అల్పపీడనం

14:58 - July 18, 2017

విశాఖపట్టణం : పశ్చిమ బెంగాల్‌, ఒడిశాను ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఈ ప్రభావంతో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. వాయుగుండం మంగళవారం రాత్రికి తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. వాగులు..వంకలు పొంగిపొర్లుతున్నాయి. బలంగా గాలులు వీచడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమగోదావరి, ఏజెన్సీ ప్రాంతాల్లో అధిక వర్ష పాతం నమోదైంది. కేకే లైన్ వద్ద రైల్వే ట్రాక్ పై వర్షపు నీరు వెళుతుండడంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

08:18 - July 18, 2017

విశాఖ : పశ్చిమ మధ్య బంగాళఖతంలో ఏర్పాడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. 48గంటల తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రానున్న 24గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర భారీ వర్షలు కురిస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 50 కి.మీ నుంచి 55కి,మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. అటు శ్రీకాకుళంలో భారీ వర్షాలతో వరద ముప్పు ఉండడంతో అధికారులు ప్రమాద హెచ్చరికాలు జారీ చేశారు. వంశధార, నాగావళి ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

15:21 - July 17, 2017

హైదరాబాద్ : వర్షాలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వానలు పడకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. కానీ బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత అల్పపీడనంగా బలపడుతోంది. దీనితో ఇరు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీనితో గత కొన్ని రోజులుగా ఆందోళనగా ఉన్న రైతులు వర్షాలు కురుస్తుండడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నగరంలో భారీ వర్షం..
నగరంలో గత రెండు రోజుల నుండి వాతావరణం మేఘావృతమై కనిపిస్తోంది. కానీ సోమవారం వాతావరణ పరిస్థితుల్లో మార్పు కనిపించింది. నగరంలో ఉదయం నుండి వర్షం కురుస్తోంది. సాయంత్రం భారీ వర్షం పడుతుండంతో జనజీవనం స్తంభించింది. రోడ్లపై భారీ ఎత్తున నీరు చేరుతుండడంతో వాహనదారులు..పాదాచారులు అష్టకష్టాలు పడుతున్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. పత్తి..వరి నాటు వేసుకున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేస్తున్నారు.
 

08:09 - July 17, 2017

హైదరాబాద్ : వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో నైరుతీ రుతువనాలు చురుగ్గా కదలుతున్నాయి. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రంలో పడుతున్న వర్షాలు మరింత విస్తృతంకానున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈనెల 18,19 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈనెల 20 నాటికి ఒడిశాలో తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మరింత విస్తృతమై ఈనెల 19 వరకు కొనసాగుతాయి.శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకు భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో 20 సెంమీటర్ల అతి భారీ వర్షాలకు కురిసే చాన్స్‌ ఉంది. వాయుగుండం తీరం దాటినా ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణల్లో వర్షాలు కురుస్తాయి. గోదావరికి వరదలు వచ్చే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు.

ఒడిశాలో భారీ వర్షాలు
మరోవైపు ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలతో నాగావళి పోటెత్తుతోంది. దీంతో విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్‌లోని కూనేరు, కొమరాడ, గురుగుబిల్లి మండలాల్లో వరద ముంపులో చిక్కుకున్నాయి. తెరవళి వంతెన కూలిపోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒడిశాలోని కళ్యాణ్‌సింగ్‌పూర్‌ గ్రామం నీటి మునిగింది.

పోటెత్తిన నాగావళి నది
నాగావళి నది పోటెత్తడంతో విజయనగరం జిల్లాలోని తోటపల్లి జలాశయం పూర్తిగా నిండిపోయింది. రిజర్వాయర్‌ పరిసర ప్రాంతాల్లోని గ్రామాలు నీట మునిగాయి. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిమ్మకపాడు నుంచి 12 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తోటపల్లి బ్యారేజ్‌లోని అన్ని గేట్లను పైకిఎత్తి 21,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గంట గంటకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. వరదముంపు, భారీ వర్షాల సమాచారం కోసం పార్వతీపురం ఐటీడీఏ కార్యాయంలో కంట్రోల్‌ రూము ఏర్పాటు చేశారు. కొమరాడ మండలం ఇందిరానగర్‌కు చెందిన అంకాలపు సీతారాయుడు పుశువులను తోలుకుని వెళ్లి నాగవళి నది మధ్యలో చిక్కుకుపోయాడు. ప్రాణాలు అరచేతపెట్టుకు బిక్కుబిక్కుమంటున్న సీతారాయుడును కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. నాగవళి నది పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. 

09:43 - July 14, 2017

హైదరాబాద్ : వర్షాలు లేకపోవడంతో వ్యవసాయం పనులు ముందుకుసాగక అల్లాడుతున్న రైతులకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఈ నెల 16 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని  అంచనావేస్తోంది. ఇది  వాయుగుండంగా మారి  భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉందని వెల్లడించింది. మరోవైపు నైరుతీ రుతుపవనాలు  రాయలసీమలో చురుగ్గా కదులుతున్నాయి. దీంతో ఈ  నాలుగు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. 
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం   
తెలుగు రాష్ట్రాల్లో నైరుతీ రుతుపవాలు ప్రవేశంచి నెల రోజులు గడచిపోయింది. అయినా భారీ వర్షాలు కురవకపోవడంతో వ్యవసాయం పడకేసింది. పనులు ముందుకుసాగక వరుణుడి కరుణ కోసం రైతులు ఆకాశం వైపు దిగాలుగా చూస్తున్నారు. ఈనెల 16న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ప్రకటనతో  రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నెల 16న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అది క్రమేణా వాయుగుండంగా మారే అవకాశం ఉందని  వాతావరణ శాఖ ప్రకటించింది.  ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఇస్రో కుడా ఇదే విషయం చెప్పింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం వాయుగుండంగా మారి, ఈ నెల 16 నుంచి 18 వరకు ఒక మోస్తరు వర్షాలు, ఆ తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.  ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. నైరుతీ రుతుపవన కాలంలో ఏర్పడే  ఈ వాయుగుండం వల్ల రుతుపవనాలు బలంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో పలు చోట్ల ఆరు  నుంచి 11 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదుకావొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈనెల 18న కొన్ని ప్రాంతాల్లో 30 సెంటీమీటర్లకు పైగా అతి వర్షాలు కురిసే అవకాశం ఉంది.  అదే సమయంలో ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షాలు పడతాయి. అలాగే ఈ నెల  20 నుంచి  22 వరకు అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలతోపాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. అల్పపీడనం, వాయుగుండం ప్రభావం తెలంగాణ జిల్లాలపై కూడా ఉంటుంది. 
రాయలసీమలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు
రాయలసీమలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాపై ఈ ప్రభావం కనిపిస్తోంది. పలు  ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షపాతం నమోదైంది.  ఆ జిల్లాల్లో రానున్ననాలుగు రోజులూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. 

 

21:23 - June 19, 2017

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. వానల కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. వాగులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. తెలంగాణలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. ఈ మేరకు ఆదిలాబాద్‌ జిల్లాలోని... ఉట్నూరు ఏరియాలో భారీ వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల రోడ్లు కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో జహీరాబాద్‌, న్యాల్‌కల్‌, ఝరాసంగం, కోహీర్‌ మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. జహీరాబాద్‌ ప్రాంతంలోని పలు వాగులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు చేరింది. మహబూబ్‌నగర్‌ జిల్లా... బాదేపల్లి పట్టణంలో 10 సెంటి మీటర్ల వాన కురిసింది. దీంతో రోడ్లు, ప్రధాన వీధులు చెరువులను తలపిస్తున్నాయి. జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో భారీగా వర్షపు నీరు చేరి...తరగతి గదులన్నీ బురదమయంగా మారాయి.

వాగు దాటడానికి ప్రయత్నించి..
ఏకదాటిగా కురుస్తోన్న వానలకు మెదక్‌ జిల్లా సత్యగామ వాగు పొంగిపొర్లుతోంది. వాగును దాటడానికి ప్రయత్నించిన ఇద్దరు యువకులు బైక్‌తో సహా కొట్టుకుపోయారు. స్థానికులు తాడు సాయంతో యువకులను రక్షించారు. వికారాబాద్‌ జిల్లా.. పరిగిలో ఉదయం నుంచి భారీగా వర్షం పడుతుంది. పరిసర ప్రాంతాలలోని చిన్న వాగులు పొంగిపొర్లుతున్నాయి. నస్కల్‌ సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరిగి-వికారాబాద్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పిడుగు పడి పెద్దపల్లి జిల్లా... ఓదెల మండలం పొత్కపల్లి వద్ద రైల్వే సిగ్నల్‌ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. రోడ్లపై భారీగా నీరు చేరడంతో.. ద్విచక్ర వాహనదారులు, ఉద్యోగులు, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా మేడ్చల్‌ జిల్లా.. కీసర మండలం నాగరం గ్రామంలో గురుకుల పాఠశాల గదుల్లో నీరు చేరింది. విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కాగా మరో రెండు రోజులు పాటు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సీజన్‌ ప్రారంభంలోనే వర్షాలు పడటంతో.. రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

10:08 - May 29, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆదివారం తెల్లవారుజామున వాయుగుండం ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. తుపాన్ గా మారే అవకాశం ఉందని, రేపు బంగ్లాదేశ్ తీరాన్ని తాకనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సాయంత్రానికి కోల్‌ కతాకు దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో, బంగ్లాదేశ్‌ లోని చిట్టగాంగ్‌ కు దక్షిణ నైరుతి దిశగా 740 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో తుపానుగా మారనుందని, అనంతరం 30న మధ్యాహ్నానికి బంగ్లాదేశ్‌ తీరాన్ని తాకుతుందని వారు వెల్లడించారు. దీని ప్రభావంతో ఉత్తరకోస్తాలో 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలుస్తోంది. మరోవైపు పశ్చిమగోదావరి, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో ఆరు సెం.మీ. వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. తుపాన్ గా మారిన సమయంలో దిశ మార్చుకొనే అవకాశం ఉంటుందని, ఈ నేపథ్యంలో ఆంధ్రా తీరం వైపు పయనించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాయుగుండం ప్రభావంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, మంగళవారంకు కేరళను తాకనుందని వెల్లడించారు.

08:29 - May 28, 2017
20:34 - May 18, 2017

హైదరాబాద్ : పిడుగు పడుద్ది..కానీ అంతకు ముందే మొబైల్ మోగుద్ది. అవును మరి పిడుగు ఆకాశాన్ని చీల్చుకుని రాకముందే అలర్ట్ బీ కేర్ ఫుల్ అంటోంది. జాగ్రత్తలు తీసుకుంటున్నారని గుర్తుచేస్తుంది. ఇప్పటి వరకు ప్రమాద వశాత్తూ ఎన్నో ప్రాణాలు పిడుగుల పాలిట పడ్డాయి. కానీ ఇక ముందు ఆ పరిస్థితి రాదు. ఏపీలో ప్రవేశ పెట్టిన టెక్నాలజీతో ఇపుడు సీన్ మారనుంది. మేఘాలు పిడుగుకు సై అనకముందే ఇక్కడ సేఫ్ ప్లేస్ లో సర్దుకునే అవకాశం వస్తోంది. ఇదే అంశం పై నేటి వైడాంగిల్ స్టోరి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

18:44 - November 29, 2016

హైదరాబాద్ : భూమధ్య రేఖ సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరో మూడు రోజుల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. దీని ప్రభావం తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని తెలిపింది. తెలంగాణకు వర్షసూచన లేదు కానీ రాత్రి చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - అల్పపీడనం