అధికం

16:27 - June 24, 2017

హైదరాబాద్ : పోడు భూముల సమస్య తెలంగాణ వచ్చాక ఎక్కువైందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్‌ ఎస్ వీకేలో పోడుభూముల సమస్యపై వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు తమ్మినేని హాజరై, మాట్లాడారు. ఏళ్ల తరబడి సాగు చెసుకుంటున్న సాగు భూమిని హరిత హారం పేరిట లాక్కుంటున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా అడవి భూములపై గిరిజనులకు హక్కు లేదని అన్నారని గుర్తుచేశారు. చట్టాన్ని కాపాడవలసిన సీఎం.. చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని తమ్మినేని మండిపడ్డారు. గిరిజనుల పై దాడులు ఎక్కువయ్యాయని వాపోయారు. 2006సం.లో చేసిన గిరిజన చట్టాన్ని సీఎం కేసీఆర్ చదవాలని సూచించారు. గిరిజనులపై దాడులు చేస్తే సహించమని తేల్చి చెప్పారు. అవసరమైతే ప్రాణాలైనా ఇస్తామని.. భూముల్ని మాత్రం వదలమని స్పష్టం చేశారు. 

 

15:54 - April 20, 2017

వయస్సు 36 సంవత్సరాలు..బరువు మాత్రం 500కిలోలు..గుర్తుడే ఉంటుంది కదా. అధిక బరువుతో తీవ్ర సమస్యలు ఎదుర్కొన్న 'ఇమాన్ అహ్మద్ అబ్దులాటి'ని ప్రస్తుతం చూసి షాక్ తింటున్నారు. ఇంకా బరువు పెరిగిందా ? అని అనుమానించకండి. ఆమె బరువు తగ్గుతోంది. ఈజిప్టుకు చెందిన ఈ అమ్మాయి బరువు తగ్గించుకోవడానికి భారతదేశానికి వచ్చింది. ముంబైలోని సైఫీ ఆసుపత్రిలో చేరిపించేందుకు అష్టకష్టాలు పడ్డారు. కార్గో విమానంలో తీసుకరావడం..అక్కడి నుండి టెంపోలో ఆసుపత్రికి...భారీ క్రేన్ సహాయంతో ఆమె పడుకున్న బెడ్ ను మొదటి అంతస్తు వరకు తీసుకెళ్లి చికిత్స చేయడం ఆరంభించారు. రెండు నెలల అనంతరం ఆమె శరీరంలో పూర్తి మార్పు వచ్చింది. సగానికి పైగా బరువును ఆమె కోల్పోవడంతో ఇప్పుడు వీల్ చెయిర్ లో కూడా కూర్చొనే స్థితికి చేరుకుంది. గతంలో పోలిస్తే చాలా సన్నగా..సంతోషంగా ఉంటోందని ఆసుపత్రి వైద్యులు పేర్కొంటున్నారు. క్రమం తప్పకుండా ఆమెకు ఫిజియోథెరపీ కూడా జరుగుతోందని తెలిపారు.

08:48 - April 18, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడిగాలులు వీస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బయటకు రావాలంటే జంకుతున్నారు. ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని విశాఖ..హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రాలు సోమవారం రాత్రి వెల్లడించాయి. ప్రకాశం..నెల్లూరు..రాయలసీమ జిల్లాల్లో వేడిగాలులు అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నాయి. వేడిగాలుల తీవ్రత గణనీయంగా ఉందని, కోస్తా జిల్లాలో ఉక్కపోత అధికంగా ఉందని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పలువురు మృత్యువాత పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండలం సర్దాపూర్ గ్రామానికి చెందిన దడిగెల వెంకటయ్య (75), కోనరావు పేట మండలం మరిమడ్లకు చెందిన తిక్కల భూమయ్య (60), మెదక్ జిల్లా చిన్న శంకరం పేటకు చెందిన కూలీ ఎర్రి నర్సింహులు (55) ఎండవేడిమికి మృతి చెందారు.

12:13 - January 11, 2017

ఢిల్లీ : ప్రకృతి ఎప్పుడు కన్నెర్ర చేసినా.. ఆ ప్రభావం రైతన్నల పైనే పడుతోంది. ప్రతిఏటా సంభవించే కరవు కాటకాలకు దేశవ్యాప్తంగా చిన్న రైతులే చితికి పోతున్నారు. కరవు, వర్షాభావ పరిస్థితులు అదే పనిగా అన్నదాతల పాలిట శాపంగా మారి ఉసురు తీస్తున్నాయి. 2015 ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం కరవు పీడిత ప్రాంతం మహారాష్ట్రలో అత్యధికంగా రైతులు మృతి చెందారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో చిన్న కమతాల రైతులే అధికంగా ఉండటం శోచనీయం. ! 
కరవుతో రైతులు విలవిల 
గత ఏడాది క్రితం వరకు దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరవుతో రైతులు విలవిలలాడి పోయారు. వర్షాలు లేక మరట్వాడా ప్రాంతం పూర్తిగా ఎడారిని తలపించింది. ఒక్క మహారాష్ట్రలోనే కాదు .. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో చిన్న, సన్నకారు రైతులే అధికమని గణాంకాలు చెబుతున్నాయి. 
రైతులే అధిక శాతం ఆత్మహత్యలు 
నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో ప్రకారం 2 హెక్టార్ల కన్నా తక్కువ భూమి కలిగిన రైతులే అధిక శాతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలా 2015లో 72 శాతం చిన్న రైతులే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 10 హెక్టార్లు ఆపై భూమి కలిగిన రైతుల్లో ఆత్మహత్య శాతం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ కోవకు చెందిన రైతుల్లో కేవలం 2 శాతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2015లో 8 వేల ఏడు మంది రైతులు ఉసురు తీసుకుంటే.. ఇందులో నాలుగో వంతు మధ్యతరగతి రైతులు ఉన్నారు. 2 నుంచి 10 హెక్టార్ల భూమి కలిగిన రైతులను మధ్యతరగతి రైతులుగా పరిగణిస్తారు. 
మోతుబరి రైతుల చేతిలో సాగవుతున్న భూమి 10.6 శాతం 
2010-11 వ్యవసాయ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. హెక్టార్‌ కంటే తక్కువగా భూమి ఉన్న వారిలో 67.1 శాతం ఉండగా... 1 నుంచి 2 హెక్టార్లు భూమి కలిగిన రైతులు 17.9 శాతం ఉన్నారు. అదేవిధంగా 2 నుంచి 10 హెక్టార్లు కలిగిన మధ్యతరగతి రైతులు 14.3 శాతం ఉంటే.. 10 హెక్టార్లకంటే ఎక్కువ భూమి కలిగిన మోతుబరి రైతులు 0.7 శాతం ఉన్నారు. మొత్తానికి సాగులో ఉన్న భూమి చిన్న రైతులకు అల్పంగా ఉందని గణాంకాలు చాటుతున్నాయి. ఉపాంత రైతులు సాగులో ఉన్న భూమి కేవలం 22.5 శాతం కాగా, 22.1శాతం భూమి చిన్న రైతుల చేతుల్లో సాగవుతోంది. అదే సమయంలో మధ్యతరగతి రైతుల 44.8 శాతం సాగుబడిలో ఉండగా... మోతుబరి రైతుల చేతిలో సాగవుతున్న భూమి 10.6 శాతంగా ఉంది.   
ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలి..
కేవలం వ్యవసాయం పైనే కాకుండా..వ్యవసాయేతర రంగాలపైనా దృష్టి పెట్టినప్పుడే రైతన్నల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని భువనేశ్వర్‌కు చెందిన నవకృష్ణ చౌదరి సెంటర్‌ ఫర్‌ డెవలప్‌ మెంట్‌ స్టడీస్‌ డైరెక్టర్‌ సృజిత్‌ మిశ్రా  సూచించారు. అందరికీ అన్నంపెట్టే అన్నదాతలు చితికిపోకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. 
ఉపాంత రైతులు బలవన్మరణాలు
గణాంకాల ప్రకారం.. మొత్తం 2,195 అతి తక్కువ భూమి కలిగిన ఉపాంత రైతులు బలవన్మరణాలకు పాల్పడగా...వారిలో మహారాష్ట్రలో 834, ఛత్తీస్‌గడ్‌లో 354 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డ వారిలో ఉన్నారు. అంటే మహారాష్ట్రలో 38 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 16 శాతం ఉపాంత రైతులు బలవంతంగా ఉసురుతీసుకున్నారు.  మహారాష్ట్రలో ఆత్మహత్యలు చేసుకున్న 3,618 రైతుల్లో...1,285 మంది చిన్న రైతులే కావడం గమనార్హం. మొత్తంగా చూస్తే అత్యధిక శాతం అంటే.. 35.5 శాతం ఆత్యహత్యలకు పాల్పడ్డట్లు గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇక కర్ణాటకలో 3,618 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడితే... అందులో అధికమొత్తంలో 751 మంది చిన్నరైతులే ఉండటం శోచనీయం. ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్న వారిలో చిన్నరైతులే 20 శాతం ఉండటం చూస్తే చిన్న రైతుల దుస్థితి ఎలా ఉందో అర్ధం అవుతోంది. 2015లో మొత్తం 160 మంది 10 హెక్టార్లకు పైబడ్డ రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారిలో తెలంగాణలో అత్యధికంగా అంటే.. 79 మంది మోతుబరి రైతులున్నారు. 37 మంది రైతులతో ఛత్తీస్‌గఢ్‌ రెండోస్థానంలో నిలిచింది. 
ఆత్మహత్య చేసుకున్నవారిలో చిన్న రైతులే అధికం 
అత్యధికంగా.. 354 మధ్యతరగతి రైతుల ఆత్మహత్యలు ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకోగా.. వాటిలో చిన్న రైతులు 310 మంది చనిపోయారు. మొత్తానికి కరవు కాటకాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో చిన్న రైతులే అధికంగా ఉంటున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

 

15:23 - January 4, 2017

హైదరాబాద్ : గత ప్రభుత్వాల కంటే టీఆర్‌ఎస్  ప్రభుత్వ హయాంలోనే రైతు ఆత్మహత్యలు ఎక్కువ నమోదయ్యాయని టీడీపీ శాసనసభ పక్షనేత రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డు బ్యూరో ప్రకారం రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ సెకండ్‌ ప్లేస్‌లో ఉందని అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఇప్పటికైనా కేసీఆర్ పరామర్శించాలని...ఒక్కో కుటుంబానికి 6 లక్షల రూపాయల నష్టపరిహారమివ్వాలని డిమాండ్‌ చేశారు. 

 

21:44 - November 21, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో... బ్యాంకు స్ట్రాంగ్ రూములు నిండిపోతున్నాయి. ప్రధాని ప్రకటన వచ్చిన పది రోజుల్లోనే.. ఐదున్నర లక్షల కోట్ల రూపాయల బ్యాంకుల్లో చేరాయి. గత 10రోజుల్లో జరిగిన లావాదేవీలపై ఆర్బీఐ ప్రకటన చేసింది. 
బ్యాంకుల్లో 5.12లక్షల కోట్లు డిపాజిట్‌  
దేశంలో పెద్దనోట్లను రద్దు చేసిన దగ్గర నుంచి ప్రజలు పాత కరెన్సీని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసే పనిలో పడ్డారు. ఈ నెల 10 నుంచి 18 వరకు అంటే 9 రోజుల్లో ప్రజలు 5.లక్షల 12 వేల  కోట్ల రూపాయల పాత కరెన్సీని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేశారు. మరో 33 వేల కోట్ల రూపాయల విలువైన పెద్ద నోట్లను మార్పిడి చేసుకున్నారు. అలాగే ఈ తొమ్మిది రోజుల్లో బ్యాంకులు, ఏటీఎంల ద్వారా లక్షా మూడు వేల కోట్ల రూపాయల కొత్త నోట్లను ప్రజలకు పంపిణీ చేశారు. 
పాతనోట్లను డిపాజిట్‌ చేసేందుకు జనం పరుగులు 
పెద్దనోట్లు చెల్లవని ప్రధాని మోదీ ప్రకటించడంతో.. బ్యాంకుల్లో పదో తేదీ నుంచి పాత నోట్లను డిపాజిట్‌ చేయడానికి.. పరిమితి స్థాయిలో నోట్లను మార్చుకునేందుకు  అనుమతించారు. దీంతో తొమ్మిది రోజుల్లో ప్రజల నుంచి మొత్తం 5 లక్షల 45వేల కోట్ల రూపాయల పాత కరెన్సీ బ్యాంకులకు చేరింది. కాగా 2016 మార్చి నాటికి 14 లక్షల 12వేల  కోట్ల రూపాయల నగదు 500, వెయ్యి రూపాయల నోట్ల రూపంలో చెలామణిలో ఉంది. ఈ అంచనా ప్రకారం ప్రజల వద్ద ఇంకా ఎనిమిది లక్షల 67వేల కోట్ల రూపాయల విలువైన పెద్దనోట్లు ఉన్నాయి. వీటిని డిపాజిట్‌ చేసేందుకు, మార్చుకునేందుకు డిసెంబర్‌ 30వ తేదీ వరకు గడువు ఉంది. అయితే ఈ డబ్బంతా బ్యాంకులకు చేరదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
14.12లక్షల కోట్ల నగదులో రూ.3.5లక్షల కోట్ల నల్లదనం
మొత్తం 14లక్షల 12వేల  కోట్ల రూపాయల నగదులో పెద్ద నోట్లు 25 శాతం అంటే 3లక్షల 5వేల కోట్ల రూపాయలు నల్లదనం రూపంలో ఉందని , ఈ మొత్తం బ్యాంకులకు చేరదని నిపుణులు అంటున్నారు. ఈ డబ్బును రిజర్వ్‌ బ్యాంకుకు లాభంగా పరిగణించి అంతే మొత్తంలో కొత్త నోట్లను ముద్రిస్తుంది. తర్వాత డివిడెండ్‌ల రూపంలో కేంద్రానికి బదిలీ చేస్తుంది. ఈ అంచనా ప్రకారం ప్రజల నుంచి మరో 5లక్షల17వేల కోట్ల రూపాయల పాత కరెన్సీ మాత్రమే బ్యాంకుల వచ్చే అవకాశముంది. ఇదిలా ఉండగా  పెద్దనోట్ల రద్దు వల్ల ఇబ్బంది పడుతున్న రైతులు.. చిన్న వ్యాపారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. 
పాత 500 నోట్లతో విత్తనాలు కొనుగోలు చేసే అవ‌కాశం 
మరోవైపు రైతులు పాత 500 నోట్లతో విత్తనాలు కొనుగోలు చేసే అవ‌కాశం క‌ల్పించింది ఆర్థిక శాఖ‌. చిన్న వ్యాపారులు ఓవర్‌ డ్రాఫ్ట్‌, క్యాష్ క్రెడిట్ ఖాతాల నుంచి వారానికి 50 వేల వ‌ర‌కు న‌గ‌దు విత్‌డ్రా చేసుకోవచ్చని ఆర్‌బీఐ ప్రకటించింది. అయితే క‌నీసం మూడు నెల‌ల నుంచి యాక్టివ్‌గా ఉన్న అకౌంట్లకే ఈ వెసులుబాటు కల్పించింది. వ్యక్తిగత ఓవ‌ర్‌డ్రాఫ్ట్ అకౌంట్లకు ఇది వర్తించదు.

 

16:30 - October 30, 2016

కడప : వాడవాడలా దీపావళి సంబరాలు ప్రారంభమయ్యాయి. దీపాలతో ఇంటిని అలంకరించేందుకు ఆకాశంలో బాణాసంచా వెలుగులు నింపేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. దీంతో మార్కెట్‌లు..షాప్‌లు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. అయితే టపాసుల ధరలు వినియోగదారులను హడలెత్తిస్తున్నాయి. ధరలు విపరీతంగా పెరిగిపోయాయని వాపోతున్నారు. కడప జిల్లాలో దీపావళి సందడి మొదలైంది. జిల్లా వ్యాప్తంగా దీపావళి సంబరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమిదలు.. టపాసుల కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా కడప నగరంలో మున్సిపల్ గ్రౌండ్స్‌లో టపాసుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. స్టేడియంలో ఏర్పాటు చేసిన టపాసుల స్టాళ్ల వద్ద జనం క్యూ కడుతున్నారు.

మరింత ప్రియంగా టపాసుల ధరలు..
అయితే టపాసుల ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండటం లేదని కడప వాసులు చెబుతున్నారు. గతంతో పోల్చితే ఈ ఏడాది ధరలు విపరీతంగా ఉన్నాయంటున్నారు. టపాసుల ధరలు మరింత ప్రియంగా మారాయని తప్పక కొనుగోలు చేస్తున్నామంటున్నారు. ఈ పండుగ సంతోషకరంగా జరగడం లేదని....కష్టంగానే జరుపుకుంటున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాక్స్ లు అధికంగా వసూలు చేస్తుండటంతో తాము కూడా అధిక ధరలకు టపాసులు విక్రయించాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. ట్యాక్స్‌లు.. అద్దెలు ఎక్కువగా ఉన్నాయని అందుకే ధరలు అధికంగా ఉన్నాయని అంటున్నారు. లాభం లేకపోయినా.. నష్టం రాకుండా ఉంటే చాలని అనుకుంటున్నామని వ్యాపారులు చెబుతున్నారు. టపాసుల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో విక్రయాలు గతం కన్నా బాగా తక్కువగా సాగుతున్నాయనే చెప్పాలి. 

15:56 - September 5, 2016

తాగండి..అంటే ఏదో అనుకోకండి..జ్యూస్ లు...వీటిని సేవించడం వల్ల బరువు తగ్గిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. జ్యూస్ లతో కూడా ఎన్నో ప్రయోజనాలు దాగుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా అందరూ స్థూలకాయంతో బాధపడుతున్నారు. తింటున్న ఆహారం ఈ మార్పులకు కారణమవుతోంది. అయితే శరీర బరువును తగ్గించుకునేందుకు రకరకాల ఎక్సర్‌ సైజులతో పాటు ఆహారపదార్ధాలు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే చాలా మందికి పండ్లు తినడం ఇష్టము ఉండదు. బరువు తగ్గించే జ్యూస్‌ లు కూడా ఉన్నాయి. అవేంటంటే…
కీరదోస..టమోట...క్యారెట్..బీట్ రూట్..యాపిల్..నిమ్మకాయ..పుచ్చకాయ..జ్యూస్ లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశాలున్నాయి.
ఉదయం ఆరు గంటలకు లేవగానే కొత్తిమీర జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తీసుకోవాలి.
అనంతరం 11గంటలకు ఓ గ్లాస్ బత్తాయి రసం..మధ్యాహ్నం 1గంటకు బొప్పాయి జ్యూస్ రెండు గ్లాసులు తీసుకోవాలి.
ఇక సాయంత్రం 4గంటలకు కమలాపండ్ల రసం ఒక గ్లాస్ తీసుకోవాలి.
రాత్రి 8గంటలకు కీరదోసకాయ జ్యూస్ చివరగా పడుకొనే ముందు ఓ గ్లాస్ మజ్జిగ తీసుకుని పడుకోవాలి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గే అవకాశాలున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. సో..ట్రై చేసి చూడండి..

15:15 - May 3, 2016

హైదరాబాద్ : ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు అన్నాడో సినీ కవి. ఓవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు కూరగాయల ధరలు భయపెడుతున్నాయి. ఏం కొనాలో ఏం తినాలో అర్థం కాక సగటు జీవి అల్లడిపోతున్నాడు. 
కొనాలంటేనే భయపడిపోతున్న జనం
సంచినిండా డబ్బులతో జేబు నిండా కూరగాయలన్న చందంగా ధరలకు రెక్కలొచ్చాయి. టొమాటో, బీన్స్, క్యారెట్‌, కాప్సికం, కాదేది... ధరల పెరుగుదలకనర్హం అన్నట్లుంది కూరగాయల పరిస్థితి. సరఫరా మధ్య సగానికి పైగా అంతరం ఏర్పడటంతో రాష్ట్రంలో కూరగాయల ధరలు  ఒక్కసారిగా పెరిగాయి. హోల్‌సేల్‌ మార్కెట్లో, రిటైల్ ధరలకు ఏమాత్రం పొంతన ఉండట్లేదు. టోకు మార్కెట్లో కిలో 52 రూపాయలు ఉన్న టొమాటో బహిరంగ మార్కెట్లోకి వచ్చేసరికి 60 నుంచి 80 రూపాయల ధరల పలుకుతోంది. మిగిలిన కూరగాయల ధరలు కూడా ఇలాగే ఉండటంతో వీటిని కొనాలంటేనే జనం భయపడిపోతున్నారు. 
ఆకాశాన్నంటుతున్న ఆకుకూరల ధరలు
పదిరోజుల క్రితం వరకు సాధారణంగా ఉన్న కూరగాయల ధరలు ఇప్పుడు రెట్టింపు అయ్యాయి. కిలో వంకాయల ధర 15రూపాయలుండగా ప్రస్తుతం 30 అయ్యింది. బెండకాయ 15 నుంచి 40 రూపాయలకి పెరిగింది. దొండకాయలు  15నుంచి 25 ,బంగాళదుంపలు 30 నుంచి 40 రూపాయలకు  పెరిగాయి. ములక్కాయలైతే పది రూపాయలకి రెండే ఇస్తున్నారు. ఇక కొత్తిమేర, పుదీనాలతో పాటు ఆకుకూరల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. నాలుగు రకాల కూరగాయలు కొనడానికి  200 రూపాయలకు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
కూరగాయలపై కరవు ప్రభావం
రాష్ట్రంలో నెలకొన్న కరవు ప్రభావం కూరగాయలపై పడుతోంది. తీవ్రమైన ఎండలు, వర్షాలు కురవకపోవడం, భగర్భజలాలు అడుగంటుకుపోవడంతో పంటలకు నీరు కరువై దిగుబడి బాగా తగ్గిపోయింది. ఆశించిన స్థాయిలో కూరగాయల సాగు జరగకపోవడం ధరలు పెరగడానికి కారణమవుతోంది. ఏప్రిల్ మొదటివారం వరకు కాస్త అందుబాటులో ఉన్న కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ప్రధాన  మార్కెట్లకు కూరగాయల దిగుమతులు తగ్గిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ వంటి ప్రధాన నగరాలతో పాటు వివిధ పట్టణాల్లో కూరగాయల ధరలు చూసి సాధారణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
ధరలు పెరుగుదలపై ప్రజల అసంతృప్తి 
ప్రతి ఏడాది కూరగాయల ధరలు ఇలాగే పెరిగిపోతున్నాయని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో,కూరగాయలపై  వ్యవసాయ శాఖ  ముందే అప్రమత్తమై చర్యలు చేపడితే కొంతవరకు సమస్యను పరిష్కరించవచ్చునని సూచిస్తున్నారు.

18:40 - April 19, 2016

ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టాలు తేవాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఫీ'జులుం'పై వైజాగ్ లో టెన్ టివి పబ్లిక్ బిబేట్ నిర్వహించింది. పలువురు డిబేట్ లో పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వంలో ఉన్నవారు వారికి అనుకూలంగా చట్టాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేట్ విద్యాలయాలను అరికట్టాలన్నారు. విద్యా హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రైవేట్ విద్యాలయాలు వేలు, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యను సరుకుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం విద్యా వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Pages

Don't Miss

Subscribe to RSS - అధికం