పిట్టల్లా రాలుతున్న రైతులు

12:11 - October 12, 2017

 

నాగపూర్ : భారతీయులకు వ్యవసాయమే ప్రధాన వృత్తి. ఎక్కువ శాతం మందికి ప్రజలకు వ్యవసాయరంగమే జీవనోపాధి కల్పిస్తోంది. జనాభాలో సగం మందికి పైగా వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇలాంటి రంగంలో సహజ ఎరువుల వినియోగం తగ్గిపోయి పెస్టిసైడ్స్‌ వాడకం పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తులను ఆశించిన స్ధాయిలో పొందేందుకు క్రిమి సంహారక మందులు, కలుపు మందులు విరివిగా వాడుతున్నారు. పంటను కాపాడుకోవాలనే తాపత్రయంతో.. అవసరానికి మించి క్రిమిసంహారక మందులను వాడుతున్నారు. అవే వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి.

బలవంతంగా అంటగడుతున్నారు....పెస్టిసైడ్స్‌ వినియోగం పెరగడంతో.. వ్యాపారులు దీన్నీ తమ లాభార్జనకు.. వంచనకు మార్గంగా ఎంచుకుంటున్నారు. నకిలీ పురుగు మందులు.. నాణ్యత లేని, ప్రమాదకర పెస్టిసైడ్స్‌ను.. రైతులకు బలవంతంగా అంటగడుతున్నారు. వీటిని వినియోగించే క్రమంలో రైతులు రకరకాల రుగ్మతలకు లోనవుతున్నారు. పెస్టిసైడ్‌ వల్ల రోగాల పాలై చనిపోయిన రైతులు చాలా మందే ఉన్నారు. వాటిపై వారికి పూర్తిగా అవగాహన లేకపోవడమే అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.ఏదో జబ్బు చేసిందని ఆసుపత్రుల చుట్టూ తిరిగి చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు. స్లో పాయిజన్‌లా పని చేసే పురుగుల మందు ప్రభావంతో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నా కారణమిదని గ్రహించుకోలేకపోతున్నారు. మందుల మోతాదు ఎక్కువై గాలి, నేల కలుషితమవుతున్నాయి. వీటివల్ల మనుషులకు క్యాన్సర్‌, గుండె జబ్బులు వస్తున్నాయి. శిశు మరణాలు సంభవిస్తున్నాయి.

రైతులు శరీరాన్నంతా ఆప్రాన్‌ లేదా కవర్‌తో కప్పేసుకోవాలి...
మందులు పిచికారీ చేసే సమయంలో రైతులు శరీరాన్నంతా ఆప్రాన్‌ లేదా కవర్‌తో కప్పేసుకోవాలి. మందు చల్లినప్పుడు మొక్క పత్ర రంధ్రాల ద్వారా ఎలా లోపలికి వెళ్తుందో.. అలాగే మనిషి చర్మంపై పడి పురుగుల మందులు శరీరంలోకి వెళ్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే శరీరాన్ని పూర్తిగా కప్పుకోవాలని చెబుతున్నారు. తలపై కూడా క్యాప్‌ పెట్టుకోవాలి. చేతులతో మందు కలపకుండా కర్రతో కలపాలి. మందు చల్లడం పూర్తయిన తరువాత సబ్బుతో చేతులు కడుక్కోకుండా, స్నానం చేయకుండా భోజనం చేయకూడదు. ఇలాంటి సూచనలు చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులకు పట్టింపు లేకుండాపోయింది. దీంతో రైతాంగం మొత్తాన్ని పురుగుల మందులు స్లో పాయిజన్‌లా చంపేస్తున్నాయి. 

Don't Miss