National News

కర్ణాటక : అనేక సార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎస్‌.ఎం. కృష్ణ.. కర్ణాటక ముఖ్యమంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా, స్పీకర్‌గా, గవర్నర్‌గా కీలక బాధ్యతల్లో పనిచేసిన ఎస్‌ ఎం కృష్ణ అసంతృప్తితో రాజకీయ సన్యాసం తీసుకోనున్నట్లుగా రాజకీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్‌ అధిష్టానం తనను పూర్తిగా పక్కన పెట్టేయడంతో తీవ్ర అసంతృప్తికి లోనై ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసి శాసనసభ ఎన్నికల సమయంలో బీజెపి తీర్ధం పుచ్చుకున్న మాజీ సీఎం ఎస్‌ఎం.కృష్ణ ఇక్క డ కూడా అదే పరిస్థితి ఎదురు కావడంతో రాజకీయ సన్యాసం తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. అతి త్వరలోనే ఎస్‌ఎం.కృష్ణ ఆత్మ కథ విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగే సభలో ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకునే విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపిలపై తనకు పూర్తిగా భ్రమలు తొలగిపోయాయని కృష్ణ తన అనుచరుల వద్ద పేర్కొన్నట్లు తెలిసింది. 
 ఒక వేళ ఇదే కనుక జరిగితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయాలపై ప్రభావం చూపడం తథ్యమని బీజెపి నేత ఒకరు తెలిపారు. కాగా ఎస్‌ఎం.కృష్ణ రాజకీయ సన్యాసం చేస్తూనే ఆయన రెండో కుమార్తె శాంభవి తండ్రి స్థానాన్ని భర్తీ చేసేందుకు తెరపైకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దించాలని బీజేపి భావిస్తోంది.

హైదరాబాద్ : సామాన్యుడికి పెను భారంగా మారుతున్న పెట్రోల్ ధరలను తగ్గించేసామని పెద్ద గొప్పగా చెప్పుకునే కేంద్రప్రభుత్వంపై సెటైర్ల వర్షం కురుస్తోంది. రోజుకొకవిధంగా ధరలను పెంచి ఉదయం లేని ప్రతీ వ్యక్తి ఈరోజు పెట్రోల్ ధరలు ఎలా వున్నాయో చూసుకోవటం రోజువారి దిన చర్యలో భాగంగా మారేలా కేంద్రం ప్రభుత్వం వ్యవహరించింది. ధరలు పెరుగుతూ ఉంటే చూస్తుండిపోయిన ప్రభుత్వం, ఇప్పుడు నామమాత్రంగా తగ్గించి పండగ చేసుకోమన్నట్టు చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. 
ఆకాశానికి అంటిన పెట్రోలు, డీజిల్ ధరల నుంచి కాస్తంత ఉపశమనాన్ని కల్పిస్తూ, రూ. 2.50 మేరకు కేంద్రం తగ్గించిన నేపథ్యంలో, సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు వస్తున్నాయి. కొద్దిమంది మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తుండగా, చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. 
పలు దేశాల్లో పెట్రోలును రూ. 35కే విక్రయిస్తున్నారని, ఇండియాలో రూ. 90 వసూలు చేస్తూ, కేవలం రెండున్నర రూపాయలు తగ్గించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పలు రాష్టాల్లో ఎన్నికలు రానున్నందునే ఈ రెండున్నరను డిస్కౌంట్ గా ఆఫర్ చేస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు. ప్రజలను దోపిడీ చేస్తున్న బీజేపీ, తమ అవినీతి నుంచి వారి దృష్టిని మరల్చేందుకే పెట్రోలు తాయిలం ప్రకటించిందని కాంగ్రెస్ ఆరోపించింది. కాగా, కేంద్రం సుంకాలను తగ్గించిన తరువాత, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అంతేమొత్తం సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే.
 

ఢిల్లీ : వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ పటిష్టమైన స్థితిలో బ్యాటింగ్ చేస్తోంది. టీమిండియా బ్యాట్స్‌మెన్ వెస్టిండీస్ బౌలర్ల భరతం పడుతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. 186 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీ 24వ సెంచరీ చేశాడు. 92 పరుగుల వద్ద రిషబ్ పంత్ ఔట్ అయ్యాడు. 5 వికెట్ల నష్టానికి టీమిండియా 470 పరుగులు చేసింది. 

 

 చెన్నై...బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబరు 4 నుంచి 8 వ తేదీ మధ్య కేరళ,తమిళనాడు,కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. చెన్నైలో కురిసిన భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో చెన్నై, కాంచీపురం,తిరువళ్లువర్ జిల్లాల్లో ప్రభుత్వం శుక్రవారం పాఠశాలలకు శలవు ప్రకటించింది. అక్టోబర్ 7 న కేరళలోని ఇడుక్కి,పాలక్కాడ్,త్రిశూర్ మూడు జిల్లాల్లో రెడ్ ఎలర్ట్ ప్రకటించింది. అల్పపీడనం ఒమన్ వద్ద తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించటంతో కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాయం కోరారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ యంత్రాంగం ఎటువంటి పరిస్ధితినైనా ఎదుర్కోటానికి అప్రమత్తంగా ఉందని ఆయన అన్నారు. త్రిసూర్,పాలక్కాడ్ ల లోని జలాశయల గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. తమిళనాడులోని చెన్నైలో 2015లో కురిసిన వర్ష బీభత్సాన్ని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కర్ణాటకలో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో దక్షిణ కర్ణాటకలోని 12  జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు.

ఢిల్లీ : అచ్చం మోడీలా ఉంటాడు...ఆయన బయటకు వస్తే మోడీలాగే ఉన్నాడే..అంటూ కొంత కన్య్పూజన్ అవుతుంటారు. ఎందుకంటే ఆయన అచ్చం మోడీలాగే ఉంటాడు. ఆయనే అభినందన్ పాఠక్. దీనిని కాషాయదళం క్యాష్ చేసుకొనేందుకు ప్రయత్నించింది. ఎన్నికల ప్రచారంలో ఆయన్ను ప్రచారంలో ఉపయోగించుకొంది. గతంలో బీజేపీ తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికలు ఏమీ లేవు కదా..ఇప్పుడు ఎందుకు ఈ అంశం అని అనుకుంటున్నారా ? ఎందుకంటే అభినందన్ ప్రస్తుతం బీజేపీకి గుడ్ బై చెబుతున్నారంట....

ఉత్తర్ ప్రదేశ్ షహరాన్ పూర్ లో అభినందన్ నివాసం ఉంటున్నారు. మోడీ అంటే తనకు ఎంతో అభిమానం అని అభినందన్ గతంలో ఎన్నోమార్లు చెప్పారు కూడా. గత సంవత్సరం మార్చిలో గోరఖ్ పూర్‌లో ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అభినందన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం నిర్వహించారు. కానీ అకస్మాత్తుగా ఏమైందో ఏమో కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని అభినందన్ కీలక నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన వార్తలు సోషలో మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

కాంగ్రెస్ కు సంబంధించిన నేతలతో అతను సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నానని కీలక నేతలకు చెప్పడం జరిగిందని తెలుస్తోంది. దీనికి కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తెలుస్తోంది. అభినందన్ పాఠక్ 1999లో లోక్ సభకు ..2012 సంవత్సరంలో రాజ్యసభకు పోటీ చేశారు. షాహన్ పూర్ కార్పొరేటర్‌గా రెండుసార్లు పనిచేశారు. 

ఢిల్లీ : వాహనదారులకు గుడ్ న్యూస్..గత కొద్ది రోజులుగా చమురు ధరలు పెరుగుతూ..వాహనాదారులను బెంబేలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అచ్చేదిన్ ఎప్పడూ పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి. దీనితో కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో పడింది. వచ్చే సంవత్సరంలో ఎన్నికలు ఉండడం..ప్రభావం చూపుతుందనే దానిపై సీరియస్‌గా ఆలోచించి ధరలు తగ్గించాలనే నిర్ణయానికి వచ్చింది. లీటర్‌పై రూ.2.50 తగ్గించింది. తగ్గించిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రకటించారు. చమురుపై రూ. 2.50 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు, గతంలో పెట్రోల్ ధరలు పెరిగిన సమయంలో రూ. 2 ఎక్సైజ్ పన్ను తగ్గించామని గుర్తు చేశారు. ద్రవ్యలోటు తగ్గించేందుకు కృషి చేయడం జరుగుతోందని, ద్రవ్యలోటు మూడు శాతానికి మించకుండా చేశామని చెప్పుకొచ్చారు. ఓపెక్ దేశాలు పెట్రోలియం ఉత్పత్తులు పెంచడం లేదని, రూ. 5 తగ్గించాలని అనుకున్నా సాధ్యపడలేదని తెలిపారు. 

ధరలు పెరుగుతుండడంతో దేశంలోని పలు రాష్ట్రాలు పలు నిర్ణయాలు తీసుకున్నాయి. రూ. 2 మేర తగ్గిస్తున్నట్లు కొన్ని రాష్ట్రాలు ప్రకటించాయి కూడా. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ధరకు ఆయా రాష్ట్రాలు మరో రూ. లీటర్‌పై రూ.2.50 తగ్గిస్తే సుమారు రూ.5 వరకు వినియోగదారులకు లాభం జరుగుతుందని జైట్లీ సూచించారు. ప్రస్తుతం రూ.2.50 తగ్గించడం వల్ల కేంద్ర ప్రభుత్వం రూ.21,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని అరుణ్ జైట్లీ తెలిపారు.
గురువారం కూడా ధరలు పెరిగాయి ముంబైలో ఏకంగా లీటర్ పెట్రోల్ రూ.90 దాటడం గమనార్హం. ధరలు పెరుగుతుండడంతో వీటిపై ఆధారపడిన వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాహనదారులు..సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ధరలపై ప్రజలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

ఢిల్లీ : ముందుస్తుపై దూకుడు పెంచిన గులాబీ బాస్ కు సుప్రీంకోర్ట్  ఝలక్ ఇచ్చింది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఒక ఝలక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమలులో వుండగా..ఎటువంటి పథకాలను అమలు చేయకూడదనీ ఈ క్రమంలో రైతుబంధు పథకం ద్వారా రైతులకు చెక్కుల పంపిణీ నిలిపివేయాలని..బతుకమ్మ చీరల పంపిణీకూడా చేయకూడదని టీఆర్ఎస్ కు ఈసీ షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చింది. 
తెలంగాణలో ముందస్తు ఎన్నికల పిటిషన్ పైన సుప్రీం కోర్టులో గురువారం విచారణలో భాగంగా..అన్ని పిటిషన్లను రేపే విచారణ చేపట్టాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల పై స్టే విధించవలసి వస్తే హైకోర్టుకు ఆ అధికారం ఉందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లను రేపే విచారణ చేపట్టాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది. 
ఈ నెల 8వ తేదీన ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆ లోపే విచారణ పూర్తి కావాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఓటర్ల జాబితా విషయంలో అవకతవకలు కనిపిస్తే హైకోర్టు స్టే విధిస్తుందనే ఆశతో విపక్షాలు ఉన్నాయి. అదే జరిగితే తెరాసకు షాక్ అని చెప్పవచ్చు.

ఢిల్లీ : ప్రయాణీకుల పట్ల భారత రైల్వే ఎంత నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు ఎటువంటి కారణం తెలుపకుండానే రైల్వే శాఖ ఉన్నట్లుండి 149 రైళ్లను అర్థాంతరంగా రద్దు చేసేసింది. సామాన్యుడికి అందుబాటులో వుండే ఒకే ఒక్క ప్రయాణ సాధనం రైలు. బస్ లు, ఆటోలు వంటి ప్రయాణ సాధనాలకంటే కూడా సామాన్యుడు ఎక్కువగా రైలు ప్రయాణానికే మక్కువ చూపుతుంటాడు. కారణం అనకు పూర్తిగా కాకపోయినా..కనీసమాత్రంగా అందుబాటు ధరలో రైల్వే ప్రయాణం వుంటుందని. ఆ నమ్మకంపై రైల్వే శాఖ నిర్లక్ష్యం చూపింది. 
భారతీయ రైల్వే అధికారులు ప్రయాణికులకు గురువారం గట్టి షాక్‌ ఇచ్చారు. ప్రత్యేక కారణాలేమీ తెలియజేయకుండానే భారీ సంఖ్యలో అంటే 149 రైళ్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. తుఫాన్‌లు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు, శాంతిభద్రత సమస్యలు తలెత్తినప్పుడు రైల్వే శాఖ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సర్వసాధారణం. అయితే ఈసారి రైళ్ల రద్దుకు ఆ శాఖ ఎటువంటి ప్రత్యేక కారణాన్ని వెల్లడించలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల రైళ్లను రద్దు చేస్తున్నట్లు మాత్రమే ప్రకటించింది. రద్దయిన రైళ్లలో అత్యధికం పాసింజర్‌ ట్రైన్‌లే ఎక్కువగా వున్నాయి. అంటే అతి సామాన్యుడి ప్రయాణసాధనానికి గండి కొట్టిందన్నమాట. 
ఈ విషయాన్ని ప్రయాణీకులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలియజేశామని..ప్రయాణికులు కన్‌ఫర్మ్‌ చేసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం’ అంటూ రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదలచేసి ల్వే శాఖ చేతులు దులుపేసుకుంది.

న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పొరపాటున తన ట్వీట్‌లో రాంగ్ ఫోటో జతచేయడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.

ఉత్తరప్రదేశ్ బీజేపీ సర్కారును ఇరుకున పెట్టేందుకు దిగ్విజయ్ సింగ్ తన ట్వీట్‌లో వాడకుండా వదిలేసి పాడైపోయిన 108, 102 అంబులెన్సు వాహనాలున్న ఫోటోను తన ట్వీట్‌లో జతచేయడం వివాదాస్పదమైంది. అయితే తెలుగులో రాసి ఉన్న ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ అన్న పేరును చూడకుండా ఫోటోను అప్‌లోడ్ చేయడంతో దిగ్విజయ్ సింగ్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

గతేడాది సెప్టెంబరులో ఇటువంటి కామెంట్లతో దిగ్విజయ్ సింగ్ ప్రధాని మోదీపై వివాదస్పద వ్యాఖ్యలు ట్విట్టర్‌లో చేసి నాలిక కరుచుకున్న సంగతి తెలిసిందే..ఇప్పుడు తాజాగా పాడై పోయిన అంబులెన్సుల ఫోటోతో మరో సారి వార్తల్లోకి ఎక్కారు.

ఢిల్లీ : భారతదేశ రెండవ అతిపెద్ద బ్యాంకు...ప్రైవేటు సెక్టార్ లో మొదటి అతి పెద్ద బ్యాంకు...అదే ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు..ఈ బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా...నిర్వహణ అధ్యక్షురాలుగా విధులు నిర్వహించిన చంద్రాకొచ్చార్ రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. దీనిని బీఎస్ఈ వెంటనే ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ స్థానంలో సందీప్ బక్షీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కొనసాగుతారని బోర్డు వెల్లడించింది. అక్టోబర్ 3, 2023 వరకు అపాయింట్ మెంట్ పదవీకాలం ఉంటుందని తెలిపింది. 
వీడియోకాన్ గ్రూపునకు 2012లో అక్రమంగా రూ.3,250 కోట్ల రుణాన్ని మంజూరు చేసి క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు ఐసీఐసీఐ సీఈవో చందాకొచ్చర్ పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే ఆమె పదవికీ రాజీనామా చేశారని తెలుస్తోంది. దీనికి ఆమెపై తీవ్ర వత్తిడి వచ్చిందని సమాచారం. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా చందా కొచర్ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి వరకు ఉంది. కానీ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో  చందా కొచ్చర్ తన పదవికి రాజీనామా చేయాలని ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు నుంచి ఒత్తిడి పెరిగింది. రుణం మంజూరులో చందాకొచర్ ప్రమేయం ఏదీ లేదంటూ ఇటీవలే బ్యాంకు బోర్డు ఆమెకు మద్దతుగా సైతం నిలిచింది. కొచర్‌ రాజీనామా వార్తలతో, ఈ బ్యాంకు షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయని తెలుస్తోంది. 
కాగా  ఐసీఐసీఐ బ్యాంకును ప్రైవేటు రంగంలో నంబర్ 2 బ్యాంకుగా నిలబెట్టడంలో చందాకొచర్ పాత్ర ఎంతో విలువైనది. సంస్థలో మూడు దశాబ్దాలుగా ఆమె పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా ఆమె ఎన్నో పర్యాయాలు గుర్తింపు పొందారు.

ఢిల్లీ :  ప్రపంచంలోనే భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా పేరొందింది. కాలానుగుణంగా ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేకుండా పోతోంది. పాలకుల అవినీతి,అధికారుల దోపిడీ..చిన్నస్థాయి చిరుద్యోగి నుండి పైస్థాయి అధికారి వరకూ లంచం, లంచం, లంచం. లంచంలేదనిదే ఏపని జరగని పరిస్థితి. అక్కడక్కడా నిజాయితీపరులైన అధికారులున్నా వారిని సక్రమంగా వారి విధులను వారు చేసుకోనివ్వలేని పరిస్థితికి దిగజారిపోతున్న నేపథ్యంలో భారతదేశం అవినీతి దేశంగా మారిపోయింది. ప్రజాస్వామ్య దేశమంటే కేవలం ప్రజల ఓట్లదో ప్రజాప్రతినిధులను ఎన్నుకోవటమే కాదు..ప్రజలకు అన్ని వసతులు..నీతిగా..నిజాయితీగా..పారదర్శకంగా పాలన అందించాల్సిన పాలకులనుండి అంటెండర్ వరకూ అవినీతి కూపంలో భారత్ కూరుకుపోయింది. ఈ వాస్తవాలు ప్రముఖ  పత్రిక సర్వేలో ఫోర్బ్స్ వెల్లడించింది. కానీ మరోపక్క ప్రదాని మోదిపై ఈ పత్రిక సలు కురిపించింది. 
ఆసియా దేశాల్లో మ‌న భారతదేశం ఎక్కువ శాతం అవినీతి జరుగుతోందని ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ట్రాన్స్‌ప‌రెన్సీ ఇంట‌ర్నేష‌న‌ల్ త‌న స‌ర్వే నివేదిక‌లో ఈ అంశాన్ని వెల్ల‌డించింది. అవినీతిని రూపుమాపాల‌ని మోడీ ప్ర‌భుత్వం చేస్తున్న ల‌క్ష్యాల‌ను అందుకోవాలంటే ఇంకా ఆ దేశం చాలా ముందుకు వెళ్లాల్సి ఉంద‌ని ఆ నివేదిక పేర్కొన్న‌ది. ఆసియాలో ఉన్న ఫైవ్ మోస్ట్ క‌ర‌ప్ట్ కంట్రీస్ జాబితాను ఫోర్బ్స్ రిలీజ్ చేసింది. ఆసియా దేశాల్లో లంచాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ఆ నివేదికలో తెలిపింది. భార‌త్ త‌ర్వాత వియ‌త్నాం, థాయ్‌లాండ్, పాకిస్థాన్‌, మ‌య‌న్మార్ దేశాలు ఉన్నాయి. భార‌త్‌లో అవినీతి 69 శాతం ఉందని పేర్కొంది. ఆ త‌ర్వాత వియ‌త్నాంలో 65 శాతం లంచాలు ఇస్తేనే ప‌నులు జరుగుతాయని పేర్కొంది. థాయ్‌లాండ్‌లో41 శాతం, పాకిస్థాన్‌లో 40 శాతం, మయన్మార్‌లో 40 శాతం అవినీతి ఉందని పేర్కొంది. భార‌త్‌లో స్కూళ్లు, హాస్పిట‌ళ్లు, ఐడీ డాక్యుమెంట్లు, పోలీసులు, సేవ‌ల రంగాల్లో లంచం మ‌రీ ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ఆ నివేదిక పేర్కొంది. 

ఢిల్లీ: ఏడుగురు రోహింగ్యా శరణార్థులను తిరిగి వారి స్వదేశానికి అప్పగించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ మేరకు వీరి తరలింపుపై వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు  కొట్టివేసింది. రోహింగ్యాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది.
ఏడుగురు రోహింగ్యా ముస్లింలు 2012 నుంచి అసోంలో అక్రమంగా నివాసముంటున్నారు. కొన్నాళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించిన వీరు ప్రస్తుతం సిల్చార్‌లోని ఓ శిబిరంలో ఉంటున్నారు. వీరి వద్ద ఎలాంటి నివాస గుర్తింపు లేని కారణంగా తిరిగి వీరిని  మయన్మార్‌ పంపేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం ఈ ఏడుగురిని మణిపూర్‌లోని మోరె సరిహాద్దు వద్ద సంబంధిత అధికారులకు అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 
అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో నిన్న పిటిషన్‌ దాఖలైంది. అత్యవసర విచారణ కింద ఈ పిటిషన్‌ను న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఈ ఏడుగురు అక్రమ వలసదారులని, విదేశీ చట్టం కింద జైలు శిక్షకు గురైనట్లు కేంద్రం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంతేగాక మయన్మార్‌ ప్రభుత్వం కూడా వీరిని తమ పౌరులుగా గుర్తించిందని చెప్పారు. వాదోపవాదాల అనంతరం ఈ రోహింగ్యాలను మయన్మార్‌ తరలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రభుత్వ నిర్ణయంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

ముంబాయి : స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా నష్టపోయాయి. చమురు ధరలు పెరగడం, రూపాయి పతనం, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో సెన్సెక్స్ 622 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోయాయి. 2 గంటల ట్రేడింగ్‌లోనే రూ.171000 కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద నష్టపోయింది. రూపాయి పతనం, క్రూడాయిల్ ధరలు పెరుగడంతోపాటు ఆర్‌బీఐ వడ్డీ రేటు పెంచనుందనే అంచనాలే స్టాక్ మార్కెట్లు నష్టపోవడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. 

 

వాషింగ్టన్‌: అమెరికాలో నేడు మరో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. దక్షిణ కరొలినాలోని ఫ్లోరెన్స్‌ కౌంటీలో ఒక ఆగంతకుడు ఏకంగా పోలీసులపైనే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.  ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి అక్కడికక్కడే మరణించగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఆగంతకుడు  కొందరు చిన్నారులను బందీలుగా తీసుకుని రెండు గంటల పాటు పోలీసులను తన వద్దకు రానీయలేదు.  సుమారు రెండు గంటల తర్వాత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.
ఆగంతకుడు  జరిపిన కాల్పుల్లో గాయపడిన పోలీసులు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అతడు ఎవరో, ఎందుకు కాల్పులు జరిపాడో ఇంకా తెలియలేదని అధికారులు తెలిపారు . ఈ ఘటనపై దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విచారం వ్యక్తంచేస్తూ . మృతి చెందిన పోలీసు కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ట్వీట్‌ చేశారు. 
ఇప్పటి వరకు అమెరికాలో సుమారు 23 వేల 408 మంది పోలీసులు సర్వీసులో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఆ సంఖ్య 112గా ఉన్నట్లు ఆఫీసర్ డౌన్ మెమోరియల్ పేజ్‌లో ఉంది. గత ఏడాది అమెరికాలో 15 వేల మంది తుపాకీ కాల్పుల్లో మరణించారని గన్ వాయిలెన్స్ ఆర్కీ అనే  వెబ్‌సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. 

ఢిల్లీ : మళ్లీ జికా వైరస్ కలకలం రేపుతోంది. రాజస్థాన్ లో ఈ వైరస్ బారిన పడి పలువురు చికిత్స పొందుతున్నారు. ఏడుగురు ఈ వ్యాధి బారిన పడినట్లు, అందులో ముగ్గురు గర్భవతులున్నారు. జైపూర్ లోని శాస్త్రీనగర్ లో వైరస్ గుర్తించారు. సెప్టెంబర్ 2018లో 85 సంవత్సరాల వృద్దురాలు ఈ వ్యాధి వచ్చింది. దీనితో జికా వైరస్ మొదటి కేసు నమోదైంది. కొన్ని అనారోగ్యాల కారణంగా ఆసుపత్రిలో చేరగా ఆమెకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. డెంగ్యూ, స్వైన్ ఫ్లూ వ్యాధులు సోకాయని వైద్యులు గుర్తించి మరిన్ని వైద్య పరీక్షల కోసం పూణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపారు. రక్త పరీక్షలో 'పాజిటివ్‌' చూపించిందని ఎస్‌ఎమ్‌ఎస్‌ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ యుఎస్‌అగర్వాల్‌ ఆదివారం తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య కేంద్రం వెంటనే అప్రమత్తమైందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. 

ఎడిస్‌ ఈజిప్టు ఇది పగటి పూట మాత్రమే కుడుతుంది. ఎక్కువగా మోకాళ్ల కింది భాగంలో ఇది కుడుతుంది. కుట్టినప్పుడు ఎలాంటి నొప్పి గాని దురద కాని ఉండదు. జికా వైరస్‌, డెంగీ, గన్యా లాంటి జబ్బులు వస్తాయి. సువాసన గల పూల కుండీలు, నిల్వ ఉన్న నీరు, ఎయిర్‌ కూలర్ల, పాత టైర్లు, కొబ్బరి చిప్పల వద్ద ఎడిస్‌ ఈజిప్టు దోమలు ఎక్కువగా ఉంటాయి. పగటి పూట దోమలు కుట్టకుండా శరీరానికి పూత మందులు రాసుకోవాలి. నిండుగా దుస్తులు వేసుకోవాలి. వ్యాధి ప్రభావం కనిపిస్తే తగిన వైద్యున్ని సంప్రదించాలి.

ఛండీఘర్ : నిర్భయలాంటి ఎన్ని చట్టాలొచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. దేశంలో అనునిత్యం ఏదో ఒకచోట మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. హర్యానాలో దారుణం జరిగింది. తల్లీకూతురిపై 2నెలలుగా 18 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

హర్యానా రాష్ట్రంలోని కైథాల్ కలాయత్ పట్టణానికి సమీపంలో ఉన్నగ్రామంలో తల్లి, 15 ఏళ్ల కూతురిపై 18 మంది కామాంధులు 2 నెలలుగా సామూహికంగా అత్యాచారం చేశారు. అత్యాచారం జరిపిన కామాంధుల్లో ఏడుగురు హర్యానా పోలీసులు కూడా ఉండటం సంచలనం రేపింది. బాలిక ఫిర్యాదు మేర పోలీసులు 18 మంది కామాంధులపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఏడుగురు పోలీసులు, గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచులు కూడా ఉన్నారని కైథాల్ జిల్లా ఎస్పీ అస్తామోదీ తెలిపారు. నిందితుల్లో ఏఎస్ఐ షంషేర్ సింగ్, రోషన్ లాల్, ధనపతిలను గుర్తించారు. ఏఎస్ఐ షంషేర్ సింగ్ తనతోపాటు తన తల్లిపై పలుసార్లు అత్యాచారం చేశాడని బాధిత బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అస్తామోదీ చెప్పారు.

 

ముంబయి: స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. రోజు రోజుకూ క్షీణిస్తున్న రూపాయి విలువ కారణంగా మదుపర్లు ఆందోళన పడుతుండడంతో సూచీలు పడిపోతున్నాయి. దీంతోపాటు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం మార్కెట్లపై ప్రభావం చూపుతోంది.
ఈ రోజు సెన్సెక్స్‌ ఆరంభంలోనే 500 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ 155 పాయింట్లకు పైగా పడిపోయి 10700 వద్ద ప్రారంభమైంది. ఉదయం 9.45 సమయానికి సెన్సెక్స్‌ 527 పాయింట్లు నష్టపోయి 35448 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 158 పాయింట్లు నష్టపోయి 10700 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 73.67 వద్ద ట్రేడవుతోంది.
నేడు ఎన్‌ఎస్‌ఈలో లార్సెన్‌, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, వేదాంత తదితర కంపెనీలు లాభపడుతున్నాయి. ఐషర్‌ మోటార్స్‌, రిలయన్స్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, గెయిల్‌ తదితర కంపెనీలు నష్టపోతున్నాయి.

హైదరాబాద్ : మళ్లీ చమురు ధరలు పెరిగాయి. ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే రూపాయి పతనం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుతుండడంతో ధరలు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు. దీనికారణంగా చమురు మార్కెటింగ్ సంస్థలు దేశీయ మార్కెట్‌లో రోజుకింత ధరల్ని పెంచుతూపోతున్నాయి. 
గురువారం లీటరు పెట్రోలుపై 15 పైసలు, డీజిల్ పై 20 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. దీంతో న్యూఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 84కు చేరగా, లీజిల్ ధర రూ. 75.45కు పెరిగింది. ముంబైలో పెట్రోలు ధర రూ. 91.34కు, డీజిల్ ధర రూ. 80.10కి చేరగా, హైదరాబాద్ లో పెట్రోలు రూ. 89.06, డీజిల్ రూ. 82.07కు పెరిగాయి. విజయవాడలో పెట్రోలు రూ. 88.25, డీజిల్ రూ. 80.92కు, గుంటూరులో పెట్రోలు 88.45, డీజిల్ రూ. 81.12కు పెరిగాయి.

తిరువనంతపురం : కేరళలో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) హెచ్చరికలు జారీ చేసింది. కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఈ వర్ష ప్రభావం ఉంటుందని వెల్లడించింది. ఆగస్టులో కేరళను వరదలు ముంచెత్తాయి. దారుణమైన ప్రకృతి వైపరీత్యానికి కేరళ ఎదుర్కొంది. ఈ భారీ వర్షాల కారణంగా 231 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. 

ముఖ్యంగా అరేబియా సముద్రం, శ్రీలంక తీరానికి సమీపంలోని ప్రాంతాల ప్రజలకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు ఐఎమ్‌డీ హెచ్చరించిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. ఆదివారం నాడు వర్షాలు కురవనున్న నేపథ్యంలో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశామని ఆయన అన్నారు. ముందస్తు జాగ్రత్తగా జాతీయ విపత్తు దళాన్ని అందుబాటులో ఉంచాలని కేరళ ప్రభుత్వం కేందాన్ని కోరింది. అక్టోబరు 5 కల్లా మత్స్యకారులు తీరానికి వచ్చేయాలని సూచించారు. ఈ వర్షాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారయంత్రాంగాలను అప్రమత్తం చేశామని తెలిపారు. అలాగే మన్నార్‌ నుంచి నీలకురింజి ప్రాంతాలు, ముఖ్యంగా పర్వత ప్రాంతాలకు పర్యాటకులు రావొద్దని ఆయన సూచించారు. ఈ అల్పపీడనం భారీ తుపాన్‌గా మారే అవకాశం ఉందని, అనంతరం లక్షద్వీప్‌ వైపు ప్రయాణిస్తుందని తెలిపారు.

 

ఢిల్లీ :  సాధారణ స్థాయి నుండి ప్రధాన మంత్రి స్థాయికి చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనే విషయం అందరికి తెలుసు. క్రమేపీ పార్టీలో ఎదిగి గుజరాత్ ముఖ్యమంత్రి..అనంతరం ప్రధానమంత్రి అయిన ప్రధాన మోదీని నమ్మిన ప్రజలు ప్రధానికి చేశారు. కానీ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన మోదీ డీమానిటేష్ వంటి పథకాలతో అప్పతిష్టను మూటకట్టుకోవటమే కాక..భారతదేశపు ఆర్థిక వ్యవస్థనే ఛిన్నా భిన్నం చేసేసారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు ఎన్నికల ప్రధాన అస్త్రంగా ఎన్డీయే వైఫల్యాలను అస్త్రాలుగా చేసుకున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతు..నరేంద్ర మోదీని నమ్మిన ప్రజలు ఆయనకు అవకాశం ఇవ్వగా, ఆయన దాన్ని నిలబెట్టుకోవడంలో విఫలం అయ్యారని..నమ్మిన ప్రజలను మోదీ మోసం చేశారని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తనను నమ్మాలని కోరారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి మహాత్మాగాంధీ ఎంతో కృషి చేస్తే, ఇప్పటి ప్రధాని విభజించి పాలించాలన్న సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు.
"మీరు మోదీకి మద్దతిచ్చారు. ఆయన మీ నమ్మకాన్ని వమ్ము చేశారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని, మహాత్మా గాంధీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లి దేశాన్ని అభివృద్ధి చేసే సత్తా ఉన్న కాంగ్రెస్ ను నమ్మండి" అని ఆయన వ్యాఖ్యానించారు. రాఫెల్ డీల్ ను ప్రస్తావిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థను వదిలేసి, అంబానీల సంస్థను ఎంచుకోవడం వెనకున్న కారణం ఏంటో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు.

భాగ్‌పత్ (ఉత్తర్ ప్రదేశ్) : ఒకే కుటుంబానికి చెందిన 13 మంది సభ్యులు ఇస్లాం నుంచి హిందూ మతానికి మారిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పత్‌ జిల్లాలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే ఓ ముస్లీం కుటుంబం బాదర్క గ్రామం నుంచి నవడా గ్రామానికి వలస వెళ్లారు. వారి కుటుంబంలోని వ్యక్తి ఇటీవల హత్యకు గురయ్యాడు. నిందితులను పట్టుకోవడంలో తమకు ఏ ఒక్కరూ సహాయం అందించకపోవడంతో పాటు తమకు దక్కాల్సిన న్యాయం దక్కనందున మతాన్ని మార్చుకుంటున్నట్టు కుటుంబ పెద్ద ప్రకటించాడు.  పోలీసులు కాని తమ మతానికి చెందిన వారు కాని తమకు ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదని.. మతం మారడం వెనక ఎటువంటి తొందరపాటు లేదని తమంత తాముగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కుటుంబ పెద్ద వివరించాడు. దీనికి సంబంధించి కోర్టులో వీరు అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కుటుంబానికి అండగా ఉంటామని యువ హిందూ వాహిని భారత్ నేత యోగేందర్ తోమర్ ప్రకటించారు.

13 మంది గల ఈ కుటుంబం శాస్త్రోక్తంగా అగ్నిగుండం ఏర్పాటు చేసుకొని జపాలతో మతం మారటం విశేషం.

న్యూఢిల్లీ: అత్యాచార బాధితులు తమపై జరిగిన లైంగిక దాడిపై ఫిర్యాదు చేసేందుకు 30 ఏళ్లకు పెంచేందుకు కేంద్ర మహిళ, శిశు సంరక్షణ మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తున్నట్టు ఆ శాఖ మంత్రి మేనకా గాంధీ వెల్లడించారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లడుతూ చిన్నతనంలో జరిగిన లైంగికదాడులకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు మహిళలకు అవకాశం పెరుగుతుందని మేనకా గాంధీ అభిప్రాయపడ్డారు.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (ఎస్‌పీసీ) సెక్షన్ 468 ప్రకారం అత్యాచారం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయాలని పేర్కొంటోంది.

ఇటీవల బాలివుడ్ నటి తనుశ్రీ దత్తా నానా పటేకర్‌పై సినిమా సెట్‌పై చేసిన ఆరోపణల నేపథ్యంలో మేనకా గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలతో సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగిన సంగతి విదితమే. 

తనుశ్రీ దత్తా సంఘటన నేపథ్యంలో నెటిజన్లు ‘‘#మీ టూ’’ అంటూ గ్రూపులుగా ఏర్పడి కామెంట్లు గుప్పించడంతో మరోసారి అత్యాచార బాధితుల ఫిర్యాదులపై చర్చ ప్రారంభమయ్యింది.  

‘‘మీ టూ ఇండియా’’ పేరుతో భారీ ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని మేనకా గాంధీ అభిప్రాయపడ్డారు. కనీసం కొంతమందైనా బాధితులు ముందుకువచ్చి ఫిర్యాదు చేస్తారన్న ఆశాభావాన్ని కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు.

ఢిల్లీ : రూపాయి విలువ భారీగా పతనమైంది. అమెరికా కరెన్సీ డాలర్‌కు డిమాండ్ పెరిగిపోవడంతో దేశీయ కరెన్సీ రూపాయి విలువ మరోసారి భారీగా క్షీణించింది. మార్కెట్‌ చరిత్రలోనే తొలిసారిగా 73 మార్క్‌ను దాటింది. 73.34 వద్ద అత్యంత కనిష్టానికి రూపాయి పడిపోయంది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.34 వద్ద తాజా జీవనకాల కనిష్ఠాన్ని తాకింది. మంగళవారం నాటి సెషన్‌లో 72.91 వద్ద స్థిరపడ్డ రూపాయి.. నేడు 35 పైసలు నష్టపోయి 73.26 వద్ద ప్రారంభమైంది. కాసేపటికే మరింత దిగజారి 73.34 వద్ద అత్యంత కనిష్ఠానికి పడిపోయింది. ప్రస్తుతం 9.45 గంటల ప్రాంతంలో రూపాయి మారకం విలువ 73.33గా కొనసాగుతోంది.

దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో పాటు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడంతో దేశీయంగా రూపాయి విలువ భారీగా పతనమైందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. సోమవారం నాటి ట్రేడింగ్‌లో రూ. 1,842కోట్ల పెట్టబడులను విదేశీ సంస్థాగత మదుపర్లు వెనక్కి తీసుకున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా ముడిచమురు ధర బ్యారెల్‌కు 85 డాలర్లుగా ఉంది. కాగా.. రూపాయి పతనం స్టాక్‌ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. నేటి ట్రేడింగ్‌లో దేశీయ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఢిల్లీ  ...భారత అత్యున్నత న్యాయస్థానం  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్‌   బుధవారం  ప్రమాణ స్వీకారం  చేశారు.  రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఈ ఉదయం ఆయనతో  రాష్ట్రపతి  భవన్ లో  ప్రమాణ స్వీకారం చేయించారు. అసోం వాసి అయిన 63 సంవత్సరాల  గొగోయ్‌.. ఈశాన్య రాష్ట్రాల నుంచి   దేశ సర్వోన్నత  న్యాయస్థానం చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు చేపడుతున్న తొలివ్యక్తి.  ఆయన ఈ పదవిలో 2019 నవంబర్‌ వరకు  కొనసాగుతారు. రాష్ట్రపతి భవన్  దర్బార్ హాలులో  జరిగిన ఈ  కార్యక్రమానికి ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ,   కేంద్ర  హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్,  ఆర్ధిక మంత్రి అరుణ్  జైట్లీ , మాజీ  ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, దేవగౌడ, పలువురు కేంద్రమంత్రులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.ఈఏడాది జనవరిలో   చీఫ్ జస్టిస్ మిశ్రాని విమర్శించిన నలుగురు న్యాయమూర్తులలో రంజన్ గొగోయ్‌  ఒకరు. 

 

కోల్‌కతా...పశ్చిమబంగాల్‌లోని  కోల్‌కతా  మెడికల్  కాలేజీ  ఆస్పత్రిలో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఆస్పత్రిలోని 250 మంది రోగులను సెలైన్‌ సీసాలు, స్ట్రెక్చర్‌లతో సహా హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో కొందరిని ఇతర ఆస్పత్రులకు పంపించారు. మొదట  ఉదయం   7-30   ప్రాంతంలో ఆస్పత్రిలోని ఫార్మసీ విభాగంలో దట్టమైన పొగ రావడం గమనించిన సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ బ్రిగేడ్ 10 వాహనాలతో సహా ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులతోపాటు పశ్చిమ్‌ బంగ‌ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరిగినట్టు ఇంతవరకూ సమాచారమేదీ లేదు. స్థానిక పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.  

2011లో కోల్‌కతాలోని ఏఎంఆర్‌ఐ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 92 మంది చనిపోయారు.అప్పుడు  రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో చాలా మంది రోగులు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు.

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తమ ఆందోళన కొనసాగించిన రైతులు  అర్థరాత్రి ఆందోళన విరమించారు. ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించిన అన్నదాతలు తమ ఆందోళనలు విరమించుకున్నారు. అంతకు ముందు రైతులు ఆందోళన విరమణకు రైతులు ససేమిరా అన్నారు. తమను ఆపిన చోటే ఆందోళనను కొనసాగిస్తామంటూ మంగళవారం రాత్రి పొద్దుపోయాక దిల్లీ సరిహద్దులోనే పడకలు వేసుకుని నిద్రకు ఉపక్రమించారు. దీంతో అక్కడ వేలమంది పోలీసుల్ని మోహరించారు. కనీస మద్దతు ధరపై స్వామినాథన్‌ కమిటీ నివేదిక పూర్తిస్థాయి అమలు, సంపూర్ణ రుణమాఫీల కోసం రైతులు పట్టుపట్టారు. 11 అంశాలకు గానూ ఏడింటిపై ప్రభుత్వం అంగీకరించినా మిగిలినవి ఆర్థికాంశాలు కావడంతో చర్చించాక చెబుతామన్నారని బీకేయూ ప్రతినిధి యుధ్‌వీర్‌సింగ్‌ తెలిపారు. ఆతర్వాత అర్థరాత్రి ఆందోళన విరమించుకోవడంతో  అధికారులు, అటు కేంద్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.
 
మంగళవారం వేల మంది  అన్నదాతలు దేశ రాజధానిపైకి దండెత్తారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి వినిపించడానికి ఉద్యుక్తులయ్యారు. వీరిని నిలువరించేందుకు పోలీసులు  చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారి తీసింది. పంట రుణాల మాఫీ, ఇంధన ధరల తగ్గింపు, స్వామినాథన్‌ కమిటీ నివేదిక అమలు, పదేళ్లు పైబడిన ట్రాక్టర్ల వినియోగంపై నిషేధం తొలగింపు వంటి వివిధ డిమాండ్ల సాధనకు వీరంతా 'కిసాన్‌ క్రాంతి పాదయాత్ర' పేరుతో భారీ ప్రదర్శన చేపట్టారు. వారిపైకి పోలీసులు జల ఫిరంగులను, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఘర్షణలో కొందరు రైతులు, పోలీసులు గాయపడ్డారు. ప్రభుత్వం తమ డిమాండ్లను ఆమోదించేవరకూ ఆందోళనను విరమించేది లేదని రైతునేతలు స్పష్టం చేశారు. 

రైతులపట్ల కేంద్రం తీరును విపక్షాలు ఆక్షేపించాయి. రైతులపై హింసాత్మక చర్యలకు పాల్పడడమేమిటని కాంగ్రెస్‌, ఆప్‌ ప్రశ్నించాయి. ఏపీ సీఎం చంద్రబాబు కూడా కేంద్రం తీరును తప్పుపట్టారు. మరోవైపు పరిస్థితి తీవ్రత దృష్ట్యా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ సహా కొంతమందితో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చర్చించారు. ఆ తర్వాత ఆందోళనకారుల వద్దకు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రాజేంద్రసింగ్‌ షెకావత్‌ వచ్చారు. డిమాండ్లను పరిశీలించడానికి ముఖ్యమంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం తరఫున హామీ ఇచ్చారు. నిరసనకారులు ఆ హామీతో సంతృప్తి చెందలేదు. ఢిల్లీ సరిహద్దుల్లో రాత్రి బైఠాయించారు. 

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. యువతిపై మేనమామ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జాతకంలో దోషం ఉందంటూ ఓ యువతిపై ఆమె మేనమామ నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతికి వివాహం జరిగాక కూడా నిందితుడు ఈ అఘాయిత్యాన్ని ఆపలేదు. దీంతో విషయాన్ని యువతి తన బంధువులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. 

ఆ దోషం సరి చేసుకోకపోతే తండ్రి చనిపోతాడని చెప్పి నిందితుడు బాధితురాలిని లొంగదీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మేనకోడలు అని కూడా చూడకుండా 23 ఏళ్ల యువతిపై గత నాలుగేళ్లుగా లెక్కలేనన్ని సార్లు అత్యాచారం జరిపాడని వెల్లడించారు. యువతిని ఢిల్లీలోని మహిళా సంరక్షణ గృహానికి తరలించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. నరేలా ప్రాంత పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 

 

Pages

Don't Miss