అనంతపురం

10:57 - May 30, 2017

నందమూరి బాలికాకయ్యకు హిందూపురం జనం ఉసురు తాకెతట్టే గొడ్తున్నది.. సీన్మల సీన్లు జెప్పినట్టనుకున్నడో ఏమో.. అప్పుడెప్పుడో ఎన్కట ఒకపారి హిందూపురానికి వొయ్యి ఓట్లేశిన జనానికి ఎన్నో ఒట్లు వెట్టిండు.. మీకు ఇది జేస్తా అది జేస్త.. ఆడకట్టు ఆడకట్టుకు మంచినీళ్లు తాపిస్తాని.. ఇప్పుడు పత్తాకే లేకుంట ఏడు చెర్వుల నీళ్లు దాపిస్తున్నడట కాకయ్య..మరి పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

11:14 - May 29, 2017

అనంతపురం : 'బాహుబలి' సినిమా చూసేందుకు అనుమతించాలంటూ మందుబాబులు ఓ థియేటర్ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో చోటు చేసుకుంది. గుత్తిలోని కేపీఎస్ మూవీల్యాండ్ థియేటర్ లో 'బాహుబలి' సినిమా ప్రదర్శితమౌతోంది. గత అర్ధరాత్రి ఐదుగురు యువకులు పూటుగా మద్యం సేవించి థియేటర్ కు వచ్చారు. లోనికి అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. సినిమా చివరిలో ఉందని..ఇప్పుడు అనుమతించడానికి వీలు లేదంటూ సిబ్బంది పేర్కొన్నారు. తీవ్ర ఆగ్రహానికి గురైన మందబాబులు సిబ్బందిపై పిడుగుద్దుల వర్షం కురిపించారు. దీనితో సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. థియేటర్ యాజమాన్యం చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

08:54 - May 27, 2017

అనంతపురం: గుత్తి మండలం వన్నె దొడ్డి వద్ద జాతీయ రహదారిపై టీఎస్‌ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. 48 మంది ప్రయాణికులతో హైదరాబాద్-బెంగళూరు వెళ్తున్న టీఎస్‌ఆర్టీసీ గరుడ బస్సు ఓ లారీని ఓవర్ టేక్ చేయబోయి పది అడుగుల ఎత్తైన ఫ్లైఓవర్ నుంచి కింద పడింది.ఈ ఘటన శనివారం వేకువజామున 3.30 నుండి 4గంటల సమయంలో జరిగింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయాలైన వారిని గుత్తి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం కర్నూల్ ఆస్పత్రికి తరలి చికిత్స అందిస్తున్నారు.

21:52 - May 24, 2017

అనంతపురం : రాయలసీమలో ఉరుముతున్న కరువును తరిమేయాలంటూ వామపక్షాలు కదం తొక్కాయి. కరవు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశాయి. నష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని వామపక్ష, ప్రజాసంఘాల నేతలు నినదించారు. ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. కామ్రేడ్ల నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాయి. మొత్తంగా రాయలసీమ బంద్‌ పిలుపు సక్సెస్‌ అయ్యింది. రాయలసీమ సమస్యలపై సీమ బంద్‌ పిలుపు నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు కడపలో ఆందోళనకు దిగారు. వేలాది మంది ప్రజలతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న మధును పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో అన్ని రాజకీయపక్షాలను కలుపుకుని ప్రభుత్వంపై మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని మధు స్పష్టం చేశారు.

హోరెత్తిన బద్వేలు
వామపక్షాల ఆందోళనలతో బద్వేలు పట్టణం హోరెత్తింది. భారీ నిరసనలతో దద్దరిల్లింది. పట్టణంలో వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్‌కు సంఘీభావం ప్రకటించారు. లెఫ్ట్‌పార్టీల కార్యర్తల ఆందోళనతో భారీగా బస్సులు నిలిచిపోయాయి. పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం అయిందని సీపీఎం నాయకులు విమర్శించారు. వామపక్ష పార్టీలు చేపట్టిన రాయలసీమ బంద్ కర్నూలులో ప్రశాతంగా సాగింది. నగరంలో ప్రజలు స్వచ్చదంగా పాల్గొని వ్యాపారులు, ఆటో డ్రైవర్లు బంద్‌కు మద్దతు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 800 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రాయలసీమ బంద్ సందర్భంగా కర్నూలులో సీపీఎం పార్టీ కేంద్ర కమీటి సభ్యులు ఎంఏ గఫూర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. కరువుతో రాయలసీమ తీవ్రంగా నష్టపోయిందన్నారు. రైతులకు సబ్సిడి క్రింద పంట రుణాలు, విత్తనాలను అందించాలని ఆయన డిమాండ్ చేశాడు. సీమలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి తాగు,సాగునీటిని అందించాలని సీపీఎం పార్టీ కేంద్ర కమిటి సభ్యులు ఎంఏ గఫూర్ డిమాండ్ చేశారు.

బస్సులు డిపోలకే పరిమితం
అనంతపురం జిల్లాలో బస్‌ డిపోల నుంచి బస్సులు కదలకుండా వామపక్ష నేతలు అడ్డుకున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. పుట్టపర్తిలో సీపీఎం, సీపీఐ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. బస్‌ డిపో ఎదుట బస్సులను అడ్డుకోవడంతో.. భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు కదిరిలో వామపక్షాల ఆధ్వర్యంలో దుకాణాలు మూయించి ర్యాలీలు నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బంద్‌నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నాయకులు, కార్యర్తలను పెద్ద ఎత్తున అరెస్టు చేశారు.

చిత్తూరులో ఉద్రిక్తత
చిత్తూరు జిల్లాలోనూ రాయలసీమ బంద్‌ ఉద్రిక్తంగా కొనసాగింది. తిరుపతి బస్టాండ్‌ సర్కిల్‌ వద్ద వామపక్ష నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్టాండ్ల వద్ద బస్సులను అడ్డుకున్నారు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు సీపీఎం, సీపీఐ నాయకులను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు రాయలసీమ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని నేతలు ఆరోపించారు. మొత్తానికి లెఫ్ట్‌పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన రాయలసీమ బంద్ విజయవంతగా కొనసాగింది.

19:15 - May 24, 2017
15:26 - May 24, 2017
06:47 - May 24, 2017
20:35 - May 23, 2017
18:49 - May 23, 2017

అనంతపురం : రాయలసీమ..! నిత్య క్షామపీడిత ప్రదేశం. పాలకులు నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం. ఈ జిల్లాల్లో పదేళ్ల సగటు తీసుకుంటే.. ఏడేళ్లు కరవు కరాళ నృత్యం చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా కరవు.. వరుసగా ఆరోసారి పిలవని చుట్టంలా వచ్చేసింది. ఫలితంగా వ్యవసాయం కుదేలైంది. ఉపాధి కరవైంది. తాగునీటికీ కటకట ఏర్పడింది. వలసలు మొదలయ్యాయి. ప్రజల కష్టాలు పాలకుల చెవికెక్కడం లేదు. రాష్ట్ర విభజన వేళ ఈ ప్రాంతాన్ని నందనవనం చేస్తామన్న హామీ ఎప్పుడో అటకెక్కేసింది. ఈ దశలో, అలో లక్ష్మణా అని అలమటిస్తోన్న సీమ గోడును.. సర్కారు దృష్టికి తెచ్చేందుకు.. వామపక్ష, ప్రజాసంఘాలు.. రేపు రాయలసీమ బంద్‌ను పాటించబోతున్నాయి. రతనాల సీమ.. నేడు కరవు కోరల్లో విలవిలలాడుతోంది. పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా.. సీమవాసులు తీవ్ర దుర్భిక్షంతో తల్లడిల్లుతున్నారు. ముఖ్యంగా సీమలోని నాలుగు జిల్లాల పశ్చిమ ప్రాంతాలైతే.. దుర్భర క్షామాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రాంతంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆదుకోక.. చేసిన పనులకూ డబ్బులు రాక కూలీలు ఆకలితో నకనకలాడుతున్నారు. వీరిని ఆదుకోవాల్సిన సర్కారు కానీ, అధికార యంత్రాంగం కానీ మౌన ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. సాగునీటి ప్రాజెక్టులు తగినన్ని లేనికారణంగా ఇక్కడి రైతులు అత్యధికం వర్షంపైనే ఆధారపడి సేద్యం చేస్తారు. హంద్రీనీవా, గాలేరు నగరి లాంటి బృహత్తర ప్రాజెక్టులు దశాబ్దాలుగా నత్తనడకన సాగుతున్నాయి. నదుల అనుసంధానంలో భాగంగా పట్టిసీమ ద్వారా, సీమకు, కొంతమేర కృష్ణా నీటిని మళ్లించే ప్రయత్నం చేసినా.. అది ఈ ప్రాంత అవసరాల్లో ఒక్క శాతం కూడా తీర్చలేని పరిస్థితి. వరుణుడి కరుణ లేక కొంత.. ప్రకృతి ప్రకోపానికి మరికొంత.. పంటలు నాశనమయ్యాయి. దీంతో రైతులకు పెట్టుబడులే కాదు, కనీసం పశువులకు గ్రాసమూ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఉపాధి దొరక్క, యువత వలసబాటన సాగుతోంది.

హామీల మీద హామీలు..
రాయలసీమ తలరాతను మారుస్తామని, పాలకులు ఎన్నో హామీలు గుప్పించారు. రాష్ట్ర విభజన వేళ.. కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామన్నారు. జలవనరులను ఎంతెంతగానో పెంచుతామన్నారు. అంతెందుకు ఈ ప్రాంతానికి బుందేల్‌ఖండ్‌ తరహాలో ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామన్నారు. కానీ, ఇవేవీ నెరవేరలేదు. రాయలసీమపై ప్రభుత్వ ఉదాసీనతను నిరసిస్తూ.. వామపక్ష, ప్రజాసంఘాలు బుధవారం రాయలసీమ బంద్‌ను పాటిస్తున్నాయి. బంద్‌కు ప్రజలను చైతన్య పరిచేందుకు, ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నాయి. అనంతపురం నగరంలో ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు, తలపై బిందెలు, వంటపాత్రలు, దుస్తుల మూటలతో.. వలస పరిస్థితులను ప్రతిబింబించేలా ర్యాలీ నిర్వహించారు. అటు కడప నగరంలోనూ వామపక్షనాయకులు బైక్‌ ర్యాలీని నిర్వహించారు. బంద్‌కు ప్రజలను చైతన్యపరచడంలో భాగంగా... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు.. మంగళవారం, అనంతపురం జిల్లా కదిరి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం, అక్కడి గొర్రెల సంతను సందర్శించి, పశుగ్రాసం కొరత వల్ల.. జీవాలను అమ్ముకుంటున్న రైతుల వెతలను తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న వారి కష్టాలనూ తెలుసుకున్నారు. కూలీలకు రెండు వందల రోజులు పని దొరికేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బుధవారం నాటి రాయలసీమ బంద్‌కు, ప్రతిపక్ష వైసీపీ కూడా మద్దతు ప్రకటించింది. ఉదయం నుంచే బంద్‌లో పాల్గొనాలని తద్వారా రైతులు, ఇతర ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని వామపక్ష, ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి.

18:38 - May 23, 2017

అనంతపురం : జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురంలోని పంట పొలాల్లో రైతులు నిర్మించుకున్న నీటి కుంటలను పరిశీలించారు గవర్నర్ నరసింహన్. రైతుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నీటి కుంటల వల్ల కలిగే ఉపయోగాలను రైతుల్ని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఉపాధి హామీ కూలీలతో వారి సమస్యలపై చర్చించారు. హార్టీ కల్చర్ వైపు మొగ్గుచూపాలని .. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నరసింహన్ రైతులకు సూచించారు. మరోవైపు గార్లదిన్నె ప్రభుత్వ వైద్యశాల హెచ్ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు ఏసిన కార్యక్రమంలోనూ గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. గవర్నర్ వెంట ఎమ్మెల్సీ శమంతకమణి, ఎమ్మెల్యే యామిని బాల, కలెక్టర్ వీరపాండ్యన్ తో పాటు పలువురు అధికారులు ఉన్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - అనంతపురం