అమిత్ షా ను కలిసిన టీఆర్ఎస్ ఎంపీ డీఎస్: పార్టీ మారబోతున్నారా?

Submitted on 12 July 2019
Rajya Sabha member of TRS D. Srinivas Meets Amit Shah

కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్‌ ఎంపీ డీఎస్ (ధర్మపురి శ్రీనివాస్) భేటీ అయ్యారు. ఢిల్లీలో అమిత్‌షాను కలిసిన డీఎస్.. అరగంటకుపైగా సమావేశమయ్యారు. షాతో డీఎస్ ఏం చర్చించారన్నది క్లారిటీ రానప్పటికీ, కొంతకాలంగా టీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్న డీఎస్ బీజేపీ అధ్యక్షుడ్ని కలవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం స్టార్ట్ అయ్యింది. కొంతకాలంగా ఆయన పార్టీ మారుతారని వార్తలు వచ్చినప్పటికీ, బుధవారం(10 జులై 2019) ఢిల్లీలో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీపక్ష భేటికి ఆయన హాజరు కావడంతో ఆయన టీఆర్‌ఎస్‌లో కొనసాగుతారని భావించారు. కానీ మరుసటి రోజే అమిత్ షాను కలవడంతో రాజకీయంగా చర్చ మొదలైంది.

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో డీఎస్‌ కుమారుడు అరవింద్ నిజామాబాద్‌ నుంచి బీజేపీ ఎంపీగా కేసీఆర్ కుమార్తె కవితపై గెలిచారు. అయితే తండ్రి టీఆర్ఎస్‌లో కుమారుడు బీజేపీలో ఉండటంపై కాస్త విమర్శలు రాగా ఆయన పార్టీ మారుతారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో  అమిత్‌ షాను డీఎస్ కలిసిన విషయాన్ని టీఆర్ఎస్ ఎంపీలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీఎస్ వ్యవహారంపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన ఆధారాలు లభిస్తే అనర్హత వేటు కోసం రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు.

ఇక తెలంగాణ రాజకీయాల్లో ధర్మపురి శ్రీనివాస్‌ది ఓ కీలకమైన పాత్ర. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు అనుభవించిన ఆయన.. అనంతర కాలంలో టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. అక్కడ కూడా మం పదవులే లభించగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయనపై సొంత పార్టీ నేతలే ఫిర్యాదులు చేశారు. దీంతో ఆయన పార్టీ మారతారని ప్రచారం జరిగినా పార్టీ మారలేదు. ఇప్పడు అమిత్‌షాను కలవడంతో డీఎస్ పార్టీ మారే విషయమై మళ్లీ వార్తలు వస్తున్నాయి.
 

Rajya Sabha member
Telangana Rashtra Samiti
D. Srinivas
Amit Shah

మరిన్ని వార్తలు