ఉల్లిపాయల కోసం సాటి మనిషి ప్రాణాన్ని పట్టించుకోని ఘటన వైరల్..

16:37 - November 3, 2018

మహారాష్ట్ర : మనిషి మానవత్వాన్ని విడిచి దానవత్వంలోకి పోతున్నాడా? ఆది మానవుడుగా తిరోగమనంలోకి పోతున్నాడా? మనిషి ప్రాణం కంటే వస్తువులకు, ఆస్తులకు విలువనిస్తున్నాడా? సాటి మనిషి ప్రాణం పోతున్న సమయంలో కూడా స్వార్థంలో పడిన మనిషి దానవుడుగా మారిపోతున్నాడు. దీనికి ఎన్నో రోడ్డు ప్రమాదాలు సాక్ష్యాలుగా నిలిచాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సాటి మనిషి ప్రాణాల కోసం కొట్టుకులాడుతుంటే..అది మరచి సెల్ఫీలు తీసుకోవటమే టెక్నాలజీకి నిదర్శనమా? అని అనుమానం రాక మానదు. ప్రమాదానికి లోనైన మనిషి ప్రాణాలు కాపాడాల్సింది పోయి మనకెందుకులే అనుకుని వెళ్లిపోయేవారు కొందరైతే..ప్రమాదంలో ఉన్న వ్యక్తి దగ్గరి వస్తువులు తీసుకుని వెళ్తుంటారు మరికొందరు.

Image result for onion truck accident రోడ్డు ప్రమాదం జరిగి ఓ ట్రక్కు డ్రైవర్‌ ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. అతడ్ని ఏమాత్రం పట్టించుకోని జనం ఆ ట్రక్కు నుంచి పడిపోయిన ఉల్లిగడ్డలు ఎత్తుకెళ్లారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పుణె నుంచి ఉల్లి లోడ్‌తో ముంబయి వెళ్తున్న ఓ ట్రక్కు లోనావ్లా ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. వాల్వన్‌ బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న ట్రక్కు ఒక్కసారిగా అదుపుతప్పి వంతెనపై నుంచి పుణె-ముంబయి పాత హైవేపై పడింది. ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించి స్థానికులు వెంటనే అక్కడ గుమిగూడారు. అయితే వారి దృష్టి గాయపడిన డ్రైవర్‌ మీద కాకుండా ట్రక్కు నుంచి పడిపోయిన ఉల్లిగడ్డల మీద పడింది.
ఇంకేముంది డ్రైవర్‌ను పట్టించుకోని స్థానికులు తమకు దొరికినన్ని ఉల్లిగడ్డలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఉల్లిగడ్డల ట్రక్కు బోల్తా పడిందన్న వార్త దావానలంలా వ్యాపించిందని, దీంతో స్థానికులు సంచులు తెచ్చుకుని మరి ఉల్లిగడ్డలను ఎత్తుకెళ్లారని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటో ఒకటి తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
 

Don't Miss