యపూరిత చర్యలకు దిగుతోందని జెడియు నేత కెసి త్యాగి పేర్కొన్నారు. 

హైదరాబాద్ : అంతర్జాతీయ సరిహద్దులో ఎలాంటి గోడ నిర్మాణం చేపట్టే ఆలోచన భారత్‌కు లేదని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ఐజి స్పష్టం చేశారు. జమ్ముకాశ్మీర్‌లో ఎల్వోసి వద్ద భారత్‌ గోడ నిర్మాణం చేపడుతోందని పాకిస్తాన్‌ సెప్టెంబర్‌ 9న ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి ఫిర్యాదు చేసింది. 197 కిలోమీటర్ల పొడవు 10 మీటర్ల ఎత్తుతో భారత్‌ గోడ కడుతున్నట్టు యుఎన్‌ఓలో పాక్‌ రాయబారి మలీహా లోధి సెక్యూరిటీ కౌన్సిల్‌కు లేఖ రాస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. హిజ్బుల్‌ ముజాహిదిన్‌ నేత సయీద్‌ సలావుద్దీన్‌ ప్రకటన ఆధారంగా పాకిస్తాన్‌ ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసినట్టు భారత్‌ పేర్కొంది.

హైదరాబాద్ : ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో ముంబై డొమెస్టిక్, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్, తాజ్‌ హోటల్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముంబై ఎయిర్‌పోర్ట్, తాజ్‌ హోటల్‌పై బాంబులతో దాడులు జరుపుతామని ఎయిర్‌పోర్ట్‌ మేనేజర్‌కు నిన్న రాత్రి ఫోన్‌ కాల్‌ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. మూడు చోట్ల వాహనాల్లో పేలుడు పదార్థాలు పెట్టినట్టు కూడా అజ్ఞాతవ్యక్తి ఫోన్‌లో చెప్పాడు. ఇది ఫేక్‌ కాల్‌ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హైసెక్యూరిటీ జోన్‌లో ఎయిర్‌పోర్టు, తాజ్‌ హోటల్‌ వద్ద భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. 2008లో నవంబర్‌లో తాజ్‌ హోటల్‌పై పాక్‌ ఉగ్రవాదులు దాడి జరిపిన విషయం తెలిసిందే. 

హైదరాబాద్ : లారీ యజమానులు సమ్మె బాట పట్టారు. అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా 72 లక్షల లారీలు, ట్రక్కులు ఎక్కడివక్కడే నిలిచిపోనున్నాయి. దీని ప్రభావం పెట్రోల్ బంక్ ల మీద కూడా పడే అవకాశం వుంది. సరుకు రవాణా రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న లారీల ఓనర్స్ సమ్మెకు కారణం ఏమిటి? లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్య లేమిటి? వీరు ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నదేమిటి?

నిత్యావసరాల సరఫరాలో కీలకపాత్ర లారీ ట్రాన్స్ పోర్ట్ దే...

మన దేశంలో సరుకులు, నిత్యావసరాల సరఫరాలో కీలకపాత్ర పోషిస్తున్నది లారీ ట్రాన్స్ పోర్ట్ రంగం. మన దేశంలో సరుకుల రవాణా రంగంలో 65శాతం దాకా రోడ్డు మార్గం ద్వారానే సరఫరా అవుతోంది. కొద్ది రోజుల పాటు లారీల రవాణా స్తంభిస్తే, అనేక గ్రామాలకు, పట్టణాలకు నిత్యావసరాలు అందని పరిస్థితి ఎదురవుతుంది. మన దేశంలో దాదాపు 72 లక్షల లారీలు, ట్రక్కులున్నట్టు అంచనా. అయితే, మన దేశంలో అయిదుకంటే తక్కువ లారీలు కలిగిన యజమానుల సంఖ్యే ఎక్కువ. పదికి మించి లారీలు, ట్రక్కులు కలిగినవారి శాతం చాలా తక్కువ. వందల సంఖ్యలో లారీలున్న యజమానులు మరీ స్వల్పం. ఒకట్రెండు వాహనాలు మాత్రమే కలిగినవారిలో చాలామంది డ్రైవర్లను పెట్టుకోలేక తామే స్వయంగా వాహనాలు నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.

విభజన తర్వాత పెరిగిన సమస్యలు..

ఇక రాష్ట్ర విభజన తర్వాత తమ సమస్యలు మరింత పెరిగినట్టు రెండు తెలుగు రాష్ట్రాల లారీల యజమానులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సరుకు రవాణాకు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ విధానం ప్రవేశపెట్టాలని ఇరు రాష్ట్రాల లారీ యజమానులు కోరుతున్నారు. అయితే, ఈ సింగిల్ పర్మిట్ విధానం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య అవగాహన కుదరకపోవడంతో లారీ యజమానుల మీద ఆర్థికభారం పడుతోంది. టెంపరరీ పర్మిట్ కోసం డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. రాష్ట్ర విభజనకు పూర్వం మాదిరిగానే ఇప్పటికీ 23 జిల్లాలకు కలిపి క్వార్టర్ చార్జీలు వసూలు చేస్తుండడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నట్టు లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే పెట్రోల్, డీజిల్ పై పన్ను బాదుడు ఎక్కువగా వుంది. ఇప్పటికే ఉభయ రాష్ట్రాల్లో పెట్రోల్ పై 33శాతం, డీజీల్ 22. 25శాతం వ్యాట్ వసూలు చేస్తుండగా, అది చాలదన్నట్టు గత ఫిబ్రవరి నుంచి లీటరుకి మరో నాలుగు రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వం అదనంగా వసూలు చేస్తోంది. ఇసుక అక్రమ రవాణా, ఓవర్ లోడింగ్ పేరుతో అధికారులు తమను తరచూ వేధిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లారీలకు పార్కింగ్ సౌకర్యం లేదు. .....

హైదరాబాద్ తో పాటు ఉభయ రాష్ట్రాల్లోని అనేక పెద్ద పట్టణాలలో లారీలకు పార్కింగ్ సౌకర్యం లేదు. దీంతో ఎప్పుడైనా రోడ్డు పక్కన పార్కింగ్ చేస్తే వెంటనే ట్రాఫిక్ పోలీసులు వచ్చి, చలాన్లు రాస్తున్నారన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ గేట్లు , అక్కడ వసూలు చేస్తున్న టోల్ రుసుములు తమ నడ్డివిరిస్తున్నాయని లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా లారీ యజమానులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రోడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా వుండడం. లారీ కిరాయిలపై టీడీఎస్ ను రద్దు చేయాలని లారీ యజమానులు కోరుతున్నారు. 

హైదరాబాద్ : అరుదైన సూపర్‌మూన్‌ చంద్రగ్రహణం వీక్షకులను అలరించింది. దాదాపు గంటపాటు కనిపించిన ఈ అరుదైన దృశ్యాన్ని ప్రజలు వీధుల్లోకి వచ్చి వీక్షించారు. ఎరుపెక్కిన చంద్రుడి దృశ్యాలను స్మార్ట్‌ ఫోన్‌లలో, కెమెరాల్లో బంధించారు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, పశ్చిమ ఐరోపా దేశాల్లో ఈ దృశ్యం కనువిందు చేసింది. భారత్‌కు మాత్రం నిరాశపరచింది.

చంద్రుడు దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రయాణించినప్పుడు సూపర్‌మూన్‌ ఏర్పడుతుంది...

శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం చంద్రుడు దీర్ఘవృత్తాకార కక్ష్యలో పయణించినప్పుడు సూపర్‌మూన్‌ ఏర్పడుతుంది. అప్పుడు చంద్రుడి భూకక్ష్య 2లక్షల 26వేల000 మైళ్ల దగ్గరలో ఉంటుంది. దీంతో చంద్రుడు ఆకాశంలో పెద్ద రూపంలో కనిపిస్తాడు. చంద్రుడ్ని భూమి నుంచి వీక్షిస్తే 14శాతం పెరిగిన వ్యాసంతో, ఎరుపైన రంగులో కనిపిస్తాడు. దీనిని సూపర్‌మూన్‌ చంద్రగ్రహణమని, హార్వెస్ట్‌మూన్‌ ఎక్లిప్స్‌, సూపర్‌బ్లడ్‌ మూన్‌ అంటూ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా నామకరణం చేసింది.

1900 నుంచి సూపర్‌మూన్‌ కేవలం ఐదు సార్లే సంభవించింది.....

సాధారణంగా చంద్రుడు, సూర్యుడి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీంతో భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. ఇది సాధారణంగా పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. చంద్రుడు ఎరుపురంగులో కనిపించే దృశ్యం దశాబ్ధాల్లో ఓ సారి మాత్రమే కనిపిస్తోంది. 1900 నుంచి సూపర్‌మూన్‌ కేవలం ఐదు సార్లే సంభవించిందని నాసా వెల్లడించింది. సూపర్‌మూన్‌ చంద్రగ్రహణం 1982లో సంభవించిందని, తర్వాత 2033లోనే ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించగలమని తెలిపింది.

'సూపర్‌మూన్‌' వల్ల సముద్రంలో అత్యధిక ఆటుపోటులు.......

ఇదిలా ఉంటే సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 2 వరకు బంగాళాఖాతంలో 'సూపర్‌మూన్‌' అనే ఖగోళ ప్రక్రియ వలన సముద్రంలో అత్యధిక ఆటుపోటులు ఏర్పడవచ్చని విశాఖలోని బంగాళాఖాతం అధ్యయన కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావంతో అక్టోబరు 2 వరకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశముందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్ : పోలీసులు కాఠిన్యం ప్రదర్శించారు. మానవత్వం మరచిపోయి.. ఓ అమ్మాయిపై దుర్భాషలాడారు. అందరూ చూస్తుండగా చేతులకు పనిచెప్పారు. దెబ్బ మీద దెబ్బ. చితగ్గొట్టారు. తర్వాత ఓవైపుకు లాగి పడేశారు. ఈ దృశ్యాలకు ముంబై వేదికైంది. ఇక.. అమ్మాయిపై చేయి చేసుకుంది మహిళా పోలీసులు కావటం ఆశ్చర్య కలిగిస్తోంది. ముంబైలో అత్యంత రద్దీగా వుండే లాల్‌బాగ్‌లో... వినాయక నిమజ్జనం సందర్భంగా ఇది జరిగినట్లు తెలుస్తోంది. క్యూ లైన్లో వెళ్లకుండా.. నిబంధనలకు విరుద్ధంగా ఆ యువతి ప్రవర్తించినందువల్లే.. అలా వ్యవహరించాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. సెల్‌ ఫోన్‌లో చిత్రీకరించిన ఈ దృశ్యాలు... ప్రస్తుతం సామాజిక వెబ్‌సైట్లలో హల్ చల్ చేస్తున్నాయి. పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మహారాష్ట్ర సీఎం దేవేంద్రఫడ్నవీస్‌... ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించారు.  

హైదరాబాద్ : యూపిఏ చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాలను తానే మొదలెట్టినట్టుగా ప్రధాని నరేంద్ర మోది గొప్పలు చెప్పుకుంటున్నారని కాంగ్రెస్‌ దుయ్యబట్టింది. అమెరికా పర్యటనలో 2014కు ముందు దేశంలో ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ లేదని మోది పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. ఇన్ఫర్మేషన్, టెలికాం రంగాలను భారత్‌లో ప్రవేశ పెట్టింది దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీయేనని ఆ పార్టీ నేత ఆనంద్‌శర్మ అన్నారు. డిజిటల్‌ ఇండియాకు కూడా తానే ఏదో చేస్తున్నట్టు మోది చెబుతున్నారని, 2011లోనే 'నేషనల్‌ మిషన్‌ మోడ్‌ ప్రాజెక్ట్‌' పేరిట ఆప్టికల్‌ ఫైబర్ ప్రాజెక్టు ప్రారంభమైందన్నారు. ఇందు కోసం 20 వేల కోట్లు కేటాయించడం జరిగిందని, బిజెపి అధికారంలోకి రాకముందే 70 శాతం పనులు కూడా పూర్తయ్యాయన్నారు. అలాగే జి4 దేశాల కూటమి కూడా ఇప్పుడు ప్రారంభం కాలేదని, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ జీ 4 దేశాలతో ఇంతకు ముందే సమావేశమయ్యారని గుర్తు చేశారు.

 

హైదరాబాద్ : గృహ హింస కేసులో ఆప్‌ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సాయంత్రం ఆరు గంటల్లోగా లొంగిపోవాలని ఆయనను కోర్టు ఆదేశించింది. ముందు లొంగిపోండి, తరువాత మధ్యవర్తిత్వం గురించి ఆలోచించవచ్చని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. అయితే ఈ సమాచారాన్ని సోమనాథ్ భారతి తనకు అందుబాటులోకి రాగానే తెలియజేస్తానని ఆయన తరపు న్యాయవాది విజయ్ అగర్వాల్ చెప్పారు. సోమనాథ్‌ భారతి భార్య లిపికా ఫిర్యాదు మేరకు ఆయనపై గృహహింస, హత్యాయత్నం కేసు నమోదైంది. పోలీసులకు లొంగిపోకుండా సోమనాథ్ భారతి తప్పించుకుతిరుగుతున్నారు.

హైదరాబాద్: బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఊరట లభించింది. కోల్‌ స్కాంలో సిబిఐ కోర్టు మన్మోహన్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. మన్మోహన్‌ సింగ్‌ను నిందితుడిగా చేర్చాలని మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు సిబిఐ కోర్టుకు లిఖితపూర్వకంగా తెలియజేసిన నేపథ్యంలో మాజీ ప్రధానికి గొప్ప ఊరట లభించినట్టయ్యింది. అంతకు ముందు జార్ఖండ్‌ మాజీ సిఎం మధుకోడా కూడా మన్మోహన్‌ ని నిందితుడిగా చేర్చాలని, ఆయనను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.  

హైదరాబాద్ : ఖగోళంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. చంద్రుడు భూమికి అతి సమీపానికి రావడంతో ఇవాళ తెల్లవారు జామున సూపర్‌ మూన్‌ ఏర్పడింది. ఈ నెల 14న ఒకసారి చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చాడు. దీని ప్రభావంతో.. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, అక్టోబర్‌ 2 వరకూ తీరప్రాంతాల్లోని ప్రజలు అప్రమ్తతంగా ఉండాలని ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషియన్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ హెచ్చరించింది. ఇవాళ పౌర్ణమి కూడా కావడంతో సముద్రంలో తీవ్ర పోటు ఏర్పడనుందని తెలిపింది. సూపర్‌మూన్‌ వల్ల భారతదేశంలోని తూర్పు, పశ్చిమ తీరాల్లో అనేకచోట్ల ఆటుపోట్లు సంభవించనున్నాయి. దీనివల్ల 30వ తేదీ వరకు సుమారు ఐదడుగుల ఎత్తులో అలలు రావొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

 

హైదరాబాద్ : భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడి ఎన్నికకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ...రోజుకో పేరు బయటకు వస్తోంది. శరద్ పవార్, రాజీవ్ శుక్లా, అమితాబ్ చౌదరి, సౌరవ్ గంగూలీ పేర్లు పోయి... ఇప్పుడు సరికొత్తగా బోర్డు మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. శరద్ పవార్, అనురాగ్ ఠాకూర్ వర్గాల సంయుక్త అభ్యర్ధి శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి....

.రోజుకో కొత్తపేరు షికారు....

భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడుగా అసాధారణ సేవలు అందించిన జగ్ మోహన్ దాల్మియా ఆకస్మిక మృతితో...ఆయన వారసుడి ఎంపికకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ...రోజుకో కొత్తపేరు షికారు చేస్తోంది. దాల్మియా మరణవార్త వచ్చిన కొద్ది గంటల్లోనే....దాల్మియాస్థానాన్ని భర్తీ చేసేవారిని ఎంపిక చేయడం కోసం..వచ్చే రెండువారాలలో బోర్డు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ నిర్ణయించడంతో...పలువురి పేర్లు బయటకు వచ్చాయి.

కింగ్ మేకర్ గా ఎన్. శ్రీనివాసన్...

బోర్డు సరికొత్త అధ్యక్షుడి ఎన్నికలో ఐసీసీ చైర్మన్ ఎన్ .శ్రీనివాసన్ కింగ్ మేకర్ కాబోతున్నారని....ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడు శరద్ పవార్, బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, జార్ఖండ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అమితాబ్ చౌదరిల్లో ఎవరో ఒకరు అధ్యక్షస్థానానికి ఎంపికయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది. ఒకదశలో ..క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ కాబోయే అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేరు సైతం వినిపించింది. అయితే..ఇప్పుడు తాజాగా మాజీ అధ్యక్షుడు, విదర్భ క్రికెట్ సంఘానికి చెందిన శశాంక్ మనోహర్ పేరు బయటకు వచ్చింది.

భారత క్రికెట్ బోర్డు అధ్యక్ష ఎన్నికలో మొత్తం 30 ఓట్లు......

భారత క్రికెట్ బోర్డు అధ్యక్ష ఎన్నికలో మొత్తం 30 ఓట్లు ఉంటాయి. ఇందులో శ్రీనివాసన్ వర్గం చేతిలో 10 ఓట్లు ఉంటే....కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, అరుణ్ జైట్లీ, శరద్ పవార్ వర్గాల చేతిలో మిగిలిన 20 ఓట్లు ఉన్నాయి. అయితే ..పవార్, జైట్లీ, అనురాగ్ ఠాకూర్ వర్గాలు సంయుక్తంగా...శశాంక్ మనోహర్ ను బలపరుస్తూ ఉండటంతో...ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2008 నుంచి 2011 వరకూ బోర్డు అధ్యక్షుడుగా....

2008 నుంచి 2011 వరకూ బోర్డు అధ్యక్షుడుగా పనిచేసిన సమయంలో శశాంక్ మనోహర్ కు వివాదరహితుడుగా పేరుంది. పైగా కష్టపడి పనిచేసే స్వభావం కూడా శశాంక్ మనోహర్ కు ఉపయోగపడగలదని భావిస్తున్నారు. మహారాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజయ్ షిర్కీ మాటల్లో చెప్పాలంటే...దాల్మియా వారసుడిగా, బోర్డు సరికొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఎంపిక దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

హైదరాబాద్ : మొబైల్ మార్కెట్‌లో గూగుల్‌ మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. అదిరిపోయే ఫీచర్లతో నెక్సస్ ఫైవ్ ఎక్స్ పేరుతో వీటిని తీసుకురానుంది. రెండు రోజుల్లో మార్కెట్‌లోకి రిలీజవుతున్న నెక్సస్ ఫైవ్ ఎక్స్ విశేషాలేంటో చూద్దాం....

ఐదేళ్ల క్రితం మొబైల్‌ ఫోన్లలో నెక్సస్ సిరీస్‌.....

ఐదేళ్ల క్రితం మొబైల్‌ ఫోన్లలో నెక్సస్ సిరీస్‌ ను ప్రారంభించింది గూగుల్. ఇప్పుడు ఇదే సిరీస్‌లో నెక్సస్ ఫైవ్ ఎక్స్ ను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. సెప్టెంబర్ 29న అఫీషియల్‌గా వీటిని లాంఛ్‌ చేస్తోంది.

ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ మార్షమల్లో.....

యాపిల్, శామ్‌సంగ్, సోని, మోటరోలా కంపెనీలు గడచిన రెండు నెలల్లో కొత్త ఫోన్లను రిలీజ్ చేశాయి. ఇప్పుడు గూగుల్ వంతు. లేటెస్ట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ "ఆండ్రాయిడ్ మార్షమల్లోతో'' నెక్సస్ ఫైవ్‌ ఎక్స్‌ ను లాంచ్‌ చేయాలని భావిస్తోంది.న్యూ క్రోమ్ కాస్ట్ న్యూస్‌ కూడా ఇందులో ఉంటుందట. అంతేకాదు స్ఫూటితో భాగస్వామ్యం, అప్‌డేటెడ్ యాప్‌ నెక్సస్‌ కొత్త వెర్షన్‌లో ఉంటుందని గూగుల్ తెలిపింది. దీంతో నెక్సస్‌ ఫైవ్‌ ఎక్స్‌పై అందరిలోనూ అంచనాలు పెరుగుతున్నాయి. దీని షేప్‌ ఎలా ఉంటుందో స్పష్టంగా బయటపడక పోయినా.. కొన్ని ఇమేజెస్‌ నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

డిస్‌ ప్లే 5.2 అంగులాలు......

దీని ఫీచర్ల విషయానికి వస్తే...నెక్సస్ ఫైవ్ ఎక్స్ డిస్‌ ప్లే భారీగా ఉంటుందని తెలుస్తోంది. దాదాపు 5.2 ఇంచెస్ డిస్‌ప్లే, 1080p రెజల్యూషన్‌ లు ఆకర్షణగా చెబుతున్నారు.

ఫింగర్ ప్రింట్ సెన్సర్....

ఫింగర్ ప్రింట్ సెన్సర్. గూగుల్ నెక్సస్‌ ఫైవ్ ఎక్స్ లో హైలెట్‌. ఈ ఫీచర్‌ తప్పకుండా మార్కెట్లో తమ ఫోన్లకు క్రేజ్ పెంచుతుందని గూగుల్ భావిస్తోంది. ఇక ఫోన్ వెనుక భాగం.. సిల్వర్‌ కలర్‌లో‌ ఉంటుందని తెలుస్తోంది. కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే... వెఉక భాగాన థర్టీన్ మెగాపిక్సల్‌ .. ముందు భాగాన 5 మెగా పిక్సల్‌ రిజల్యూషన్‌ ఉన్నట్లు చెబుతున్నారు. 2జీబీ లేదా 3జీబీ ర్యామ్‌తో ఫోన్‌ స్పీడ్ దూసుకుపోతుందని తెలుస్తోంది. 16 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉండొచ్చని నెటిజన్ల అంచనా. మొత్తానికి ఎన్నో అంచనాలతో మార్కెట్లోకి ఎంటరవుతున్న గూగుల్ నెక్సస్ ఫైవ్ ఎక్స్...ధర కూడా ఆ రేంజ్‌లో ఉంటుందని ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు.

Pages

Don't Miss