టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలు గల్లంతు

Submitted on 13 June 2019
SSC supplementary examination answer papers missing Komurambhim district

కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో టెన్త్ తరగతి సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల గల్లంతయ్యాయి. తపాలా శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జవాబు పత్రాలు గల్లంతు కాగా రెండు రోజుల అనంతరం లభ్యమయ్యాయి. ఈ మేరకు బుధవారం (జూన్ 12, 2019) కాగజ్‌నగర్‌ డీఎస్పీ సాంబయ్య వాటికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. సోమవారం (జూన్ 10, 2019) కాగజ్‌నగర్‌ లోని మూడు కేంద్రాల్లో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. మొదటిరోజు 65 మంది విద్యార్థులు తెలుగు, హిందీ, ఉర్దూ పరీక్షలు రాయగా వాటికి సంబంధించిన జవాబు పత్రాలను ఆ రోజు సాయంత్రమే పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ కు  తరలించారు.

పోస్టల్‌ అధికారులు ఒక బ్యాగులో జవాబు పత్రాలను భద్రపరిచి రైలు ద్వారా మంచిర్యాల సార్టింగ్‌ కేంద్రానికి తరలించడానికి ప్రయత్నించారు. జవాబు పత్రాల బ్యాగుతోపాటు మొత్తం 13 బ్యాగులు ఆటోలో రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లారు. గ్రాండ్‌ట్రంక్‌ (జీటీ) ఎక్స్‌ప్రెస్‌లో మంచిర్యాలకు తరలించడానికి ఆర్‌ఎంఎస్‌ (రైల్వే మెయిన్‌ సర్వీసెస్‌) బోగీలో ఎక్కిస్తుండగా అందులో ఒక బ్యాగు లేనట్లు గుర్తించారు. వెంటనే చుట్టుపక్కల ప్రాంతంలో గాలించారు. అయినా ఎంతకూ దొరక్కపోవడంతో మంగళవారం (జూన్ 11, 2019) పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగజ్‌నగర్‌ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో టౌన్‌ సీఐ కిరణ్‌ విచారణ చేపట్టారు. ఆటోలో జవాబు పత్రాలు తరలిస్తున్న క్రమంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం రావడంతో స్టేషన్‌ సమీపంలోనే బ్యాగ్‌ కింద పడినట్టు విచారణలో తేలింది. ఆ బ్యాగ్‌ను గుర్తుతెలియని మహిళ తీసి సమీపంలో ఉన్న రైల్వే ఉద్యోగి క్వార్టర్ లో భద్రపరిచింది. అయితే సదరు రైల్వే ఉద్యోగి విధులకు వెళ్లి బుధవారమే తిరిగి రాగా జవాబు పత్రాలను గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఆ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని, తెరిచి చూడగా అందులో ఏడు బండిళ్లలో సీలు వేసి ఉన్న పదో తరగతి పరీక్ష జవాబు పత్రాలు లభ్యమయ్యాయి. 

వాటిని జిల్లా విద్యాధికారి భిక్షపతి సమక్షంలో పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్స్ శంకరయ్య, హన్మంత్‌రావు, వరలక్ష్మి పరిశీలించారు. తాము వేసిన సీళ్లలో ఎలాంటి తేడాలూ లేవని వారు నిర్ధారించడంతో జిల్లా విద్యాశాఖాధికారికి అప్పగించారు. పోస్టల్‌ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే జవాబు పత్రాలు గల్లంతైనట్లు విచారణలో తేలిందని డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని చెప్పారు.
 

ssc
Supplementary
Examination
answer papers
Missing
Komurambhim district
Kagajnagar

మరిన్ని వార్తలు