అన్నాడిఎంకే

11:25 - April 6, 2018

ఢిల్లీ : లోక్ సభ నిరవధికంగా వాయిదా పడింది. లోక్ సభ సమావేశాలు ప్రారంభం కాగానే అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన చేపట్టారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీల నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తే అన్ని అంశాలపై చర్చిద్దామని స్పీకర్ సుమిత్ర మహాజన్ అన్నారు. వందేమాతరం గీతాలాపన తర్వాత సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.  

21:52 - September 12, 2017

చెన్నై : అన్నాడిఎంకేలో చిన్నమ్మ శశికళ శకం ముగిసినట్లేనా? తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగిస్తూ అన్నాడిఎంకె నిర్ణయం తీసుకుంది. మరోవైపు పళనిస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకే మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్ వేసింది.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత పార్టీలో ప్రభుత్వంలో చక్రం తిప్పాలని భావించిన చిన్నమ్మ
శశికళ ఆశలన్నీ అడియాసలవుతున్నాయి. ఇప్పటికే అక్రమ ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించారు. పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం నేతృత్వంలో చెన్నైలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి ఎప్పటికీ జయలలితదేనని జనరల్‌ కౌన్సిల్‌ తీర్మానించింది. ఆ బాధ్యతలను తాత్కాలికంగా చేపట్టిన శశికళను పదవి నుంచి తొలగిస్తూ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. పార్టీ చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా పన్నీర్‌ సెల్వం, అసిస్టెంట్‌ చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా పళనిస్వామి ఉంటారని కార్యవర్గం పేర్కొంది. శశికళ మేనల్లుడు దినకరన్‌ చేపట్టిన నియామకాలు, ప్రకటనలను ఆమోదించమని స్పష్టం చేసింది. పార్టీ రెండాకుల గుర్తును తిరిగి కైవసం చేసుకోవడానికి ప్రయత్నించాలని సమావేశం నిర్ణయించింది.

మరోవైపు త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామి ప‌ళ‌ని ప్రభుత్వం బ‌ల‌నిరూప‌ణ నిర్వహించాల‌ని డీఎంకే నేత స్టాలిన్ మద్రాస్‌ కోర్టుకు వెళ్లారు. స్టాలిన్‌తో పాటు పీఎంకే పార్టీకి చెందిన బాలు కూడా పిటిష‌న్ వేశారు. ఈ పిటిషన్‌పై అక్టోబ‌ర్ 10వ తేదీన  మద్రాస్ హై కోర్టు విచారణ చేపట్టనుంది. 

తమిళనాడు ప్రజలను, పార్టీ కార్యకర్తలను పన్నీర్‌సెల్వం, పళనిస్వామి మోసం చేశారని దినకరన్‌ మండిపడ్డారు. పళనిస్వామి ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తానని హెచ్చరించారు. అన్నాడిఎంకెకు చెందిన 19 మంది ఎమ్మెల్యేలు దినకరన్‌ వెంట ఉండడంతో పళనిస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడింది. 

శశికళకు  కాలం కలిసి రాలేదు. జయలలిత మరణానంతరం శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టడం....పన్నీర్‌ సెల్వంను సిఎంను పదవి నుంచి తొలగించడం జరిగిపోయాయి. తదనంతరం జరిగిన పరిణామాల్లో పార్టీ రెండుగా చీలిపోయింది. సిఎంగా బాధ్యతలు చేపడతారు అనుకునే సందర్భంలో అక్రమ ఆస్తుల కేసులో శశికళ జైలుపాలయ్యారు. దీంతో ఆమె మేనల్లుడు దినకరన్‌కు ఉప ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం పార్టీలో కొందరికి నచ్చలేదు. ఈ నేపథ్యంలో పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం వర్గాలు ఏకమయ్యాయి. శశికళ, దినకరన్‌కు  అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్లు  తాజాగా తీర్మానం చేశాయి. తాజా పరిణామాల నేపథ్యంలో శశికళ ఎలాంటి వ్యూహం పన్నుతారో  వేచి చూడాల్సిందే.

21:16 - December 22, 2016

అన్నాడీఎంకెలో లుకలుకలు మొదలయ్యాయా ? బీజేపీ తమిళనాడులో పావులు కదుపుతోందా ? డీఎంకే వ్యూహమేంటీ? తమిళనాడులో ఏం జరుగుతోంది ? ఐటీ దాడులు ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయి? ఐటీ దాడులు రాజకీయ ఎత్తుగడల్లో మునిగిన తమిళనాడు.. సీఎస్ రామ్మోహన్ రావు ఇంటిపై ఐటీ అధికారుల దాడులు.. తమిళనాట ఊపందుకుంటున్న రాజకీయాలు, సీఎం పీఠంపై కూర్చోవడానికి శశికళ ప్రయత్నాలు... ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

22:00 - October 26, 2016

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం చాలా మెరుగుపడిందని, ఆమె త్వరలోనే ఇంటికి చేరుకుంటారని అన్నాడిఎంకే అధికార ప్రతినిధి సిఆర్‌ సరస్వతి తెలిపారు. అమ్మ చాలా బాగున్నారు...దేవుడు ఆమెతో ఉన్నారని చెప్పారు. పార్టీ కార్యకర్తల ప్రార్థనలు, జయలలితకు చికిత్స జరిపిన లండన్, సింగపూర్‌, ఎయిమ్స్‌కు చెందిన వైద్య నిపుణుల కారణంగా ఆమె త్వరగా కోలుకున్నారని పేర్కొన్నారు. మరోవైపు జయలలిత త్వరగా కోలుకోవాలని కోరుతూ పెరంబూరులో స్థానిక ఎమ్మెల్యే వెట్రివేలు, అన్నాడిఎంకే కార్యకర్తల ఆధ్వర్యంలో మృత్యుంజయ యజ్ఞాన్ని చేపట్టారు. ఎకరం మైదానంలో 150 హోమ గుండాలను ఎర్పాటు చేసి ప్రత్యేక యాగం చేశారు.  ఈ యజ్ఞంలో 6 వందల మంది పూజారులు.. మూడు వేల మంది భక్తులు పాల్గొన్నారు.   

 

07:37 - August 20, 2015

చెన్నై: ప్రధాని మోది సిఎం జయలలితను కలుసుకోవడం అక్రమ సంబంధం లాంటిదని కాంగ్రెస్‌ నేత ఇళంగోవన్ చేసిన వ్యాఖ్యలతో తమిళనాడు అట్టుడుకుతోంది. ఇళంగోవన్‌పై అన్నాడిఎంకే ఆగ్రహంతో ఊగిపోతోంది. ఇళంగోవన్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేస్తోంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోది కొద్దిరోజుల క్రితం చెన్నయ్‌ వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జయలలితను ఆమె నివాసంలో మోది కలుసుకున్నారు. అయితే వీరి కలయికను తమిళనాడు కాంగ్రెస్‌ చీఫ్‌ ఇళంగోవన్‌ అక్రమ సంబంధంతో పోల్చడం వివాదాస్పదంగా మారింది.
తమిళనాడులో ఆందోళనలు 
జయలలితపై ఇళంగోవన్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ అన్నాడిఎంకే కార్యకర్తలు గత రెండురోజులుగా తమిళనాట ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. ఇళంగోవన్‌పై కేసులు నమోదు చేయడమే కాకుండా భౌతిక దాడులకు కూడా సిద్ధమయ్యారు. ఆగ్రహంతో ఇళంగోవన్‌ దిష్టిబొమ్మను తగలబెట్టారు.
కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసిన బిజెపి
మరోవైపు బిజెపి కూడా కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసింది. దేశ ప్రధానిని, మహిళా ముఖ్యమంత్రిని కించపరచేలా ఎలా వ్యాఖ్యానిస్తారని నిలదీసింది. ఇళంగోవన్‌ను పార్టీ నుంచి తొలగించాలని సోనియా గాంధీకి బిజెపి లేఖ రాసింది.
జర్నలిస్టుపై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడి
తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఇళంగోవన్ సర్దిపుచ్చుకునేందుకు యత్నించారు. మీడియా సమావేశంలో ఓ టీవీ రిపోర్టర్‌కు ఇళంగోవన్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. జర్నలిస్టుపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడికి యత్నించడంతో సమావేశం రసాభాసగా మారింది. ఈ గొడవ ఇప్పుడిప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. అన్నాడిఎంకే ఇళంగోవన్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేస్తుండగా...కాంగ్రెస్‌ తమ నేతను సమర్థించే పనిలో పడింది.

 

Don't Miss

Subscribe to RSS - అన్నాడిఎంకే