Yadadri

19:57 - July 9, 2017

 

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సద్గురు సాయిబాబా ఆలయాలు తెల్లవారుజామునుంచే భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. సాయినామ స్మరణతో మార్మోగుతున్నాయి. సాయి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలివస్తుండటంతో..ఇరు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా మందిరంలో గురుపౌర్ణమి పర్వదిన వేడుకలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. విద్యుత్‌దీప కాంతులతో సాయి ఆలయం దేదీప్యమానంగా వెలుగులీనుతోంది. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అటు ఎల్‌బీనగర్, పంజాగుట్ట, కూకట్‌పల్లి సాయిబాబా ఆలయాల్లో గురుపూర్ణిమ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామునుంచే సాయిని దర్శించేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో జనం రద్దీతో క్యూలైన్లు కిక్కిరిసిపోతున్నాయి. కుషాయిగూడ సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమి వేడుకలు శోభాయమానంగా సాగుతున్నాయి. ఉదయం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో సాయిని దర్శించుకుంటున్నారు. యాదగిరిగుట్ట సద్గురు శ్రీ షిర్డీ సాయినాథుని ఆలయంలో గురుపూర్ణిమ సంబరాలు వైభవంగావోపేతంగా సాగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు గురుపౌర్ణిమ సందర్భంగా సాయి విగ్రహాన్ని సర్వాంగసుందరంగా ఆలంకరించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో 1500 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

అటు ఏపీలోను గురుపౌర్ణమి
అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. దేశ, విదేశీ భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. కేంద్రఐటీ శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్‌, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌ చవాన్‌, ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతపురం మూడోరోడ్డులోని సాయిబాబా ఆలయంలో మంత్రి పరిటాల సునీత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని సాయిని కోరుకున్నట్లు తెలిపారు. అటు తాడిపత్రిలోని సాయి ఆలయాలు భక్తులతో కిక్కిరిసాయి. ఉదయం కాగడా హారతితో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. 

09:03 - July 3, 2017

అమెరికా : లోయలో మినీ బస్సు పడి తెలంగాణ యువకుడు మృతి చెందాడు. మృతుడు భువనగిరికి చెందిన పోత్నక్ ప్రదీప్‌గా గుర్తించారు. 28వ పుట్టిన రోజు జరుపుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఏడాదిన్నర క్రితమే ప్రదీప్‌ వివాహం చేసుకున్నాడు. భార్య కార్తీక సహా మరో నలుగురికి కూడా గాయాలయ్యాయి. ప్రదీప్‌ మరణవార్త విన్న కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. 

14:49 - June 29, 2017

యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో మంచినీరు అనుకుని ఇద్దరు విద్యార్థులు యాసిడ్‌తాగి ఆస్పత్రి పాలయ్యారు. యాసిడ్‌తాగి గాయాలపాలైన విద్యార్థులు సాగర్‌, మణి లను ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. విద్యార్థులు చదువుతున్న స్కూల్‌లోనే వారి నాన్నమ్మ ఆయాగా పనిచేస్తోంది.

14:55 - June 27, 2017

పశ్చిమ గోదావరి : జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రు దళితుల బహిష్కరణ విషయాన్ని టెన్ టివి వెలుగులోకి తెవడంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. దళితుల బహిష్కరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాలకోడేరు ఎమ్మార్వో రత్నమణి, ఎస్సై రాంబాబు, వీఆర్వో లను కలెక్టర్ సస్పెండ్ చేశారు. గరగపర్రు గ్రామంలో మంత్రులు నక్కా ఆనంద్ బాబు, జవహర్ పర్యటించారు. మరో వైపు దోషులను రేపు ఉదయం 9గంటలలోపు అరెస్ట్ చేయ్యాలని, లేకుంటే నీరహాదీక్షకు దిగుతానని మాజీ ఎంపీ హర్షకుమార్ హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

18:10 - June 25, 2017

యాదాద్రి భువనగిరి : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలల కాపురం తరువాత మోజుతీరిన మాయగాడికి కులం గుర్తుకొచ్చింది. నమ్ముకొని వచ్చిన ఇల్లాల్ని నట్టేట ముంచి పలాయనం చిత్తగించాడు. తాను మోసపోయానని తెలుసుకున్న యువతి భర్త కోసం 5ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉంది. 
ప్రేమ వివాహం
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతాళ్లగూడెంకు చెందిన ఈమె పేరు జ్యోతి. 2012లో ఈమెకు ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధం చూసి నిశ్చితార్థం జరిపించారు. అయితే జ్యోతి అదే గ్రామానికి చెందిన లింగస్వామి ప్రేమించుకున్నారు. కులాలు వేరుకావడంతో పెద్దల్ని ఎదిరించలేక ఇంట్లోంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో కాపురం పెట్టిన జ్యోతి, లింగస్వామిలు మూడునెలలు బాగానే ఉన్నారు. ఆ తరువాత లింగస్వామిలో మార్పు వచ్చింది. అకారణంగా కులంపేరుతో ఆమెను ధూషించడం, చేయి చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ తరువాత కొద్దిరోజులకు ఆమెను వదిలిపెట్టి తన ఇంటికి వెళ్లిపోయాడు. అత్తింటికి వెళ్లిన జ్యోతికి అగచాట్లే ఎదురయ్యాయి. కులం కానిదానివంటూ అత్తమామలు ఇంట్లోకి రానివ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది జ్యోతి. భర్త కావాలంటూ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. 
భర్త కోసం పోరాటం
ఐదేళ్లుగా భర్త కోసం ఎదురుచూసినా న్యాయం జరగకపోవడంతో రెండురోజుల క్రితం అత్తవారింటికి వచ్చింది. ఆమెను తిట్టిపోసిన అత్తమామలు ఇంటికి తాళం పెట్టి ఎటో పోయారు. అయినా సరే అక్కడే బైఠాయించిన జ్యోతి ఆందోళన చేస్తోంది. ఆమె ఆందోళనకు గ్రామస్తులు, ప్రజా సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. కేవలం కులం పేరుతో విడిచిపెట్టిన భర్తపై అధికారులు ఏం చర్యలు చేపడతారో.. జ్యోతికి ఏం న్యాయం చేస్తారో వేచి చూడాలి. 

 

17:00 - June 24, 2017

యాదాద్రి భువనగిరి : తెలంగాణ ప్రభుత్వం చేనేత, జౌళి కార్మికుల సంక్షేమానికి పాటుపడుతుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. భూదాన్‌ పోచంపల్లిలో నేతన్నకు చేయూత పథకాన్ని మంత్రి ప్రారంభించారు. త్వరలో భూదాన్‌ పోచంపల్లిలో నాలుగు ఎకరాల స్థలంలో అద్భుతమైన నేతబజార్‌ను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో చేనేత,  జౌళి మీద జిఎస్‌టిని ఉప సంహరించుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తుంటే అభినందించాల్సింది పోయి కొంతమంది నేతలు, పార్టీలు గొంతెత్తి అరుస్తున్నారని విమర్శించారు. 

13:32 - June 24, 2017
17:13 - June 23, 2017

యాదాద్రి : భువనగిరిలోని పద్మజా సంతాన సాఫల్య కేంద్రంలో డీఎంహెచ్ వో, ఆర్డీవో ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా సరోగసి నిర్వహిస్తున్నారన్న సమాచరంతో దాడులు జరిపారు. అద్దె గర్భం కోసం ఉంచిన 82 మహిళలను అధికారులు గుర్తించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలకు వీడియో చూడండి..

 

21:23 - June 19, 2017

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. వానల కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. వాగులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. తెలంగాణలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. ఈ మేరకు ఆదిలాబాద్‌ జిల్లాలోని... ఉట్నూరు ఏరియాలో భారీ వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల రోడ్లు కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో జహీరాబాద్‌, న్యాల్‌కల్‌, ఝరాసంగం, కోహీర్‌ మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. జహీరాబాద్‌ ప్రాంతంలోని పలు వాగులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు చేరింది. మహబూబ్‌నగర్‌ జిల్లా... బాదేపల్లి పట్టణంలో 10 సెంటి మీటర్ల వాన కురిసింది. దీంతో రోడ్లు, ప్రధాన వీధులు చెరువులను తలపిస్తున్నాయి. జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో భారీగా వర్షపు నీరు చేరి...తరగతి గదులన్నీ బురదమయంగా మారాయి.

వాగు దాటడానికి ప్రయత్నించి..
ఏకదాటిగా కురుస్తోన్న వానలకు మెదక్‌ జిల్లా సత్యగామ వాగు పొంగిపొర్లుతోంది. వాగును దాటడానికి ప్రయత్నించిన ఇద్దరు యువకులు బైక్‌తో సహా కొట్టుకుపోయారు. స్థానికులు తాడు సాయంతో యువకులను రక్షించారు. వికారాబాద్‌ జిల్లా.. పరిగిలో ఉదయం నుంచి భారీగా వర్షం పడుతుంది. పరిసర ప్రాంతాలలోని చిన్న వాగులు పొంగిపొర్లుతున్నాయి. నస్కల్‌ సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరిగి-వికారాబాద్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పిడుగు పడి పెద్దపల్లి జిల్లా... ఓదెల మండలం పొత్కపల్లి వద్ద రైల్వే సిగ్నల్‌ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. రోడ్లపై భారీగా నీరు చేరడంతో.. ద్విచక్ర వాహనదారులు, ఉద్యోగులు, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా మేడ్చల్‌ జిల్లా.. కీసర మండలం నాగరం గ్రామంలో గురుకుల పాఠశాల గదుల్లో నీరు చేరింది. విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కాగా మరో రెండు రోజులు పాటు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సీజన్‌ ప్రారంభంలోనే వర్షాలు పడటంతో.. రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

20:00 - June 13, 2017

యాదాద్రి భువనగిరి : తుర్కపల్లి మండలంలో భూమి కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో నలుగురుకు గాయాలయ్యాయి. వారంతా భువనగిరి ఏరియా ఆస్పత్రిలో చిరిత్స పొందుతున్నారు. తమ భూమిని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో...కావాలనే దాడి చేశారని భూ యజమాని నర్సయ్య అన్నారు. 1990లో ఆ భూమిని కొనుగోలు చేశామని.. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు.   

Pages

Don't Miss

Subscribe to RSS - Yadadri