పవన్ పాంచ్ : ఎన్నికల్లో పవర్ చూపించలేక పోయిన జనసేన

Submitted on 26 May 2019
Specical Story on Janasena

ఏపీ రాజకీయాల్లో మేమే కింగ్‌మేకర్‌ అంటూ ఊగిపోయిన జనసేన... తన ప్రభావం చూపించింది అయిదు స్థానాల్లోనే. కేవలం అయిదంటే అయిదు స్ధానాలు. ప్రధాన పార్టీలకు ఈ ఐదు నియోజకవర్గాల్లోనే గట్టి పోటీ ఇచ్చింది. మిగతా 170 నియోజకవర్గాల్లోనూ తేలిపోయింది. చాలా ప్రాంతాల్లో చివరి స్థానానికే పరిమితం కాగా... కొన్నిచోట్ల జనసేన కంటే నోటాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ప్రభుత్వ ఏర్పాటులో తామే కీలకమవుతామంటూ తొడకొట్టిన జనసేన పార్టీ... ఎన్నికల్లో   ఏమాత్రం బరిలో నిలువలేకపోయింది. ఈ పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చిన స్థానాలు అయిదే కనిపిస్తున్నాయి. అదే సమయంలో 30కి పైగా శాసనసభ స్థానాల్లో జనసేన ప్రభావం వల్ల తెలుగుదేశం నష్టపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఉభయగోదావరి, విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీపై ప్రభావం పడిందని చెప్తున్నారు.

రాష్ట్రంలో మొత్తం 138 స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీకి దిగినట్లు జనసేన చెప్పుకుంది. కానీ.. ఎన్నికల కమిషన్‌ లెక్కల ప్రకారం ఆ పార్టీ 132 స్థానాల్లోనే పోటీ చేసింది. ఈసీ వెబ్‌సైట్‌లో 132 మంది అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వచ్చాయో వెల్లడించింది. కొన్నిచోట్ల పార్టీ అభ్యర్థులు సరిగా నామినేషన్‌ దాఖలు చేయకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చాయని... ఇంకొన్ని చోట్ల నామినేషన్లు తిరస్కరించినట్లు జనసేన నాయకులు చెబుతున్నారు. పరిగణనలోకి తీసుకున్న 132 స్థానాల్లో జనసేన సాధించిన ఓట్లు మొత్తం పోలైన ఓట్లలో 5.35శాతమే.

ఉత్తరాంధ్ర జిల్లాలను పరిశీలిస్తే... పవన్‌కల్యాణ్‌ పోటీ చేసిన గాజువాకలోనే 58 వేల 539 ఓట్లు సాధించారు. ఇది మినహాయిస్తే మరెక్కడా 30వేల స్థాయికి ఓట్లు తెచ్చుకోలేకపోయారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో 10 వేల ఓట్లు దాటాయంటే... అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాంధ్ర సమస్యలను పవన్‌కల్యాణ్‌ విస్తృతంగా వెలుగులోకి తీసుకువచ్చారు. ఉద్దానం ప్రాంతం కూడా జనసేన ఆశించిన స్థాయిలో ఆదుకోలేకపోయిందనే చెప్పవచ్చు. భీమిలి, పెందుర్తి, ఎలమంచిలి నియోజకవర్గాల్లోనే దాదాపు 20వేలు, అంతకుమించి ఓట్లు తెచ్చుకుంది. భీమిలి, విశాఖ దక్షిణం, విశాఖ ఉత్తరం నియోజకవర్గాల్లోనే దాదాపు 20 వేల వరకు ఓట్ల చీలికకు కారణమైంది. మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ పోటీ చేసిన తెనాలిలో 29 వేల 905 ఓట్లు వచ్చాయి. అక్కడ వైసీపీ అభ్యర్థి 17 వేల 649 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. దక్షిణ కోస్తాలో కావలి, ఒంగోలు, నెల్లూరు గ్రామీణ నియోజకవర్గాల్లోనే 10 వేల స్థాయి ఓట్లు రాబట్టుకోగలిగింది. ఆదోని, గుంతకల్లు, అనంత అర్బన్‌, మదనపల్లి, పుంగనూరు వంటి చోట్ల 10 వేల నుంచి 15వేల ఓట్ల మధ్య జనసేన సాధించింది.

కొన్ని నియోజకవర్గాల్లో జనసేన 4, 5 స్థానాల్లోకి జారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కొన్నిచోట్ల కాంగ్రెస్‌, నోటాకు వచ్చిన ఓట్ల కన్నా కూడా తక్కువగా జనసేనకు వచ్చాయి. నరసన్నపేటలో జనసేన కన్నా కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. చీపురుపల్లిలోనూ అంతే. చీపురుపల్లిలో జనసేన కన్నా నోటాకు ఎక్కువ వచ్చాయి. విశాఖ ఉత్తరంలో బీజేపీకి, జనసేనకు దాదాపు దగ్గర దగ్గరగా ఓట్లు వచ్చాయి. మాజీ మంత్రి బాలరాజు పోటీ చేసిన పాడేరులో ఆయన కన్నా స్వతంత్ర అభ్యర్థి కె. కృష్ణారావుకు అత్యధిక ఓట్లు రావడం విశేషం. గిద్దలూరులోనూ జనసేన కన్నా నోటాకే ఓట్లు ఎక్కువ వచ్చాయి. జనసేన రాష్ట్రంలో ఒక్క రాజోలు నియోజకవర్గంలోనే గెలుపొందింది. సాక్షాత్తూ పవన్‌కల్యాణ్‌ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ... రెండో స్థానంలోనే ఆగిపోయారు. భీమవరం, గాజువాక, నరసాపురం, రాజోలు, అమలాపురం స్థానాల్లో జనసేన కొంతమేర పోటీ ఇవ్వగలిగింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన చెప్పుకోతగ్గ ఓట్లు సాధించింది.

Andhra Pradesh
Pawan kalyan
janasena

మరిన్ని వార్తలు