Yadadri

16:48 - July 14, 2018

యాదాద్రి : భువనగిరి జిల్లా వీరవెల్లి గ్రామంలో ఓ మహిళ సెల్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేసింది. సిలివేరు నర్సింహ అనే వ్యక్తి భూమి ఇప్పిస్తానని 35 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని ఆలేరుకు చెందిన సమంతారెడ్డి సెల్‌ టవర్‌ ఎక్కింది. ఎన్నిసార్లు నర్సింహ ఇంటికి వచ్చినా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఈరోజ వీరవెల్లికి వచ్చిన సమంతారెడ్డి సెల్‌టవర్‌ ఎక్కింది. తనకు వెంటనే డబ్బులు ఇప్పించి న్యాయం చేయకపోతే సెల్‌ టవర్‌ నుంచి దూకుతానని హెచ్చరించింది. స్థానికులంతా పోలీసులకు సమాచారమివ్వడంతో ఘటనాస్థలానికి చేరుకుని సమంతారెడ్డితో పోలీసులు మాట్లాడుతున్నారు.

 

12:40 - July 13, 2018

యాదాద్రి : గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నామని ఇప్పుడు అతను తనను వివాహం చేసుకోవటానికి ఇష్టపడటంలేదని ప్రియుడి ఇంటి ముందుకు గత నాలుగు రోజులుగా ఆందోళన చేపట్టింది. అయిన స్పందించకపోవటంతో సెల్ టవర్ ఎక్కి తన నిరసనను తెలిపింది. అతను వివాహానికి ఒప్పుకుంటేనే కిందికి దిగుతానని లేదంటే దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. కాగా గతంలో కూడా సదరు యువతి తన ప్రియుడిపై కేసు నమోదు చేయగా..అతనికి కౌన్సిలింగ్ ఇచ్చినా వివాహానికి నిరాకరించటంలేదు..దీంతో సదరు యువతికి కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినాగానీ..అతనితో కలిసి తీయించుకున్న ఫోటోలు బైటకు వచ్చిన తరువాత కూడా వివాహం చేసుకోకపోవటంతో మనస్తాపానికి గురై యువతి ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది.


 

21:15 - July 12, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు, లొతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తెలంగాణ, ఏపీలో గాలి వానకు పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నారుమళ్లలో నీరు చేరటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుండపోత వర్షంతో హైదరాబాద్‌ తడిసిముద్దయింది. రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్‌జాం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు ఇళ్ళలోకి చేరింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరగటంతో జనజీవనం స్తంభించింది. చందానగర్, లింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో బయటకు రావడానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇక తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రహదారులు, లొతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర, కూసుమంచి, తిరుమలాయపాలెం, పెనుబల్లి, సత్తుపల్లి, అశ్వారావుపేట మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, భువనగిరి, శాలిగౌరారం, ఎల్కారంలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ఈదురు గాలులకు చెట్లు విరిగి పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిశాయి. తాండూరు, తెల్కపల్లి, తిమ్మాజిపేట, బిజినేపల్లిలో వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తేలికపాటి జల్లులు కురిశాయి. నార్నూర్ మండలంలో 9.64 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా కడెం నారాయణ జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి 13,109 క్యూసెక్కుల వరద నీరు చేరింది. 3 గేట్ల ద్వారా 25 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రావులపాలెంలో 5.57 సెం.మీ, గడలలో 5.42 సెం.మీ, కపిలేశ్వరంలో 5.35 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో గోదావరి నది నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో లంక గ్రామాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో పది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్తంభించింది. తణుకు, అత్తిలి, ఇరగవరం, నిడదవోలు, ఉండ్రాజవరం మండలాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. అత్తిలిలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన బీటీరోడ్‌ కాలువలోకి కుంగిపోయింది. కృష్ణా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విజయవాడలో భారీ వర్షానికి రోడ్లన్ని నీటమునిగాయి. పలుచోట్ల లొతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఇటు తెలంగాణ, అటు ఏపీలో ఖరీఫ్‌ నారుమళ్లకు తీవ్రమైన నష్టం ఏర్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముంపునీరుతో నారుమళ్లు కుళ్లిపోతున్నాయి. నారుమడుల్లోంచి ముంపునీటిని బయటకు పంపేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో నాటు వేసే పనులు ముందుకు సాగటం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు చాలా చోట్ల భారీ నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. 

13:32 - July 11, 2018

యదాద్రి : జిల్లాలో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. పోచంపల్లి మండలం పెద్దరావులపల్లికి చెందిన ప్రసన్నతో బీబీనగర్ కు చెందిన ఓ యువకుడితో ఇటీవలే ప్రేమ వివాహం జరిగింది. బీబీనగర్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ప్రసన్న ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనేపథ్యంలో బీబీనగర్ తహశీల్దార్ ఆఫీస్ పక్క గల్లీలోని నివాసంలో ప్రసన్న కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. 

17:55 - July 10, 2018

యాదాద్రి భువనగిరి : చందుపట్లకు చెందిన ఓ యువతి.. వలిగొండలో ప్రియుడు భాస్కర్‌ ఇంటి ముందు ఆందోళనకు దిగింది. భాస్కర్‌ తనను ప్రేమించానని చెప్పి.. మరో యువతిని వివాహం చేసుకునేందుకు సిద్దం కావడంతో జ్యోతి ఆందోళనకు దిగింది. రెండు నెలలుగా తప్పించుకున్న తిరుగుతున్న భాస్కర్‌పై.. జ్యోతి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడం... భాస్కర్‌ వేరే యువతితో పెళ్లికి సిద్దం కావడంతో... ఆమె ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తోంది. 

12:29 - July 7, 2018
13:01 - July 4, 2018
07:02 - July 2, 2018

భద్రాద్రి : జిల్లాలో 8 వందల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన కేటీపీఎస్‌ ఏడవ దశ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. శరవేగంగా నిర్మితమైన ఈ విద్యుత్ ప్రాజెక్ట్‌ దేశ విద్యుత్ రంగంలో సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది. తెలంగాణ జెన్కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు పాల్వంచలో ఈ విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్ట్‌ను ప్రారంభించి.. పవర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. రికార్డ్ సమయంలో విద్యుత్‌ ప్లాంటును నిర్మించి.. ప్రారంభించటంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో కేటీపీఎస్‌-7
భద్రాద్రి జిల్లాలో 8 వందల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన కేటీపీఎస్‌ ఏడవ దశలో విద్యుత్‌ ఉత్పత్తి శనివారం ప్రారంభమైంది. తెలంగాణ జెన్కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు పాల్వంచలో ఈ విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్ట్‌ను ప్రారంభించి.. పవర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఈ ప్లాంటు ప్రారంభంతో తెలంగాణకు అందుబాటులో ఉండే విద్యుత్‌ 16 వేల మెగావాట్లు దాటింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రారంభించి.. పూర్తి చేసిన తొలి విద్యుత్ ప్రాజెక్ట్‌గా కేటీపీఎస్‌7 నిలిచింది. 5,700 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంటు నిర్మాణ పనులను 2015 ఫిబ్రవరి 1న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రారంభించిన 40 నెలల్లోనే ప్రాజెక్ట్‌ పూర్తి కావటంతో ప్లాంట్ల నిర్మాణంలో ఈ ప్లాంటు కొత్త చరిత్ర సృష్టించింది.విద్యుత్ కేంద్రం ప్రారంభించిన 48 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రీయ విద్యుత్‌ మండలి నిబంధనలు ఉన్ననేపథ్యంలో.. ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు అంతకన్న తక్కువ సమయంలోనే నిర్మాణం పూర్తి చేశారు.

ఐడీసీ భారం ఎక్కువ పడకుండా చరిత్రలో నిలిచిన కేటీపీఎస్‌- 7
అలాగే ఐడీసీ భారం అధికంగా పడకుండా నిర్మాణం చేపట్టిన ప్రాజెక్ట్‌గా కేటీపీఎస్‌ 7 చరిత్రలో నిలిచింది. కేంద్రీయ విద్యుత్‌ మండలి నిబంధనలకు అనుగుణంగా 8 నెలల ముందే ప్లాంటు పూర్తి కావటంతో ఈ ఘనత సాధించింది. దీంతో ఆర్థికంగా 300 కోట్ల రూపాయల మేలు కలగనున్నట్లు తెలుస్తోంది. ఇక కేటీపీఎస్‌7లో విద్యుత్‌ ఉత్పత్తికి అయ్యే ఖర్చు కూడా తక్కువగానే ఉండబోతుంది. ప్రభుత్వం రంగ సంస్థలను ప్రోత్సహించాలనే రాష్ట్ర ప్రభుత్వం విధానానికి అనుగుణంగా.. జెన్కో సింగరేణితో అంగీకారం కుదుర్చుకుంది. ఈ అంగీకారం ప్రకారం జెన్కో ఉత్పత్తి చేసే విద్యుత్‌కు సింగరేణి సంస్థ బొగ్గును సరఫరా చేస్తుంది. దీని వల్ల సింగరేణికి లాభం జరగటంతో పాటు జెన్కోకు తక్కువ ధరకు బొగ్గు లభిస్తుంది. దీంతో ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. అంతిమంగా ప్రభుత్వ రంగ సంస్థలు వర్థిల్లడానికి కేటీపీఎస్‌ 7 ఉపయోగపడుతుంది.

సీఎం ప్రోత్సాహం, అధికారులు, సిబ్బంది కృషితో వేగంగా ప్లాంటు నిర్మాణం
సీఎం కేసీఆర్‌ అందించిన ప్రోత్సాహం, విద్యుత్‌ అధికారులు, సిబ్బంది చేసిన సమిష్టి కృషివల్లే.. రికార్డు సమయంలో ప్లాంటు నిర్మాణం పూర్తి చేశామన్నారు జెన్కో-ట్రాన్స్‌కో సీఎండీ డి. ప్రభాకర్‌. తీవ్ర విద్యుత్‌ సంక్షోభం ఎదుర్కొంటున్న తెలంగాణను మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చాలనే ధృడ సంకల్పంతో.. ప్రభుత్వం ఉందని అందుకనుగుణంగా విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. రికార్డు సమయంలో 800 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంటు నిర్మించటం జెన్కోకు గర్వకారణమన్నారు. ఈ రికార్డుతో తెలంగాణ జెన్కో కీర్తి ప్రతిష్టలు పెరిగాయని ఆనందం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో భద్రాద్రి, యాదాద్రి విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభాకర్‌రావు చెప్పారు. ప్లాంటు నిర్మాణం కోసం కష్టపడిన అధికారులకు, ఉద్యోగులకు ప్రభాకర్‌రావు అభినందనలు తెలిపారు.

ప్లాంటును ప్రారంభించటంపై సీఎం కేసీఆర్ హర్షం
రికార్డు సమయంలో విద్యుత్‌ ప్లాంటును నిర్మించి.. ఉత్పత్తి ప్రారంభించటం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జెన్కో కృషి ప్రశంసనీయం అని కొనియాడారు. పారదర్శకత, పనుల్లో వేగం సాధించాలనే లక్ష్యంతో విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించామన్నారు. ఆ లక్ష్యాలు నెరవేరడం ఆనందంగా ఉందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారని కేసీఆర్ అభినందించారు. 

21:16 - June 27, 2018

హైదరాబాద్ : బిఎల్‌ఎఫ్‌ నేతృత్వంలో.. వామపక్ష, ప్రజాసంఘాలు కదం తొక్కాయి. ఏలికల నిర్బంధాన్ని.. అడుగడుగు ఆంక్షలను అధిగమిస్తూ.. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలోని డొల్లతనాన్ని ఎండగట్టాయి. అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. పోలీసుల అత్యుత్సాహాన్ని నిరసిస్తూ.. కొన్ని చోట్ల నేతలు నిరాహార దీక్షలూ చేపట్టారు. కేసీఆర్‌ సర్కారు తీరుకు నిరసనగా కదం తొక్కిన బిఎల్‌ఎఫ్‌.. అడుగడుగు ఆంక్షలను తోసిరాజన్న బిఎల్‌ఎఫ్‌.. నిర్బంధాన్ని చీల్చుకుని కలెక్టరేట్లు ముట్టడించిన బిఎల్‌ఎఫ్‌.. తెలంగాణ జిల్లాలన్నింటా.. బిఎల్‌ఎఫ్‌ శ్రేణులు నిరసన గళమెత్తాయి. అన్ని కలెక్టరేట్ల వద్దా.. ఆందోళనలు చేపట్టాయి. రాష్ట్రంలో కార్మికుల సమస్యల పరిష్కారం.. దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల కేటాయింపు, పెన్షన్లు, కౌలు, పోడు రైతులకు రైతుబంధు వర్తింపు తదితర డిమాండ్లతో బిఎల్‌ఎఫ్‌ నేతృత్వంలోని వివిధ వామపక్ష, ప్రజాసంఘాల నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు .

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. బిఎల్‌ఎఫ్‌ కన్వీనర్‌ నల్లా సూర్యప్రకాశ్‌ ఆధ్వర్యంలో నాయకులు కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్‌ తక్షణమే మేల్కొని.. ఎన్నికల హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో బిఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో వివిధ పక్షాల కార్యకర్తలు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన నిర్వహించాయి. కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో బిఎల్‌ఎఫ్‌ శ్రేణులు కదం తొక్కాయి. కరీంనగర్‌ జిల్లాలో బిఎల్‌ఎఫ్‌ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన అనంతరం లోనికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో.. తోపులాట జరిగింది. పోలీసులు పిడిగుద్దులతో ఆందోళనకారులపై విరుచుకుపడ్డారు. విద్యార్థినులను ఈడ్చుకుంటూ వెళ్లారు. దీంతో అమ్మాయిలు గాయాలపాలయ్యారు. పోలీసుల తీరును ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి.

మహబూబ్‌నగర్‌, గద్వాల, నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాల్లోనూ బిఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. ప్రజాసమస్యలు, కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోరుతూ.. పాలిటెక్నిక్‌ కాలేజీ నుంచి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. సామాజిక తెలంగాణ సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, బిఎల్‌ఎఫ్‌ నాయకులు హెచ్చరించారు. బిఎల్‌ఎఫ్‌ పిలుపు మేరకు నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ఆందోళనలు కొనసాగాయి. అర్ధరాత్రి నుంచే బిఎల్‌ఎఫ్‌ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని గృహనిర్బంధంలో ఉంచారు. పోలీసుల చర్యకు నిరసనగా.. ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పోలీసుల నిర్బంధాన్ని అధిగమించి.. బిఎల్‌ఎఫ్‌ పక్షాల నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్లకు తరలి వచ్చారు. ధర్నాలు చేపట్టారు. కలెక్టరేట్‌ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డుకిరువైపులా బారికేడ్స్‌ ఏర్పాటు చేసి.. ట్రాఫిక్‌ను మళ్లించారు. అయినా వందలాదిగా కార్మికులు తరలివచ్చారు. ర్యాలీగా వెళుతున్న బిఎల్‌ఎఫ్‌ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.

నమ్మి గెలిపిస్తే కేసీఆర్‌ ప్రజలను వంచిస్తున్నారని నాయకులు విమర్శించారు. ప్రజల మౌలిక సమస్యలు తీర్చని ప్రభుత్వాలు పతనం కాక తప్పదని హెచ్చరించారు. వరంగల్‌, జనగాం, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లోనూ బిఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తాము నిర్వహించిన సర్వేలో 40 రకాల సమస్యలు బిఎల్‌ఎఫ్‌ దృష్టికి వచ్చాయని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ప్రభుత్వం వాటి పరిష్కారానికి తక్షణమే చొరవ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోనూ బిఎల్‌ఎఫ్‌ శ్రేణులు కదం తొక్కాయి. జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపట్టాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో కేసీఆర్‌ సర్కారు విఫలమైందని నేతలు ఆరోపించారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోనూ బిఎల్‌ఎఫ్‌ శ్రేణులు ధర్నాలు చేపట్టారు. కలెక్టరేట్‌ వద్ద పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. నిజామాబాద్‌లో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

11:39 - June 25, 2018

యాదాద్రి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో అవినీతి చోటు చేసుకొంటోందని..పలువురు డబ్బులు దండుకుని రైతులకు పథకాన్ని వర్తింప చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా తాను కష్టపడి సంపాదించుకున్న భూమి తనకు దక్కదేమోనన్న భయంతో..మనస్థాపానికి గురైన ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం లింగోజిగూడెంలో చోటు చేసుకుంది. ఎర్రగోని అంజయ్య అనే రైతు తన భూమి తనకు చెందుతుందో లేదోనని, ఇందుకు రైతు బంధు పథకమే కారణమని మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. అధికారుల వద్దకు ఎన్నిసార్లు వెళ్లినా సరైన సమాచారం ఇవ్వడం లేదని..తన భూమికి డిజిటల్ పాసు పుస్తకం ఇవ్వలేదని పలువురి ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వేదనతోనే అతను చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - Yadadri