Yadadri

08:11 - June 13, 2018

యాదాద్రి : తుర్కపల్లి మండలం ముల్కలపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయులు పాఠాలు బోధించకుండా.. ఇష్టానుసారం వచ్చి వెళుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.. విషయం తెలుసుకున్న కలెక్టర్ అనిత రామచంద్రన్‌ పాఠశాలకు చేరుకున్నారు. కలెక్టర్‌కు విద్యార్థులు తమ గోడును వెళ్లబోసుకోవటంతో.. సరిగ్గా బోధించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలంటూ విద్యాశాఖ అధికారిని రోహిణిని ఆదేశించారు. 

 

19:34 - June 12, 2018

యాదాద్రి : తెలంగాణ పరిరక్షణ సమితి కన్వీనర్‌ కల్లూరి రాంచంద్రా రెడ్డి పాదయాత్ర చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చీకటిమామిడి నుంచి మర్యాల వరకు ఉన్న బీటి రోడ్డు విస్తరణ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రోడ్డు విస్తరణ జరిగితే ఈ మూడు గ్రామాలతో పాటు ఇతర గ్రామాలకు రోడ్డు సౌకర్యం మెరుగవుతుందన్నారు. రోడ్డు గుంతలు ఉండడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. 

13:30 - June 10, 2018

యాదాద్రి భువనగిరి : రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌కు అవమానం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అంబేద్కర్‌ విగ్రహానికి నల్లరంగు టీషర్ట్‌ను చుట్టారు. దీంతో దళిత, గిరిజన ప్రజాసంఘాలు ఘటనాస్థలంలో ఆందోళనకు దిగారు. సీసీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించి.. అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 12 గంటల్లో నిందితులను అరెస్ట్‌ చేస్తామని ఏసీపీ హామీ ఇవ్వడంతో ప్రజా సంఘాల నేతలు ఆందోళన విరమించారు.

19:49 - June 6, 2018

యాదాద్రి : కౌలు రైతులకు రైతుబంధు వర్తించదనడం దారుణమని టీమాస్‌ ఫోరం చైర్మన్‌ కంచ ఐలయ్య అన్నారు. కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వనందున.. ప్రతి ఏడాదిలా కాకుండా ఈ ఏడాది ప్రతి ఎకరానికి నాలుగు వేల రూపాయలు తక్కువ కౌలు చెల్లించాలని కౌలు రైతులకు సూచించారు. 

 

21:05 - June 2, 2018

హైదరాబాద్ : ఎన్నో ఏళ్ల ఉద్యమం. ఎంతో మంది యువకుల ప్రాణ త్యాగాలు. ఉమ్మడి పోరాటాలు. ఉక్కు సంకల్పం. మొక్కవోని ఆత్మస్థైర్యంతో సాధించుకున్న తెలంగాణకు నాలుగేళ్లు నిండాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కలెక్టర్‌ ఆమ్రపాళి పాల్గొన్నారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కడియం, అనంతరం కార్యక్రమంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అలాగే పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన అధికారులను మంత్రి అవార్డులతో సత్కరించారు.

కరీంనగర్‌ జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించిన ఈటెల.. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రభుత్వం తరుపున ప్రతిభ పురస్కారాలు అందించారు. రామగుండం సింగరేణి బొగ్గు గనుల్లో కార్మికులు ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గనులపై త్రివర్ణ పతకాన్ని ఎగరవేసి మిఠాయిలు పంచుకున్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకల్లో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ పాల్గొన్నారు.

మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అలాగే అమరుల కుటుంబాలకు, ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు అవార్డులను బహుకరించారు. మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో డీప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి పాల్గొన్నారు. అమరులకు నివాళులర్పించి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు.

నిజామాబాద్‌ జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు. వినాయక్‌ నగర్‌లో గల అమరవీరుల స్థూపం వద్ద కలెక్టర్‌తో కలిసి నివాళులర్పించారు. అనంతరం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి.. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదాన్‌ జరిగిన వేడుకల్లో ఆబ్కారిశాఖ మంత్రి పద్మారావు పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించి, అమరవీరులకు నివాళులర్పించారు. అనంతర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే సింగరేణి గనుల సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం గ్రౌండ్‌లో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సింగరేణి డైరెక్టర్‌ పవిత్రన్‌ కుమార్ జాతీయ జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.

నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. సూర్యాపేట జిల్లాలో జరిగిన వేడుకల్లో విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నల్లగొండలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో మండలి డిప్యూటీ చైర్మన్‌ విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు. అమరవీరులకు నివాళులర్పించి, జాతీయ జెండా ఆవిష్కరించారు.

నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వికారాబాద్‌ పోలీసు గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో జాతీయ జెండా ఎగరవేసిన మంత్రి, అనంతరం పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు.

అలాగే హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేష్ రంగనాథన్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యలయంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ జెండా ఆవిష్కరణ చేశారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఉస్మానియా యూనివర్శిటీలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా వర్శిటీ వీసీ ఆర్ట్స్ కళాశాల భవనంపై జెండా ఆవిష్కరించారు. 

14:27 - June 2, 2018

యాదాద్రి భువనగిరి : ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంత చారి తల్లి అవమానం ఎదురైంది. శనివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలో జరుగుతున్న ఆవతరణ దినోత్సవాలపై శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తొలి అమరుడి తల్లి అయినప్పటికీతనకు సరైన గౌరవం ఇవ్వలేదని..కనీసం వేదికపైకి కూడా ఆహ్వానించలేదన్నారు. ఒక సమావేశంలో అమరులను కనీసం గుర్తించడం లేదని..వేరే వారిని పిలుస్తున్నారంటూ సన్మానాన్ని తిరస్కరించారు. నిర్వాహకులు ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. 

06:48 - May 25, 2018

హైదరాబాద్ : సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులతో అమాయకులపై దాడులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో దొంగగా భావించి ముగ్గురిని చితకబాదారు గ్రామస్థులు. అటు గుంటూరు జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని మహిళపై యువకుల దాడి చేశారు. పిల్లలను అపహరించే ముఠాగా భావించి దాడికి పాల్పడ్డారు. మరోవైపు చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని అమాయకులపై దాడులకు దిగితే చర్యలు తప్పవని ఇరు రాష్ట్రాల పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంతో ప్రజలు ఇంకా భయభ్రాంతులకు గురవుతూనే ఉన్నారు. పోలీసులు భరోసా ఇచ్చినా ఇంకా రాత్రిళ్లు జాగారం చేస్తూ.. అనుమానం వచ్చిన వ్యక్తులపై దాడులకు దిగుతున్నారు. అయితే ఈ దాడులల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లోని తట్టి కోర్టు ఏరియాలో బాలరాజు అనే మూగ వ్యక్తిపై గ్రామస్థులు దాడి చేశారు. దొంగగా భావించి స్తంభానికి కట్టేసి చితకబాదారు. దీంతో బాలరాజు పరిస్థితి విషమంగా మారింది. ఎడపల్లి మండలం బాపు నగర్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దొంగలుగా భావించి ఇద్దరు వ్యక్తులను కాలనీ వాసులు చితకబాదారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జియపల్లిలో బాలకృష్ణ అనే వ్యక్తిపై గ్రామస్థులు దాడి చేసి చంపారు. ఘట్కేసర్‌ మండలం కొర్రెములకు చెందిన బాలకృష్ణ జియపల్లిలోని బంధువుల ఇంటికి వెళుతుండగా దొంగ అనే నెపంతో అతనిపై దాడి చేశారు. దీంతో బాలకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. దాడికి పాల్పడిన ఎనిమిది మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇలాంటి ఘటనలు అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని మహిళపై యువకుల దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీన్స్‌ ప్యాంట్‌ ధరించి ఉన్న మహిళను... పిల్లలను అపహరించే ముఠాగా భావించి యువకులు దాడికి దిగారు. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించటంతో వైద్యులు గుంటూరు ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితురాలికి మతిస్థిమితం సరిగా లేనట్టు వైద్యులు వెల్లడించారు. మరోవైపు ఇలాంటి సంఘటనలు జరగడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజల్లో అవగాహన కల్పించి.. దాడుల జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఘటనలపై పోలీస్‌శాఖ స్పందించింది. ఎలాంటి గ్యాంగ్‌లు రాష్ట్రంలోకి రాలేదని, అనవసరంగా అమాయకులపై దాడులకు పాల్పడితే తీవ్రమైన చర్యలు ఉంటాయని ఇరు రాష్ట్రాల పోలీసులు హెచ్చరించారు. అయితే అధికారులు, పోలీసులు ఎంత ప్రచారం కల్పించినా ప్రజల్లో మాత్రం భయం పోవట్లేదు. 

08:52 - May 24, 2018

హైదరాబాద్ : సోషల్‌ మీడియాలోని వదంతులు.. అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఊరి శివార్లలోకి వచ్చే వారిని ఎవరూ... ఏంటి అని కనీసం విచారించకుండానే కర్రలతో చితకబాదేస్తున్నారు. తెలంగాణలో... గడచిన 24 గంటల వ్యవధిలోనే ఇద్దరిని ఇలాగే కొట్టి చంపేశారు. సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలన్నీ వదంతులే అని పోలీసులు ఎంతగా చెబుతున్నా.. ప్రజలు పట్టించుకోవడం లేదు. యాదాద్రి జిల్లా బీబీనగర్‌ మండలం జియాపల్లి వాసులు.. మంగళవారం రాత్రి ఇలాగే ఓ వ్యక్తిపై దాడి చేసి హతమార్చారు. సమీపంలోని కొర్రెముళ్ల గ్రామానికి చెందిన బాలకృష్ణ.. జియాపల్లిలోని బంధువు రామస్వామి ఇంటికి వెళ్లాడు. రాత్రి తిరిగి వస్తున్న క్రమంలో కొందరు యువకులు అతడిపై కర్రలతో దాడి చేశారు. ఆసుపత్రికి తరలిస్తుండగా బాలకృష్ణ మార్గమధ్యలో మరణించాడు. ఈ ఘటనపై ఆగ్రహించిన కొర్రెముళ్ల గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు గ్రామంలో భారీ పికెట్‌ను ఏర్పాటు చేశారు.

అటు నిజామాబాద్‌ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. భీమ్‌గల్‌ మండలం చెంగల్‌లో బావ, బావమరిదులిద్దరినీ.. స్థానికులు చావబాదారు. దాడిలో గాయపడ్డ మాల్యావత్‌ దేవ్యా హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతడి బావ దేవాగత్‌ లాలూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మామిడికాయల కోసం వచ్చిన బావాబామ్మర్దులిద్దరినీ కిడ్నాప్‌ ముఠా అని భావించి గ్రామస్థులు చితకబాదారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి. నందిగామ, మచిలీపట్నం, తదితర ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరిగినా... హిందీలో మాట్లాడినా.. పట్టుకుని చితక్కొడుతున్నారు. ఈడపల్లిలో పిల్లలను ఎత్తుకు పోయేవాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని చితకబాదారు. పోలీసు వచ్చిన.. బాధితుడిని చిలకలపూడి ఆసుపత్రికి తరలించారు. సోషల్‌మీడియా వదంతులను నమ్మవద్దంటూ పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. వీటిని వ్యాపింప చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనీ హెచ్చరిస్తున్నారు.

బీహార్‌ ముఠా తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తోందని.. పిల్లలు, వృద్ధులను కిడ్నాప్‌ చేసి వారి గుండె, మెదళ్లను తీసుకుని తినేస్తున్నారంటూ.. సోషల్‌ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. దీంతో.. ఆత్మరక్షణ కోసమంటూ.. స్థానికులు సొంతంగానే.. విడతలవారీగా గ్రామంలో పహారా కాస్తున్నారు. ఏ మాత్రం అనుమానం కలిగినా వారిని వదిలిపెట్టడం లేదు. చెట్లకు, విద్యుత్ స్తంభాలకు కట్టేసి మరీ కొడుతున్నారు. ఆ తర్వాత ఎప్పుడో పోలీసులకు సమాచారం అందిస్తున్నారు.

మొన్నటివరకూ.. హిందీ మాట్లాడుతూ కనిపించిన అపరిచితులపై అనుమానం రాగానే గ్రామస్థులు దాడి చేసేవారు. కానీ ఇప్పుడు.. తెలుగు మాట్లాడుతున్నా.. తమది పక్క గ్రామమేనని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. రాత్రిపూట గ్రామశివార్లలో కనిపిస్తే చాలు.. ఎవరో ఏంటో అని ఆరా కూడా తీయకుండా కడతేర్చే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో అత్యవసరమైన పని ఉన్నా.. పక్క గ్రామానికి వెళ్లేందుకూ.. పల్లెప్రజలు భయపడిపోతున్నారు. మొత్తానికి సోషల్‌ మీడియా పుణ్యాన.. గ్రామస్థులు దాడులు చేస్తూ.. అమాయకులను హతమారుస్తూ.. అనవసరంగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. గ్రామస్థుల్లో భయం పోగొట్టేందుకు.. వారిలో చైతన్యం నింపేందుకు.. పోలీసు శాఖ.. పల్లెనిద్ర తరహా కార్యక్రమాన్ని రూపొందించుకుని.. అమలు చేస్తే బాగుంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. 

09:49 - May 23, 2018

యాదాద్రి : సోషల్ మీడియా మేసేజ్ లు ప్రాణాలు తీస్తున్నాయి. దొంగలు బీభత్సం సృషిస్టున్నారని..ప్రాణాలు సైతం తీస్తున్నారంటూ భయంకరమైన మేసేజ్ లు వెళుతున్నాయి. దీనితో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అనుమానం వచ్చిన వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. ఏకంగా దాడులు చేస్తుండడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదైనా అనుమానం వస్తే 100 డయల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. తాజాగా మరొక ప్రాణం పోయింది.

ఘట్ కేసర్ మండలం కొర్రెముల గ్రామానికి చెందిన బాలకృష్ణ బంధువుల నివాసానికి వెళ్లేందుకు జియాపల్లికి వెళుతున్నాడు. అనుమానం వచ్చిన గ్రామస్తులు దొంగగా భావించి దాడి చేయడంతో బాలకృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. దీనితో అతను మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

18:00 - May 22, 2018

Pages

Don't Miss

Subscribe to RSS - Yadadri