అమరావతి

21:58 - June 23, 2017

గుంటూరు : అమరావతిని స్మార్ట్‌ సిటిగా కేంద్రం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ. అమరావతి సెలక్ట్ కావడానికి కష్టపడిన అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. స్మార్ట్ సిటీ అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చే నిధులను 29 గ్రామాల్లో వినియోగిస్తామన్నారు మంత్రి నారాయణ. ఉండవల్లి, పెనుమాక గ్రామాల రైతులు సమీకరణకు ముందుకు వస్తున్నారని.. సమీకరణకు రాని భూములు ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా సేకరిస్తామని మంత్రి చెప్పారు. 

 

20:05 - June 23, 2017

గుంటూరు : అక్కడ ఇంటి కిరాయి ఎంతో చెబితే ఎవ్వరికైనా గుండె గుభేల్‌ మంటుంది.. నిత్యావసరాల ధరలు చూస్తే నిద్రే పట్టదు.. ప్రతి సరుకు రేటు సామాన్యులకు సమస్యలు సృష్టిస్తోంది.. మెట్రో నగరాల్లోకంటే ఎక్కువగాఉన్న ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.. అమరావతిలో పెరిగిన కాస్ట్‌ ఆఫ్ లివింగ్‌ ఖర్చులతో అక్కడికి రావాలంటేనే ఉద్యోగులు, వ్యాపారులూ వణికిపోతున్నారు.. 
సామాన్యుల జీవనం మరింత కష్టం
ఏపీ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో సామాన్యుల జీవనం మరింత కష్టమైపోయింది.. కాస్ట్‌ ఆఫ్ లివింగ్ పెరిగిపోయి అక్కడ ఉండాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులేకాదు.. బడా వ్యాపారులుసైతం ఇక్కడి ధరలు చూసి వణికిపోతున్నారు.. 
నిత్యావసరాలకు రెట్టింపు ధరలు
సాధారణంగా మెట్రోపాలిటన్‌ నగరాల్లో ఇంటి అద్దెలు ఎక్కువగా ఉంటాయి.. అమరావతిలోమాత్రం అంతకంటే ఎక్కువ ధరలు జనాల్ని బెంబేలెత్తిస్తున్నాయి.. ఉండవల్లి, తాడేపల్లిలో మామూలు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల రెంట్‌ పదివేలరూపాయలకు పైమాటే ఉంది.. మందడం, తూళ్లూరు గ్రామాల్లో 12నుంచి 15వేల రూపాయలు పలుకుతోంది.
రాజధాని ప్రకటన తర్వాత అన్ని ధరలూ పెంపు 
అమరావతి రాజధాని కాకముందు ఇక్కడ అద్దెలు మామూలుగానే ఉండేవి.. రాజధాని ప్రకటన తర్వాత అన్ని ధరలూ పెరిగిపోయాయి.. నిత్యావసరాల విషయంలోనూ అదే పరిస్థితి ఉంది.... విజయవాడ రైతు బజార్‌నుంచి తక్కువ ధరకు కూరగాయలు తెచ్చి అమరావతి పరిసర ప్రాంతాల్లో రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు వ్యాపారులు.. హొటల్స్, కూల్‌డ్రింక్స్, పాలు ఇలా ఏది ముట్టుకున్నా రేట్లు మండిపోతున్నాయి.. నిత్యావసరాల్ని ఇక్కడ కొనలేక.. సిటీకి వెళ్లి తెచ్చుకోలేక జనాలు అవస్థలు అనుభవిస్తున్నారు.. ధరలుచూసి ఇక్కడికి రావాలంటేనే వణికిపోతున్నారు.. 
పెరిగిన అద్దెలు, ఖర్చులతో స్థానికుల ఇబ్బంది   
పెరిగిన అద్దెలు, ఖర్చులు స్థానికులనూ ఇబ్బంది పెడుతున్నాయి.. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ రేట్లు తలకుమించినభారంగా మారాయి.. హైదరాబాద్‌నుంచి వచ్చిన ఉద్యోగులూ ఈ రేట్లుచూసి టెన్షన్ పడుతున్నారు.. ఈ సమస్యను గతంలో ఉద్యోగులు సీఎం దృష్టికితెచ్చారు.. దీనిపై స్పందించిన చంద్రబాబు ఇష్టానుసారంగా అద్దెలుపెంచితే రెంటల్‌ యాక్ట్‌ తీసుకొస్తామని అన్నారు.. అయితే అది ఇప్పటివరకూ అమల్లోకి రాలేదు. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ అన్ని సౌకర్యాలు మామూలు ధరలకు లభించాలి.. సగటు మనిషి జీవించే స్థాయిలో వసతులు లేకపోతే ఏం చేసినా ప్రయోజనం ఉండదు.. ప్రభుత్వం ఇప్పటికైనా అమరావతిలో కాస్ట్‌ ఆఫ్‌ లింవింగ్‌పై దృష్టిపెట్టాల్సిన అవసరమెంతైనా ఉంది.

 

15:52 - June 20, 2017

అమరావతి: రెండు రూపాయలకే 20 లీటర్ల మంచినీరు అందించే ఎన్టీఆర్‌ సుజల పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలోని వెంకటపాలెంలో ప్రారంభించారు. ఈ పథకంతో తొలిదశలో 29 గ్రామాలకు లబ్ది చేకూరుతుందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మంచినీటిని అందిస్తున్నామని.. దీన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని చంద్రబాబు అన్నారు. ఈ మంచినీటి పథకానికి మెగా గ్రూప్‌కు చెందిన కృష్ణారెడ్డి, హెటిరో కంపెనీకి చెందిన పార్థసారథిరెడ్డి దాతలుగా ముందుకు వచ్చినందుకు వారిని సీఎం అభినందించారు.  

16:46 - June 18, 2017

విజయవాడ : ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి.. అమరావతి ఎయిర్‌లైన్స్‌ని ఏర్పాటు చేయాలని.. ఏపీ సర్కార్ భావిస్తోంది. ప్రపంచ ప్రసిద్ధ నగరాలన్నీ సొంత ఎయిర్‌ లైన్స్‌ కలిగి ఉన్నాయి. అమరావతిలో కూడా సొంత ఎయిర్‌ లైన్స్‌ను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులను.. సకాలంలో పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనికి సంబంధించి మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ అధికారులతో సీఎం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ-ఇండోర్‌-తిరుపతి-విజయవాడ-ముంబై, విజయవాడ-తిరుపతి-ఇండోర్‌-ఢిల్లీ మధ్య జులై నెలాఖరు నుంచి.. జూమ్‌ ఎయిర్‌ సర్వీసులు ప్రారంభం కానున్నట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ద్వారా సర్వీసులు పెంచి.. ప్రజలందరికీ విమానయానం అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కోరారు. విజయవాడ నుంచి దుబాయ్‌, హాంకాంగ్, కౌలాలంపూర్‌లకు నేరుగా విమాన సర్వీసులు నడపాలని సీఎం సూచించారు. ప్రపంచ ప్రసిద్ధ నగరాలన్నీ సొంత ఎయిర్‌ లైన్స్ కలిగి ఉన్నాయనీ, అమరావతిలో కూడా సొంత ఎయిర్‌ లైన్స్‌ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. దేశం మొత్తం మీద 18 శాతం ఎయిర్‌ ట్రాఫిక్ వృద్ధి రేటు నమోదవగా.. ఆంధ్రప్రదేశ్‌లో 35 శాతం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. దీనికి అనుగుణంగా విమానాశ్రయాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని కోరారు. విజయవాడ విమానాశ్రయంలో రన్‌ వే, రెండో టెర్మినల్‌ భవనాల పనులు త్వరిత గతిన పూర్తి చేసి.. కార్గో విమాన సర్వీసులు ప్రారంభించాలని కోరారు.

21న శంకుస్థాపన..
ఓర్వకల్లు విమానాశ్రయానికి ఈ నెల 21న శంకుస్థాపన చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. 10 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. భోగాపురం గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయం భూ సమస్యలను పరిష్కరించి సంవత్సర కాలంలో పూర్తి చేయాలన్నారు. అన్ని పట్టణాలు, మండల కేంద్రాలలో హెలిపాడ్‌లు నిర్మించాలని చెప్పారు. ప్రతీ యేటా విశాఖ, తిరుపతిలో ఎయిర్‌ షోలు ఏర్పాటు చేయాలని కోరారు. మచిలీపట్టణం, భావనపాడు గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టుల నిర్మాణం వేగంగా జరగాలని.. ముఖ్యమంత్రి ఆదేశించారు. రోడ్డు మార్గాలు, జల మార్గాలు, వాయు మార్గాలు, ఓడ రేవుల అనుసంధానంతో ఏపీని లాజిస్టిక్‌ హబ్‌గా మార్చే అంశంపై.. టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. లక్షా 30 వేల కోట్లతో సాగరమాల ప్రాజెక్ట్‌ పనులు రాష్ట్రంలో జరుగుతున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. రోడ్డు, రైలు, ఫిషరీస్‌, ఇండస్ట్రీస్‌ శాఖల సమన్వయంతో ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని బాబు చెప్పారు. గ్యాస్ పైపులైన్లను ఏర్పాటు చేయడంలో జరుగుతున్న జాప్యంపై కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రికి లేఖ రాయాలని.. అధికారులకు సీఎం చెప్పారు. తిరుపతిలో సైన్స్‌ సిటీ, విజయవాడలో సిటీ స్క్వేర్ నిర్మాణాలను వెంటనే చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అనంతపురములో ఎనర్జీ యూనివర్శిటీని 400 కోట్లతో.. కాకినాడలో లాజిస్టిక్‌ యూనివర్శిటీని 350 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్థానిక యూనివర్శిటీలతో మాట్లాడుకొని తాత్కాలిక క్యాంపస్‌లతో ఈ విద్యా సంవత్సరం నుంచి కార్యకలాపాలను ప్రారంభించాలని ఆదేశించారు.

07:28 - June 17, 2017

గుంటూరు : పర్యాటక, విద్యా రంగాల అభివృద్ధిలో భాగంగా ఏపీ రాజధాని అమరావతిలో స్టార్‌ హోటళ్లు, అంతర్జాతీయ స్కూళ్ల ఏర్పాటుకు ఏ సంస్థలూ ఆసక్తి చూపడంలేదు. ఇందుకోసం టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఈసారి ఇన్విటేషన్‌ పద్ధతిని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్టార్‌ హోటళ్లు, అంతర్జాతీయ స్కూళ్ల యాజమాన్యాలను పిలిపించి చర్చించేందుకు చర్యలు చేపట్టింది.  

21:32 - June 16, 2017

అమరావతి: తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలపై కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తామని ఏపీ విద్యుత్‌శాఖ మంత్రి కళా వెంకట్రావు అన్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ బకాయిలకు సంబంధించిన అంశాలను లేఖలో పేర్కొంటామన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్‌ వివాదం నేపథ్యంలో.. ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మూడువేల కోట్ల విద్యుత్‌ బకాయిలు తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సి ఉందన్నారు. తెలంగాణ బకాయిల అంశాన్ని గవర్నర్‌ దగ్గర జరిగే మీటింగ్‌లోనూ లేవనెత్తుతామన్నారు. 

21:17 - June 15, 2017

అమరావతి: తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణను మరింత పటిష్టం చేయడంపై చంద్రబాబు దృష్టిసారించారు. పదేపదే హెచ్చరిస్తున్నా తెలుగు తమ్ముళ్లు కట్టుదాటుతుండడంతో ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని డిసైడ్‌ అయ్యారు. లక్ష్మణ రేఖ దాటితే ఇక నుంచి క్షమించే ప్రసక్తే ఉండబోదని పార్టీ సమన్వయ కమిటీలో చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈదిశగా మియాపూర్‌ భూకుంబకోణంలో ప్రధాన నిందితుడు, పార్టీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. క్రమశిక్షణను పాటించని వారిని ముందు సస్పెండ్‌ చేస్తామని.. ఆ తర్వాతే విచారణ చేపడతానని హెచ్చరించారు. ఇష్టారాజ్యంగా బహిరంగ విమర్శలకు దిగినే తక్షణ చర్యలు ఉంటాయని నేతలకు స్పష్టం చేశారు చంద్రబాబు.

చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ
ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో పార్టీ క్రమశిక్షణపైనే ప్రధానంగా చర్చ జరిగింది.  బహిరంగంగా వ్యక్తిగత విమర్శలకు దిగిన మంత్రులు గంటా, అయ్యన్న వ్యవహారంపై చంద్రబాబు సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.  మంత్రుల స్థాయి వ్యక్తులు బహిరంగ విమర్శలు చేసుకోవడమేంటని ఇద్దరినీ ప్రశ్నించారు.   ఇద్దరికీ ఎన్నిసార్లు సర్దిచెప్పినా బహిరంగ విమర్శలు చేసుకోవడంపట్ల చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  పార్టీ నాయకులు చేసుకునే విమర్శల కారణంగా ప్రతిపక్షాలకు అవకాశం కల్పించినట్టవుతోందని సీరియస్‌ అయ్యారు. గంటా, అయ్యన్న వ్యవహారంపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ కమిటీకి సీనియర్‌ మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షుడుగా నియమించారు. త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
పార్టీ క్రమశిక్షణకు అందరూ కట్టుబడి ఉండాలన్న చంద్రబాబు
పార్టీ క్రమశిక్షణకు అందరూ కట్టుబడి ఉండాలని చంద్రబాబు నేతలకు సూచించారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఇక నుంచి సహించబోనని హెచ్చరించారు. ఇక నుంచి క్రమశిక్షణ ఉల్లంఘించే వారికి సర్దిచెప్పడాలు, హెచ్చరించడాలు ఉండబోవన్నారు.  లక్ష్మణరేఖ దాటే వారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తానని... ఆ తర్వాతే విచారణ చేస్తానని నేతలను చంద్రబాబు హెచ్చరించారు.  బహిరంగ విమర్శలకు దిగుతూ పార్టీ, ప్రభుత్వం ప్రతిష్టతను దెబ్బతీస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. పార్టీ క్రమశిక్షణపై త్వరలోనే క్యాడర్‌కు శిక్షణా తరగతులు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. 
టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిపై వేటు
ఇక హైదరాబాద్‌లో పలుచోట్ల భూకబ్జాలకు పాల్పడిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిపైనా చంద్రబాబు వేటు వేశారు.  ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  నిజానిజాలు తేలేవరకు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌  చేస్తున్నట్టు ప్రకటించారు.  జిల్లాల  పార్టీ ఇంచార్జ్‌ల పనితీరుపైనా సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించారు. జిల్లాల పార్టీ అధ్యక్షుల పేర్లను ఈ సమావేశంలో చంద్రబాబు ఖరారు చేసినట్టు తెలుస్తోంది.  మొత్తానికి ఏపీ సీఎం చంద్రబాబు సర్ది చెప్పే ధోరణికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇకపై నేతల పట్ల కఠినంగానే ఉండాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్టున్నారు.  మరి అధినేత తీసుకుంటున్న నిర్ణయాలతోనైనా తెలుగు తమ్ముళ్ల మైండ్‌సెట్‌ మారుతుందో.. లేదో చూడాలి. 

 

 

19:30 - June 15, 2017

గుంటూరు : అమరావతిలో ఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగుతోంది.. ఈ భేటీలో పలు అంశాలపై చర్చిస్తున్నారు.. నవనిర్మాణ దీక్ష జరిగినతీరు, ఏరువాక కార్యక్రమం... తాగునీటి కార్పొరేషన్‌ ఏర్పాటు, నిరుద్యోగ భృతి విధివిధానాలు.. విశాఖలో భూకబ్జాలు, అమరావతి నగర నిర్మాణం అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు.. 

19:34 - June 12, 2017

అమరావతి: ఖరీఫ్‌ సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువులను సిద్ధం చేశామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. నకిలీ విత్తన వ్యాపారులపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. రైతులు నష్టపోకుండా.. పంటలపై అవగాహన కల్పిస్తున్నామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:26 - June 11, 2017

విజయవాడ : రాజధాని నిర్మాణానికి భూములివ్వని ఉండవల్లి, పెనమాక గ్రామాలను గ్రీన్ బెల్ట్‌గా ప్రకటించాలని సీఎం చంద్రబాబు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. ఇంకా వేచి చూసే పద్దతి వద్దని..ఇప్పటికే చాలా ఆలస్యం చేశామన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో రాజధాని నిర్మాణంపై సీఆర్డీఏ అధికారులతో సమీక్షించారు. రాజధానిలో రోడ్ల నిర్మాణ పనులను డెడ్‌లైన్‌లోగా పూర్తిచేయని కాంట్రాక్ట్‌ సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. రాజధాని నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు గ్రీన్ బెల్ట్ అంశాన్ని అధికారుల వద్ద ప్రస్తావించారు. రాజధానిలో నిర్మిస్తున్న రహదారులు, పరిపాలన, విద్యా నగరాల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా భూసేకరణలో ఉండవల్లి, పెనుమాక మరో గ్రామం నుంచి ఎదురైన అవరోధాలను ఒక్కొక్కటీగా అధిగమిస్తున్నామని సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ మూడు గ్రామాల్లో భూ సమీకరణకు ముందుకొస్తున్న వారి నుంచి ముందుగా భూములు తీసుకోవాలన్నారు సీఎం. ఆ తరువాతే భూసేకరణకు వెళ్లాలని సూచించారు. ఇంకా సాగు చేసుకుంటామని ఒత్తిడి తెస్తే.. రాబోయే కాలంలో ఆ భూములను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించకుండా ఆ ప్రాంతాన్ని గ్రీన్ బెల్ట్ కింద ప్రకటించాలన్నారు.

వ్యతిరేకం..
రాజధానిలో నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్, సబార్టేరియల్ రోడ్ల నిర్మాణంలో జాప్యాన్ని ఇక ఏమాత్రం సహించబోమని సీఎం హెచ్చరించారు. పనులు నిర్ణిత గడువులోగా వేగవంతంగా పూర్తిచేసేలా నిర్మాణ సంస్థలకు అల్టిమేటం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు పరిపాలన నగరం మాస్టర్ ప్లాన్ దాదాపు పూర్తయ్యిందని, వచ్చే వారంలో ప్రభుత్వానికి అందజేస్తామని నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ చెప్పినట్లు సీఆర్‌డీఏ కమిషనర్ సీఎం దృష్టికి తెచ్చారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఇళ్లు లేని రైతు కూలీలకు ఇళ్లు నిర్మించాలన్నారు సీఎం చంద్రబాబు. కేంద్ర, రాష్ట్రం ప్రభుత్వం సబ్సిడీ కింద 3 లక్షల వరకు ఇవ్వనుంది. దీని కోసం ఇప్పటికే సీఆర్డీఏ అధికారులు సర్వే చేసి 5 వేల మంది రైతు కూలీలను గుర్తించారు. ఒక్కో ప్రాంతంలో 500 ఇళ్ల చొప్పన మొత్తం 10 ప్రాంతాల్లో ఇళ్లు నిర్మిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఇక ఈ సమావేశంలో పాల్గొన్న విట్, అమృత, ఎస్ఆర్ఎం, ఎన్ఐడీ తదితర విద్యా సంస్థల ఏర్పాటు పురోగతిపై ఆయా సంస్థల ప్రతినిధులు సీఎంకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. అమరావతిలో ఏర్పాటవుతున్న యూనివర్శిటీలపై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు నిరంతర చర్చ జరపడం ద్వారా మన రాష్ట్ర విద్యాసంస్థలకు జాతీయస్థాయి బ్రాండింగ్ వస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఉండవల్లి, పెనమాక గ్రామాలను గ్రీన్ బెల్ట్‌గా ప్రకటించాలన్న సీఎం నిర్ణయం ఆ ప్రాంత రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మూడు పంటల పండే వ్యవసాయ భూముల కోసం రెండున్నర ఏళ్లుగా పోరాటం చేస్తున్న రైతులు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - అమరావతి