అవినీతి

07:11 - April 4, 2018

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో అధికారపార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. అమాయకులైన రైతుల భూములను లాగేసుకుంటున్నారు. వడ్డీకి డబ్బులు ఇవ్వడం.. వాటిపై చక్రవడ్డీ, బారువడ్డీల పేరుతో డబ్బులు గుంజడం.... కట్టలేని వారి నుంచి భూములు లాగేసుకోవడం ఇక్కడి నేతలకు పరిపాటిగా మారింది. అనారోగ్యంతో బాధపడుతోన్న ఓ రైతులకు డబ్బులిచ్చిన గులాబీ నేత... ఆ రైతుకు తెలియకుండానే అతని భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఘటన సిరిసిల్ల జిల్లాలోవెలుగు చూసింది.

ఎక్కల్‌దేవి సాయిలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలంలోని కొండాపూర్‌ స్వగ్రామం. కొన్నాళ్లుగా సాయిలు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సాయిలు కాలేయం దెబ్బతింది. ఆసుపత్రిలో చూపించుకుంటే భారీగా ఖర్చవుతుందని సూచించారు. తన దగ్గర అంత డబ్బులేకపోవడంతో ఫైనాన్స్‌ వ్యాపారి అయిన మురళీమోహన్‌ను ఆశ్రయించాడు. లక్ష రూపాయలు వడ్డీకి తీసుకున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా... అసలు కథ ఇక్కడే మొదలైంది.

బొల్లి మురళీమోహన్‌ సోదరుడైన బొల్లి రాంమోహన్‌ అధికారపార్టీకి చెందిన నాయకుడు. రాంమోహన్‌కు టీఆర్‌ఎస్‌లోని యువమంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అన్న రాజకీయ పలుకుబడిని ఆసరా చేసుకున్న బొల్లి మురళీమోహన్‌ అనేక అక్రమాలకు తెగబడుతున్నాడు. సాయిలు తీసుకున్న లక్ష రూపాయల అప్పుకింద అతని భూమిని లాగేసుకోవాలని ప్లాన్‌ చేశాడు. సాయిలుకుగానీ.. అతని కుటుంబ సభ్యులకుగానీ తెలియకుండా 56 గుంటల భూమి తనపేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు.

తెలంగాణ ప్రభుత్వం రైతుల భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు చేపట్టిన భూసర్వేలో సాయిలు పేరు లేకపోవడంతో బొల్లి మురళీమోహన్‌ అక్రమాల చిట్టా బయటపడింది. దీంతో సాయిలు కుటుంబ సభ్యులు మురళీమోహన్‌ను నిలదీశారు. దీంతో మరికొన్ని డబ్బులు ఇస్తానంటూ నమ్మబలికాడు. అప్పటి నుంచి రేపుమాపు అంటూ తిప్పుకుంటున్నాడు తప్పా డబ్బులు ఇవ్వడం లేదని సాయిలు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుగా లక్ష రూపాయలు ఇచ్చి తమ భూమిని మురళీమోహన్‌ అక్రమంగా లాగేసుకున్నాడని సాయిలు వారు ఆరోపిస్తున్నారు.

బొల్లి మురళీమోహన్‌ ఇంటిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేకపోవడంతో సాయిలు కుటుంబ సభ్యులు అతడి ఇంటిముందు బైఠాయించారు. మీడియా కూడా అక్కడికి చేరుకోవడంతో సమస్య పరిష్కరించుకుందామంటూ మురళీమోహన్‌ సోదరుడు బొల్లి రాంమోహన్‌ అక్కడి నుంచి వారిని తరలించి మెల్లిగా జారుకున్నాడు. తమకు న్యాయం చేయకపోతే మురళీమోహన్‌ ఇంటి ముందు దీక్షకు దిగుతామని బాధితులు తేల్చి చెప్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

16:11 - April 1, 2018

కడప : సాగునీటి ప్రాజెక్టుల రీ టెండర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 60 C నిబంధన అవినీతిమయంగా మారిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. ఈ నిబంధనను అడ్డు పెట్టుకుని పాలకులు కమీషన్లు దండుకొంటున్నారని  మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన లక్షా 32 వేల కోట్ల రూపాయల నిధులు మొబిలైజేషన్‌ అడ్వాన్సులు, ముడుపులకే సరిపోయాయని సోము వీర్రాజు ఆరోపించారు. 

 

17:54 - March 31, 2018

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వం అబద్ధాలు, అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. తండ్రీ కొడుకుల మధ్యే పాలన నడుస్తోందని.. మంత్రులకు స్వేచ్ఛలేదని ఆయన మండిపడ్డారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామన్న సోము వీర్రాజు.. రాయలసీమపై చంద్రబాబు సవతితల్లి ప్రేమ కనబరుస్తున్నారన్నారు. స్కూల్‌ పిల్లల యూనిఫామ్‌లు కుట్టించడంలో, మరుగుదొడ్లు నిర్మించడంలో.. వెనకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధుల్లో అవినీతి జరిగిందన్నారు. ఏపీకి ప్యాకేజీ కావాలన్న చంద్రబాబు ఇప్పుడు మాటమారుస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. టీడీపీ- బీజేపీ బంధం తెగిపోవడం తమకు దేవుడు చేసిన మేలని వీర్రాజు అన్నారు. 

14:29 - March 24, 2018
20:57 - February 23, 2018
14:00 - January 23, 2018

నిజామాబాద్ : మరో అక్రమార్కుడు ఏసీబీకి చిక్కాడు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ఆర్డీవో శ్రీనివాస్‌ 40 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. మినరల్ వాటర్‌ ప్లాంట్ యజమానుల నుంచి  డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

09:25 - December 21, 2017

రాజన్న సిరిసిల్ల : తెలుగు రాష్ట్రాల్లో అవినీతి అధికారుల తీరు మారడం లేదు. ఏసీబీ అధికారులు దాడులు చేస్తూ వారిని పట్టుకుంటున్నా..ఇతరుల్లో మాత్రం భయం కలగడం లేదు. ఇటీవలే ఏసీబీ అధికారులు చేసిన దాడుల్లో వందల కోట్ల రూపాయల ఆస్తులు బయపడిన సంగతి తెలిసిందే. తాజాగా వేములవాడ ఆలయ సూపరింటెండెంట్ రాజేందర్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఏసీబీ సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. అతని నివాసంతో పాటు కుటుంబసభ్యుల నివాసాలపై కూడా సోదాలు చేస్తున్నారు. నాలుగు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు. రాజేందర్ కు చెందిన ఓ లాడ్జ్ పై కూడా దాడులు చేసినట్లు సమాచారం. సోదాల్లో భారీగా ఆస్తులు..బంగారం బయటపడినట్లు తెలుస్తోంది.

రాజేందర్ ఆలయ సూపరింటెండెంట్ నిర్వహిస్తూనే ఇతర బాధ్యతలు కూడా చూస్తున్నారు. లడ్డూ ప్రసాదానికి సంబంధించిన కీలక బాధ్యతలు...శానిటేషన్ ఇన్స్ పెక్టర్ విధులు కూడా చూస్తున్నారు. దీనితో భారీగానే అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడుల అనంతరం ఎంత అవినీతికి పాల్పడ్డారో తెలియనుంది. 

19:27 - December 5, 2017

అనంతపురం : మున్సిపాలిటీకి అవినీతి గబ్బు పట్టింది. అక్కడ కాంట్రాక్టర్లు, అధికారులు, పాలకులు మూకుమ్మడిగా దోచేస్తున్నారు. పర్సంటేజీల విషయంలో జరిగిన ఓ డీల్ విషయంలో కలగజేసుకున్నాడనే నెపంతో ఓ కాంట్రాక్టర్‌ ఏకంగా డీఈపై దాడికి తెగబడటం సంచలనం రేపింది. మరోవైపు దాడికి సంబంధించి ఇంటెలిజెన్స్ రిపోర్టును పోలీస్‌శాఖ డీజీపీకి పంపడంతో మున్సిపల్ వర్గాల్లో వణుకు మొదలైంది. 

అనంతపురం మున్సిపాలిటీ అవినీతిలో కూరుకుపోయింది. అక్కడ పైసలు ఇవ్వందే ఫైల్ కదిలే పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో సోమవారం పట్టపగలు నడిరోడ్డుపై డీఈ కిష్టప్పపై కాంట్రాక్టర్ నరసింహారెడ్డి దాడిచేయడం సంచలనం సృష్టించింది. ఏఈ ప్రసాద్‌తో పర్సంటేజీల విషయంలో జరుగుతున్న గొడవలో డీఈ కలగజేసుకున్నాడని కాంట్రాక్టర్‌ నరసింహారెడ్డి కిష్టప్పపై దాడి చేశాడు. కిష్టప్పపై దాడిని నిరసిస్తూ మున్సిపల్ ఉద్యోగులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో నరసింహారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు పంపారు. అయితే అరెస్టైన సందర్భంలో నరసింహారెడ్డి బయటకి వచ్చాక అందరి భాగోతాలు బయటపెడతాననడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 

కొద్దిరోజుల క్రితం మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.40 లక్షలు పెట్టి రోడ్లు ఊడ్చే స్వీపింగ్ యంత్రాన్ని కాంట్రాక్టర్ నరసింహారెడ్డి మధ్యవర్తిత్వంతో కొన్నారు. దీనిపై అనేక వివాదాలు నడుస్తున్నాయి. నాణ్యత లేదంటూ బిల్లును చెల్లించే విషయాన్ని నాన్చుతూ వస్తున్నారు. 40లక్షలకు బదులు... 25 లక్షలు మాత్రమే చెల్లించారు. దీంతో మిగతా 15లక్షలు చెల్లించాలని కాంట్రాక్టర్ నరసింహారెడ్డికి మున్సిపల్ అధికారులకు గొడవ జరుగుతోంది.. బిల్లుకు సంబంధించి ఏఈ ప్రసాద్ పర్సంటేజీ అడిగి సతాయించాడని.. వారు అడినంత ఇవ్వలేకపోయానని.. ఆ విషయంలో గొడవ జరుగుతుండగా.. డీఈ కిష్టప్ప  వచ్చి తనను దూషించాడని నరసింహారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన కాంట్రాక్టర్ దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నరసింహారెడ్డి పోలీసుల రిమాండ్‌లో ఉన్నాడు. 

ఈ నేపథ్యంలో అనంతపురం మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి మరోసారి చర్చకు దారి తీసింది. నరసింహారెడ్డి తనవద్ద అందరి బాగోతాలు వున్నాయంటూ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అతనిని మీడియాతో మాట్లాడనివ్వకపోవడం వెనుక అధికార పార్టీ నేతల ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. సంచలనం సృష్టించిన డీఈపై దాడి ఘటనకు సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్టును పోలీస్‌ శాఖ డీజీపీకి పంపినట్లు తెలుస్తోంది. ఈ దాడి ఘటన ఎక్కడికి దారి తీస్తుందో అన్న టెన్షన్ మున్సిపల్ వర్గాల్లో నెలకొంది. 

12:22 - November 25, 2017

విజయవాడ : అవినీతి విషయంలో టాప్ టెన్ 10లో జగన్ ఉన్నారని ఏపీ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. విజయవాడలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి జగన్ కుట్ర పన్నారని, రాష్ట్రంలో నిర్మితమౌతున్న ప్రాజెక్టులపై వైసీపీ నేతలు దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు. పట్టిసీమ ద్వారా లక్షలాది ఎకరాలు సాగవుతోందని, పురుషోత్త పట్నం ఎలూరు రిజర్వాయర్ కి సెకండ్ స్టేజ్ ద్వారా నీళ్లు వెళ్లాయని తెలిపారు.

12:19 - November 8, 2017

పశ్చిమగోదావరి : దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ విజయరామరాజు ఇంటిపై ఏసీబీ దాడులు జరపడం కలకలం రేపుతోంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ ఈ దాడులు చేస్తోంది. బుధవారం ఉదయం విజయరామరాజు నివాసంతో పాటు ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు.~ భీమడోలు, హైదరాబాద్ లోని బంధువులు..స్నేహితుల నివాసాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. కోట్ల రూపాయల విలువైన డాక్యుమెంట్స్, విలువైన బంగారం..వెండి..భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా విదేశీ మద్యం పెద్ద మొత్తంలో ఉండడం తీవ్ర చర్చానీయాంశమైంది. గతంలో కూడా ఈయనపై ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఏసీబీ అధికారులు జరిపిన దాడులు దేవాదాయ శాఖలో కలకలం రేపుతోంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - అవినీతి