Yadadri

11:10 - February 4, 2018

యాదాద్రి : ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గత ప్రభుత్వాలు హయాంలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని.. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తుందన్నారు. మేడారం నుంచి తిరిగి వస్తుండగా యాదాద్రి లక్ష్మినరసింహ్మ స్వామి వారిని తలసాని దర్శించుకున్నారు. యాదాద్రి అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టారన్నారు

11:35 - February 3, 2018

 

హైదరాబాద్ : యాదాద్రి జిల్లా చిన్న కందుకూరు గ్రామంలో దళితులపై దాడి జరిగి నెల రోజులవుతోంది..ఇప్పటి వరకు బాధితులకు న్యాయం జరగలేదు. ఇప్పటికీ ఆ దళిత వాడల్లో ఉన్న దళితులు ఎప్పుడు ఏం జరగుతుందా ? అని బిక్కుబిక్కుమంటున్నారు. దళితులకు అభయం కల్పించేందుకు..వారికి ధైర్యం చెప్పేందుకు బీఎల్ఎఫ్...టీ మాస్ నేతలు నడుం బిగించారు. శుక్రవారం వారి గ్రామానికి వెళ్లి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా టెన్ టివి బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేసింది.

గో మాంసం తిన్నారనే నెపంతో ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారని దళితులు పేర్కొంటున్నారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా తమపైనే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారని దళితులు వాపోతున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

21:41 - February 2, 2018

యాదాద్రి భువనగిరి : జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరులో దాడికి గురైన దళితులకు టీమాస్‌, బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ అండగా నిలిచింది. దళితులపై దాడి జరిగి నెలరోజులవుతున్నా... ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన బాటపట్టింది. వెంటనే బాధ్యులైన వారిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని నేతలు హామీ ఇచ్చారు. ఉదయం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి టీ-మాస్‌, బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ నేతలు ర్యాలీగా కందుకూరుకు బయల్దేరారు. అనంతరం బాధిత దళితులకు అండగా... గ్రామంలో సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, టీ-మాస్‌ చైర్మన్‌ కంచ ఐలయ్య, కన్వీనర్‌ జాన్‌వెస్లీ, బీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ నల్లా సూర్యప్రకాశ్‌, టీమాస్‌ నేతలు పాల్గొన్నారు.

దళితులు, మైనారిటీలపై దాడులు 
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, మైనారిటీలపై దాడులు ఎక్కవయ్యాయన్నారు తమ్మినేని. తెలంగాణలోనూ కుల దురహంకార హత్యలు, కుల బహిష్కరణలు జరుగుతున్నాయన్నారు. అయితే... ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. దళితులకు అండగా నిలిచి మనోదైర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తున్న తమను అడ్డుకునేందుకు ప్రయత్నించారని... పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారన్నారు తమ్మినేని. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు కంచ ఐలయ్య. బాధ్యులను అరెస్ట్‌ చేసే వరకు దళితులకు అండగా నిలబడతామన్నారు. మరోవైపు బాధ్యులను అరెస్ట్‌ చేయని పోలీసులు.. బాధితులను బెదిరిస్తూ కేసులు పెడుతున్నారన్నారు నల్లా సూర్యప్రకాశ్‌. ఇకపై ఇలాంటి దాడులు జరిగితే సహించేది లేదన్నారు. సభకు హాజరైన టీ-మాస్‌, బీఎల్‌ఎఫ్‌ నేతలంతా దళితవాడలో పర్యటించి.. దళితులతో కలిస సహపంక్తి బోజనాలు చేశారు. టీ-మాస్‌, బీఎల్‌ఎఫ్‌ నేతలు అండగా నిలబడడంతో.. తమకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం బాధిత దళితుల్లో వ్యక్తమవుతోంది. 

18:12 - February 2, 2018

యాదాద్రి : జిల్లా చిన్నకందుకూరులో దళితులపై ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల దాడికి నిరసరగా గ్రామంలో ప్రతిఘటన సభ నిర్వహిస్తున్న టీ మాస్ ఫోరం, బీఎల్‌ఎఫ్‌ నేతలపై యాదగిరిగుట్ట సీఐ అశోక్‌కుమార్‌ జులుం ప్రదర్శించారు. ప్రతిఘటన సభకు అనుమతిలేదంటూ మైక్‌ కట్‌ చేసి దురుసుగా ప్రదర్శించారు. దుర్భాషలాడారు. సీఐ బెదిరింపులకు ఫోన్‌లో చిత్రీకరిస్తున్న నవతెలంగాణ రిపోర్టర్‌ రామకృష్ణపై దాడికి దిగారు. ఫోన్‌ లాక్కున్నారు. 

13:30 - February 2, 2018

యాదాద్రి : యాదగిరిగుట్ట సీఐ అశోక్ కుమార్ జులుం ప్రదర్శించారు. బీఎల్ఎఫ్..టీమాస్ నేతలపై దురుసుగా ప్రవర్తించారు. చిన్నకందుకూరు టీ మాస్..బీఎల్ఎఫ్ సభకు అనుమతి లేదంటూ సీఐ మైక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న నేతలతో వాగ్వాదం చోటు చేసుకుంది. సీఐ చర్యలను నేతలు ఖండించారు. సీఐ దురుసు ప్రవర్తనను నవతెలంగాణ రిపోర్టర్ పై కూడా సీఐ జులుం ప్రదర్శించారు. దీనిపై నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు సీఐని మందలించినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు వెనక్కి తగ్గడంతో సభ ప్రశాంతంగా జరుగుతోంది.

జనవరి 14 వ తేదీన ఆర్ఎస్ ఎస్ కు చెందిన కొంతమంది దళిత కుటుంబాలపై దాడి చేసిన ఘటన అప్పట్లో కలకలం రేగింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల బీఎల్ఎఫ్, టీ మాస్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ప్రతిఘటన సభ ఏర్పాటు చేసి..దళితులకు మద్దతు తెలియచేయాలని...బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీ మాస్..బీఎల్ఎఫ్ డిమాండ్ చేస్తోంది. 

13:26 - January 30, 2018

యాదాద్రి : జిల్లా చౌటుప్పల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. హనుమాన్ నగర్, బంగారుగడ్డలో పోలీసులు సోదాలు చేశారు. పోలీసులు ఆరుగురు అనుమానితులను అరెస్టు చేశారు. 3 బెల్ట్ షాపుల్లో 47 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే 65 బైక్ లు, 6 కార్లు, 3 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేశారు. 

20:58 - January 26, 2018

హైదరాబాద్ : వాడవాడలా.... మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. పిల్లలు, పెద్దలు.. గణతంత్ర దినోత్సవంలో భాగమై...దేశ భక్తిని చాటుకున్నారు. ప్రముఖులు జెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగం గొప్పదనాన్ని.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ కృషిని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దలు, ప్రముఖులు ఈ సంబరాల్లో భాగమయ్యారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ... రిపబ్లిక్‌ డే వేడుకలు అట్టహాసంగా సాగాయి. ముఖ్యమంత్రి అధికార నివాసం.. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి.. వందనం చేశారు. హైకోర్టులో యాక్టింగ్‌ చీఫ్‌ జస్టీస్‌ రమేశ్‌ రంగనాథన్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్సీ రామచందర్‌రావు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయంలో ఘంటా చక్రపాణి.. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి జాతీయ పతకాన్ని ఎగురవేశారు.శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సీఈవో ఎస్‌జీకే కిషోర్‌ జెండాను ఆవిష్కరించారు.

రిపబ్లిక్‌ డే.. సందర్భంగా.. చంచల్‌గూడ జైళ్ల శాఖ మైదానంలో డీజీ వినయ్‌ కుమార్‌ సింగ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి.. విధుల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు అవార్డులు అందజేశారు. అలాగే గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ రఘునందన్ రావు.. జెండాను ఆవిష్కరించి గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు.

అదేవిధంగా... సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. భాగమయ్యారు. జాతీయజెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ చేసిన కృషిని కొనియాడారు. టీజేఏసీ కార్యాలయంలోనూ రిపబ్లిక్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. చైర్మన్‌ కోదండరామ్‌ జాతీయజెండాను ఎగురవేశారు. జనసేన పార్టీ కార్యాలయంలోనూ రిపబ్లిక్ డే సంబరాలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి.. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా... తెలంగాణాలోని అన్ని జిల్లాలలో... ప్రభుత్వ కార్యాయాల్లో రిపబ్లిక్‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా.. ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను ప్రశంసా పత్రాలను అందించడం జరిగింది. కామారెడ్డి జిల్లా.. నిజాంసాగర్‌ మండలకేంద్రంలో .. మనకోసం మనం అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వెయ్యి అడుగుల జాతీయజెండాను ఊరేగించారు.

ఏపీలోనూ... ప్రజలు జాతీయ జెండా ఆవిష్కరించి.. గణతంత్ర దినోత్సవాన్ని అట్టహాసంగా జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా వినూత్నంగా భారీ జాతీయ జెండాలను ఊరేగించారు. నెల్లూరు జిల్లా.. ఓజిలి మండలం సగుటూరులో వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి.. గౌరవ వందనం చేశారు. స్వీట్స్‌ పంచిపెట్టి ఆనందం వ్యక్తం చేశారు. అలాగే కడపలో .. నారాయణ పాఠశాల విద్యార్థులు దాదాపు 365 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. కర్నూలు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లోనూ, కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలోనూ.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా.. పశ్చిమగోదావరి జిల్లా.. జంగారెడ్డి గూడెంలో విద్యా వికాస్‌ పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో 400 అడుగుల జాతీయ జెండాతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అదే విధంగా.. ఒంగోలు, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోనూ రిపబ్లిక్‌ డేను.. ఘనంగా నిర్వహించారు.

ప్రతి చోట గణతంత్ర దినోత్సవం .. ఉత్సాహంగా జరిగినప్పటికీ... కొన్ని చోట్ల చిన్న చిన్న లోపాలు తలెత్తాయి. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ మున్సిపల్‌ కార్యాలయంలో.. శానిటేషన్ కార్మికులు రాకుండానే.. కమిషనర్‌ జెండా ఎగురవేయడంపై.. కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయం ముందు కూర్చోని నిరసన తెలిపారు. అలాగే కామారెడ్డి జిల్లా.. ఎల్లారెడ్డిలో ఆర్డీవో కార్యాయలంలో జెండా ఎగురకపోవడంతో... ఆవిష్కరణలో కాస్త ఆలస్యం జరిగింది.

10:18 - January 21, 2018

యాదాద్రి : కామాంధులు రెచ్చిపోతున్నారు. పసిపిల్లలపై దారుణంగా ప్రవర్తిస్తున్నారు. సభ్యసమాజం తలదించుకొనే ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలికపై కామాంధుడు రెచ్చిపోయాడు. రాజుపేట మండలంలోని బేగంపేటలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. తల్లిదండ్రులు పోలానికి వెళ్లిన సమయంలో కాంపౌడర్ గా పనిచేసే మహేష్ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితమే జరిగినట్లు సమాచారం. జ్వరంతో బాధ పడుతుండగా తల్లిదండ్రులు ఆరా తీయగా ఈ ఘోరం బయటపడింది. అత్యాచారం చేసిన మహేష్ పై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

18:15 - January 19, 2018

యాదాద్రి : పేదలకు కేసీఆర్‌ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ఆర్‌డీవో కార్యాలయం ఎదుట టీమాస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అర్హులైన పేదలకు నివాస గృహాలు, నివాస స్థలాలను ఇవ్వాలని పేదలు ధర్నాకు దిగారు. నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. అనంతరం ఆర్‌డీవోకు మెమోరాండం అందజేశారు. హామీలను వెంటనే అమలు చేయాలని.. లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని టీమాస్‌ నేతలు కల్లూరి మల్లేష్‌, ఆనగంటి వెంకటేష్ హెచ్చరించారు.  

18:51 - January 18, 2018

యాదాద్రి : సంక్రాంతి పండగరోజు ఆవుమాంసం తిన్నారని దళితులపై జరిగిన దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామంలో చోటుచేసుకున్న ఈ దాడికి నిరసనగా టీమాస్‌ కన్వీనర్‌ జాన్‌ వెస్లీ ఆధ్వర్యంలో.. యాదగిరిగుట్టలో ధర్నా నిర్వహించారు. ఆర్ఎస్‌ఎస్‌ వాదులు గోరక్షక పేరుతో చేస్తున్న దాడులకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని ధర్నాలో పాల్గొన్న నాయకులు విమర్శించారు. దీనిపై పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై వారు తీవ్రంగా మండిపడ్డారు.

Pages

Don't Miss

Subscribe to RSS - Yadadri