వైసీపీలో ఆ నలుగురు...

13:11 - January 13, 2018

హైదరాబాద్ : ప్రతిపక్ష వైసీపీలో రాజకీయాలు ఆ నలుగురు చుట్టూనే తిరుగుతున్నాయి. అధికార టీడీపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలన్నా... విమర్శించాలన్నా...  లోపాలను ఎత్తిచూపాలన్నా.. ఆ నలుగురే. అధికారపక్ష నేత విమర్శలకు దీటుగా జవాబు ఇచ్చినా... తిప్పికొట్టాలన్నా ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు కీలకంగా మారారు. వైసీపీలో ఆ నలుగురిపై 10 టీవీ ప్రత్యేక కథనం...
వీరికే జగన్ ప్రాధాన్యత 
వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌ ఎమ్మెల్యే రోజా.. అగ్రెసివ్‌ ఎమ్మెల్యే కొడాలి నాని..  యాంగ్రీ యంగ్‌మేన్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌.. దూకుడు ప్రదర్శించే ఆళ్ల రామకృష్ణారెడ్డి... ఇప్పుడు పార్టీ రాజకీయాలు వీరి చుట్టూనే తిరుగుతున్నాయి. పార్టీ అధినేత జగన్‌ కూడా ఇప్పుడు వీరికే ప్రాధాన్యత ఇస్తున్నారు. 
కీలకంగా నలుగురు ఎమ్మెల్యేలు  
ప్రజా సమస్యలపై అటు అసెంబ్లీలో ఇటు  క్షేత్ర స్థాయిలో ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో ఈ నలుగురు ఎమ్మెల్యేలు కీలకంగా మారారు. ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ఎత్తిచూపుతూ కోర్టుల్లో కేసులు వేయడంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి దిట్ట. టీడీపీ ప్రజలకు ఇచ్చిన హామీ అమల్లో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను వేలెత్తిచూపుతూ యువతను ఆకర్షించడంలో అనిల్‌కుమార్‌ యాదవ్‌ కీలకంగా మారారు. చంద్రబాబును టార్గెట్‌ చేయడంలో కొడాలి నానిది ప్రత్యేక శైలి. 
ఫైర్‌ బ్రాండ్‌ రోజా ప్రత్యేక పాత్ర 
చంద్రబాబు విధానాలను ఎండగట్టడంతోపాటు వైసీపీ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో ఫైర్‌ బ్రాండ్‌ రోజా ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. మహిళా సమస్యలు, డ్వాక్రా రుణమాఫీ వైఫ్యాలను ఎండగడుతూ.. చంద్రబాబు, లోకేశ్‌లపై విమర్శలు సంధించడంలో ఎప్పుడే తనదే పైచేయి అని నిరూపించుకుంటారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను వైసీపీ బహిష్కరించడంతో వీరికి ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం లేకుండా పోయింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను జనంలోని తీసుకెళ్లాలని జగన్‌ ఆదేశించడంతో ఇప్పుడు వీరంతా జిల్లాల బాట పట్టారని వైసీపీలో వినిపిస్తోంది. దీంతో పార్టీ ప్రతిష్ఠ పెరుగుతుందని అధినేత భావించినట్టు సమాచారం. 
ఈ నలుగురితో పార్టీకి మైలేజీ ఎంత..డ్యామేజీ ఎంత..?  
అయితే ఈ నలుగురితో పార్టీకి మైలేజీ ఎంత ఉందో... డ్యామేజీ కూడా అంతే ఉందని వైసీపీలోని సీరియర్లు చర్చించుకుంటున్నారు. వీరితో పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగిన సందర్భాల్లో నష్ట నివారణకు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, పార్థసారధి.. వంటి సీనియర్లు రంగంలోకి దిగాల్సి వస్తోందని చెబుతున్నారు. 

Don't Miss