అటవీశాఖ

15:56 - December 6, 2018

పుదుచ్చేరి : మన ఇంటిలోకి పాము వచ్చిందంటే కొట్టి చంపేస్తాం. అటవీశాఖ అధికారులకు ఫోన్ చేస్తాం. అంతే తప్ప ఏకంగా ముఖ్యమంత్రిగారికి ఫోన్ చేసి రక్షించండి అని అడగం కదా? ఏం ఎందుకు సీఎంను అడగకూడదు అనుకున్నాడో పాము బాధితుడు. పాము నుండి రక్షించండి సీఎంగారూ అంటు ఏకంగా ఫోన్ కొట్టాడు. 
పుదుచ్చేరి రాష్ట్రం, అరియాంకుప్పవలో రాజా అనే వ్యాపారి ఇంట్లోకి ఓ త్రాచుపాము వచ్చింది. భయపడిన రాజా ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేశాడు. స్పందించకపోవటంతో టెలిఫోన్ డైరెక్టరీ తీసుకుని ఏకంగా పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామికి ఫోన్ కొట్టాడు. ‘సార్.. మా ఇంట్లో పాము దూరింది. అధికారులకు ఫోన్ చేస్తే ఎవ్వరూ ఎత్తడం లేదు. దయచేసి సాయం చేయండి’ అని విజ్ఞప్తి చేశాడు. అర్ధరాత్రి ఫోన్ వచ్చినా విసుక్కోకుండా సీఎం నారాయణ స్వామి ఆయన అడ్రస్ తెలుసుకోవటమే కాకుండా రాజాకు ధైర్యం చెప్పారు. 
అంతేకాదు వ్యాపారి రాజా ఇంటికి వెంటనే వెళ్లాల్సిందిగా అధికారులను ఆదేశించి రాజా అడ్రస్ ను అటవీశాఖా అధికారులను తెలిపారు సీఎం నారాయణ స్వామి. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో డిసెంబర్ 5వ తేదీన రాత్రి జరిగింది. సీఎంగారి ఆదేశాలతో రాజా ఇంటికి వెళ్లిన వారు పామును పట్టుకోవడంతో రాజా కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సీఎం స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 

17:48 - September 26, 2018

అస్సాం : కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాంకే గర్వకారణంగా ఉంటుంది. ఇది అంతరించిపోతున్న ఇండియన్ ఒక కొమ్ము గల ఖడ్గమృగాలకు నిలయంగా ఉంది. సుమారు 429,93 sq కిలో మీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ పార్క్ లో ఖడ్గమృగాల జోలికెళ్లితే కాల్చిపడేస్తారు. మన దేశంలో మాత్రమే కనిపించే ఈ ఖడ్గమృగాలు అధిక సంఖ్యలో కంజిరంగా పార్క్ లోనే వుంటాయి. కాగా ఖడ్గమృగాల కొమ్ము చాలా విలువైనదిగా పేర్కొంటారు. ఆ కొమ్ములో క్యాన్సర్ తో పాటు అనేక రోగాలను కూడా నయం చేసే ఔషధ గుణాలు వుంటాయని నమ్ముతుంటారు. దీంతో ఖడ్గమృగాలు వేటగాళ్ల బారిన పడి వాటి సంఖ్య తగ్గిపోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో అస్సాం ప్రభుత్వం ఖడ్గమృగాల పట్ల కఠిన చర్యల్ని తీసుకుంటోంది. ఈ ఖడ్గమృగాల కొమ్ము విదేశాల్లో లక్షల ధర పలుకుతోంది. దీంతో ఖడ్గమృగాల జోలికెళ్లినా..వాటి పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరించినా..ఏమాత్రం అనునించకుండా కాల్చిపడేయాలని  అటవీశాఖ అధికారులు కాల్చిపడేస్తారు. 2016లో ఖడ్గమృగాలను వేటాడే వేటగాళ్ల సంఖ్యకంటే అటవీశాఖ అధికారులు కాల్చిపడేసిన వేటగాళ్ల సంఖ్యే ఎక్కువంగా వుంది అంటే వారు ఎంతటి కఠిన చర్యల్ని అవలంభిస్తున్నారో ఊహించవచ్చు. ఒకప్పుడు వేళ్లమీద లెక్కించగలిగే ఖడ్గమృగాల సంఖ్యల 207కి కంజిరంగా పార్క్ లో 2400లకు పెరిగటం గమనించాల్సిన విషయం. 

 

17:44 - April 23, 2018

మంచిర్యాల : జిన్నారం మండలం కలమడుగు అటవీశాఖ చెక్‌ పోస్టు అవినీతికి ఆలవాలంగా మారింది. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ నాయీమొద్దీన్‌ వసూళ్లకు పాల్పడుతూ కెమెరాకు చిక్కాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. పెళ్లి బృందం బస్సులో ఉంచిన మంచానికి వెయ్యి రూపాయల లంచం డిమాండ్‌ చేశాడు. లేకపోతే కేసు పెడతానని బెందిరించాడు. పెళ్లి బృంద రెండు వందల రూపాయలు ఇవ్వబోతే తీసుకోకుండా... ఇబ్బందులు పెట్టాడు. 

06:50 - March 30, 2017

ఖమ్మం: అదో మారుమూల గ్రామం. గిరిజన అటవీ ప్రాంతం. అక్షర జ్ఞానం లేని గిరిజన రైతాంగం పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి. ఇలాంటి భూములపై సర్కార్‌ కన్నుపడింది. ఎలాగైనా ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో కోపోద్రిక్తులైన గిరిజనులు ఫారెస్ట్‌ సిబ్బందికి ఎదురుతిరిగారు.

పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులపై...

పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులపై ఫారెస్ట్‌ సిబ్బంది ప్రతాపం చూపిస్తున్నారు. బలవంతంగా భూములు లాక్కునేందుకు యత్నిస్తున్నారు. దీంతో ఆగ్రహించిన గిరిజనులు అధికారులకు ఎదురుతిరుగుతున్నారు.

భూములు ఆక్రమించేందుకు ఫారెస్ట్‌ సిబ్బంది యత్నం...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రేగులగూడెంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన భూములను ఆక్రమించేందుకు ఫారెస్ట్‌ సిబ్బంది యత్నించారు. ఇందుకోసం జేసీబీతో సహా పలు వాహనాలను తీసుకువచ్చారు. దీంతో కోపోద్రిక్తులైన గిరిజనులు ఫారెస్ట్‌ సిబ్బందికి ఎదురు తిరిగారు. ఫారెస్ట్‌ సిబ్బందికి చెందిన జేసీబీతో సహా మూడు బైకులను తగలబెట్టారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ....

ఇక సమాచారం అందుకున్న కొమరారం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గ్రామంలోని ఇళ్లన్నీ సోదా చేశారు. ఎవరూ దొరకకపోవడంతో.. 20 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో మండలమంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ నెలకొంది.

18:54 - August 29, 2016

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులపై అటవీ అధికారుల దాడులు ఆపాలని.. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.. లేకపోతే సీపీఎం తరపున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.. హరితహారం పేరుచెప్పి గిరిజనులు సాగుచేసుకునే భూమిని ప్రభుత్వం లాగేసుకుంటోందని ఆరోపించారు. ములకలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో తమ్మినేని బృందం పర్యటించింది.. అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంది..

17:40 - July 16, 2016

ఖమ్మం : అటవీ భూమిని పోడు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్న గిరిపుత్రులపై అటవీశాఖ అధికారులు కక్ష కట్టారు. అటవీ భూమినే నమ్ముకొని జీవిస్తున్న గిరిజనులపై దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పోడు సాగుదారులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి.

పోడు రైతులపై అటవీశాఖ అధికారుల దాడులు...
ఖమ్మం జిల్లా అశ్వారావు పేటలో గత 25 సంవత్సరాలుగా పోడు భూములలో గిరిజనులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పోడు చేసుకుంటున్న అయాయక గిరిజనులపై హరితహారం పేరుతో అటవీశాఖ అధికారులు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడం వివాదాస్పందంగా మారుతోంది.

పోడు రైతులకు మద్దుతుగా నిలిచిన సీపీఎం పార్టీ...
అటవీ, పోలీసు అధికారుల చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా నిరసనోద్యమం చేస్తున్న గిరిజనులకు సీపీఎం మద్దతు పలికింది...పోడు సాగుదారులతో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. అశ్వారావు పేటలో ర్యాలీ నిర్వహించి అనంతరం తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్నో ఏళ్లుగా పోడు చేసుకొని జీవనం సాగిస్తున్న గిరిజనులపై అటవీశాఖ సిబ్బంది కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెడుతున్నారు. పోలీసులు కూడా అత్యత్సాహం చూపుతూ గిరిజనులపై దాడులకు పాల్పడుతున్నారని సీపీఎం నేతలు మండిపడ్డారు.

గిరిజనుపై దాడులను ఖండించిన సీపీఎం నేతలు...
1996 నుంచి వాగడ్డు గూడెం, మల్లాయి గూడెం గ్రామానికి చెందిన 200 కుటుంబాలు పోడు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి..అటవీ శాఖ అధికారులు హరితహారం పేరుతో మొక్కులు నాటేందుకు పోలీసులతో బెదిరిస్తూ పోడు రైతులపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని సీపీఎం నేత పొతినేని సుదర్శన్ విమర్శించారు.

అక్రమ కేసులు ఎత్తివేయాలని సీపీఎం డిమాండ్ ..
పోడు భూమి సాగుదారుల సమస్య పరిష్కారం చేసి భూములపై హక్కు పత్రాలు ఇవ్వాలని అక్రమ కేసులు ఎత్తివేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సున్నం రాజయ్య, పోతినేని సుదర్శన్‌లతో కలిసి గిరిజనులు జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ ను కలిసి సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. 

06:58 - July 8, 2016

నిజామాబాద్ : గాంధారి మండలం నేరెల్ తండాలో పోడు భూములను దున్నిన సీపీఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీపీఎం నేతలు అటవీశాఖ అధికారులకు మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నేతలను అడ్డుకున్న అటవీ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీపీఎం నేతలు. 

18:21 - July 6, 2016

ఆదిలాబాద్ : అటవీ మంత్రి ఇలాఖాలో అడవులు అంతరించి పోతున్నాయి. స్మగ్లర్ల ధాటికి అటవీ సంపద అక్రమంగా తరలిపోతోంది. అధికారుల ఉదాసీన వైఖరే దీనికి కారణమన్న ఆరోపణలున్నాయి. పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపేలా హరించుకు పోతున్న అటవీ సంపదపై 10టివి స్పెషల్‌ రిపోర్ట్‌...
యథేచ్చగా అడవుల నరికివేత...
ఆదిలాబాద్‌.. అడవుల జిల్లాగా ప్రసిద్ధి. అయితే ఈ ఖ్యాతి సమసిపోయేందుకు ఎంతో కాలం పట్టేలా లేదు. జిల్లాలో పెట్రేగి పోతోన్న అడవి దొంగల వల్ల.. వనం శరవేగంగా అంతరించుకు పోతున్నాయి. ముఖ్యంగా కడెం మండలంలోని గంగాపూర్‌ సెక్షన్‌ పరిధిలో.. టేకు వృక్షాలను స్మగ్లర్లు ఇష్టారాజ్యంగా నరికేస్తున్నారు. గంగాపూర్‌ గ్రామానికి రెండు కిలోమీటర్ల పరిధిలో ఈ వనమేధం యథేచ్ఛగా సాగుతున్నా.. అటవీశాఖ అధికారులు నిద్ర మత్తు వీడటం లేదు.
అటవీ సంపద నరికివేతతో బోసిపోతోన్న వనం
ఆదిలాబాద్ జిల్లాలో లభించే కలపను బంగారంతో పోలుస్తారు. అత్యంత నాణ్యతగా ఉండే ఈ కలపను స్మగ్లర్లు యథేచ్చగా కొల్లగొడుతున్నారు. కలప తరలింపునకు కాదేదీ అనర్హం అన్నట్లు ఆటోలు, కార్లు, డీసీఎం వ్యాన్లు, లారీలు ఇలా ప్రతి వాహనంలో కలప తరలిపోతూనే ఉంది.. వందల సంవత్సరాల వయస్సున్న పెద్దపెద్ద టేకు వృక్షాలను నరికివేస్తుండటంతో వనం బోసిపోతోంది.  అటవీ శాఖ అధికారుల నిఘా లేకపోవడంతో లక్షల విలువ చేసే కలప అక్రమంగా రవాణా అవుతోంది.
కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు తరలింపు
అడవుల్లోని కలపను అక్రమంగా తరలించేందుకు.. స్మగ్లర్లు గోదావరి నదిని ఉపయోగించుకుంటున్నారు. ఖానాపూర్, కడెం మండలాల నుంచి.. గోదావరి నది ద్వారా.. ఆవలి తీరానికి కలపను తరలించుకు పోతున్నారు. కరీంనగర్ జిల్లాలోని మల్లాపూర్, మూలరాంపూర్, నిజామాబాద్ జిల్లా గుమిర్యాల్ గ్రామాల్లో కొందరు వ్యాపారులు ఆదిలాబాద్ కు చెందిన స్మగర్ల నుంచి కలపను కొనుగోలు చేసి నిజామాబాద్ కు తరలించి.. అక్కడ భారీ మొత్తానికి టేకును అమ్ముకుంటున్నారు. 
అధికారుల ఉదాసీనత
అడవులను పరిరక్షించాల్సిన అధికారులు ఉదాసీనంగా ఉండడం.. చెట్లు నరుకుతున్న ప్రాంతం వైపు.. నామమాత్రంగా కూడా కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. టేకు వృక్షాలను పెద్దఎత్తున నరికి.. అక్రమంగా తరలిస్తోన్న స్మగ్లర్లకు అధికారులు, ప్రజా ప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
మొక్కుబడిగా అధికారుల తనిఖీలు 
అటవీ అధికారులు అదపాదడపా తనిఖీలు నిర్వహిస్తున్నా.. అవి మొక్కుబడి తంతుగానే సాగుతున్నాయి. కఠిన చర్యలు లేకపోవడంతో స్మగ్లర్లు మరింత రెచ్చిపోతున్నారు. అంతరించుకు పోతున్న అడవులపై ప్రభుత్వం దృష్టి సారించక పోతే..  చెట్ల జిల్లాకే కాదు.. పరిసరాల పర్యావరణానికి చేటు తప్పదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. 

Don't Miss

Subscribe to RSS - అటవీశాఖ