National News

చెన్నై: తమిళనాడులో ఓ స్కూల్ బస్ బోల్తా పడ్డ ఘటనలో 50మంది చిన్నారులు గాయపడ్డారు. పెరంబదూర్ జిల్లాలోని తిరుచ్చిలో ఈ ఘటన చోటు చేసుచేసుకుంది. డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో 50మంది చిన్నారులు గాయపడగా... 27మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరందరికి పెరంబదూర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

 

ఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ సర్కారు పెట్రో డీజెల్‌పై వ్యాట్‌ పెంపుదల చేసినందుకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు సీఎం కేజ్రీవాల్‌ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వాటర్‌ క్యాన్లతో ఆందోళన కారులను చెల్లాచెదురు చేశారు.

 

హైదరాబాద్: వాహనదారులకు శుభవార్త. ఇన్నాళ్లు చుక్కలంటిన చమురు ధరలు నేలచూపులు చూశాయి. కొద్దిరోజులుగా కొండెక్కి కూర్చున్న పెట్రోల్‌, డీజిల్ రేట్లు కాస్త దిగొచ్చాయి. ఢిల్లీ మినహా దేశవ్యాప్తంగా ఆయిల్ ధరలు తగ్గాయి.
లీటరు పెట్రోలు, డీజిల్ పై రూ. 2 తగ్గింపు....
లీటర్‌ పెట్రోలుపై 2 రూపాయలు, డీజిల్‌పై 2 రూపాయలు తగ్గిస్తూ...చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచే తగ్గిన ధరలు అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు బ్యారెల్ ధరలు తగ్గుముఖం పట్టడంతోనే... ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి.
హైదరాబాద్‌లో....
హైదరాబాద్‌లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 75 రూపాయల 11 పైసలు ఉండగా... తాజాగా 73 రూపాయల 11 పైసలైంది. అలాగే లీటర్ డీజిల్ ధర 56 రూపాయల 79 పైసల నుంచి 54 రూపాయల 79 పైసలకు తగ్గింది. స్వల్పంగా తగ్గిన ధరలతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇక దేశరాజధానిలో చమురుధరలు ఆకాశాన్నంటాయి. కేజ్రీవాల్ ప్రభుత్వం సామాన్యులపై వ్యాట్ మోత మోగించింది. డీజిల్‌పై 16.6 శాతం, పెట్రోల్‌పై 25 శాతం వ్యాట్‌ను పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్‌పై 2 రూపాయల 78 పైసలు, లీటర్ డీజిల్‌పై రూపాయి 83 పైసలు పెంచారు.

హైదరాబాద్:కశ్మీర్‌ సరిహద్దులో మరోసారి పాకిస్థాన్‌ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. అఖ్నూర్‌ సెక్టార్‌లో బీఎస్‌ఎఫ్‌ శిబిరంపై బుధవారం ఉదయం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక పోలీదేవి అనే మహిళ మరణించగా.. ఇద్దరు బీఎస్ఎఫ్‌ జవాన్లతో సహా ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రలను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.                                                              
కాల్పులతో ఉలిక్కిపడ్డ ప్రజలు .....
ఒక్కసారిగా కాల్పులు జరగడంతో ఆ ప్రాంత ప్రజలు ఉలిక్కిపడ్డారు. ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. పాక్‌ దుశ్చర్యకు ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. పెద్ద పెద్ద మోటార్లతో కాల్పులకు పాల్పడ్డారని ప్రజలు చెబుతున్నారు.
తమ భూభాగంలోకి వచ్చిన డ్రోన్‌పై కాల్పులు జరిపినట్లు ప్రకటించిన పాక్‌ ఆర్మీ...
మరోపక్క తమ భూభాగంలోకి భారత నిఘా డ్రోన్‌ వచ్చిందని.. అందుకే కాల్పులు జరిపామని పాక్‌ ఆర్మీ ప్రకటించింది. అయితే ఈ ఆరోపణలను భారత రక్షణ శాఖ తిప్పికొట్టింది. కాగా.. ప్రధాని మోదీ శుక్రవారం జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్న నేపథ్యంలో అఖ్నూర్‌ సెక్టార్‌లో పాక్‌ రేంజర్లు కాల్పులకు పాల్పడడంతో ఆర్మీ సిబ్బంది అప్రమత్తమైంది. అడుగడుగున భద్రతా వ్యవస్థను పెంచింది. ఇక బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది కూడా పాక్‌ సైనికుల కాల్పులను తిప్పికొట్టాయి. సాయంత్రం వరకు కాల్పులు కొనసాగాయి. 

హైదరాబాద్ : భూసేకరణ ఆర్డినెన్స్ ఎలాగైనా తీసుకురావాలని పట్టుదలతో ఉన్న ప్రధాని నీతి ఆయోగ్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కావాల్సి ఉన్న సమావేశంలో కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల సిఎంలు మాత్రమే హాజరయ్యారు. ల్యాండ్‌ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన డజన్ మంది సిఎంలు నీతి ఆయోగ్‌ మీటింగ్‌కు డుమ్మా కొట్టారు. నీతి ఆయోగ్‌లో ఎన్నో అంశాలు ఉన్నప్పటికీ ప్రధానంగా భూసేకరణ బిల్లు ఆర్డినెన్స్ పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ ఆర్డినెన్స్ పై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి ఓ అవగాహన కల్పించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం.
కేంద్రం ఉద్ధేశ్యాన్ని పసిగట్టిన ప్రతిపక్షాలు..
కేంద్రం ఉద్దేశాన్ని ముందే పసిగట్టిన ప్రతిపక్షాలు నీతిఆయోగ్‌కు డుమ్మా కొట్టాయి. మొదటి నుంచి భూసేకరణ ఆర్డినెన్స్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలకు చెందిన 9 మంది ముఖ్యమంత్రులతో పాటు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిషా సిఎం నవీన్‌ పట్నాయక్, యుపి సిఎం అఖిలేష్‌ యాదవ్‌లు గైర్హాజరయ్యారు. భూసేకరణ ఆర్డినెన్స్‌ను తమ పార్టీ వ్యతిరేకిస్తున్నందున తాను హాజరు కావడం లేదని ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని మమతా బెనర్జీ ప్రధానికి లేఖ రాశారు. ల్యాండ్‌ బిల్లును సంయుక్త పార్లమెంట్‌ కమిటీ పరిశీలిస్తున్నందున దీనిపై సమావేశం జరపడం అనవసరమని సమాజ్‌వాది పార్టీ స్పష్టం చేసింది. ల్యాండ్‌ ఆర్డినెన్స్‌పై తమ పార్టీ వైఖరేంటో పార్లమెంట్‌ సమావేశాల్లో అవగతమవుతుందని ఎస్పీ పేర్కొంది. బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌, ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నీతీ ఆయోగ్‌లో పాల్గొన్నారు. భూసేకరణ ఆర్డినెన్స్‌ను జెడియు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు ముఖ్యమంత్రులు మొదట నీతిఆయోగ్‌కు హాజరవ్వొద్దని నిర్ణయించినప్పటికీ, మంగళవారం నాడు నితీష్‌ కేజ్రీవాల్‌ను కలుసుకున్న సందర్భంలో నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ సమావేశానికి బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా హాజరయ్యారు. మాజీ ఐపిఎల్‌ ఛైర్మన్ లలిత్‌మోదికి సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ప్రధానమంత్రి నరేంద్రమోడీని తొలిసారిగా కలుసుకున్నారు. ఆర్థిక సంస్కరణలో భాగంగా భూసేకరణ ఆర్డినెన్స్ తీసుకురావడానికి ప్రధాని మోడీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ బిల్లు ద్వారా అభివృద్ధితో పాటు మౌళిక వసతులు ఏర్పాటవుతాయని కేంద్రం చెబుతోంది. రైతులను మోసం చేసి కార్పోరేట్లకు లబ్ది చేకూర్చేందుకే కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ తెస్తోందని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఢిల్లీ : వ్యాపం స్కాంతో బిజెపికి చెందిన కేంద్రమంత్రులు ఎంపీలు, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకు సంబంధం ఉందని కాంగ్రెస్‌ ఆరోపించింది. తాజాగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కాంగ్రెస్‌ టార్గెట్‌ చేసింది. వ్యాపం స్కాం ప్రధాన సూత్రధారి సుధీర్‌శర్మ, లక్ష్మీకాంత్‌ శర్మలతో కేంద్రమంత్రి ప్రధాన్‌ డబ్బులు పంచుకున్నారని ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కాంగ్రెస్‌ బహిర్గతం చేసింది. ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రయాణానికి కావలసిన విమాన టికెట్లను సుధీర్‌ శర్మ తీసుకున్నట్టు పేర్కొంది. 2011లో సుధీర్‌ శర్మ తదితరుల ఆదాయానికి సంబంధించి ఐటి శాఖ నిర్వహించిన సోదాలో ఈ విషయం బయటపడిందని తెలిపింది. నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్‌ పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా డిమాండ్‌ చేశారు. సిబిఐ విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది.

ఢిల్లీ : రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటకు ఏపీ సీఎం చంద్రబాబే కారణమని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా పేర్కొన్నారు. ఢిల్లీలో ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో రఘువీరా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై రాహుల్ తో రఘువీరా చర్చించారు. ఈ సందర్భంగా రఘువీరా మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు వీఐపీ ఘాట్ లో స్నానం చేసి ఉంటే ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగి ఉండేది కాదన్నారు. ఇతరులు స్నానం చేసే చోట మూడున్నర గంటల వరకు స్నానం చేశారని విమర్శించారు. ఆ సమయంలో సామాన్య భక్తులను ఎవరినీ వదలలేదని ఇది తాము చెబుతున్న మాటలు కాదని, చనిపోయిన వారు కుటుంబసభ్యులు..క్షతగాత్రులు పేర్కొన్నారని తెలిపారు. 

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ రెండో విడత సమావేశానికి 14మంది ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు 9మందితో పాటు జయలలిత, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశానికి గైర్హాజరయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు హాజరయ్యారు. వివాదాస్పద భూసేకరణ బిల్లుతో పాటు కేంద్ర పథకాలపై చర్చిస్తున్నారు. 

హైదరాబాద్ : సామాజిక కార్యకర్త తీస్తా సెతల్‌వాద్ విదేశీ విరాళాల కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. కోర్టు ఆదేశాలతో నిన్న మూడుచోట్ల దాడులు నిర్వహించిన సీబీఐ.. త్వరలో ఈ కేసులో నోటీసులు జారీ చేయనుంది. అయితే మోడీ సర్కార్ తనపై కావాలనే ఇలా వేధింపులకు పాల్పడుతోందని తీస్తా ఆరోపించింది. 
తీస్తా ఇంటిపై సీబీఐ దాడులు...
కేంద్ర హోం శాఖ అనుమతి పొందకుండా.. విదేశీ విరాళాలను స్వీకరించారంటూ... సామాజిక కార్యకర్త తీస్తా సెతల్ వాద్ ఇంటిపై సీబీఐ దాడులు నిర్వహించింది. కోర్టు అనుమతితో తీస్తా ఇల్లు, ఆమె భర్త నిర్వహిస్తున్న సబ్ రంగ్ కమ్యునికేషన్స్ కార్యాలయం, ప్రింటింగ్ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ రైడింగ్‌లో 16 మంది అధికారులు పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో కీలక ఆధారాలు, డాక్యుమెంట్లు లభించినట్టు సీబీఐ తెలిపింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద నిబంధనలు ఉల్లఘించారనేందుకు కావల్సిన సాక్ష్యాలు లభించినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు.
గుజరాత్ అల్లర్ల బాధితులకు తీస్తా చేయూత..
గుజరాత్‌ అల్లర్ల బాధితులను ఆదుకునేందుకు కొన్నేళ్లుగా తీస్తా సెతల్‌వాద్‌ కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం 2010లో విదేశాల నుంచి స్వీకరించిన నిధుల వెనక. ఎఫ్సీఆర్ఏ నిబంధనలు ఉల్లఘించారని ఆమెపై ఆరోపణలొచ్చాయి. దీనిపై కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. ఈ కేసులో తీస్తాతో పాటు ఆమె భర్త జావిద్ అహ్మద్, పెషిమామ్ గులామ్ మోహమ్మద్ మరో వ్యక్తిపై గతవారం సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నిన్నటి తనిఖీల్లో లభించిన డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం నిందితులకు సమన్లు జారీ చేస్తామని దర్యాప్తు అధికారులు తెలిపారు. మరోవైపు తాము విచారణకు పూర్తిగా సహకరిస్తామని లేఖ రాసినప్పటికి ఇలా ఆకస్మిక దాడులు నిర్వహించడాన్ని తీస్తా తప్పుపట్టారు. తనపై విచారణ కోసం ప్రధాని కార్యాలయం సిబిఐపై ఒత్తిడి తెస్తునట్టు ఆమె ఆరోపించారు. 

హైదరాబాద్: గ్రీస్ ప్రమాదం తప్పింది... స్టాక్ మార్కెట్ బాగానే ఉంది... ద్రవ్యోల్బణమే కాస్త పెరిగి భయపెడుతుంటే... వర్షాలు నిరాశపరుస్తున్నాయి... ఇన్ని అంశాల మధ్య ఇప్పుడు దేశంలో ఆర్థిక నిపుణులు, కార్పొరేట్ సంస్థల్లో కొత్త చర్చ మొదలైంది. వచ్చేనెల 4న జరిగే పరపతి సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లు పెంచుతుందా... లేదా... ఎకనామిక్ వరల్డ్ లో ఇదే ఇప్పుడు హాట్ డిస్కషన్.
రాజన్ మరోసారి తీపికబురే పంచుతారా...?
ఆగస్ట్ 4న జరిగే మధ్యంతర పరపతి సమీక్షలో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నెక్ట్ స్టెప్ ఏంటి... ఎలా ఉండబోతోందో... ఆర్థిక వేత్తలు అప్పుడే అంచనాలు ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే... మరోసారి రాజన్ తీపికబురే పంచుతారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మోడీ మెకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా పథకాలకు సపోర్టుగా... ఈ ఏడాది ముచ్చటగా నాలుగుసారి కనీసం పావుశాతం కీలక వడ్డీరేటు తగ్గిస్తారని కొందరు నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఫలితాలు ఆశాజనకంగా లేకపోవటంతో... ఆర్బీఐ నుంచి కార్పొరేట్ సంస్థలు ద్రవ్య మద్దతు.కోరుకుంటున్నాయి. పడిపోతున్న ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ రేటింగ్ ను వారు సాకుగా చూపిస్తున్నారు. రేటింగ్ సంస్థల అంచనాలు కూడా పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులు బాగా ఉంటే వచ్చేనెల వడ్డీరేట్లు పావుశాతం తగ్గడం ఖాయమని మూడీస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, మెరిలించ్ తమ రీసెర్చ్ రిపోర్టులో పేర్కొన్నాయి.
జులైలో 30శాతం తగ్గిన వర్షపాతం....
అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జులైలో వర్షాభావ పరిస్థితులు మరోసారి రేట్లకోతకు అడ్డుగా పరిణమించే అవకాశాలు లేకపోలేదు. ఈనెలలో ఇప్పటివరకు వర్షపాతం 30శాతం తగ్గింది. జూన్ లో సాధారణం కంటే 16శాతం అధికంగా నమోదైన వర్షాలు ... ఇప్పుడు మొహం చాటేచాయి. ఈ ప్రభావం.. వ్యవసాయ ఉత్పత్తులపై కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేలో 4శాతం పెరిగిన పప్పుధాన్యాల ధరలు... ఈనెలలో ఇప్పుడు 22శాతం పెరగడం కలవరం కలిగిస్తోంది. మరోవైపు ద్రవ్యోల్బణం 8నెలల గరిష్ఠానికి చేరడం మరో ప్రమాదకర అంశం. జూన్ లో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 5.4శాతంగా నమోదైంది. అంతకు ముందు మేలో ఇది 5.01శాతం. ద్రవ్యోల్బణ కట్టడే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న రాజన్ ... ఈసారి వడ్డీరేట్ల తగ్గింపు సమీక్షలో ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. వడ్డీరేట్లు తగ్గి.. కంపెనీల విస్తరణ, చౌక గృహరుణాలతో ఆర్థికాభివృద్ధి పుంజుకుంటుందని కార్పొరేట్ సంస్థలు భావిస్తుంటే... పెరుగుతున్న ద్రవ్యోల్బణ భూతం వారి ఆశలపై నీళ్లు చల్లేలా కనిపిస్తోంది. ఏదేమైనా రఘురామ్ రాజన్ మనసులో ఏముందో బయటపడాలంటే ఆగస్ట్ 4 వరకు వేచి చూడాలి.

హైదరాబాద్: కూసింత వయ్యారం..కూసింత సింగారం. దీనికి తోడు కాసంత బంగారం.. ఇంకేముందు ఫ్యాషన్‌ షో అదుర్స్‌ అనిపించింది. పట్టు చీరలు.. అందునా కాంచీపురం చీరలు. వీటికి 72 గ్రాముల బంగారు తీగలతో మరింత బంగారు మెరుగులు దిద్దారు డిజైనర్లు. అవే తంగపట్టు చీరలు. సిక్స్‌ యార్డ్‌ వండర్‌ పద్ధతిలో ఈ చీరలను 14 రోజులపాటు నేశారు. పసిడి తీగలు, పట్టు ఉలెన్‌ల సమ్మేళనంతో తయారైన తంగపట్టు చీరల్లో మోడళ్లు కేకపుట్టించారు. సొగసైన, మృదువైన, తక్కువ బరువుండే కాంచీపురం చీరలకు బంగారం అద్దులు అద్ది మరింత వన్నె తెచ్చారు. లైట్ అండ్ డార్క్‌ కలర్స్‌లోని ప్రీమియం డిజైన్లు అందరినీ ఆకట్టుకున్నాయి.
చెన్నైలో కుమరన్ స్టోర్స్ ఆధ్వర్యంలో ....
చెన్నైలో కుమరన్ స్టోర్స్ ఆధ్వర్యంలో ఈ ఫ్యాషన్‌ షో నిర్వహించారు. దక్షిణ భారతదేశపు సంస్కృతీ సంప్రదాయాలదు ఉట్టిపడేలా జరిగిన ఈ ఫ్యాషన్‌ షోలో చెన్నై ఫ్యాషన్‌ వీక్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ రోషన్‌ రావ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

హైదరాబాద్: ఛత్తీస్‌గడ్‌ లోని బిజాపూర్‌ జిల్లాలో రెండు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన పోలీసులను మావోయిస్టులు మట్టుబెట్టారు. వారి మృత దేహాలను కిడ్నాప్‌కు గురైన ప్రాంతం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో వదిలివెళ్లారు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం బస్సులో ప్రయాణిస్తుండగా కిడ్నాప్‌కు గురైన అసిస్టెంట్‌ కానిస్టేబుళ్లను మావోయిస్టులు కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. అనంతరం వారిని తుపాకులతో కాల్చి చంపి రోడ్డు పక్కన పారవేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. చనిపోయిన కానిస్టేబుల్స్‌ను జైదేవ్‌ యాదవ్‌, మంగల్‌ సోదీ, తేల రాజు, మజ్జి రాము గా గుర్తించారు. 

ఢిల్లీ:అమెరికా ఆధ్వర్యంలోని 6 శక్తిమంతమైన దేశాలతో ఇరాన్‌ చారిత్రాత్మక అణు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రకటించారు. అమెరికా- ఇరాన్‌ల మధ్య దాదాపు 20 నెలలుగా సాగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరింది. ఈ కీలక ఒప్పందంతో ఇరాన్‌ చమురు ఉత్తత్తి, ఫైనాన్షియలకు సంబంధించిన వ్యవహారాలపై అమెరికా దాని మిత్రదేశాలు పెట్టిన ఆంక్షలు తొలగిపోనున్నాయి. టెహరాన్‌, వాషింగ్టన్‌ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరాన్‌ అణ్వస్త్ర కార్యకలాపాలను ఐక్యరాజ్యసమితి బృందం పర్యవేక్షిస్తుంది. ఇరాన్‌ సైనిక స్థావరాలను సైతం సోదా చేసే అధికారం ఉంటుంది. ఈ ఒప్పందంపై ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహాని హర్షం వ్యక్తం చేశారు. 

ఢిల్లీ: రాష్ట్రపతిభవన్‌లో ప్రణబ్‌ ముఖర్జీ ఇవ్వనున్న...ఇఫ్తార్‌ విందుకు ప్రధాని హాజరుకావటం లేదని తెలుస్తోంది. మోదీ బిజీ షెడ్యూల్ కారణంగానే.. విందుకు హాజరుకావటం లేదని పీఎంవో వర్గాలు చెబుతున్నాయి. ఈ రోజుసాయంత్రం ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో మోడీ సమావేశమవుతారు. సిక్కిం సహా పలు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై సమావేశంలో చర్చించనున్నారు.
షెడ్యూల్ మార్చాలని కోరినా స్పందించలేదు-కాంగ్రెస్....
ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఐదింటిలో అధికారంలో ఉంది. మోడీ షెడ్యూల్‌పై కాంగ్రెస్‌ వాదన మాత్రం మరోలా ఉంది. ఈశాన్యరాష్ట్రాల పర్యటన షెడ్యూల్‌ను మార్చుకొని....ఇఫ్తార్‌ విందుకు హాజరుకావాలని కోరినా ప్రధాని స్పందించలేదని ఆరోపిస్తున్నారు. ఇఫ్తార్‌ ముస్లింల కార్యక్రమం కావటంతోనే... మోడీ కావాలని విస్మరిస్తున్నారని విమర్శిస్తున్నారు.
మోడీ తీరుపై విపక్షాల విమర్శలు....
కాంగ్రెస్‌ విమర్శలను పీఎంవో వర్గాలు తిప్పికొడుతున్నాయి. పలు ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రామలపై సమావేశం ఉందని...అందుకే మోడీ దానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఐతే మోడీ తీరుపై పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని సెక్యులరిజానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శిస్తున్నారు.

గతేడాది కూడా హాజరుకాని మోడీ....
ఐతే మోడీ గతేడాది కూడా రాష్ట్రపతి ఇఫ్తార్‌ విందుకు హాజరుకాలేదు. చాలావరకు కేంద్రమంత్రులు సైతం విందుకు వెళ్లలేదు. ఒక్క రాజనాథ్‌సింగ్‌ మాత్రమే ఇఫ్తార్‌ విందుకు హాజరయ్యారు. మోడీ మరోసారి ఇఫ్తార్ విందుకు డుమ్మాకొడుతున్నారని ఇప్పటికే తేలిపోయింది. మరి ఎంతమంది కేంద్రమంత్రులు..విందుకు హాజరవుతారో చూడాలి.

హారారే: జింబాబ్వేతో ముగిసిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో ప్రపంచ రెండో ర్యాంకర్ టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో క్లీన్ స్వీప్ సాధించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ముగిసిన ఆఖరి వన్డేలో టీమిండియా 83 పరుగుల భారీవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 276 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. మిడిలార్డర్ ఆటగాడు కేదార్ జాదవ్ 87 బాల్స్ లో 12 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో అజేయ సెంచరీ సాధించాడు. మనీష్ పాండే 71 పరుగులతో స్కోరుత కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. 278 పరుగుల భారీ టార్గెట్ తో చేజింగ్ కు దిగిన జింబాబ్వే...42.4 ఓవర్లలో 193 స్కోరుకే కుప్పకూలింది. ఓపెనర్ చిబాబా మినహా మిగిలిన ఏ.. ఆటగాడు టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొనలేకపోయాడు. మీడియం పేసర్లు స్టువర్ట్ బిన్నీ 3 వికెట్లు, మోహిత్ శర్మ2 వికెట్లు, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు. కేదార్ జాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, అంబటి రాయుడుకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. సిరీస్ లోని రెండు మ్యాచ్ ల టీ-20 సమరం ఈనెల 17న ప్రారంభమవుతుంది.

 

 

ఢిల్లీ: ఐపీఎల్ 2013 సీజన్.. బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ పై విచారణ నిర్వహించిన జస్టిస్ లోథా కమిటీ తన తుదితీర్పును ప్రకటించింది. ఐపీఎల్ మాజీ చాంపియన్లు రాజస్థాన్, చెన్నై ఫ్రాంచైజీలపై రెండేళ్ళ పాటు నిషేధం విధించినట్లు జస్టిస్ లోథా ప్రకటించారు. ఫ్రాంచైజీ ఓనర్లుగా ఉంటూ భారత క్రికెట్ కే తలవంపులు తెచ్చిన గురునాథన్ మెయ్యప్పన్, రాజ్ కుంద్రాలపై జీవితకాల నిషేధం విధించినట్లు కూడా ప్రకటించారు. ఫ్రాంచైజీలను, ఓనర్లను వేర్వేరుగా చూడలేమని జస్టిస్ లోథా స్పష్టం చేశారు.

చెన్నె : ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. చెన్నెలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1928 జూన్ 24న విశ్వనాథన్ జన్మించారు. తమిళం, తెలుగు, మలయాళం సినిమాలకు స్వరాలందించారు. మూడు భాషల్లో 1200 సినిమాలకు సంగీతం అందించారు. సోలోగా 700 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. తమిళంలో 510, మలయాళం 76, కన్నడంలో 3, తెలుగులో 70 సినిమాలకు ఎంఎస్ స్వరసారధ్యం వహించారు.
దేవదాసు, లైలా మజ్నూ సినిమాలకు సీఆర్ సుబ్బరామన్ తో కలిసి పనిచేశారు. వివిధ చిత్రాలకు రామూర్తి, విశ్వనాథన్ సంగీత దర్శకత్వం వహించారు. దేవదాసు సినిమాలో 'జగమే మాయ..బ్రతుకే మాయ' పాటను ఎంఎస్ స్వరపరిచారు. చండీరాణి, గుప్పుడు మనస్సు, మరో చరిత్ర, లేత మనసులు, సత్తెకాలపు సత్తయ్య, సిపాయి చిన్నయ్య, ఇంటికి దీపం ఇల్లాలే, సింహబలుడు, చిలకమ్మ చెప్పింది, అంతులేని కథ వంటి సినిమాలకు ఆయన సంగీతం అందించారు.

ఢిల్లీ: 26/11 ముంబై దాడులకు సంబంధించి భారత్- పాక్‌ ప్రధానుల మధ్య ఉఫాలో జరిగిన చర్చలపై పాకిస్తాన్‌ యూ టర్న్ తీసుకుంది. ముంబై దాడులపై మరిన్ని ఆధారాలు, సాక్ష్యాలు కావలాంటూ పాకిస్తాన్‌ మళ్లీ మెలిక పెట్టింది. అంతేకాదు... కాశ్మీర్‌ ఎజెండా లేకుండా రెండు దేశాల మధ్య చర్చలు జరగడం అసాధ్యమని పాకిస్తాన్‌ జాతీయ భద్రతా సలహాదారుడు సర్తాజ్‌ అజీజ్‌ స్పష్టం చేశారు. ముంబై దాడులకు సంబంధించిన ఆధారాలను భారత్‌ పాక్‌ సమర్పించినా ఉగ్రవాదులపై ఇంతవరకు విచారణ జరపలేదు. ఇరుదేశాల ప్రధానులు జరిపిన చర్చలపై ముంబై దాడులతో పాటు, కాశ్మీర్‌ అంశం కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చర్చకు వచ్చింది. ఇంతలోనే పాకిస్తాన్‌ మాట మార్చింది. ముంబై దాడుల ప్రధాన సూత్రధారి లఖ్వీ వాయిస్‌ శాంపిల్స్ ను తమ దేశ చట్టాలు అంగీకరించవని పాకిస్తాన్‌ పేర్కొంది.

 

ఢిల్లీ: వ్యాపం కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభమైంది. మొత్తం 40 మంది అధికారుల బృందం విచారణలో భాగస్వామ్యం అవుతోంది. ఈ బృందానికి 1986 బ్యాచ్‌ ఐపీఎస్ అధికారి... అస్సాం-మేఘాలయ క్యాడర్‌కు చెందిన ఆర్ పి. అగర్వాల్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఇవాళ ఉదయమే బోపాల్‌ చేరుకున్న సీబీఐ టీమ్‌... వచ్చీ రాగానే తనపని మొదలు పెట్టింది. ఇప్పటి వరకూ వ్యాపం స్కాంపై దర్యాప్తు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్-ఎస్ టిఎఫ్ ను కలిసి... వారి నుంచి కేసు దర్యాప్తు బాధ్యతలు తీసుకున్నారు. 

ఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇఫ్తార్‌ విందు ప్రారంభమైంది. ఈ విందుకు ఎన్డీయేతర సెక్యులర్‌ పార్టీలను ఆహ్వానించారు. త్వరలో ప్రారంభమయ్యే వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల ముందు ఈ విందు- రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. వ్యాపం స్కాం, లలిత్‌ మోదీ అంశాలపై పార్లమెంట్‌లో అనుసరించే వ్యూహాలపై సెక్యులర్‌ పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది. ఈ విందుకు ఎస్పీ అధినేత ములాయం, బిఎస్పీ చీఫ్‌ మాయావతి, సిపిఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ తరపున రాజా, ఎన్‌సిపి చీఫ్‌ శరద్‌పవార్, దేవెగౌడతో పాటు డిఎంకె, టిఎంసి, అన్నాడిఎంకె, బిజెడి, టిఆర్‌ఎస్ తదితర నేతలు హాజరు కానున్నారు. బీహార్‌లో బిజీ షెడ్యూల్‌ ఉండడం వల్ల తాను ఇఫ్తార్‌కు హాజరు కావడం లేదని ఆర్జేడి అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ పేర్కొన్నారు. పార్లమెంట్‌ సమావేశాలు జూలై 21 నుంచి ప్రారంభం కానున్నాయి.

 

ఫ్రాన్స్: ప్యారిస్‌లో ఓ గన్‌మెన్‌ కలకలం రేపాడు. ప్రిమార్క్ అనే బట్టల దుకాణంలో ప్రవేశించి.. అక్కడున్న పదిమందిని బందీలుగా చేశాడు. ఏం జరుగుతుందో తెలీక బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గన్‌మెన్‌ చెరనుంచి...బాధితులను విడిపించేందుకు పోలీసులు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ఇద్దరు లేదా ముగ్గురు ఆగంతకులు షాపు లోపలకు ప్రవేశించి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రిమార్క్‌ దుకాణం చుట్టూ భారీగా పోలీసుల్ని మోహరించారు. అటు... బందీలుగా చేసుకున్న ఆగంతకులు... ఏ క్షణం ఎలా రియాక్టవుతారో అన్న ఆందోళన... సర్వత్రా వ్యక్తమవుతోంది. 

బీహార్ : త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్‌పై రాజకీయ పార్టీల ఫోకస్ మొదలైంది. యుద్దానికి సన్నద్దం అయ్యేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక ఎప్పటిలాగే ఈసారీ అక్కడ కులరాజకీయాలే రాజ్యమేలేలా కనిపిస్తున్నాయి. వ్యూహాలు పన్నటంలో దిట్టగా పేరొందిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా బీహార్‌లో అపుడే వ్యూహాల అమలు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో అత్యధికంగా వున్న వెనకబడిన తరగతుల ఓట్లు కొల్లగొట్టడానికి ఓబీసీ మంత్రం జపిస్తున్నారు. దేశంలోనే తొలి ఓబీసీ ప్రధాని నరేంద్రమోదీ అని... బీజేపీ హయాంలోనే వెనకబడిన వర్గాలకు మేలు జరిగిందని ప్రచారం చేస్తున్నారు.
బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టిన ప్రత్యర్థి వర్గం..
బీజేపీ ప్రచారాన్ని ప్రత్యర్థి వర్గమైన జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి తిప్పికొట్టింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసమే మోడీ బీసీ కార్డును బీజేపీ తెరపైకి తెస్తోందని విమర్శించింది. గతంలో ప్రధానులుగా పనిచేసిన చౌదరి చరణ్‌సింగ్, దేవెగౌడ వెనకబడిన తరగతులకు చెందినవారేనని గుర్తు చేసింది. సమాజంలో మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టడం కమలనాథులకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేసింది. సామాజిక, ఆర్థిక, కులగణన రిపోర్టును కేంద్రం ఎందుకు బహిర్గతం చేయలేకపోయిందని ప్రశ్నించింది.
మొత్తానికి రెండు వర్గాలూ కుల రాజకీయాలనే టార్గెట్ చేశాయి. మరి వారి పాచికలు పారుతాయా? ప్రజలు ఎవరికి జైకొడతారు? ఎవరిని అందలం ఎక్కిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే... ఇంకొంత కాలం వేచి వుండాల్సిందే.

తుర్కెమెనిస్థాన్ : మధ్య ఆసియా దేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతోంది. తుర్కెమెనిస్థాన్ పర్యటన ముగించుకున్న మోడీ ఆదివారం ఉదయం కిర్గిజిస్థాన్ చేరుకున్నారు. అక్కడ భారత ప్రధానికి ఘన స్వాగతం లభించింది. తర్వాత కిర్గిజిస్థాన్ అధ్యక్షుడితో మోడీ సమావేశమయ్యారు. వాణిజ్యం, పర్యాటకం, మానవ వనరులు సహా ఇతర రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. ఉగ్రవాదంపై సంయుక్తంగా పోరాడాలని, ఏటా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాలని నిర్ణయించారు. తర్వాత ఇరు దేశాలకు చెందిన ఉత్యున్నత స్థాయి బృందం సమావేశమైంది. కీలక అంశాలపై చర్చించింది. కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేశారు. అనంతరం స్థానిక ఆస్పత్రులను మోడీ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి ఆస్పత్రులకు వైద్య పరికరాలు అందజేశారు.

ఢిల్లీ: 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కేసు విచారణ వేగవంతం చేయాలని భారత్‌, పాక్‌ ప్రధానుల నిర్ణయించి రెండు రోజులైనా గడవలేదు. అప్పుడే విచారణకు బ్రేకులు వేసే పని అడ్డదారిలో మొదలైంది. ముంబై పేలుళ్ల కేసు నిందితుడు జకీర్ రెహ్మాన్‌ లఖ్వీ తన వాయిస్ శాంపిల్స్ భారత్‌కు ఇవ్వడని... అతని తరపు న్యాయవాది ప్రకటించారు. అతనిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేరని స్పష్టం చేశారు. గతంలోనే వాయిస్ శాంపిల్స్ ఇచ్చేందుకు లఖ్వీ తిరస్కరించాడని... ఇప్పుడు మరోసారి వ్యతిరేకించినట్లు వెల్లడించారు.

 

ఛత్తీస్‌గఢ్‌: విద్యా బుద్ధులు చెప్పి, పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సింది గురువులు. పైగా వారి నడక, నడత అన్నీ విద్యార్థులను ఇన్‌స్పైర్‌ చేసే అంశాలే. ఇంతగొప్ప గురుతర బాధ్యతల్లో వున్న ఓ ఉపాధ్యాయుడు మద్యం సేవించి తరగతి గదిలో ప్రవేశించాడు. అంతటితో ఆగక పిల్లలకు పాఠాలు బోధించాడు. అవి ఏ.. పాఠాలు అనుకుంటున్నారు... మందు పాఠాలే. డి ఫర్ డాగ్‌, డాల్‌.... పి ఫర్‌ పీకాక్, ప్యారెట్‌ అని అందరూ చెబితే... కానీ ఆ టీచర్ మాత్రం డి ఫర్ దారు... పి ఫర్ పీయో అంటూ తాగుబోతు అర్థాలు బోధించారు. దారు అంటే ఆల్కహాల్, పీయో అంటే డ్రింక్‌ అని అర్థం. ఇదంతా ఛత్తీష్‌గఢ్‌లోని కొరియా జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది.

 

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఢిల్లీ: ఇస్రో వెబ్ సైట్ హ్యాక్ గురైంది. వాణిజ్య విభాగానికి యాంత్రిక్ సైట్ హ్యాక్ అయింది. ఇస్రో.. 2 రోజుల క్రితమే 5 కమర్షియల్ రాకెట్స్ ప్రయోగించింది. ఇస్రో వెబ్ సైట్ ను చైనా ప్రభుత్వం హ్యాక్ చేసినట్లు ఇస్రో అధికారులు అనుమానిస్తున్నారు. హ్యాక్ గురైన వెబ్ సైట్ ను తిరిగి తమ అధీనంలోకి తీసుకరావడానికి ఇస్రో అధికారులు త్రీవ ప్రయత్నాలు చేస్తున్నారు. 

Pages

Don't Miss