అక్షరం

12:11 - April 23, 2017

తెరపై నవ్వుతూ కనిపిస్తారు. ప్రేక్షకులను ఆహ్లాదపరుస్తారు.. కానీ, వారి జీవితాల్లో మరెన్నో విశేషాలుంటాయి. ఆ ప్రయాణంలో ఎన్నో మలుపులుంటాయి. ప్రపంచానికి తెలియని మరెన్నో కోణాలూ వారిలో ఉంటాయి. ప్రముఖ కథారచయిత కూనపరాజు కుమార్ రాసిన హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ జీవిత చరిత్ర ఇటీవల విడుదలయింది. ఆ వివరాలతో పాటు, కుమార్ రాసిన న్యూయార్క్ కథా సంపుటి విశేషాలు చూద్దాం.. 

12:08 - April 23, 2017

కవిత్వానికి కాలం చెల్లిందా? వచనం రాయలేని వాళ్లే కవిత్వం రాస్తున్నారా? సాహితీ ప్రక్రియల ప్రాధాన్యం కాలానుగుణంగా మారుతుందా? ఇప్పుడు వచన సాహిత్యానికి, పాటకు మాత్రమే సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి ఉందా? కొందరు కవులు లేవనెత్తుతున్న ప్రశ్నలివి. దీనికి సమాధానం అంత తేలిక కాకపోవచ్చు. ఆధునిక కవిగా తన తెలుగు సాహిత్యంపై తన ముద్రవేసిన కవి ప్రసేన్ కథనంతో పాటు, న్యూయార్క్ కథలు, ఎమ్మెస్ నారాయణ జీవిత చరిత్ర వెలువరించిన కూనపరాజు కుమార్ ల ప్రత్యేక కథనాలతో ఈ వారం అక్షరం మీముందుకొచ్చింది.. కవిత్వంతో మొదలు పెట్టిన ప్రయాణం.... కవితాత్మక వచనం దిశగా సాగుతోంది. వ్యాసాలు, విమర్శలతో నడుస్తోంది.  రక్తస్పర్శ, ఏదీకాదు, ఇంకా ఉంది, కవిత్వం మొదలైన సంపుటాలతో తెలుగు సాహితీ ప్రపంచానికి సుపరిచితమైన కవి ప్రసేన్. పోస్టు మోడ్రన్ కవిగా, విమర్శకునిగా, పాత్రికేయునిగా, బహుముఖ ప్రజ్ఞతో రచనావ్యాసంగాన్ని సాగిస్తున్న ప్రసేన్ పై ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

13:34 - March 26, 2017

తెలంగాణాలో ఎందరో గేయ రచయితలు ఉన్నారు. ప్రజాసమస్యలను అక్షరీకరిస్తూ ఎన్నో పాటలు రాస్తున్నారు. ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. అలాంటి వారిలో దేవణ్ణ ఒకరు. సమాజంలోని అనేక సమస్యలపై ఎప్పటికప్పడు స్పందిస్తూ వందలాది పాటలు రాసిన గేయరచయిత దేవణ్ణ జనం పాటలు చూద్దాం....

13:30 - March 26, 2017

ఆమె కలంలో అధునాతన భావాల జలపాతాలు జాలువారుతుంటాయి
ఆమె గళంలో ప్రగతిశీల భావనల సముద్రాలు ఉప్పొంగుతుంటాయి
ఆమె స్త్రీజాతి స్వేచ్ఛను కోరి రచనలు చేసిన కవయిత్రి...
ప్రేమకు పెళ్ళికి మధ్య నలిగిపోయిన అంతరాల అంత:సంఘర్షణను అక్షరాల్లో చూపించిన నవలా రచయిత్రి...
ప్రవాసాంధ్ర జీవన దృశ్యాలను కథలుగా..... నవలలుగా శిల్పీకరించిన కథనశిల్పి...
ఆమె కల్పన రెంటాల..
తెల్లటి పూల గుత్తులు రోడ్డంతా
మంచు ప్రేమ మైకంలో మునిగిపోయే మాడిసన్
చివరి చూపు, చివరి మాటల్లాగా
ఎండిపోయిన చెట్లు
ఆఖరిక్షణాల్లో ఆత్మీయపు పలకరింతల్లాగా
మళ్లీ తొలిప్రేమంతా తాజాగా
ఓ తెల్లటి కౌగిలింతలో ఒదిగి పోయిన రెండు రాబిన్ పక్షులు
అంటూ అద్భుత భావుకతతో కవిత్వం రాసిన కల్పన రెంటాల కలానికి రెండు పక్కలా పదునే అని చెప్పాలి. 

కవిత్వం రాసినా.. కథరాసినా.. నవల రాసినా రెంటాల కల్పన అక్షరాలలో జీవితం ఉంటుంది.. జీవం ఉంటుంది.. అనుభూతి ఉంటుంది.. ఆర్ధ్రత ఉంటుంది.. సున్నితమైన మనోభావాలుంటాయి.. బలమైన తాత్వికతా నీడలుంటాయి.. స్త్రీ పురుషుల అంత:సంఘర్షణల తాలుకూ చేదు నిజాలుంటాయి. అణచివేతల ఆనవాళ్లుంటాయి.. మానవీయ కోణాలుంటాయి.. అనుభవాలుంటాయి.. ఆదర్శాలుంటాయి.. ఒక్క మాటలో చెప్పాలంటే రెంటాల కల్పన రచనల్లో.. ఒక కొత్తదనం ఉంటుంది. అందుకు ఉదాహరణే... ఆమె రాసిన సంచలన నవల...తన్హాయి 

వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో ఎన్నో నవలలు వచ్చాయి. స్త్రీ పురుష సంబంధాలపై సంచలనాత్మక నవలలు వెలువడ్డాయి.. అందులో చలం మైదానం. ఒకటి.
ఆ.. నవలలోని ఇతివృత్తం అప్పట్లో సంచనలం సృష్టించింది. పెళ్లైన రాజేశ్వరి..ఒక ముస్లిం యువకుని వెంట వెళ్లి స్వేచ్ఛగా జీవించిన ఇతివృత్తం అప్పట్లో ఓ విస్ఫోటనాన్నే సృష్టించింది. సమాజంలోని కట్టుబాట్లను తెంచి తుప్పుపట్టిన మానవ మస్తిష్కాలను కొత్తగా ఆలోచింపజేసిన నవల అది. చాలా ఏళ్ల తర్వాత అదే దారిలో ఓ నవలను రాసి పెను సంచలనం సృష్టించారు కల్పనా రెంటాల.. తన్హాయి నవలతో పలు చర్చలకు తెర లేపారు. పాఠకుల్లో సరికొత్త ఆలోచనలు రేకెత్తించారు..

ప్రవాసాంద్రులైన రెండుకుటుంబాలలోని పెళ్లైన స్రీపురుషుల మధ్య జరిగే ప్రేమతాలూకు అనుభూతుల కెమిట్రీచుట్టూ ..అల్లిన నవల ఇది. స్వేచ్ఛ.., అంత: సంఘర్షణ.., సమాజపు కట్టుబాట్లు.., భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ రాహిత్యం, విదేశాల్లో ఉన్న భారతీయుల కుటుంబ సంబంధాలు ఇత్యాది అంశాల చుట్టూ అల్లిన నవల తన్హాయి. ఎన్నో ప్రశ్నలు..చర్చలు..లేవదీసిన..తన్హాయి నవల..రచయిత్రికి మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది.

కల్పన రెంటాల తొలుత కవయిత్రిగా ఎంతో పేరుతెచ్చుకున్నారు. 2001 లో వెలువరించిన  నేను కనిపించే పదం అనే కవితా సంకలనంలో స్త్రీవాద కవితలతో పాటు వస్తువైవిధ్యం శిల్ప సోయగం ఉట్టి పడే కవితలెన్నో ఉన్నాయి. అవన్నీ ఆమెను.. కవయిత్రిగా.. తెలుగు కవితా రంగంపై నిలబెట్టాయి. అంతేకాదు.కల్పనా రెంటాల..ఒక జర్నలిస్టుగా ఎన్నో మానవీయ కథనాలకు పత్రికల్లో అక్షరరూపమిచ్చిన అనుభవంతో అద్భుతమైన కథలు రాశారు.. ఆమె రాసిన కథల్లో.. స్లీపింగ్ ఫిల్, అయిదో గోడ, కప్లెట్, ఇట్స్ నాట్ ఓ.కె కథలు అప్పట్లో పాఠకులను ఎంతగానో అలరించాయి.ఆలోచింపజేశాయి. కథానిర్మాణంలో పాత్ర చిత్రణలో... వాతావరణ కల్పనలో.. సంఘటనల కూర్పులో ..వాస్తవిక దృశ్యాల చిత్రణలో.. సహజత్వం ఉట్టి పడే కథలవడంతో రచయిత్రికి తెలుగు కథాసాహిత్యంలో మంచి గుర్తింపు వచ్చింది. 

నిజం చెప్పాలంటే కల్పనా రెంటాలకు సాహిత్య అభిలాష, అభినివేశం ఆమె తండ్రి రెంటాల గోపాలకృష్ణ నుంచి వచ్చిందని చెప్పాలి. ఇక ఆమె సహచరుడు ప్రముఖకవి అప్సర్ తో కలసి అనంతపురం నుండి అమెరికా వరకు ప్రయాణించిన ...జీవితం, సాహిత్యం కలబోసిన ప్రయాణంలో ఆమె సృజనాత్మకత వేయి పూలుగా వికసించింది. 2003 లో అమెరికా వెళ్లాక కల్పన రెంటాల కల్పనలో అనూహ్యమైన మార్పులొచ్చాయి. అద్భుతమైన నవల తన్హాయి అక్కడే అక్షరీకరింపబడింది. 2011 లో ఆమె బ్లాగు తూర్పు పడమరలో ఆ...నవల సీరియల్ గా 10 నెలలపాటు వచ్చింది. విశేష ఆదరణ పొందిన తన్హాయి నవల ఆమెకు ఎందరో అభిమాన పాఠకులను తెచ్చి పెట్టింది .

విజయవాడలోనే పుట్టి పెరిగిన కల్పన 1980లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో టెలివిజన్ కళాసాంస్కృతిక రంగాల సమీక్షలు రాసే జర్నలిస్టుగా  ఉద్యోగ జీవితం ప్రారంభించారు. తర్వాత స్వాతి వారపత్రికలో పనిచేశారు. విజయవాడ ఆకాశవాణిలో న్యూస్ రీడర్ గా కూడా పనిచేశారు. ఆంధ్రభూమిలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తూనే ప్రవృత్తిగా రచనా రంగంలో కృషిచేశారు. ఆమె రాసిన నేను కనిపించే పదం కవితా సంకలనానికి అజంతా అవార్డు లభించింది. అలాగే `ఆమెపాట` పేరుతో కల్పన రెంటాల ఆంధ్రభూమిలో రెండేళ్లపాటు వివిధ భాషల్లో వచ్చిన స్త్రీల కవితల విశ్లేషణతో  ఆమెకు మంచి  గుర్తింపు వచ్చింది. 

తెలుగు స్త్రీవాద సాహిత్యంలో తనదైన గొంతు వినిపించిన కవయిత్రిగా.. కథాసాహిత్యంలో తనదైన సృజన శిల్ప ప్రతిభలను ప్రదర్శించిన కథనశిల్పిగా... తన్హాయి లాంటి ఒక్క నవలతో సంచలన నవలాకారిణిగా గుర్తింపు పొందిన కల్పన,  అప్సర్ తో పాటు సారంగ వెబ్ మాగజైన్ నిర్వహణలో తనదైన కృషిచేస్తూ.. కొత్త కవులకు రచయితలకు బాసటగా కూడా నిచిచారు. 

జర్నలిస్టుగా.. కవయిత్రిగా, నవలా కారిణిగా బహుముఖీనమైన కృషి చేస్తున్న కల్పన రెంటాల కలం నుండి భవిష్యత్తులో మరెన్నో కవితా.. కథా సంకలనాలతో పాటు సంచలన నవలలు కూడా వెలువడాలని ఆశిద్దాం...

13:28 - March 26, 2017

ఆధునిక తమిళ కథా, నవలా సాహిత్యంలో విశేష కృషిచేసిన సుప్రసిధ్ధ రచయిత అశోక్ మిత్రన్. జీవిత వాస్తవికతకు అద్దం పట్టే కథలు, నవలలను రాసిన అశోక మిత్రన్ అసలు పేరు జగదీశ త్యాగరాజన్. ఆయన 1931 సెప్టెంబర్ 22న సికింద్రాబాద్ లో జన్మించారు. 20 ఏళ్లు సికింద్రాబాద్ లోనే చదువుకున్నారు. తర్వాత 1952 లో మద్రాస్ వెళ్ళిపోయారు. అక్కడ జెమిని స్టూడియోలో దశాబ్దం పైగా పని చేశారు.
200 కథలు, 8నవలలు
అశోక్ మిత్రన్ 200 కథలు, 8నవలలు. ఆయన కథల్లో సినీ జీవుల వ్యథలు, సామాన్య ప్రజల జీవన చిత్రాలు, జీవితానుభవాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి.1953 లో ఆయన రాసిన అన్ బిన్ పరిసు నవల అప్పట్లో సంచలనం సృష్టించింది. తన్నీర్, మానస సరోవర్, పావమ్ దళ్ పతడో మెుదలైన నవలలు అశోకమిత్రన్ కు ఎంతో కీర్తిని తెచ్చి పెట్టాయి. ఆయన రాసిన తన్నీర్ నవలను దర్శకుడు వసంత్ సినిమాగా తీశాడు.
తమిళ సాహిత్యంలో గుర్తింపు 
మిత్రన్ వ్యాసరచయితగా, విమర్శకునిగా తమిళ సాహిత్యంలో గుర్తింపు పొందారు. 1966 లో ఆయన రాసిన మై ఇయర్స్ విత్ బాస్  కాలమ్స్ మిత్రన్ కు మంచిగుర్తింపునిచ్చాయి. ఆయన కథలు, నవలలు ఇంగ్లీషుతో పాటు పలు యూరోపియన్ భాషల్లోకి అనువాదమయ్యాయి.
అవార్డులు, రివార్డులలతో సత్కారం...
అశోక్ మిత్రన్ సాహితీ కృషికి ఎన్నో సంస్థలు అవార్డులు రివార్డులిచ్చి సత్కరించాయి. 1995లో అశోక్ మిత్రన్ వెలువరించిన అప్పవిన్ స్నేగిధర్ కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.  యూనివర్సిటీ ఆఫ్ అయోవా నుంచి క్రియేటివ్ రైటింగ్ ఫిలోషిప్, యం.ఆర్ .జి అవార్డు, లిలీ మెమోరియల్ అవార్డు, అక్షర తదితర అవార్డులెన్నో అందుకున్నారు. సాధారణ కుటుంబంనుంచి, గొప్ప రచయితగా ఎదిగి ఇటీవల కన్ను మూసిన అశోక్ మిత్రన్ కు 10 టి.వి.అక్షరం నివాళులర్పిస్తోంది.

 

13:12 - March 19, 2017

ఏడాది పొడుగునా వేచి వేచి ఒక చెట్టు
ఒళ్ళంతా పువ్వులతో
తనను తాను తిరిగి పొందేవేళ..
అంటూ అద్భుత భావనా బలంతో కవిత్వం రాసిన అరుదైన కవి విన్నకోట రవిశంకర్. మనిషి తనలోని ఆత్మను అందంగా ఆవిష్కరించడమే కవిత్వమని భావించే రవిశంకర్ ఏ వస్తువునైనా అద్బుతమైన కవితా శిల్పంగా మార్చగలరు. కుండీలో మర్రిచెట్టు కవితా సంకలనంతో వస్తూ వస్తూనే తెలుగు కవిత్వంపై తనదైన ముద్రను వేశారు. అదే వరుసలో వచ్చిన వేసవివాన, రెండో పాత్ర లాంటి కవితా సంపుటాలు కవిత్వాభిమానులను మరితంగా ఆకట్టుకున్నాయి. 
"కవిత్వంలో నేను" వ్యాసం
కవిత్వం రాయడంతో పాటు ఇతర కవులు రాసిన కవిత్వాన్ని ఆకళింపజేసుకొని వారి కవితా సంపుటాలలోని వస్తుశిల్పాలను "కవిత్వంలో నేను" అనే వ్యాస సంకలనంలో అందంగా విశ్లేషించారు విన్నకోట రవిశంకర్. కవిత్వంలో నూతన అభివ్యక్తికి ఈ కవిరాసిన కుండీలో మర్రి చెట్టు కవిత్వం అద్దం పడుతుంది.
సున్నితమైన జ్ఞాపకాల వేలికొసల తాకిడికి
శ్రుతి చేసిన వీణలా ఆమె ధ్వనిస్తుంది
కనిపించని విషాదపు ఒత్తిడికి
చిగురుటాకులా  ఆమె  చలిస్తుంది
అంటూ సరికొత్త అభివ్యక్తితో కవిత్వాన్ని శిల్పీకరించారు. కుండీలో మర్రిచెట్టు కవితా సంకలనంలో 29 కవితలున్నాయి. హోళీ, ఉదయాలు, ప్లూ, నిద్రానుభవం, గాయం, కెరీరిజం, పాప మనసు, చలనచిత్రం, మెుదలైన కవితలు మనల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. 

కవిత్వం రాయడాన్ని చాలా సీరియస్ యాక్టివిటీగా భావిస్తారు రవి శంకర్ . అతని ప్రతి కవితా సంకలనంలో, ప్రతి కవితలోనూ ఈ స్పృహ అడుగడుగునా కనిపిస్తుంది. అతడు వెలువరించిన మరో కవితా సంపుటి వేసవివాన .అందులో
నేల కురిసే వాన
గుండ్రంగా తిరుగుతుంది
ఎప్పుడంటే అప్పడు
ఇంటి ముందు ఇంద్రధనుస్సులల్లుతుంది
 అంటూ వానను సరికొత్త భావనతో కవిత్వం చేసి అబ్బురపరుస్తారు. 
అగ్ని పర్వతం ఒకటి
హఠాత్తుగా మనసు మార్చుకుని
మంచుకొండగా మారిపోయినట్టుగా ఉంది
అంటూ ఒక వస్తును ఎవరూ ఊహించని ఇమేజరీతో తళుక్కుమనిపిస్తారు. ఇది  రవిశంకర్ ప్రత్యేక కవితా శిల్పకళ అని చెప్పాలి. 
విన్నకోట కవిత్వంలో ఏ వస్తువైనా అందంగా శిల్పీకరించబడుతుంది. కవిత్వ భాష , పదచిత్రాలు, ఇమేజరి, అభివ్యక్తి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ అందమైన కవిత్వంగా ఆవిష్కరించబడుతుంది.. 

ఇక రెండో పాత్ర కవితా సంపుటిలో మెుత్తం 77 కవితలున్నాయి. అందులో గొడుగు, వానపాట, బాధ, సహచరిలాంటి కవితలు శిల్ప సోయగంతో కవితా ప్రియులను అలరిస్తాయి. 
జలజలమంటూ కురిసే వాన
కిటికీపై నీటిపరదాలు జార్చినట్టు
నీ పాట నా కంటిమీద
కన్నీటి తెరలు దించుతుంది..

వెలిసిన వాన వేరే ఊరు 
వెతుక్కుంటూ వెళ్లిపోతుంది.
ముగిసిన నీ పాట మాత్రం
కొన్నాళ్ల వరకు 
తలపుల్లో గూడుకట్టుకుని
కలలో కూడా వెంటాడుతుంది.. అంటాడు విన్నకోట రవిశంకర్..

కవిత్వం రాయడంతో ఆగి పోకుండా, ఇతరుల కవిత్వాన్ని చదువుతూ  కవిత్వాన్ని విశ్లేషించడం నిరంతరం కొనసాగిస్తున్నారు విన్నకోట రవిశంకర్.  కవిత్వంలో నేను సంకలనంలో నల్లగేటు నందివర్ధనం చెట్టు, నిరంతరయాత్ర, పడవనిద్ర, సాలె పురుగులాంటి వ్యాసాలు ఆయా కవుల సృజన పట్ల కొత్త ఆలోచలను రేకెత్తిస్తాయి. 

విన్నకోట రవిశంకర్ కు కవిత్వం వారసత్వంగా వచ్చింది. తండ్రి విన్నకోట వేంకటేశ్వరావు స్వయానా పండితుడు ..ఆయన తెలుగు తోట అన్న ఒక కవితా సంకలనాన్ని వెలువరించారు. ఇందులో 85 మంది కవుల కవితలను ప్రచురించారు. 

ఇక రవిశంకర్ జీవిత విశేషాల్లోకి వెళితే ఆయన తూర్పుగోదావరిజిల్లా అమలాపురంలో  విన్నకోట వేంకటేశ్వరరావు, శ్యామల దంపతులకు జన్మించారు. పిఠాపురం, కాకినాడల్లో హైస్కూల్ వరకు చదువుకున్నారు. వరంగల్ లో యం.టెక్ ను పూర్తి చేశారు. తర్వాత ఎ.పి.ఎస్.ఇ.బి లోను తర్వాత  సి.యం.సిలో ఇంజనీర్ గా పనిచేశారు. 1998 లో అమెరికా వెళ్లి సౌత్ కెరొలినాలో ఉద్యోగం చేస్తున్నారు. 

ప్రముఖ కవి ఇస్మాయిల్ ప్రభావంతో  తనదైన మార్గంలో కవిత్వం రాస్తున్న అరుదైన కవి, సాహితీ సమీక్షకులు విన్న కోట రవిశంకర్. ఆయన కలం నుండి భవిష్యత్ లో మరెన్నో కవితా సంపుటాలు వెలువడాలని ఆశిద్దాం....

12:44 - March 5, 2017

గానుగెద్దు జీవితంలో సంపాదనకు, అప్పులకు, ఆస్తులు కూడబెట్టటానికి... వృత్తి జీవితానికి కాలం గడిచిపోతుంది. ఇది సాధారణ వ్యక్తుల జీవితం. కానీ, అతికొద్ది మంది వృత్తిని, ప్రవృత్తిని బ్యాలెన్స్ చేస్తూ, చుట్టూ ఉన్న అనేకానేక సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ కథారచయిత్రి , సంఘ సేవకురాలు ఆలూరి విజయలక్ష్మి ఒకరు. ఆమె చేసేది వైద్య వృత్తి. కాని ఆమె నిరంతరం ప్రజలకోసం కలం యుద్దం చేస్తుంది. సమాజంలోని అనేకానేక విషయాలకు స్పందించి రచనలు చేస్తుంది. ఓ పక్క మహిళల జీవిత సమస్యలకు, మరోపక్క వారి ఆరోగ్య సమస్యలకోసం కలాన్ని కదిలిస్తుంది. అలా ఆమె ఎన్నో నవలలు కథాసంపుటాలు, ఆరోగ్యానికి సంబంధించిన పుస్తకాలను వెలువరించారు. ప్రముఖ కథారచయిత్రిగా, నవలాకారిణిగా, వైద్యురాలిగా ఐదు దశాబ్దాలుగా సేవలందిస్తున్న డాక్టర్. ఆలూరి విజయలక్ష్మి విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

12:57 - February 26, 2017

కవులు, రచయితలు, కళాకారులు, ప్రేక్షకుల సహకారంతో నాలుగేళ్లు పూర్తి చేసుకున్న టెన్ టీవీ అక్షరం 'అక్షరం సమీక్షణం' పేరుతో ఓ వేడుకను నిర్వహించింది. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన ఈ సెలబ్రేషన్స్ లో ప్రముఖ కవి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె శివారెడ్డితో పాటు సాహితీ ప్రముఖులు ఖాదర్ మొహియుద్దీన్, ప్రసాదమూర్తి, యాకూబ్, స్ఫూర్తి, జి. లక్ష్మీనర్సయ్య, అట్టాడ అప్పల్నాయుడు, శిఖామణి, పసునూరు రవీందర్, ఎండ్లూరి మానస, పసునూరు శ్రీధర్ బాబు, అక్షరం ప్రేక్షకులు పలువురు పాల్గొన్నారు. ఆ కార్యక్రమ విశేషాలు వీడియోలో చూడండి..

12:48 - February 26, 2017

ఓ సాహిత్య కార్యక్రమం ఎలక్ట్రానిక్ మీడియాలో ఇముడుతుందా? ప్రతీ వారం ఇవ్వగలరా? అసలు అక్షరాన్ని విజువల్ గా ఎలా చూపిస్తారు..? ఇప్పటికే కొందరు ప్రయత్నించారు.. విరమించుకున్నారు.. మరి ఈ ప్రయత్నం మాత్రం ఎంతవరకు విజయవంతమౌతుంది? ఇలాంటి ప్రశ్నలు అనేకం వినిపించాయి.. అన్ని ప్రశ్నలకు సమాధానంగా నాలుగేళ్లు... రెండువందల వారాలు.. పూర్తి చేసుకుని .. సరికొత్త ప్రణాళికలతో, మరిన్ని విన్నూత్న కార్యక్రమాలతో మీ ముందుకు రాబోతోంది టెన్ టీవీ అక్షరం.. అక్షరం 200వ ఎపిసోడ్ సెలబ్రేషన్స్ తో పాటు.. ఈ నాలుగేళ్ల పయనంలోని అనుభవాలతో ఈ వారం అక్షరం ప్రత్యేకంగా మీముందుకొచ్చింది. సమున్నత ఆశయంతో సాగుతున్న టెన్ టీవీ అక్షర ప్రయాణంలో ఓ మైలు రాయి లాంటి సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ నిర్వహించిన చిన్న వేడుక 'అక్షరం సమీక్షణం' పలువురు సాహితీవేత్తల సమక్షంలో జరిగింది.

13:26 - February 19, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - అక్షరం