Yadadri

18:08 - November 29, 2016

యాదాద్రి : భువనగిరిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఆలేరు మండలానికి చెందిన భాస్కర్, నీలావేణి ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన వీరు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో అక్కడున్న స్థానికులు వారిని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. 

13:18 - November 27, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ రాజకీయ పార్టీలు, కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం జరిగే భారత్‌ బంద్‌కు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. బంద్‌ సందర్భంగా ధర్నాలు, రాస్తా రోకోలు, రైల్‌ రోకోలు చేయాలని నిర్ణయించాయి. హర్తాళ్‌ను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ ప్రజలు, నేతలు, కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నాయి. ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఈనెల 8న తీసుకున్న నిర్ణయం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నల్లధనం వెలికితీత పేరుతో పెద్ద నోట్ల రద్దు చేసిన ప్రధాని మోదీ నిర్ణయాన్ని అందరూ సమర్థిస్తున్నారు. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఉన్నపళంగా కరెన్సీని రద్దు చేయడాన్ని నిరసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆకస్మిక నిర్ణయంతో సమాన్యులు, రైతులు, కూలీలు, కార్మికులు తీవ్ర ఇబ్బందు ఎదుర్కొంటున్నారు. ఈ వర్గాల సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ రాజకీయ పార్టీలు, కార్మిక, ప్రజా సంఘాలు సోమవారం భారత్‌ బంద్‌కు పిలుపు ఇచ్చాయి.

తెలుగు రాష్ట్రాలు సిద్ధం..
తెలుగు రాష్ట్రాలు ఇందుకు సర్వం సిద్ధమయ్యాయి. తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేస్తూ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నిర్ణయిచింది. పెద్ద నోట్ల రద్దకు నిరసనగా ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ స్తంభింపచేయాలని ఏపీ పీపీసీ నిర్ణయించింది. నోట్ల రద్దు తీరుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ నెల 28 న జరిగే హార్తాల్ కు తమ పార్టీ మద్దతిస్తోందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు చేస్తున్న నిరసనలకు వైసీపీ పూర్తి మద్దతు తెలుపుతోందని అన్నారు. ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయానికి నిరసనగా సోమవారం జరిగే బంద్‌కు.. ఏపీలో సీపీఎం శ్రేణులు సిద్ధమయ్యాయి. కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం కూడా భారత్‌ బంద్‌కు మద్దతు ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న కష్టాలకు సంఘీభావంగా ప్రజా ప్రతినిధులందరూ బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల ఆటో కార్మిక సంఘాల సమాఖ్య భారత్‌ బంద్‌కు మద్దతు ప్రకటించింది. మొత్తం మీద పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున సిద్ధమతున్నాయి. 

06:36 - November 25, 2016

హైదరాబాద్ : పెద్దనొట్ల రద్దు అంశం ఆర్టీసీపై తీవ్ర ప్రభావాన్నిచూపుతోంది. అసలే నష్టాలతో నడుస్తోన్న సంస్ధలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది. మోదీ తీసుకున్న నిర్ణయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీలకు అక్యుపెన్సీ దారుణంగా పడిపోయింది. దీంతో ఉహించని రీతిలో ఆర్టీసీలు నష్టాలు చవిచూస్తున్నాయి. 500,1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశ వ్యాప్తంగా అన్నీ రంగాలు ఆర్ధిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్ధలైన ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. అసలే..ఆర్థిక కష్టాలలో..నష్టాల నావను నెట్టుకొస్తున్నరెండు కార్పొరేషన్లు ప్రయాణికుల లేమితో మరింతగా నష్టాలను చవిచూస్తున్నాయి. పెద్దనోట్లను రద్దుచేస్తూ మోదీ ప్రకటన చేసిన నాటినుంచి నేటి వరకూ తీవ్రస్ధాయిలో నష్టాలను చవిచూస్తున్నాయి.

ప్రతిరోజు రూ.60 లక్షలు నష్టం..
నవంబర్ 8 పెద్దనోట్ల రద్దు ప్రకటన అనంతరం తొలిరోజు టిఎస్ ఆర్టీసీ కోటిరూపాయలు నష్టాన్ని చవిచూడగా.. నాటి నుండి నేటి వరకూ ప్రతిరోజూ 60 లక్షల రూపాయల నష్టాన్ని నమోదుచేస్తూ వస్తోంది. ప్రయాణికులు చిల్లరదొరక్క తమతమ టూర్లను వాయిదా వేసుకుంటుండగా సుమారు ఈ 16 రోజుల్లోనే 1300 కోట్ల రూపాయలకు పైగా...నష్టాల్ని చవిచూసింది. మరికొంతకాలం ఇదే ఆర్థిక అస్థిరత ఉంటున్న నేపధ్యంలో పెద్దనోట్ల రద్దు వ్యవహారం టిఎస్ ఆర్టీసీకి కోలుకోలేని నష్టం తప్పదని అధికారులు వాపోతున్నారు.

ఏపీఎస్ ఆర్టీసీకి ఇదే పరిస్ధితి..
మరోవైపు ఏపీలోకూడా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. జర్నీకి కావాల్సిన చిల్లర దొరక్క జనం తప్పసరి అయితేనే ప్రయాణీస్తున్నారు. దీంతో ఏపీలో కూడా అక్యుపెన్సీ పూర్తిగా పడిపోయింది. ఫలితంగా ఏపీఎస్ఆర్టీసీ సైతం నష్టాలను చవిచూస్తొంది... ప్రయాణీకుల చిల్లర సమస్యలను తొలగించి అక్యుపెన్సీని పెంచేందుకు ఏపీ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచిస్తోంది. నగదుతో నిమిత్తం లేకుండా ప్రయాణాలు జరిపేందుకు ఈ పాస్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా ప్రయాణీకులు తమ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల సహాయంతో టిక్కెట్ పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి బస్టాండ్లు, లాంగ్ రూట్ బస్సులలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తున్నా భవిష్యత్తులో అన్నీ బస్సుల్లో...నగదు రహిత టిక్కెట్ పొందే విధానాన్ని అమలు పరిచేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తొంది. సాధారణంగా నవంబర్ మాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో... ఆర్టీసీలో రద్దీ అధికంగా ఉంటుంది. కాకపొతే.. పెద్దనోట్లు రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ సంస్ధలు భారీగా నష్టపోతున్నాయి. మరో నెలరోజుల పాటు ఇదే రకమైన వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తుండటంతో... ఈ తరహా నష్టాలు భారీగా పెరిగే అవకాశం ఉందనీ అధికారులు అంచానా వేస్తున్నారు.

06:42 - November 24, 2016

హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య ఇప్పట్లో పెరిగే అవకాశం లేదని తేలిపోయింది. రాజ్యసభ సాక్షిగా కేంద్రమంత్రి హన్సరాజ్‌ ప్రకటన చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సి ఉన్నప్పటికీ.. డీ-లిమిటేషన్‌ చట్టం ప్రకారం 2026 వరకు సంఖ్య పెంచలేమని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికలకు నియోజకవర్గాల పెంపు ఉంటుందని ఆశపడుతున్న తెలంగాణ రాజకీయ నేతలపై కేంద్రం నీళ్లు చల్లింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ ప్రకారం అసెంబ్లీ స్థానాల పెంపు కోసం తెలంగాణ రాష్ట్రం ఏమైన ప్రతిపాదనలు పంపిందా ? అని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్సరాజ్‌ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. నియోజకవర్గాల పెంపు కుదరదని స్పష్టం చేశారు. నియోజకవర్గాలను పెంచాలంటే ఆర్టికల్‌ 371ను సవరించాల్సిన అవసరముందన్నారు. అయితే అది ఇప్పుడు సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి.. నియోజకవర్గాల సంఖ్య పెంపు కుదరదని హన్సరాజ్‌ తెలిపారు.

సీట్లను పెంచాల్సి ఉంది..
అయితే.. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉంది. ఈ మేరకు నియోజకవర్గాల పునర్విభజన చేయాలని తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. చట్టం ప్రకారం 2026లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం లేదు. దీంతో రాజ్యాంగ ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం అటార్నీ జనరల్‌ సలహా కోరింది. నిబంధనలు అంగీకరించవని అటార్నీ జనరల్‌ కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ పద్ధతులను సూచిస్తూ తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. అయితే డీ లిమిటేషన్‌ను 2026 వరకు సీల్‌ చేస్తూ గతంలో పార్లమెంట్‌ చట్టాన్ని ఆమోదించడంతో.. అసెంబ్లీ సీట్ల పెంపునకు అవకాశం లేకుండాపోయింది.

తెలుగు రాష్ట్రాల పరిస్థితి వేరు..
ఇదిలావుంటే.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి వేరని విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెంచాలని రెండు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. మిగతా రాష్ట్రాలతో సంబంధం లేకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలు పెంచాలని కోరతున్నాయి. రాష్ట్రాన్ని విభజించేందుకు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ను వాడుకున్నారో.. అదే ఆర్టికల్‌తో రెండు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలు పెంచవచ్చని ఒత్తిడి తీసుకువస్తున్నాయి. అయితే.. తాజాగా రాజ్యసభలో కేంద్రమంత్రి హన్సరాజ్‌ ప్రకటనతో వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పెంపు కష్టమేనని తెలుస్తోంది. మరి ఈ ప్రకటనపై తెలంగాణ రాష్ట్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

21:26 - November 20, 2016

హైదరాబాద్ : పాత నోట్లు చెల్లవు.. కొత్త నోట్లు అందుబాటులో లేవు. బ్యాంకులు బంద్. ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకుందామంటే.. చాంతాడంత క్యూలైన్లు. పన్నెండు రోజులవుతున్నా.. ఇదే పరిస్థితి. ఇటు.. పెద్ద నోట్లను ఎవరూ తీసుకోకపోవడం..అటు... కొత్త నోట్లకు చిల్లర లభించకపోవడంతో... సామాన్యులు, పేదల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త నోట్ల కోసం జనం ఇంకా ఏటీఎంల ముందు భారీగా క్యూలు కడుతున్నారు. చాలా చోట్ల ఏటీఎంలు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ప్రజలు ఎదురు చూపులు చూస్తున్నారు. ఏటీఎంలు మొరాయిస్తుండటం, లేదా అవుట్‌ ఆఫ్‌ సర్వీస్‌ అనే బోర్డులుండటంతో... వినియోగదారులు కొత్త నోట్ల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న పరిస్థితి ఉంది. పెద్ద నోట్ల రద్దై 12 రోజులు కావొస్తున్న పరిస్థితి ఇంకా చక్కబడలేదు. ఎక్కడ చూసినా ఏటీఎంల ముందు జనం బారులు తీరి కనిపిస్తున్నారు.

వ్యాపారుల నష్టం..
పెద్ద నోట్ల రద్దుతో వివిధ రకాల చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. కస్టమర్లు రాక... పూల మార్కెట్‌లతో పాటు పండ్లు, కూరగాయలు, నాన్ వెజ్ మార్కెట్లు బోసిపోయాయి. ప్రతి ఆదివారం మాంసం ప్రియులతో కిటకిటలాడే చికెన్‌ సెంటర్లు, మాంసం విక్రయ కేంద్రాలు వినియోగదారులు లేక విలవిల్లాడుతున్నాయి. పెద్దనోట్ల రద్దుతో గిరాకి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో నోట్ల రద్దు వ్యవహారం పేదలు, కూలీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కూలీకి వెళితే పాత నోట్లు ఇవ్వడం.. సరుకులు తెచ్చుకునే దుకాణాల్లో కొత్త నోట్లే తీసుకునే పరిస్థితి ఉండటంతో.. రోజూ వారి కూలీలు తీవ్ర దయనీయ స్థితిలో కాలం వెల్లదీస్తున్నారు. ఇంటి అద్దెలు కట్టడానికి కూడా డబ్బులు లేవని మహిళలు వాపోతున్నారు.

చిన్న నోట్లు ఎక్కడ ? 
చిన్న నోట్లు అందుబాటులో లేకపోవడంతో హోల్ సేల్, రిటైల్ పండ్ల మార్కెట్ కుదేలైపోయింది. కార్తీక మాసంలో వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వ్యాపారాలు లేక వ్యాపారులు లబోదిబోమంటున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పండ్ల తోటలు కొనుగోలు చేస్తే...ఇపుడు చిల్లర దొరక్క.. వ్యాపారం లేక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కొనుగోలు చేసేందుకు వచ్చేవారు 2 వేల నోటు తీసుకురావడంతో చిల్లర లేక వ్యాపారాలను వదులుకుంటున్న పరిస్థితి నెలకొంది. గతంలో రోజుకు మూడు వేల వరకు వ్యాపారం అయ్యేదని.. ఇప్పుడు ఐదు వందల వ్యాపారం కూడా జరగడం లేదని చిరువ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. తమ సమస్యలు చూసైనా... ప్రభుత్వం వేగంగా... ఐదు వందల రూపాయల కొత్త నోట్లతో పాటు.. వంద రూపాయల నోట్లను విరివిగా మార్కెట్లోకి విడుదల చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. ఆర్బీఐ నుంచి నగదు సరఫరా పెరిగి... ఏటీఎంలు పూర్తిస్థాయిలో పనిచేస్తే కానీ.. సమస్యకు పరిష్కారం లభించే అవకాశం లేదు. ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నా.. ఆర్బీఐ, బ్యాంకులు... వేగంగా నోట్ల పంపిణీపై దృష్టిపెట్టినట్టు కనిపించడం లేదు.   

19:50 - November 14, 2016
09:30 - November 14, 2016

యాదాద్రి : డెంగ్యూ మహమ్మారి ఆ ఊరిని కాటేస్తోంది. ప్రజలకు వైద్యం చేయాల్సిన డాక్టర్లు పత్తా లేరు. ఊర్లో ఉన్న ప్రభుత్వాస్పత్రికి ఎప్పుడూ తాళం వేసే ఉంటుంది. ఆర్థిక స్తోమత ఉన్నవాళ్లు నగరాలకు వెళ్లి వైద్యం చేయించుకుంటుంటే.. ఆర్ధికంగా ఇబ్బంది పడేవాళ్లు.. ఆస్పత్రి ఎప్పుడు తెరుస్తారా ? వైద్యులు ఎప్పుడు వస్తారా ? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. 
కొల్లూరులో విష జ్వరాలు 
యాదాద్రి జిల్లా ఆలూరు మండలంలోని కొల్లూరు గ్రామాన్ని విష జ్వరాలు వెంటాడుతున్నాయి. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు డెంగ్యూ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. నెలల తరబడి జ్వరాల బారినపడినా పట్టించుకునే నాధుడే లేడని గ్రామస్తులంటున్నారు. ఊర్లో ఉన్న ప్రభుత్వాస్పత్రి ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి ఉందంటున్నారు. 
డాక్టర్లు ఎప్పుడో ఒకసారి ఆస్పత్రికి 
డాక్టర్లు ఎప్పుడో ఒకసారి ఆస్పత్రికి వచ్చినా.. జ్వరం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించి వెళ్లిపోతున్నారని గ్రామస్తులంటున్నారు. మా గ్రామానికే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి జ్వరంతో బాధపడుతున్నా.. నగరానికి వెళ్లి వైద్యం చేయించుకునే స్తోమత లేక ఆస్పత్రి ఎప్పుడు తెరుస్తారా ? వైద్యం ఎప్పుడు చేస్తారా ? అని ఎదురుచూస్తున్నామని గ్రామస్తులంటున్నారు. 
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం శూన్యం : సర్పంచ్ 
ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ జ్వరాలు మాత్రం తగ్గడం లేదంటున్నారు గ్రామ సర్పంచ్‌ శంకరయ్య. ఊర్లో పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

21:20 - November 11, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పెద్ద నోట్ల రద్దు గందరగోళ పరిస్థితుల్ని సృష్టిస్తోంది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఎక్కడ చూసినా.... జనం భారీగా క్యూ కడుతున్నారు. నిత్యవసరాలన్నీ నగదుతో ముడిపడి ఉండటంతో కొత్త నోట్ల కోసం.. నానా తంటాలు పడాల్సి వస్తోంది. అటు దుకాణాల్లో పాత నోట్లు నిరాకరిస్తుండటం.. ఇటు కొత్త నోట్లు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ఏటీఎంలు తెరచుకోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఏటీఎంలు పనిచేస్తాయని ప్రభుత్వం చెప్పినా చాలా ప్రాంతాల్లో ఆ పరిస్థితి కనిపించడంలేదు.. కొత్త నోట్లు ఇంకా బ్యాంకులకు చేరక ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు.

నానా ఇబ్బందులు..
పాత 500, 1000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకు అధికారుల తీరుతో ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. వరంగల్ జిల్లాలో ఇప్పటికే 200 కోట్ల రూపాయల మేర డబ్బులు బ్యాంకుల్లో జమ అయ్యాయి. ఇంకా యాభై, వంద రూపాయల నోట్ల కోసం ప్రజలు బ్యాంకుల్లో పడిగాపులు కాస్తూనే ఉన్నారు. పాలమూరు జిల్లాలో ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల వద్ద వినియోగదారులు బారులు తీరారు. బ్యాంకుల్లో 500, వేయి రూపాయల నోట్ల మార్పిడి కోసం జనం క్యూ కట్టారు. ఏటీఎంల్లో డబ్బుల డ్రా చేసుకునేందుకు ప్రజలు గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. ఒక్కొక్కరు రెండు వేల రూపాయలు మాత్రమే డ్రా చేసుకునే వీలుండటంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెదక్‌ జిల్లాలో పాత నోట్ల రద్దు ప్రభావం స్థిరాస్తి రిజిస్ట్రేషన్లపై తీవ్రంగా చూపుతోంది. జనం లేక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. గతంలో రోజుకు 150 వరకు జరిగిన రిజిస్ట్రేషన్లు.. ఇప్పుడు రెండు, మూడుకు మించడం లేదంటే పరిస్థితి తీవ్రత ఏంటో తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో రిజిస్ట్రేషన్లు పూర్తిగా పడిపోయాయని ఉప్పల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ తెలిపారు.

వినూత్న నిరసనలు..
హైదరాబాద్‌ ఓల్డ్ సిటీలో పోలీసులు తమ ఉదారత చాటుకున్నారు. పెద్ద నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద క్యూ కట్టిన జనాలకు పోలీసులు దగ్గరుండి మరీ వాటర్ పాకెట్లు సరఫరా చేశారు. రెండు రోజుల తర్వాత ఏటీఎంలు తెరుచుకోవడంతో జనాలు బారులు తీరారు. నగదును బ్యాంకులలో డిపాజిట్‌ చేసేందుకు ఖాతాదారులు భారీగా తరలివచ్చారు. రాంనగర్‌లో బ్యాంకుకు వచ్చిన ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. అలాగే ఇంకా చాలా చోట్ల ఏటీఎంలు తెరుచుకోలేదు. తెరుచుకున్న ఏటీఎంలలో క్యాష్‌ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాత నోట్ల రద్దుపై తిరుపతిలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. వెయ్యి నోట్లను ఒంటిపై పరచుకుని రోడ్డుపై అడ్డంగా పడుకున్నాడు. రెండు రోజుల్లో తన కుమార్తె పెళ్లి ఉండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఇలా చేశానని సుబ్రహ్మణ్యం అంటున్నాడు. సుబ్రహ్మణ్యంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరులో..
గుంటూరులో రెండో రోజు బ్యాంకుల వద్ద ఖాతాదారుల రద్దీ కొనసాగింది. శుక్రవారం కూడా ఏటీఎంలు మూతపడి ఉండటంతో.. జనం బ్యాంకులకు క్యూ కడుతున్నారు. నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల దగ్గర పడిగాపులు కాశారు. కేంద్రం రద్దు చేసిన 500, వెయ్యినోట్లతో వెలగపూడి సచివాలయంలోని ఉద్యోగులకు రెండో రోజు కూడా తిప్పలు తప్పలేదు. మొదటి రోజు ఎలాగోలా సర్దుకున్న ఉద్యోగులు,..రెండో రోజు బ్యాంకుల్లో డబ్బును పొందవచ్చని భావించారు. కానీ సచివాలయంలోని ఆంధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంక్ లకు కొత్తనోట్లు రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

తూర్పు మన్యంలో..
పెద్ద నోట్ల రద్దుతో తూర్పు మన్యంలోని మారుమూల ప్రాంతాల్లోనూ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. చిల్లర సమస్యతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మన్యం వాసులు డివిజన్‌ కేంద్రంలోని బ్యాంకులకు క్యూ కడుతున్నారు. నిత్యవసరాలకు డబ్బులు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని మన్యం వాసులు వాపోతున్నారు. పలుచోట్ల బ్యాంకుల్లో సిబ్బంది తక్కువగా ఉండటంతో వినియోగదారులకు నగదు చెల్లింపులు ఆలస్యం అవుతోంది. దీంతో ఖాతాదారులు నగదు సంబంధిత వ్యవహారాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఎక్కడ చూసినా జనం నోట నోట్ల మాటే వినిపిస్తోంది. అటు.. దుకాణాల్లో పాత నోట్లు తీసుకోక.. ఇటు కొత్త నోట్లు దొరక్క జనం అల్లాడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయం చూపాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.  

12:47 - November 11, 2016

యాదాద్రి : గ్రూప్‌-2 పరీక్ష కోసం ఎంతో తీవ్రంగా శ్రమించిన విద్యార్థులు.. ఒక్క నిమిషం నిబంధనతో పరీక్షకు హాజరుకాలేని పరిస్థితి నెలకొంది. నల్లగొండ, యాదాద్రి జిల్లాలలో సుమారు 20 మంది విద్యార్థులు పరీక్షకు ఆలస్యంగా వచ్చారు. గ్రూప్‌-2 పరీక్షకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు అనుమతించలేదు. దీంతో సదరు విద్యార్థులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. 

17:11 - November 8, 2016

యాదాద్రి : యాదాద్రి టెంపుల్‌ సిటీ మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనపై సీఎం కేసీఆర్ రెండోరోజు సమీక్ష నిర్వహించారు. యాదాద్రి టెంపుల్‌ సిటీ నిర్మాణంపై కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రధాన గుట్టకు సమీపంలో 30 ఎకరాల్లో కార్ల పార్కింగ్‌, 10 ఎకరాల్లో బస్సుల పార్కింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. 35 ఎకరాల్లో బస్‌ డిపో, పోలీస్‌, ఫైర్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌, ఫుడ్‌ కోర్డులను నెలకొల్పాలని కేసీఆర్ సూచించారు. ఆలయానికి మరోవైపు 25 ఎకరాల్లో పూలతోట, 50ఎకరాల్లో కళ్యాణ మంటపం, ప్రవచన వేదిక నిర్మించాలన్నారు. గుట్టపై నుంచి కిందికి డ్రైనేజీ వ్యవస్థ, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. టెంపుల్‌ సిటీలో భక్తులకు మంచి వసతి కల్పించేదుకు 100 ఏసీ రూంలు, 100 నాన్‌ ఏసీ రూంలు, 100 ఉచిత రూంలు, డార్మెటరీ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ అన్నారు. ప్రధాన గుట్టపైనే 2వేల కార్లు పార్కు చేసే విధంగా ఎస్కలేటర్‌ సౌకర్యంతో మల్టీ లెవల్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని కూడా కేసీఆర్ సూచించారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - Yadadri