అలసత్వం

13:41 - August 21, 2018

మహబూబ్‌నగర్‌ : ఆ గ్రామాలకు  వెళ్ళాలంటే నాటు పడవే దిక్కు.. బడికెళ్ళే పిల్లలైనా.. ఆసుపత్రికి వెళ్ళాల్సిన గర్భిణీ స్ర్తీలైనా.. ఊరు దాటాలంటే పడవ ఎక్కాల్సిందే. దాదాపు పదేళ్ళ క్రితం ర్యాలంపాడు తుంగభద్ర బ్రిడ్జికి శంకుస్థాపన చేసినా.. నేటికీ పనులు పూర్తి కాలేదు. తెలంగాణ రాష్ట్రంలోని ర్యాలంపాడు, సుల్తానపురం, జిల్లెలపాడు గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. తుంగభద్ర నదికి భారీగా వరద నీరు రావడంతో ఈ మూడు గ్రామాల ప్రజలు బయటకు రాలేకపోతున్నారు.  దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

 

12:32 - August 10, 2018

శ్రీకాకుళం : సిక్కోలు రిమ్స్ ఆసుపత్రికి మాయరోగం ఆవహించింది. కోట్లాది రూపాయలు నిధులు ఖర్చుపెడుతున్నా.. బాధ్యతాయుతమైన సేవలు కరువవుతున్నాయి. వైద్యుల ఇష్టారాజ్యం.. సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల అలసత్వంతో ... సిక్కోలు పెద్దాసుపత్రికి నిర్లక్ష్యపు జబ్బు పడుతోంది. ఇటీవల ఇంజక్షన్ వికటించి ముగ్గురు మృతిచెందగా.. మరో పదిహేడు మంది పరిస్థితి విషమంగా మారడం ఈ పరిస్థితులకు అద్దం పడుతోంది.
నిధులు ఫుల్...సేవలు నిల్
శ్రీకాకుళంలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్ ఆసుపత్రి ఇది.. దాదాపు జిల్లాలోని ముప్పై ఎనిమిది మండలాల్లోని రోగులకు పెద్ద దిక్కుగా మారిన ఈ ఆసుపత్రికి నిలువునా నిర్లక్ష్యపు జబ్బు చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఇంజక్షన్ వికటించి ముగ్గురు మృతి చెందడంతో పాటు, మరో పదిహేడు మంది ప్రాణాల మీదకు రావడానికి కారణం వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమేనన్న ఆరోపణలున్నాయి. 
రిమ్స్ కు వందల కోట్ల బడ్జెట్ కేటాయింపులు 
వందలాది మంది వైద్యులు, సిబ్బంది విధులు నిర్వర్తించే రిమ్స్ ఆసుపత్రికి వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారు. ఆసుపత్రి భవనాలు సైతం కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. అయినప్పటికీ.. జిల్లాలో ఉన్న ఏకైక ఈ ధర్మాసుపత్రిలో బాధ్యతాయుత సేవలు కరువుతున్నాయి. ఆసుపత్రిలో చేరుతున్న రోగులకు సరైన సేవలు అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వైద్య పరీక్షలు, స్కానింగ్ లు, ఇతర రిపోర్టులు అవసరమైనప్పుడు బయట ప్రయివేటు లేబొరేటరీలపై ఆధారపడాల్సివస్తోందని బాధితులు వాపోతున్నారు. వీటికి తోడు.. వైద్యులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదని రోగులు చెబుతున్నారు. నర్సుల పరిస్థితీ అంతే.  రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణం అంతా అపరిశుభ్రంగా తయారవుతున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యాడని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
నీరుగారిపోతోన్న రిమ్స్ లక్ష్యం  
అయితే లక్షలాదిమంది జిల్లా వాసులకు పెద్ద దిక్కుగా ఉన్న ఈ ఆసుపత్రి మరింత భరోసా కల్పించేలా రోగులకు సేవలందించాలని స్థానికులు కోరుతున్నారు. రిమ్స్ లక్ష్యం ఇలాంటి పరిణామాలతో నీరుగారిపోతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపట్ల  ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

 

20:43 - March 30, 2018

కేంద్రం అలసత్వంతోనే సీబీఎస్ఈ ప్రశ్నపత్రాలు లీకేజీ అయినవని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విద్యరంగా నిపుణులు నారాయణ, ఎస్ ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వర్ రావు, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి, హెచ్ ఎస్ పీఏ ప్రతినిధి కృష్ణ జక్క, బాధితుడు కార్తీక్ పాల్గొని, మాట్లాడారు. సీబీఎస్ఈ ప్రశ్నపత్రాల లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. మంత్రి, బాధ్యులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..  

 

07:58 - December 29, 2017

ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రప్రభుత్వం అలసత్వం వహిస్తోందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో నవతెలంగాణ ఎడిటర్, విశ్లేషకులు ఎస్.వీరయ్య, బీజేపీ అధికార ప్రతినిధి ఎన్ వి.సుభాష్ పాల్గొని, మాట్లాడారు. ఉమ్మడి హైకోర్టు విభజన విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కేంద్రం బాధ్యతగా వ్యవహరించడం లేదని విమర్శించారు. విభజన ప్రక్రియను కేంద్రం సజావుగా జరిపించాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

08:33 - November 19, 2017

ఏపీ నూతన రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు అనురాధ, సీపీఎం నేత సీహెచ్ బాబురావు, గ్రీన్ ట్యిబ్యునల్ పిటిషన్ దారుడు శ్రీమన్నారాయణ పాల్గొని, మాట్లాడారు. మూడేళ్లయినా డిజైన్స్ ఇంకా పరిశీలనలోనే ఉన్నాయన్నారు. నిబంధనలు పాటించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. పర్యావరణానికి హాని కలగకుండా అమరావతి నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....
 

14:45 - April 22, 2017

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన పనులు పడకేశాయి. అధికారుల పని తీరు ఒక అడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ఫలితంగా ట్యాంక్‌బండ్‌ దగ్గర దుర్వాసన దంచి కొడుతోంది. ఈ దెబ్బతో నగరవాసులు, పర్యాటకులు అటువైపు వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. హుస్సేన్‌సాగర్‌ వద్ద ముక్కుపుటాలు అదిపోయేంత దుర్వాసన. రెండు నిమిషాలు కూడా మనుషులు నిలవలేని దుస్థితి.

కెమికల్స్‌, రసాయనాలు, చెత్తాచెదారాలతో ....

హుస్సేన్‌సాగర్‌ కెమికల్స్‌, రసాయనాలు, చెత్తాచెదారాలతో నిండిపోయింది. ప్రక్షాళన పనులు తాత్కాలికంగా వాయిదా పడ్డాయో లేక.. అధికారుల అలసత్వమో హుస్సేన్‌సాగర్‌ యథాతథ దుస్థితికి చేరుకుంది. గతంలో సాగర్‌ నీటి వ్యర్థాల తీవ్రతను తెలుసుకునేందుకు.. ఆస్ట్రియా నిపుణుల బృందం నమూనాలను సేకరించింది. ఆ ఫలితాల ఆధారంగా, మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం సంకల్పించుకుంది. ఇందులో భాగంగా, చెత్త తొలగింపు పనులు ప్రారంభించింది. అయితే ఆ పనులు నామమాత్రంగానే సాగడంతో హుస్సేన్‌ సాగర్‌ వద్ద దుర్వాసన యథావిధిగానే వెలువడుతోంది. దీని ప్రభావం పర్యావరణంపై తీవ్రంగా పడుతోంది.

కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం శూన్యం

నెక్లెస్‌ రోడ్‌ నుంచి లుంబినీ పార్క్‌ వరకు ట్యాంక్‌ బండ్‌ పరిసర ప్రాంతాల్లో సంచరించాలంటేనే.. నగరవాసులు, పర్యాటకులు భయపడిపోతున్నారు.కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం మాత్రం శూన్యంగా మారింది.

హుస్సేన్‌సాగర్‌లో విషపూరిత రసాయనాలు ఇంకా అలాగే.....

హుస్సేన్‌సాగర్‌లో విషపూరిత రసాయనాలు ఇంకా అలాగే ఉన్నాయి. నీటి అడుగు భాగాన ఉన్న వ్యర్థాల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. అసలు అందులోని రసాయనాలు ఏంటి? వాటిని పూర్తిగా బయటకు తొలగించే వీలు లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వ్యర్థాలను బయటకు తీస్తే ప్రజలకు కలిగే ఇబ్బందులు ఏమిటి.. వ్యర్థాలను ఎక్కడ వేయవచ్చు. ఈ విషయంలో టీ సర్కార్ వైఖరి పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. సాగర్‌ నీటిని పూర్తిగా ఖాళీ చేసి ప్రక్షాళన చేయాలని కేసీఆర్‌ భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసినా హుస్సేన్‌సాగర్‌ పరిస్థితి మారలేదు. ఇంకా నాలాల మళ్లింపు పనులు పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం వ్యర్థజలాలు సాగర్‌ను కలుషితం చేస్తూనే ఉన్నాయి.

పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని ...

హుస్సేన్‌సాగర్‌కు పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్‌, నగర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌లు చెప్పారు. కానీ అది ఆచరణలోకి రావడం లేదు. పైగా ఎక్కడ లోపం ఉందన్నది ఇప్పటికీ ప్రభుత్వానికి అంతుచిక్కని సమస్యగానే మారింది. ఇప్పటికైనా సాగర్‌ ప్రక్షాళనను పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. 

13:37 - February 14, 2017

హైదరాబాద్: 2012లో ఢిల్లీలో దారుణ అత్యాచారానికి గురైన నిర్భయ జ్ఞాపకార్థం దేశంలోని మహిళల భద్రత కోసం స్వచ్ఛంద సంస్థలు చేపట్టే కార్యక్రమాల కోసం నిర్భయ నిధి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ప్రతి సంవత్సరం లాగానే 2015-16 సంవత్సరానికి గాను నిర్భయ కు కేటాయించిన నిధుల్లో పైసా కూడా ఖర్చు చేయలేదు. దీనికి గల కారణాలు ఏమిటి? ఇదే అంశంపై 'వేదిక'లో ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో సామాజిక కార్యకర్త దేవి, మహిళా కాంగ్రెస్ నేత కీర్తి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

16:20 - January 20, 2017

హైదరాబాద్ : కృష్ణా నీటి పంపకాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. కృష్ణా ట్రిబ్యునల్‌ బోర్డు కాస్తా చంద్రబాబు ట్రిబ్యునల్‌ బోర్డుగా మారిపోయిందన్నారు. చంద్రబాబు యధేచ్ఛగా జలదోపిడీకి పాల్పడుతున్నా కేసీఆర్‌ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ మోడీ భజన మానుకొని కృష్ణా జలాలపై దృష్టి సారించాలన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కోరారు. 

 

12:49 - January 12, 2017

హైదరాబాద్ : చిన్న పని కోసం చెప్పులు అరిగేలా తిరగాలి.. పైసలు లేనిదే పనులు కావు... జీహెచ్‌ఎంసీలో జరుగుతున్న తీరుపై సాక్ష్యాత్తు సీఎం కేసీఆర్‌ అన్న మాటలివి. గ్రేటర్‌ వాసుల సమస్యల పరిష్కారం అవ్వాలంటే అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని.. అవినీతి లేని పాలన సాగాలని పిలుపునిచ్చారు. అందుకు తగ్గట్టుగా గ్రేటర్‌ పరిధిలో సర్కిళ్లను  పెంచింది. అయితే వాటికి అధికారాలు ఇవ్వడంలో.. కార్యాలయాలను ఏర్పాటు చేయడంలో మాత్రం అలసత్వం వహిస్తోంది. 
గ్రేట‌ర్ ప‌రిధిలో స‌ర్కిళ్ల  పెంపు 
గ్రేట‌ర్ ప‌రిధిలో ఉన్న కోటి మంది జ‌నాభాకు మెరుగైన సేవ‌లు అందించాలంటే ప్రస్తుతం ఉన్నపాల‌న‌ను పూర్తిగా మార్చాల‌ని డిసైడ్ చేసింది ప్రభుత్వం. అందులో భాగంగానే గ్రేట‌ర్ ప‌రిధిలో ఉన్న స‌ర్కిళ్లను భారీగా పెంచి ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి వ‌ర‌కు ప‌నిచేసేలా ప్లాన్‌ చేసింది. అందులో భాగంగానే 18గా ఉన్న గ్రేట‌ర్ స‌ర్కిళ్లను కొద్ది నెలల వ్యవధిలో 30 స‌ర్కిళ్లకు పెంచింది. అందుకు అనుగుణంగా అధికారుల‌ను సిబ్బందిని కేటాయించి సిటిజ‌న్స్ ప‌నులు పెండింగ్ లో ఉండ‌కుండా చూడాలని అధికారుల‌ను ఆదేశించింది ప్రభుత్వం.
ప్రభుత్వ ఆదేశాలు అమ‌లు కావ‌డం లేదు 
ఇంత వ‌ర‌కు భాగానే ఉంది కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు గ్రేట‌ర్ లో అమ‌లు కావ‌డం లేదు. స‌ర్కిళ్ల సంఖ్యను పెంచి మూడు నెల‌లు పూర్తి కావ‌స్తున్నా పూర్తిస్థాయిలో అధికారుల‌ను కేటాయించలేదు.  కొంద‌రు అధికారుల‌ను ట్రాన్స్ ఫ‌ర్ చేసినా ఇప్పటికీ వారు అక్కడ విధుల్లో చేరలేదు. కొన్ని చోట్ల అర‌కొరగా అధికారులు  నియ‌మించ‌బ‌డ్డప్పటికీ కార్యాల‌యాలు మాత్రం పాత ఆఫిసుల్లోనే కొన‌సాగుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన స‌ర్కిళ్లకు కొత్త కార్యాల‌యాల‌ను కేటాయించ‌డంలో మాత్రం బ‌ల్దియా ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విఫ‌ల‌మ‌య్యారు. 
నలుగురు డిప్యూటి క‌మీష‌న‌ర్లకు అద‌న‌పు బాధ్యతలు 
ఇక అధికారుల కేటాయింపు విష‌యంలోనూ పూర్తి స్థాయిలో పంపిణీ చేయడం లేదు. నలుగురు డిప్యూటి క‌మీష‌న‌ర్లకు అద‌న‌పు బాధ్యతలు ఇచ్చారు. స‌ర్కిల్ కు ఉండాల్సిన స్టాఫ్ కంటే చాలా మంది త‌క్కువ‌గా ఉన్నా రెగ్యులర్‌  స్టాఫ్‌ మాట ప‌క్కన పెడితే కనీసం కాంట్రాక్టు ఉద్యోగుల‌ను కూడా నియ‌మించ‌లేదు. దీంతో ఉన్న త‌క్కువ మంది సిబ్బందితోనే కొత్త పాత, స‌ర్కిళ్ల అధికారులు ప‌నులు చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న చాలా స‌ర్కిల్ కార్యాల‌యాలు ప్రజ‌ల‌కు దూరంగా ఉంటున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన స‌ర్కిళ్లకు ఆయా ప్రాంతాల్లోనే పెద్ద పెద్ద వార్డు ఆఫీసులు అందుబాటులో ఉన్నాయి. 
కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్న నగరవాసులు 
ఎక్కువ స‌ర్కిళ్లు ఎక్కువ మంది అధికారులు ఉంటే ప‌నులు వేగంగా జ‌రిగి ఎలాంటి అవినీతికి తావు ఉండ‌ద‌ని ప్రభుత్వం భావించినప్పటికీ.. ప‌రిస్థితిలో ఎలాంటి మార్పులేద‌నే విమ‌ర్శలున్నాయి. ఎప్పటి లాగే కార్యాల‌యాల చుట్టు చెప్పుల‌రిగేలా తిరుగాల్సి వ‌స్తుందంటున్నారు నగరవాసులు. ఇప్పటికైనా కొత్తగా ఏర్పాటు చేసిన సర్కిళ్లకు పూర్తి స్థాయిలో అధికారులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలందరికి సమీపంలో ఉండే ప్రాంతాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నగర వాసులు కోరుతున్నారు. 

 

15:13 - January 8, 2017

కాకినాడ : ఏపీలో బీచ్ ఫెస్ట్ సందడి మొదలవుతోంది. ఏటా సంక్రాంతికి.. నిర్వహించే సాగర సంబరాలకు.. తీరప్రాంతాలు సిద్ధమవుతున్నాయి. అయితే కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ఫెస్ట్ పనులు నత్తనడకన సాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కాకినాడ బీచ్ ఫెస్టివల్ పనుల్లో అలసత్వంపై టెన్ టీవీ ప్రత్యేక కథనం. 
నత్తనడకన సాగుతున్న పనులు  
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నెల రెండు పండుగలను తెస్తోంది. ఒకటి సంక్రాంతి అయితే.. రెండోది సాగరతీరంలో నిర్వహించే బీచ్‌ ఫెస్టివల్‌. సాగరతీర పండుగ కోసం.. సముద్రతీర ప్రాంతాలన్నీ ఇప్పటికే సన్నద్ధమయ్యాయి. ముఖ్యంగా కాకినాడలో బీచ్‌ ఫెస్ట్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. అయితే, పనులు నత్తనడకన సాగుతుండడమే, పండుగ సక్రమ నిర్వహణపై అనుమానాలను పెంచుతోంది. 
కాకినాడ బీచ్ కు పోటెత్తుతున్న పర్యాటకులు  
కాకినాడ బీచ్ నిత్యం పర్యాటకులతో పోటెత్తుతుంటుంది. ఇటీవల టూరిస్టుల సంఖ్య భారీగా పెరిగింది. దీనికి తగ్గట్టుగా సాగరతీరాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే కాకినాడ బీచ్ అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించింది. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులో భాగంగా వచ్చిన 72కోట్ల రూపాయలనూ సాగరతీర అభివృద్ధికి కేటాయించారు. 
అట్టహాసంగా బీచ్ అభివృద్ధి పనులు ప్రారంభం
కాకినాడలో ఎన్టీఆర్ బీచ్ అభివృద్ధి కోసం అట్టహాసంగా పనులు ప్రారంభించారు. కానీ అధికార యంత్రాంగం అలసత్వంతో అది ఆరంభశూరత్వంగా మిగిలిపోయింది. 62 ఎకరాల విస్తీర్ణంలో సాగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించింది. పర్యవేక్షణ లేకపోవడంతో పనులన్నీ తూతూమంత్రంగా సాగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం 12 వ తేదీన బీచ్ ఫెస్టివల్ నిర్వహించాల్సివుంది. కానీ పనులు ఇప్పటికీ పది శాతం కూడా పూర్తి కాలేదు. 
నాణ్యత ప్రమాణాలను మరిచిపోయిన కాంట్రాక్టర్స్ 
టూరిజం అభివృద్ధిలో భాగంగా పార్క్‌లో లోల్యాండ్ స్కేప్, ఫౌంటేన్లు సహా పలు నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే పూర్తయిన పనులు చూస్తే నాణ్యత లేమి ఏమేరకు ఉందో అర్థమవుతుంది. కాంట్రాక్టర్లు కనీస ప్రమాణాలూ పాటించకుండా నాసిరకం పనులు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  
నాసిరకంగా సాగుతున్న పనులపై విమర్శలు
పనుల నాణ్యతపై పలువురు పెదవి విరుస్తున్నారు. భారీగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని విమర్శిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులే ఈ కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. 
పూర్తికాని బీచ్ అభివృద్ధి పనులు
మరో వైపు బీచ్ అభివృద్ధి పనులు పూర్తి కాకముందే ఈ ఏడాది బీచ్ ఫెస్టివల్‌ ను ఆడంబరంగా నిర్వహిస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఏకంగా మూడు కోట్ల రూపాయల మేర వెచ్చించి ఫెస్ట్‌ను అట్టహాసంగా నిర్వహించనున్నట్లు మంత్రులు చెబుతున్నారు. అరకోరగా పూర్తయిన పనులకే ప్రారంభోత్సవం కూడా చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పూర్తి కాని పనులను చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభింపచేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా భారీ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి అక్కరకు రాకుండా పోతోంది. ఇదే నాణ్యతా లోపాలు కొనసాగితే సుదీర్ఘకాలం అందుబాటులో ఉండాల్సిన పనులు స్వల్పకాలానికే పాడైపోయే పరిస్ధితి కనిపిస్తోంది. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - అలసత్వం