జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం : హడలెత్తిస్తున్న ఫీజులు 

Submitted on 11 June 2019
Schools re-open in Telangana from June 12

హైదరాబాద్ : రాష్ట్రంలో జూన్ 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. జూన్ నెల వచ్చిందంటే చాలు విద్యార్దుల తల్లితండ్రులు హడలెత్తి పోతుంటారు. ఏ ఏటికాయేడు పెరిగిపోతున్న స్కూలు ఫీజులతో పేద, మధ్య తరగతి ప్రజలు భయపడిపోతుంటారు. ట్యూషన్ ఫీజుల పేరుతో ప్రయివేటు విద్యా సంస్ధలు వసూలు చేసే ఫీజులతో పిల్లల చదువు భారం అవుతోంది. పుస్తకాలు, షూస్, యూనిఫామ్స్, స్టేషనరీ ఇలా పిల్లల చదువులకు సంబంధించిన ప్రతిదీ తమ వద్దే కొనాలనే కండీషన్తో పేరెంట్స్ బెంబేలెత్తి పోతున్నారు. వాటి ధరలు బహిరంగ మార్కెట్ తో పోలిస్తే డబుల్ ఉండటంతో పిల్లల చదువు మధ్యతరగతి  కుటుంబాలకు భారం అవుతోంది. మంగళవారం 11వ తేదీతో వేసవి శలవులు ముగుస్తాయి. 12వ తేదీ బుధవారం నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ లోని ప్రయివేటు స్కూళ్లలో ఫీజులు ఎక్కువగా ఉండి సంవత్సరం ప్రారంభంలోనే ఆ మొత్తం చెల్లించాల్సి రావటంతో తల్లితండ్రుల్లో ఆందోళన మొదలవుతోంది. ఒక్కో విద్యార్ధిపై ఏడాదికి రూ.60 వేలు నుంచి రూ.80 వేల వరకు ఖర్చు చేయాల్సి రావటంతో మధ్య తరగతి కుటుంబాలు ఆర్ధికంగా చితికి పోతున్నాయి. 

నిబంధనలకు పాతర.. పట్టించుకోని అధికారులు
ప్రయివేటు స్కూళ్లపై విద్యాశాఖ అజమాయిషీ లేకపోవటంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. 1994 జీవో నెంబరు 1 ప్రకారం పాఠశాలలు 5 శాతానికి తగ్గకుండా లాభాలను ఆశించాలి. వసూలు చేసిన ఫీజులో 50 శాతాన్ని ఉపాధ్యాయులకు వేతనాలుగా చెల్లించాలి.  ఉపాధ్యాయులు, విద్యార్ధుల ప్రయోజనాలకు 15 శాతం, పాఠశాల నిర్వహణకు, అభివృధ్దికి 15 శాతం చొప్పున  ఖర్చు చేయాలి. కానీ ప్రయివేటు విద్యాసంస్ధలు 80 శాతం ఆదాయాన్ని లాభంగా తీసుకుంటూ కేవలం 20 శాతం మాత్రమే ఉపాధ్యాయులు విద్యార్ధుల కోసం ఖర్చు చేస్తున్నాయి.  ఏటా ప్రభుత్వానికి సమర్పించాల్సిన ఆడిట్ రిపోర్టూ సమర్పించటంలేదు. ఒకవేళ ఫీజులను పెంచాల్సి వస్తే డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీ అనుమతి తీసుకోవాలి.  పిల్లలను టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్, షూస్, స్కూలులోనే కొనాలనే నిబంధన పెట్టకూడదు. వీటిని అమ్మటానికి స్కూల్లోకౌంటర్ ఏర్పాటు చేయరాదు. కానీ అధికారులు వీటిని ఏమీ పట్టించుకోక పోవటంతో విద్యాసంస్ధలు తమ వ్యాపారాన్ని యధేఛ్చగా కొనసాగిస్తున్నాయి. 

ప్రయివేటు విద్యా సంస్ధలు నిబంధనలు పాటించకపోవటం, వాటిపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవటంతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయని విద్యార్ధుల తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలల్లో ప్లే గ్రౌండ్, అవసరమైనన్ని టాయిలెట్స్, అర్హతగల ఉపాధ్యాయుల భర్తీ చెయ్యాల్సి ఉన్నా పాఠశాలలు ఇవేమీ అమలు చేయటంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిజిటల్ తరగతి గదులు, ఏసీ గదుల పేరుతో కొన్ని పాఠశాలలు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయటం పట్ల విద్యార్ధి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో నిర్ణయించిన ఫీజులు సకాలంలో చెల్లించకపోతే వాటికి అపరాధ రుసుం కలిపి వసూలు చేస్తున్నాయి. ఒక వేళ అంత ఫీజు చెల్లించినా ఆయా పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కూడా ఉండటం లేదని తల్లి తండ్రులు ఆరోపిస్తున్నారు.

Schools
fees
schools re opening
Hyderabad
Private Schools
Telangana
 

మరిన్ని వార్తలు