Yadadri

12:28 - June 13, 2017

యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలో స్కూల్‌ బస్సుకు ప్రమాదం తప్పింది. మోత్కూరు శివారులో చెరువుకట్టపై వెళ్తున్న బస్సు టైర్ల బోల్టులు ఊడిపోయాయి. దీంతో బస్సు ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును నిలిపివేశాడు. లేకపోతే... బస్సు చెరువులోకి దూసుకెళ్లి ప్రమాదం జరిగి ఉండేది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 10 మంది విద్యార్ధులున్నారు. ప్రమాదం తప్పడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. 

17:51 - June 11, 2017

యాదాద్రి : ప్రేమోన్మాది శ్రీకాంత్‌ ఇంటి ముందు గాయాత్రి మృతదేహంతో ఆమె బంధువులు ఆందోళనకు దిగడంతో యాదాద్రి జిల్లా యాదగిరిపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన బంధువులు.. శ్రీకాంత్‌ ఇంటిపై దాడిచేశారు. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి, నిప్పుపెట్టారు. అప్రమత్తమైన పోలీసులు.. వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. అంతకుముందు యాదగిరిగుట్ట రోడ్డుపై గాయత్రి మృతదేహంతో జైగౌడ నాయకులు, బంధువులు ధర్నా చేశారు. శ్రీకాంత్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ధర్నాకు మహిళా సంఘాలు మద్దతుతెలిపాయి. నిందితుడిని ఉరితీయాలని డిమాండ్‌ చేశారు. మృతురాలి కుటుంబానికి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రేమోన్మాది శ్రీకాంత్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

16:47 - June 11, 2017

యాదాద్రి : యాదాద్రి జిల్లాలో అంతర్జాతీయ దోపిడీ ముఠాను రాచకొండ స్పెషల్‌ ఆపరేషన్‌ టీం పట్టుకుంది.. చౌటుప్పల్‌లో వాహనాలను తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఈ ముఠాతీరు అనుమానాస్పదంగా కనిపించింది.. వెంటనే ఏడుగురిని అదుపులోకితీసుకున్న పోలీసులు.. వారిదగ్గరనుంచి కారు, మోటార్ బైక్, ఆరు డాగర్లు, రెండు కత్తులు, ఐదు కత్తెరలు, ఒక స్క్రు డ్రైవర్, ఎనిమిది మొబైల్ ఫోన్లు, 71వేల 300 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.. అరెస్టయినవారు మహారాష్ట్రకు చెందిన పార్ధి, షికారి గ్యాంగ్ అని.. దొంగల్లో ఇద్దరు మైనర్లున్నారని పోలీసులు చెప్పారు.

16:01 - June 11, 2017

యాదాద్రి : నిన్న హత్యకు గురైన గాయత్రి మృతదేహనికి పొస్టుమార్ట పూర్తయింది. ప్రేమోన్మాది శ్రీకాంత్ శిక్షించాలనే డిమాండ్ తో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. గ్రామ పెద్దల హామీతో గాయత్రి కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.అలాగే నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ భువనగిరి జిల్లా వద్ద మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. దీంతో ఆస్పత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. అనంతరం గాయత్రి మృతదేహాన్ని యాదగిరిగుట్టకు తరలించారు. 

15:55 - June 11, 2017

యాదాద్రి : ప్రేమోన్మాదానికి బలైన గాయత్రి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ భువనగిరి జిల్లా వద్ద మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. దీంతో ఆస్పత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. 

21:43 - June 10, 2017

యాదాద్రి : ఈ కన్నతండ్రి ప్రశ్నలకు సమాధానం ఏది..?? ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుని కూతురిని ఓ ఇంటికి ఇచ్చి బాధ్యత తీర్చుకోవాలనుకున్న ఆ కన్నవారికి మిగిలింది శోకమేనా...! ఇది ఒక్క తండ్రి మాట కాదు..ఇప్పటికే ఎందరో కన్నతండ్రులు ప్రశ్నిస్తున్నవే... కూతుళ్లు కళ్ల ముందు చనిపోతుంటే చూస్తూ కూడా ఏదీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఎందరో కన్నతండ్రుల మూగరోదనకు సమాధానం ఏది..? ఎన్నో కుటుంబాల్లో విషాదానికి కారణమవుతుంది ప్రేమ. ప్రేమ పేరుతో మోసం చేస్తున్నవారేగాకుండా...అదే ప్రేమ కోసం పిచ్చివాళ్లుగా మారి ఉన్మాదులుగా తయారయి ప్రాణాలు తీస్తున్నారు.యాదాద్రి జిల్లా యాదగిరిపల్లిలో దారుణం జరిగింది... ప్రేమోన్మాది ఘాతుకానికి మరో అమాయకురాలు బలయింది.... గ్రామంలోని గాయత్రి అనే యువతిని ప్రేమిస్తున్నానంటూ కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ వెంటపడుతున్నాడు..అతని ప్రేమను నిరాకరించినందుకు కక్షగట్టాడు..ఇదే సమయంలో గాయత్రికి పెళ్లి చేయాలని నిర్ణయించిన పెద్దలు సంబంధం ఖాయం చేసుకున్నారు.

కొన్ని గంటల్లో నిశ్చితార్థం
సరిగ్గా కొన్ని గంటల్లో గాయత్రికి నిశ్చితార్థం పెట్టుకున్నారు....ఆ ఏర్పాట్లలో కన్నవారు ఉండగా ఇది తెలుసుకున్న శ్రీకాంత్ ఇంటికి వచ్చి గొడవపడ్డాడు..ముందుగానే అనుకున్నట్లు కత్తితో వచ్చిన ఆ దుర్మార్గుడు గాయత్రిని పొడిచాడు...వెంటనే గాయత్రిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. విషయం తెలిసిన పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు...గాయత్రి హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

17:20 - June 10, 2017

యాదాద్రి : యాదగిరిగుట్టలో దారుణం జరిగింది. ప్రియురాలు గాయత్రిని ప్రియుడు శ్రీకాంత్ కత్తితో పొడిచాడు. గాయత్రిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. శ్రీకాంత్, గాయత్రి గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి పెళ్లి విషయమై ఇరువురి తల్లిదండ్రలు చర్చించారు. శ్రీకాంత్ ఏ ఉద్యోగం లేదు కాబట్టి అమ్మాయి తరుపువారు పెళ్లి నిరాకరించారు. అంతేకాకుండా గాయత్రి మరో వ్యక్తితో పెళ్లి ఒప్పుకుంది. ఆ వ్యక్తితో రేపు ఎంగెజ్ మెంట్ జరుగనుంది. ఈ రోజు మధ్యాహ్నాం 2గంటల సమయంలో గాయంత్రి ఇంటి వచ్చిన శ్రీకాంత్ వచ్చి కత్తితో ఎడు పోట్లు పొడవడంతో గాయత్రి తమ్ముడు అరవడంతో చుట్టుపక్కలవారు వచ్చి ఆసుపత్రికి తరలించారు. తనకు దక్కాంది మరో వ్యక్తి దక్కకుండా గాయత్రిని చంపినట్లు తెలిసింది. నిందితుడు స్థానిక పోలీసు స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం. 

11:43 - June 10, 2017

యాదాద్రి భువనగిరి : కులదురహంకారంతో హత్యలు చేస్తున్న వారిని సామాజిక బహిష్కారం చేయాలని సీపీంఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. యాదాద్రిజిల్లా భువనగిరిలో జరిగిన  సభలో పెద్ద ఆయన పాల్గొన్నారు. నరేశ్‌ అంబోజి కుటుంబానికి వామపక్షాలు, ప్రజాసంఘాలు బాసటగా నిలుస్తాయని.. న్యాయం జరిగే వరకు , నిందితులకు శిక్షలు పడేవరకు పోరాటం చేస్తామన్నారు ప్రజాసంఘాల నేతలు.
భువనగిరిలో భారీ బహిరంగసభ 
అంబోజు నరేశ్‌..స్వాతిల హత్యలను నిరసిస్తూ వామపక్షాలు, 83 ప్రజాసంఘాలు భువనగిరిలో కదంతొక్కాయి. పట్టణంలోని జగ్జీవన్‌రామ్‌ విగ్రం వద్ద  పౌర, సామాజిక, ప్రజాసంఘాల పేరుతో బహిరంగసభను నిర్వహించారు. నరేశ్‌-స్వాతిల హత్యపై సమగ్ర న్యాయవిచారణ జరిపించాలని, నరేశ్‌కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 
నరేశ్...స్వాతి హత్యలను కులాల ఘర్షణగా చిత్రించే కుట్ర..!
నరేశ్.. స్వాతిల హత్యను కులాల మధ్య సంఘర్షణగా చిత్రించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని.. అలాంటి కుట్రలను విఫలం చేయాలన్నారు  సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం. నరేశ్‌ కుటుంబానికి న్యాయం జరిగేవరకు వామపక్షాలు రాజీలేని పోరాటం చేస్తాయని తేల్చి చెప్పారు. దీనికోసం మిగతా రాజకీయపార్టీలను, యాద్రాద్రిజిల్లా  టీఆర్‌ఎస్‌ నాయకులను కూడా కలుపుకుని పోరాడతామన్నారు.
నిందితులకే వత్తాసు పలుకుతున్న పోలీసులు
కులదురహంకారంతో జరిగిన స్వాతి నరేశ్‌ల హత్యలను ప్రజలందరూ ఖండించాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి. పోలీసు వ్యవస్థసైతం నిందితుల పక్షం వహించడంపై ప్రజాసంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రక్షణలేకుండా పోయిందని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయన్నారు.  మేజర్లైన యువకులు తమకు నచ్చిన వారిని పెళ్లిచేసుకునే హక్కును .. ఆదిపత్యకులాల ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని విమర్శించారు. 
ప్రజాసంఘాలు ధర్నా 
అంతకు ముందు ప్రజాసంఘాలు ధర్నాకు దిగాయి. సభాప్రాంగణానికి ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించి.. నరేశ్‌కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌  చేశారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ స్థంభించింది. నిందితుడు శ్రీనివాసరెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్న  రామన్నపేట సీఐ శ్రీనివాస్‌, భువనగిరిపట్టణ సీఐ  శంకర్‌గౌడ్‌లపై హత్యకేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కేసు విచారణకు ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాలని,  నరేశ్‌ కుటుంబానికి 25లక్షల రూపాయలు, 3ఎకరాలభూమిని  పరిహారంగా 
ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 
కులాంతర వివాహ రక్షణ చట్టం తేవాలి
ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ స్వాతి-నరేశ్‌ల హత్యపై ఉన్నత స్థాయి దర్యాప్తును చేపట్టి.. తెలంగాణలో సామాజిక న్యాయాన్ని బతికించాలని వామపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.  భవిష్యత్తులో ఇలాంటి కులదురహంకార హత్యలు జరగకుండా.. కులాంతర వివాహాల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. లేదంటే.. పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. 

 

18:41 - June 9, 2017
16:52 - June 9, 2017

యాదాద్రి భువనగిరి : నరేష్..స్వాతి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. దోషులును కఠినంగా శిక్షించాలన్నారు. బాధితులకు భారీగా నష్టపరిహారం ఇప్పించాలని చెప్పారు. ఈమేరకు ప్రజాసంఘాలు యాద్రాద్రి భువనగిరిలో నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొని, మాట్లాడారు. నరేష్ హత్యను కులాల మధ్య సంఘర్షణగా చూపించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని అన్నారు. శ్రీనివాస్ రెడ్డి ఆఖరుకు సొంత కూతురిని చంపేశాడని... ప్రజలే అతన్ని శిక్షిస్తారని చెప్పారు. అతన్ని ఒంటరి కుక్కను చేయాలని సూచించారు. శ్రీనివాస్ రెడ్డి వంటి కుల అహంకారిని శిక్షించేందుకు అన్ని కులాలు ఏకం కావాలని పిలపునిచ్చారు. శ్రీనివాస్ రెడ్డి లాంటి వారిని సహాయ నిరాకరణతో సమాజమే శిక్షించాలని కోరారు. చట్టం, పోలీసులు ఉన్మోళ్ల చుట్టాలైపోయాయని ఆరోపించారు. అగ్రకులంలో అహంకారం ఉండొద్దని.. అగ్రకులస్తులకూ అహంకారం ఉండకూడదన్నారు. అమానవీయంగా ఘటన జరిగితే స్పందించవద్దా...? ఈ హత్య ఘటనను తేలికగా వదిలిపెట్టవద్దన్నారు. నరేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ఉద్యమం ఆగదని పేర్కొన్నారు. ఉద్యమంలో సీపీఎం ముందుంటుందని తెలిపారు. భువనగిరిలో వ్యక్తమవుతున్న ప్రజాగ్రహాన్ని సీఎం గుర్తించాలన్నారు. ఘటనపై సీఎంను కలవాలన్నారు. సామాజిక తెలంగాణ మాటలు ఉత్త మాటలు కావని..సీఎం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.  

Pages

Don't Miss

Subscribe to RSS - Yadadri