Yadadri

06:48 - May 25, 2018

హైదరాబాద్ : సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులతో అమాయకులపై దాడులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో దొంగగా భావించి ముగ్గురిని చితకబాదారు గ్రామస్థులు. అటు గుంటూరు జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని మహిళపై యువకుల దాడి చేశారు. పిల్లలను అపహరించే ముఠాగా భావించి దాడికి పాల్పడ్డారు. మరోవైపు చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని అమాయకులపై దాడులకు దిగితే చర్యలు తప్పవని ఇరు రాష్ట్రాల పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంతో ప్రజలు ఇంకా భయభ్రాంతులకు గురవుతూనే ఉన్నారు. పోలీసులు భరోసా ఇచ్చినా ఇంకా రాత్రిళ్లు జాగారం చేస్తూ.. అనుమానం వచ్చిన వ్యక్తులపై దాడులకు దిగుతున్నారు. అయితే ఈ దాడులల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లోని తట్టి కోర్టు ఏరియాలో బాలరాజు అనే మూగ వ్యక్తిపై గ్రామస్థులు దాడి చేశారు. దొంగగా భావించి స్తంభానికి కట్టేసి చితకబాదారు. దీంతో బాలరాజు పరిస్థితి విషమంగా మారింది. ఎడపల్లి మండలం బాపు నగర్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దొంగలుగా భావించి ఇద్దరు వ్యక్తులను కాలనీ వాసులు చితకబాదారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జియపల్లిలో బాలకృష్ణ అనే వ్యక్తిపై గ్రామస్థులు దాడి చేసి చంపారు. ఘట్కేసర్‌ మండలం కొర్రెములకు చెందిన బాలకృష్ణ జియపల్లిలోని బంధువుల ఇంటికి వెళుతుండగా దొంగ అనే నెపంతో అతనిపై దాడి చేశారు. దీంతో బాలకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. దాడికి పాల్పడిన ఎనిమిది మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇలాంటి ఘటనలు అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని మహిళపై యువకుల దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీన్స్‌ ప్యాంట్‌ ధరించి ఉన్న మహిళను... పిల్లలను అపహరించే ముఠాగా భావించి యువకులు దాడికి దిగారు. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించటంతో వైద్యులు గుంటూరు ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితురాలికి మతిస్థిమితం సరిగా లేనట్టు వైద్యులు వెల్లడించారు. మరోవైపు ఇలాంటి సంఘటనలు జరగడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజల్లో అవగాహన కల్పించి.. దాడుల జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఘటనలపై పోలీస్‌శాఖ స్పందించింది. ఎలాంటి గ్యాంగ్‌లు రాష్ట్రంలోకి రాలేదని, అనవసరంగా అమాయకులపై దాడులకు పాల్పడితే తీవ్రమైన చర్యలు ఉంటాయని ఇరు రాష్ట్రాల పోలీసులు హెచ్చరించారు. అయితే అధికారులు, పోలీసులు ఎంత ప్రచారం కల్పించినా ప్రజల్లో మాత్రం భయం పోవట్లేదు. 

08:52 - May 24, 2018

హైదరాబాద్ : సోషల్‌ మీడియాలోని వదంతులు.. అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఊరి శివార్లలోకి వచ్చే వారిని ఎవరూ... ఏంటి అని కనీసం విచారించకుండానే కర్రలతో చితకబాదేస్తున్నారు. తెలంగాణలో... గడచిన 24 గంటల వ్యవధిలోనే ఇద్దరిని ఇలాగే కొట్టి చంపేశారు. సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలన్నీ వదంతులే అని పోలీసులు ఎంతగా చెబుతున్నా.. ప్రజలు పట్టించుకోవడం లేదు. యాదాద్రి జిల్లా బీబీనగర్‌ మండలం జియాపల్లి వాసులు.. మంగళవారం రాత్రి ఇలాగే ఓ వ్యక్తిపై దాడి చేసి హతమార్చారు. సమీపంలోని కొర్రెముళ్ల గ్రామానికి చెందిన బాలకృష్ణ.. జియాపల్లిలోని బంధువు రామస్వామి ఇంటికి వెళ్లాడు. రాత్రి తిరిగి వస్తున్న క్రమంలో కొందరు యువకులు అతడిపై కర్రలతో దాడి చేశారు. ఆసుపత్రికి తరలిస్తుండగా బాలకృష్ణ మార్గమధ్యలో మరణించాడు. ఈ ఘటనపై ఆగ్రహించిన కొర్రెముళ్ల గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు గ్రామంలో భారీ పికెట్‌ను ఏర్పాటు చేశారు.

అటు నిజామాబాద్‌ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. భీమ్‌గల్‌ మండలం చెంగల్‌లో బావ, బావమరిదులిద్దరినీ.. స్థానికులు చావబాదారు. దాడిలో గాయపడ్డ మాల్యావత్‌ దేవ్యా హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతడి బావ దేవాగత్‌ లాలూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మామిడికాయల కోసం వచ్చిన బావాబామ్మర్దులిద్దరినీ కిడ్నాప్‌ ముఠా అని భావించి గ్రామస్థులు చితకబాదారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి. నందిగామ, మచిలీపట్నం, తదితర ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరిగినా... హిందీలో మాట్లాడినా.. పట్టుకుని చితక్కొడుతున్నారు. ఈడపల్లిలో పిల్లలను ఎత్తుకు పోయేవాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని చితకబాదారు. పోలీసు వచ్చిన.. బాధితుడిని చిలకలపూడి ఆసుపత్రికి తరలించారు. సోషల్‌మీడియా వదంతులను నమ్మవద్దంటూ పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. వీటిని వ్యాపింప చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనీ హెచ్చరిస్తున్నారు.

బీహార్‌ ముఠా తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తోందని.. పిల్లలు, వృద్ధులను కిడ్నాప్‌ చేసి వారి గుండె, మెదళ్లను తీసుకుని తినేస్తున్నారంటూ.. సోషల్‌ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. దీంతో.. ఆత్మరక్షణ కోసమంటూ.. స్థానికులు సొంతంగానే.. విడతలవారీగా గ్రామంలో పహారా కాస్తున్నారు. ఏ మాత్రం అనుమానం కలిగినా వారిని వదిలిపెట్టడం లేదు. చెట్లకు, విద్యుత్ స్తంభాలకు కట్టేసి మరీ కొడుతున్నారు. ఆ తర్వాత ఎప్పుడో పోలీసులకు సమాచారం అందిస్తున్నారు.

మొన్నటివరకూ.. హిందీ మాట్లాడుతూ కనిపించిన అపరిచితులపై అనుమానం రాగానే గ్రామస్థులు దాడి చేసేవారు. కానీ ఇప్పుడు.. తెలుగు మాట్లాడుతున్నా.. తమది పక్క గ్రామమేనని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. రాత్రిపూట గ్రామశివార్లలో కనిపిస్తే చాలు.. ఎవరో ఏంటో అని ఆరా కూడా తీయకుండా కడతేర్చే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో అత్యవసరమైన పని ఉన్నా.. పక్క గ్రామానికి వెళ్లేందుకూ.. పల్లెప్రజలు భయపడిపోతున్నారు. మొత్తానికి సోషల్‌ మీడియా పుణ్యాన.. గ్రామస్థులు దాడులు చేస్తూ.. అమాయకులను హతమారుస్తూ.. అనవసరంగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. గ్రామస్థుల్లో భయం పోగొట్టేందుకు.. వారిలో చైతన్యం నింపేందుకు.. పోలీసు శాఖ.. పల్లెనిద్ర తరహా కార్యక్రమాన్ని రూపొందించుకుని.. అమలు చేస్తే బాగుంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. 

09:49 - May 23, 2018

యాదాద్రి : సోషల్ మీడియా మేసేజ్ లు ప్రాణాలు తీస్తున్నాయి. దొంగలు బీభత్సం సృషిస్టున్నారని..ప్రాణాలు సైతం తీస్తున్నారంటూ భయంకరమైన మేసేజ్ లు వెళుతున్నాయి. దీనితో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అనుమానం వచ్చిన వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. ఏకంగా దాడులు చేస్తుండడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదైనా అనుమానం వస్తే 100 డయల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. తాజాగా మరొక ప్రాణం పోయింది.

ఘట్ కేసర్ మండలం కొర్రెముల గ్రామానికి చెందిన బాలకృష్ణ బంధువుల నివాసానికి వెళ్లేందుకు జియాపల్లికి వెళుతున్నాడు. అనుమానం వచ్చిన గ్రామస్తులు దొంగగా భావించి దాడి చేయడంతో బాలకృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. దీనితో అతను మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

18:00 - May 22, 2018
09:07 - May 22, 2018

యాదాద్రి భువనగిరి : తెలంగాణలో టీడీపీకి గత వైభవం రావడం ఎంతోదూరంలో లేదని ఆపార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన మినీ మహానాడులో పాల్గొన్న ఆయన... ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. అనంతరం జిల్లాలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒకమాట వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతోందని ఎల్‌ రమణ విమర్శించారు. 

06:24 - May 14, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం మహోద్యమంగా కొనసాగుతోంది. గ్రామ గ్రామాన లబ్ధిదారులైన రైతులకు పెట్టుబడి సాయం కింద చెక్కులు అందజేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అన్నదాతలకు చెక్‌లతోపాటు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో జరిగిన రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ తదితరులు పాల్గొన్నారు. రైతులకు చెక్కులతోపాటు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా కేటీఆర్‌... రైతులకు పెట్టుబడి సాయం పథకం దేశానికే ఆదర్శమన్నారు.

మెదక్‌ నియోజకవర్గంలో జరిగిన రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం భగాయత్‌లో జరిగిన రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామల్లో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. ఎంపీ బాల్క సుమన్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పులు ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్ని రైతుకుల చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేమహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో జరిగిన రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో ఎంపీ బండ ప్రకాశ్‌, ఎమ్మెల్యే రమేశ్‌ పాల్గొన్నారు. రైతు సంక్షేమ కార్యక్రమాల అమల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు చెక్కుల పంపణీ పథకం అమలు కొసాగుతోంది. 

18:03 - May 12, 2018

యాదాద్రి భువనగిరి : తెలంగాణలో బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా జూన్‌ 25, 26, 27 తేదీల్లో కలెక్టరేట్లను ముట్టడిస్తామని చెప్పారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో జరిగిన బీఎల్‌ఎఫ్ సమావేశంలో పాల్గొన్న తమ్మినేని పెట్టుబడి సాయం సామాన్య రైతులకు అందడం లేదన్నారు. ప్రభుత్వం పెట్టుబడిసాయం లాంటివి కాకుండా పండిన పంటకు గిట్టుబాటు ధరను అందించాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు.

13:47 - May 12, 2018

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ ప్లాజా వద్ద ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. వేసవి సెలవులతో పాటు శుభకార్యాలు కూడా రావడంతో సొంత గ్రామాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగి హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు రోడ్డు రద్దీగా మారింది. 

 

17:30 - May 4, 2018

యాదాద్రి భువనగిరి: ఎంపీ బూర నరసయ్య గౌడ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిలను రైతులు అడ్డుకున్నారు. యాదాద్రి భువనగిరి మార్కెట్ యార్ట్ లో గత 20 రోజుల నుండి ఆందోళన చేస్తున్న రైతులు ఈరోజు ఎంపీ, ఎమ్మెల్యే మార్కెట్ యార్డ్ కు రాగానే వారిని లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారు. తడిసినధాన్యాన్ని ప్రభుత్వం తగిన ధరకు కొనాలని రైతులు డిమాండ్ చేశారు. వారంరోజులగా మార్కెట్ కు ధాన్యం వచ్చినా కొనుగోలు చేయటంలేదని వెంటనే ధాన్యాన్ని కొనాలని రైతులు డిమాండ్ చేశారు. కాగా ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో రైతులను ఆదుకుంటామని మాట ఇచ్చిన ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలని రైతులు ఎంపీ, ఎమ్మెల్యేలను అడ్డుకుని డిమాండ్ చేశారు.

16:09 - May 4, 2018

యాదాద్రి భువనగిరి : మోత్కూర్‌లో జరుగుతున్న ఓపెన్‌ డిగ్రీ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్ జోరుగా సాగుతుంది. మోత్కూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో విద్యార్థుల నుండి డబ్బులు వసూళ్లు చేస్తూ.. ఇన్విజిలేటర్లు మాస్‌ కాపీయింగ్‌కు సహకరిస్తున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి 2 వేల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - Yadadri