National News

హైదరాబాద్ : మూడు రోజుల బ్రిటన్‌ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ..రెండో రోజు శుక్రవారం బిజీ బిజీగా గడిపారు. రెండు రోజు ఉదయం బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్‌తో ఆయన అధికారిక నివాసం చెకర్స్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యూకేకు వెళ్లే భారత విద్యార్థుల వీసా సమస్యలను పరిష్కరించాలంటూ మోదీ కోరారు. విద్యారంగంలో భారత్, యూకే మధ్య పటిష్ఠమైన సత్సంబంధాలు ఉన్నాయని మోదీ అన్నారు. భారత విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా తర్వాత యూకేను ఎన్నుకొంటారన్నారు. అయితే యూకేకు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది 50శాతానికి తగ్గిందని..వీసా తీసుకునే సమయంలో ఎదుర్కొనే సమస్యల వల్లే విద్యార్థులు యూకేలో చదవడానికి ఆసక్తి చూపడంలేదని మోదీ..బ్రిటన్ ప్రధానితో అన్నారు. మోదీ లేవనెత్తిన వీసా సమస్యలపై బ్రిటన్‌ ప్రధాని సానుకూలంగా స్పందించారని భారత విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. అయితే, ఒక్కసారితో సమస్య పరిష్కారం కాదని, ఈ అంశంపై మరింత చర్చ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారని వెల్లడించాయి. అంతకుముందు ప్రధాని మోదీ డేవిడ్ కామెరాన్‌కు స్వామి వివేకానంద చిత్రపటాన్ని బహుమతిగా అందించారు. వీటితోపాటు చెక్క, పాలరాయి, వెండితో తయారు చేసిన అరుదైన కానుకను కూడా అందించారు.

కామెరూన్‌తో మోదీ సమావేశం......

బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌తో భేటీ అయిన తర్వాత సీఈవోలతో రౌండ్‌టేబుల్ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. అనంతరం బ్రిటన్ రాణి ఎలిజబెత్‌ ఆతిథ్యాన్ని మోదీ స్వీకరించారు.ఈ సందర్భంగా క్వీన్ ఎలిజబెత్‌తో మోదీ కాసేపు ముచ్చటించారు. అనంతరం బ్రిటన్ రాణికి ప్రధాని మోదీ అరుదైన కానుకలు అందించారు. 54 ఏళ్ల క్రితం క్వీన్ ఎలిజబెత్ భారత్‌లో పర్యటించిన అరుదైన ఫొటోలను మోదీ క్వీన్ ఎలిజబెత్‌కు బహుమతిగా అందించారు.

వెంబ్లీ మైదానంలో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగం....

అనంతరం రాత్రి 9.45 నిమిషాలకు ప్రధాని మోదీ వెంబ్లీ మైదానంలో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి 60వేల మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ప్రధాని ప్రసంగానికి ముందు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తొలుత భారతీయుల ప్రసంగించిన బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్..వెంబ్లీ స్టేడియంలో ఇదొక చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. భారతీయుల పెట్టుబడులు బ్రిటన్‌లో పలువురికి ఉపాధి కల్పిస్తున్నాయన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలిసి పనిచేస్తామన్నారు. భారత్‌కు బ్రిటన్ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.

భిన్నత్వంలో ఏకత్వమే మన శక్తి .....

ఆ తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. భిన్నత్వంలో ఏకత్వమే మన శక్తి అని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశంలో యువతకు కొదవలేదని..ఇక వెనుకబాటుతనం అన్న ప్రశ్నే రాదని వ్యాఖ్యానించారు. యువత కలలను సాకారం చేసే శక్తి దేశానికి ఉందన్నారు. 12 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా మీ ముందుకు వచ్చానని..భారత దేశ ప్రజలు నేడు తనకు కొత్త బాధ్యతను అప్పగించారన్నారు. తనకు లభించిన స్వాగతానికి కృతజ్ఞుడినన్నారు. భారత్‌లో కబీర్, రహీమ్‌ల మాటల అందరికీ ప్రేరణనిస్తాయని..సూఫీల సంస్కృతి అర్థం చేసుకుంటే ఎవరూ తుపాకి పట్టరని మోదీ అన్నారు.

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా.....

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ను అంతర్జాతీయ సంస్థలన్నీ గుర్తిస్తున్నాయని మోదీ అన్నారు. ఈ అభివృద్ధి ఫలాలు త్వరలోనే అందరికీ అందుతాయని..స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లయినా భారత్‌లోని 18 వేల గ్రామాల్లో ఇంకా విద్యుత్ సౌకర్యం లేదన్నారు. ఒక చాయ్ అమ్ముకున్న వ్యక్తి, ఓ పేదవాడి కొడుకు ఎర్రకోటపై నుంచి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయగలడని కలలో కూడా అనుకోలేదు. కానీ అది సాధ్యమైందన్నారు మోదీ. మొత్తానికి వెంబ్లీ స్టేడియంలో ప్రధాని మోదీ ప్రసంగానికి ప్రవాస భారతీయులు మంత్ర ముగ్దులయ్యారు. మోదీ ప్రసంగిస్తున్నంత సేపు మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. 

హైదరాబాద్ : ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ ఉగ్రదాడితో అల్లాడిపోయింది. ఫ్రాన్స్‌ కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత.. ఉగ్రవాదులు నగరంలోని పలుచోట్ల అటాక్‌ చేశారు. 170 మందికి పైగా ఈ ఉగ్రదాడుల్లో చనిపోయారు. బాటక్లాన్‌ అనే థియేటర్‌లో టెర్రరిస్టులు వందమందిని బంధించి.. కాల్చి చంపారు. మూడుచోట్ల బాంబులు పేల్చారు. దాదాపు మరో ఆరు చోట్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో మరో 70 మంది చనిపోయినట్లు సమాచారం. ఫ్రాన్స్‌ సరిహద్దులను మూసేసి ఎమర్జెన్సీని విధించారు. మొత్తం సైన్యం రంగంలోకి దిగింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ బాన్‌కీ మూన్‌ ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా ఈ ఉగ్రదాడిని ఖండించారు. జర్మనీ ఛాన్సెలర్‌ ఏంజెలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ముగ్గురు టెర్రరిస్టులను భద్రతా దళాలు కాల్చి చంపినట్లు సమాచారం. అయితే ఫ్రాన్స్‌ ప్రభుత్వం అధికారికంగా ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు.

ఉత్తరప్రదేశ్‌ : వారణాసిలో దారుణం చోటుచేసుకుంది. బల్గేరియాకు చెందిన 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి జరిగింది. వారణాసిలోని ననద్ నగర్‌లో ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో విదేశీ యువతి పేయింగ్ గెస్ట్ గా ఉంటోంది. ఆమె రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోండగా ఇద్దరు వ్యక్తులు యాసిడ్ దాడి చేసి పారిపోయారు. స్థానికులు వెంటనే ఆ విదేశీ యువతిని బనారస్‌ హిందూ యూనివర్సిటీలోని సుందర్‌లాల్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక వార్డులో వైద్యులు ఆమెకు చికిత్స జరిపిస్తున్నారు. ఆమె ముఖంతో పాటు శరీరంలోని ఇతర భాగాలపై గాయాలయ్యాయి. విషయం తెలియగానే స్థానిక పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాధితురాలు బల్గేరియాలోని వర్నాకు చెందినవారు.

 

ఢిల్లీ : దేశంలో గాడ్సేను పొగిడిన ప్రధాని మోడీ... లండన్‌ పార్లమెంట్ ఆవరణలో గాంధీని పొగడటం బీజేపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి విమర్శించారు. దేశంలో మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్న మోడీకి బీహార్‌ ఎన్నికలు చావుదెబ్బవంటివని అన్నారు. మోడీ చేస్తున్న విదేశి పర్యటనలన్నీ మన దేశంలోకి విదేశీ పెట్టుబడుదారులకు రెడ్‌ కార్పెట్‌ వేసేందుకేనని చెప్పారు.

ఛత్తీస్‌ఘడ్‌ : దండకారణ్యం మళ్లీ ఉలిక్కిపడింది. ఎర్రటి నెత్తురుతో పచ్చని అడవిలో భయానక వాతావరణం నెలకొంది. ఛత్తీస్‌ఘడ్‌ బీజాపూర్‌ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో మావోయిస్టు యాక్షన్‌ టీం కమాండర్‌ రైనా ఉన్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. భారీ ఎత్తున ఆయుధాలతో పాటు డంప్‌ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని విప్లవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మావోయిస్టులే మృతి చెందటం, పోలీసులకు కనీస గాయాలు కూడా కాకపోవటం ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.

 

హైదరాబాద్ : చైనా ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆన్ లైన్ సేల్స్ తో వరల్డ్ లోనే నెంబర్ వన్ గా నిలిచేందుకు సరికొత్త ప్రణాళికలతో దూసుకెళ్తున్న ఈ ఇ-కామర్స్ దిగ్గజం... ఒకేరోజు 13.8బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిపి... ఇతర సంస్థలకు దిమ్మతిరిగేలా చేసింది.

తన రికార్డును తానే బద్ధలు కొట్టేసుకున్న ఆలీబాబా గ్రూప్....

ఈ కామర్స్ జైంట్ అలీబాబా గ్రూప్ తన రికార్డును తానే బద్ధలు కొట్టేసుకుంది. గత ఏడాది ఒక్క రోజు జరిపిన అమ్మకాలకన్నా ...ఈ ఏడాది ఒకే రోజు రికార్డు శాతంలో అమ్మకాలు జరిపి దాదాపు 50శాతం అధిక ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది ఈ సంస్థ ఒకరోజు ఆన్ లైన్ ద్వారా దాదాపు 9.3 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిపి రికార్డు సృష్టించగా ఈసారి దానిని అధిగమించి 13.8 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను విక్రయించి చరిత్ర సృష్టించింది. మన కరెన్సీలో ఈ మొత్తం 9వేల వందకోట్ల రూపాయలకు సమానం.

చైనాకు చెందిన బీడీఏ అనే సంస్థ ధృవీకరణ....

అలీబాబా రికార్డును చైనాకు చెందిన బీడీఏ అనే సంస్థ ధృవీకరించింది. చైనా ఈ కామర్స్ మార్కెట్‌లో అలిబాబా నంబర్ వన్. కస్టమర్ల నుంచి లభించిన అపూర్వ స్పందనకు... కృతజ్ఞతలు తెలిపిన అలీబాబా ప్రతినిధులు... రాబోయే రోజుల్లో ఈ జోరును ఇలాగే కొనసాగించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటామని తెలిపారు. మరో ఐదేళ్లలోగా చైనా ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్ సంస్థగా మారనుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం అలీబాబా ప్రపంచవ్యాప్తంగా అమ్మకాల పరంగా రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో అమెరికాకు చెందిన అమేజాన్ ఇకామర్స్ నిలిచింది. అమేజాన్ తరహాలోనే అలీబాబా కూడా ఇతర దేశాల్లో పాగా వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అవే జరిగితే.. వచ్చే ఐదేళ్లలో ఈ సంస్థ అమేజాన్ ను మించిపోవడం ఖాయం. 

హైదరాబాద్ : ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్‌ క్రికెట్‌ అసోసియేషన్- డిడిసిఏ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఢిల్లీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన వినోదపు పన్నును డిడిసిఏ ఎగ్గొట్టడంతో కేజ్రీవాల్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇందుకోసం ఇద్దరు సభ్యులతో ఓ కమిటీని నియమించింది.

24 కోట్ల వినోదపు పన్ను చెల్లించాల్సి ఉంది...

డిడిసిఏ ఢిల్లీ ప్రభుత్వానికి 24 కోట్ల వినోదపు పన్ను చెల్లించాల్సి ఉంది. 1996 ఢిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ బెటింగ్‌ టాక్స్‌ యాక్ట్‌ ప్రకారం ఆప్‌ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌ పన్ను చెల్లించడానికి 24 గంటల సమయమిచ్చింది.

భారత్‌-సౌతాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యే అవకాశం...

ఒకవేళ డిడిసిఏ పన్ను చెల్లించకపోతే ఫిరోజ్‌షాకోట్లలో భారత్‌-సౌతాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన నాలుగో క్రికెట్‌ టెస్ట్‌ రద్దయ్యే అవకాశం ఉంది. నాలుగో టెస్ట్‌ డిసెంబర్‌ 2న ప్రారంభం కానుంది. టాక్స్‌ కడితేనే మ్యాచ్‌కు అనుమతిస్తామని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

డిడిసిఏ ఆర్థిక పరిస్థితి దివాళా తీసినట్టు సమాచారం.....

డిడిసిఏ ఆర్థిక పరిస్థితి దివాళా తీసినట్టు సమాచారం. టెస్ట్‌ ప్రారంభానికి ముందు అడ్వాన్స్‌గా కోటి రూపాయల టాక్స్ మాత్రమే చెల్లించే అవకాశం కనిపిస్తోంది. మిగతా బకాయిలను టెస్ట్‌ మ్యాచ్‌ తర్వాత చెల్లిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో డిడిసిఏ మూడేళ్ల బ్యాలెన్స్‌ షీట్‌ను బిసిసిఐకి పంపింది. ఒకవేళ బిసిసిఐ అనుమతిస్తే డిడిసిఏకు 30 కోట్లు మంజూరు చేసే అవకాశముంది. ఢిల్లీ ప్రభుత్వం అనుమతివ్వకుంటే టెస్ట్‌ మ్యాచ్‌ను పుణెకు తరలిస్తామని డిడిసిఏకు బిసిసిఐ హెచ్చరించింది.

 

హైదరాబాద్ : దేశంలో పెరుగుతున్న మత అసహానికి నిరసనగా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ పీఎం భార్గవ ప్రభుత్వం తనకు ప్రధానం చేసిన పద్మభూషణ్‌ అవార్డును తిరిగి ఇచ్చేశారు. అవార్డుతో పాటు, ప్రశంసా పత్రాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి పంపారు. అవార్డును తిరిగి ఇవ్వడానికి కారణాలను వివరిస్తూ ప్రణబ్‌కు లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో శాస్త్రీయ ధృక్పదాన్ని ప్రోత్సహించడానికి బదులు మూఢనమ్మకాలను పెంపొందిస్తోందని భార్గవ విమర్శించారు.

రాష్ట్రపతికి లేఖలో వివరణ.....

దేశంలో పెరుగున్న మత అసహానికి నిరసనగా అవార్డులు తిరిగి ఇస్తున్నవారి జాబితాలో ఇప్పుడు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త పీఎం భార్గవ కూడా చేశారు. ఈయన నగరంలోని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్కులర్‌ బయాలజీ.... సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్‌. జీవశాస్త్రరంగంలో ఆయన చేసిన పరిశోధలకు గుర్తింపుగా కేంద్రం 1986లో పద్మభూషణ్‌ అవార్డు ప్రదానం చేసింది. అప్పటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌ చేతులు మీదుగా అవార్డు అందుకున్నారు. అటువంటి శాస్త్రవేత్త పీఎం భార్గవ ఇప్పుడు తన అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. పద్మభూషణ్‌ అవార్డులతోపాటు, ప్రశంసా పత్రాన్ని ఈనెల 6న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి పంపారు. అవార్డును తిరిగి ఇచ్చేయడానికి కారణాలు వివరిస్తూ రాష్ట్రపతికి ఓ లేఖ కూడా రాశారు.

సంఘ్‌ పరివార్ శక్తులు చెలరేగిపోతున్నాయి .....

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ సర్కార్‌ ఏర్పడిన తర్వాత దేశంలో మత అసహనం పెరిగిపోయిందన్న విషయాన్ని డాక్టర్‌ భార్గవ... రాష్ట్రపతికి రాసిన లేఖలో ప్రస్తావించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని సంఘ్‌ పరివార్‌ శక్తులు చెలరేగిపోతున్నాయని ఘాటుగా విమర్శించారు. కేంద్రంతో పాటు, కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజాస్వామ్యాన్ని బజారుకీడ్చిందన్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వెలిబుచ్చారు. సామాజిక, రాజకీయ పరిస్థితులు ఏమంత బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌ పాలకులు తమ దేశాన్ని ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చిన తరహాలోనే బీజేపీ, సంఘ్‌ పరివార్‌ శక్తులు కూడా మన దేశాన్ని హిందూత్వ రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని డార్టక్‌ భార్గవ రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

విభజనవాద అజెండా అమలు చేస్తున్న సంఘ్‌ పరివార్‌ ......

బీజేపీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆర్ ఎస్ ఎస్ నాయకులు తమ సొంత భావజాలంతో ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తున్నారన్నది డాక్టర్‌ భార్గవ వాదన. సంఘ్‌ పరివార్‌ తమ విభజనవాద అజెండా అమలు చేయించుకుంటున్నారని లేఖలో ప్రస్తావించారు. ఇది ఆశాస్త్రీయం, అసమంజసమన్నారు. ప్రజల్లో శాస్త్రీయ భావాలను పెంపొందించాల్సిన పాలకులు, మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. పెళ్లి అన్నది స్త్రీ, పరుషుల మధ్య ఒక ఒడంబడికని, మహిళ ఎక్కడా పనిచేయకుండా గృహిణిగానే ఉండాలంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ చేసిన వ్యాఖ్యలను డాక్టర్‌ భార్గవ గుర్తు చేశారు.

బీజేపీ ముందస్తు ప్రణాళికతోనే దాద్రీ ఘటన......

ఉత్తర్‌ప్రదేశ్‌లోని దాద్రీ ఘటనను కూడా డాక్టర్‌ భార్గవ ప్రస్తావించారు. గోమాంసం తిన్నాడన్న వదంతులో మహ్మద్‌ ఇక్లాక్‌ అనే వ్యక్తికి ఓ ముఠా హత్య చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది బీజేపీ శక్తులు ముందస్తు ప్రణాళికలో భాగమే ఈ ఘటన అన్నది ఆయన ఆరోపణ. గోమాంసం తినొద్దని ఏ శాస్త్రం కూడా చెప్పలేదన్నారు. చాలా వైకల్యాల నివారణకు గోమాంసం పనిచేస్తుందని చక్ర సంహితలో రాసిన విషయాన్ని గుర్తు చేశారు. జలుబు, దగ్గు, జర్వం వంటి వ్యాధుల నివారణంతో పాటు... ఆకలి రగిల్చేందుకు దోహదం చేస్తుందని చక్ర సంహితలో ఉన్న అంశాన్ని ప్రస్తావించారు. శారీరక శ్రమ చేసేవారు ఆవు మాంసం కోరుకుంటారని చెప్పారు.

మోడీ పాలనలో మైనారిటీల్లో అభద్రతా భావం....

మోడీ పాలనలో మైనారిటీల్లో అభద్రతా భావం పెరిగిపోయిందని డాక్టర్‌ భార్గవ.. రాష్ట్రపతి ప్రణబ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. బీజేపీ పాలనతో తాము ద్వితీయ శ్రేణి పౌరులమన్న భావం ప్రబలిందని, దేశానికి ఇది మంచిదికాది ఆయన సూచించారు. 

హైదరాబాద్ : అనుమతించిన పరిణామం కంటే సీసం ఎక్కువ పాళ్లు ఉందని తేలడంతో ఐదు నెలల కిందట మ్యాగీని భారత్ లో నిషేధించిన సంగతి తెలిసిందే. అన్ని పరీక్షలను దాటుకొని మార్కెట్ లోకి వచ్చిన మ్యాగీకి తీపికబురు దక్కింది. ఈ రోజు నుంచి భారత్ లో ఆన్ లైన్ లో మ్యాగీ విక్రయాలు మొదలవగా....ఆన్ లైన్ లో మ్యాగీ అందుబాటులోనికి వచ్చిన ఐదు నిముషాల వ్యవధిలోనే దాదాపు 60వేల వెల్ కమ్ మ్యాగీ కిట్లు అమ్ముడయ్యాయి. ఐదు నిముషాల వ్యవధిలో 60 వేల మ్యాగీ కిట్ లు అమ్ముడు కావడం మ్యాగీకి భారత్ లో ఉన్న డిమాండ్ కు నిదర్శనంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామం నెస్లే ఇండియాకు పెద్ద ఉపశమనమని విశ్లేషిస్తున్నారు.

హైదరాబాద్: టికెట్‌ రద్దు చార్జీలను రైల్వేశాఖ డబుల్‌ చేసేసింది. టికెట్‌ రద్దు నిబంధనల్లో పలు మార్పులు తీసుకొచ్చింది. ఇక నుంచి రైలు బయల్దేరాక టికెట్లు రద్దు చేస్తే నగదు వాపసు రాదు. రైలు బయల్దేరడానికి కనీసం నాలుగు గంటల ముందు టికెట్టు రద్దు చేసుకునే వారికే సొమ్ము వాపసు ఇచ్చే నిబంధన అమల్లోకి వచ్చింది.

ఫస్ట్ ఏసీ/ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ రద్దు చార్జీ రూ. 240...

ఫస్ట్ ఏసీ/ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ రద్దు చార్జీ 240కు పెంచేశారు. ఇంతకుముందు ఈ ఛార్జి 120 రూపాయలు ఉండేది. సెకండ్ ఏసీ/ఫస్ట్ క్లాస్ టికెట్ రద్దు చేసుకోవాలంటే 200 చెల్లించాల్సి ఉంటుంది. థర్డ్ ఏసీ/ఏసీసీ/3ఏ ఎకానమీ టికెట్ రద్దుకు 180, సెకండ్ స్లీపర్ క్లాస్ టికెట్ రద్దుకు 120 సమర్పించుకోవాలి. ఇక సెకండ్ క్లాస్ టికెట్ రద్దు చేసుకుంటే 60 ఎగిరిపోతాయి.

48-12 గంటల మధ్య కన్‌ఫం టికెట్ రద్దు చేస్తే 25 శాతం ఛార్జ్.....

రైలు బయల్దేరే ముందు 48-12 గంటల మధ్య కన్‌ఫం టికెట్ రద్దు చేస్తే 25 శాతం ఛార్జ్ పిండుతారు. 12-4 గంటల మధ్య కన్‌ఫం టికెట్ రద్దు చేస్తే 50 శాతం రుసులు చెల్లించాల్సి ఉంటుంది. 4 గంటల తర్వాత కన్‌ఫం టికెట్ రద్దు అవకాశం లేదు. వెయిట్ లిస్ట్/ఆర్‌ఏసీ టికెట్లు రైలు బయల్దేరే అరగంట ముందే రద్దు చేసుకోవాలి. ఐఆర్‌టీసీ ద్వారా తీసుకున్న టికెట్లకు కూడా రద్దు ఛార్జీలు, నిబంధనలు వర్తిస్తాయి. అన్‌ రిజర్వ్‌డ్‌, ఆర్‌ఏసి, వెయిట్‌ లిస్టెడ్‌ టికెట్ల రద్దు చేసుకోవడానికి చెల్లించాల్సిన ఛార్జీలు 15 నుంచి 30 కి పెరిగాయి. సెకండ్‌ క్లాస్‌ రిజర్వ్‌డ్‌, ఇతర తరగతుల్లో ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలంటే 60 రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. 

హైదరాబాద్ : మూడు రోజుల బ్రిటన్‌ పర్యటన నిమిత్తం గురువారం లండన్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది. గురువారం ఉదయం 10 గంటలకు ఎయిర్‌ఇండియా ప్రత్యేక విమానంలో ఇక్కడి ఈత్‌స్టిక్‌ విమానాశ్రయంలో దిగిన మోదీకి..బ్రిటన్‌ విదేశాంగశాఖ సహాయ మంత్రి హ్యూగో స్వైర్‌, ఉపాధి కల్పన మంత్రి ప్రీతి పటేల్‌ సాదర స్వాగతం పలికారు. ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి బ్రిటన్‌ పర్యటనకు వచ్చిన మోదీకి విమానాశ్రయంలో బ్రిటన్‌ సాయుధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. ఈ పర్యటనతో దాదాపు దశాబ్ద కాలం తర్వాత లండన్‌ను సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ రికార్టులకెక్కారు.

బ్రిటన్‌ ఉన్నతస్థాయి బృందంతో భారత్‌ చర్చలు

అనంతరం ప్రధాని కామెరూన్‌ నివాసానికి చేరుకున్న భారత ప్రతినిధి బృందం బ్రిటన్‌ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో చర్చలు జరిపింది. ఆ తర్వాత ఇరువురు ప్రధానులూ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. దక్షిణాసియా, పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాలు కలిసి పనిచేయనున్నట్లు మోదీ తెలిపారు. విద్య, విజ్ఞానం, సాంకేతిక అభివృద్ధిలో పరస్పర సహకారం కొనసాగుతుందని స్పష్టంచేశారు. భారత్‌లో ప్రతి పౌరుడి స్వేచ్ఛను కాపాడతామని ప్రధాని నరేంద్ర మోది అన్నారు. దేశంలో పెరిగిపోతున్న అసహన పరిస్థితులపై బ్రిటన్‌ మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ- బుద్ధుడు, గాంధీ జన్మించిన గడ్డపై అసహన పరిస్థితులకు ఆస్కారం లేదన్నారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కేమరూన్‌, భారత ప్రధాని మోది జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో ఇరు దేశాల మధ్య 90 వేల కోట్ల ఒప్పందం కుదిరింది. రక్షణ, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులకు బ్రిటన్‌ ముందుకు వచ్చింది. యుఎన్‌ఓ భద్రతాసమితిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి బ్రిటన్‌ మద్దతిస్తుందని కేమరూన్‌ ప్రకటించారు. పౌర అణు ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.

ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి దిక్చూచి....

అంతకుముందు...బ్రిటన్‌ పార్లమెంట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పంజలి ఘటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ..ఆ తర్వాత బ్రిటన్‌ పార్లమెంట్‌లో ప్రసంగించారు. ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి దిక్చూచిగా నిలిచిన బ్రిటీష్‌ పార్లమెంటులో ప్రసంగించడం ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహాత్మాగాంధీ గొప్పదనం గుర్తించడంలో బ్రిటీషువారు విజ్ఞతను ప్రదర్శించారని మోదీ అన్నారు. భారత్‌లో ఎక్కువ పెట్టుబడులు పెట్టే దేశంగా బ్రిటన్‌ మూడోస్ధానంలో ఉందని మోదీ అన్నారు.

ప్రధాని కామెరూన్‌ కౌంటీ నివాసంలో బస....

మూడు రోజుల అధికారిక పర్యటన కోసం బ్రిటన్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తొలిరోజు...బ్రిటన్‌ ప్రధాని కామెరూన్‌ కౌంటీ నివాసంలో బస చేశారు. ఆ తర్వాత రెండోరోజైన శుక్రవారం ఉదయం బ్రిటన్‌ ఎలిజబెత్‌ రాణి విందు సమావేశంలో పాల్గొంటారు. అనంతరం లండన్‌ ఉత్తర ప్రాంతంలోని వెంబ్లీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయి బ్రిటన్‌లోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 

ఒడిషా : రాష్ట్రంలోని పూరి రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న రైళ్లలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాట్‌ఫాంపై ఉన్న మూడు రైళ్లలోని బోగీల్లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లోని రెండు స్లీపర్‌ కోచ్‌లతో పాటు నందన్‌కనన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఒక స్లీపర్‌ కోచ్, పూరి-హౌరా ఎక్స్‌ప్రెస్‌లో జనరల్‌ కంపార్ట్‌మెంట్‌ దగ్ధమయ్యాయి. సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు గంటసేపు బోగీల్లో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటల కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వే ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

బెంగళూరు : ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా  బెంగలూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని గిరీష్‌ ఓ సభలో డిమాండ్‌ చేశారు. దీంతో కర్నాటక రచయిత కల్బుర్గి, మహారాష్ట్రలో పన్సారేకు పట్టిన గతే పడుతుందని ట్విట్టర్‌లో గిరీష్‌ కర్నాడ్‌ను కొందరు హెచ్చరించారు. 
'ఇన్‌టోలరెంట్ చంద్ర' అనే యూజర్ నేమ్‌తో...
తన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో.. 77 ఏళ్ల గిరీష్ కర్నాడ్ క్షమాపణలు చెప్పారు. ఎవరైనా తన వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడితే క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. దీంతో ట్వీట్‌లోని హెచ్చరికలను డిలీట్‌ చేశారు. 'ఇన్‌టోలరెంట్ చంద్ర' అనే యూజర్ నేమ్‌తో ట్విట్టర్‌లో గిరీష్ కర్నాడ్‌ను హెచ్చరిస్తూ పోస్టింగ్ వచ్చిందని, దీనిపై ఏమైనా ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. గిరీష్‌ కర్నాడ్‌ ఇంటివద్ద భద్రతను పెంచారు. 
టిప్పు జయంతి ఉత్సవాలు.. వివాదాస్పదం..
18 వ శతబ్దానికి చెందిన పరిపాలకుడు టిప్పుసుల్తాన్‌ జయంతి ఉత్సవాల నిర్వహణ కర్నాటకలో వివాదాస్పదమైంది. టిప్పు సుల్తాన్ వేడుకలను వ్యతిరేకిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి చేస్తున్న నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. పోలీసు లాఠీ చార్జీ, కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ వీహెచ్‌పీ కార్యకర్తతో మరొకరు మృతి చెందారు. టిప్పు సుల్తాన్‌ జయంతి వేడుకలను రద్దు చేసే ప్రసక్తే లేదని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య స్పష్టం చేశారు. టిప్పు సుల్తాన్ హిందు, క్రైస్తవులను ఆదరించిన సెక్యులర్‌వాదిగా పేర్కొన్నారు.

ఢిల్లీ : తల్లిదండ్రులు, టీచర్లు, బంధువులు.. ఇలా ఎవ్వరైనా సరే... చిన్నారుల్ని వేధించారా, జైల్లో కూర్చోవాల్సిందే.. నేరం రుజువైతే భారీగా జరిమానా కూడా తప్పదు.. కేసు విచారణలో సహకరించకపోతే స్కూల్‌ ప్రిన్సిపల్‌ కూడా శిక్ష పడుతుంది. ఇలా సరికొత్త నిబంధనలతో బాలబాలికల రక్షణ కోసం చట్టాన్ని తెస్తోంది కేంద్రం. బాలబాలికలపై వేధింపులను సీరియస్‌గా తీసుకుంది కేంద్రం.. ఇకపై ఇలాంటివి జరగకుండా చూడాలని నిర్ణయించింది. బాలబాలికల రక్షణకోసం చట్టాలకు పదునుపెడుతోంది. పిల్లల్ని వేధిస్తే భారీ జరిమానా, జైలుశిక్ష విధించేలా బాలల రక్షణ చట్టానికి సవరణలు తేబోతోంది. తల్లిదండ్రులు, టీచర్లు ఇలా ఎవ్వరైనాసరే చిన్నారుల్ని వేధిస్తే కఠినంగా శిక్షించేలా చట్టంలో మార్పులు చేస్తోంది.

65 శాతం శారీరక హింస..
65 శాతం మంది బాలలు పాఠశాలల్లో శారీరక హింసకు గురవుతున్నారు. దేశంలో ప్రతి రోజూ ఏదో ఒక కీచక టీచర్‌ వ్యవహారం బయటకొస్తోంది. ఇక తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల్ని దండించడం సాధారణంగా మారింది. ఈ వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో ఎన్నో సర్వేలు బయటపెట్టాయి. యూనిసెఫ్‌ ఇతర ఎన్జీవోలతో కలిసి నిర్వహించిన అధ్యయనంలో 65 శాతం మంది బాలలు పాఠశాలల్లో శారీక హింసకు గురవుతున్నారని బయటపడింది. చిన్నారులపై శారీరక, లైంగిక, మానసిక హింసల్లో ఎక్కువశాతం ఇంట్లోనో, పాఠశాలల్లోనో తెలిసిన వ్యక్తులవల్లే జరుగుతోందని ఈ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇటువంటి హింసను అరికట్టేందుకు అనేక చట్టాలున్నా అవి సరిగా అమలు కావడంలేదు.

రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టబోతున్న ప్రభుత్వం..
ఢిల్లీ నిర్భయ ఘటనలో మైనర్‌ అరెస్టుతో ప్రభుత్వం చట్టంలో అనేక మార్పులు తీసుకొచ్చింది. ఈ మార్పులతో కూడిన చట్టాన్ని కేబినెట్‌ ఆమోదించింది. లోక్‌సభలో బిల్లు ఆమోదం కూడా పొందింది. ఈ నెల 26నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ చట్టంలో విద్యార్థుల రక్షణకు సంబంధించిన అంశాలు, శారీరక హింస జరగకుండా చాలా మార్పులు తీసుకొచ్చారు. బాలల్ని శారీరకంగా, మానసికంగా, లైంగికంగా, మాటలు, చేతలతో ఎలా వేధించినట్లు రుజువైనా తీవ్రమైన శిక్ష విధించేలా చట్టంలో నిబంధనలు పొందుపరిచారు. ఈ బిల్లు ఆమోదం పొందితే మొదటిసారి నేరానికి ఆరు నెలల జైలుశిక్ష, జరిమానా రెండోసారైతే మూడేళ్ల జైలు, జరిమానా... పిల్లల్ని తీవ్రంగా హింసిస్తే మూడేళ్ల జైలు, 50వేల రూపాయల జరిమానా.. మూడోసారి హింసిస్తే ఐదేళ్లు జైలు, లక్ష రూపాయల జరిమానా విధిస్తారు.. ఇక స్కూళ్లలో చిన్నారులపై హింస కేసులో పాఠశాల యాజమాన్యం సహకరించకపోతే స్కూల్‌ ప్రిన్సిపల్‌, డైరెక్టర్‌కు మూడేళ్ల జైలు, లక్ష రూపాయల ఫైన్ వేసేలా చట్టంలో శిక్షలను కేంద్రం ఖరారు చేసింది.

ఢిల్లీ : 15 రంగాల్లో ఎఫ్‌డీఐలకు అనుమతిలిస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీపీఎం పొలిట్‌బ్యూరో తీవ్రంగా వ్యతిరేకించింది. మరో 15 రోజుల్లో పార్లమెంట్‌ సమావేశాలుండగా.. కేబినెట్‌ ఆమోదం కూడా లేకుండా ఈ నిర్ణయాలను తీసుకోవడానికి సీపీఎం తీవ్రంగా తప్పుబట్టింది. మోడీ విదేశీ పర్యటనలకు ముందు ప్రకటించాలనే హడావుడిగా నిర్ణయం తీసుకున్నారని మండిపడింది. ఇప్పటికే నిత్యావసర ధరలతో ప్రజలు, గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. వాటిని మరింత పెంచేవిధంగా మోడీ నిర్ణయాలున్నాయని సీపీఎం విమర్శించింది.

ఢిల్లీ: బీహార్‌ ఎన్నికలు ఇచ్చిన షాక్‌ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీ తిరిగి విదేశీ పర్యటనలకు సిద్ధమయ్యారు. బ్రిటన్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలువురు నేతలు, అధికారులతో సమావేశం కానున్నారు. ఆయన ప్రధాని అయిన తర్వాత ఇంగ్లాండ్‌లో జరిగే మొట్టమొదటి ద్వైపాక్షిక సమావేశమిది.

తొమ్మిది సంవత్సరాల తర్వాత......

తొమ్మిది సంవత్సరాల తర్వాత భారత ప్రధాని ఇంగ్లాండ్‌తో ద్వైపాక్షిక జరిగే సమావేశాలకు వెళ్లడం ఇదే ప్రథమం. 2006లో మన్మోహన్‌సింగ్‌ బ్రిటన్‌లో పర్యటించారు. పెట్టుబడులు, రక్షణ రంగాలకు సంబంధించి మోడీ బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌తో సమావేశమవుతారు. సుమారు 18 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. లండన్‌లో పలువురు ప్రముఖులతోనూ మోడీ రౌండ్ టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు. ఇంగ్లాండ్‌లోని ఎన్‌ఆర్‌ఐలతో సమావేశమై భారత్‌లో పెట్టుబడులు పెట్టమని స్వాగతించే అవకాశముంది.

రక్షణ పరంగా సాంప్రదాయకంగా.....

ఇరుదేశాల మధ్య రక్షణ పరంగా సాంప్రదాయకంగా కొనసాగుతున్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తామని, తయారీరంగంపై ప్రధానంగా దృష్టిపెడతామని మోడీ ఇప్పటికే ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు. జి-7 కంట్రీస్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న, బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం ఇంగ్లాండని వ్యాఖ్యానించారు. తన పర్యటన ద్వారా ఆర్థిక వ్యాపార రంగాల్లో ఇంగ్లాండ్‌తో బంధం బలోపేతమయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు.

మోడీ బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రసంగం....

ఇదే పర్యటనలో మోడీ బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు. ఒక ఇండియన్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ ఇంగ్లాండ్ చట్టసభలో ప్రసంగించడం ఇదే ప్రథమమవుతుందని విదేశీ కార్యదర్శి ఎస్‌.జైశంకర్‌ అభిప్రాయపడ్డారు. క్వీన్‌ ఎలిజెబెత్‌తో బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో మోడీ విందులో పాల్గొంటారు. ఆ దేశ పార్లమెంట్ వద్దనున్న మహాత్మాగాంధి విగ్రహానికి ప్రధాని నివాళులర్పించనున్నారు. దీనితోపాటు లండన్‌లో అంబేద్కర్‌ నివసించిన ఇంటిని మోడీ సందర్శిస్తారు. బ్రిటన్‌ పర్యటన అనంతరం ప్రధాని టర్కీలో జరిగే జి-20 సమావేశాలకు వెళ్తారు. నవంబర్‌ 14న ఆ సమావేశాల్లో పాల్గొంటారు. మొత్తంగా ప్రధాని ఇంగ్లాండ్‌ పర్యటనతో దేశానికి ఏరకమైన ప్రయోజనాలు కలగబోతున్నాయన్నది వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

ఢిల్లీ : దేశవ్యాప్తంగా దీపావళి పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. బాణసంచాల వెలుగులు, మతాబుల మోతలతో సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్నా పెద్దా తేడాలేకుండా అందరూ ఈ దివ్వెల పండుగను ఆనందంగా జరుపుకున్నారు. పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇళ్లు, దుకాణాల ముందు ప్రమిదలువెలుగులు ముచ్చటగొలిపాయి. దేవాలయాల్లో దీపాలు వెలిగించి దీపాల పండగను జరుపుకున్నారు. పలు నగరరాల్లోని ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాలు విద్యుత్తు కాంతులతో ధగదఘలాడుతూ దర్శనమిచ్చాయి. విద్యుత్తు కాంతులతో సరికొత్త శోభ సంతరించుకున్నాయి.

భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో .....

భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో దీపావళి పండుగ వాతావరణం కనిపించింది. గత కొంతకాలంగా కాల్పుల మోతలతో దద్దరిల్లిన సరిహద్దు ప్రాంతాలు దీపావళి పండుగ శోభను సంతరించుకున్నాయి. సరిహద్దుల్లో భారత్‌, పాక్‌ సైనికులు మిఠాయిలు పంచుకున్నారు. ప్రధానమంత్రి మోదీ సరిహద్దు సైనికులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అమృత్‌సర్‌లోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ దగ్గర ఆయన జవాన్లతో ముచ్చటించారు. వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

రాజ్ భవన్ లో దీపావళి వేడుకలు......

రాజ్ భవన్ లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.. పండుగ సంధర్బంగా ప్రజాధర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు గవర్నర్ దంపతులు... రాష్ట్రప్రజల్ని కలుసుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటున్న దీపావళి... రాష్ట్ర ప్రజలందరికీ ఆనందోత్సాహాలు అందించాలన్నారు గవర్నర్ నరసింహన్.. ఇర రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు కలిసిమెలిసి ముందుకు సాగాలనీ ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసన మండలి చైర్మన్ చక్రపాణి, టిటిడిపి నేతలు ఎల్ రమణ, రావుల.. ఉన్నతాధికారులు ప్రజలు పాల్గొన్నారు.

శ్రీకాకుళంలో కళ్యాణ్‌ అనురాగ్‌ నిలయం ఆధ్వర్యంలో.....

శ్రీకాకుళంలో కళ్యాణ్‌ అనురాగ్‌ నిలయం ఆధ్వర్యంలో అనాధ పిల్లలకు దీపావళి సంబరాలు నిర్వహించారు. పిల్లలతో కేక్‌ కట్‌ చేయించి.. టపాసులు అందజేశారు. చిన్నారులు ఎంతో సంతోషంగా టపాసులు కాల్చారు. విజయవాడలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ రోడ్లపైకి చేరుకొని బాణసంచా కాల్చి సందడి చేశారు. మహిళలు, చిన్నారులు తారాజువ్వలను వెలిగించి కేరింతలు కొట్టారు. పాతబస్తీ, సత్యనారాయణపురం, పటమటతో పాటు నగర వ్యాప్తంగా టపాసుల మోత మోగింది. వ్యాపారులు తమ షాపులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పూజలు నిర్వహించారు. బాణసంచా కాలుస్తూ సందడిచేశారు. 

హర్యానా : గుర్ గావ్ లో ఓ వ్యక్తిని నలుగురు దుండగులు అతి దారుణంగా కాల్చి చంపారు. కాల్చి చంపిన దృశ్యాలు సీసీ కెమెరాలో రిక్డారయ్యాయి. గుర్ గావ్ సెక్టార్ 5 సమీపంలో ఉన్న ఓ పెట్రోల్ బంక్ లో మంగళవారం రాత్రి పదిన్నర సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు బైక్ లపై గుర్తు తెలియని నలుగురు దుండగులు ప్రవేశించారు. ఒక బైక్ పై కూర్చొన్న వ్యక్తి మొదట కాల్పులు పెట్రోల్ బంక్ దగ్గరున్న వ్యక్తిపై కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన ఆ వ్యక్తి ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీశారు. మరో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా కాల్పులు జరిపారు. దీనితో సదరు వ్యక్తి అక్కడికక్కడనే కుప్పకూలిపోయాడు. కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజు అని పోలీసులు గుర్తించారు. వ్యాపార గొడవలే ఈ హత్యకు గల కారణం అని తెలుస్తోంది. పరారీలో ఉన్న దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

ముంబై : బాలీవుడ్ హీరో 'షారుఖ్ ఖాన్' ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి విచారించింది. దాదాపు మూడు గంటల పాటు షారుఖ్ ను ప్రశ్నించారు. తాను ఎలాంటి ఆర్థిక అక్రమాలకు పాల్పడలేదని షారుఖ్ పేర్కొన్నట్లు సమాచారం. కోల్ కతా నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రై.లి.షేర్లను మారిషస్ కు చెందిన జయ్ మెహతా కంపెనీకి విక్రయించడంల్ో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ షారుఖ్ కు మూడు సార్లు ఈడీ నోటీసులు జారీ చేసింది. 2008-09 సంవత్సరంలో జరిగిన ఐదు మిలియన్ల షేర్ల అమ్మకానికి సంబంధించి ఈడీ తొలిసారిగా 2011లో సమన్లు పంపగా కోలకతా నైట్ రైడర్స్ కు బాలీవుడ్ నటి జుహ్లీచావ్లా, ఆమె భర్త జయ్ మెహతాతో పాటు షారుఖ్ ఖాన్ ఓనర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరికి కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. షేర్ల అమ్మకంలో జయ్ మెహతాకు సంబంధించి సి ఐల్యాండ్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ విలువను 8 -9 రేట్లకు తక్కువగా అమ్మారని ఈడీ విచారణ జరుపుతోంది. 70-80 కోట్ల విలువగల ఈక్విటీ షేర్లను సి ఐల్యాండ్ కు కేవలం రూ.10లకే కేటాయించారని ఈడీ తన నివేదికలో పేర్కొంది. 

హైదరాబాద్ : చిలీ సమీపంలోని సముద్రంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 6.6గా నమోదైంది. అయితే సునామీ వచ్చే అవకాశమేమీ లేదని హవాయిలోని పసిఫిక్‌ సునామీ సెంటర్‌ అధికారులు ప్రకటించారు. 

ఢిల్లీ : బంగ్లాదేశ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఉల్ఫా నేత అనుప్ చెటియాను బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధానమంత్రి వ్యక్తిగత దర్యాప్తు బృందానికి చెటియాను అప్పగించారు. ఉగ్రవాద సంస్థ ఉల్ఫా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన చెటియా మీద హత్యలు, కిడ్నాప్‌ల లాంటి ఎన్నో కేసులు ఉన్నాయి. 1997లో చెటియాను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. 

ఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ భార్య సునందాపుష్కర్‌ అనుమానాస్పద మృతి కేసులో.. అమెరికా ఫెడరల్‌ బ్యూరో ఇన్వేస్టిగేషన్‌ ఢిల్లీ పోలీసులకు మెయిల్‌ ద్వారా నివేదికను పంపించింది. ఆమె శరీరంలో ఎలాంటి విష పదార్థాలు లేవని ఎఫ్‌బీఐ తెలిపింది. అయితే పూర్తిస్థాయి ఫోరెన్సిక్‌ నివేదిక మాత్రం ఇంకా అందించలేదని తెలుస్తోంది. ఇక ఈ కేసును తొలుత ఆత్మహత్యగా భావించిన పోలీసులు.. ఆ తర్వాత హత్య అంటూ కేసు నమోదు చేశారు. దీంతో ఎఫ్‌బీఐ ఈ కేసు విచారణను చేపట్టింది. 

హైదరాబాద్ : భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ ఇస్రో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.. ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి జీశాట్ 15 ఉపగ్రహాన్ని సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించింది.. తెల్లవారుజామున 3గంటలకు ఈ ప్రయోగాన్ని జరిపింది.. అరైన్ 5 అనే ఉపగ్రహ వాహకనౌక ద్వారా 3వేల 164 కిలోల బరువున్న జీ శాట్‌తోపాటు అరబ్‌శాట్‌ 6బీని రోదసీలోకి పంపారు.. జీ శాట్‌లో 24కేయూ బ్యాండ్‌ ట్రాన్స్‌పాండర్స్, రెండు గగన్‌ పేలోడ్స్ ఉపకరణాలను అమర్చారు.. 

హైదరాబాద్ : తమిళనాడులో భారీవర్షాలకు దాదాపు 23మంది ప్రాణాలు కోల్పోయారు.. ఒక్క కడలూరు జిల్లాలోనే 17మంది మృత్యువాత పడ్డారు.. సేలం, ధర్మపురి, కోయంబత్తూర్, కడలూర్ జిల్లాల్లో వాగులు పొంగిప్రవహిస్తున్నాయి.. ఈ ప్రాంతాల్లో వెంటనే సహాయకచర్యలు చేపట్టాలని సీఎం జయలలిత అధికారులను ఆదేశించారు.. అటు ఏపీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి... నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి.. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు పొంగిప్రవహిస్తున్నాయి.. వివిధ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.. ఇక తిరుమలలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది.. వందేళ్లలో ఇంతటి వర్షపాతం నమోదు కాలేదని టీటీడీ అంచనావేస్తోంది.. కొద్దినెలలుగా నీరులేక ఇంకిపోయిన జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి.. పాప వినాశనం, గోగర్భం, కుమారధార పసుపుధార జంట ప్రాజెక్టుల్లోకి దాదాపు 70శాతం నీరు చేరింది.. 

ఢిల్లీ : బీహార్‌ ఓటమి బీజేపీలో చిచ్చు రేపుతోంది. పార్టీలో ఎదురులేని మనుషుల్లా చెలామణి అవుతున్న మోదీ, అమిత్‌షాలపై అసమ్మతి గళం ఆరంభమైంది. పెద్దల పాత్రకే పరిమితమైన నేతలు ఇప్పుడు నోరు విప్పుతున్నారు. అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు.

అద్వానీ, మురళీమనోహర్‌ జోషి..............

బీహార్‌ ఎన్నికల ఓటమిపై బీజేపీ అగ్రనేతలైన అద్వానీ, మురళీమనోహర్‌ జోషి, శాంతకుమార్‌, యశ్వంత్‌ సిన్హా విరుచుకుపడ్డారు. తొలిసారిగా తమ ఆగ్రహాన్ని పబ్లిక్‌గా ప్రకటించారు. స్వయంగా సొంత పార్టీ తీరునే తప్పుపట్టారు. ఢిల్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఎటువంటి పాఠం నేర్చుకోలేదని విమర్శించారు. గత కొంతకాలంగా పార్టీని బలహీనపర్చడం వల్లనే బీహార్‌లో ఓటమి ఎదురైందని ఆరోపించారు. ఈ ఓటమిపై సమీక్ష జరపాలని ఆ నలుగురు వెటరన్లు డిమాండ్‌ చేశారు.

మురళీమనోహర్‌ జోషి నివాసంలో సమావేశం....

మంగళవారం సాయంత్రం ఈ నలుగురు అగ్రనేతలు మురళీమనోహర్‌ జోషి నివాసంలో సమావేశమయ్యారు. అనంతరం సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుతం పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని ఆ ప్రకటనలో విమర్శించారు. కొంతమంది ముందు పార్టీ ఎలా మోకరిల్లిందని, సర్వాంగీకార స్వభావాన్ని వారు ఎలా నాశనం చేశారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గెలిస్తే క్రెడిట్‌ తీసుకునేందుకు సిద్ధమయ్యే వారు ఈ అవమానకరమైన ఓటమికి బాధ్యత తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారని ఆ ప్రకటనలో విమర్శించారు. బీహార్‌ ఓటమికి ఎవరినీ బాధ్యులు చేయకపోవడం అంటే అర్థం, ఇందుకు ఎవ్వరూ బాధ్యులు కారని నిర్ధారించడమే అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

మోదీ, అమిత్‌షాలే టార్గెట్‌!......................

ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలను టార్గెట్‌ చేస్తూ అగ్రనేతలు ఈ ప్రకటన చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మోదీ, అమిత్‌షా చేతుల్లోనే పార్టీ నడుస్తోందనే విమర్శలు ఉన్నాయి. అద్వానీతో పాటు ఇతర అగ్ర నేతలకు పార్టీలో అంతగా ప్రాధ్యానత దక్కడం లేదనేది బహిరంగ రహస్యం. వెటరన్లను పట్టించుకునే పరిస్థితి పార్టీలో లేదనేది చాలా విషయాల్లో స్పష్టం కూడా అయ్యింది. మోదీ,అమిత్‌షాలు అన్నీ తామై నడిపిస్తున్నారనే అసంతృప్తి కూడా కొంతమంది నేతల్లో ఉంది. ఈ నేపథ్యంలో బీహార్‌ ఓటమిని బూచీగా చూపిస్తూ సీనియర్లు వీరిపై పరోక్షంగా దాడి మొదలుపెట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

సీనియర్లు సంధించిన స్టేట్‌మెంట్‌ పార్టీలో కలకలం....

మరోపక్క ఆర్థిక మంత్రి జైట్లీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వంటి వారు మోదీ, అమిత్‌షాలకు సపోర్టుగా మాట్లాడుతున్నారు. బీహార్‌ ఓటమికి మోదీ, అమిత్‌షాలను బాధ్యులు చేయలేమని చెప్పుకొస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పరోక్షంగా ప్రధానిని, పార్టీ అధ్యక్షుడిని ఉద్దేశిస్తూ నలుగురు సీనియర్లు సంధించిన స్టేట్‌మెంట్‌ పార్టీలో కలకలం సృష్టిస్తోంది.  

హైదరాబాద్ : బార్‌ స్కాం కేసులో కేరళ ఆర్థికమంత్రి కె ఎం మణి రాజీనామా చేశారు. ఈ కుంభకోణంలో ఆయన పాత్రపై విచారణ జరిపించాలని కేరళ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో మణి రాజీనామాకు ఒత్తిడి పెరిగింది. ఈ మొత్తం వ్యవహారాన్ని యూడీఎఫ్‌ స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో చర్చించారు. మణి రాజీనామాకు యూడీఎఫ్‌కు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌తోపాటు, ఇతర భాగస్వామ పార్టీలు, ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మంత్రి పదవిలో కొనసాగడం మంచిదికాదని సమావేశం అభిప్రాయపడింది. ఇదే విషయాన్ని కమిటీ సభ్యులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మణి రాజీనామా చేశారు. 

ఢిల్లీ : మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా.. డిసెంబర్‌ 1 నుంచి 6 వరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వామపక్షపార్టీలు నిర్ణయించాయి. ఢిల్లీలో సమావేశమైన ఆరు వామపక్ష పార్టీలు .. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తీర్పును అభినందించాయి. అలాగే దేశంలో మతోన్మాద దాడులకు వ్యతిరేకంగా సాహితీవేత్తలు, సినీ ప్రముఖులు, ప్రొఫెసర్లు అవార్డులు వెనక్కి ఇస్తున్న వారిని లెఫ్ట్‌ నేతలు అభినందించారు. 

Pages

Don't Miss