దేశంలోనే ఫస్ట్ : ఏపీలో గిరిజనుల కోసమే ఓ జిల్లా

Submitted on 17 July 2019
ntr, alluri sita rama raju names for new districts

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం చర్చనీయాంశంగా మారింది. జగన్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది. ఏపీ మండలిలో కొత్త జిల్లా ఏర్పాటు అంశం ప్రస్తావనకు వచ్చింది. సభ్యులు పలు సూచనలు చేశారు. కొత్త జిల్లాలకు ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, ఫూలే వంటి మహనీయుల పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం.. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందించే లక్ష్యంతో రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును ప్రభుత్వం పరిశీలిస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వివరించారు. జిల్లాల ఏర్పాటుకు ముందే ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని సభ్యులు సూచించారు. కమిటీ ద్వారా అధ్యయనం చేయటం లేదా అఖిలపక్షం ద్వారా సలహాలు స్వీకరించాలని కోరారు.

ప్రత్యేకంగా గిరిజన జిల్లా ఏర్పాటు చేసే క్రమంలో పరిపాలన సౌలభ్యంగా ఉండేలా జిల్లా కేంద్రాన్ని ఎంపిక చేయాలని ఎమ్మెల్సీలు సంధ్యారాణి, సోము వీర్రాజు సూచించారు. గిరిజన నియోజకవర్గాలను కలిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొత్త జిల్లాలకు ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, ఫూలే వంటి మహనీయుల పేర్లు పెట్టాలని ఎమ్మెల్సీ రాము సూర్యారావు డిమాండ్ చేశారు.

కొత్త జిల్లాల ఏర్పాటు అంశం ఇంకా ప్రతిపాదన స్థాయిలోనే ఉందని మంత్రి పిల్లి సుభాష్ స్పష్టం చేశారు. సభ్యుల సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లోని జనాభా, భౌగోళిక పరిస్థితులు, చారిత్రక నేపథ్యం, ఆదాయం, సంస్కృతి వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.

ఏపీలో ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి. అవి డబుల్ కానున్నాయని సమాచారం. లోక్ సభ నియోజకవర్గాల ప్రకారం జిల్లాల విభజన జరగాలన్న డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సీఎం జగన్ కొత్తగా 12 జిల్లాలు ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఫలితంగా ఏపీలో జిల్లాల సంఖ్య 25 కానుంది.

ఓ గిరిజన జిల్లా కూడా ఏర్పాటు చేయాలని జగన్ ఆసక్తిగా ఉన్నారట. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మధ్య ఏజెన్సీలో ఆ జిల్లా ఏర్పాటవుతుందని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. ఆ జిల్లాతో కలిపి 26 జిల్లాలు కాబోతున్నాయని చెబుతున్నారు. అంటే జిల్లాల సంఖ్య "డబుల్" కానుందని చెప్పుకుంటున్నారు.

New Districts
Andhra Pradesh
NTR
alluri sitarama raju
phule
25 districts
26 districst
pilli subash chandra bose

మరిన్ని వార్తలు