అలహాబాద్

21:12 - February 12, 2018

ఢిల్లీ : దళిత విద్యార్థి హత్యపై అలహాబాద్‌ అట్టుడికింది. దళిత విద్యార్థి మృతిని నిరసిస్తూ ఆందోళనకారులు ఓ బస్సును తగలబెట్టారు. దళిత విద్యార్థి హత్య కేసులో సిసిటివి ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. దళిత విద్యార్థి హత్యను సిపిఎం, బిఎస్‌పి ఖండించాయి. బిజెపి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశాయి. విద్యార్థి హత్యను నిరసిస్తూ ఆందోళనకారులు భారీ ప్రదర్శన నిర్వహించారు.....ఓ బస్సును తగలబెట్టారు. హింసను నియంత్రించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

లా చదువుతున్న 26 ఏళ్ల దిలీప్‌ శుక్రవారం రాత్రి తన ఇద్దరు స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు కర్నాల్‌గంజ్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఇంతలోనే లగ్జరి కారులో అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులకు దిలీప్‌కు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అంతే...వారు దిలీప్‌ను రాళ్లు, కర్రలు, హాకీ స్టిక్‌తో చితకబాదారు.

తీవ్ర గాయాలపాలైన దిలీప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం కన్నుమూశాడు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెస్టారెంట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ దాడిలో ప్రధాన ఆరోపితుడు రైల్వే ఉద్యోగి విజయ్ శంకర్ సింగ్‌ పరారీలో ఉన్నాడు. విజయ్‌ శంకర్‌సింగ్‌ డ్రైవర్‌తో దిలీప్‌పై హాకీ స్టిక్‌తో దాడి చేసిన రెస్టారెంట్ వెయిటర్‌ మున్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిలీప్‌ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దిలీప్‌ను దుండగులు కొట్టిన సమయంలో పోలీసులకు తక్షణమే సమాచారం ఇవ్వనందుకు.. రెస్టారెంట్ యజమానిపై కూడా కేసు నమోదైంది.

దళిత విద్యార్థి హత్యపై బిఎస్‌పి చీఫ్‌ మాయావతి దుఃఖాన్ని ప్రకటించారు. బిజెపి అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. కుల విద్వేషాలు రెచ్చగొడుతున్న ఎన్డీయే ప్రభుత్వాన్ని దోషిగా నిలపాలని మాయావతి అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో దళిత విద్యార్థి హత్యను సిపిఎం ఖండించింది. దిలీప్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. యూపిలో యోగి సర్కార్‌ పగ్గాలు చేపట్టాక మతతత్వ శక్తుల మనోబలం మరింత పెరిగిందని...భవిష్యత్తులో దళితులపై మరిన్ని దాడులు జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది.

07:18 - October 13, 2017

అలహాబాద్ : 9 ఏళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్‌ హత్య కేసులో అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆరుషి తల్లిదండ్రులు రాజేష్‌ తల్వార్, నుపూర్‌ తల్వార్‌లను నిర్దోషులుగా పేర్కొంటూ అలహాబాద్‌ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఆరుషిని ఆమె తల్లిదండ్రులే చంపారనడానికి ఎలాంటి ఆధారాలు లేని కారణంగా అనుమానం కింద శిక్షలు విధించలేమని కోర్టు స్పష్టం చేసింది. బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద న్యాయస్థానం ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా ప్రకటించింది.

బెడ్‌రూమ్‌లో ఆరుషి హత్య...
2008 మే 16వ తేదీన నోయిడా జలవాయువిహార్‌లోని సొంత ఇంట్లోనే బెడ్‌రూమ్‌లో ఆరుషి హత్యకు గురైంది. ఆమెను గొంతుకోసి చంపేశారు. ఈ ఘటన తర్వాత పనిమనిషి హేమరాజ్‌ కనిపించకుండా పోయాడు. అతడే ప్రధాన నిందితుడైన ఉంటాడని పోలీసులు తొలుత భావించారు. ఆ మరుసటి రోజు పనిమనిషి హేమరాజ్ శవం అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌పై కనిపించడంతో కేసు మరో మలుపు తిరిగింది. బెడ్‌రూమ్‌లో ఆరుషి, హేమరాజ్‌లు సన్నిహితంగా ఉండడం చూసిన ఆరుషి తల్లిదండ్రులే హత్య చేశారన్న అనుమానంతో పోలీసులు రాజేష్‌ తల్వార్, నుపుర్‌ తల్వార్‌లను అరెస్ట్‌ చేశారు. పరువుహత్యకు సంబంధించిన ఈ కేసును అప్పటి యూపీ ప్రభుత్వం 2008 మేలో సిబిఐకి అప్పగించింది. ఏడాదిపాటు విచారణ అనంతరం డాక్టర్‌ రాజేష్ సహాయకుడు కృష్ణ, పనిమనుషులు రాజ్‌కుమార్‌, విజయ్‌లను నిందితులుగా పేర్కొన్న సిబిఐ- వారిపై ఆరోపణలను నిరూపించలేకపోయింది. దీంతో ఈ కేసును 2009లో సిబిఐలోని మరో బృందానికి అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన సిబిఐ- రాజేష్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. ఈ కేసును విచారించిన గజియాబాద్‌లోని సిబిఐ ప్రత్యేక కోర్టు నవంబర్ 25, 2013న ఆరుషి తల్లిదండ్రులను దోషులుగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది.

నిర్దోషులుగా రాజేశ్‌ దంపతులు
సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆరుషి తల్లిదండ్రులు రాజేష్‌ తల్వార్, ఆయన భార్య నుపూర్ తల్వార్‌ 2014లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద రాజేశ్‌ దంపతులను నిర్దోషులుగా ప్రకటించింది. బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ అంటే.. కేసులో ఆధారాలు సరిగా లేనప్పుడు నిందితులకు అనుకూలంగా తీర్పిచ్చేందుకు న్యాయవ్యవస్థలో వెసులుబాటు ఉంటుంది. ఈ కేసులో తమకు న్యాయం జరిగిందని హైకోర్టు తీర్పుపై ఆరుషి తల్లి నుపుర్‌ హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై సిబిఐ స్పందించింది. కోర్టు కాపి అందిన తర్వాత పూర్తిగా చదివి విశ్లేషణ చేశాకే ఈ కేసులో ముందుకు వెళ్తామని స్పష్టం చేసింది. 

07:08 - June 13, 2016

ఢిల్లీ :అలహాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశమయింది. ఈ కార్యక్రమాలను ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పలు అంశాలపై పార్టీ పెద్దలు చర్చించారు. ప్రస్తుతం దేశంలో పథకాల అమలు తీరు రానున్న ఎన్నికల్లో పార్టీ తీరుపై సుదీర్ఘంగా చర్చించారు.

ముఖ్య అతిధిగా ప్రధాని మోదీ...

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. యూపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే దానిపై చర్చించారు. రాజ్‌నాథ్ సింగ్‌ను యూపీ సీఎం అభ్యర్ధిగా ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం. త్వరలో జరగబోయే పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా ఎన్నికలపై కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.

పలు తీర్మానాలు ఆమోదం....

ఈ రెండు రోజుల సమావేశాల్లో రాజకీయ, ఆర్ధిక, విదేశాంగ విధానాలపై తీర్మానాలు ఆమోదించనున్నారు. ఆఫీస్ బేరర్లతో పది నిమిషాలు మాట్లాడిన నరేంద్ర మోదీ పలు విలువైన సూచనలిచ్చారు. కాలానుగుణమైన మార్పులతో కొత్త ఆలోచనలు, కొత్త కార్యచరణతో ముందుకు దూసుకెళ్లాలని మోదీ సూచించారు. 

08:36 - June 12, 2016

అలహాబాద్ : నేటి నుండి బీజేపీ కార్యనిర్వాహక సమావేశం జరగనుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పార్టీ కార్యకర్తలు పూర్తి చేశారు. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరు కానున్నారు. వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

Don't Miss

Subscribe to RSS - అలహాబాద్