ధావన్ లేకుంటే.. రోహిత్ శర్మపై ఒత్తిడి తప్పదు : హర్భజన్ 

Submitted on 12 June 2019
Shikhar Dhawan's absence will put more pressure on Rohit Sharma, says Harbhajan Singh

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో జట్టుకు దూరం కావడం.. రోహిత్ శర్మపై ఒత్తిడి పెంచుతుందని సీనియర్ క్రికెటర్, హాఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ధావన్ గాయం కారణంగా ఇంగ్లాండ్ లో న్యూజిలాండ్ తో జరుగబోయే మ్యాచ్ కు దూరమయ్యాడు.

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ధావన్ ఎడమ చేతి బొటనవేలికి గాయమైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ మ్యాచ్ సమయానికి ధావన్ ఇంకా కోలుకోకపోవడంతో అతన్ని మరో 2 నుంచి 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా భారత మెడికల్ టీం సూచించింది. 

భారత జట్టులో ధావన్ లేని లోటు, టాప్ ఆర్డర్ మార్పు కారణంగా ఓపెనర్ రోహిత్ శర్మ ఒత్తిడిగా ఫీలయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాడు. ధావన్ స్థానాన్ని తిరిగి భర్తీ చేయగల ఆటగాడిని ఎంపిక చేయడం కాస్త కష్టమైన పనిగా భజ్జీ తెలిపాడు. ధావన్ మ్యాచ్ కు దూరం కావడంతో అతని స్థానంలో రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్ గా కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడు.

శిఖర్ లేని లోటు కచ్చితంగా రోహిత్ పై ఎక్కువ ఒత్తిడి పెంచుతుందని, టాప్ ఆర్డర్ బ్యాటింగ్ ను తన భుజాలపై రోహిత్ మోయాల్సిన పరిస్థితి ఎదురువుతుందని భజ్జీ అభిప్రాయపడ్డాడు. కేఎల్ రాహుల్ తో రోహిత్ ఎలా నెట్టుకువస్తాడో వేచి చూడాలని భజ్జీ అన్నాడు.  

లెజండరీ ఇండియన్ ఓపెనర్ సునీల్ గవాస్కర్ కూడా ధావన్ జట్టులో లేకపోవడంపై స్పందించాడు. రోహిత్, ధావన్ ఓపెనర్ భాగస్వామ్యం అర్థవంతంగా ఉంటుంది. వికెట్ల మధ్య పరుగులు రాబట్టానికి రెగ్యులర్ పార్టనర్ భాగస్వామ్యం ఎంతో ముఖ్యం. ఇన్నింగ్స్ ఆరంభంలో ఎవరి భాగస్వామ్యంతో బరిలోకి దిగుతున్నామనేది ఆలోచించుకోవాలి. రోహిత్-ధావన్ విషయంలో సందేహమే అక్కర్లేదు.

వికెట్ల మధ్య పరుగులు ఎలా రాబట్టాలో వారికి బాగా తెలుసు. శిఖర్ లేనప్పటికీ రోహిత్ శర్మ రాహుల్ తో మ్యాచ్ ఎంజాయ్ చేస్తాడని అనుకుంటున్నా. రోహిత్ నుంచి రాహుల్ కూడా ఎన్నో నేర్చుకుంటాడని భావిస్తున్నా’ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. 

world cup 2019
 Shikhar Dhawan
Rohit Sharma
harbhajan singh

మరిన్ని వార్తలు