అఖిల భారత మహాసభలు

21:18 - April 21, 2018

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు రేపటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా.. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో.. పార్టీ, భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈనెల 18న ప్రారంభమైన సీపీఎం 22వ జాతీయ మహాసభలు.. తుది దశకు చేరుకుంటున్నాయి. నాలుగు రోజులుగా వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించి.. తీర్మానాలు చేసిన మహాసభ.. శుక్రవారం రాత్రి.. పార్టీ రాజకీయ తీర్మానాన్నీ ఆమోదించింది. సభల చివరి రోజైన ఆదివారం నాడు.. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సరూర్‌నగర్‌ స్టేడియంలో సీపీఎం బహిరంగ సభకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

పార్టీ తెలంగాణ శాఖ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శివర్గ సభ్యుడు నంద్యాల నరసింహారెడ్డి తదితరులు.. ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభను వీక్షించేందుకు.. సభ ప్రాంగణంలో ఆరు, ఎల్బీనగర్‌ చౌరస్తా వరకు మరో ఆరు ఎల్‌ఈడీ స్క్రీన్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. స్టేడియంలో బహిరంగ సభకు హాజరయ్యే మహాసభల ప్రతినిధులు, ప్రముఖులు, మీడియా కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు మలక్ పేట నుంచి రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు ప్రారంభమవుతుంది. సాయంత్రం ఐదు గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది.

మహాసభల్లో సీపీఎం జాతీయ ప్రధాన కార్యార్శి సీతారం ఏచూరి, కేరళ సీఎం పినరాయి విజయన్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌, బృందాకరత్‌, త్రిపుర మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌, బీవీ రాఘవులు, తెలుగు రాష్ట్రాల సీపీఎం కార్యదర్శులు హాజరు కానున్నారు. ఎన్నికల సంవత్సరంలో జరిగిన పార్టీ మహాసభ తీసుకున్న నిర్ణయాలను.. వారీ సందర్భంగా ప్రజలకు వివరించనున్నారు.

07:44 - April 21, 2018

హైదరాబాద్ : కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే తమ లక్ష్యమని సీపీఎం ప్రకటించింది.  కాంగ్రెస్‌తో రాజకీయ పొత్తు ఉండబోదని స్పష్టం చేసింది. ప్రజాసమస్యలపై మాత్రమే కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ప్రకటించారు.  ఈ మేరకు సీపీఎం జాతీయ మహాసభల్లో రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు.
రాజకీయ తీర్మానానికి మహాసభ ఆమోదం 
హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో సీపీఎం 22వ అఖిల భారత మహాసభలు ఉత్సాహపూరితంగా జరుగుతున్నాయి. మహాసభల్లో మూడో రోజైన శుక్రవారం.. కీలకమైన రాజకీయ తీర్మానాన్ని మహాసభ ఆమోదించింది. కాంగ్రెస్‌తో రాజకీయ పొత్తు ఉండబోదన్న తీర్మానాన్నే మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే కాంగ్రెస్‌తో ప్రజాసమస్యలపై కలిసి పనిచేయనున్నట్టు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ స్పష్టం చేశారు.   కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌ను గద్దె దించాలని మహాసభ అభిప్రాయపడినట్టు తెలిపారు.  పార్టీ ఐక్యతకు ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించేందుకు  ప్రజాస్వామ్య పద్దతిలో వెళ్లామని చెప్పేందుకు సీపీఎం గర్విస్తోందని ఏచూరీ అన్నారు.
కేంద్రంలోని బీజేపీని ఓడించడమే లక్ష్యం : ఏచూరీ
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించడమే తమ లక్ష్యమని ఏచూరీ తెలిపారు. రాజకీయ తీర్మానానికి అనుగుణంగా పార్టీ సభ్యులంతా ఐక్యంగా కృషి చేయాలని, దేశ వ్యాప్తంగా ప్రజలను సమీకరించాలని ఆయన కోరారు. పార్టీని బలోపేతం  చేయాలని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌తో పొత్తులు ఉండవు : ఏచూరీ
కాంగ్రెస్‌ పార్టీతో రాజకీయ కూటమి ప్రతిపాదనను సీపీఎం జాతీయ మహాసభ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. పాలక వర్గాలకు చెందిన ఓ ప్రధాన పార్టీయైన కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడమనేది తప్పుడు సంకేతాలను ఇస్తుందని మహాసభ అభిప్రాయపడింది. పాలకవర్గాలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ విధానాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలను సమీకరించాలని పిలుపునిచ్చింది. ఈ ప్రాతిపదికనే భవిష్యత్‌ ఎన్నికల ఎత్తగడలుంటాయని తెలిపింది.  

 

15:32 - April 18, 2018

హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జరుగుతోన్న ఈ సభలకు సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకరత్‌ హాజరయ్యారు. మహిళలపైన జరుగుతోన్న దాడులను నివారించేందుకు ఈ మహాసభల్లో తీర్మానాలు చేస్తామంటున్న బృందాకరత్‌తో టెన్ టివి మాట్లాడింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:04 - April 16, 2018

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలకు ఎర్రదండు సిద్ధం అవుతోంది. ఊరూవాడా అరుణపతాకాలు కవాతు తొక్కుతున్నాయి. హైదరాబాద్ బహిరంసభకు ప్రజలు తరలిరావాలని ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగురాష్ట్రాల్లో సీపీఎం శ్రేణులు ర్యాలీలు హోరెత్తుతున్నాయి. ఇటు హైదరాబాద్‌లో మహాసభల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సీపీఎం జాతీయ మహాసభలకు తెలుగు రాష్ట్రాల్లో పార్టీశ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. ఈనెల 22న భారీ బహిరంగసభకు తరలి రావాలని తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం హోరెత్తుతోంది. ఎర్రజెండాలు చేతబూనిన పార్టీ శ్రేణులు వాడవాలా ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి.

ఈనెల 18 నుంచి 22వరకు హైదరాబాద్‌లో సీపీఎం జాతీయ మహాసభలకు సర్వం సన్నద్ధం అవుతోంది. జాతీయ మహాసభలకు ఆర్టీసీ కల్యాణమండపంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 18న ఉదయం 10 గంటలకు సీపీఎం సీనియర్‌ నేత కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం అరుణపాతకను ఆవిష్కరించనున్నారు. మహాసభల వేదికకు కామ్రేడ్‌ మహ్మద్‌ అమీన్‌ పేరును పెట్టామన్నారు.. పార్టీ పొలిటిట్‌బ్యూరో సభ్యులు బి.విరాఘవులు.

ఐదు రోజుల పాటు జరగనున్న జాతీయ మహాసభలకు 764 మంది ప్రతినిధులు, 74 మంది పరిశీలకులు, మరో 8 మంది సీనియర్‌ నేతలు కూడా హాజరవనున్నారు. వీరితోపాటు ఐదు వామపక్షాల నుంచి జాతీయ నేతలు ప్రారంభసభలో పాల్గొంటారని బి.వి.రాఘవులు తెలిపారు. జాతీయస్థాయిలో వామపక్ష రాజకీయ వేదిక ఏర్పాటు, రైతులు, కార్మికులు, మహిళల సమస్యలపై మహాసభల్లో చర్చలు జరుగుతాయన్నారు. దాంతోపాటు 15వ ఆర్థిక సంఘం నిధులు..రాష్ట్రాలకు దక్కాల్సిన నిధుల లాంటి అంశాలపై కూడా చర్చిస్తామన్నారు. ప్రస్తుతం అన్నిపార్టీలు సామాజిక న్యాయం గురించే మాట్లాడుతున్నాయంటే అది వామపక్షాల ఘనతే అన్నారు. సీపీఎం నేతృత్వంలో జరిగిన మహాజన పాదయత్ర ఫలితంగా ప్రజల్లో సామాజిక న్యాయంపై అవగాహన వచ్చిందన్నారు.

మహాసభల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా సీపీఎం శ్రేణులు కదం తొదక్కుతున్నాయి. ఊరూవాడా ప్రదర్శనలు జోరుగా సాగుతున్నాయి. సూర్యాపేట జిల్లా మునగాలలో జరిగిన సెమినార్‌లో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భవించిందన్నారు. బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధ్యం అవుతుందన్నారు. పార్టీ మహాసభలకు తరలి రావాల్సిందిగా సీపీఎం శ్రేణులకు పిలుపు నిచ్చారు.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో అతిపెద్ద అరుణపతాకాన్ని ప్రదర్శించారు. 22వ జాతీయ మహాసభల సందర్భంగా 22మీటర్ల ఎర్రజెండాతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అటు మేడ్చల్‌జిల్లా ఘట్‌కేసర్‌లో బైక్‌ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగే బహిరంగసభకు తరలి రావాలని ప్రజలకు సూచించారు.

రైతు ఆత్మహత్యలు, కార్మికుల సమస్యలు, దళితులు, మైనార్టీలపై దాడులు, మహిళలపై అకృత్యాలతో దేశంలో అరాచకం రాజ్యంమేలుతోందని సీపీఎం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మరింతగా దిగజారాయంటున్నారు. ఈపరిస్థితిని ఎదుర్కోడానికి దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని ఆపార్టీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరగనున్న జాతీయ మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సిద్ధం అయ్యామని మార్క్సిస్టుపార్టీ నాయకత్వం అంటోంది. 

13:09 - April 15, 2018

హైదరాబాద్ : సీపీఎం అఖిల భారత మహాసభల కోసం తాము కోరుకున్న స్థలం ఇవ్వలేదని..ఇది రాజకీయపరమైన తిరస్కరణ అని భావిస్తున్నామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలకు గ్రౌండ్ ఇవ్వాలని నిబంధన ఉందని, స్థానిక యాజమాన్యం..అధికారులు రికమెండ్ చేయలేదని తమకు ఉత్తరం రాశారని తెలిపారు. తాము గత్యంతరం ఏమి లేని పరిస్థితుల్లో సరూర్ నగర్ స్టేడియంలో సభ జరుగుతున్నామన్నారు. మహాసభలకు ప్రజలు జయప్రదం చేయాలని, జయప్రదం కోసం రాష్ట్ర వ్యాపితంగా కార్యకర్తలు విస్తృతంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. 17వ తేదీ సాయంత్రం వరకు ప్రతినిధులు నగరానికి చేరుకుంటారని తెలిపారు. 

21:27 - April 8, 2018

హైదరాబాద్ : జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌కు సీపీఎం మాత్రమే ప్రత్యామ్నాయం అన్నారు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. ఈ నెల 18 నుంచి 22 వరకు సీపీఎం అఖిల భారత మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభల్లో దేశంలో పలు అంశాల్లో చోటుచేసుకుంటున్న మార్పులు, అభివృద్ధి నమూనాలపై చర్చిస్తామన్నారు. మతోన్మాద, కార్పొరేట్ అనుకూల వైఖరితో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా.. వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఏకం కావాలన్నారు. ఇవే అంశాలపై ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే సీపీఎం అఖిల భారత మహా సభల్లో చర్చిస్తామని చెప్పారు. ఈ మహా సభల ఉద్దేశాన్ని ప్రజలకు చేరవేసేందుకు సహకరించాలని హైదరాబాద్‌లో జరిగిన మీడియా ఎడిటర్స్‌ మీట్‌లో కోరారు.

ప్రజా వ్యతిరేక విధానాల్లో కాంగ్రెస్ కన్నా బీజేపీ ప్రభుత్వం దూకుడును ప్రదర్శిస్తుందని.. బీవీ రాఘవులు అన్నారు. కుల, మత వైషమ్యాలతో సమగ్రత, అభివృద్దికి ఆటంకం కలిగించేలా మోదీ చర్యలు ఉన్నాయని విమర్శించారు.. అమెరికా జోక్యంతో మేకిన్ ఇండియాకు అర్ధమే లేకుండా పోయిందన్నారు.

రాష్ర్టంలో అనేక అంశాలపై పోరు సలుపుతున్న తరుణంలో సీపీఎం మహాసభలు జరగడం... ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా అమలు కావాలంటే రాజకీయ జోక్యం తప్పనిసరన్నారు. అందుకోసమే ఆ కోణంలో నుంచే బీఎల్ఎఫ్ పుట్టుకొచ్చిందని తెలిపారు. గొర్రెలు, బర్రెలు ఇవ్వడం సామాజిక సహాయం అవుతుందే కానీ సమాజిక న్యాయం కాదని తమ్మినేని అన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభతో పాటు.. 25 వేల మంది రెడ్ షర్ట్ వాలంటీర్లతో కవాతు నిర్వహిస్తామని తమ్మినేని అన్నారు. కోదండరాం, పవన్‌ కళ్యాణ్‌లతో కలిసి పని చేసే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. 

13:38 - April 4, 2018

హైదరాబాద్ : సీపీఎం అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్‌లో బస్సు యాత్ర నిర్వహించారు. కుత్బుల్లాపూర్‌ సీపీఎం కార్యదర్శి లక్ష్మణ్‌ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ప్రజా సమస్యల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు గురించి ప్రజలను చైతన్యం చేసే విధంగా మహాసభలు ఉపయోగపడతాయని సీపీఎం నేతలు చెప్పారు. 

16:50 - March 24, 2018

రంగారెడ్డి : సీపీఎం మహాసభల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పోరాట కార్యాచరణ రూపొందిస్తామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు. సీపీఎం జాతీయ మహాసభల సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో బస్సు జాతాలు ప్రారంభమయ్యాయి. బస్సు జాతాలను ప్రారంభించిన రాఘవులుతో టెన్ టివి ముచ్చటించింది.

మహసభల కోసం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇటీవలే వెల్లడించిన థర్డ్ ఫ్రంట్ తో ఉపయోగం లేదని, కాంగ్రెస్ బిజెపిలు అనుసరిస్తున్న విధానాలను కేసీఆర్ అవలింబిస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్రలో జరిగిన లాంగ్ మార్చ్ లాగే తెలంగాణ రాష్ట్రంలో పోరాటాలు చేయాల్సినవసరం ఉందన్నారు. 

14:39 - March 24, 2018

హైదరాబాద్ : వచ్చే నెలలో జరగనున్న సీపీఎం 22వ జాతీయ మహాసభల పాటల సీడీని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని ఎంబీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో తమ్మినేని పాల్గొన్నారు. హైదరాబాద్‌లో జరగనున్న సీపీఎం జాతీయ మహాసభలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది అన్నారు. మహాసభల విజయవంతం కోసం తెలంగాణ వ్యాప్తంగా ప్రచారజాతా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈసందర్భంగా దేశంలో చోటు చేసుకుంటున్న సంఘటలపై తమ్మినేని ఆందోళన వెలిబుచ్చారు. తెలంగాణలో బహునులకు రాజకీయ అధికారం సాధించడమే లక్ష్యంగా సీపీఎం పనిచేస్తోందన్నారు తమ్మినేని వీరభద్రం. 

Don't Miss

Subscribe to RSS - అఖిల భారత మహాసభలు