అడ్డం

20:35 - August 11, 2017

మన నిజాంబాదు పోలీసోళ్లు ఎంత తెల్వికల్లోళ్లమ్మా..? అడ్డంబడెటోన్ని ఇడ్సిపెట్టి.. ఆపదలున్నోన్ని అరెస్టు జేశిండ్రంటే.. వాళ్ల ప్రతిభా పాఠవాలు మామూల్యేంగాదు.. తెలంగాణ జేఏసోళ్లు స్పూర్తి యాత్ర పేరు మీద నిజాంబాదుకు వోతుంటే.. టీఆర్ఎస్ కార్యకర్తలు నడ్మిట్ల అడ్డం బడి ఆగమాగం జేయవోయిండ్రు.. మరి ఆడనే ఉన్న పోలీసోళ్లు ఏం జెయ్యాలే.. అడ్డంబడెటోన్ని అరెస్టు జేయాల్నా..? జేఏసోళ్లను అరెస్టు జెయ్యాల్నా మీరే జెప్పుండ్రి..

ఆ నంద్యాల ఉపఎన్నికలళ్ల గెల్చెటోళ్లు ఎవ్వలో పొయ్యెటోళ్లు ఎవ్వలోగని.. రామచంద్రా.. తెల్గుదేశమోళ్లు అట్లనే మోపైండ్రు.. అటు జగన్ పార్టోళ్లు అట్లనే మోపైండ్రు.. ఎల్లిమీద మల్లి మల్లి మీద ఎల్లి.. వీళ్లు వాళ్లను తిట్ట వాళ్లు వీళ్లను తిట్ట.. నంద్యాల ఓటర్లే నోరెళ్ల వెట్టె పరిస్థితొచ్చింది.. అటు ఎన్నికల సంఘమోళ్లు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు దీస్కుంటున్నరు..

సిరిసిల్ల జిల్లా నేరెళ్ల పంచాదిల కొండను దొవ్వి ఎల్కను వట్టిండ్రుగదా ప్రభుత్వమోళ్లు.. మోకాళ్లు వల్గెతట్టు.. సంసారానికి పన్కిరానట్టు దళితులను గొట్టిన కేసుల తప్పంత ఎస్ఐ రవీందరుదేనటనుల్లా.. ఆ ఒక్కడు గొడ్తెనే ఎన్మిది మంది ఎందుకు పన్కిరాకుంటైండ్రట.. మరి అంత ధమ్మున్న ఎస్ఐని ఇండియా పాకిస్తాన్ బార్డర్ పొంట నిలవడ్తె ఒక్కడన్న బత్కుతడా పాకిస్తాన్ ఉగ్రవాది..? ఏం తమాషనో పోండ్రి..

హురక మనం చాల మిస్సైపోయినయ్ నిన్నటి శ్రీరాంసాగర్ నీళ్ల సభకాడి ముచ్చట్లు.. అంటే ఇవ్వి సర్కారు కెమేరాల గనిపియ్యయ్ గదా..? ఏదో ప్రైవేటు కెమేరాలకే దొర్కుతయ్ గావట్టి ఆల్చంగొస్తున్నట్టున్నయ్.. అయితే నిన్న ఓదిక్కు ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే.. సభ సంతోషంగున్నదనుకున్నంగని.. లోపటతం గంద్రగోళమే అయ్యిందట.. సూడుండ్రి..

ఓ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారూ.. ఎంత మందున్నరు మీ కులపోళ్లు తెలంగాణల..? అంత తింపికొడ్తె.. అరశాతానికి ఎక్వలేరు.. మీరు గంత మంది ఎమ్మెల్యేలా..? గజ్వెల్లి కెళ్లి మొదలు వెడ్తె.. సిద్దిపేట మీరేనాయే.. సిరిసిల్ల మీరేనాయే.. వేములవాడ మీరేనాయే.. కోరుట్ల మీరేనాయే.? ఏంది తమాష మరి మా బీసీలంత ఎటువోవాలె అంటున్నడు అంబర్ పేట అన్మంతన్న... ఏందో మళ్లొకపారి జెప్పు..?

మహాత్మా జ్యోతి బాపూలే బడుల పొంట సద్వుతున్న పోరగాళ్లు సద్వుళ్ల సారం నేర్చుకోని ఎట్ల బత్కాలె అని నేర్చుకునుడు కంటే.. మన్షి అనెటోడు ఏ విధంగ బత్కొద్దు అనేదే నేర్చుకుంటున్నట్టున్నరు ఎక్వ.. ఎందుకంటె హాస్టళ్లు గట్టిండ్రు పయ్యాకన బాతురూములు మర్శిండ్రు.. రూములు నిర్మించిండ్రు.. కిటికీలు మర్శిండ్రు.. ఇన్ని అవస్థల నడ్మ వాడు వ్యవస్థ మీద ఏడపట్టుసాధిస్తడు చెప్పుండ్రి..

ట్రాఫిక్ పోలీసాయిన పని ఏందయ్యా..? ఏడ ట్రాఫిక్ జాంగాకుంట జూస్కోవాలె.. ఎవ్వలన్న వీఐపీలొస్తె ట్రాఫిక్ క్లీయర్ జెయ్యాలే..? రోజు సక్కగ డ్యూటీ జేశి ఇంటికి వోవాలె అంతేనా..? మరి తొవ్వొంట వొయ్యెటోళ్లను అమ్మని అక్కని అని తిడ్తె ఎన్కటి కాలమేనా ఇది..? జనం అంత ఒక్కటై.. ట్రాఫిక్ కానిస్టేబుల్ గాని తోలు దీశిండ్రు సూడుండ్రి..

కాలే ధన్ వాపస్ లాయెంగే.. యా నహి లాయెంగే... చేతులు ఇంత పొడ్గువెట్టి చెప్పిండు అప్పటి అభ్యర్థి.. ఇప్పటి ప్రధానమంత్రి మోడీ.. నల్లధనం వాపసు దెస్తాన్న మొనగాడు.. ఉన్నధనం విదేశాల పాలు జేశే పనిజేస్తున్నడట.. ఇన్నొద్దులు సర్కారు చేతులున్న రైల్వే సంస్థ.. ఇప్పుడు విదేశాలోళ్లకు అప్పజెప్పె కుట్రలు జేస్తున్నడట.. ఇగ రైల్వే కార్మికులు.. కండ్లెర్ర జేయవట్టిరి..

 

07:21 - August 2, 2017

హైదరాబాద్ : సంచలనం సృష్టించిన విక్రమ్‌గౌడ్‌ కాల్పుల కేసులో మిస్టరీ వీడింది. విక్రమ్‌గౌడే ప్రధాన సూత్రదారి అని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ఆరుగురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని అనంతపురం నుంచి ఇప్పటికే హైదరాబాద్‌కు తరలించారు. నిందితులను విచారించిన పోలీసులు. శుక్రవారం తెల్లవారు జామున తనపై ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారని విక్రమ్‌గౌడ్‌ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అయితే... ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. కావాలనే మైండ్‌గేమ్‌ ఆడుతున్నాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అప్పుల బాధను తప్పించుకోవడానికే కాల్పుల నాటకం ఆడినట్లు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆరుగురు వ్యక్తులను తనే పురమాయించి ఉంటాడని అనుమానించారు. తనపై కాల్పులు జరపాలని అనంతపురానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు.. హైదరాబాద్‌కు చెందిన నలుగురికి సుపారీ ఇచ్చాడు. పక్కా పథకం ప్రకారమే కాల్పులకు ప్లాన్‌ చేశాడు. తొలుత బంజారాహిల్స్‌లోని తన కార్యాలయం 'క్లాప్‌షార్ట్‌'లో కాల్చుకునేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. అయితే... అక్కడే ఒక్కడే వాచ్‌మెన్‌ ఉండడంతో పాటు... రాత్రి ఒంటిగంటన్నర కావస్తుండడంతో తనకు సీరియస్‌ అయితే ఎవరూ ఆస్పత్రికి తీసుకువెళ్లరనే అనుమానంతో ప్లాన్‌ను ఇంటికి మార్చినట్లు తెలుస్తోంది.

స్వయంగా రెండువైపులా కాల్చుకుని
ఇక ఇంటికి వచ్చిన విక్రమ్‌ సుపారీ ఇచ్చినవారితో కాల్పించుకోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే వాచ్‌మెన్‌ను గేట్‌ వేయవద్దని చెప్పాడు. అయితే కాల్చే సమయంలో వారి గురి తప్పితే ప్రాణాలకు ప్రమాదముందని భయపడిన విక్రమ్‌ తానే స్వయంగా రెండువైపులా కాల్చుకుని... గన్‌ను వారికిచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు విక్రమ్‌ గేమ్‌ ఆడుతున్నాడని గుర్తించారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి అన్ని వివరాలు సేకరించారు. కాల్పులకు ఉపయోగించిన గన్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముంది.

 

Don't Miss

Subscribe to RSS - అడ్డం