వారిద్దరి సంబంధం నిజమే, కానీ పల్లవి ఆరోపణలు నిజం కాదు : అక్బర్ భార్య

21:22 - November 2, 2018

 ఢిల్లీ : మీటూ ఉద్యమంలో భాగంగా మాజీ కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌పై  జర్నలిస్ట్ పల్లవి గొగోయ్ చేసిన ఆరోపణలపై అక్బర్ భార్య మల్లికా అక్బర్  స్పందించారు. పల్లవి గొగోయ్ చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. మంత్రి ఎంజే అక్బర్ గతంలో తనపై అత్యాచారం చేశారని ఎన్ఆర్ఐ మహిళ పల్లవి గొగొయ్ ఆరోపణలను ఖండించిన అక్బర్, పరస్పర అంగీకారంతో తమ మధ్య సంబంధం కొన్ని నెలలు కొనసాగిందని వివరణ ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్బర్ భార్య మల్లికా అక్బర్ కూడా స్పందించారు.  

తన భర్తపై ‘మీటూ’ ఆరోపణలు వస్తున్నా ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, కానీ, పల్లవి చేసిన ఆరోపణల నేపథ్యంలో తాను పెదవి విప్పక తప్పడం లేదని అన్నారు. కొన్నేళ్ల కిందట పల్లవి తమ కుటుంబంలో చిచ్చుపెట్టిందని చెప్పారు. తన భర్తకు అర్ధరాత్రి సమయంలో ఫోన్ కాల్స్ చేయడం, పబ్లిక్ గా వీళ్లిద్దరూ సన్నిహితంగా ఉండటంతో వాళ్లిద్దరి మధ్య సంబంధం తనకు తెలిసిందని అన్నారు. 
తమ ఇంట్లో జరిగిన ఓ పార్టీలో తన భర్త, ఆమె కలిసి డ్యాన్స్ చేయడం తనను బాధించిందని, ఈ విషయమై నాడు తన భర్తను నిలదీసాననీ దీనికి ఆయన ఇకపై కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తానని తన భర్త మాట ఇచ్చిన విషయాన్ని పల్లవి గొగొయ్, తుషితా పటేల్ ఇద్దరూ తమ నివాసానికి తరచుగా వస్తుండేవారని మల్లికా అక్బర్ చెప్పుకొచ్చారు.
 

Don't Miss