జనసేనపై ఎందుకింత కక్ష : ఉన్న ఒక్క ఎమ్మెల్యేని లాక్కోవాలని చూస్తున్నారు

Submitted on 14 August 2019
pawan kalyan criticise on jagan government

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో డబ్బు పంచి గెలిచారని ఆరోపించారు. ఎన్నికల్లో డబ్బు పంచడం వైసీపీకి మాత్రమే సాధ్యమైందన్న పవన్.. అందుకే ఆ పార్టీ అధికారంలో ఉందని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలోని పార్టీ నేతలతో బుధవారం(ఆగస్టు 14,2019) పవన్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి జనసేనపై కక్ష ఎందుకు అని పవన్ ప్రశ్నించారు. ఉన్న ఒక్క జనసేన ఎమ్మెల్యేనూ లాక్కునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రాపాకపై 5 నుంచి 7 కేసులు పెట్టారన్నారు. 
సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో ఎందుకు వేగం లేదు, పురోగతి లేదు అని పవన్ నిలదీశారు. జర్నలిస్టుపై దాడి చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేపై కేసు ఎందుకు పెట్టలేదని, చర్యలు ఎందుకు తీసుకోలేదని అడిగారు. తనను రెచ్చగొట్టొద్దన్న పవన్.. ఎంతవరకైనా పోరాడతానని హెచ్చరించారు. మూడేళ్ల నుంచి పోరాటం చేసి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేవాళ్లమని పవన్ అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వంపై 100 రోజుల తర్వాత విమర్శలు చేద్దామని అనుకున్నా.. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు వేరుగా ఉన్నాయని, అందుకే మాట్లాడాల్సి వస్తోందని పవన్ అన్నారు. తన సోదరుడు చిరంజీవిని ఏడిపించినట్టే తననూ కొంతమంది నేతలు ఏడిపించారని పవన్ వాపోయారు. తాను మాత్రం మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను అని స్పష్టం చేశారు. మా హక్కులు కాలరాస్తే చూస్తూ ఊరుకునేది లేదన్న పవన్.. ప్రభుత్వం మెడలు వంచే సత్తా జనసేనకి ఉందన్నారు. 100 రోజుల మా మౌనాన్ని మీరే బ్రేక్ చేశారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. చిన్న విషయానికే జనసేన ఎమ్మెల్యేపై కేసు పెట్టారని సీరియస్ అయ్యారు.

Pawan kalyan
janasena
Government
Money
Elections
cm jagan
Eluru
mla rapaka varaprasad

మరిన్ని వార్తలు