National News

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. యువతిపై మేనమామ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జాతకంలో దోషం ఉందంటూ ఓ యువతిపై ఆమె మేనమామ నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతికి వివాహం జరిగాక కూడా నిందితుడు ఈ అఘాయిత్యాన్ని ఆపలేదు. దీంతో విషయాన్ని యువతి తన బంధువులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. 

ఆ దోషం సరి చేసుకోకపోతే తండ్రి చనిపోతాడని చెప్పి నిందితుడు బాధితురాలిని లొంగదీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మేనకోడలు అని కూడా చూడకుండా 23 ఏళ్ల యువతిపై గత నాలుగేళ్లుగా లెక్కలేనన్ని సార్లు అత్యాచారం జరిపాడని వెల్లడించారు. యువతిని ఢిల్లీలోని మహిళా సంరక్షణ గృహానికి తరలించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. నరేలా ప్రాంత పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 

 

ఢిల్లీ : రైతుల ఆందోలనలకు కేంద్రం దిగి వచ్చింది. రైతుల తొమ్మిది డిమాండ్లలో ఏడింటికి కేంద్ర ప్రభుత్వం అంగీకారించింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో.. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో.. రైతు సంఘాలతో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చలు జరిపారు. రైతు సంఘాల నేతలు పెట్టిన 9 డిమాండ్లలో ఏడింటిని అంగీకరిస్తామన్నారు. అయితే.. రుణమాఫీ, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుపై మాత్రం ఏకాభిప్రాయం కుదరనట్లు తెలుస్తోంది.

మెజార్టీ డిమాండ్లను ఆమోదించడానికి సిద్ధపడినందున ఆందోళన విరమించాలంటూ కేంద్రం రైతులను కోరింది. అయితే కీలక డిమాండ్లైన రుణమాఫీ, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను ఆమోదిస్తేనే ఆందోళన విరమిస్తామంటూ రైతు సంఘాల నేతలు తేల్చి చెప్పారు. దీంతో రైతులు నచ్చజెప్పేందుకు.. నేరుగా ఢిల్లీ-యూపీ సరిహద్దులకే కేంద్ర మంత్రులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 

అంతకముందు అన్నదాతలు కదంతొక్కారు. జై జవాన్, జై కిసాన్ నినాదంతో ఢిల్లీ సరిహద్దులు మారు మ్రోగాయి. పోలీసులు వాటర్ కేనన్లు, టియర్ గ్యాస్‌తో అడ్డుకున్నా.. రైతులు వెన్నుచూపలేదు. అంతకంతకు భారమవుతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రైతులు గర్జించారు. రైతన్నలు కదం తొక్కారు. ఢిల్లీ..యూపీ సరిసహద్దుల్లో రోడ్డుపై రైతులు నిరసన తెలుపుతున్నారు. రుణమాఫీ అమలు చేయాలని సెప్టెంబర్ 23న ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నుంచి కిసాన్ ర్యాలీ ప్రారంభం అయింది. ఇవాళ కిసాన్ ర్యాలీ ఢిల్లీ చేరుకుంది. వేలాదిగా రైతులు ఢిల్లీలో కనిపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి వేల మంది రైతులు ఢిల్లీకి వస్తున్నారు. 

ఢిల్లీలో కిసాన్ ర్యాలీకి పోలీసులు అనుమతివ్వడం లేదు. రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు. రైతులపై పోలీసులు భాష్పవాయువులు, జల ఫిరంగులు ప్రయోగిస్తున్నారు. చాలా మంది రైతులు రోడ్లపైనే పడిపోయారు. అయినా వెనక్కి వెళ్లేది లేదని రైతులు రోడ్లపైనే భీష్మించుకుని కూర్చుకున్నారు. హింస చెలరేగింది. ర్యాలీ విజయ్‌ఘాట్ వద్దకు రావాల్సివుంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు అడ్డకుంటున్నారని, దౌర్జన్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. రుణమాపీ అమలు చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆందోళనల కారణంగా మీరట్ ఎక్స్‌ప్రెస్ వే పైకి వెళ్లవద్దని పోలీసులు ద్విచక్రవాహనదారులకు సూచిస్తున్నారు.  దీంతో ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరస్థితులు నెలకొన్నాయి. 

 

కర్ణాటక : ఉగ్రవాదుల అరాచకాలకు పలువురి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వీరి అకృత్యాలకు ఎందరో అమాయకులు కూడా బలైపోతున్నారు. పవిత్ర యుద్ధం పేరుతో వీరు చేసే మారణకాండలకు వేలాది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రామనగర ప్రాంతంలో గత నెలలో సోదాలు జరిపిన ఎన్‌ఐఏ అధికారులు, జేఎంబీ టెర్రరిస్ట్‌ మునీర్‌ ను అరెస్టు చేశారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ బౌద్ధ మత గురువు దలైలామా హత్యకు కుట్ర చేసినట్టు కర్ణాటకలో ఇటీవల పట్టుబడిన ఓ ఉగ్రవాది వెల్లడించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్‌ కు చెందిన మునీర్, తమ దేశంలో పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర చేశాడు. బంగ్లాదేశ్ లో పోలీసులు గాలిస్తుండడంతో ఇండియాలోకి చొరబడిన మునీర్, బట్టల వ్యాపారిగా అవతారం మార్చి కన్నడనాట ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఇతని వ్యవహారాలపై నిఘా వేసిన ఎన్‌ఐఏ అరెస్ట్ చేసి విచారించింది.

దలైలామా తరచుగా మైసూరుకు దగ్గరలో ఉన్న బైలుకుప్పె ప్రాంతంలోని టిబెటన్‌ పునరావాస కేంద్రానికి వస్తుంటారన్న సంగతిని పసిగట్టిన మునీర్, ఆయన వచ్చిన వేళ, హత్య చేయాలని కుట్ర పన్నినట్లు పోలీసులకు తెలిపాడు. ఈ పని చేస్తే, భారత్‌ తో పాటు పలు దేశాల్లో చిచ్చు పెట్టవచ్చన్నది ఆయన వ్యూహం. ఈ సంవత్సరం జనవరి 18న బిహార్‌ లోని బుద్ధగయలో జరిగిన ఓ కార్యక్రమంలో బాంబు పేల్చడం ద్వారా దలైలామా, ఆయనతో పాటు ఇదే కార్యక్రమంలో పాల్గొనే బిహార్‌ గవర్నర్‌ లను హత్య చేయాలని కుట్ర చేసినట్టు కూడా మునీర్ చెప్పినట్టు పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి.

కేరళ : శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలనాత్మక తీర్పు నేపథ్యంలో ఆలయ బోర్డు మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పంపానది వద్ద మహిళల కోసం ప్రత్యేక ఘాట్లు ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక టాయిలెట్లు, బస్సుల్లో మహిళలకు సీట్లలో రిజర్వేషన్ తదితర సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం బోర్టు సన్నాహాలు చేస్తోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పంపానది నుంచి సన్నిధానం వరకు ఉన్న అడవి మార్గంలో లైటింగ్ వ్యవస్థను మెరుగుపరచనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేశన్‌ వెల్లడించారు. మహిళల కోసం ‘మహిళా మిత్ర’ టాయిలెట్లను ఏర్పాటు చేస్తామని, నీలక్కల్-పంప మధ్య నడిచే ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తామని తెలిపారు. రద్దీని నియంత్రించేందుకు మహిళా కానిస్టేబుళ్లను నియమిస్తామని పేర్కొన్నారు. అయితే, మహిళల కోసం ప్రత్యేకంగా క్యూలు ఏర్పాటు చేయడం అసాధ్యమని, కాబట్టి వారు పురుషులతో కలిసే వెళ్లాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
 

 

ఢిల్లీ : ఇకపై రైళ్లలో శాకాహారులు, మాంసాహారులకు వేర్వేరు సీట్లు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందరికీ ఒక దగ్గరే సీట్లు కేటాయించడం వల్ల శాకాహారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాబట్టి ఇద్దరికీ వేర్వేరుగా సీట్లు కేటాయించేలా రైల్వేను ఆదేశించాలంటూ..  అహ్మదాబాద్‌కు చెందిన 67 ఏళ్ల సయీద్..  గుజరాత్ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. శాకాహారులు, మాంసాహారులకు వేర్వేరు సీట్లు కేటాయించడం వల్ల ఒకరి ఆహారపు అలవాట్ల వల్ల మరొకిరికి ఇబ్బంది ఉండదని పిటిషనల్‌లో పేర్కొన్నారు.  టికెట్ రిజర్వేషన్ సమయంలో వారు శాకాహారులా? మాంసాహారులా? అనే విషయం తెలుసుకుని సీట్లు కేటాయించేలా రైల్వే శాఖను ఆదేశించాలని పిటిషనర్ కోరాడు. దీనివల్ల కేటరింగ్ సిబ్బందికి కూడా ఆహార సరఫరా మరింత సులభం అవుతుందన్నారు. అయితే వచ్చే వారం ఈ పిటిషన్ విచారణకు రానుంది.

ఢిల్లీ : శారీరక బలంతో కాదు.. సంకల్ప బలంతోనే శక్తి పుడుతుందన్నగాంధీజీనే అందుకు ఉదాహరణ. స్వరాజ్యం, స్వపరిపాలన గురించి కలలుగన్న మహనీయుడు. విశ్వమానవునిగా ఎనలేని కీర్తి పొందిన గాంధీమహాత్ముని 150వ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను భావితరాలకు అందిస్తూ.. మనసా వాచా స్మరించుకుందాం..
నేడు గాంధీ మహాత్ముడి 150వ జయంతి.   ప్రేమ, త్యాగం, సేవను  నిత్యం ఆచరించి చూపిన ఆదర్శ వంతుడు మన బాపూజీ.  ఏడు దశాబ్దాల తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా  ఆయన బాటే   ఏకైక మార్గంగా నిలిచిందంటే ఆయన గొప్పతనమేంటో తెలుస్తోంది.    స్వేచ్ఛా, స్వాతంత్రాలకోసం అహింసాయుతంగా పోరాడిన ఆదర్శమూర్తి.  తెల్లదొరల నుంచి భారతమాతను విముక్తం చేసిన సాహసి. అహింసా అనే ఆయుధంతో యావత్‌ భారతీయులను ఏకంచేసిన మహానేత. జనాందోళనలతో బ్రిటీష్‌వారిని ఎదురించి చివరికి స్వాతంత్యాన్ని సాధించిన గొప్ప స్వాప్నికుడు. అందుకే ఆయన దేశపిత అయ్యాడు. భారతదేశ ప్రజల మదిలో ఎప్పటికీ  చెదిరిపోని సంతకం అయ్యారు.  
స్వాతంత్ర్యోద్యమ కాలంలో గాంధీజీ ఏనాడు తాను నమ్మిన సిద్దాంతాన్ని ఏనాడూ వదిలిపెట్టలేదు. హింసామార్గంలో ఎప్పుడూ వెళ్లలేదు. ఎప్పుడూ అహింసా మార్గంలోనే తన ఉద్యమాన్ని నడిపించాడు. ఆ అహింసా అనే ఆయుధంతోనే స్వాతంత్ర్యాన్ని సాధించాడు. అహింసా, సేవ ఆయుధాలుగా బాసిల్లిన మహాత్ముడు.. విశ్వమానవుడై చిరంజీవిగా నిలిచిపోయారు. 
 
బాపూజీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాజ్‌కోట్‌లో  ప్రధాని మోదీ మ్యూజియంను ప్రారంభించారు. స్థానిక ఆల్ఫ్రెడ్ హై స్కూల్‌లో  నిర్మించిన మ్యూజియంలోని మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ప్రధాని. 1887లో మహాత్మాగాంధీ ఇక్కడే మెట్రిక్యులేషన్ చదివారు. మినిట్స్ బుక్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు.నోట్లు వెదజల్లి కోట్లు దండుకోవాలని చూస్తున్న నేటి తరం నేతలకు.. కుర్చీపట్టుకుని వేలాడకండి అన్న గాధీజీ మాట చెవికెక్కుతుందా.. ప్రతి ఒక్కరూ సేవాతత్పరతతో మెలగాలన్న ఆయన సూచనలు పాటించేవారు  నేడు దేశంలో కరువవుతున్నారు. దండలు, దండాలు పక్కనబెట్టి ఆయన అడుగుల్లో అడుగేయడమే అయనకు మనం అర్పించే అసలైన నివాళి.

 

ముంబై : క్యాస్టింగ్ కౌచ్ వివాదం సినిమా పరిశ్రను కుదిపివేస్తోంది. టాలీవుడ్ లో శ్రీరెడ్డితో మరోసారి మొదలైన ఈ రచ్చ బాలివుడ్ లో కూడా గత కొన్ని రోజుల నుండి వివాదాస్పదమవుతోంది. దాదాపు అన్ని భాషాల్లోని సినిమా పరిశ్రమపై ఈ అంశం సంచలనంగా మారుతోంది. ఈ నేపథ్యంలో  బాలీవుడ్ లో హీరోయిన్ తనుశ్రీ దత్తా క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తనను సీనియర్ నటుడు నానా పటేకర్ లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. అలాగే  కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య కూడా తనను లైంగికంగా వేధించాడని ఆమె తెలిపింది.  దీంతో ఈ వివాదంపై సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా తనుశ్రీ దత్తాకు మద్దతుగా నిలిచారు. అయితే ఈ వివాదంపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించేందుకు నిరాకరించారు. ఈ వివాదంపై మాట్లాడటానికి తాను తను శ్రీ దత్తాను కానీ, నానా పటేకర్ ను కానీ కాదని స్పష్టం చేశారు. దీంతో అమితాబ్ వ్యాఖ్యలపై తనుశ్రీ దత్తా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మాయిల సమస్యల గురించి స్పందించని అమితాబ్ లాంటి వ్యక్తులు సామాజిక కథాంశాల ఆధారంగా ‘పింక్’ వంటి సినిమాలు తీస్తున్నారని విమర్శించింది. ఇలాంటి వ్యక్తులు నిజజీవితంలో కళ్ల ఎదుట జరిగే దారుణాన్ని ప్రశ్నించరనీ, కళ్లు మూసుకుంటారని..ఇటువంటివారు సినిమాల్లో హీరోలు..నిజ జీవితంలో జీరోలు అని వ్యాఖ్యానించింది. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై తాను చివరివరకూ పోరాడుతానని స్పష్టం చేసింది. 
మహారాష్ట్ర, ముంబై, బాలివుడ్, క్యాస్టింగ్ కౌచ్, తనుశ్రీదత్తా, నానా పటేకర్, అమితాబచ్చన్,టాలీవుడ్, శ్రీరెడ్డి, Maharashtra, Mumbai, Bollywood, Casting Cowch, Tanushree Datta, Nana Patekar, Amitabhachan,Tollywood, Sri Reddy

 

కర్ణాటక : మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రజలకు ఓ మంచి సందేశాన్నిచ్చారు. సిగిరెట్లు తాగవద్దని..వాటితో క్యాన్సర్ వస్తుందని..దయచేసి సిగిరెట్లు తాగి క్యాన్సర్ బారిన పడవద్దని పిలుపునిచ్చారు. మైసూరులో క్యాన్సర్ పరీక్షాశిబిరం ప్రారంభం సందర్భంగా మాట్లాడుతూ, ఒకప్పుడు తాను రోజుకు 40 సిగరెట్లు కాల్చేవాడినని తెలిపారు. ఒకసారి తన మిత్రులు విదేశీ సిగరెట్ల పెట్టెను తీసుకొస్తే... అదే రోజు చాలా ఉత్సాహంగా సిగరెట్లన్నింటినీ ఊదేశానని... ఆ తర్వాత తనలో ఒక అపరాధభావం మొదలైందని, సిగరెట్లను మానేశానని చెప్పారు. ఇప్పుడు ఎవరి వద్ద నుంచైనా సిగరెట్ వాసన వస్తే భరించలేనని తెలిపారు. 31 ఏళ్ల నుంచి సిగరెట్లకు దూరంగా ఉన్నానని చెప్పారు. సిగరెట్ పెట్టెలపై బొమ్మలతో సహా హెచ్చరికలు ఉన్నప్పటికీ... జనాలు వాటిని వదల్లేకపోతుండటం బాధను కలిగిస్తోందని సిద్ధరామయ్య చెప్పారు. ధూమపానం వల్ల క్యాన్సర్ వస్తుందని... అందువల్ల క్యాన్సర్ బారిన పడకముందే దాన్ని వదిలేయాలని సూచించారు.

పాకిస్థాన్ : పాకిస్థాన్ లో వున్న పలు సమస్యలకు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి చిటికెలో పరిష్కారాన్ని చెప్పేశారు. పేదిరకం,ఉగ్రవాదం, సైస్యం పెత్తనం వంటి సమస్యలు పోవాలంటే పాకిస్థాన్ ను నాలుగు ముక్కలు చేయడమే ఆ దేశానికి పరిష్కారమన్నారు. ‘‘పాకిస్తాన్‌కు ఒకే ఒక్క మార్గం ఉంది. బలోచ్‌లు పాకిస్తాన్‌తో కలిసి ఉండేందుకు ఇష్టపడడం లేదు. సింధీలు, పస్తూన్లది కూడా అదే దారి. కాబట్టి పాకిస్తాన్‌ను బలోచ్, సింద్, పస్తూన్ మూడింటితో పాటు అవశేష పశ్చిమ పంజాబ్‌గా విడగొట్టాలి....’’ అని స్వామి పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ గురించి మాట్లాడుతూ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సమయం వృధా చేసుకోవద్దనీ.. భారత్ తిట్టినప్పుడల్లా పాకిస్తాన్ వెర్రి ఆనందం పొందుతుందన్నారు. ‘‘పాకిస్తాన్‌ను పక్కనపడేసి మన సైన్యాన్ని సన్నద్ధం చేసుకోవాలి. అదనుచూసి ఒకరోజు దాన్ని నాలుగు ముక్కలుచేస్తే సరి...’’ అని స్వామి వ్యాఖ్యానించారు. కాగా పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదం, మానవ హక్కుల ఉల్లంఘపై ఇటీవల సుష్మా స్వరాజ్‌ ఐరాసలో లేవనెత్తిన నేపథ్యంలోనే స్వామి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

ఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మరోసారి తన నోటికి పని పెట్టారు. ఎప్పుడు వివాదాస్ప వ్యాఖ్యలు చేస్తు వార్తల్లో నిలిచే సుబ్రహ్మణ్యస్వామి ఈసారి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై పడ్డారు. ఇమ్రాన్‌ఖాన్‌పై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘‘ఇమ్రాన్ ఖాన్ ఓ ‘చప్రాసీ’ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్‌లో అక్కడి సైన్యం, ఐఎస్ఐ, తీవ్రవాదులే పరిపాలన సాగిస్తున్నారు. అక్కడి ప్రభుత్వంలో ఇమ్రాన్ ఖాన్ ఓ నౌకరు మాత్రమే. ఆయనను పేరుకు ప్రధాని అని పిలుస్తున్నారు.. వాస్తవానికి ఆయన ఓ ‘చప్రాసీ’...’’ అని సుబ్రమణ్యస్వామి వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. 

 

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ హత్యకు మావోయిస్టులు ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాలు పేర్కొనటంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనిపై విరసం సభ్యుడు వరవరరావు, హక్కుల కార్యకర్తలు సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్మన్ గంజాల్వెజ్, గౌతమ్ నవలఖాలను మహారాష్ట్ర పోలీసులు ఆగస్టు 28న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఐదుగురు హక్కుల కార్యకర్తలను సుప్రీంకోర్టు 4 వారాల పాటు హౌస్ అరెస్ట్ లో ఉంచింది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు వీరి అరెస్టులపై స్పందించారు.
ప్రధాని మోదీ హత్యకు తాము పౌర హక్కుల నేతలతో కలసి కుట్ర పన్నలేదని మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ కి చెందిన అభయ్ లేఖ విడుదల చేశారు. హక్కుల నేత రోనా విల్సన్ దగ్గర దొరికినట్లు పోలీసులు చెబుతున్న లేఖలు బూటకమని విమర్శించారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. పౌర హక్కుల నేతలపై జరుగుతున్న అణచివేతలపై ప్రజాస్వామ్య వాదులు స్పందించాలని కోరారు. ప్రధానిని హత్య చేయాలని తాము ఎవరికీ లేఖ రాయలేదనీ, అలాంటి అవసరం తమకు లేదని అభయ్ స్పష్టం చేశారు.
పుణెలో జరిగిన ఎల్గర్ పరిషత్ సమావేశం అనంతరం దళితులకు-అగ్రవర్ణాలకు మధ్య భీమా-కోరేగావ్ ప్రాంతంలో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీనికి సంబంధించి కేసు నమోదుచేసిన పోలీసులు హక్కుల కార్యకర్త రోనా విల్సన్ ఇంటిలో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ తరహాలో ప్రధాని మోదీని మట్టుబెట్టేందుకు మావోలు ప్లాన్ వేశారనీ, ఇందుకోసం ఆయుధాల కొనుగోలుకు వరవరరావు సాయం చేస్తాడని లేఖలో ఉన్నట్లు..దానికి సంబంధించిన లేఖ లు తమకు లభించినట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐదుగురు హక్కుల కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది.

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయి ఎవరి పాలన వారు చేసుకుంటున్నారు. కాగా ఇరు రాష్ట్రాలకు ఉమ్మడిగా వున్న హైకోర్టును త్వరంగా విభజించాలని తెలంగాణ రాష్ట్రం కేంద్రం న్యాయశాఖను త్వరపెడుతుందో. మరోవైపు హైకోర్టుకు సంబంధించిన భవనాల నిర్మాణం ఇంకా పూర్తికాలేదనేది ఏపీ వాదన. దీనిపై త్వరగా నిర్మాణం పూర్తి చేసి హైకోర్టను ఏపీకి తీసుకెళ్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే గత మూడేళ్లనుండి ఈవిషయంపై ఓ కొలిక్కి రాలేదు. 
ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.  ఎప్పుడు సిద్ధమవుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు సిద్ధమవుతుందని సుప్రీంకోర్టుకు ఏపీ తరపు న్యాయవాది నారీమన్ తెలిపారు. ఏపీ మూడేళ్లుగా ఇదే మాట చెబుతున్నారని కేంద్ర, తెలంగాణ తరపు లాయర్లు కోర్టుకు విన్నవించారు. హైకోర్టు భవనం ఎప్పటిలోగా సిద్ధమవుతుందో అఫిడవిట్ రూపంలో రెండు వారాల్లో కోర్టుకు అందజేయాలని జస్టిస్ ఏకే సిక్రీ ధర్మాసనం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
 

 

ఢిల్లీ : దేశంలో రిజర్వేషన్స్ అంశంపై సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. అర్హత, ప్రతిభను బట్టే రిజర్వేషన్స్ వుండాలని కొందరు వాదిస్తుంటే..వెనుకబడిన వర్గాలను అభివృద్ది కోసం రిజర్వేషన్స్ కొనసాగించాలని మరికొందరి వాదన. ఈ నేపథ్యంలో రిజర్వేషన్స్ పై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  దళితులు, ఇతర వెనుకపడిన వర్గాలకు అందజేస్తున్న రిజర్వేషన్లపై జార్ఖండ్ లో జరిగిన ‘లోక్ మానథాన్’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్న నేపథ్యంలో సామాజిక సామరస్యం సాధించేందుకు వీలుగానే అంబేడ్కర్ రిజర్వేషన్లు తీసుకొచ్చారని తెలిపారు. కానీ రిజర్వేషన్ల కారణంగా ఆయా రంగాల్లో తీవ్రమైన శూన్యత ఏర్పడిందని వ్యాఖ్యానించారు. తొలుత పదేళ్లకు మాత్రమే అనుకున్న రిజర్వేషన్లను పెంచుకుంటూ పోవడం వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం లభించలేదని అభిప్రాయపడ్డారు. సామాజిక ప్రగతి సాధించాలంటే రిజర్వేషన్లు అవసరం లేదనీ..ఆలోచనలను, చేతలను మార్చుకోవాలని మహాజన్ తెలిపారు. అలా చేసినప్పుడే అంబేడ్కర్ కన్న కలలు సాకారం అవుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

ఢిల్లీ : పీఎన్‌బీకి వేల కోట్లు ఎగనామం పెట్టిన నీరవ్ మోడీ ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నారు. నాలుగు నెలలు కిందటే అతని పాస్‌పోర్టును భారత ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. వేల కోట్ల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టు పరారీలో ఉన్న వజ్రాల వర్తకుడు నీరవ్‌  మోడీ ఆస్తులను ఈడీ జప్తు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రూ. 637 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ ఆస్తులు భారతేదశంతో పాటు ఇతర దేశాల్లో కూడా ఉన్నాయని తెలుస్తోంది. జప్తు చేసుకున్న ఆస్తుల్లో నగలు, ప్లాట్లు, బ్యాంకుల్లో నగదున్నట్లు సమాచారం. మనీ లాండరింగ్‌ చట్టం కింద ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి ఈ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం బ్యాంకులకు రూ. 12,600 కోట్లను నీరవ్‌ మోడీ ఎగ్గొట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మీరట్: ఉత్తరప్రదేశ్‌లో ముస్లీం యువకుడిని ప్రేమించిందని హిందూ యువతిని ఒక ముస్లీంను ప్రేమిస్తావా అంటూ.. పోలీసుల వ్యాన్‌లో చెంపలు పగులకొట్టిన మహిళా కానిస్టేబుల్ ఇతర పోలీసుల వీడియో గతవారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఆ పోలీసులకు కఠినంగా శిక్షిస్తారని అందరూ ఊహించారు.   అదే బిల్డప్ యూపీ పోలీసు బాసులు ఇచ్చారు. సీన్ మారితే.. సదరు పోలీసు అధికారులకు వీఐపీ శిక్ష అమలు చేసి తమ ముద్రను చాటుకుందీ యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ సర్కర్.

ఆ మహిళా పోలీసును మరొ ఇద్దరు అధికారులను గోరఖ్‌పూర్‌కు బదిలీ చేసి చేతులు దులుపుకుంది ప్రభుత్వం.  గోరఖ్‌పూర్.. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ స్వంత నియోజకవర్గం కావడం కొసమెరుపు.  ఇది పనిష్‌మెంట్ ట్రాన్స్‌ఫరా లేదా వీఐపీ ట్రీట్‌మెంటా అనే సందిగ్ధాన్ని అక్కడి ప్రజలకు మిగిల్చింది సర్కార్.  

దాదాపు 18 మంది వీహెచ్‌పీ కార్యకర్తలు ఒక ముస్లీం యువకుడిని దారుణంగా చితకబాదుతున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. అందులో ఒక్కరినీ యూపీ పోలీసులు  అరెస్టుచేయలేదు. మెడికల్ కాలేజీ స్టూడెంట్లు అయిన ఓ జంటను కొందరు దాడిచేసి గాయపర్చారు. ఆ వీడియోలు బయటకు రావడంతో నిందితులను కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర స్థాయి పోలీసు అధికారులు ప్రకటించారు.  ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు వారిపై కేసును మాత్రం నమోదు చేయలేదు. అలాగే బాధితురాలిని వ్యాన్‌లో కొట్టిన సంఘటనలో ఆ ముగ్గురు పోలీసులపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఈ సంఘటనపై ఆదిత్యనాథ్ సర్కార్‌పై  రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

ముంబై : పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ రికార్డులు సృష్టిస్తున్నాయి. వరుసగా ధరలు పెరగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం లీటర్ పెట్రోల్ 24 పైసలు, డీజిల్ లీటర్‌కు 30 పైసలు పెరగడంతో సామాన్యుడు లబోదిబోమంటున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 83.73, లీటర్ డీజిల్ రూ. 75.09 ధరగా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 91.08, లీటర్ డీజిల్ రూ. 79.72 ధరగా ఉంది. 
అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా పెట్రోలియం ఉత్పత్తుల రేట్లలో మార్పులు చేస్తున్న కేంద్రం ప్రభుత్వ విధానం వల్ల వరుసగా పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇటీవల కాలంలో గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ మేరకు త్వరలో లీటరు డీజిల్‌ ధర 100కు చేరుకుంటుదనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అధిక చమురు ధరలు ప్రజల ఆదాయానికి గండికొడుతున్నాయి. వినియోగదారులకు అదనపు భారం పడుతోంది.   

న్యూఢిల్లీ : వంట గ్యాస్ ధర పెరిగింది. ఇప్పటికే పెట్రోల్, డీజీల్ ధరలతో ఇబ్బందులు పడుతున్నసామాన్యులకు మరోసారి షాక్ తగిలింది. సబ్సిడీ గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు మరోమారు షాకిచ్చాయి. సబ్సిడీ, సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) ఆదివారం ప్రకటించింది. ధరలు పెరిగాయన్న విషయం తెలుసుకున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్  ధరలు పెరగడంతో వాటిపై ఆధారపడిన ధరలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం గ్యాస్ ధర కూడా పెంచడంతో సామాన్యుడికి ఏమి చేయాలో పాలు పోవడం లేదు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో గ్యాస్ ధరలు పెంచక తప్పడం లేదని ఐఓసీఎల్ పేర్కొంది. సబ్సిడీ సిలిండర్‌పై రూ. 2.89, సబ్సిడీయేతర సిలిండర్‌పై రూ. 59.00 పెంచుతున్నట్టు తెలిపింది. వినియోగదారులకు చెల్లిస్తున్న నగదు బదిలీ మొత్తాన్ని రూ.320.49 నుంచి రూ.376కు పెంచినట్టు ఐఓసీఎల్ పేర్కొంది.

ఢిల్లీ : భారతదేశ శాంతికి విఘాతం కలిగించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే... వారికి సైనికులు ధీటైన సమాధానం చెబుతారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పాకిస్థాన్ పేరును నేరుగా ప్రస్తావించకుండా వార్నింగ్ ఇచ్చారు. శాంతిని బలంగా నమ్మే దేశం ఇండియా అన్న ఆయన దేశ సార్వభౌమాధికారం, ఆత్మగౌరవం విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ప్రధాని స్పష్టం చేశారు. మన్ కీ బాత్  రేడియో షో 48వ ఎడిషన్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ మాట్లాడారు. శాంతికి మనం కట్టుబడి ఉన్నామని.... అదే విధానంతో ముందుకు వెళ్తామన్నారు. భారత ఆర్మీ ప్రత్యేక బలగాలు జరిపిన సర్జికల్ దాడులను ప్రధాని గుర్తుచేస్తూ, మన సైనికులు 2016లో ఉగ్రవాదానికి గట్టి గుణపాఠం చెప్పారన్నారు. 

ఢిల్లీ : పెట్రోల్, డీజిల్‌ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి. పెట్రో ధరలు సామాన్యుడికి పెనుభారంగా మారుతున్నాయి. నిత్యావసర ధరలు ఒక్కొక్కటిగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా పెట్రోలియం ఉత్పత్తుల రేట్లలో మార్పులు చేస్తున్న కేంద్రం ప్రభుత్వ విధానం వల్ల వరుసగా పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇటీవల కాలంలో గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ మేరకు త్వరలో లీటరు డీజిల్‌ ధర 100కు చేరుకుంటుదనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అధిక చమురు ధరలు ప్రజల ఆదాయానికి గండికొడుతున్నాయి. వినియోగదారులకు అదనపు భారం పడుతోంది.   పెట్రోల్‌, డీజిల్ ధరల పెరుగుదల వల్ల పేద కుటుంబాలపై  అధిక ప్రభావం చూపిస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. సొంత వాహనంపై ప్రయాణం భారంగా మారుతోంది. పెట్రో ధరల పెరుగుదలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాలతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఆందోళనలో పాల్గొంటున్నారు. పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాదారులకు బ్యాడ్‌ న్యూస్‌. ఎస్‌బీఐ డెబిట్‌ కార్డ్‌ ద్వారా ఏటీఎం నుంచి రోజుకు 20వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునేలా కొత్త నిబంధన వచ్చింది. ఐతే ఈ నిబంధన అక్టోబర్‌ 31 నుంచి అమలవుతుందని ఐస్‌బీఐ అధికారులు తెలిపారు. ఐతే క్లాసిక్‌, మ్యాస్ట్రో డెబిట్‌ కార్డులు వినియోగిస్తున్నబ్యాంక్‌ ఖాతాదారులకే ఇదే వర్తించనుంది. ప్రస్తుతం ఎస్‌బీఐ డెబిట్‌ కార్డ్‌ ద్వారా ఏటీఎం నుంచి రోజుకు 40వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏటీఎంల వద్ద నగదు ఉపసంహరణలో మోసాలు జరుగుతున్నాయని అధికంగా ఫిర్యాదులు వచ్చినందునే ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 

తమిళనాడు : కోడి పందాన్ని ఓ కుక్క అడ్డుకునే ప్రయత్నం చేసింది. అవును రెండు కోళ్లు పరస్పరం పోరాడుతుంటే వాటిని ఆపేందుకు ఓ కుక్క ప్రయత్నిస్తున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా  మారింది. ఆ రెండు కోళ్లను విడదీసేందుకు అది ఎంతగానో ప్రయత్నించింది. అయితే ఆ కోళ్లు ఈ కుక్కను ఏమాత్రం పట్టించుకోకుండా పోరాడుతూనే ఉన్నాయి. అయినా వెనక్కి తగ్గకుండా ఆ కుక్క ఆ కోళ్ల పోరాటాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తూనేవుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియోలో హల్‌చల్ చేస్తోంది. ఈ ఘటన  తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిందని తెలుస్తోంది. 

ఢిల్లీ : బస్ రావాలి..బైటకు పోవాలి అనేది పాతసంగతి. చేతిలో స్మార్ట్ ఫోన్ వుంటే హలో అంటే పొలో అని వచ్చేస్తున్నాయి క్యాబ్ లు. ఒక్క క్లిక్ తో ఇంటిముందు వాలిపోతున్నాయి. ప్రయాణీకులకు చక్కటి ప్రయాణ సాధనంగా క్యాబ్ లు మారిపోయాయి. ఈ సౌకర్యం బాగానే వున్నా..కొంతమంది డ్రైవర్లు ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భాలు లేకపోలేదు. ఒక్కసారి బుక్ చేసుకున్నాక ఆ క్యాబ్ డ్రైవర్ రాలేనంటే ఇకపై కుదరదు. 
క్యాబ్‌ సర్వీసులు. దిల్లీ, బెంగళూరు, ముంబయి వంటి నగరాల్లో అయితే.. చాలా మంది వరకు వీటి మీదే ఆధారపడతారు. గత కొన్నేళ్లుగా ఓలా, ఉబెర్‌ వంటి సంస్థలు ప్రజలకు క్యాబ్‌ సేవలను అందిస్తున్నాయి. మనం ఏదైనా ప్రాంతానికి వెళ్లేందుకు క్యాబ్‌ బుక్‌ చేసుకున్న తర్వాత కొంతమంది డ్రైవర్లు ఆ ప్రదేశానికి రాలేమంటూ రైడ్‌ను రద్దు చేసుకుంటారు. ఇక మీదట అలా ఎవరైన డ్రైవర్‌ రైడ్‌ను రద్దు చేస్తే రూ.25వేల వరకు జరిమానా ఎదుర్కొవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఓ ప్రతిపాదనను దిల్లీ ప్రభుత్వం త్వరలోనే తీసుకురానుంది.
క్యాబ్‌ సేవల ధరలు పెరుగుదలను నియంత్రించడంతో పాటు, వాటిల్లో ప్రయాణించే ప్రయాణికుల భద్రతకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయాల్సిందిగా కోరుతూ దిల్లీ రోడ్డు రవాణా శాఖ సరికొత్త డ్రాఫ్ట్‌ను రూపొందించింది. క్యాబ్‌ డ్రైవర్లు ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై పోలీస్‌ కేసు పెట్టాలని ఆ డ్రాఫ్ట్‌లో పేర్కొన్నారు. ఒకవేళ కేసు పెట్టకుండా ఉన్నట్లయితే సదరు డ్రైవర్ లక్ష రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ముసాయిదాను దిల్లీ పీడబ్ల్యూడీ మంత్రి సత్యేంద్ర జైన్‌ త్వరలోనే కేబినెట్‌ ముందు పెట్టనున్నారు. 

 

మహారాష్ట్ర : ప్రముఖ ‘లంకేశ్’ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేశ్ హత్య దారుణ హత్యకు గురైన సంఘటన యావత్ దేశాన్ని కుదిపివేసింది. ఈ కేసులో నిందుతులను సిట్ విచారణకు అప్పంగించిన విషయం తెలిసిందే. ఈ విచారణలో నిందితులు పరశురామ్ వాగ్మేర్, మనోహర్ లు ప్రత్యేక దర్యాప్తు బృందంపై  సంచలన ఆరోపణలు చేశారు.  ఈ హత్యలో నిందితుడు పరశురామ్ మాట్లాడుతూ, ఈ కేసు విచారణ నిమిత్తం సిట్ ఏర్పాటు చేసినప్పుడు సంబంధిత అధికారులు నేరుగా తన వద్దకే వచ్చారని, ఈ నేరం ఒప్పుకోవాలని తనపై ఒత్తిడి చేశారని ఆరోపించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు తమకు బెదిరింపులు మొదలయ్యాయని, తనకు రూ.25 లక్షలు ఇచ్చి నేరం ఒప్పుకోమని సిట్ అధికారులు చెప్పారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 మరో నిందితుడు మనోహర్ మాట్లాడుతూ, గౌరీ లంకేశ్ హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అయినప్పటికీ, తనను, తన కుటుంబాన్ని బెదిరించి తనతో ఈ నేరం ఒప్పించారని ఆరోపించారు. కాగా, గత ఏడాది సెప్టెంబర్ 5న గౌరీ లంకేశ్ హత్యకు గురయ్యారు. ఈ కేసు విచారణ నిమిత్తం ప్రత్యేక దర్యాప్తు బృందం ను కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి 14 మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

 

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలో వాణిజ్య రాజధాని ఇండోర్. ఇప్పుడు ఈ పేరు వణుకు పుట్టిస్తోంది. దాదాపు 40 నుంచి 50 లక్షల మంది ప్రాణాలను హరించగల అత్యంత విషపూరిత రసాయనాలను ఇండోర్ లో పోలీసులు, డీఆర్డీఓ సైంటిస్టులు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్తంగా జరిపిన దాడిలో పట్టుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. దాదాపు వారం రోజుల పాటు ఆపరేషన్ జరిపిన అధికారులు 9 కిలోల సింథటిక్ ఓపియాయిడ్, ఫెంటానిల్ ను సీజ్ చేశారు. ఇండియాలో ఫెంటానిల్ పట్టుబడటం ఇదే తొలిసారని తెలుస్తోంది.
ఇండోర్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ వ్యాపారి, అమెరికాపై కక్షను పెంచుకుని, ఈ రసాయనాలను తయారు చేసినట్టు తెలుస్తోంది. రసాయన యుద్ధంలో దీన్ని వినియోగిస్తే, కోట్లాది మంది అనారోగ్యం బారినపడివుండేవారని, ఈ కేసులో ఓ మెక్సికన్ జాతీయుడిని కూడా అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు.కాగా, హెరాయిన్ తో పోలిస్తే 50 రెట్ల అధిక విషపూరితమైన ఫెంటానిల్ ను వాసన చూసినా కూడా ప్రభావం చాలా దారుణంగా ఉంటుందని డీఆర్ఐ డైరెక్టర్ జనరల్ డీపీ దాస్ వెల్లడించారు. ఎంతో నైపుణ్యవంతులైతేనే దీన్ని తయారు చేయగలుగుతారని, దీన్ని తయారు చేసిన వ్యాపారి కెమిస్ట్రీలో పీహెచ్డీ కూడా చేస్తున్నాడని తెలిపారు. 

ఉత్తర్ ప్రదేశ్ : తన భర్త మరణానికి రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సమాధానం చెప్పాలని తివారీ భార్య కల్పన డిమాండ్‌ చేశారు. తన భర్త ఉగ్రవాదా? అని ప్రశ్నించారు. తనకు రూ.కోటి పరిహారం, పోలీసు శాఖలో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీఎంకు ఆమె లేఖ రాశారు. తివారీ, కల్పన దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తివారీ మృతికి బాధ్యులైన ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు. వారిని సర్వీసు నుంచి తొలగించనున్నట్లు రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్‌ తెలిపారు. ఆత్మ రక్షణ పరిమితులను దాటి వారు అతిగా వ్యవహరించినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైందని అన్నారు. ఎవరినీ కాల్చేందుకు పోలీసులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ యువకుడిని పోలీస్ కానిస్టేబుల్ కాల్చిచంపిన ఘటన సంచలనం రేపుతోంది. తనిఖీల సమయంలో కారు ఆపలేదన్న కారణంతో నిండు ప్రాణాలు బలి తీసుకోవడం లక్నోలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరు, రాష్ట్రంలో పెరిగిన ఎన్‌కౌంటర్ల సంస్కృతి పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. లక్నోలోని విలాసవంతమైన గోమతీనగర్‌ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ప్రశాంత్‌ చౌధరి అనే కానిస్టేబుల్‌ జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వివేక్ తివారీ యాపిల్ కంపెనీ ఉద్యోగి. తివారీ విధులు ముగించుకొని వస్తున్న సమయంలో గస్తీ కాస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఆయన వాహనాన్ని ఆపమని కోరారు. కానీ ఆప కుండా ముందుకు పోవడంతో కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. ఈఘటనలో తివారీ అక్కడే మృతి చెందాడు. ఈసమయంలో కారులో మరో మహిళ కూడా ఉన్నారు.

జమ్మూ కాశ్మీర్ : మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీసులను టార్గెట్ చేస్తున్నారు. గ్రనైడ్లు, తుపాకులతో దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం షోపియాన్ పీఎస్‌పై దాడికి పాల్పడ్డారు.  ఒక్కసారిగా గుంపులుగా వచ్చిన ఉగ్రవాదులు పీఎస్‌పై గ్రనైడ్లు విసురుతూ..తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. కొద్దిసేపటి అనంతరం పోలీసులు తేరుకుని ప్రతిగా కాల్పులు జరిపారు. కానీ ఓ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే అతను మృతి చెందాడు. అనంతరం అడవుల్లోకి పరారయ్యారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు పీఎస్‌కు చేరుకుని పరిస్థితిని ఆరా తీశారు. అడవుల్లో నక్కిన ఉగ్రవాదుల కోసం గాలింపులు చేపడుతున్నారు. షోపియాన్ జిల్లాలో పట్టు సాధించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులే టార్గెట్ చేస్తున్నారు. నెల రోజుల క్రితం నలుగురిని పోలీసులును ఉగ్రవాదులు మట్టబెట్టారు. దాడులు చేసిన అనంతరం పోలీసుల ఆయుధాలను ఎత్తుకెళుతున్నారు. 

Pages

Don't Miss